వేల ఎకరాలు సేకరించి దోచుకునే కుట్ర.. భూముల అన్యాక్రాంతంపై శ్వేతపత్రం విడుదల చేయాలి
కేసీఆర్ కుటుంబ భూదోపిడీపై చర్యలేవి?
గుర్రంగూడ బోనాల ఉత్సవాల్లో కేంద్రమంత్రి బండి సంజయ్
సాక్షి, రంగారెడ్డి జిల్లా/బడంగ్‌పేట్: కాంగ్రెస్ ప్రభుత్వం ఫోర్త్ సిటీ పేరుతో చేసిన ప్రకటన వెనుక పెద్ద ఎత్తున భూదందా కొనసాగుతోందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలో నిర్వహించిన బోనాల ఉత్సవాలకు బండి సంజయ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ నేతలు వేల ఎకరాలు ముందుగానే సేకరించి..రియల్ దందా చేస్తూ వేలకోట్ల విలువ చేసే ఆస్తులు పోగేసుకునేందుకు సిద్ధమయ్యారన్నారు. కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్‌ఎస్ బాటలో నడుస్తున్నారని చెప్పారు. ఈ ఫోర్త్‌సిటీ వల్ల కాంగ్రెస్ నేతలకు తప్ప ప్రజలకు ప్రయోజనం లేదని, స్థానిక నేతకే భూములు సేకరించే బాధ్యతను అప్పగించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
ఆ కమిటీ నివేదిక ఎక్కడ?
ధరణి పేరును భూమాతగా మారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం భూ మేతకు ఉపయోగించుకునేందుకు సిద్ధమవుతుందని బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 24 లక్షల అసైన్డ్ భూములుంటే.. నేడు ఆ భూములు ఐదు లక్షలకు ఎలా తగ్గాయని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు పెద్ధఎత్తున ధరణిని అడ్డుపెట్టుకొని దోచుకున్నారని ఎన్నికల ముందు చెప్పిన కాంగ్రెస్ నేతలు ఈ విషయంపై ఎందుకు విచారణ జరిపించడం లేదన్నారు.
అధికారంలోకి రాగానే ధరణిపై ఐదుగురు సభ్యులతో వేసిన కమిటీ నివేదిక ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల తీరు చూస్తుంటే భవిష్యత్‌లో గజం భూమి కూడా మిగిలే పరిస్థితి కనిపించడం లేదని చెప్పారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ధరణి భూముల అన్యాక్రాంతంపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.
ఆ విలీన ప్రతిపాదన అర్థం లేనిది
గ్రేటర్ హైదరాబాద్ శివారులోని 33 గ్రామపంచాయతీలు, 20 పురపాలక సంఘాలు, 8 కార్పొరేషన్లు, 61 పారిశ్రామిక వాడలు, కంటోన్మెంట్ బోర్డును జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలనే ప్రతిపాదన అర్థం లేనిదని బండి సంజయ్ అన్నారు. దీనిపై బీజేపీ నాయకత్వం చర్చించి తగిన కార్యాచరణ ప్రకటిస్తుందని చెప్పారు. రుణమాఫీతో పాటు ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా ఏదో ఒక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకురావడం, ప్రజల దృష్టిని మళ్లించడం కాంగ్రెస్ నేతలకు అలవాటైపోయిందని విమర్శించారు.
హిందువుల పండుగలంటే అంత చులకనా?
‘బోనాల పండుగ వెనుక పెద్ద చరిత్ర ఉంది. దీనికి సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. కానీ ఇంత పెద్ద పండుగకు ప్రభుత్వం నిధులివ్వదు. హిందువుల పండుగలకు పైసలివ్వరు. సెక్యులరిజం పేరుతో ఒక మతానికే కొమ్ముకాస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లు ఖర్చు చేస్తోంది’అని బండి సంజయ్ విమర్శించారు.
రంజాన్‌కు రూ.33 కోట్లు, హిందువులను చంపిన తబ్లిగీ జమాతే సంస్థకు రూ.2.40 కోట్లు విడుదల చేసిన కాంగ్రెస్ అదేదో ఘన కార్యంగా చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బొక్కనర్సింహారెడ్డి తదితరులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment