
సాక్షి, చర్ల: సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు శుక్రవారం అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్‌ను హతమార్చారు. పోలీసుల కథనం ప్రకారం.. బీజాపూర్ జిల్లా బైరంగడ్ అటవీ రేంజ్ పరిధిలోని గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి కూలీలకు డబ్బులు చెల్లించి తిరిగి వస్తున్న రేంజ్ ఆఫీసర్ కొండ్రోజీని మావోయిస్టులు అడ్డుకొని కిడ్నాప్ చేశారు. అనంతరం గొడ్డళ్లతో నరికి దారుణంగా హతమార్చారు. సమాచారం తెలుసుకున్న జంగ్లా పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
దుంకుతున్నదుమ్ముగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కుమ్మరిగూడెంలోని దుమ్ముగూడెం ఆనకట్ట జలకళను సంతరించుకుంది. విస్తారంగా కురిసిన వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల నుంచి తరలివస్తున్న గోదావరి వరద పరవళ్లు తొక్కుతోంది. ఫలితంగా చూసేకొద్దీ మళ్లీ చూడాలనిపించే ఆనకట్ట అందాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శుక్రవారం ‘సాక్షి’కెమెరా ఈ దృశ్యాన్ని బంధించింది.