మాజీ సీఎం కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్
మొగిలిగిద్ద బహిరంగ సభలో సీఎం ప్రసంగం
ఫామ్‌హౌస్‌లో పడుకుని ఎవరిని గంభీరంగా చూస్తున్నావ్..
త్వరలో అసెంబ్లీలో బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై చర్చ పెడతాం
పొంకనాలు కొట్టడం కాదు.. దమ్ముంటే అసెంబ్లీకి రా
నీ రాక కోసం ప్రజలెవరూ ఎదురు చూడటం లేదు
వేములవాడ రాజన్నను మోసం చేసిన చరిత్ర నీది
కేసీఆర్ ఓ చెల్లని వెయ్యి రూపాయల నోటు.. ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదని వ్యాఖ్య
సాక్షి,రంగారెడ్డి జిల్లా: ‘‘కేసీఆర్(KCR) గత 14 నెలలుగా ఫౌమ్‌హౌస్‌లో పడుకొని గంభీరంగా చూస్తున్నానని అంటున్నారు. ఎవరిని చూస్తున్నావు? ఎందుకు చూస్తున్నావు? బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశంపై చర్చించేందుకు ఫిబ్రవరి మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నాం. ఫామ్‌హౌస్‌లో పడుకుని పొంకనాలు కొట్టడం కాదు. దమ్ముంటే అసెంబ్లీకి రా.. అన్ని లెక్కలు తేల్చుకుందాం.’’ అని మాజీ సీఎం కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సవాల్ విసిరారు.
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూఖ్‌నగర్ మండలం మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల 150వ వార్షికోత్సవానికి సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే..
‘‘కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ఫౌమ్‌హౌస్‌లో పడుకొని కొడుకు, అల్లుడిని ఊర్లపైకి ఉసిగొల్పుతున్నడు. జహంగీర్‌పీర్ దర్గా, వేములవాడ రాజన్నలను మోసం చేసిన చరిత్ర నీది. నీ రాక కోసం తెలంగాణ ప్రజలెవరూ ఎదురు చూడటం లేదు.
సరిగ్గా నిలబడటం నేర్చుకో..
నువ్వో చెల్లని వెయ్యి రూపాయల నోటువు. ఆ నోటును ఎవరైనా జేబులో పెట్టుకునిపోతే.. జైలుకు వెళ్లడం ఖాయం. కొడితే బలంగా కొడతానని అంటున్నారు. కొట్టడం కాదు ముందు సరిగ్గా నిలబడటం నేర్చుకో. సోషల్ మీడియా టిక్‌టాక్‌లో తనకు ఎక్కువ మార్కులు వచ్చాయని గొప్పలు చెప్పుకొంటున్నారు. సల్మాన్‌ఖాన్‌కు రాఖీ సావంత్‌కు మధ్య పోటీపెడితే ఎక్కువ లైకులు రాఖీ సావంత్‌కే వచ్చాయి. అంత మాత్రన సల్మాన్‌ఖాన్ గొప్పవాడు కాకుండా పోతాడా?
ఆయన ఆరోగ్య పరిస్థితి బాగులేదు
కేసీఆర్ మానసిక ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు. ఆయన కుటుంబ సభ్యులు యమకింకరులై తిరుగుతున్నారు. ఫామ్‌హౌస్‌లో పడుకుని సోది చెప్పుకోవడం కాదు. అసెంబ్లీకి రా.. అన్ని లెక్కలు వివరిస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి పనులను, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను అభినంచడానికి మనసు రాకపోతే ఫామ్‌హౌస్‌లోనే పడుకో. పాలమూరు, జూరాల ఎత్తిపోతల, కోయల్‌సాగర్ కడతానని హామీ ఇచ్చి.. ప్రజలను మోసం చేశావు. నువ్వు ఎన్ని చెప్పినా తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితిలో లేరు.
ఏడాదిలో ఎన్నో చేశాం..
మా ఏడాది పాలనలో రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశాం. సన్నాలకు రూ.500 బోనస్ ఇచ్చాం. 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే గృహాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాం. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. ఏడాదిలోనే 55,143 ఉద్యోగాలు భర్తీ చేశాం. రైతు భరోసా కింద ఎకరానికి రూ.12 వేలు ఇస్తున్నాం. భూమి లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద నగదు అందజేస్తున్నాం, రైతును రాజును చేస్తున్నాం.
ప్రభుత్వ విద్యకు బడ్జెట్ 15 శాతానికి పెంచుతాం
దివంగత వైఎస్సార్ పాలనలో జిల్లాకో యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. అనేక ప్రభుత్వ పాఠశాలలను నెలకొల్పాం. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి పేదలకు ఉన్నత చదువులు చదివే అవకాశం కల్పించాం. పదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రభుత్వ విద్యారంగం పూర్తిగా నిర్విర్యమైంది. ఉస్మానియా, కాకతీయ వర్సిటీలు పునరావాస కేంద్రాలుగా మారాయి. అవి ప్రతిష్టను కోల్పోయే పరిస్థితికి దిగజార్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాం. బడ్జెట్‌లో ఏడు శాతం నిధులు కేటాయించాం. తండాలు, మారుమూల గ్రామాల్లో మూసివేసిన అనేక పాఠశాలలను పునఃప్రారంభించాం. 11 వేల కొత్త ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశాం. భవిష్యత్తులో విద్యకు బడ్జెట్‌ను 15 శాతానికి పెంచాలని నిర్ణయించాం.
స్టాన్‌ఫర్డ్ వర్సిటీతో ఎంఓయూకు యత్నం
మహాత్మాగాంధీ నడిపిన యంగ్ ఇండియా పత్రిక స్ఫూర్తితో విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలను అందించేందుకు ‘యంగ్ ఇండియా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్’ను ఏర్పాటు చేస్తున్నాం. రూ.2,400 కోట్లతో 75 ఐటీఐలను ఆధునీకరించాం. టాటా కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. సింగపూర్ నుంచి నిపుణులను ఇక్కడికి రప్పించి, నిరుద్యోగులకు ఆయా అంశాల్లో శిక్షణ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రఖ్యాత స్టాన్‌ఫర్డ్ వర్సిటీతో ఎంఓయూ కోసం ప్రయత్నిస్తున్నాం. కేవలం చదువుకున్నవారికే కాదు ఆటల్లో రాణిస్తున్నవారికీ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్‌కు డీఎస్పీ ఉద్యోగంతోపాటు రూ.2 కోట్ల ఆర్థిక సాయం అందించాం. పెద్దగా చదువు లేని సిరాజుద్దీన్ సహా దీప్తికి గ్రూప్–2 ఉద్యోగం, ఆర్థిక సాయం, ఇంటి స్థలం ఇచ్చి ప్రోత్సహించాం..’’ అని సీఎం రేవంత్ తెలిపారు.
ప్రభుత్వ టీచర్లు ఆత్మ విమర్శ చేసుకోవాలి.
విద్యార్థుల భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమై ఉంది. రాష్ట్రంలో 12వేల ప్రైవేటు పాఠశాలల్లో 31లక్షల విద్యార్థులు చదువుతుంటే.. 30వేల ప్రభుత్వ పాఠశాలల్లో 24 లక్షల మంది చదువుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. ప్రభుత్వ విద్య ప్రైవేటుపరం కాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది. మట్టిలో మాణిక్యాలను గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయులు స్థానికంగా నివాసం ఉండాలి. విద్యార్థులను ప్రోత్సహించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో డిగ్రీలు, పట్టాలు ఉంటే సరిపోదు. పోటీ ప్రపంచంలో రాణించాలంటే మార్కులు, డిగ్రీలేకాదు.. సాంకేతిక నైపుణ్యం కూడా తోడవాలి. అప్పుడే కోరిన ఉద్యోగం దొరుకుతుంది.
మొగిలిగిద్దకు రూ.16 కోట్లు
మొగిలిగిద్ద పాఠశాల తెలంగాణకే వన్నె తెచ్చిందని, ఇక్కడ చదువుకున్న వారిలో ఇద్దరు సీఎంలు, గవర్నర్, మాజీ మంత్రి, ప్రొఫెసర్ సహా అనేక మంది ఉన్నారని సీఎం గుర్తు చేశారు. ఇలాంటి చారిత్రక స్కూలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు. మొగిలిగిద్దలో పాఠశాల భవనం, గ్రామ పంచాయతీ భవనం, సీసీ రోడ్ల కోసం రూ.16 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక్కడి విద్యార్థులకు వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు ‘అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్’ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ బహిరంగ సభలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ హరగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment