Forest Range Office
-
ఎఫ్ఆర్వో దారుణ హత్య.. గుత్తికోయల బహిష్కరణ!
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావుపై దాడి.. హత్య ఘటనను తీవ్రంగా ఖండిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడు పంచాయతీ ఇవాళ కీలక తీర్మానం చేసింది. గుత్తి కోయలందర్నీ గ్రామం నుంచి బహిష్కరించాలని బెండాలపాడు గ్రామసభ తీర్మానించింది. సాక్షి, భద్రాద్రి జిల్లా: ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు మృతికి కారణమై గుత్తి కోయలను బహిష్కరిస్తూ శనివారం బెండాలపాడు గ్రామసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య ఘటనను ఈ సందర్భంగా గ్రామసభ ముక్తకంఠంతో ఖండించింది. బెండలపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని ఎర్రబోడు నుంచి అక్కడ నివసిస్తున్న గుత్తి కోయలను బహిష్కరిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాదు.. వాళ్లను వాళ్ల స్వరాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌కు పంపాలంటూ ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈ సందర్భంగా.. బెండాలపాడు గ్రామస్తులు గుత్తి కోయలపై పలు ఆరోపణలు చేశారు. గుత్తి కోయలు రోజూ గంజాయి, నాటుసారా సేవిస్తూ విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారని పేర్కొంది. గుత్తి కోయల తీరు చాలా ప్రమాదకరంగా ఉందని, మారణాయుధాలు ధరించి తిరుగుతున్నారని, వాళ్ల వల్ల తమకూ ప్రాణహాని పొంచి ఉందని ఆ తీర్మానంలో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు గుత్తి కోయలను వాళ స్వస్థలమైన ఛత్తీస్‌గఢ్‌కు తరలించాల్సిందేనని సభ తీర్మానించింది. పోడు సాగుకు అడ్డొస్తున్నారని చంద్రుగొండ రేంజ్ ఎఫ్ఆర్వో చలమల శ్రీనివాసరావు(45)ను గొత్తికోయలు దారుణంగా దాడి చేసి హతమార్చిన విషయం తెలిసిందే. -
భద్రాద్రి: గుత్తికోయల దాడి.. ఫారెస్ట్ రేంజర్ మృతి
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: కలకలం సృష్టించిన గుత్తి కోయల దాడి ఘటనలో ఫారెస్ట్ అధికారి మృతి చెందారు. పోడు భూములకు సంబంధించి గుత్తికోయలకు , ఫారెస్ట్ అధికారులకు మధ్య మంగళవారం గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడ్డ ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. చంద్రుగొండ మండలం బెండలపాడులో మంగళవారం ఈ దాడి ఘటన చోటు చేసుకుంది. ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్‌ను వెంటాడి మొదటి కర్రతో దాడి చేశారు. కిందపడిపోయిన తర్వాత వేట కొడవళ్లు, గొడ్డళ్లతో దాడి చేశారు. ఘటన గురించి తెలిసిన వెంట హుటాహుటిన చండ్రుగొండ చేరుకున్నారు డీఎస్పీ వెంకటేశ్వరబాబు, సీఐ వసంత్ కుమార్‌లు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతోన్న శ్రీనివాస్‌ను చంద్రుగొండ పిహెచ్సీకి తరలించారు. పరిస్తితి విషమించడంతో ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. గత కొంతకాలంగా ఫారెస్ట్ అధికారులకు, ఆదివాసులకు మధ్య పోడు భూముల విషయంలో వరుసగా జరుగుతున్న వివాదాలు ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. బెండలపాడు సమీపంలోని ఎర్రబొడు అటవీప్రాంతంలో గుత్తికోయలు పోడు వ్యవసాయం చేసుకుంటున్న భూముల్లో గతంలో ఫారెస్ట్ అధికారులు మొక్కలు నాటారు. ఈ నాటిన మొక్కల్ని తొలగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో పలుమార్లు ఫారెస్ట్ అధికారులకు, పోడు రైతులకు మధ్య గొడవ కూడా జరిగింది. గతంలో లాఠీఛార్జ్ సైతం చేశారు. తాజాగా ఫారెస్ట్ అధికారులు ప్లాంటేషన్ చేయడాన్ని నిరసిస్తూ ఇవాళ మళ్లీ భూముల్లో అధికారులను నాటిన మొక్కల్ని ధ్వంసం చేశారు గుత్తికోయలు. దానిని అడ్డుకునే క్రమంలో అధికారులు, గుత్తి కోయలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావుపై వేట కొడవళ్లతో దాడి చేశారు. -
ప్రశాంతంగా ఉంటే అద్భుతాలు చేయగలం అంటే ఇదేనేమో!
చెన్నై: ఇంతవరకూ ఏనుగులు పంటలను నాశనం చేయడం, మనుష్యుల పై దాడి చేయడం చూశాం. అలాగా ఇటీవల కొన్ని చోట్ల రహాదారులపైకి వచ్చి కారులను, వ్యాన్లను తన తొండంతో ఎత్తిపడేసి నుజ్జునుజ్జు చేసిన ఉదంతలు వింటున్నాం. అయితే అచ్చం ఇలానే తమిళనాడులోని ఒక ఏనుగు ప్రభుత్వ ఉద్యోగులు ప్రయాణిస్తున్న బస్సు పై దాడి చేసింది. కాకపోతే ఎవ్వరికీ ఏమి కాలేదు. (చదవండి: ఇంత చదువు చదివి బర్రెలు అమ్ముతావా?) వివరాల్లోకెళ్లితే ....ప్రభుత్వ ఉద్యోగస్తులను కోటగిరి నుంచి మెట్టుపాలయంకి తీసుకువెళ్లే నీలగిరి బస్సు పైకి ఒక ఏనుగు ఉన్నట్టుండి అనుహ్యంగా దాడి చేసింది. పైగా తన తొండంతో బస్సు అద్దాలను పగలగొట్టింది. దీంతో బస్సులో ఉన్నవాళ్లందరూ భయంతో ఆహాకారాలు చేశారు. వెంటనే ఆ డ్రైవర్ చాకచక్యంగా ప్రయాణికులందర్నీ బస్సు వెనుక వైపుకి తీసుకువచ్చి సురక్షితంగా ఉండేలా చేశాడు. ఈ మేరకు ఏనుగు కాసేపటకీ అక్కడ నుంచి నెమ్మదిగా వెళ్లిపోయింది. అంతేకాదు అంతటి విపత్కర సమయంలో డైవర్ ఏమాత్రం కంగారు పడకుండా ప్రశాంతంగా ఉండటం విశేషం. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వ అటవీ పర్యావరణ, వాతావరణ మార్పుల ప్రధాన కార్యదర్శి సుప్రీయ సాహు ఈ వీడియోకి "ప్రశాంతంగా ఉంటే అద్భుతాలు చేయగలం" అనే ట్యాగ్‌లైన్‌ను జోడించి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఈ మేరకు నెటిజన్లు ఉద్యోగస్తులను కాపాడిన తీరు, విపత్కర పరిస్థితల్లో బస్సు డ్రైవర్ స్పందించిన తీరుకి ఫిదా అవుతున్నాం గురూ అంటూ... అతని పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. Huge respect for the driver of this Government bus in Nilgiris who kept his cool even under the terrifying hits on the bus from an agitated tusker.He helped passengers move back safely, in an incident today morning. Thats why they say a cool mind works wonders VC- by a friend pic.twitter.com/SGb3yqUWqK — Supriya Sahu IAS (@supriyasahuias) September 25, 2021 (చదవండి: మహిళ పోలీస్ అధికారి బాత్రూమ్లో కెమెరా.. స్నానం చేస్తుండగా గమనించి..) -
పొదల చాటున సంతాన వృద్ధి
జన్నారం (ఖానాపూర్): కవ్వాల్ టైగర్ జోన్లో అటవీశాఖ అధికారులు చేపట్టిన గడ్డి క్షేత్రాల పెంపకం సత్ఫాలితాలను ఇస్తోంది. గడ్డి మైదానాల పెంపకంతో రెండేళ్లలో టైగర్‌జోన్ పరిధి లో 40శాతం శాఖాహార జంతువులు పెరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో పులికి సమృద్ధిగా ఆహారం అందుబాటులో ఉంటుందని వారు భావిస్తున్నారు. అడవిలో వన్యప్రాణుల జనాభా వాటి ఆవాస ప్రాంతాల్లో విస్తరించి ఉన్న గడ్డి ప్రాంతాలపై ఆధారపడి ఉంటుంది. శాఖాహార జంతువులు అధికంగా ఉంటే వాటిపై ఆధారపడిన మాంసాహార జంతువుల జనాభా కూడా పెరుగుతోంది. చదవండి: బంగారు చేప.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన మత్య్సకారుడు 2018లో ప్రారంభం.. కవ్వాల్ టైగర్ జోన్ 893 హెక్టర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ ప్రాంతాన్ని 2012లో కేంద్ర ప్రభుత్వం టైగర్‌జోన్‌గా ప్రకటించింది. అప్పటి నుంచి అడపాదడపా పులులు రాకపోకలు సాగిస్తున్నా.. స్థానికంగా స్థిర నివాసం ఏర్పర్చుకున్న దాఖలాలు లేవు. జీవావరణ వ్యవస్థలో గడ్డి జాతుల ప్రాధాన్యం అధికంగా ఉంటుంది. ఆహారపు గొలుసులో మొక్కలు ప్రథమ ఉత్పత్తి దారులుగా నిలుస్తాయి. వీటిపై జింకలు, దుప్పులు, సాంబర్లు, నీలుగాయిలు, కొండగొర్రెలు, అడవి దున్నలు, ఇతర వన్యప్రాణులు ఆధారపడి ఉంటాయి. శాఖాహార జంతువులపై ఆధారపడి పెద్ద పులులు, చిరుతలు, నక్కలు, అటవీ కుక్కలు, తోడేళ్లు తదితర జంతువులు మనుగడ సాగిస్తాయి. పులులకు స్థానికంగా తగినంత ఆహారాన్ని వృద్ధి చేయాలనే ఉద్దేశంతో కవ్వాల్ టైగర్ జోన్లో గడ్డి క్షేత్రాల పెంపకానికి అధికారులు శ్రీకారం చుట్టారు. 2018 సంవత్సరంలో మహారాష్ట్రకు చెందిన గడ్డి క్షేత్రాల నిపుణుడు డాక్టర్ జీడీ మురత్కర్ జన్నారం డివిజన్లోని టీడీసీ టైగర్‌జోన్‌లో అటవీశాఖ అధికారులకు గడ్డి పెంపకంపై శిక్షణ ఇచ్చారు. సహజ గడ్డి క్షేత్రాలు, విత్తనాల సేకరణ, ముళ్ల కంచెల తొలగింపు, కలుపుమొక్కల నివారణ, గడ్డి విత్తనాల నిల్వ, సస్యరక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అదే ఏడాది 600 ఎకరాల్లో గడ్డి మైదానాల పెంపకానికి శ్రీకారం చుట్టారు. ఏటా పెంపకం.. శిక్షణ అనంతరం గడ్డి క్షేత్రాల పెంపకంలో స్థానిక అధికారులు చురుగ్గా పనిచేయడంతో దేశంలోని టైగర్‌జోన్‌లో కవ్వాల్జోన్కు మంచిపేరు వచ్చింది. 2018 సంవత్సరంలో 600 ఎకరాల్లో గడ్డి మైదానాలు పెంచగా.. 2019లో 130 హెక్టర్లలో, 2020లో 200 హెక్టార్లలో, ఈ ఏడాది మరో 180 హెక్టార్లలో గడ్డి మైదానాల పెంపకంపై దృష్టి సారించారు. కొన్ని ప్రాంతాలలో గడ్డి విత్తనాలను చల్లి సహజసిద్ధంగా గడ్డిని పెంచుతున్నారు. మరికొన్ని ప్రాంతాలలో సహజసిద్ధంగా మొలిచిన గడ్డి చుట్టూ కంచె వేసి, కలుపు తొలగిస్తారు. అడవిలోని వన్యప్రాణులకు ఆహారం, నీరు ఒకచోట అందుబాటులో ఉండేవిధంగా అధికారులు చొరవ తీసుకుంటున్నారు. నీటి కుంట ఉన్న ప్రాంతంలోనే గడ్డి పెంపకం చేపడితే వన్యప్రాణులు అహారం తిని అక్కడే నీరు తాగి సేదదీరేందుకు వీలుంటుందని వారు భావిస్తున్నారు. పెరుగుతున్న శాఖాహారులు.. గడ్డి క్షేత్రాల పెంపకంతో రెండేళ్లుగా శాఖాహార జంతువుల సంఖ్య 40 శాతం పెరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. పెరుగుదల ఇదేవిధంగా ఉంటే పది పులులకు సరిపడా ఆహారం స్థానికంగా లభిస్తుందని వారు అంటున్నారు. ప్రస్తుతానికి రెండు పులులు కవ్వాల్ టైగర్‌జోన్‌లోని జన్నారం అటవీ డివిజన్‌లోకి రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే స్థానికంగా దట్టమైన అడవులు, సరిపడా శాఖాహార జంతువులు ఉన్నా పులులు స్థిర ఆవాసం ఏర్పాటు చేసుకోవడం లేదు. తిప్పేశ్వర్, తాడోబా టైగర్‌జోన్‌ల నుంచి కూడా పులుల రాకపోకలు ఉన్నాయి. దట్టమైన అటవీప్రాంతం, గడ్డి మైదానాలు, వేటాడేందుకు సరిపడా వన్యప్రాణుల అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించారు. అటవీ ప్రాంతంలో అలికిడిని తగ్గించి పులులు స్థానికంగా ఆవాసం ఏర్పాటు చేసుకునేందుకు ఈ ప్రాంతాన్ని అధికారులు తీర్చిదిద్దుతున్నారు. విరివిగా గడ్డి మైదానాలు 2018 నుంచి గడ్డి క్షేత్రాలను విరివిగా పెంచుతున్నాం. గతేడాది 200 హెక్టర్లలో గడ్డి మైదానాలు పెంచాం. దాని నిర్వహణ చూస్తూనే ఈ ఏడాది మరో 180 హెక్టార్లలో గడ్డిక్షేత్రాలను విస్తరిస్తున్నాం. కచ్చితమైన సంఖ్య తెలియకున్నా.. డివిజన్ పరిధిలో వన్యప్రాణుల సంతతి పెరుగుతోంది. రాత్రిపూట అడవి గుండా రాకపోకలు నిషేధించాం. వన్యప్రాణులు స్వేచ్ఛగా తిరిగేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. - మాధవరావు, డివిజన్ ఫారెస్టు అధికారి -
Sakshi Effect: గూడూరు ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్
సాక్షి, గూడూరు(వరంగల్): గూడూరు ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ అమృత కంపా నిధులు దుర్వినియోగం చేసినట్లు అధికారుల విచారణలో తేలడంతో సస్పెండ్ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గూడురు ఫారెస్టు రేంజ్లో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కాగా ఆమె కాజేసినట్లు సాక్షిలో వరుస కథనాలు వచ్చాయి. ఈ నెల 5వ తేదీ మానుకోట స్ట్రైకింగ్ ఫోర్స్, భద్రాద్రి కొత్తగూడెం టాస్క్ ఫోర్స్ అధికారులు విచారణ చేపట్టారు. విచారణలో ఎఫ్ఆర్వో అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో చర్యలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం సీసీఎఫ్ భీమానాయక్‌ను పీసీసీఎఫ్ శోభారాణి ఆదేశించారు. ఈ మేరకు ఎఫ్ఆర్వో అమృతను సస్పెన్షన్ చేస్తున్నట్లు సీసీఎఫ్ భీమానాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. -
గజరాజులకు పునరావాసం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉత్తరాంధ్ర సరిహద్దుల్లో ఏనుగుల సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. విజయనగరం జిల్లాలో ఆ మేరకు అవసరమైన స్థలాలను అధికారులు అన్వేషిస్తున్నారు. 1,315 ఎకరాల్లో ఎలిఫెంట్ శాంక్చ్యురీని పెట్టి రెండు జిల్లాల్లో సంచరిస్తున్న 10 ఏనుగులకు ఆవాసం కల్పించాలని భావిస్తున్నారు. గజరాజుల సంరక్షణతోపాటు, వాటి దాడినుంచి ప్రజలు, పంటలను రక్షించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఎలిఫెంట్ జోన్లు ఏర్పాటుచేసి ఏనుగులకు అవసరమైన ఆహారం, తాగునీటి సౌకర్యాలు కల్పించాలనే ప్రతిపాదనలు చాలా కాలంగా ఉన్నాయి. అయితే అడవినే నమ్ముకుని బతుకుతున్న గిరిజనులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. గిరిజనుల భయాందోళనలను దృష్టిలో పెట్టుకుని శాశ్వత ప్రాతిపదికన ఎలిఫెంట్ జోన్ ఏర్పాటు చేసే అంశాన్ని పక్కనపెట్టి ఏనుగుల పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాలూరు అటవీ రేంజ్ పరిధిలోని జంతికొండ ప్రాంతాన్ని దీనికోసం ఎంపిక చేశారు. సరిహద్దులో ఏనుగులు–ఆందోళనలో ప్రజలు ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లో ఏనుగులు ఏడాది కాలంగా తిష్టవేశాయి. విజయనగరం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం, జియ్మమ్మవలస, కురుపాం, సాలూరు గిరిజన ప్రాంతాల్లోకి గతేడాది సెప్టెంబర్ 7వ తేదీన ప్రవేశించాయి. కొండ చరియల ప్రాంతంలో నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పటికీ గిరిజనులు ఎంతో కష్టపడి పంటలను సాగుచేస్తున్నారు. ఆ సమయంలో ఏనుగులు దాడిచేయగా 1,368 ఎకరాల్లో వరి, చెరకు, అరటి, టమాట పంటలు దెబ్బతిన్నాయి. 1,138 మంది రైతులు రూ.89.50 లక్షల పంటను నష్టపోయారు. ఇద్దరు చనిపోయారు. రెండు ఏనుగులు కూడా చనిపోయాయి. 2007 సంవత్సరంలో కూడా ఏనుగులు జిల్లాలో ప్రవేశించి ఆస్తి, ప్రాణనష్టం కలిగించాయి. అప్పట్లో జియ్యమ్మవలస మండలానికి చెందిన ముగ్గురిని పొట్టన పెట్టుకున్నాయి. ఒక ఏనుగును చంపేశారు. ఏనుగుల సంచారంతో విజయనగరం జిల్లాతో పాటు శ్రీకాకుళం జిల్లా, ఒడిశా రాష్ట్ర ప్రజలు కూడా భయంతో బతుకుతున్నారు. గతంతో ఏనుగులు విరుచుకుపడినప్పుడు ఆపరేషన్ జయంతి, అపరేషన్ గజ పేరుతో నాలుగు ఏనుగులను బంధించి ఒడిశా రాష్ట్రంలోని లఖేరీ అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. అందులో ఒక ఏనుగు మరణించడంతో జంతు సంరక్షణ కమిటీ అభ్యంతరం తెలిపింది. దాంతో ఆ ఆపరేషన్ ఆగిపోయింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పునరావాస కేంద్రం ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. వన్యప్రాణుల సంరక్షణకు కూడా... రాష్ట్రంలో మొత్తం 13 అభయారణ్యాలు ఉన్నాయి. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్ట్ ఏరియాలో పులుల అభయారణ్యం ఉంది. వాటిలో 55 వరకూ పులులు ఉన్నాయి. 40 ఏళ్ల క్రితం శేషాచలం అడవులు...అంటే తిరుపతి దిగువన ఉన్న ప్రాంతాల్లో పులులు ఉండేవి. ఈ ఏడాది మార్చిలో అక్కడ పులుల జాడ కనిపించింది. రానున్న మూడేళ్లలో వన్యప్రాణుల కోసం నీటి కుంటలు, చెరువులు సైంటిఫిక్‌గా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. వన్యప్రాణులు నీరు, ఆహారం కోసం అడవులు దాటి, ప్రజల ఆవాసాలపైకి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రతి 5 చదరపు కిలోమీటర్లకు చెరువులు/కుంటలు ఏర్పాటు చేయనున్నారు. ఏడాదంతా నీరు ఉండేందుకు సోలార్ పంప్ సెట్లను కూడా ఏర్పాటు చేస్తారు. త్వరలోనే పునరావాసం ఏనుగుల పునరావాస కేంద్రాన్ని 1,315 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఈ ప్రాంతం చుట్టూ ఏనుగుల సంచారానికి, నివాసానికి అనుకూల పరిస్థితులు కల్పిస్తాం. అవి బయటకు రాకుండా తగిన రక్షణ ఏర్పాట్లు చేస్తాం. ఆహారం, నీటి సౌకర్యాలు అందుబాటులో ఉంచుతాం. –లక్ష్మణ్, డీఎఫ్ఓ (టెరిటోరియల్), విజయనగరం. -
మహిళా ఎఫ్ఆర్వోపై ఎమ్మెల్యే సోదరుడి దాడి.!
కాగజ్‌నగర్ : విధి నిర్వహణలో ఉన్న అటవీ అధికారులపై ఓ ఎమ్మెల్యే తమ్ముడు దౌర్జన్యం చేశాడు. స్థానికులను ఉసిగొల్పి రణరంగం సృష్టించాడు. వివరాలు.. సిర్పూర్ కాగజ్‌నగర్ ప్రాంతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్రత్యామ్నాయ అటవీకరణ పనులు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాంతో కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలోని సార్సాలా గ్రామంలో 20 హెక్టార్లలో చెట్లు నాటేందుకు అటవీ అధికారులు సిద్ధమయ్యారు. చెట్లు నాటేందుకు వీలుగా భూమిని చదును చేసేందుకు ట్రాక్టర్లు, సిబ్బందితో కలిసి ఆదివారం ఉదయం అక్కడికి చేరుకున్నారు. అయితే, ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు యత్నించిన సిర్పూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరుకోనప్ప సోదరుడు, జెడ్పీ వైస్ చైర్మన్ కృష్ణ అధికారులపట్ల అమానుషంగా ప్రవర్తించాడు. అనుచరులతో కలిసి మహిళా ఎఫ్ఆర్వోపై ఒక్కసారిగా కర్రలతో దాడికి పాల్పడ్డాడు. అతనితోపాటు మరికొంతమంది కర్రలు చేతబూని అధికారులను బెదిరింపులకు గురిచేశారు. ఈ దాడిలో ఎఫ్ఆర్వో అనిత తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. మొదటగా కోనేరు కృష్ణ, అనంతరం అతని అనుచరులు తనపై అకారణంగా దాడికి పాల్పడ్డారని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనిత ఆవేదన వ్యక్తం చేశారు. పదిమంది ఒక్కసారిగా కర్రలతో తలపై కొట్టారని, ఆక్షణంలో తాను బతుకుతానని అనుకోలేదని కన్నీటిపర్యంతమయ్యారు. ఘటనాస్థలంలో 50 మంది పోలీసులు ఉన్నా దాడిని అడ్డుకోలేకపోవడం గమనార్హం. -
ఆ గ్రామాల్ని ఖాళీ చేయించొద్దు
సాక్షి, హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం కోమట్లగూడెం, కొడిసెలగట్టు అటవీ గ్రామాల నుంచి జనాన్ని ఖాళీ చేయించవద్దని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోమట్లగూడెంకు చెందిన కిన్నెర బుచ్చక్క సహా 25 మంది, కొడిసెలగట్టు గ్రామస్తుడు పి.కన్నయ్య సహా 24 మంది దాఖలు చేసిన రిట్ పిటిషన్లను గురువారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ విచారించారు. అటవీ చట్టాన్ని అమలు చేశాకే వారిని అక్కడి నుంచి వారిని తరలించాలని ఆదేశించారు. అటవీ ప్రాంతం లో నివాసం ఉంటున్న ఎస్టీ తెగకు చెందిన పిటిషనర్లను చట్ట వ్యతిరేకంగా ఖాళీ చేయిస్తున్నారని న్యాయవాది రాజ్‌కుమార్ వాదించారు. గ్రామ సభ నిర్వహించాక, అటవీ నివాస గుర్తింపు చట్ట నిబంధనల ప్రకారం అటవీ ప్రాంతంలో ఉండే వారిని గుర్తించాలని, దానిని జిల్లా/రాష్ట్ర కమిటీలకు పంపిన తర్వాత చట్ట పరిధిలోకి రాని వారికి నోటీసులిచ్చి అటవీ ప్రాంతం నుంచి తరలించాలని చెప్పారు. చట్ట పరిధిలోనే చర్యలు తీసుకుంటున్నామ ని ప్రభుత్వ న్యాయవాది నరేంద్రరెడ్డి చెప్పారు. వాదనలు విన్న న్యాయ మూర్తి.. ప్రతివాదులైన అటవీ, పంచాయతీరాజ్, హోం శాఖలకు నోటీసులు జారీ చేశారు. విచారణను వచ్చే నెల 17కి వాయిదా వేశారు. -
అటవీ చట్ట ఉల్లంఘనలకు చీతా చెక్
కాగజ్‌నగర్: డివిజన్ పరిధిలో ఎవరైనా అటవీ చట్ట ఉల్లంఘనలకు చీతా చెక్ పెట్టనుంది. చీతా అనే పేరు గల జర్మన్ షెఫర్డ్ జాతికి చెందిన స్నిప్ ఫర్ డాగ్‌ను డివిజన్‌కు కేటాయించారనీ, దీంతో చట్టవ్యతిరేక కార్యకలా పాలకు పాల్పడే నిందితులను త్వరగా పట్టుకోవచ్చని కాగజ్‌నగర్ ఎఫ్‌డీవో రాజారమణరెడ్డి హెచ్చరించారు. మంగళవారం కాగజ్‌నగర్ డివిజన్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి జన్నారం నుంచి వచ్చిన డాగ్ స్క్వాడ్ బృందం గురించి వివరించారు. ఈ డాగ్ పేరు చీతా అని ఇప్పటికే పలు కేసుల్లో నిందితులను దీని సాయంతో పట్టుకున్నట్లు పేర్కొన్నారు. చీతా చాలా చురుకైన డాగ్ అనీ, నేరస్థులతోపాటు అక్రమ వేట సామగ్రిని కూడా గుర్తిస్తుందన్నారు. గత చట్టంలో నిందితులు బెయిల్‌పై వచ్చేవారని, కొత్త చట్టంలో అలాంటి వీల్లేదని ఎఫ్‌డీవో స్పష్టం చేశారు. అడవులను నరికినా, వన్యప్రాణులను వేటాడినా నాన్ బెయిలేబుల్ కేసు నమోదు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎప్ఆర్వో అనిత, ఎఫ్ఎస్వో యోగేష్, బీట్ ఆఫీసర్ బానయ్య, డాగ్ స్క్వాడ్ సభ్యులు సత్యనారాయణ, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఫారెస్టు కార్యాలయంపై ఏసీబీ దాడులు
నిజామాబాద్‌అర్బన్: నిజామాబాద్ ఉత్తర మండలం ఫారెస్టు రేంజ్ కార్యాలయంపై సోమవారం ఏసీబీ అధికారులు దాడి చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చిన డిప్యూటీ డైరెక్టర్ రమణకుమార్ నలుగురు సిబ్బందితో కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ అధికారులు తనిఖీలు చేసే సమయంలో ఫారెస్టు అధికారి కార్యాలయంలో రూ. 94 వేలు పట్టుబడినట్లు సమాచారం. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై విచారణ చేపడుతున్నారు. ఇదిలా ఉండగా మూడు రోజుల కిందట నెలవారీ మూమూళ్ల కోసం ఫారెస్టు అధికారులు వేధింపులు చేపట్టడంతో బాధితుడు ఒకరు హైదరాబాద్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అక్కడి నుండి ఏసీబీ అధికారులు తనిఖీలకు వచ్చినట్లు సమాచారం. రేంజ్ పరిధిలో మొత్తం సామిల్లులు ఎన్ని ఉన్నాయి. వాటి నిర్వహణకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తున్నారు. ఈ తనిఖీల్లో నిజామాబాద్ డీఎస్పీ ప్రసన్నరాణితో పాటు సిబ్బంది ఉన్నారు. విచారణ పూర్తయిన తరువాతే వివరాలు వెల్లడిస్తామని డిప్యూటీ డైరెక్టర్ చెప్పారు. అక్రమ కలప వ్యవహారంలో ముగ్గురు అధికారులు సస్పెన్షన్‌కు గురికాగా, దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో ఏసీబీ దాడులు జరగడం కలకలరేగింది. అర్ధరాత్రి వరకు తనిఖీలు కొనసాగాయి. -
ధారూరుకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్
ధారూరు: మండల కేంద్రానికి ఫారెస్టు రేంజ్ ఆఫీస్ మంజూరైంది. మూడు సెక్షన్లను కలిపి ఇక్కడ రేంజ్ ఆఫీసును ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటి వరకు స్థానికంగా ధారూరు ఫారెస్టు సెక్షన్ ఆఫీసు మాత్రమే ఉంది. అయితే వికారాబాద్ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు కానున్న నేపథ్యంలో.. రేంజ్ ఆఫీస్ ఏర్పాటు కోసం అటవీశాఖ పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఓ ఫారెస్ట్ అధికారి తెలిపారు. దీని పరిధిలోకి అడాల్‌పూర్, ధారూరు, జుంటుపల్లి సెక్షన్లు రానున్నాయి. ధారూరు ఫారెస్టు రేంజ్ పరిధిలో మన్సాన్పల్లి, రుద్రారం, ధారూరు, రాస్నం, దోర్నాల్, జుంటుపల్లి, కొప్పన్‌కోట్ ఫారెస్ట్ బీట్లను చేర్చారు. ఇంతవరకు జుంటుపల్లి సెక్షన్ తాండూరు ఫారెస్ట్ రేంజ్ పరిధిలో, ధారూరు సెక్షన్ వికారాబాద్ రేంజ్లో ఉన్నాయి. అడాల్‌పూర్ మాత్రం ఇప్పటివరకూ బీట్‌గానే కొనసాగింది. ప్రస్తుతం దీన్ని సెక్షన్ ఆఫీస్‌గా అప్‌గ్రేడ్ చేశారు. ప్రస్తుతం ధారూరులో ముగ్గురు, అడాల్‌పూర్‌లో ఇద్దరు, జుంటుపల్లిలో ఇద్దరు చొప్పున బీట్ ఆఫీసర్లు ఉన్నారు. ధారూరు, రాస్నం బీట్లలో ఇద్దరు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు విధులు నిర్వహిస్తున్నారు. ధారూరులో కొత్తగా రేంజ్ ఆఫీస్ కార్యాలయం ఏర్పాటు కావడంతో నాలుగు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు అదనంగా కేటాయించారు. రుద్రారం, రాస్నం, దోర్నాల్, కోపన్‌కోట ఫారెస్టు బీట్లలో.. బీట్ ఆఫీసర్లకు తోడుగా వీరిని నియమించనున్నారు. జిల్లాలోని ధారూరు ఫారెస్టు పరిధిలోనే అధికంగా అడవులు ఉండటమే రేంజ్ ఆఫీసు ఏర్పాటుకు కారణం. -
రక్షిస్తారా.. శిక్షిస్తారా..
ప్రొద్దుటూరు క్రైం: ఎర్రచందనం దుంగలు మాయమైన వ్యవహారంపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ముద్దనూరు అటవీశాఖ రేంజ్ కార్యాలయ పరిధిలో సుమారు 140 ఎర్రచందనం దుంగలు మాయమైన విషయం తెలిసిందే. అయితే కార్యాలయంలో పని చేసే సిబ్బందే కనిపించకుండా పోయిన దుంగల స్థానంలో వేరే దుంగలను ఉంచారు. అంతకు ముందు దుంగలు పోయిన సంఘటనపై అధికారులు విచారణ జరుపగా సుమారు 140 దుంగలు కనిపించలేదని తేలింది. దీంతో ఆగమేఘాల మీద సిబ్బంది కనిపించకుండా పోయిన దుంగల స్థానంలో మరో చోట నుంచి తెచ్చి గోడౌన్లో గుట్టుచప్పుడు కాకుండా ఉంచారు. అంతటితో ఈ వ్యవహారం సద్దుమణిగిందనుకున్నారు. అయితే ముద్దనూరులో ఉన్న ఎర్రచందనాన్ని ప్రొద్దుటూరు గోడౌన్‌కు తరలించే క్రమంలో కొలతల్లో తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేయడానికి ప్రొద్దుటూరు డీఎఫ్ఓ ఎఫ్ఆర్ఓను నియమించారు. ఆ అధికారి దుంగల కొలతలను పరిశీలించారు. రెండు రోజుల క్రితమే అధికారి పూర్తి స్థాయిలో కొలతలు, తూకం వేసి డీఎఫ్‌ఓకు నివేదిక ఇచ్చారు. దుంగలు ఉన్నాయి.. కొలతల్లో భారీ తేడా ప్రొద్దుటూరు గోడౌన్లో ఉన్న ముద్దనూరుకు సంబంధించిన చందనం దుంగులన్నీ ఉన్నప్పటికీ వాటి కొలతల్లో భారీ తేడా ఉన్నట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. అయితే గతంలో ఉన్న కొలతల కంటే ఎక్కువ ఉన్నాయని, తూకం విషయంలో కూడా చాలా ఎక్కువగా ఉన్నట్లు అధికారులు నివేదిక ఇచ్చారు. పోయిన దుంగల సంఖ్య అయితే సరిపోయింది కానీ.. అంతే తూకం, కొలతలు కలిగిన దుంగలను మాత్రం ఇంటి దొంగలు సమకూర్చలేక పోయారు. నివేదికను పరిశీలించిన తర్వాత డీఎఫ్ఓ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. దుంగలు మాయమైనట్లు దాదాపుగా నిర్ధారణ అయినట్లే. మరి ఉన్నతాధికారులు ఇంటి దొంగలను రక్షిస్తారా లేక వేటు వేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే కొందరు అధికారులు, సిబ్బంది తమకు ముప్పు రాకుండా పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. ఇంటి దొంగల వింత వాదన.. అధికారి విచారణ చేసిన తర్వాత దుంగల కొలతల్లోనూ. తూకంలో వ్యత్యాసం ఉన్నట్లు వెల్లడైంది. 140 దుంగల్లోనూ వ్యత్యాసం కనిపించినట్లు తెలుస్తోంది. కాగా గతంలో ఉన్న వాటి కంటే కొలతలు, తూకం ఎక్కువగా ఉన్నట్లు విచారణలో తేలడంతో ఇంటి దొంగలు వింతగా వాదిస్తున్నారు. కావలసిన దానికంటే తక్కువగా ఉంటే ఆలోచించాలి కానీ ఎక్కువగా ఉంటే అటవీశాఖకు మేలే కదా అని వాదిస్తున్నారు. ఇందులో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏముందని వారు అధికారులతో అన్నట్లు తెలిసింది. ఇప్పుడే నివేదిక అందింది.. ముద్దనూరు అటవీ కార్యాలయ పరిధిలో ఉన్న ఎర్రచందనం దుంగలు మాయమైన వ్యవహారంలో విచారణ నివేదిక వచ్చిందని డీఎఫ్ఓ శివశంకర్‌రెడ్డి అన్నారు. ఇంకా నివేదిక చూడలేదని, చూశాక నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.