
సాక్షి, హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం కోమట్లగూడెం, కొడిసెలగట్టు అటవీ గ్రామాల నుంచి జనాన్ని ఖాళీ చేయించవద్దని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోమట్లగూడెంకు చెందిన కిన్నెర బుచ్చక్క సహా 25 మంది, కొడిసెలగట్టు గ్రామస్తుడు పి.కన్నయ్య సహా 24 మంది దాఖలు చేసిన రిట్ పిటిషన్లను గురువారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ విచారించారు. అటవీ చట్టాన్ని అమలు చేశాకే వారిని అక్కడి నుంచి వారిని తరలించాలని ఆదేశించారు.
అటవీ ప్రాంతం లో నివాసం ఉంటున్న ఎస్టీ తెగకు చెందిన పిటిషనర్లను చట్ట వ్యతిరేకంగా ఖాళీ చేయిస్తున్నారని న్యాయవాది రాజ్‌కుమార్ వాదించారు. గ్రామ సభ నిర్వహించాక, అటవీ నివాస గుర్తింపు చట్ట నిబంధనల ప్రకారం అటవీ ప్రాంతంలో ఉండే వారిని గుర్తించాలని, దానిని జిల్లా/రాష్ట్ర కమిటీలకు పంపిన తర్వాత చట్ట పరిధిలోకి రాని వారికి నోటీసులిచ్చి అటవీ ప్రాంతం నుంచి తరలించాలని చెప్పారు. చట్ట పరిధిలోనే చర్యలు తీసుకుంటున్నామ ని ప్రభుత్వ న్యాయవాది నరేంద్రరెడ్డి చెప్పారు. వాదనలు విన్న న్యాయ మూర్తి.. ప్రతివాదులైన అటవీ, పంచాయతీరాజ్, హోం శాఖలకు నోటీసులు జారీ చేశారు. విచారణను వచ్చే నెల 17కి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment