ధారూరుకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్
ధారూరు: మండల కేంద్రానికి ఫారెస్టు రేంజ్ ఆఫీస్ మంజూరైంది. మూడు సెక‌్షన్లను కలిపి ఇక్కడ రేంజ్ ఆఫీసును ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటి వరకు స్థానికంగా ధారూరు ఫారెస్టు సెక‌్షన్ ఆఫీసు మాత్రమే ఉంది. అయితే వికారాబాద్ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు కానున్న నేపథ్యంలో.. రేంజ్ ఆఫీస్ ఏర్పాటు కోసం అటవీశాఖ పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఓ ఫారెస్ట్ అధికారి తెలిపారు. దీని పరిధిలోకి అడాల్‌పూర్, ధారూరు, జుంటుపల్లి సెక‌్షన్లు రానున్నాయి. ధారూరు ఫారెస్టు రేంజ్ పరిధిలో మన్‌సాన్‌పల్లి, రుద్రారం, ధారూరు, రాస్నం, దోర్నాల్, జుంటుపల్లి, కొప్పన్‌కోట్ ఫారెస్ట్ బీట్లను చేర్చారు. ఇంతవరకు జుంటుపల్లి సెక‌్షన్ తాండూరు ఫారెస్ట్ రేంజ్ పరిధిలో, ధారూరు సెక‌్షన్ వికారాబాద్ రేంజ్‌లో ఉన్నాయి. అడాల్‌పూర్ మాత్రం ఇప్పటివరకూ బీట్‌గానే కొనసాగింది. ప్రస్తుతం దీన్ని సెక‌్షన్ ఆఫీస్‌గా అప్‌గ్రేడ్ చేశారు. ప్రస్తుతం ధారూరులో ముగ్గురు, అడాల్‌పూర్‌లో ఇద్దరు, జుంటుపల్లిలో ఇద్దరు చొప్పున బీట్ ఆఫీసర్లు ఉన్నారు. ధారూరు, రాస్నం బీట్లలో ఇద్దరు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు విధులు నిర్వహిస్తున్నారు. ధారూరులో కొత్తగా రేంజ్ ఆఫీస్ కార్యాలయం ఏర్పాటు కావడంతో నాలుగు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు అదనంగా కేటాయించారు. రుద్రారం, రాస్నం, దోర్నాల్, కోపన్‌కోట ఫారెస్టు బీట్లలో.. బీట్ ఆఫీసర్లకు తోడుగా వీరిని నియమించనున్నారు. జిల్లాలోని ధారూరు ఫారెస్టు పరిధిలోనే అధికంగా అడవులు ఉండటమే రేంజ్ ఆఫీసు ఏర్పాటుకు కారణం.