సాక్షి, హైదరాబాద్ : విధి నిర్వహణలో ఉన్న మహిళా అటవీశాఖ అధికారిణిపై దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యే సోదరుడు, జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణ వ్యవహార శైలిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి సమగ్ర విచారణ జరిపించాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని టీఆర్‌ఎస్ నాయకత్వం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
చదవండి: నేను బతుకుతానని అనుకోలేదు: ఎఫ్‌ఆర్వో అనిత
కాగా ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం కొత్త సారసాల గ్రామంలో అటవీ శాఖ అధికారులపై తన అనుచరులతో హంగామా సృష్టించి, దాడికి పాల్పడ్డ కోనేరు కృష్ణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం మధ్యాహ్నం జెడ్పీ వైస్ చైర్మన్, జడ్పీటీసీ పదవికి రాజీనామా చేశారు. కోనేరు కృష్ణ తన రాజీనామా లేఖను జిల్లా కలెక్టర్‌కు పంపించారు. అయితే పార్టీ ఆదేశాల మేరకు ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కాగా ఎఫ్‌ఆర్వో అనితపై దాడి చేసిన కేసులో కోనేరు కృష్ణ సహా 16మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి 30మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
చదవండి: మహిళా ఎఫ్‌ఆర్వోపై ఎమ్మెల్యే సోదరుడి దాడి.!
దాడి ఘటన ఖండించిన మంత్రి అల్లోల
మరోవైపు అధికారులపై జరిగిన దాడిని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఏమైనా ఇబ‍్బందులు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలే తప్ప, భౌతిక దాడులకు పాల్పడటం సరికాదని అన్నారు. అలాగే అటవీశాఖ సిబ్బందిపై దాడిని ఐఎఫ్‌ఎస్ అధికారుల సంఘం ఖండించింది. విధి నిర్వహణలో ఉన్న వారిని అడ్డుకోవడం, మహిళా అధికారిని తీవ్రంగా గాయపరచడం తీవ్రమైన చర్య అని, బాధ్యులపై వెంటన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment