కాగజ్‌నగర్ : విధి నిర్వహణలో ఉన్న అటవీ అధికారులపై ఓ ఎమ్మెల్యే తమ్ముడు దౌర్జన్యం చేశాడు. స్థానికులను ఉసిగొల్పి రణరంగం సృష్టించాడు. వివరాలు.. సిర్పూర్ కాగజ్‌నగర్ ప్రాంతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్రత్యామ్నాయ అటవీకరణ పనులు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాంతో కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలోని సార్‌సాలా గ్రామంలో 20 హెక్టార్లలో చెట్లు నాటేందుకు అటవీ అధికారులు సిద్ధమయ్యారు. చెట్లు నాటేందుకు వీలుగా భూమిని చదును చేసేందుకు ట్రాక్టర్లు, సిబ్బందితో కలిసి ఆదివారం ఉదయం అక్కడికి చేరుకున్నారు.
అయితే, ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు యత్నించిన సిర్పూరు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కోనేరుకోనప్ప సోదరుడు, జెడ్పీ వైస్ చైర్మన్ కృష్ణ అధికారులపట్ల అమానుషంగా ప్రవర్తించాడు. అనుచరులతో కలిసి మహిళా ఎఫ్‌ఆర్వోపై ఒక్కసారిగా కర్రలతో దాడికి పాల్పడ్డాడు. అతనితోపాటు మరికొంతమంది కర్రలు చేతబూని అధికారులను బెదిరింపులకు గురిచేశారు. ఈ దాడిలో ఎఫ్‌ఆర్వో అనిత తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. మొదటగా కోనేరు కృష్ణ, అనంతరం అతని అనుచరులు తనపై అకారణంగా దాడికి పాల్పడ్డారని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనిత ఆవేదన వ్యక్తం చేశారు. పదిమంది ఒక్కసారిగా కర్రలతో తలపై కొట్టారని, ఆక్షణంలో తాను బతుకుతానని అనుకోలేదని కన్నీటిపర్యంతమయ్యారు. ఘటనాస్థలంలో 50 మంది పోలీసులు ఉన్నా దాడిని అడ్డుకోలేకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment