
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు సహించబోమని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తి కోయల దాడిలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు మృతి చెందిన ఘటనపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం తరపున బాధిత కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు ఆయన. ఉద్యోగులపై దాడులను సహించబోమన్న సీఎం కేసీఆర్.. దోషులను కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు. అంతేకాదు.. శ్రీనివాసరావు కుటుంబానికి పూర్తి జీతభత్యాలు అందుతాయని, రిటైర్‌మెంట్ వయసు వరకు కుటుంబ సభ్యులకు వేతనం చెల్లిస్తామని తెలిపారు.
చంద్రుగొండ మండలం బెండలపాడులో మంగళవారం ఈ దాడి ఘటన చోటు చేసుకుంది. విధి నిర్వహణలో శ్రీనివాసరావు ప్రాణాలు పొగొట్టుకోవడంతో ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. అధికార లాంఛనాలతో ఎఫ్‌ఆర్‌వో శ్రీనివాస రావుకు అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment