శనివారం చేవెళ్ల బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద బహిరంగసభకు హాజరైన ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న కేసీఆర్. చిత్రంలో చేవెళ్ల అభ్యర్థి కాసాని
ప్రజలపక్షాన ఆయుధమై కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడుతాం..
కాంగ్రెస్‌ది అసమర్థ పాలన.. మళ్లీ కరెంటు కోతలు మొదలయ్యాయి
ఆడబిడ్డలకు స్కూటీలు లేవు కానీ రాష్ట్రంలో లూటీలు మొదలయ్యాయి
దళితబంధు పథకాన్ని పక్కన పెట్టారంటూ కాంగ్రెస్‌కు చురకలు
కేంద్రంలోని పదేళ్ల బీజేపీ పాలనలో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు
ధాన్యం కొనాలంటే నూకలు తినుమన్నరు.. బీజేపీకే నూకలు తినిపిద్దాం
చేవెళ్ల బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మాజీ సీఎం కేసీఆర్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర ప్రజల పక్షాన ఆయుధమై కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాడుతామని.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా ప్రజలకు అండగా నిలుస్తామని బీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. ప్రభుత్వం మెడలు వంచాలన్నా.. రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, కారి్మకులు, బడుగు, బలహీన వర్గాలకు మేలు జరగాలన్నా.. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చా రు. అప్పుడే ప్రభుత్వం దిగొస్తుందని.. హామీలను నెరవేరుస్తుందని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం చేవెళ్లలో నిర్వహించిన తొలి ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే..
‘‘అంబేడ్కర్, జ్యోతిబా పూలే స్ఫూర్తితో పదిహేనేళ్లపాటు పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఆ మహానుభావులకు బీఆర్‌ఎస్ సముచిత స్థానం కల్పించింది. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతోపాటు దేశంలో ఎక్కడా లేనివిధంగా సచివాలయానికి ఆయన పేరు పెట్టాం.
సచివాలయం ముందు ధర్నాకు దిగుతా..
ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి. ప్రజానీకానికి ప్రభుత్వంపై నమ్మకం, విశ్వాసం, గౌరవం ఉండాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు సాధ్యంకాని హామీలిచ్చింది. ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు కావస్తోంది. కానీ గత ప్రభుత్వం సృష్టించిన వనరులను వాడుకునే నైపుణ్యం వారికి లేకుండా పోయింది. మళ్లీ కరెంటు కోతలు మొదలయ్యాయి. మంచినీరు దొరకడం లేదు. సాగునీరు అందడం లేదు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు ఉపకార వేతనాలు నిలిచిపోయాయి.
దళితవాడలు ధనిక వాడలు కావాలనే సదుద్దేశంతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ రూ.12 లక్షల చొప్పున ఇస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. అది ఇవ్వకపోగా.. 1.36 లక్షల మందికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను రద్దు చేసింది. కలెక్టర్ల అకౌంట్లలో జమ చేసిన నగదును వాపస్ తీసుకుంది. అర్హులైన దళితులందరికీ వెంటనే దళిత బంధు ఇవ్వాలి. లేదంటే 1.36 లక్షల మంది లబ్ధిదారులతో కలసి సచివాలయం ముందు ధర్నాకు దిగుతా.
మార్కెట్‌లో తులం బంగారం దొరకడం లేదా?
మౌనంగా ఉంటే సమస్యలు తీరవు. ఎన్నికల ప్రచారం కోసం గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ నేతలను దళితబంధుపై నిలదీయండి. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డల పెళ్లి కోసం ఆర్థిక సాయం చేసే కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేసింది. కాంగ్రెస్ దానికి అదనంగా తులం బంగారం చొప్పున ఇస్తామని మాయమాటలు చెప్పింది. ఏమైంది? ఆడబిడ్డలకు ఇవ్వడానికి కాంగ్రెస్ సర్కారుకు మార్కెట్లో తులం బంగారం దొరకడంలేదా?
కేసీఆర్ వెళ్లగానే కరెంటు పోతుందా?
తెలంగాణలో 11 ఏళ్ల క్రితం దారుణ పరిస్థితి ఉండేది. మేం ఏడాదిన్నర వ్యవధిలో బాగుచేశాం. రైతులు, పరిశ్రమలు, గృహాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేశాం. కేసీఆర్ వెళ్లగానే కరెంటు ఎందుకు రావట్లేదు? ఇది కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం కాదా? మిషన్ భగీరథ పథకాన్ని ఐక్యరాజ్యసమితి కూడా అభినందించింది. మరి ఎవరి తెలివి తక్కువతనం వల్ల మంచి నీటి కొరత ఏర్పడింది? ప్రభుత్వ వాగ్దానాలు నెరవేరాలంటే బలమైన ప్రతిపక్షం ఉండాలి.
వరికి బోనస్ ఇవ్వకుంటే ఊరుకోబోం..
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు 420 వాగ్దానాలు ఇచ్చింది. వాటిలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తామని చెప్పింది. స్కూటీలు ఇవ్వకపోగా.. రాష్ట్రంలో లూటీలు మొదలుపెట్టింది. రియల్ ఎస్టేట్‌ను దెబ్బతీసింది. అనుమతులు నిలిపివేసింది. ఆ రంగంపై ఆధారపడి బతుకుతున్నవారిని రోడ్డు పాలు చేసింది. ప్రభుత్వం యాసంగి పంటను పూర్తిగా కొనుగోలు చేయాలి. వరికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వాల్సిందే.. లేదంటే ఊరుకోబోం.
దేశాన్ని ముందుకు తీసుకెళ్లే పద్ధతి ఇదేనా?
కేంద్రంలో బీజేపీ పదేళ్లుగా అధికారంలో ఉంది. ప్రజల మధ్య భావోద్వేగాలు రెచ్చగొట్టడం, మత పిచ్చి పెంచడం తప్ప చేసిందేమీ లేదు. పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెంచేసింది. మోదీ, ఈడీ.. ఇదేనా దేశాన్ని ముందుకు తీసుకెళ్లే పద్ధతి? గుడ్డిగా ఓటేయొద్దు. బీజేపీ సర్కారు దేశవ్యాప్తంగా 150 మెడికల్ కాలేజీలు మంజూరు చేసింది. తెలంగాణకు మెడికల్ కాలేజీలు మంజూరు చేయాలని కోరుతూ నేను వంద ఉత్తరాలు రాసిన.. కానీ ఒక్క కాలేజీ ఇవ్వలేదు. ఒక్క నవోదయ స్కూల్ కూడా ఇవ్వలేదు. రైతుల మోటర్లకు మీటర్లు పెట్టాలని మోదీ నా మెడపై కత్తిపెట్టాడు. కానీ నేను మీటర్లు పెట్టలేదు. దాంతో ఏటా రూ.5 వేల కోట్లు కోత కోసిండు. తెలంగాణకు రూ.30 వేల కోట్ల నష్టం వచ్చింది.
బీజేపీకి నూకలు తినిపించాలి
వికారాబాద్, చేవెళ్లలో ధాన్యం బాగా పండింది. పండిన ధాన్యాన్ని కొనుమంటే.. యాసంగి ధాన్యం నూకలు అయితయి. తెలంగాణ ప్రజలకు నూకలు అలవాటు చేయండి అని కేంద్ర మంత్రి ఒకరు ఉచిత సలహా ఇచ్చిండు. నూకలు తిందామా? బీజేపీకి నూకలు తినిపిద్దామా? తెలంగాణ ఇచ్చినప్పుడు 7 మండలాలను, సీలేరు ప్రాజెక్టును ఆంధ్రాలో కలిపారు. ఐటీఐఆర్ ప్రాజెక్టును, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని రద్దు చేశారు. బీజేపీ ప్రభుత్వంలో ఏ వర్గానికీ మేలు జరగలేదు. మేం పదేళ్లలో చేవెళ్లను పారిశ్రామిక కేంద్రంగా, రియల్ ఎస్టేట్ జోన్‌గా అభివృద్ధి చేశాం.
రంజిత్‌రెడ్డి ఏమైనా పొద్దుతిరుగుడు పువ్వా?
ఎంపీ రంజిత్‌రెడ్డికి ఏం ఏం తక్కువ చేశాం? ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది? రంజిత్‌రెడ్డి ఏమైనా పొద్దుతిరుగుడు పువ్వా? అధికారం ఎటుంటే అటు తిరుగుతడా? ఆయన పార్టీ ఎందుకు మారాడు.. అధికారం కోసమా? పైరవీల కోసమా. రంజిత్‌కు పార్లమెంటు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలి. కాంగ్రెస్ నేతలు సవాల్ విసిరినట్టు బీసీ అయిన కాసాని జ్ఞానేశ్వర్‌ను గెలిపించుకోవాలి. కాసాని గెలుపు బీసీల అభివృద్ధికి మలుపు..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాం«దీ, కాలె యాదయ్య, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, ఎగ్గె మల్లేశం, దయానంద్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.
బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం
తెలంగాణలో బీఆర్‌ఎస్ బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. అన్ని స్థానాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించి అంకుశం లాంటి ఆయుధాన్ని బీఆర్‌ఎస్ చేతికి ఇవ్వాలి. అప్పుడే ప్రభుత్వ మెడలు వంచగలుగుతాం. బీఆర్‌ఎస్ గెలవాలి.. అంకుశంలా పనిచేయాలి. లేదంటే మోసం చేసిన వాళ్ల చేతిలోనే మళ్లీ మోసపోతాం. బీఆర్‌ఎస్ పుట్టిందే అణగారిన వర్గాల కోసం. అనేక మందిని కాపాడుకున్నాం. కేసీఆర్ బతికున్నంత కాలం పోరాటం చేస్తూనే ఉంటడు.
Comments
Please login to add a commentAdd a comment