బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణ
సీఎం రేవంత్ ఏర్పాటు చేసిన ఈ ముఠా కంపెనీలను బ్లాక్‌మెయిల్ చేస్తోంది
అక్రమ వసూళ్లకు పాల్పడుతోంది.. కబ్జాలు, భూదందాలు చేస్తోంది
ఇవన్నీ బయటపడతాయనే తప్పుడు కేసులతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు
ఎన్ని కేసులు పెట్టుకున్నా ప్రజల తరఫున ప్రశ్నించడాన్ని ఆపబోమని స్పష్టికరణ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘రాష్ట్రంలో ఆరుగురు సభ్యులతో కూడిన దోపిడీ ముఠా తిరుగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి ఏర్పాటు చేసిన ఈ ముఠా కంపెనీలను బ్లాక్‌మెయిల్ చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతోంది. ఈ అక్రమ దందాలు బయటపడతాయనే భయంతోనే మాపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ (పక్కదోవ రాజకీయాలు)కు పాల్పడుతున్నారు.
మాపై ఎన్ని కేసులు పెట్టినా ప్రజల తరఫున ప్రశ్నించడాన్ని మాత్రం మేం ఆపం. ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీల్లో భాగంగా కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను అమలు చేసేంతవరకు వెంటాడుతూనే ఉంటాం..’అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. శుక్రవారం షాబాద్‌లో నిర్వహించిన రైతుదీక్షలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఆ తర్వాత మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
అలీబాబా అరడజన్ దొంగల ముఠా
‘రాష్ట్రంలో తిరుపతిరెడ్డి, కొండల్‌రెడ్డి, వేం నరేందర్‌రెడ్డి, రోహిణ్‌రెడ్డి, ఫహీం ఖురేíÙ, ఏవీ రెడ్డిలతో కూడిన అలీబాబా అర డజన్ దొంగల ముఠా తిరుగుతోంది. బ్లాక్‌మెయిళ్లు, అక్రమ వసూళ్లతో పాటు కబ్జాలు, భూ దందాలు చేస్తోంది. ఇవన్నీ బయటపడతాయనే తప్పుడు కేసులు పెడుతున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.
పైసా లాభం లేకుండా క్విడ్ ప్రోకో ఎక్కడిది?
కొన్ని రోజులు కాళేశ్వరం, మరికొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ కేసుల పేరుతో ప్రభుత్వం టైం పాస్ చేసింది. ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణపై ఏమీ లేనటువంటి ఏసీబీ కేసును ప్రజలను డైవర్ట్ చేసేందుకు వాడుకుంటోంది. ఏసీబీ, ఈడీ విచారణలో ఎలాంటి అవినీతి లేదని స్పష్టమైంది. గ్రీన్ కో కంపెనీకి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వల్ల ఒక రూపాయి అయినా లాభం జరిగిందా? ఆ కంపెనీకి ఎలాంటి లబ్ధి చేయనప్పుడు క్విడ్ ప్రో కో అనే మాట ఎలా వర్తిస్తుంది? ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.46 కోట్లలో నయా పైసా అయినా మాకు వచ్చిందా? మాకు జైళ్లు, ప్రభుత్వ వేధింపులు కొత్తకాదు. బీజేపీ–కాంగ్రెస్, ఈడీ–ఏసీబీ కలిసి ఎన్ని కేసులు పెట్టుకున్నా..నేను ప్రజల తరఫున ప్రశ్నించడాన్ని ఆపబోను. నాపై కేసుల్ని న్యాయపరంగానే ఎదుర్కొంటా. మేం గతంలో చేసిన పెట్టుబడి ప్రయత్నాల ఫలితంగానే రాష్ట్రంలో ఈ రోజు పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. కానీ కాంగ్రెస్ హయాంలో పైసా పెట్టుబడి రాలేదు..’అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
కాంగ్రెస్‌వి ప్రతిచోటా మోసాలే..
‘కాంగ్రెస్ పార్టీ గెలిచిన ప్రతిచోటా మోసాలకు పాల్పడుతోంది. గ్యారంటీల పేరుతో ఓట్ల గారడీ చేస్తోంది. కర్ణాటకలో ఇప్పటికే 15 శాతం బస్సు చార్జీలను పెంచారు. ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల కోసం రైతు భరోసా పేరుతో మళ్లీ మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల తర్వాత భరోసాను ఎత్తేస్తారు. కాంగ్రెస్‌ను ఢిల్లీ ప్రజలు కూడా ముమ్మాటికీ తిరస్కరిస్తారు. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది.
రాష్ట్రంలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవాలి
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవాలి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే ఊరుకోం. బడుగు, బలహీన వర్గాల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటాం. సాగునీటిని అందజేయడంతో పాటు వివిధ పథకాలతో రైతులకు, వ్యవసాయానికి కేసీఆర్ చేసినంత సేవ దేశ చరిత్రలో ఎవరూ చేయలేదు. మా పార్టీకి ఆయువు పట్టుగా ఉన్న రైతన్నల కోసం ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తెస్తూనే ఉంటాం. విచారణల పేరుతో పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించినా మా పోరాటం ఆపబోం..’అని కేటీఆర్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment