తెలంగాణ తల్లి సెంటిమెంట్‌ పండేనా? | Political Row Erupts In Telangana Thalli Statue | Sakshi
Sakshi News home page

తెలంగాణ తల్లి సెంటిమెంట్‌ పండేనా?

Published Tue, Dec 10 2024 10:57 AM | Last Updated on Tue, Dec 10 2024 1:30 PM

Political Row Erupts In Telangana Thalli Statue

తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణలో కొత్త సెంటిమెంట్‌ రాజుకునేందుకు కారణమవుతోందా? ఇటీవలి పరిణామాలను గమనిస్తే ఇది నిజమే కావచ్చు అనిపిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం రూపొందించిన ఈ విగ్రహం చుట్టూనే రాజకీయాలన్నీ తిరుగుతూండటం ఇందుకు కారణమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి ఏపీలోని తెలుగు తల్లి విగ్రహానికి పోటీగా తెలంగాణ తల్లి పేరుతో విగ్రహాన్ని తయారు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమ స్ఫూర్తిని రగిలించే ప్రయత్నం చేశారు. ఇందులో పలువురు ఉద్యమకారుల ప్రమేయం ఉన్నప్పటికీ మూల కారకుడు బీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్ రావు  అని చెప్పక తప్పదు. 

అప్పట్లో వాడవాడల్లో సుమారు ఐదు వేల విగ్రహాలను ప్రతిష్టించారు. బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లోనూ ప్రత్యేకంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమైన కార్యక్రమాలు జరిగినప్పుడల్లా తొలుత ఆ విగ్రహానికి నివాళులు అర్పించే మొదలుపెట్టేవారు. ఇది ఒక సెంటిమెంట్ గా మారింది. అయితే ఏ కారణం వల్లో బీఆర్‌ఎస్‌ ఈ విగ్రహానికి అధికారిక ముద్ర వేయలేకపోయింది. పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌ కొత్త సచివాలయాన్ని నిర్మించారు. సచివాలయం ఎదుట భారీ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆయన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రం పెట్టలేదు. 

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే సచివాలయం వద్ద మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో, బీఆర్ఎస్ దాన్ని వ్యతిరేకించింది. తాము అధికారంలోకి రాగానే ఆ విగ్రహం స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్‌ ప్రకటించారు కూడా. ఆ వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి, ఇన్నాళ్లు తెలంగాణ తల్లి విగ్రహన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నిస్తూ, తామే సచివాలయంలో ఆ విగ్రహాన్ని స్థాపిస్తామని చెప్పి శంకుస్థాపన కూడా చేసేశారు. ఆ తర్వాత కొత్త డిజైన్‌తో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సిద్ధం చేశారు. వివాదం ఇక్కడే ఆరంభమైంది. ఈ విగ్రహాన్ని ఒక సెంటిమెంట్‌గా మార్చడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ప్రభుత్వం రూపొందించిన తల్లి విగ్రహం ఆకుపచ్చ చీర ధరించి ఉంటుంది. అంతేకాక మెడలో ఒకటి, రెండు నగలతోనే చిత్రీకరించారు.

 ఈ విగ్రహంలో తల్లి చేతిని ప్రముఖంగా ప్రదర్శిస్తుంటుంది. ఇది కాంగ్రెస్ పార్టీ అధికారిక గుర్తు అయిన చేతి గుర్తును పోలి ఉందని, ఇదంతా రాజకీయమని విపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. విమర్శలు చేస్తున్నాయి. ఈ విగ్రహం కాంగ్రెస్ తల్లి అని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ కనుక, విగ్రహంలో చేతిని ప్రొజెక్టు చేయడంలో తప్పు ఏముందని ఇంకొందరి ప్రశ్న. ఇక విగ్రహ ముఖ కవళికలపై కూడా పలు వ్యాఖ్యలు ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి వస్తున్న కామెంట్లు సమర్థనీయం కాదు. విగ్రహం ముఖ కవళికలు రేవంత్ కుటుంబ సభ్యులను పోలి ఉన్నట్లు ఉన్నాయని కొంతమంది ఆరోపిస్తున్నారు. ఇందులో నిజం ఉండదు. అయినా ఎవరి దృష్టి కోణంతో చూస్తే, వారి కోణంలోనే అలా అనిపిస్తుంటుంది. గతంలో ఎన్టీఆర్.ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టాంక్‌బండ్ పై పలువురు తెలుగు తేజాల విగ్రహాలను ఏర్పాటు చేసి, దానిని ఒక టూరిస్ట్ స్పాట్ గా అభివృద్ది చేశారు. 

అప్పట్లో విపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ విగ్రహాల ఏర్పాటు వృథా వ్యయం అని విమర్శించేది. ఆ విగ్రహాలు అచ్చం ఎన్టీఆర్. ముఖ కవళికలతో ఉన్నట్లుగా కొన్ని పత్రికలలో కార్టూన్లు కూడా వచ్చాయి. ఉమ్మడి ఏపీలో మూడు ప్రాంతాలకు చెందిన పలువురు ప్రముఖ సాంస్కృతిక వేత్తలు, కవులు,కళాకారుల విగ్రహాలను ఎన్టీఆర్. ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వాటిలో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన ప్రముఖుల విగ్రహాలను కూల్చివేసే యత్నం జరిగింది. కొన్ని విగ్రహాలకు నల్లరంగు పులిమారు. బంజారాహిల్స్ లో ఉన్న పెద్ద పార్కుకు కేబీఆర్‌ పార్క్ అని పేరు పెట్టి మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేస్తే, ఆయనను సమైక్యవాది అని భావించి కొందరు ఉద్యమకారులు దానిని కూడా ధ్వంసం చేశారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి టాంక్ బండ్ పై ఉన్న విగ్రహాలను, అలాగే కాసు విగ్రహన్ని పునరుద్దరించారు. 

ఈ నేపథ్యంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్‌ ఆధ్వర్యంలో తయారు చేయించి ఈ ప్రాంతం అంతా వ్యాప్తి చేశారు. ఆ విగ్రహంలో తెలంగాణ తల్లి పింక్ రంగు చీర ధరించినట్లు కనిపిస్తుంది. అయితే అది బీఆర్‌ఎస్‌ రంగు పింక్ కాదని, మెరూన్ కలర్ అని బీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. భరతమాత విగ్రహంలో ఉన్న చీర కలర్ కూడా మెరూనే అని వీరు అంటున్నారు. మెడలో నెక్ లెస్, తదితర మంచి ఆభరణాలు కనిపిస్తాయి. బతుకమ్మ ఉత్సవాలకు ప్రతీకగా దీనిని తయారు చేయించామని బీఆర్‌ఎస్‌ నేతల వాదన. తలకు కిరీటం కూడా ఉంటుంది. ఇది కూడా భరతమాతనే పోలి ఉంందని వీరి అభిప్రాయం.అయితే బీఆర్‌ఎస్‌ మహిళా నేత, కేసీఆర్‌ కుమార్తె కవిత ఒక సందర్భంలో తెలంగాణ తల్లి విగ్రహంలో తన పోలిక ఉందని చెప్పుకున్నారు. ఈ వ్యాఖ్యను కాంగ్రెస్ నేతలు తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. 

తెలంగాణ తల్లి విగ్రహాలను మారుస్తామన్న కేటీఆర్

తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం మూర్ఖత్వమని మాజీ సీఎంకేసీఆర్ వ్యాఖ్యానించారు. సీఎం వి తలతిక్క ఆలోచనలని, వాటివల్ల తెలంగాణ అస్తిత్వానికి గాయం అవుతోందని ఆయన ధ్వజమెత్తారు. ఈ అంశాన్ని సెంటిమెంట్ గా మార్చడానికి ఆయన ప్రయత్నించవచ్చు. తెలంగాణ ఉద్యమం ప్రధానంగా నడిచింది అంతా సెంటిమెంట్ రాజకీయాలతోనే అన్న సంగతి తెలిసిందే. తెలంగాణలో అభివృద్ది మా హక్కు అని, తెలంగాణ రాష్ట్రం మా సెంటిమెంట్ అని ఉద్యమ సమయంలో కేసీఆర్‌ ప్రచారం చేసేవారు. కాగా కేసీఆర్‌ సెంటిమెంట్ రాజకీయాన్ని ఎదుర్కోవడానికి రేవంత్ సిద్దపడుతున్నారు. చాకలి ఐలమ్మ స్పూర్తితో తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేయించామని, కుడిచేతితో జాతికి అభయాన్ని ఇస్తోందని అన్నారు. ఎడమ చేతిలో వరి, జొన్న, సజ్జ పంటలతో ఈ విగ్రహం తయారైందని అన్నారు. 

తెలంగాణ సంప్రదాయాలకు అనుగుణంగా విగ్రహ రూపకల్పన జరిగిందని ఆయన వాదించారు. శాసనసభలో భావుకతను కూడా ప్రదర్శిస్తూ ప్రసంగించారు. డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం జరుపుతామని కూడా ప్రకటించడం విశేషం. సోనియాగాంధీ జన్మ దినం ఇదే రోజు కావడం గమనార్హం. బీఆర్‌ఎస్‌ ఇందుకు అంగీకరించదు. తెలంగాణ అవతరణ దినోత్సవ తేదీని మార్చడానికి కాంగ్రెస్ కుట్ర చేస్తోందని బిజెపి ఆరోపించింది. దీనిని కాంగ్రెస్ విగ్రహంగా తయారు చేశారని కూడా బీజేపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా విగ్రహాలను సెంటిమెంట్‌గా పరిగణిస్తుంటారు. అవి కూడా కాలాన్ని బట్టి, రాజకీయాలను బట్టి, మారిన ప్రభుత్వాలను బట్టి కూడా ఉండవచ్చు. 

టాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాలను ఒకప్పుడు కూల్చే యత్నం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాటి జోలికి ఎవరూ వెళ్లలేదు. అంతవరకు మంచిదే. రష్యా లో కమ్యూనిస్టు ప్రభుత్వాల నేతలు లెనిన్, స్టాలిన్ వంటి వారి విగ్రహాలను కూడా తొలగించారు. మన దేశంలో విగ్రహాల చుట్టూ కూడా రాజకీయాలు సాగుతుంటాయి. ఎన్టీఆర్ విగ్రహాన్ని తెలుగుదేశం సెంటిమెంట్ గా మార్చుకుంటే, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని వైఎస్ ఆర్ కాంగ్రెస్ సెంటిమెంట్ గా పరిగణిస్తుంది. తెలంగాణ తల్లి విగ్రహంపై రాజకీయం ఎలా సాగుతుందన్నది అప్పుడే చెప్పలేం. 

కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఈ విగ్రహం ఏర్పాటు చేసింది కనుక, రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా ప్రభుత్వ స్థలాలలో ఈ విగ్రహాలను నెలకొల్పవచ్చు. కాని ఇప్పటికే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటైన తెలంగాణ తల్లి విగ్రహాలు అలాగే కొనసాగవచ్చు.. బీజేపీ అధికారంలోకి వస్తే వారు కొత్త విగ్రహం తయారు చేసి చేతిలో కమలం గుర్తు పెడతారేమోనని కొందరు చమత్కరిస్తున్నారు.ఏది ఏమైనా ప్రజలు ఈ విగ్రహాల సెంటిమెంట్ రాజకీయాలకు ప్రభావితం అవుతారా?లేక రాజకీయ పార్టీల పనితీరుకు ప్రభావితం అవుతారా?అంటే అది సందర్భాన్ని బట్టి, ఆయా నాయకుల చాకచక్యాన్ని బట్టి ఉంటుందేమో! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement