ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలను ఒకే గొడుగు కిందికి తెస్తున్నాం
కుల రహిత సమాజ స్థాపనే ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి
కొందుర్గులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన
గత పదేళ్లలో విద్యావ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని విమర్శ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘గత ముఖ్యమంత్రి గడీలు, పార్టీ ఆఫీసులు కడితే.. మేము పేద పిల్లల కోసం సమీకృత గురుకుల పాఠశాలలు నిర్మిస్తున్నాం. తెలంగాణలోని 28 నియోజకవర్గాల్లో వీటిని కడుతున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలను ఒకే గొడుగు కిందికి తీసుకురావడం ద్వారా కుల రహిత సమాజ స్థాపనే ప్రభుత్వ లక్ష్యం..’అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. 25 ఎకరాల్లో, రూ.125 కోట్ల అంచనా వ్యయంతో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం కొందుర్గులో అత్యాధునిక హంగులతో నిర్మించ తలపెట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనానికి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు.
అయినవాళ్లకు పదవులు..పేదలకు బర్రెలు
‘కేసీఆర్ గత పదేళ్లలో విద్యావ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఏడు లక్షల కోట్లు అప్పు చేశారు కానీ విద్యాలయాలకు పైసా విదల్చలేదు. పైగా ఐదు వేలకుపైగా స్కూళ్లను మూసి వేయించారు. ఒక నియోజకవర్గానికో, ఒక కులానికో గురుకులాన్ని ఏర్పాటు చేసినా వాటిలో కనీస సదుపాయాలు కల్పించలేదు. నలుగురు ఉండాల్సిన గదుల్లో 40 మంది పిల్లలను కుక్కారు. చదువుకున్నోళ్లకు ఎవరైనా ఆయా రంగాల్లో ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కలి్పంచాలి. కానీ ఆయన మాత్రం తన కొడుకు, అల్లుడికి మంత్రి పదవులు, కూతురుకు ఎమ్మెల్సీ, మరో కొడుక్కి రాజ్యసభ పదవులు కట్టబెట్టాడు. నమ్ముకున్న పేదలకు మాత్రం గొర్రెలు, బర్రెలు, పందులు పంచి పెట్టాడు.
నీ కొడుకును, అల్లుడిని, బిడ్డను బర్రెలు, గొర్రెలు కాయడానికి పంపుతావా? పేదోడు చదువుకుంటే ఎక్కడ వారిలో చైతన్యం వస్తుందో అని, ఎక్కడ తన తప్పులను ప్రశి్నస్తారో అని భయపడి చదువుకు దూరం చేసి, వారిని బానిసలుగా చూశాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అంటూ విడదీసి ఒకేచోట కలిసి మెలసి ఉండాల్సిన పిల్లల మెదడులో విషం నింపాడు. సమాజ విచ్ఛిన్నానికి కుట్రపన్నాడు. 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజించాడు. ఆయా జిల్లాల్లో పార్టీ కార్యాలయాల కోసం ప్రభుత్వ భూములను అప్పనంగా కొట్టేసి నిర్మాణాలు చేపట్టాడు. కానీ పేదలకు స్కూళ్లు, ఆస్పత్రులు కట్టేందుకు మాత్రం ఆయనకు మనసు రాలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎస్‌కు గుండు సున్నా ఇచ్చారు. అయినా ఆ పార్టీ నేతల బుద్ధి మారలేదు..’అని రేవంత్‌రెడ్డి అన్నారు.
ప్రవీణ్‌కుమార్ కూడా దొరలాగే మాట్లాడుతున్నాడు
‘ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అంటే నాకు గౌరవం ఉంది. అణగారిన కులం నుంచి వచ్చి ఐపీఎస్ అయినందుకు ఆయన్ను మనస్ఫూర్తిగా అభినందించా. బీఎస్పీలో ఉంటారో? బీఆర్‌ఎస్‌లో ఉంటారో ఆయన ఇష్టం. ఆయన గురుకులాలకు కార్యదర్శిగా పని చేశారు. షాద్‌నగర్ బిడ్డలకు రూ.125 కోట్లతో ఇంటిగ్రేటెడ్ గురుకులం నిర్మిస్తుంటే అభినందించాల్సింది పోయి అడ్డుపడుతున్నాడు. కేసీఆర్ చెప్పిందే ఆయన మాట్లాడుతున్నాడు. బీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత ఆయన కూడా పేదలు బర్రెలు, గొర్రెలు, పందులు కాసుకోవాలని దొరలాగే సూచిస్తున్నాడు..’అని సీఎం ధ్వజమెత్తారు.
సమీకృత స్కూళ్లకు పీవీ ఆద్యుడు
‘నిర్వీర్యమైన విద్యా వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నా. ఎలాంటి విమర్శలకు తావు లేకుండా ఇప్పటికే 34 వేల మంది ఉపాధ్యాయులను బదిలీ చేశాం. 21 వేల మందికి పదోన్నతులు కలి్పంచాం. ఇందులో అధికారుల కృషి అభినందనీయం. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు దివంగత ప్రధాని పీవీ నరసింహారావు ఆద్యుడు. ఆయన సర్వేల్, నాగార్జునసాగర్‌లో ఏర్పాటు చేసిన స్కూళ్లలో చదువుకున్న అనేకమంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, డాక్టర్లు, లాయర్లు, పారిశ్రామిక వేత్తలుగా ఎదిగారు. ఒకప్పుడు సర్వేల్ స్కూల్లో చదువుకున్న బుర్ర వెంకటేశం ఐఏఎస్ అయ్యారు. మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి కూడా ఇదే స్కూల్లో చదువుకున్నారు..’అని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, రాంమోహన్‌రెడ్డి, కాలె యాదయ్య, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, కలెక్టర్ శశాంక పాల్గొన్నారు.
విద్యార్థులందరిదీ ఒక్కటే కులం
కొందుర్గు: విద్యాభ్యాసం చేస్తున్న బాలబాలికలందరిదీ ఒక్కటే కులమని, అది విద్యార్థి కులమని కొందుర్గు విద్యార్థి మణికంఠ అన్నాడు. సీఎం పాల్గొన్న సభలో అతను మాట్లాడుతూ.. పేదలు, మధ్య తరగతి విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించడానికి, కుల, మతాలకతీతంగా విద్యార్థులందరూ ఒకేచోట చదువుకునేందుకు వీలుగా ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమని అన్నాడు. ‘నేను ప్రమాణం చేసి చెప్తున్నా.. ఈ విషయమై ఎప్పుడూ సీఎం రేవంత్‌రెడ్డికి రుణపడి ఉంటాం..’అని చెప్పాడు. ఈ సందర్భంగా మణికంఠతో పాటు మరో విద్యార్థి జ్యోతిని ముఖ్యమంత్రి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment