High Court telangana
-
నేడు హైకోర్టు నిర్మాణానికి భూమిపూజ
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్‌లో నూతన హైకోర్టు భవన నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై. చంద్రచూడ్ బుధవారం సాయంత్రం 5.30 గంటలకు భూమి పూజ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధేతోపాటు హైకోర్టు ఇతర న్యాయమూర్తులు పాల్గొననున్నారు. గత డిసెంబర్లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, హైకోర్టు సీజేతో భేటీ సందర్భంగా హైకోర్టుకు నూతన భవన నిర్మాణ అంశం ప్రస్తావనకు వచ్చిన విష యం తెలిసిందే. ప్రస్తుత హైకోర్టు భవనం శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో నూతన భవనాన్ని నిర్మించాల్సిన ఆవశ్యకతను ప్రధాన న్యాయమూర్తి, న్యాయవాదులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ముఖ్యమంత్రి సకల హంగులతో 100 ఎకరాల్లో రాజేంద్రనగర్‌లో భవ నాన్ని నిర్మించి ఇస్తామని, త్వరలో శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులను అదే రోజు ఆదేశించారు. అలాగే హైకోర్టును ఇక్కడి నుంచి తరలించినా.. ఇప్పుడున్న భవనాన్ని హెరిటేజ్ బిల్డింగ్‌గా పరిరక్షించాల్సిన బాధ్యత తీసుకుంటామని రేవంత్ చెప్పా రు. ఆ భవనాన్ని ఆధునీకరించి సిటీ కోర్టుకు లేదా ఇతర కోర్టులకు వినియోగించుకునేలా చూస్తామని చెప్పిన విష యం విదితమే. ఆ తర్వాత మంత్రులు, న్యాయమూర్తులు భవన నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. కోర్టు నిర్మాణానికి భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం గత జనవరిలో జీవో జారీ చేసింది. ఇదిలాఉండగా, బుధవారం శంకుస్థాపన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాల్గొంటుండటంతో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. -
Sowmya Janu: నటి సౌమ్య జాను వివాదం.. హైకోర్టు కీలక ఆదేశాలు!
టాలీవుడ్ నటికి ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో వివాదం మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇప్పటికే ఈ సంఘటనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. సౌమ్య జాను రాంగ్ రూట్లో రావడంతో అక్కడే ఉన్న ట్రాఫిక్ హౌంగార్డ్ ఆమెను అడ్డుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తాజాగా ఈ కేసుపై నటి సౌమ్య జాను హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకోకుండా స్టే విధించాలని కోరుతూ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం సౌమ్యకు సీఆర్పీసీ 41ఏ నోటీసులు ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. అంతే కాకుండా మార్చి 11 లోపు పోలీసుల ఎదుట హాజరు కావాలని సౌమ్యకు హైకోర్ట్ సూచించింది. అసలేం జరిగిందంటే.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో హోంగార్డుపై దాడికి పాల్పడిందని సినీనటి సౌమ్యజానుపై పోలీసులు కేసు నమోదు చేశారు. గతనెల 24న బంజారాహిల్స్ రోడ్ నంబరు 12లోని అగ్రసేన్ జంక్షన్లో జాగ్వార్ కారులో రాంగ్రూట్లో వచ్చిన సౌమ్యను విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హోంగార్డుపై అడ్డుకున్నారు. దీంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. -
వ్యూహం సినిమా వివాదం.. హైకోర్టు కీలక ఆదేశాలు!
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ ఆర్జీవీ తెరకెక్కించిన వ్యూహం రిలీజ్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మూవీ నిర్మాత దాసరి కిరణ్‌కుమార్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక ఉత్తర్వులిచ్చింది. అయితే ఈ సినిమాపై సింగిల్బెంచ్లోనే తేల్చుకోవాలన్న ఉన్నత న్యాయస్థానం.. మెరిట్స్ ఆధారంగా చేసుకుని ఈనెల 8వ తేదీనే పిటిషన్‌పై తుది తీర్పు ఇవ్వాలని సూచించింది. కాగా.. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును దాసరి కిరణ్‌కుమార్ సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా దీనిపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. కాగా.. వ్యూహం సినిమాకు సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ చట్టవిరుద్ధమని.. ఏపీ రాజకీయాలను ప్రభావం చేసేలా సినిమా ఉందంటూ టీడీపీ లీడర్ నారా లోకేశ్ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీంతో లోకేష్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ బెంచ్.. ఈ నెల 11వ తేదీ సినిమా రిలీజ్ చేయవద్దంటూ ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. -
గ్రూప్–1పై అప్పీలుకు వెళ్లేదెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షపై సందిగ్ధం వీడటం లేదు. నిర్వహణలో నిర్లక్ష్య వైఖరి వహించినందుకు ఈ పరీక్షను రద్దు చేయాలంటూ వేర్వేరు సందర్భాల్లో హైకోర్టు రెండుసార్లు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు వచ్చి నెలరోజులు కావస్తున్నా... తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఇప్పటివరకు ఏ నిర్ణయాన్ని ప్రక టించలేదు. పరీక్ష రద్దు విషయంలో స్పష్టతని వ్వని టీఎస్పీఎస్సీ హైకోర్టు తీర్పుపై అప్పీలు కోసం సుప్రీంకోర్టుకు సైతం వెళ్లలేదు. దీంతో పరీక్ష రాసిన అభ్యర్థుల్లో తీవ్ర అయోమయం నెలకొంది. కొత్తగా పరీక్ష నిర్వహిస్తారా? లేదా? అందుకు మళ్లీ సన్నద్ధం కావాలా? లేక మెయిన్ పరీక్షలకు సిద్ధమవ్వా లా? తేల్చుకోలేక అభ్యర్థులు గందరగోళంలో ఉన్నారు. పరీక్షలు రద్దు మీద రద్దు గ్రూప్–1 కేటగిరీలో 503 ఉద్యోగ ఖాళీల భర్తీకి టీఎస్పీఎస్సీ గతేడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు మొత్తంగా 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో గతేడాది అక్టోబర్ 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన టీఎస్పీఎస్సీ ఫలితాలు ప్రకటిస్తూ... 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి జాబితాను విడుదల చేసింది. దీంతో ఆయా అభ్యర్థులంతా మెయిన్ పరీక్షలకు సిద్ధమవుతున్న తరుణంలో టీఎస్పీఎస్సీలో పరీక్ష ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారం వెలుగు చూసింది. గ్రూప్–1 పరీక్ష పేపర్ లీకు కావడంతో ఆఘమేఘాల మీద అక్టోబర్ 16న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షను కమిషన్ రద్దు చేసింది. ఆ తర్వాత జూన్ 11న మరోమారు పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రకటించడంతో అభ్యర్థులు మళ్లీ సన్నద్ధమయ్యారు. రెండో దఫా పరీక్షకు 3,09,323 మంది అభ్యర్థులు హాల్‌టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోగా... 2,33,248 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. రెండో దఫా పరీక్ష నిర్వహణలో టీఎస్పీఎస్సీ పకడ్భందీగా నిర్వహించలేదని అభ్యర్థులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రధానంగా అభ్యర్థుల వేలిముద్రలు తీసుకోకుండా ఇష్టానుసారంగా నిర్వహించారని, పరీక్ష హాజరు శాతంలో గణాంకాలు మారిపోయాయంటూ ఆరోపించారు. కేసును విచారించిన హైకోర్టు రెండు సార్లు పరీక్ష రద్దు చేయాలని తీర్పునిచ్చింది. ఇప్పుడు ఏ పరీక్షకు సిద్ధం కావాలో? సాధారంగా కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఆ తీర్పును అమలు చేయడం లేదా పై కోర్టును ఆశ్రయించడం జరుగుతుంది. కానీ టీఎస్పీఎస్సీ ఇప్పటివరకు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించలేదు. దాదాపు ఏడాదిన్నరగా పరీక్షలకు సన్నద్ధమైన అభ్యర్థులకు తక్షణ కర్తవ్యం ఏమిటో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే రెండుసార్లు ప్రిలిమినరీ పరీక్షలకు సన్నద్ధం కాగా... ఇప్పుడు ఏ పరీక్షకు సిద్ధం కావాలో పాలుపోవడం లేదంటూ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రక్రియ కొనసాగుతోందట! కాగా, హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని టీఎస్పీఎస్సీని వివరణ కోరగా... సుప్రీంకోర్టుకు వెళ్తామని, ఇందుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుందని కమిషన్ అధికారులు చెబుతున్నారు. -
డ్రగ్స్ కేసులో నవదీప్‌కు ఊహించని షాకిచ్చిన పోలీసులు
డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరో నవదీప్‌కు పోలీసులు షాకిచ్చారు. తాజాగా ఆయనకు వారు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఈ కేసుతో తనకు ఎలాంటి సబంధం లేదని ఆయన కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో నవదీప్‌ను అరెస్ట్ చేయవద్దని పోలీసులకు కోర్టు ఆదేశించింది. కానీ అతనికి ఈ కేసులో సంబంధం ఉన్నట్లు పోలీసులు బలంగా నమ్ముతున్నారు. అందుకే అతన్ని విచారించేందుకు తాజాగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో ఈ కేసుపై మరింత ఉత్కంఠ నెలకొంది. (ఇదీ చదవండి: 'కింగ్ ఆఫ్ కొత్త' ఓటీటీ విడుదల తేదీలో మార్పు) మాదాపూర్‌లోని విఠల్‌నగర్‌లో ఉన్న ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో దొరికిన తీగను లాగుతుంటే టాలీవుడ్ డ్రగ్ డొంక కదులుతోంది. ఈ కేసులో ఫిల్మ్ ఫైనాన్షియర్ కె.వెంకటరమణారెడ్డితో పాటు ‘డియర్ మేఘ’ చిత్ర దర్శకుడు అనుగు సుశాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరి నుంచి రూ.10 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వారిని విచారిస్తున్న సమయంలో నవదీప్ పేరు తెరపైకి వచ్చినట్లు సమాచారం. దీంతో ఈ డ్రగ్స్ కేసుతో నవదీప్‌కు సంబంధం ఉందని పోలీసులు వెల్లడించారు. (ఇదీ చదవండి: భర్త జైల్లో ఉంటే ఫోటోషూట్స్‌తో బిజీగా ఉన్న మహాలక్ష్మి!) నవదీప్ డ్రగ్స్ సేవించినట్లుగా హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే వెల్లడించారు. ఈ కేసులో 29వ నిందితుడిగా అతని పేరు చేర్చినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఇప్పటికే ముగ్గురు నైజీరియన్లతో సహా 8 మంది నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. తాజాగా నవదీప్‌కు విచారణకు రావాలని నోటీసులు జారీ చేయడంతో అతన్ని కూడా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
డ్రగ్స్ కేసు.. నవదీప్ విషయంలో హైకోర్ట్ కీలక నిర్ణయం!
డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరో నవదీప్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో అతనికి సంబంధమున్నట్లు హైదరాబాద్ సీపీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నవదీప్ హైకోర్ట్‌ను ఆశ్రయించారు. అతని పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. ఈ కేసులో నవదీప్‌ను ఆరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించింది. (ఇది చదవండి: హీరో నవదీప్‌కు నోటీసులు.. డ్రగ్స్ కేసులో ఉన్న టాలీవుడ్ ప్రముఖులు) అసలేం జరిగిందంటే.. మాదాపూర్‌లోని విఠల్‌నగర్‌లో ఉన్న ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో దొరికిన తీగను లాగుతుంటే టాలీవుడ్ డ్రగ్ డొంక కదులుతోంది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతం చేశారు. ఫిల్మ్ ఫైనాన్షియర్ కె.వెంకటరమణారెడ్డితో పాటు ‘డియర్ మేఘ’ చిత్ర దర్శకుడు అనుగు సుశాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరి నుంచి రూ.10 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో టాలీవుడ్‌కు చెందిన హీరో నవదీప్‌తో పాటు నిర్మాత సుశాంత్ రెడ్డి కూడా ఉన్నట్లు నగర పోలీసు కమీషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. నవదీప్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతన్ని పట్టుకుంటామని చెప్పారు. అయితే దీనిపై వెంటనే హీరో నవదీప్ కూడా స్పందించాడు. అసలు ఆ డ్రగ్స్ కేసుతో తనకు సంబంధమే లేదన్నాడు. తాను ఎక్కడికి పారిపోలేదు తాను ఎక్కడికి పారిపోలేదని, హైదరాబాద్‌లోనే ఉన్నానన్నారు. తన కొత్త సినిమాకి సంబంధించిన సాంగ్ లాంచింగ్ ఈవెంట్లో బీజీగా ఉన్నాయనని ఓ మీడియా ప్రతినిధికి ఆయన చెప్పారు. అలాగే ట్విటర్(ఎక్స్) ద్వారా కూడా ఆయన ఈ కేసుపై స్పందించాడు. అది నేను కాదు జెంటిల్మెన్, నేను ఇక్కడే ఉన్నాను ముందు క్లారిటీ తెచ్చుకోండి థాంక్స్ అని ట్వీట్ చేశాడు. (ఇది చదవండి: అక్కడ సూపర్ హిట్.. తెలుగులో రిలీజ్ కానున్న మూవీ!) నవదీప్ స్నేహితుడు అరెస్ట్ అయితే ఈ కేసులో నవదీప్ స్నేహితుడు రాంచందర్‌ని నార్కోటిక్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఇచ్చిన సమాచారం ప్రకారమే నవదీప్‌ను డ్రగ్స్ కన్స్యూమర్ గా తేల్చారు. ఈ విషయాన్ని సీసీ ఆనంద్ మీడియా ముఖంగా తెలియజేశారు. గతంలోనూ టాలీవుడ్ డ్రగ్స్ కేసు విషయంలో నవదీప్ పేరు మారుమోగింది.అప్పట్లో ఎక్సైజ్, ఈడీ విచారణకు కూడా ఆయన హాజరయ్యారు. -
కొత్త మెడికల్ కాలేజీల్లో 85% సీట్లు స్థానికులకే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో జాతీయ కోటా (15 శాతం) పోను మిగిలిన కన్వీనర్ కోటా సీట్లు (85 శాతం) స్థానిక విద్యార్థులకే కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన జీవో 72ను హైకోర్టు సమర్థించింది. కొత్త మెడికల్ కాలేజీల్లో సీట్లు పూర్తిగా తెలంగాణ విద్యార్థులకే చెందుతాయన్న తెలంగాణ ప్రభుత్వ వాదనలతో ఏకీభవించింది. ఈ మేరకు జీవో 72ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఎలాంటి మెరిట్ లేదంటూ కొట్టివేసింది. రాష్ట్రంలోని కొత్త మెడికల్ (ఎంబీబీఎస్, డెంటల్) కాలేజీల్లో సీట్ల కేటాయింపు వివాదంలో హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజెస్ అడ్మిషన్ రూల్స్‌కు సవరణ చేస్తూ ప్రభుత్వం గత నెల ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం 2014, జూన్ 2 తర్వాత ఏర్పాటు చేసిన వైద్య కాలేజీల్లోని కన్వీనర్ కోటాలోని 100 శాతం ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ విద్యార్థులకే రిజర్వు కానున్నాయి. ఈ మేరకు జూలై 3న జీవో నంబర్ 72ను విడుదల చేసింది. అంతకుముందు జాతీయ కోటా 15 శాతం పోగా.. మిగిలిన సీట్లలో 85 శాతం స్థానిక విద్యార్థులకు, 15 శాతం అన్‌రిజర్వుడుగా ఉండేవి. అన్‌రిజర్వుడులో తెలంగాణతోపాటు ఏపీ విద్యార్థులు కూడా పోటీ పడేవారు. ప్రభుత్వ తాజా జీవోతో అన్‌రిజర్వుడు అనేది ఉండదు. దీన్ని ఏపీకి చెందిన గంగినేని సాయి భావనతోపాటు మరికొందరు తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశారు. వాదనలు సాగాయిలా..: ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం గతంలో విచారణ చేపట్టింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రిజర్వేషన్లను పదేళ్లపాటు కొనసాగించాలని పిటిషనర్ న్యాయవాది వాదనలు వినిపించారు. ఆ సమయం ముగిసే వరకు ఎలాంటి మార్పులు చేయడానికి వీల్లేదన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు 15 శాతం కోటాను తప్పనిసరిగా కొనసాగించాల్సిందేనని చెప్పారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ వాదిస్తూ.. ‘రాష్ట్ర విభజన నాటికి 20 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. 2,850 సీట్లలో 15 శాతం కింద 313 సీట్లను కేటాయించాం. 2019లో నీట్ అమల్లోకి వచ్చాక.. జాతీయ కోటా కింద 540 సీట్లను రిజర్వు చేశాం. మొత్తం ఈ 853 సీట్లలో ఏపీ విద్యార్థులకు అవకాశం ఉంటుంది. పునర్విభజన తర్వాత వచ్చిన 34 కాలేజీల్లో వారికి ప్రత్యేక రిజర్వేషన్ లేదు. ఇది రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధం కాదు’ అని వివరించారు. ఎన్సీసీ కోటాపై... తెలంగాణ మెడికల్ అండ్ డెంటల్ కాలేజెస్ అడ్మిషన్ రూల్స్–2017లోని రూల్ 4(3)(ఏ)లో మార్పులు చేస్తూ జూలై 4న ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్ 75 సమర్థనీయమేనని హైకోర్టు స్పష్టం చేసింది. కౌన్సెలింగ్‌లో గతంలో నేషనల్ కేడెట్ కోర్ (ఎన్సీసీ)కు 1 శాతం రిజర్వేషన్ ఉండేది. ఈ జీవో కారణంగా ఎన్సీసీ (ఏ) ఉన్న వారికి రావాల్సిన 1 శాతం కోటా పోతోందని హైదరాబాద్‌కు చెందిన లోకాస్వీ సహా మరికొందరు రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ, పిటిషన్లను కొట్టివేసింది. శుభపరిణామం: మంత్రి హరీశ్ వైద్య విద్యలో మెడికల్ అడ్మిషన్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును శుభపరిణామంగా పేర్కొంటూ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు. జిల్లాకో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడంతోపాటు వాటి ద్వారా అందుబాటులోకి వచ్చిన ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ బిడ్డలకే దక్కేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనని స్పష్టమైందన్నారు. హైకోర్టు తీర్పుతో మరో 520 మెడికల్ సీట్లు తెలంగాణ విద్యార్థులకు లభిస్తున్నాయన్నారు. -
చట్ట ప్రకారమే సోదాలు
సాక్షి, అమరావతి : మార్గదర్శి చిట్‌ఫండ్స్ లిమిటెడ్ సంస్థే చట్ట ఉల్లంఘనలకు పాల్పడిందని ప్రభుత్వం హైకోర్టుకు సోమవారం నివేదించింది. తాము ఎలాంటి చట్ట ఉల్లంఘనలకు పాల్పడలేదని, మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో తాజా సోదాలన్నీ నిబంధనలకు అనుగుణంగానే జరుగుతున్నాయని నివేదించింది. చిట్ రిజిస్ట్రార్లు చేస్తున్న సోదాలను సవాలు చేస్తూ మార్గదర్శి చిట్‌ఫండ్స్ యాజమాన్యం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై జస్టిస్ నైనాల జయసూర్య సోమవారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ.. చట్టం ఇచ్చిన అధికారం మేరకే చిట్ రిజిస్ట్రార్లు సోదాలు చేస్తున్నారని తెలిపారు. పగలు సోదాలు చేస్తుంటే చందాదారులు ఇబ్బంది పడుతున్నారని, కార్యకలాపాలకు విఘాతం కలుగుతోందంటున్న మార్గదర్శి.. ఎవరికీ ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో రాత్రిళ్లు సోదాలు చేస్తుంటే తామేదో నేరం చేస్తున్నట్లు కోర్టులో ఫిర్యాదు చేస్తోందని అన్నారు. ఇది ఎంత మాత్రం సరికాదన్నారు. షట్టర్లు మూసి సోదాలు చేస్తున్నామన్న దాంట్లో వాస్తవం లేదన్నారు. ఆ సంస్థ చట్ట ఉల్లంఘనలకు సంబంధించి కొన్ని ఘటనలు రిజిస్ట్రార్ల దృష్టికి వచ్చినందునే చట్ట ప్రకారం చర్యలు చేపట్టారని, నిబంధనలను అనుసరించే స్వతంత్రంగా సోదాలు చేస్తున్నారని తెలిపారు. హైకోర్టు ఇచ్చిన ఏ ఆదేశాలనూ ఉల్లంఘించలేదన్నారు. గత సోదాల్లో పలు అక్రమాలు వెలుగు చూశాయి సీఐడీ తరఫు న్యాయవాది వై.శివకల్పనారెడ్డి వాదనలు వినిపిస్తూ.. మార్గదర్శిపై నమోతైన పలు కేసుల్లో దర్యాప్తు జరుగుతోందని, రెండింట్లో చార్జిషీట్లు దాఖలు చేశామని చెప్పారు. గతంలో నిర్వహించిన సోదాల్లో సీఐడీకి లభించిన పలు కీలక డాక్యుమెంట్లను అధ్యయనం చేసిన తరువాత మార్గదర్శి ఎలాంటి మోసాలకు పాల్పడిందో అర్థమైందన్నారు. ఓ చిట్ గ్రూపులో ఇవ్వాల్సిన మొత్తాలను మరో చోట సర్దుబాటు చేస్తున్నారని తెలిపారు. నర్సరావుపేట చిట్ గ్రూపునకు చెల్లించాల్సిన మొత్తాలను రాజమండ్రి గ్రూపులకు సర్దుబాటు చేస్తున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. చందాదారులకు తెలియకుండానే ఇలాంటి వ్యవహారాలు మార్గదర్శిలో చాలా జరుగుతున్నాయన్నారు. రాత్రివేళ సోదాలు చేస్తున్నారు అంతకు ముందు మార్గదర్శి యాజమాన్యం తరఫున సీనియర్ న్యాయవాది నాగముత్తు, మీనాక్షి ఆరోరా వాదనలు వినిపిస్తూ.. తెలంగాణ హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రాత్రి వేళ సోదాలు చేస్తున్నారని తెలిపారు. ప్రతిసారీ తాము హైకోర్టును ఆశ్రయించి ఉత్తర్వులు తెస్తుంటే.. కొత్త ఎత్తుగడలతో ప్రభుత్వం సోదాలు చేస్తోందన్నారు. గతంలో ఇలాంటి సోదాలు జరగలేదని, 2019లో ప్రభుత్వం మారిన తరువాతే జరుగుతున్నాయని అన్నారు. సోదాలపై రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ ఉత్తర్వులు చెల్లవన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి మంగళ లేదా బుధవారం మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయం వెలువరిస్తానని తెలిపారు. అప్పటివరకు సోదాలు చేయకుండా అధికారులకు తగిన సూచనలు చేయాలని ఎస్‌జీపీ చింతల సుమన్‌కు మౌఖికంగా తెలిపారు. -
ఫార్మాసిటీ కోసం ఆలయ భూములా?
సాక్షి, హైదరాబాద్: ఫార్మాసిటీ ఏర్పాటు కోసం వెయ్యి ఎకరాల ఆలయ భూముల సేకరణను హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తప్పుబట్టింది. దేవాదాయ శాఖ భూములను సాగునీటి ప్రాజెక్టుల కోసమే సేకరించాలని గతంలోనే ద్విసభ్య ధర్మాసనం చెప్పిందని, ఇతర అవసరాల కోసం కాదని స్పష్టంచేసింది. భూ సేకరణ, రెవెన్యూ అధికారులకు సంబంధించిన అంశంలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక వసతుల సంస్థ (టీఎస్ఐఐసీ) పిటిషన్ ఎలా దాఖలు చేస్తుందని ప్రశ్నించింది. ద్విసభ్య ధర్మాసనం విచారణ జరపాల్సిన దేవాదాయ భూ సేకరణపై సింగిల్ జడ్జిని ఆశ్రయించడాన్ని తప్పుబట్టింది. రంగారెడ్డి జిల్లా నందివనపర్తి, సింగారంలో ఓంకారేశ్వర స్వామి ఆలయానికి చెందిన 1,022 ఎకరాల భూ సేకరణపై యథాతథస్థితి విధించింది. నీటి ప్రాజెక్టులకు కాకుండా ఇతర ప్రజావసరాలకు ఆలయ భూములు సేకరించవచ్చన్న నిబంధనలు ఏవైనా ఉంటే.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని టీఎస్ఐఐసీ ఎండీ, రెవెన్యూ–దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి, దేవాదాయ శాఖ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయ ఈవోకు నోటీసులు జారీ చేసింది. తాము తదుపరి ఆదేశాలిచ్చే వరకు భూ సేకరణపై ముందుకెళ్లరాదని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 12కు వాయిదా వేసింది. దేవాదాయ భూముల సేకరణకు హైకోర్టు నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో నందివనపర్తి, సింగారం పరిధిలోని ఓంకారేశ్వర స్వామి ఆలయానికి చెందిన 1,022 ఎకరాల భూముల సేకరణ కోసం టీఎస్ఐఐసీ గత నవంబర్‌లో హైకోర్టు సింగిల్ జడ్జి వద్ద పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. భూ సేకరణకు అనుమతి ఇస్తూ అదే నెలలో ఉత్తర్వులు జారీ చేశారు. భూ సేకరణ చట్ట ప్రకారం భూమిని సేకరించాలని, ఆ వచ్చిన మొత్తం నగదును ఓంకారేశ్వర స్వామి ఆలయ ఖాతాలో జమ చేయాలని ఆదేశించారు. సదరు మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని సింగిల్ జడ్జి చెప్పారు. ద్విసభ్య ధర్మాసనం అనుమతి తప్పనిసరి సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాటిపర్తి గ్రామానికి చెందిన భక్తులు మోతెకాని జంగయ్య, కుర్మిడ్డకు చెందిన దేవోజీ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ టి.వినోద్‌కుమార్, జస్టిస్ పుల్ల కార్తీక్ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఆలయ భూముల సేకరణకు ద్విసభ్య ధర్మాసనం అనుమతి తప్పనిసరి అని.. సింగిల్ జడ్జిని ఆశ్రయించి ఉత్తర్వులు పొందడం చెల్లదన్నారు. తాగు, సాగు నీటి ప్రాజెక్టులకు మాత్రమే ఆలయ భూములు సేకరించాలని గతంలో డివిజన్ బెంచ్ పేర్కొందన్నారు. భూసేకరణతో ఎలాంటి సంబంధం లేని టీఎస్ఐఐసీ పిటిషన్ ఎలా వేస్తుందని ప్రశ్నించారు. భూ సేకరణను వెంటనే నిలిపివేయాలని, సింగిల్ జడ్జి ఉత్తర్వులను ఆపాలని కోరారు. ఇతర అవసరాలకు సేకరించవచ్చు... ఇతర ప్రజావసరాలకు కూడా దేవాదాయ భూములను సేకరించవచ్చని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. గతంలో దీనికి సంబంధించి పలు తీర్పులు కూడా ఉన్నాయన్నారు. అయితే వివరాలు సమర్పించడానికి కొంత సమయం కావాలని కోరారు. భూములు ఇచ్చేందుకు ఓంకారేశ్వర ఆలయ కమిటీ, దేవాదాయశాఖ అంగీకరించాయని చెప్పారు. ఇందులో ఇతరులకు అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదన్నారు. -
డింపుల్ హయాతి వివాదం.. హైకోర్టును ఆశ్రయించిన హీరోయిన్!
ఐపీఎస్ అధికారి, డీసీపీ రాహుల్ హెగ్డే, రామబాణం హీరోయిన్ డింపుల్ హయాతి మధ్య వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. డీసీపీ కారును కాలితో తన్నడమే కాకుండా తన బెంజికారుతో రివర్స్‌లో వచ్చి ఢీకొట్టి దుర్భాషలాడిందంటూ నటిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే తాజాగా ఈ కోర్టుపై డింపుల్ హయాతి హైకోర్టును ఆశ్రయించింది. (ఇది చదవండి: ఐపీఎస్ ఆఫీసర్ కారును తన్నిన డింపుల్ హయాతి..కేసు నమోదు..) తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో డింపుల్ హయాతి పిటిషన్ దాఖలు చేసింది. ట్రాఫిక్ డీసీపీ ఒత్తిడితోనే తప్పుడు కేసు పెట్టారని పిటిషన్లో పేర్కొంది. అయితే డింపుల్ హయాతికి సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు ఇచ్చినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. అయితే వాదనలు విన్న న్యాయస్థానం.. సీఆర్పీసీ 41ఏ నిబంధనల మేరకే వ్యవహరించాలని పోలీసులను ఆదేశించింది. కాగా.. ఐపీఎస్ అధికారి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారుపై డింపుల్ హయాతి దాడి చేశారన్న ఆరోపణలతో ఆయన డ్రైవర్ చేతన్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డింపుల్ హయాతి, డేవిడ్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. (ఇది చదవండి: ఆదిపురుష్ టీం సంచలన నిర్ణయం..వారి కోసమే!) -
శ్రీ కృష్ణుడి రూప ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు నో!
సాక్షి, హైదరాబాద్: ఖమ్మంలోని లకారం చెరువులో శ్రీకృష్ణుడి రూపంలోని ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టాపనకు హైకోర్టు అనుమతి నిరాకరించింది. గతంలో ఇచ్చిన స్టేను పొడిగిస్తూ తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను పురస్కరించుకుని లకారం చెరువులో 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. ఈ విగ్రహావిష్కరణను ఈ నెల 28న నిర్వహించాలని ఇప్పటికే ఖరారు చేశారు. తానా ఈ విగ్రహాన్ని అందిస్తోంది. అయితే శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటును సవాల్ చేస్తూ భారత యాదవ సమితి, ఆదిభట్ల శ్రీకళా పీఠం, బహుజన జాయింట్ యాక్షన్ కమిటీ పిటిషన్లు దాఖలు చేశాయి. (చదవండి: ఔటర్ రింగ్‌రోడ్డు లీజుపై విపక్షాల విషం) -
వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్..సీబీఐకి హై కోర్టు కీలక ఆదేశాలు
-
టీఎస్పీఎస్సీ ఉద్యోగులు పరీక్ష ఎలా రాస్తారు?
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్పీ) ఉద్యోగులు అది నిర్వహించే పరీక్షలు ఎలా రాస్తారు. వారిని పరీక్షపత్రాల తయారీకి ఎలా అనుమతిస్తారు?’అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. టీఎస్పీఎస్సీ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల ప్రశ్నపత్రం లీకేజీపై హైకోర్టుకు మంగళవారం సిట్ దర్యాప్తు స్థాయీ నివేదిక సీల్డ్ కవర్లో సమర్పించింది. అయితే నిందితుల వివరాలను ఇవ్వాలని సర్కార్‌కు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. పేపర్ లీకేజీ కేసును సిట్ పారదర్శకంగా దర్యాప్తు చేయలేదని, సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌తోపాటు మరో ఇద్దరు నిరుద్యోగులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి మంగళవారం విచారణ చేపట్టారు. సిట్ తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) బీఎస్ ప్రసాద్ నివేదిక అందజేసి వాదనలు వినిపించారు. దర్యాప్తు నివేదికను పిటిషనర్లకు ఇవ్వాలని, వారి తరఫు సీనియర్ న్యాయవాది వివేక్ ఠంకా న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. సీల్డ్ కవర్ నివేదికలను బహిర్గతం చేయవచ్చని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో పేర్కొందని ఠంకా చెప్పారు. దర్యాప్తులో తీవ్ర లోపాలున్నాయని, సాక్ష్యాలు మాయమవుతున్నాయని అన్నారు. సిట్ చైర్మన్‌పై ఆరోపణలు ఉన్నాయని, సరీ్వస్ కమిషన్ ఏర్పాటులోనూ లోపాలున్నాయని పేర్కొన్నారు. ఈ కేసులో ప్రవాస భారతీయుల పాత్ర ఉందన్నారు. ఇది 30 లక్షల మంది భవిష్యత్‌తో ముడిపడి ఉన్న అంశమని అన్నారు. సెక్షన్ అధికారి వద్ద మాత్రమే కాకుండా చైర్మన్, కార్యదర్శి వద్ద కూడా పాస్వర్డ్ ఉంటుందన్నారు. పారదర్శకంగా సాగని దర్యాప్తు సిట్ దర్యాప్తు పారదర్శకంగా సాగడంలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది వివేక్ ఠంకా అన్నారు. ఈ క్రమంలో ప్రశ్నపత్రాలను ఎవరు తయారీ చేశారు.. ఏ ఏజెన్సీకి అప్పగించారు.. అని న్యాయమూర్తి ప్రశ్నించారు. పరీక్షలు రాసేవారిని విధులకు ఎందుకు అనుమతించారని అడుగగా, పరీక్షలు రాసేవారిని నిర్వహణ ప్రక్రియకు దూరంగా పెట్టినట్లు ఏజీ చెప్పారు. దర్యాప్తు పురోగతిపై పూర్తి వివరాలతో నివేదికను సమరి్పస్తామని, ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులతోపాటు మరికొన్ని వివరాలు అందాల్సి ఉందన్నారు. ఈ కేసులో మొత్తం 18 మంది నిందితులుండగా, 17 మందిని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. ఒకరు మాత్రం న్యూజిలాండ్‌లో ఉన్నారని అన్నారు. సీబీఐ దర్యాప్తు అవసరం లేదని నివేదించారు. ఏ ఒక్కరూ చట్టం నుంచి తప్పించుకోలేరని తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. తదుపరి విచారణను ఈనెల 24కి వాయిదా వేశారు. చదవండి: టీఎస్పీఎస్సీ లీకేజీ.. రంగంలోకి ఈడీ -
‘విద్యుత్ బకాయిల’పై కేంద్రం వివక్ష
విద్యుత్ బకాయిల చెల్లింపుల అంశంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో వాదనలు వినిపించింది. అందులో భాగంగానే రూ. 6,757 కోట్ల విద్యుత్ బకాయిలను వెంటనే ఏపీకి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసిందని పేర్కొంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ మధ్య విద్యుత్ పంచాయితీ నడుస్తోంది. తెలంగాణ తమకు విద్యుత్ చార్జీలు బకాయి పడిందంటూ ఏపీ ఫిర్యాదు చేయడంతో కేంద్రం గతేడాది కీలక ఉత్తర్వులిచ్చింది. ఏపీ వాదనతో ఏకీభవించిన కేంద్రం అసలు, లేట్ పేమెంట్ సర్ చార్జీ కింద కలిపి మొ త్తం రూ.6,757 కోట్లను ఏపీకి చెల్లించాలని తెలంగాణను ఆదేశించింది. 30 రోజుల్లోగా చెల్లింపులు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలంగాణ ప్రభు త్వం ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. కేంద్రం ఆదేశాలపై సీజే ధర్మాసనం గతంలో విచారించి స్టే విధించింది. కాగా, ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయా న్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం సోమవారం కూడా విచారణ జరిపింది. ఏపీ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి, తెలంగాణ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపించారు. రావాల్సిన వాటిని పరిగణనలోకి తీసుకోలేదు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల నుంచి తెలంగాణ విద్యుత్ సంస్థలకు రావాల్సిన బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని కేంద్రం పరిగణనలోకి తీసుకోకుండానే ఏపీకి అనుకూలంగా ఆదేశాలు జారీ చేసిందని వైద్యనాథన్ పేర్కొన్నారు. ఒక రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉంటే, మరో రాష్ట్రం 10 ఏళ్ల వరకు సరఫరా చేయాలని ఏపీ పునరి్వభజన చట్టంలో ఉందని, అయినా విడిపోయిన తర్వాత తెలంగాణకు ఏపీ విద్యుత్ సరఫరా నిలిపివేసిందని నివేదించారు. దీంతో తెలంగాణ బయటి నుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచ్చిందని, ఈ కారణంగా రాష్ట్రంపై రూ.4,740 కోట్ల భారం పడిందని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను మార్చి 14కు వాయిదా వేసింది. -
ఇంజనీరింగ్ కాలేజీల్లో ఇష్టం వచ్చినట్లు సీట్ల పెంపు కుదరదు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కళాశాలలకు హైకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా.. అభ్యంతరం లేదంటూ(ఎన్ఓసీ) సర్టిఫికెట్ జారీ చేయకుండా ఇంజనీరింగ్ కళాశాలల్లో కొత్త కోర్సులు, సీట్ల పెంపు సాధ్యం కాదని తేల్చిచెప్పింది. సుప్రీంకోర్టు గత ఉత్తర్వులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయని స్పష్టం చేసింది. పిటిషన్లలో ఎలాంటి మెరిట్ లేని కారణంగా పిటిషనర్లకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేమని పేర్కొంది. ఈ మేరకు దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు చెప్పింది. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా యూనివర్సిటీలు అఫిలియేషన్ ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించడం అవసరమని తెలిపింది. ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్ సీఎస్ఈ డేటా సైన్స్స్, సీఎస్ఈ సైబర్ సెక్యూరిటీ, సీఎస్ఈ ఏఐఎంల్, ఐటీ తదితర కొత్త కోర్సులకు ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) అనుమతి ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదంటూ చెరబుద్ది ఎడ్యుకేషనల్ సొసైటీ సహా పలు కాలేజీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ప్రభుత్వం రీయింబర్స్మెంట్ ఇవ్వాల్సి వస్తుందనే కారణంతోనే కాలేజీల్లో కొత్త కోర్సులకు అనుమతి ఇవ్వడం లేదని పేర్కొన్నారు. సామాజిక కోర్సుల్లో విద్యార్థులు చేరడం లేదని.. దీంతో కొత్త కోర్సుల ప్రాముఖ్యత పెరిగిందన్నారు. ఈ క్రమంలో ఆయా కోర్సులను అనుమతి ఇవ్వాలని కోరారు. ఏఐసీటీఈ అనుమతి ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం దాదాపు 4000 సీట్లపై ప్రభావం చూపుతుందని, ఇది సరికాదన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనం ఇవ్వడం.. ఇవ్వకపోవడం ప్రభుత్వ ఇష్టమని.. అయితే కోర్సులకు మాత్రం అనుమతి ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయా కాలేజీల్లో కొత్త కోర్సులకు అనుమతి ఇస్తే తమకెలాంటి అభ్యంతరం లేదని జేఎన్టీయూ తరఫు న్యాయవాది మయూర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జీపీ, ఏఐసీటీఈ తరఫున ముద్దు విజయ్, టీఎస్ ఎంసెట్ కనీ్వనర్ తరఫున సీ.వాణి రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వ అనుమతి లేనిదే సీట్ల పెంపు సాధ్యం కాదని తేల్చిచెబుతూ ఉత్తర్వులు వెలువరించింది. చదవండి: అదో చిన్న సమస్య..పెద్దది చేయొద్దు: మంత్రి మల్లారెడ్డి -
జూబ్లీహిల్స్ పబ్‌లలోనే రాత్రి 10 దాటితే నో మ్యూజిక్: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని పబ్‌ల వ్యవహారంలో మరోసారి విచారణ చేపట్టింది హైకోర్టు. 10 పబ్‌లలో రాత్రి పది గంటల తర్వాత మ్యూజిక్ వినిపించకూడదని గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని అప్పీలు చేసింది రెస్టారెంట్ అసోసియేషన్. ఈ అప్పీలుపై విచారణ సందర్భంగా డివిజనల్ బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. సింగిల్ బెంచ్ తీర్పు జూబ్లీహిల్స్‌లోని 10 పబ్‌లకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 26న పబ్‌లపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాత్రి 10 గంటల తర్వాత మ్యూజిక్‌ను అనుమతించవద్దని ఆదేశాలు జారీ చేశారు. అలాగే మైనర్లను కూడా పబ్‌లలోకి అనుమతివ్వొద్దని ఆదేశించారు. ఇదీ చదవండి: కేసుల్లో ఈ కేసులు వేరయా.. పతి, పత్నీ ఔర్ ఓ.. ప్చ్! యాప్ ఎంతపని చేసింది? -
మునుగోడులో మరో ట్విస్ట్.. హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఓటర్ జాబితాలో అక్రమాలకు పాల్పడుతోందని బీజేపీ ఆరోపించింది. కొత్తగా ఓట్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య రెండు నెలల్లోనే పాతిక వేలు దాటిందని పేర్కొంది. ఈ తతంగంపై విచారణ జరపాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించింది. అంతకు ముందు 7 నెలల కాలంలో 1,474 మంది మాత్రమే దరఖాస్తు చేసుకోగా, ఇప్పుడు 6 నెలల్లోనే పెద్ద మొత్తంలో 24,781 దరఖాస్తు రావడం వెనుక టీఆర్ఎస్ హస్తం ఉందని చెప్పింది. జూలై 31 నాటికి ఉన్న ఓటర్ల జాబితా ఆధారంగానే మునుగోడు ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు జారీ చేయాలని కోరింది. ఈ మేరకు బీజేపీ తరఫున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్‌రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్లో పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషనర్ తరఫు న్యాయవాది బి.రచనారెడ్డి కోరారు. ఇప్పుడు అత్యవసరంగా విచారణ చేపట్టలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం పేర్కొంది. ఈ నెల 14న కేంద్ర ఎన్నికల సంఘం కొత్త దరఖాస్తులను ఆమోదించే అవకాశం ఉందని, ఓటర్ల జాబితాను ఖరారు చేయనున్నారని రచనారెడ్డి తెలపడంతో.. ఈ నెల 13న విచారణ జరుపుతామని ధర్మాసనం పేర్కొంది. -
హైకోర్టులో రాఘురామకృష్ణరాజుకు చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: ఎంపీ రాఘురామకృష్ణరాజుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. గచ్చిబౌలి పీఎస్‌లో దాఖలైన కేసు కొట్టేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు పేర్కొంది. వివరాల ప్రకారం.. రఘురామకృష్ణరాజు ఇంటి వద్ద విధి నిర్వహణలో ఉన్న ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌ను ఇంట్లో నిర్బంధించి దాడి చేశారన్న విషయంలో గచ్చిబౌలి పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ క్రమంలో కేసు కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కాగా, పిటిషన్‌పై విచారణలో భాగంగా.. కోర్టులో పోలీసులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు.. ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌ను ఇంట్లో నిర్బంధించి దాడి చేశారని కోర్టుకు తెలిపారు. ఈ విషయంలో తమ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని కోర్టుకు చెప్పారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని పోలీసులు స్పష్టం చేశారు. సీఆర్పీఎఫ్ సిబ్బంది సస్పెండ్ అయ్యారని తెలిపారు. దీంతో, పోలీసుల వాదనతో ఏకీభవించిన హైకోర్టు.. రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు పేర్కొంది. ఇది కూడా చదవండి: గుట్కా దందా.. తమ్ముళ్ల పంథా -
పబ్ కేసులో మరో ట్విస్ట్.. కోర్టును ఆశ్రయించిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఆమ్నేషియా పబ్ కేసు దేశంలోనే చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటికే పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో భాగంగా తెలంగాణ పోలీసులు.. హైకోర్టును ఆశ్రయించారు. ఆరుగురు(ఐదుగురు మైనర్లతో సహా సాదుద్దీన్) నిందితుల డీఎన్ఏ సేకరణ కోసం పోలీసులు కోర్టును ఆశ్రయించారు. నిందితుల డీఎన్ఏ సేకరణ కోసం జువైనల్ బోర్డుతోపాటు కోర్టు అనుమతిని సైతం పోలీసులు కోరారు. దీంతో, ఆరుగురు నిందితుల డీఎన్ఏను సేకరించి పోలీసులు ల్యాబ్‌కు పంపనున్నట్టు స్పష్టం చేశారు. ఇన్నోవాలో సేకరించిన ఆధారాలతో అధికారులు.. డీఎన్ఏను సరిపోల్చనున్నారు. కాగా, విచారణలో సైంటిఫిక్ ఎవిడెన్స్‌గా డీఎన్ఏ రిపోర్టు కీలకం కానుంది. ఇదిలా ఉండగా, అవసరమైతే బాధితురాలి డీఎన్ఏ శ్యాంపిల్ కూడా తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు.. కేసులో బాధితురాలి స్టేట్మెంట్ను పోలీసులు ఇప్పటికే కోర్టులో సబ్మిట్ చేశారు. ఈ క్రమంలోనే నిందితుల పాస్‌పోర్టులను కూడా సీజ్ చేయాలని పోలీసులు.. కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వారికి బెయిల్ లభిస్తే.. దేశం విడిచి వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. కాగా, నిందితుల బెయిల్ పిటిషన్‌ను కోర్టు ఇప్పటికే తిరస్కరించింది. ఇది కూడా చదవండి: గచ్చిబౌలి: పబ్‌లో మైనర్లతో పార్టీ నిర్వహణ.. బడా నేత ప్రమేయం! -
జీవో 402 సస్పెన్షన్: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరస్పర బదిలీ (మ్యూచువల్)లకు సంబంధించిన మార్గదర్శకాలతో ప్రభుత్వం జారీచేసిన జీవో 402ను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్‌రెడ్డి సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా జీవో 402 జారీ చేశారని పలువురు ఉపాధ్యాయులు వేసిన పిటిషన్లను న్యాయమూర్తి విచారించారు. ‘పరస్పర బదిలీలతో సీనియారిటీ కోల్పోవాల్సి ఉంటుంది. అయితే రాష్ట్రప్రభుత్వం సీనియారిటీ కోల్పోకుండా జీవో 402 జారీచేసింది. కానీ ఇది రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధం’ అని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను జూన్ 20కి న్యాయమూర్తి వాయిదా వేశారు. -
ఆ 142 ఎకరాలు సర్కారువే
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌లోని గండిపేట మండలం మంచిరేవులలో గ్రేహౌండ్స్ దళాల శిక్షణ కోసం సర్వే నంబర్ 391/1 నుంచి 391/20ల్లో 2007లో కేటాయించిన 142.39 ఎకరాల భూమి సర్కారుదేనని హైకోర్టు స్పష్టం చేసింది. నిరుపేదలకు ప్రభుత్వం కేటాయించిన భూమిని అసైన్మెంట్ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించిన నేపథ్యంలో.. ఆ అసైన్మెంట్ను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని తేల్చిచెప్పింది. ఈ భూమిని అసైన్మెంట్ ద్వారా పొందిన వారికి హక్కులున్నాయని, వారికి పరిహారం చెల్లిం చి భూములు స్వాధీనం చేసుకోవాలంటూ 2010లో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్ టి.తుకారాంజీతో కూడిన ధర్మాసనం కొట్టేసింది. ఈ మేరకు సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం అనుమతిస్తూ శుక్రవారం తీర్పునిచ్చింది. 11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ధర్మాసనం తీర్పుతో దాదాపు రూ.10 వేల కోట్ల విలువైన ఈ భూమిని కాపాడినట్లైంది. లావుని నిబంధనలు పాటించలేదు ‘‘లావుని నిబంధనల ప్రకారం.. ప్రభుత్వం భూములను స్వాధీనం చేసుకోవడం సరికాదన్న అసైన్‌మెంట్‌దారుల తరఫు న్యాయవాదుల వాదన సరికాదు. లావుని నిబంధనల ప్రకారం ప్రభుత్వ భూములను వేలం ద్వారా కేటాయించాలి. వేలంలో భూమిని పొందిన వ్యక్తులు 25 శాతం డబ్బును వెంటనే చెల్లించాలి. మిగిలిన 75 శాతం 15 రోజుల్లో చెల్లించాలి. అయితే ఈ భూములను భూమిలేని నిరుపేదలకు అసైన్మెంట్ విధానంలో కేటాయించారు. ఇతరులకు విక్రయించరాదనే షరతు కూడా ఉంది. అయితే వీరు భూమిని విక్రయించేందుకు ప్రైవేట్ వ్యక్తులతో ఒప్పందం చేసు కున్నారు. 1991లో ఎంఎ.భక్షికి జీపీఏ ఇచ్చారు. ఆ భూమిని అభివృద్ధి చేసిన భక్షి అసైన్‌మెంట్‌దారులకు ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. ఇది అసైన్మెంట్ భూమిని విక్రయించరాదన్న నిబంధనను ఉల్లంఘించడమే. తర్వాత భక్షికి చేసిన జీపీఏను అసైన్మెంట్దారులు రద్దు చేసినా అప్పటికే అసైన్మెంట్ నిబంధనలను ఉల్లంఘించారని నిర్ధారణ అయ్యింది.ఈ నేపథ్యంలో వీరికి చేసిన అసైన్మెం ట్ను రద్దు చేసే అధికారం రెవెన్యూ అధికారులకు ఉంది’అని ధర్మాసనం తీర్పులో స్పష్టం చేసింది. ‘గ్రేహౌండ్స్’శిక్షణ కోసం కేటాయించారు.. ‘అసైన్మెంట్ నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి ఈ భూమిని స్వాధీనం చేసుకొని ప్రజోపయోగమైన పనుల కోసం ప్రభుత్వం కేటాయించింది. నక్సల్స్‌ను నిరోధించేందుకు ఏర్పాటు చేసిన గ్రేహౌండ్స్ దళాలకు శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ కమాండోలతోపాటు కేంద్ర పారామిలిటరీ బలగాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి నక్సలిజం నిర్మూలన కోసం వినియోగిస్తున్నారు. ఈ భూమిని ప్రభుత్వం 2003లో స్వాధీనం చేసుకుంది. 2006 డిసెంబర్లో ప్రజోపయోగమైన పనులకు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది’అని ధర్మాసనం తీర్పులో పేర్కొంది. 1961లో అసైన్మెంట్ కింద కేటాయించిన ఈ ప్రభుత్వ భూమి ప్రైవేట్ వ్యక్తులపరం కాకుండా డీజీపీ, గ్రేహౌండ్స్ అదనపు డీజీ, రంగారెడ్డి కలెక్టర్, ఆర్డీవో, గండిపేట తహసీల్దార్లు కృషి చేశారని ధర్మాసనం అభినందింది. ఇదిలా ఉం డగా, ఈ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించి వెంచర్లు వేసిన కబ్జాదారులపై రెవెన్యూ అధికారుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ కేసు నాంపల్లి క్రిమినల్ కోర్టులో విచారణలో ఉంది. -
తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు
న్యూఢిల్లీ: తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు నియామకమయ్యారు. గత నెల 16న వీరి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిపార్సు చేయగా, బుధవారం రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర హైకోర్టు జడ్జిలుగా జస్టిస్ శ్రీసుధ, జస్టిస్ సుమలత, జస్టిస్ రాధారాణి, జస్టిస్ మాధవిదేవి, జస్టిస్ తుకారామ్, జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ వెంకటేశ్వర్‌రెడ్డిని నియమిస్తూ న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: VC Sajjanar: పెద్ద సంఖ్యలో ప్రశ్నలు అడగడంతో ప్రెస్మీట్లో తప్పులు చెప్పా -
22వ శతాబ్దంలో నివేదిక ఇస్తారా?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని రిజర్వాయర్ల సంరక్షణకు సంబంధించిన జీవో 111 పరిధి పునఃపరిశీలన, అధ్యయనంలో జాప్యంపై హైకోర్టు మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వం 2016లో ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ 45రోజుల్లోనే నివేదిక ఇవ్వాల్సి ఉన్నా..ఇప్పటికీ ఇవ్వకపోవడమేంటని నిలదీసింది. 22వ శతాబ్ధంలో నివేదిక ఇస్తుందా అని ప్రశ్నించింది. అయితే చివరగా మరో అవకాశం ఇవ్వాలని, నాలుగు వారాల్లోగా హైపవర్ కమిటీ నివేదిక ఇస్తుందని ఆగస్టు 13న రాష్ట్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో.. వచ్చే నెల 13లోగా నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. నివేదికపై ఆ నెలాఖరులోగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని తేల్చిచెప్పింది. వచ్చే నెల 13లోగా నివేదిక ఇవ్వకపోతే హైపవర్ కమిటీ రద్దవుతుందని, హైపవర్ కమిటీ చైర్మన్, సభ్యులపై కోర్టు ధిక్కరణ చర్యలూ ఉంటాయని హెచ్చరించింది. ఇక క్యాచ్మెంట్ ఏరియా వెలుపల ఉన్న సర్వే నంబర్లను జీవో 111 పరిధి నుంచి తొలగించాలంటూ.. ‘ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రెయినింగ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఈపీటీఆర్ఐ)’2006లో ఇచ్చి న నివేదికపైనా తగిన నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. జీవో 111 పరిధి అధ్యయనం, నివేదిక విషయాల్లో తీసుకోబోయే చర్యలను వివరిస్తూ.. హైపవర్ కమిటీ చైర్మన్, ప్రభుత్వ సీఎస్ వారం రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని పేర్కొంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. హైపవర్ కమిటీ ఇచ్చే నివేదిక, దానిపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వివరిస్తూ.. అక్టోబరు 3 లోగా స్థాయీ నివేదిక సమర్పించాలని ఆదేశించింది. విచారణను అక్టోబరు 4కు వాయిదా వేసింది. రహస్య ఎజెండా ఏమైనా ఉందా? జీవో 111 పరిధికి సంబంధించిన ప్రభుత్వానికి రహస్య ఎజెండా ఏమైనా ఉందా అని విచారణ సందర్భంగా ధర్మాసనం అనుమానం వ్యక్తం చేసింది. ‘‘జీవో 111 పరిధిపై అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం 2006లో ఈపీటీఆర్ఐని కోరింది. అధ్యయనం చేసిన ఈపీటీఆర్ఐ కొన్ని సర్వే నంబర్లు క్యాచ్మెంట్ వెలుపల ఉన్నాయని, వాటిని జీవో 111 పరిధి నుంచి తొలగించాలని నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను ప్రభుత్వం ఆమోదించింది. 2010లో ఆ సర్వే నంబర్లను తొలగించేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేసింది. మళ్లీ 2016లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది. నాలుగేళ్లు గడిచినా కమిటీ నివేదిక ఇవ్వలేదు. 2018లో ఓ కేసు విచారణ సందర్భంగా 6 నెలల్లో నివేదిక ఇచ్చేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. ఆ గడువు కూడా 2019 ఆగస్టు నాటికి ముగిసింది. అయినా కమిటీ నివేదిక ఇవ్వలేదు’’అని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచందర్‌రావు కాస్త గడువు ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు. ‘‘2019లో మరో కమిటీని ఏర్పాటు చేసినా కరోనా నేపథ్యంలో నివేదిక ఇవ్వలేకపోయింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన నివేదిక ఇవ్వాలని హైపవర్ కమిటీకి విజ్ఞప్తి చేస్తాం. ఇందుకు ఎనిమిది వారాల గడువు ఇవ్వండి’’అని నివేదించారు. కాగా.. పలు సర్వే నంబర్లను జీవో 111 పరిధి నుంచి తొలగించాలంటూ 2006లో ఈపీటీఆర్ఐ ఇచ్చిన నివేదికను మున్సిపల్ శాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని ధర్మాసనం ఆదేశించింది. -
‘రామప్ప’ పరిసరాలు కాంక్రీట్ జంగిల్‌గా మారొద్దు : హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రామప్ప ఆలయానికి వరల్డ్ హెరిటేజ్ గుర్తింపునిస్తూ యునెస్కో ప్రకటించిన నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో నిర్ణీత దూరం వరకు ఎటువంటి కట్టడాలకు అనుమతి ఇవ్వరాదని హైకోర్టు స్పష్టంచేసింది. ఆలయ శిల్పకళకు, పర్యావరణానికి విఘాతం కలగకుండా ఆలయం చుట్టూ కొంత ప్రాంతాన్ని నిర్మాణ నిషిద్ధ (బఫర్‌జోన్) ప్రాంతంగా ప్రకటించాలని ఆదేశించింది. అంతర్జాతీయ పర్యాటకుల బసకు వీలుగా చేపట్టే నిర్మాణాలు ఆలయానికి దూరంగా ఉండాలని తేల్చిచెప్పింది. నగరంలోని చారిత్రక కుతుబ్‌షాహీ టూంబ్స్ చుట్టూ కాంక్రీట్ జంగిల్ తయారైందని, రామప్ప ఆలయ పరిసరాలు అలా మారకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. యునెస్కో నిర్ధేశించిన మేరకు శాశ్వత గుర్తింపు లభించేందుకు అవసరమైన పనులను సకాలంలో పూర్తిచేయాలని, అందుకు మైలురాళ్లు నిర్ధేశించుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. రామప్పకు యునెస్కో గుర్తింపు లభించిన నేపథ్యంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై పత్రికల్లో వచ్చిన కథనాలను గతంలో ధర్మాసనం సుమోటోగా విచారణకు స్వీకరించింది. దీనిపై విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవహరించి యునెస్కో నిర్దేశించిన మేరకు పనులు పూర్తిచేయాలని ధర్మాసనం స్పష్టంచేసింది. 2022 డిసెంబర్‌లోగా పనులు పూర్తిచేయాలి యునెస్కో నిర్ధేశించిన మేరకు పనులన్నింటినీ ఈ ఏడాది డిసెంబర్‌లోగా కాకుండా 2022 డిసెంబర్‌లోగా పూర్తిచేయాలని వరల్డ్ హెరిటేజ్ కమిటీ సూచించిందని కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎన్.రాజేశ్వర్‌రావు నివేదించారు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) అధికారులతో కూడా కమిటీ వచ్చే వారంలో సమావేశమై.. బఫర్ జోన్‌ను ప్రకటించే విషయంపై నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఆలయ పరిసరాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఇటీవల సమావేశం నిర్వహించారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ హరీందర్ నివేదించారు. దీంతో స్పందించిన ధర్మాసనం రానున్న నాలుగు వారాల్లో తీసుకున్న చర్యలను వివరిస్తూ తాజా నివేదికను సెప్టెంబర్ 29లోగా సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ విచారణను వాయిదావేసింది. -
‘కోకాపేట డబ్బులు’ ఎస్క్రో ఖాతాలో ఉంచేలా ఆదేశిస్తాం
సాక్షి, హైదరాబాద్: జీవో 111 పరిధికి సంబంధించి హైపవర్ కమిటీ అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు మరో రెండు నెలల సమయం ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు నెలలు కాదు రెండేళ్లయినా సమయం ఇస్తామని, అయితే నివేదిక ఇచ్చేవరకూ ఇటీవలి కోకాపేట భూముల వేలానికి సంబం ధించిన డబ్బును ఎస్క్రో (మూడవ పార్టీ) బ్యాంకు ఖాతాలో ఉంచేలా ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది. అలాగే వేలం వేసిన భూముల్లో మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ), ఇతర మౌలిక వసతులు కల్పించే వరకూ, అలాగే హైపవర్ కమిటీ నివేదిక సమర్పించే వరకు ఈ డబ్బును ము ట్టడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. ఆ భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని కూడా పే ర్కొంది. ఈ అంశాలపై ప్రభుత్వ అభిప్రాయం చెప్పాలని అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచందర్రావును ఆదేశించింది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ రిజర్వాయర్లకు సమీపంలోని 84 గ్రామాల్లో భారీ నిర్మా ణాలు చేపట్టకూడదని జీవో 111 స్పష్టం చేస్తోంది. ఈ జీవో నుంచి వట్టినాగులపల్లిలోని కొన్ని సర్వే నంబర్లను తొలగించాలంటూ దాఖలైన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. సీఎం అలా చెప్పలేదు... ‘జీవో 111ను ఉపసంహరించుకుంటామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మీడియాకు చెప్పలేదు. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. హైపవర్ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆ విషయాన్ని రాయకుండా మీడియా ఇతర విషయాలను ప్రస్తావించింది. వీలైనంత త్వరగా కమిటీ నివేదిక సమర్పి స్తుంది. మరో రెండు నెలలు ఆగితే కమిటీ నివేదిక వస్తుంది. అప్పటివరకు సమయం ఇవ్వండి’అని ధర్మాసనాన్ని ఏఏజీ అభ్యర్థించారు. 2 నెలల్లో ఇస్తామంటే ఎలా నమ్మాలి? ‘జీవో 111 పరిధిని నిర్ణయించాలంటూ 2006లో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ రీసర్చ్ అండ్ ట్రై నింగ్ సెంటర్ (ఈపీటీఆర్ఐ)ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో వట్టినాగులపల్లిలోని కొన్ని సర్వే నంబర్లు క్యాచ్మెంట్ ఏరియాలో లేవని, వాటిని జీవో 111 పరిధి నుంచి తొలగించవచ్చని ఈపీటీఆర్ఐ నివేదిక ఇచ్చింది. అయితే జీవో 111 పరిధిపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2016లో హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఇచ్చిన జీవోలో 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని పేర్కొంది. ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఆ కమిటీ నివేదిక ఇవ్వలేదు. పనిచేయని ఇటువంటి కమిటీలను వెంటనే రద్దు చేయాలి. ఇన్నేళ్లు పట్టనట్లుగా వ్యవహరించి ఇప్పుడు రెండు నెలల్లో నివేదిక ఇస్తామంటే ఎలా నమ్మాలి?..’అని ధర్మాసనం నిలదీసింది. తమ షరతులకు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతిస్తే రెండు నెలల సమయం ఇవ్వడానికి అభ్యంతరం లేదని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం చెప్పేందుకు సోమవారం వరకు గడువు ఇవ్వాలని ఏఏజీ అభ్యర్థించగా.. నిరాకరిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేసింది. -
జీవో 111 రద్దు చేసే ఆలోచన ఉందా?
సాక్షి, హైదరాబాద్: జీవో 111ను రద్దు చేసే ఆలోచన ఉందా లేదా.. అన్న దానిపై స్పష్టతనివ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆరు నెలల్లో జీవో 111ను రద్దు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటీవల ప్రకటించినట్లుగా పత్రికల్లో వచ్చిన కథనాలను చూసినట్లు పేర్కొంది. ఈ వ్యవహారంపై ప్రభుత్వ అభిప్రాయం తెలుసుకొని చెప్పాలని అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచందర్‌రావుకు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది. ఒకవేళ ప్రభుత్వానికి జీవో 111ను రద్దు చేసే ఉద్దేశం ఉంటే, దాని పరిధిపై దాఖలైన పిటిషన్లను విచారించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. బుధవారంలోగా ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలియజేయాలని ఏఏజీకి సూచిస్తూ విచారణను వాయిదా వేసింది. జీవో 111 నుంచి వట్టినాగులపల్లిలోని కొన్ని సర్వే నంబర్లను తొలగించాలంటూ దాఖలైన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. కోర్టు ముందస్తు అనుమతి లేకుండా కోకాపేట ప్రాంతంలో ప్రభుత్వ భూములను వేలం వేయొద్దని ధర్మాసనం సూచించింది. కోకాపేటలో భూముల వేలంలో కొనుగోలు చేసినవారు... అక్కడ అభివృద్ధి పనులు చేపట్టాలంటే డ్రైనేజీ, వరదనీటి తరలింపునకు సంబంధించి పనులు పూర్తయిన తర్వాతే అనుమతులు ఇస్తామని తెలియజేయాలని ధర్మాసనం హెచ్ఎండీఏకు సూచించింది. ‘‘కోకాపేటలో ప్రభుత్వ భూముల వేలంలో ఒకలాగా... వట్టి నాగులపల్లిలోని ప్రైవేటు వ్యక్తుల భూముల విషయంలో మరోలాగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది’’ అని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. -
మాజీ సైనికుడికి గౌరవం ఇదేనా?
సాక్షి, హైదరాబాద్: మాజీ సైనికుడికి నిబంధనల మేరకు భూమి కేటాయించినా రెవెన్యూ అధికారులు అప్పగించకపోవడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రెండు యుద్ధాల్లో పాల్గొన్న సైనికుడికి మీరిచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించింది. రెండు వారాల్లోగా భూమి కేటాయించి సైట్ ప్లాన్‌తోపాటు అప్పగించాలని గత జూన్ 15న ఆదేశించినా ఇప్పటికీ అమలు చేయకపోవడంపై మండిపడింది. రెండు వారాల్లో భూమి అప్పగించకపోతే రూ.25 వేలు జరిమానాగా పిటిషనర్‌కు చెల్లించాల్సి వస్తుందని తమ ఆదేశాల్లో స్పష్టం చేసిన నేపథ్యంలో, రూ.25 వేలు పిటిషనర్‌కు చెల్లించాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. మరో రెండు వారాల్లో కూడా భూమి అప్పగించకపోతే రూ.50 వేలు పిటిషనర్‌కు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తమకు 4 ఎకరాల భూమిని రెండు వారాల్లో అప్పగించాలన్న ధర్మాసనం ఆదేశాలను అమలు చేయలేదంటూ వికారాబాద్ జిల్లాకు చెందిన మాజీ సైనికుడు పి.లక్ష్మీనారాయణరెడ్డి దాఖలు చేసిన కోర్టుధిక్కరణ పిటిషన్‌ను ధర్మాసనం విచారించింది. భూ కేటాయింపు ప్రక్రియ తుది దశలో ఉందని, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హరీందర్ నివేదించారు. మరో రెండు వారాల సమయం ఇస్తే భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేయడంతోపాటు భూమిని అప్పగిస్తామని పేర్కొన్నారు. విచారణను సెప్టెంబర్ 15కు వాయిదా వేసింది. -
గిరిజన ప్రాంతాల్లో ఏం వసతులు కల్పించారు?
సాక్షి, హైదరాబాద్: గిరిజన సలహా మండలి తీర్మానాలను 2013 నుంచి ఎందుకు అమలు చేయడం లేదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, రవాణా వంటి మౌలిక సదుపాయాల కల్పనకు తీసుకున్న చర్యలను వివరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. గిరిజన ప్రాంతాలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, కనీసవసతులు కూడా కల్పించడం లేదంటూ ఆదివాసి సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు పి.శ్రీనివాస్ దాఖ లు చేసిన ప్రజాహిత వ్యాజ్యా న్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డిల ధర్మాసనం ఇటీవల విచారించింది. ‘గిరిజనులకు రక్షణగా ఉన్న 1/70 చట్టాన్ని అమలు చేయడం లేదు. ఈ మేరకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను అమలు చేయడం లేదు. గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు కనీసం వైద్యం అందడం లేదు. ప్రాథమిక వైద్యం కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఆస్పత్రులకు తరలించే అంబులెన్స్‌లు లేవు. విద్యుత్, రవాణా వంటి కనీస సదుపాయాల కల్పనలోనూ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. జీవనోపాధి కోసం గిరిజనులు సాగు చేసుకుంటున్న భూముల్లోకి అటవీ, పోలీస్ అధికారులు వెళ్లి వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. గిరిజన సలహా మండలి 2013 నుంచి అనేక సిఫార్సులు చేస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు’ అని పిటిషనర్ తరఫున న్యాయ వాది పీవీ రమణ వాదనలు వినిపించారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేప ట్టామని, సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తరఫు స్పెషల్ జీపీ హరీందర్ నివేదించారు. తదుపరి విచారణను కోర్టు నవంబర్ 10కి వాయిదా వేసింది. -
ఆ నిధుల విడుదలకు హైకోర్టు ఓకే
సాక్షి, హైదరాబాద్: భూసేకరణలో భాగంగా చెల్లించాల్సిన పరిహారానికి సంబంధించి కోర్టు ధిక్కరణ, ఎగ్జిక్యూషన్ పిటిషన్లు దాఖలు చేసినవారికే రూ.59 కోట్లు విడుదల చేస్తూ జీవో 208 జారీ చేశామన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు గతంలో ఈ నిధులను విడుదల చేయరాదంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తేసింది. నిధుల విడుదలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కోర్టుధిక్కరణ కేసుల్లో హాజరైనవారి కోసం అంటూ రూ.59 కోట్లను విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ నాగర్‌కర్నూలు జిల్లాకు చెందిన లెక్చరర్ సి.ప్రభాకర్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం మరోసారి విచారించింది. గతంలో ఆదేశించిన మేరకు జీవోను సవరించి తాజాగా జారీచేశారా అని ధర్మాసనం అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్‌ను ప్రశ్నించింది. ఈ పిటిషన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ దాఖలు చేసిన కౌంటర్లోని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఏజీ నివేదించారు. ఈ నిధులను ఎందుకోసం ఖర్చు చేస్తున్నారో స్పష్టం చేస్తూ సవరించిన జీవో జారీచేయడానికి ఇబ్బంది ఏంటని ధర్మాసనం ప్రశ్నించగా గత ఏడాది విడుదల చేసిన నిధులు సకాలంలో నిర్వాసిత రైతులకు అందించలేకపోయామని, దీంతో తాజాగా ఈ జీవో జారీచేయాల్సి వచ్చిందని వివరించారు. -
ఆరుగురు అధికారులకు 6 నెలల జైలు
సాక్షి, హైదరాబాద్: కోర్టు ఆదేశాల అమల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అటవీ, రెవెన్యూ శాఖ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్లకు చెందిన భూమి సేకరణ విషయంలో ఆరు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని 2009లో అటవీ శాఖ, రెవెన్యూ అధికారులను ఆదేశించినా ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడింది. ఉద్దేశపూర్వకంగానే ఆదేశాలను ఉల్లంఘించారంటూ అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆర్.శోభ, రంగారెడ్డి చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ సునీత ఎం.భగవత్, డీఎఫ్‌వో జానకీరామ్, అడిషనల్ కలెక్టర్ ఎస్.తిరుపతిరావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎ.శాంతకుమారి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ డి.అమోయ్‌కుమార్‌కు ఆరు నెలల సాధారణ జైలుశిక్ష విధించింది. రూ.2 వేల చొప్పున జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఈమేరకు న్యాయమూర్తి జస్టిస్ టి.అమర్నాథ్గౌడ్ ఇటీవల తీర్పునిచ్చారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం సర్వే నంబర్ 222/1 నుంచి 222/20లో మహ్మద్ సిరాజుద్దీన్ తదితరులకు 383 ఎకరాల భూమి ఉంది. అటవీ అధికారులు ఈ భూమిని రిజర్వు ఫారెస్టుగా మార్చాలని నిర్ణయించి సేకరించాలని భావించారు. అయితే ఈ భూమిని రిజర్వు ఫారెస్టుగా మార్చడం సాధ్యం కాదంటూ అటవీశాఖ సెటిల్మెంట్ ఆఫీసర్ 2008లో కలెక్టర్‌కు లేఖ రాశారు. అటవీ శాఖ అధికారుల నిర్ణయాన్ని సవాల్‌చేస్తూ సిరాజుద్దీన్ తదితరులు హైకోర్టును ఆశ్రయించగా, ఈ భూమిసేకరణ ప్రక్రియపై ఆరు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని 2009లో అటవీ, రెవెన్యూ అధికారులను ఆదేశించింది. ఆరేళ్లయినా అటవీ అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోగా ఆ భూమిని తమకు అప్పగించకపోవడాన్ని సవాల్‌చేస్తూ సిరాజుద్దీన్ తదితరులు 2015లో కోర్టుధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. -
పాక్షికంగా కేసుల భౌతిక విచారణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గిన నేపథ్యంలో కేసుల విచారణను ఈ నెల 9 నుంచి సెప్టెంబర్ 9 వరకు ప్రయోగాత్మకంగా పాక్షికంగా భౌతిక పద్ధతిలో చేపట్టడంతోపాటు ఆన్‌లైన్‌లోనూ చేపట్టాలని హైకోర్టు నిర్ణయించింది. అయితే ఈ నెల 8 వరకు మాత్రం ప్రస్తుతమున్న ఆన్లైన్ విధానంలోనే కేసుల విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. సోమ, మంగళవారాల్లో ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనంతోపాటు ముగ్గురు సింగిల్ జడ్జీలు భౌతికంగా కేసులను విచారిస్తారని, బుధ, గురువారాల్లో న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్. రామచందర్‌రావు, జస్టిస్ టి. వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనంతోపాటు ముగ్గురు సింగిల్ జడ్జీలు భౌతికంగా కేసులను విచారిస్తారని హైకోర్టు తెలిపింది. ఆ తర్వాత రెండు రోజులు న్యాయమూర్తులు జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనంతోపాటు ముగ్గురు సింగిల్ జడ్జీలు భౌతికంగా కేసులను విచారిస్తారని పేర్కొంది. హైకోర్టుతోపాటు కింది కోర్టుల్లో వ్యాక్సిన్ వేయించుకున్న న్యాయవాదులనే కోర్టు హాల్లోకి అనుమతించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు వ్యాక్సిన్ తీసుకున్న సర్టిఫికెట్‌ను వెంట ఉంచుకోవాలని సూచించింది. అలాగే హైకోర్టుతోపాటు కిందిస్థాయి కోర్టులు, ట్రిబ్యునళ్లలో ఆయా రోజుల్లో కేసులు విచారణలో ఉన్న న్యాయవాదులనే అనుమతిస్తామని పేర్కొంది. న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తప్పనిసరిగా కరోనా నిబంధనలను పాటించాలని హైకోర్టు రిజిస్ట్రార్ వెంకటేశ్వర్‌రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రేపట్నుంచి సెప్టెంబర్ 9 వరకు కింది కోర్టుల్లోనూ... సోమవారం నుంచి సెప్టెంబర్ 9 వరకు కింది కోర్టులు, ట్రిబ్యునళ్లలో పాక్షికంగానే భౌతికంగా కేసుల విచారణ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో మాత్రం ఈ నెల 8 వరకు ఆన్లైన్లోనే విచారణ కొనసాగించాలని స్పష్టం చేసింది. సీబీఐ, ఏసీబీ, నాంపల్లి, సిటీ సివిల్ కోర్టు, వరంగల్ జిల్లా కోర్టుల్లో ప్రస్తుతం కొనసాగిస్తున్న విధానంలోనే పాక్షికంగా ప్రత్యక్షంగా కేసులను విచారించాలని పేర్కొంది. తుది విచారణ దశలో ఉన్న కేసుల్లో ముందుగా సమాచారం ఇచ్చి భౌతికంగా లేదా ఆన్లైన్ ద్వారా వాదనలు వినిపించే అవకాశం న్యాయవాదులకు ఉంటుందని తెలిపింది. -
అంత సమయం ఇవ్వలేం
సాక్షి, హైదరాబాద్: అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయంపై ఉగ్రవాద దాడిలో మృతిచెందిన ఐఎఫ్ఎస్ అధికారి వి.వెంకటేశ్వర్రావు కుటుంబానికి ఇంటిస్థలం అప్పగింతకు మూడు నెలల సమయం ఇవ్వాలని రాష్ట్ర ప్రభు త్వం కోరడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దాదాపు 12 ఏళ్లుగా బాధిత కుటుంబం స్థలం కోసం ఎదురు చూస్తోందని, అంత సమయం ఇవ్వలేమని, 3 వారాల్లో ఇంటి స్థలం కేటాయింపు ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. భరణి లేఔట్లో కేటాయించనున్న ప్లాట్ నంబర్ 54ను వారం రోజుల్లో వెంకటేశ్వర్రావు భార్య మాలతీరావుకు చూపించాలని, ఆ ప్లాట్ తీసుకునేందుకు ఆమె అంగీకరిస్తే మరో 2 వారాల్లో కేటాయించాలని, ఆగస్టు 23లోగా ప్లాట్ అప్పగింతకు సంబంధించిన పూర్తి వివరాలను పేర్కొంటూ సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తన భర్త 2008లో తీవ్రవాదుల దాడిలో చనిపోయారని, ఇంటి స్థలం కేటాయిస్తూ 2014లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం జీవో జారీచేసినా ఇప్పటికీ స్థలం అప్పగించలేదంటూ మాలతీరావు రాసిన లేఖను ధర్మాసనం గతంలో సుమోటో పిటిషన్‌గా విచారణకు స్వీకరించింది. మాలతీరావు అంగీకరిస్తే భరణి లేఔట్‌లోనే గతంలో కేటాయించిన ప్లాట్ నంబర్ 58 బదులుగా 475 గజాల స్థలం ఉన్న ప్లాట్ నంబర్ 54 ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని రెవెన్యూ శాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది భాస్కర్‌రెడ్డి నివేదించారు. ఇందుకు ధర్మాసనం నిరాకరించడంతో...కనీసం 4 వారాల సమయం అయినా ఇవ్వాలని కోరారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం ఆగస్టు 23లోగా ప్లాట్ కేటాయింపు ప్రక్రియ పూర్తిచేసి మాలతీరావుకు అప్పగించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. -
సినిమా టికెట్ల ధరలపై నిర్ణయం తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: సినిమా టికెట్ల ధరలకు సంబంధించి ప్రత్యేక కమిటీ చేసిన మార్గదర్శకాల మేరకు నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు తీసుకున్న చర్యలను వివరిస్తూ సమగ్ర నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం ఈ మేరకు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. సినిమా టికెట్ల ధరల నిర్ణయానికి సంబంధించి ప్రత్యేక కమిటీవేసి మార్గదర్శకాలు రూపొందించాలంటూ 2016లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయలేదంటూ సినీ ప్రేక్షక వినియోగదారుల సంఘం అధ్యక్షుడు, న్యాయవాది జీఎల్ నరసింహారావు రాసిన లేఖను ధర్మాసనం సుమోటో ప్రజాహిత వ్యాజ్యం (పిల్)గా విచారణకు స్వీకరించింది. ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసి మార్గదర్శకాలు కూడా రూపొందించి ప్రభుత్వానికి పంపామని హోంశాఖ తరఫున న్యాయవాది శ్రీకాంత్‌రెడ్డి నివేదించారు. దీంతో స్పందించిన ధర్మాసనం.. నిర్ణయం తీసుకోవడంలో జాప్యం ఎందుకు చేస్తున్నారని, నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకొని తమకు తెలియజేయాలని ఆదేశించింది. కాగా, సినిమా టికెట్ల ధరలకు సంబంధించి ప్రభుత్వ ఆమోదం తర్వాతే థియేటర్ యజమానులు పెంచుకోవాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌చేస్తూ థియేటర్ యజమానులు దాఖలుచేసిన అప్పీళ్లను తర్వాత విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేస్తూ తదుపరి విచారణను అక్టోబరు 26కు వాయిదా వేసింది. -
అధిక ఫీజులపై ఏం చర్యలు తీసుకున్నారు
-
ఇది కోర్టు ధిక్కరణే...!
-
తెలంగాణ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: బీసీ గణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను నిర్ణయించాలంటూ 2010లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడంపై హైకోర్టు మండిపడింది. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా 2019లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం కోర్టుధిక్కరణ కిందకే వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మరోసారి విచారించింది. బీసీ సమగ్ర ఆర్థిక, సామాజిక పరిస్థితులపై బీసీ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే తాము స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లను నిర్ణయించామంటూ గతంలో అదనపు ఏజీ పేర్కొన్న నేపథ్యంలో, బీసీ కమిషన్ నివేదిక సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. అయితే గతంలో తాను పొరపాటున అలా చెప్పానని, జిల్లా కలెక్టర్లు ఇచ్చిన నివేదిక ఆధారంగా బీసీ రిజర్వేషన్లను నిర్ణయించామని అదనపు ఏజీ నివేదించారు. బీసీ గణన కోసం బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేయలేదని, ఈ నేపథ్యంలో ఎటువంటి నివేదిక ప్రభుత్వం వద్ద లేదని పేర్కొన్నారు. కాగా, ఏజీ పరస్పర విరుద్ధమైన వాదనలు వినిపించడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. బీసీల సామాజిక, ఆర్థిక పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు చట్టబద్ధమైన బీసీ కమిషన్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది ధర్మేష్ డీకే జైశ్వాల్ నివేదించారు. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 201ను ఎందుకు చట్టవిరుద్ధంగా ప్రకటించరాదో స్పష్టం చేస్తూ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశిస్తూ విచారణను జూన్‌కు వాయిదా వేసింది. ( చదవండి: హైదరాబాద్ ఐఎస్బీ.. దేశంలోనే టాప్! ) -
అధికారులు స్పందించకుంటే కోర్టును ఆశ్రయించండి
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల సేవల్లో లోపాలపై సంబంధిత అధికారులకు ముందుగా ఫిర్యాదు చేయాలని, వారు స్పందించకపోతే కోర్టును ఆశ్రయించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీని కట్టడి చేసేలా, వాటి పనితీరులో జవాబుదారీతనం పెంచేలా నిబంధనలు రూపొందించేందుకు నిపుణులతో కమిటీ వేయాలంటూ జర్నలిస్టు కాజీపేట నరేందర్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం కొట్టేసింది. 2016లో నరేందర్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఓ కార్పొరేట్ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తన సోదరి మృత్యువాతపడ్డారని, ఇలా మరొకరికి జరగకుండా ఉండాలంటే నిపుణులతో కమిటీ వేసి కార్పొరేట్ ఆసుపత్రుల పనితీరులో జవాబుదారీతనం పెంచాలని కోరారు. ఈ వ్యాజ్యం గురువారం మరోసారి విచారణకు వచ్చింది. తమ వాదనను రాష్ట్ర విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్ సమర్థించారని పిటిషనర్ తరఫున న్యాయవాది శ్రవణ్‌కుమార్ నివేదించారు. అయితే ముందు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయకుండా నేరుగా పిటిషన్ ఎలా దాఖలు చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించకపోతే తిరిగి పిటిషన్ దాఖలు చేసుకునేలా స్వేచ్ఛనిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. ఆరోగ్యశ్రీ పథకం అమలులో లోపాలు ‘‘రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు వైద్యం అందించాలన్న లక్ష్యంతో తెచ్చిన ఆరోగ్యశ్రీ పథకం అమలును పరిశీలించేందుకు 2009లో అనేక ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశాం. ఆరోగ్యశ్రీ కింద చేరే రోగులకు కన్సల్టేషన్ ఫీజు తీసుకోరాదని నిబంధనలు చెబుతున్నా తీసుకుంటున్నాయి. బయట ప్రైవేట్ ల్యాబ్స్‌లో స్కానింగ్ పరీక్షలు చేయించుకొని రావాలంటూ ఒత్తిడి చేస్తున్నాయి. ఉచితంగా రవాణా కల్పించడంలేదు. ఉచితంగా మందులు ఇవ్వడంలేదు. ఆరోగ్యశ్రీలో నిర్దేశించిన ఫీజులకన్నా కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు ఎక్కువ మొత్తాన్ని రోగుల నుంచి వసూలు చేశాయి. శస్త్రచికిత్స తర్వాత వైద్యసహాయం అందివ్వాల్సి ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. కొన్ని హాస్పిటల్స్ రూ.14 వేల స్టంట్స్‌ను వేసి ఆరోగ్యశ్రీ ద్వారా రూ.30 వేలు తీసుకున్నాయి. ఆరోగ్యశ్రీ కింద డబ్బు కడితేనే రోగులను చేర్చుకుంటామంటూ ఒత్తిడి చేస్తున్నాయి. మరో ఆసుపత్రి అయితే ఆరోగ్యశ్రీ కింద చేర్చుకొని అదనంగా మరో రూ.40 వేలు రోగి నుంచి వసూలు చేసింది. కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి’’అని విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ త్రివేది తన కౌంటర్లో వివరించారు. ( చదవండి: జూబ్లీహిల్స్‌లో దారుణం: చంపి ఫ్రిజ్‌లో పెట్టారు ) -
న్యాయవాద దంపతుల హత్య ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలి
సాక్షి, హైదరాబాద్: న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, పీవీ నాగమణిల దారుణహత్య ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ వామన్‌రావు తండ్రి గట్టు కిషన్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. ‘‘అధికార పార్టీ నేతలపై, పోలీసులపై, స్థానిక రాజకీయ నాయకుల అక్రమాలపై వామన్‌రావు, నాగమణి అనేక కేసులు వేశారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ అక్రమాలపై కూడా హైకోర్టులో కేసులు వేశారు. దీంతో తన కుమారుడు, కోడలిపై పుట్ట మధుకర్, ఆయన అనుచరులు వ్యక్తిగత ద్వేషం పెంచుకున్నారు. పుట్ట మధుకర్‌కు నేరచరిత్ర ఉంది. గతంలో ఆయనపై రౌడీషీట్ ఉండటంతోపాటు అనేక క్రిమినల్ కేసులు విచారణలో ఉన్నాయి. ఓ వివాదంలో పుట్ట మధుకర్‌పై వామన్‌రావు గోదావరిఖని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే మంథని మున్సిపల్ చైర్మన్, మధుకర్ భార్య శైలజ ఎన్నికను సవాల్ చేస్తూ పీవీ నాగమణి ఎన్నికల పిటిషన్ కూడా దాఖలు చేశారు. శీలం రంగయ్య అనే వ్యక్తి పోలీసు కస్టడీలో మృతి చెందిన ఘటనపై లాకప్‌డెత్‌గా పేర్కొంటూ నాగమణి రాసిన లేఖను హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించి దర్యాప్తునకు ఆదేశించింది. మైనింగ్, ఇసుక మాఫియాకు చెందిన వారే రంగయ్యను హత్య చేయించారని వామన్‌రావు నాకు చెప్పాడు. నా కుమారుడి హత్య వెనుక పెద్ద వ్యక్తులు ఉన్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ తన కుమారుడిపై గతంలో అవాస్తవాలను ప్రచారం చేశారు. ఆయన ఆధ్వర్యంలో దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందన్న నమ్మకం లేదు. నిందితులు అధికార పార్టీకి చెందిన నేతలు. నిందితులతో స్థానిక పోలీసులకు సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కమిషనర్ సహా స్థానిక పోలీసు అధికారులను వెంటనే అక్కడి నుంచి బదిలీ చేయాలి. హత్య ఘటనపై పెద్దపల్లి జిల్లా రామగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈనెల 17న నమోదైన క్రైమ్ నంబర్ 21/2021 దర్యాప్తును సీబీఐకి అప్పగించాలి’’అని పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్ ఒకటి, రెండ్రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం ఉంది. కాగా, న్యాయవాద దంపతుల హత్యకు నిరసనగా బార్ అసోసియేషన్స్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం నాంపల్లి క్రిమినల్ కోర్టు న్యాయవాదులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. -
తెలంగాణ మొత్తానికి 50 వేల పరీక్షలేనా?
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ పట్టణంలో రోజుకు 40 వేల కరోనా పరీక్షలు చేస్తుంటే తెలంగాణ రాష్ట్రం మొత్తానికి రోజుకు 50 వేల పరీక్షలు మాత్రమే చేస్తున్నారా అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పరీక్షలు ఎక్కువగా నిర్వహించి కేసులను గుర్తించడం ద్వారా కరోనా వ్యాప్తి చెందకుండా కట్టడి చేయవచ్చన్నారు. జనవరి 20 నుంచి ఫిబ్రవరి 5 వరకు కరోనా నిర్ధారణ పరీక్షలు ఎన్ని చేశారో జిల్లాల వారీగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ఇందులో ఆర్టీపీసీఆర్ పరీక్షలు ఎన్ని? ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు ఎన్ని చేశారు? ఎన్ని కేసులను గుర్తించారు? పరీక్షల ఫలితాలను ఎలా తెలియజేస్తున్నారు? సీరో సర్వేలైన్స్ ఎలా అమలు చేస్తున్నారు? యూకే నుంచి వచ్చిన వారి ద్వారా కొత్త స్ట్రెయిన్ వ్యాప్తి చెందకుండా ఏం చర్యలు తీసుకున్నారు? తదితర వివరాలను సమర్పించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కరోనా నియంత్రణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేయాలంటూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. ప్రస్తుతం తెలంగాణలో 250 నుంచి 300 కేసులు మాత్రమే ఉన్నాయని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. కొత్త స్ట్రెయిన్‌కు సంబంధించి యూకే నుంచి వచ్చిన నలుగురిని గుర్తించి వారికి చికిత్స అందించి వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఒకే అంశంపై ఇన్ని పిటిషన్లా? కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై 24 ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు అవడంపై సీజే విస్మయం వ్యక్తం చేశారు. ఒకే అంశానికి సంబంధించి ఇన్ని పిటిషన్లను విచారించడం సరికాదని, ఈ నేపథ్యంలో ఒకే అంశంపై దాఖలైన 22 పిటిషన్లపై విచారణను ముగిస్తున్నామని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వం నుంచి రాయితీ పద్ధతిలో భూమి పొంది ప్రభుత్వం నిర్దేశించిన మేరకు పేదలకు వైద్యం అందించడం లేదంటూ దాఖలైన వ్యాజ్యాలతోపాటు మిగిలిన ఐదు పిటిషన్లను వేరుగా విచారిస్తామని, ఇతర పిటిషన్లలోని న్యాయవాదులు కోర్టుకు వాదనలు వినిపించి సహకరించవచ్చని సూచించింది. -
‘ఆ ఫలితంపై అత్యవసర జోక్యం అవసరం లేదు’
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేరెడ్మెట్ డివిజన్ మినహా పూర్తయిన సంగతి తెలిసిందే. నేరెడ్‌మెట్‌లో స్వస్తిక్ ముద్ర కాకుండా ఇతర ముద్ర ఉన్న ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ఫలితాలు వాయిదా వేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇతర ముద్రల ఓట్లపై సింగిల్‌జడ్జి ఉత్తర్వులపై హైకోర్టులో ఎస్ఈసీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం.. సింగిల్‌జడ్జి మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. నేరెడ్‌మెట్‌లో ఫలితం నిలిచిపోయిందని ఎస్ఈసీ తెలపగా, అందుకు సిబ్బంది శిక్షణ లోపమే కారణమని హైకోర్టు అభిప్రాయపడింది. సింగిల్ జడ్జి వద్ద సోమవారమే విచారణ ఉన్నందున అత్యవసరంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. సింగిల్ జడ్జి వద్ద విచారణ పూర్తయ్యాక ఒకవేళ అభ్యంతరం ఉంటే అప్పీల్ చేయాలని తెలిపింది. ఇందుకు గాను సోమవారం ఉదయమే ఈ అంశంపై విచారణ జరపాలని సింగిల్ జడ్జికి ఆదేశాలు జారీ చేసింది. (నేరేడ్మెట్ డివిజన్ ఓట్ల లెక్కింపు నిలిపివేత) -
రోజూ 50 వేలు.. వారానికోసారి లక్ష టెస్టులు
సాక్షి, హైదరాబాద్ : ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య చాలా తక్కువగా ఉందని రాష్ట్ర హైకోర్టు అభిప్రాయ పడింది. కరోనా సెకండ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో రోజూ 50 వేలకు తగ్గకుండా పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే వారంలో ఒక రోజు లక్ష పరీక్షలు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి. విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నియంత్రణకు సంబంధించి దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలను ధర్మాసనం మరోసారి విచారించింది. ఈ పిటిషన్లపై విచారణకు కేవలం 15 నిమిషాల ముందు ప్రభుత్వం కరోనా పరీక్షలకు సంబంధించి నివేదిక సమర్పించడంపై ఉన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కనీసం ఒక రోజు ముందు నివేదిక సమర్పించాలని పలుమార్లు ఆదేశించినా ప్రభుత్వం వాయిదా కోరాలన్న కారణంగా ఇలా చివరి నిమిషంలో నివేదికలు సమర్పిస్తోందని మండిపడింది. ప్రజల ప్రాణాలను కాపాడటంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదని ధర్మాసనం పేర్కొంది. ప్రజలను చీకట్లో ఉంచి అంతా బాగుందనడం సరికాదని, రోగులు, మృతుల సంఖ్యకు సంబంధించి సరైన సమాచారం ప్రజలకు తెలియడం లేదని అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మార్గదర్శకాల మేరకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని ప్రజారోగ్య విభాగం సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు పేర్కొనడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. జర్మనీలో, తెలంగాణలో ఒకే తరహాలో పరీక్షలు చేస్తామంటే ఎలా అని, డబ్ల్యూహెచ్‌వో సూచనలు రాష్ట్రంలోని పరిస్థితులకు అనుగుణంగా ఉండవని, కరోనా నియంత్రణకు ప్రభుత్వం వినూత్నంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. విచారణకు ముందు పరీక్షల సంఖ్య పెంచుతున్నారు... హైకోర్టులో ఈ పిటిషన్లు విచారణకు వచ్చే ముందు రెండు, మూడు రోజులు మాత్రమే పరీక్షల సంఖ్య 40 వేలకు పెంచుతున్నారని, ఇతర రోజుల్లో 20 నుంచి 25 వేలు మాత్రమే చేయడంపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారీ సంఖ్యలో పరీక్షలు చేసి కరోనా రోగులను గుర్తిస్తే తప్ప కరోనా వ్యాపించకుండా చర్యలు తీసుకోవడం సాధ్యంకాదని స్పష్టం చేసింది. ఢిల్లీ, కేరళలలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పటికే ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రభుత్వ వరద సాయం కోసం దరఖాస్తు చేసుకొనేందుకు మీ–సేవా కేంద్రాల వద్ద ప్రజలు భౌతికదూరం పాటించకుండా, మాస్కు లేకుండా గుమిగూడినా పోలీసుల జాడ కనిపించలేదని ధర్మసనం అసహనం వ్యక్తం చేసింది. కరోనా నిబంధనలు పాటించకపోతే జరిమానా విధించేలా జారీ చేసిన జీవో 64ను కఠినంగా అమలు చేయాలని తేల్చిచెప్పింది. విపత్తు ప్రణాళిక లేనట్లుగా భావిస్తాం... విపత్తు నివారణ ప్రణాళిక సమర్పించాలని 6 నెలల నుంచి కోరినా ప్రభుత్వం ఇవ్వడం లేదని, అటువంటి ప్రణాళిక ఏదీ లేదని భావించి తీర్పు ఇవ్వాల్సి వస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ప్రణాళిక ఉందని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ చెప్పగా అది రహస్యమన్నట్లుగా మీ జేబులో పెట్టుకుంటే ఎలా తెలుస్తుందని, కోర్టుకు సమర్పించాలని ఐదు పర్యాయాలుగా ఆదేశిస్తూనే ఉన్నామంటూ అసహనం వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేసిన ప్రైవేటు ఆస్పత్రులపై ఏం చర్యలు తీసుకున్నారో నివేదికలో స్పష్టంగా పేర్కొనలేదంటూ మండిపడ్డ ధర్మాసనం.. కేసు తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. అయితే ఈ నెల 24లోగా నివేదిక సమర్పించాలని ఏజీని ఆదేశించింది. -
వరదనీరు ఆసుపత్రిలో చేరకుండా చర్యలు తీసుకోండి
హైదరాబాద్ : ఉస్మానియా ఆస్పత్రిలో వరద నీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉస్మానియా ఆస్పత్రిలో వరద నీరు, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదన్న పిల్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. వర్షం నీరు బయటకు వెళ్లే ఏర్పాట్లు సరిగా లేక ఆస్పత్రిలో నీరు నిండుతొందని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉస్మానియా ఆస్పత్రిలో వర్షం నీరు మూసీలో కలిసేలా ఏర్పాట్లు చేయాలని హైకోర్టు ఆదేశించింది. గతంలో భారీ వర్షాలు కురిసినప్పుడు రోగులు ఇబ్బంది పడ్డారని హైకోర్టు ప్రస్తావించింది. మరో వారం, పది రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. తదుపరి విచారణను నవంబరు 12కి వాయిదా వేసింది. (‘హైదరాబాద్‌లో అత్యధిక వర్షం, ఇది రెండోసారి’ ) -
ఏపీ చేస్తోంది... మీరెందుకు చేయలేరు?
సాక్షి, హైదరాబాద్: కరోనా పరీక్షల సంఖ్య అప్పుడప్పుడూ అనూహ్యంగా తగ్గినా.. తగ్గలేదంటూ తప్పుడు సమాచారంతో నివేదిక సమర్పించి ఫూల్స్‌ను చేయాలని చూస్తారా అంటూ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు ధర్మాసనం మండిపడింది. తప్పుడు సమాచారం ఇచ్చే అధికారులపై కోర్టుధిక్కరణ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తమ ఆదేశాల అమలుకు సంబంధించి ప్రభు త్వం సమర్పించిన నివేదిక అస్పష్టంగా, అసమగ్రంగా, తప్పుల తడకగా ఉందంటూ ఆగ్ర హం వ్యక్తం చేసింది. కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, వైద్య ఆరోగ్య సిబ్బం ది రక్షణకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, కరోనా బిల్లుల విషయంలో ప్రైవేటు ఆసుపత్రులపై నియంత్రణకు సంబంధించి దాఖలైన 20కి పైగా ప్రజాహితవ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్. చౌహాన్, జస్టిస్ బి. విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. తదు పరి విచారణను నవంబర్ 19కి వాయిదా వేసింది. ఏపీ చేస్తోంది... మీరెందుకు చేయలేరు? ‘‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోజుకు 1.20 లక్షల పరీక్షలు చేస్తోంది. కరోనా చికిత్స కోసం 581 ఆసుపత్రులను ఏర్పాటు చేసింది. తెలంగాణలో కేవలం 62 ఆసుపత్రులనే కరోనా చికిత్స కోసం ఏర్పాటు చేశారు. కర్ణాటకలో 1,029, తమిళనాడులో 1,809 ఆసుపత్రులను కేటాయించారు. తెలంగాణలో ఆసుపత్రుల సంఖ్యతోపాటు పరీక్షల సంఖ్యనూ గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉంది. ప్రతి వెయ్యి మందిలో ఆక్సిజన్ బెడ్స్ సంఖ్య తెలంగాణలో 1.3గానే ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం కనీసం 3 బెడ్స్ ఉండాలి. తెలంగాణలో శీతాకాలంలో కరోనా మరోసారి విజృంభించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆసుపత్రుల సంఖ్య పెంచి మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలి’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. నవంబర్ 16లోగా నివేదిక ఇవ్వండి... ‘‘బతుకమ్మ, దసరా, దీపావళి పర్వదినాల సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున సమావేశమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభు త్వం అన్ని ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలి. అలాగే కరోనా రెండో దశలో విజృంభించే అవకాశం ఉన్నందున ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. మా ఆదేశాల అమలుపై నవంబర్ 16లోగా సమగ్ర నివేదిక సమర్పించండి’’అని హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరణాల లెక్కలపై అనుమానాలు... ‘‘రాష్ట్రంలో కరోనా కేసులు వందల్లో ఉన్న రోజుల్లోనూ రోజువారీ కరోనా మరణాల సంఖ్య 10–13 మాత్రమే ఉందన్నారు. కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగినా ఇప్పుడూ అన్నే మరణాలు నమోదవుతున్నాయని మీడియా బులెటిన్‌లో పేర్కొంటున్నారు. ఇది వాస్తవ సమాచారం కాదని భావిస్తున్నాం. శ్మశానవాటికల నిర్వాహకులను రోజూ ఎన్ని కరోనా మృతదేహాలను దహనం చేస్తున్నారనే దానిపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తే వాస్తవ పరిస్థితి ఏమిటో తెలుస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటే మరణాల సంఖ్య ఎంతో తెలియాల్సిన అవసరం ఉంది. కరోనా కట్టడి చర్యల్లో వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల పనితీరు ఇలాగే ఉంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను మరోసారి వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించాల్సి ఉంటుంది’’అని ఈ కేసు విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావుకు హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను అమలు చేయండి... జూలై 1 నుంచి అక్టోబర్ 10 వరకు ఢిల్లీ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో ఎన్ని పరీక్షలు నిర్వహిస్తే ఎన్ని పాజిటివ్ కేసులు వచ్చాయి? కరోనాతో ఎందరు మరణించారనే వివరాలతోపాటు రాష్ట్రంలో అదే కాలానికి చేసిన పరీక్షలు, నమోదైన కేసులు, మరణాల సంఖ్యను గ్రాఫ్ రూపంలో నివేదిక సమర్పించండి. రాష్ట్రవ్యాప్తంగా 1,135 వెంటిలేటర్ బెడ్స్ ఉండగా ఇటీవల 135 బెడ్స్ పెంచామన్నారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పడకలు సరిపోవు, వాటిని మరింతగా పెంచండి. గాంధీ, చెస్ట్ ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను తెలిపేలా లైవ్ డ్యాష్ బోర్డులను ఏర్పాటు చేయాలన్న మా ఆదేశాలను ఇప్పటికైనా అమలు చేయండి. ప్రస్తుతమున్న 17 ఆర్టీ–పీసీఆర్ పరీక్షా కేంద్రాలకు మరో 6 కేంద్రాలను త్వరలో ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం పేర్కొన్నా ఎప్పటిలోగా ఏర్పాటు చేసేదీ చెప్పలేదు. త్వరలో అంటే రెండు రోజులా, రెండు నెలలా, రెండేళ్లా? కేసుల సంఖ్య పెరిగే అవకాశమున్న దృష్ట్యా వాటిని మరింతగా పెంచండి. ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీపై నివేదిక సమర్పించాలని ఆదేశించినా నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఎందుకు సమర్పించలేదు? తదుపరి విచారణలోగా నివేదిక సమర్పించేలా చర్యలు తీసుకోవాలి. -
అధికారుల తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారుల తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో సుదీర్ఘ విచారణ సందర్భంగా అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకపోవడంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారంటూ హైకోర్టు అభిప్రాయపడింది. అయితే విచారణకు హాజరైన వైద్యశాఖ అధికారులు రాష్ర్టంలో కరోనా తగ్గుముఖం పట్టిందని కోర్టుకు తెలిపారు. దీనికి అభ్యంతరం చెబుతూ ఎక్కువ టెస్టులు చేయనప్పుడు కరోనా కేసులు ఎలా తెలుస్తాయంటూ హైకోర్టు ప్రశ్నించింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ప్రభుత్వ టెస్ట్ ల్యాబ్స్ తక్కువగా ఉన్నాయని పేర్కొంది. తప్పుడు లెక్కలతో హైకోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. -
దేవుడికి ప్రార్థన ఎక్కడైనా చేసుకోవచ్చు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: గుడిలోనే దేవుడికి ప్రార్థనలు చేసుకోవాలని ఎక్కడ లేదని, మనసులో దేవుడు ఉంటే ఎక్కడైనా ప్రార్థన చేసుకోవచ్చని తెలంగాణ హైకోర్టు తెలిపింది. సచివాలయంలోని మసీదు కూల్చివేతపై సయ్యద్ యాసన్, మహమ్మద్ ముజాఫరుల్ల, ఖాజా అజ్జాజుదీన్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. సచివాలయంలో ఉన్న భూమి వక్ఫ్ బోర్డుకు చెందిన భూమి అని పిటిషనర్ల తరఫు న్యాయవాది పేర్కొన్నారు. కూల్చివేయడం చట్ట విరుద్ధమని పిటిషనర్లు హైకోర్టుకు తెలిపారు. 657 గజాలు ఉన్న మసీదును కూల్చివేసి 1500 చదరపు అడుగులు స్థలం కేటాయించడంపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. సచివాలయం కూల్చివేతలో భాగంగా మసీదు కూడా కూలిపోయిందని ఏజీ హైకోర్టుకు తెలియజేశారు. ప్రభుత్వ ఖర్చుతో నూతన మసీదును నిర్మిస్తామని చెప్పారు. మసీదును ఎక్కడైతే కూల్చివేశారో అక్కడే నూతనంగా మసీదు నిర్మాణం చేపట్టాలని పిటీషనర్లు కోరారు. గుడిలోనే దేవుడికి ప్రార్థనలు చేసుకోవాలని ఎక్కడ లేదని మనసులో దేవుడు ఉంటే ఎక్కడైనా ప్రార్థన చేసుకోవచ్చని హైకోర్టు పేర్కొంది. దేవుళ్లు, మతాల కంటే చట్టాలు గొప్పవని తెలిపింది. ప్రజా అవసరాల కోసం మసీదులని కుల్చే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. చట్ట ప్రకారం ప్రభుత్వాలు ఆ పని చేయవని తెలిపింది. అవసరమైతే కూల్చిన ప్రదేశానికి సంబందించి నష్ట పరిహారం చెల్లించాలని హైకోర్టు స్పష్టం చేసింది. మసీదు కూల్చితపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇక తదుపరి విచారణ అక్టోబర్ 8కి వాయిదా వేసింది. -
పదేళ్ల నుంచి ఏం చేస్తున్నారు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విద్యాహక్కు చట్టం అమలుపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. 2010 నుంచి పెండింగ్‌లో ఉన్న పలు పిల్స్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. పూర్తి వివరాలతో సోమవారం కౌంటర్ దాఖలు చేస్తామని కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలుపగా, 10 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. విద్యా హక్కు చట్టం అమలవుతుందా? లేదా? అని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది (చదవండి: రోజు పది మందే చనిపోతున్నారా?: హైకోర్టు) నిధులు, ఖర్చుల వాటాలపై కేంద్రం స్పష్టత ఇవ్వలేదని, హైకోర్టు ఆదేశించినప్పటికీ కేంద్రం తన వైఖరి వెల్లడించలేదని రాష్ట్రప్రభుత్వం పేర్కొంది. బడ్జెట్ వివాదాలను ఈనెల 17లోగా పరిష్కరించుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. మరో వాయిదా ఇచ్చేది లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోర్టు స్పష్టం చేసింది. ఈనెల 18న తుది విచారణ చేపడతామని హైకోర్టు వెల్లడించింది. (చదవండి: అది రాజ్యాంగ విరుద్ధం) -
వారిపై చర్యలు తీసుకోండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్ : బక్రీద్ సందర్భంగా అక్రమ జంతు వధ చేస్తే చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా అక్రమంగా జంతువుల రవాణా లేదా వధ చేస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది. ఒంటెల అక్రమ రవాణా, వధ నిరోధించాలని డాక్టర్ శశికళ దాఖలు చేసిన కేసుపై విచారణ నేపథ్యంలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఆదేశాలతో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో జంతు వధ కేంద్రాలను తనిఖీ చేసినట్టు తెలిపిన ప్రభుత్వం..రెండు కేసులు నమోదు చేసినట్లు పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించకూడదంటూ పేర్కొన్న హైకోర్టు.. జంతు వధ నిబంధనల ప్రకారమే జరగాలని స్పష్టం చేసింది. జంతు మాంసం ద్వారా వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని.. చైనాలో గబ్బిలాలు తినడం ద్వారా కరోనా వచ్చిందన్న ప్రచారాన్ని గుర్తుచేసింది. మాంసం దుకాణాలను జీహెచ్ఎంసీ అధికారులు ఎప్పుడైనా తనిఖీలు చేశారా అని ప్రశ్నించింది. రెండు వారాల్లో పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. (బక్రీద్ బిజినెస్ ఎలా?) -
డిగ్రీ,పీజీ పరీక్షలపై హైకోర్టు విచారణ
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ, పీజీ పరీక్షలు రద్దు చేయాలంటూ దాఖలైన పిల్‌పై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. ప్రభుత్వం తరపున ఏజీ తన వాదనలు వినిపించారు. పరీక్షలు రద్దు చేయడం కుదరదని, యూజీసీ మార్గదర్శకాల ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. పరీక్షల తేదీలను రెండు,మూడు వారాల తర్వాత ఖరారు చేస్తామని తెలిపారు. పరీక్షలు నిర్వహించకుండానే ఇంటర్నల్ మార్కుల ద్వారా గ్రేడింగ్ ఇవ్వాలని పిటిషనర్ తరపున న్యాయవాది దామోదర్‌రెడ్డి వాదనలు వినిపించారు. యూజీసీ మార్గదర్శకాలు కేవలం సూచనలు మాత్రమేనని, 8 రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు చేశారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిమ్జ్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా.. నిమ్జ్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశించింది. మామిడి గ్రామానికి చెందిన ఐదుగురు రైతులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలిపై రేపు జరగాల్సిన బహిరంగ విచారణ వాయిదా వేయాలని ధర్మాసనం తెలిపింది. కరోనా పరిస్థితుల్లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించవద్దని హైకోర్టు ఆదేశించింది. -
ట్రాన్స్జెండర్లకు రేషన్ సరుకులు ఇచ్చారా?
సాక్షి, హైదరాబాద్: ట్రాన్స్జెండర్లకు రేషన్ షాపుల్లో సరుకుల కేటాయింపునకు ప్రభుత్వం చర్యలు తీసుకుందో లేదో తెలియజేయాలని హైకోర్టు కోరింది. కరోనా సమయంలో ట్రాన్స్జెండర్లకు నిత్యావసరా లు, వసతి, వైద్యం, ప్రభుత్వ పథకాలను అమలు చేసేలా ఉత్తర్వుల జారీని కోరుతూ వైజయంతి వసంత మొగిలి (ఎం.విజయ్‌కుమార్) దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి. విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లో వివరాలు అసమగ్రంగా ఉన్నాయని, పూర్తి వివరాలు నివేదించాలని ధర్మాసనం ఆదేశించింది. వైరస్ వ్యాప్తికి గురయ్యే ట్రాన్స్జెండర్లకు వైద్య సహాయం అందించేందుకు గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డును కేటాయించే ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించాలని సూచించింది. వారిని జనరల్ వార్డులో ఉంచితే ఇతరులతో వారు సమస్యలు ఎదుర్కొనవచ్చునని వ్యాఖ్య చేసింది. ఇలా చేయడం దురదృష్టకరమని కోర్టు అభిప్రాయపడింది. అనంతరం కోర్టు కేసు విచారణ జూలై 6వ తేదీకి వాయిదా వేసింది. -
శ్రామిక్ రైళ్లను అడగడం లేదేంటి?
సాక్షి, హైదరాబాద్: వలస కార్మికుల్ని వారి రాష్ట్రాలకు పంపేందుకు రైల్వేశాఖ కోరిన వెంటనే శ్రామిక్ రైళ్లను నడిపేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఎం దుకు ఆ అవకాశాల్ని వినియోగించుకోవడం లేదని హై కోర్టు ప్రశ్నించింది. ఈ నెల 1 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం శ్రామిక్ రైళ్లు కావాలని దరఖాస్తు చేయలేదని రైల్వేశాఖ తరఫు న్యాయవాది చెప్పడంతో హైకోర్టు పైవిధంగా ప్రశ్నించింది. ఇటుక బట్టీల్లో పనిచేసే వలస కార్మికుల తరలింపునకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వాటి సంబంధిత ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ రిటైర్డ్ లెక్చరర్ జీవన్‌కుమార్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం మరోసారి విచారించింది. ఒక్క రోజులోనే శ్రామిక్ రైలు ఏర్పా టు చేస్తామని కేంద్రం చెబుతున్నా రాష్ట్రంలోని ఒక్క జిల్లా కలెక్టర్ కూడా దరఖాస్తు చేయకపోవడంపై హైకోర్టు విస్మయాన్ని వ్యక్తంచేసింది. దీనిపై పూర్తి వివరాలు బుధవారం జరిగే విచారణ సమయంలో తెలియజేయాలని రాష్ట్రాన్ని ఆదేశించింది. వివిధ జిల్లాల్లోని ఇటుక బట్టీ కార్మికులు 9 వేల మంది వరకూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకోవడంతో రైల్వేప్లాట్ ఫారాలు, రైళ్లు కిక్కిరిసిపోయాయని పిటిషనర్ న్యాయవాది వసు ధా నాగరాజ్ కోర్టు దృష్టికి తెచ్చారు. జూన్ 1 నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారని, బిహార్‌కు ఒక్క రైలును మాత్రమే నడపడంతో 24 బోగీలూ కిటకిటలాడుతూ వెళ్లాయన్నారు. దీనిపై స్పందించిన ధర్మా సనం, ఆహారం, వసతి, వై ద్యం, మరుగుదొడ్ల సౌకర్యాలను కల్పించాలని తా ము గతంలో ఇచ్చిన ఉత్తర్వులు ఎందుకు అమలు చేయట్లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తామిచ్చే ఉత్తర్వులు ప్రజాహితం కో సమేనని, చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లుగా కారాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. çకరోనాపై పి ల్స్ దాఖలైతే అవి ప్రభుత్వానికి వ్యతిరేకం కాబోవని, ప్రజాహితంగా చూడాలని సూచించింది. ప్రభు త్వ వాదనలతో కౌంటర్ దాఖలు చేసినట్టు అడ్వొ కేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ చెప్పారు. విచారణ నేటికి వాయి దా పడింది. -
‘అనంతగిరిసాగర్’ భూసేకరణ రాజ్యాంగ విరుద్ధం
సాక్షి, హైదరాబాద్: అనంతగిరిసాగర్ రిజర్వాయర్ కోసం ప్రభుత్వం రైతులతో బలవంతంగా భూసేకరణ ఒప్పందం చేయించడం రాజ్యాంగ వ్యతిరేకమని హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. పునరావాసం, పునర్నిర్మాణం పథకం పిటిషనర్లకు లభించకుం డా అధికారులు చేయడం చట్ట వ్యతిరేకమ ని వెల్లడించింది. ‘120 మంది నుంచి భూ మి తీసుకున్నప్పుడు ఉన్న ధర ప్రకారం పరిహారాన్ని తిరిగి నిర్ణయించి చెల్లించాలి. ఇప్పటికే చెల్లించిన పరి హారాన్ని పిటిషనర్ల నుంచి వసూలు చేయకూడదు. అధికారుల బలవంతంతో చేసిన ఒప్పందానికి పిటిషనర్లు కట్టుబడి ఉండక్కర్లేదు. పిటిషనర్లు ఆర్ఆర్ ప్యాకేజీ పొందడానికి అర్హులు’ అని న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం బుధవారం తీర్పునిచ్చింది. కోర్టును ఆశ్రయించిన 120 మంది.. ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా, ఒప్పంద పత్రాలపై బలవంతంగా సంతకాలు చేయించి అర్ధరాత్రి తమను దౌర్జన్యంగా అధికారులు ఇళ్ల నుంచి ఖాళీ చేయించారంటూ సిద్ది పేట జిల్లా చిన్నకొండూరు మండలం అ ల్లిపురం, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామాలకు చెందిన 120 మంది హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే విచారణ చేపట్టిన కోర్టు.. ఒప్పంద పత్రాలపై పిటిషనర్లతో బలవంతంగా సంతకాలు చేయించడం చె ల్లదని, ఆ ఒప్పందానికి పిటిషనర్లు కట్టుబడి ఉండాల్సిన అవసరంలేదని తేల్చిచెప్పింది. అధికారులు వ్యవహరించిన తీరు చట్ట వ్యతిరేకంగా ఉందని ఆక్షేపించింది. సమీపంలోని లింగారెడ్డిపల్లిలో ఎకరాకు రూ. 13 లక్షలు చొప్పున చెల్లించిన ప్రభుత్వం.. తమ భూములకు మాత్రం రూ.6.5 లక్షలు చెల్లించడం అన్యాయమని పిటిషనర్లు లేవనెత్తిన ముఖ్యమైన అంశానికి అధికారుల నుంచి జవాబు లేదంది. ఎకరాకు రూ.6.5 లక్షలు చెల్లిస్తామని పిటిషనర్లతో ఒప్పం దం చేసుకోడానికి కారణాలు చెప్పలేదని, భూపరిహారంపై ఇతరత్రా ఆధారాలు కూ డా చూపలేదని తెలిపింది. అయినా ధర విషయంలో జిల్లా కమిటీ తీర్మానం, మార్కె ట్ ధర ఎంత ఉందో కూడా ప్రభుత్వం చె ప్పలేదని అభిప్రాయపడింది. పిటిషనర్లు ఆర్ఆర్ ప్యాకేజీ, భూమి ఇతరత్రా చట్ట ప్రకారం లభించాల్సిన హక్కులను ఎందుకు వదులుకున్నారో, వాటికి ప్రభుత్వం ప్ర త్యామ్నాయం ఏం ఇస్తోందో కూడా ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లో ప్రస్తావించలేదని ధర్మాసనం తప్పుపట్టింది. ఇది సరికాదు..: కేసు విచారణ సందర్భం గా అడ్వొకేట్ జనరల్ వ్యవహారశైలిని ధర్మాసనం తప్పుపట్టింది. 4 పిటిషన్లల్లో రెండింటిలో కౌంటర్ వేసి మరో రెండింటిని స మయం మించి పోయినా దాఖలు చేయలే దు. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేయాల్సిన కారణంగా పిటిషనర్లను అత్యవసరంగా విచారించాలని ఏజీ కోరారు. తీరా ప్రధాన న్యాయమూర్తి ధ ర్మాసనం మే 11 నుంచి 17 వరకూ లేకపోయేసరికి రోస్టర్ విధానంలో తమ ముందుకొచ్చిన రిట్‌పై విచారణ అత్యవసరం కాద ని ఏజీ చెప్పారు. ఫైళ్లను చదవలేదని చెప్పి విచారణను వాయిదా వేయాలని కోరారు. పిటిషనర్ న్యాయవాది రచనారెడ్డి వాదనలు పూర్తయిన తర్వాత రోజు మే 14న వా దనలు వినిపిస్తామని ఏజీ చెప్పారు. తీరా 14న ఏజీ లాక్డౌన్ ఎత్తేసే వరకూ వాయిదా వేయాలని మెమో దాఖలు చేశారు. సుప్రీంకోర్టు సహా అన్ని హైకోర్టులు వీడియో కాన్ఫరెన్స్‌లోనే కేసుల్ని విచారిస్తున్నాయి. ఏజీ కూడా ఇదే హైకోర్టులోని ఇతర కోర్టు ల్లో ప్రభుత్వ న్యాయవాదులను పక్కన కూర్చొబెట్టుకుని వాదనలు వినిపించారు. ఈ కేసులో మాత్రం వినిపించలేదు. దీనిపై ధ ర్మాసనం స్పందిస్తూ.. ‘రోస్టర్ పద్ధతిలో కే సు తమ ముందుకు వచ్చేసరికి వాదనలు అత్యవసరం కాదని ఏజీ చెప్పడం సరికా దు. భూసేకరణ కేసుల్లో 6మాసాల్లోగా ఉ త్తర్వులు జారీ చేయాలన్న చట్ట నిబంధనల మేరకు తీర్పు వెలువరిస్తున్నాం.. వీరం దరికీ ఖర్చులుగా ప్రభుత్వం రూ.2 వేలు చొప్పున చెల్లించాలి’ అని స్పష్టం చేసింది. -
'పదో తరగతి పరీక్షల వ్యాజ్యంపై విచారణ చేపట్టండి'
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో నిర్వహించాల్సిన పదో తరగతి పరీక్షలకు సంబంధించిన వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది. ఈ మేరకు ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టును కోరారు. విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని పరీక్షల నిర్వహణకు అనుమతివ్వాలని ప్రసాద్ పేర్కొన్నారు. వైద్యుల సలహా మేరకు కరోనా నివారణకు సంబంధించిన చర్యలను ప్రభుత్వం చేపడుతుందని వెల్లడించారు. అన్ని వాదనలు విన్న హైకోర్టు ఈ నెల 19న పదో తరగతి వ్యాజ్యం విచారణ చేపడతామని స్పష్టం చేసింది. -
పేదలకు రూ.1,500 నగదు సాయం ఆపొద్దు
సాక్షి, హైదరాబాద్: వరుసగా మూడు నెలలు రేషన్ బియ్యం తీసుకోని తెల్ల రేషన్ కార్డు దారులకు రూ.1,500 నగదు సాయం ఆపేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. లాక్డౌన్ లాంటి కష్టకాలంలో నగదు సాయం ఎలా నిలిపేస్తారని ప్రశ్నించింది. మూడు సార్లు బియ్యం తీసుకున్న వారికే కాకుండా బియ్యం తీసుకోని వారికీ నగదు పంపిణీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో వరుసగా 3 నెలలు రేషన్ బియ్యం తీసుకోని వారికి రూ.1,500 నగదు సాయం నిలిపివేత అన్యాయమంటూ హైదరాబాద్‌కు చెందిన ఎ.సృజన రాసిన లేఖను హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించి బుధవారం విచారణ చేపట్టింది. లాక్డౌన్ వేళ నిత్యావసర వస్తువుల కొనుగోలుకు తెల్ల రేషన్ కార్డు దారులకు నెలకు రూ.1,500 వంతున ఆర్థిక సాయం అందించాల్సిందేనని న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ కె.లక్ష్మణ్‌ల ధర్మాసనం ఆదేశించింది. రేషన్‌కార్డుదారులకు ఇతర సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ చెప్పిన జవాబు పట్ల ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.ఈ ఏడాది మార్చి 20న జారీ చేసిన జీవో 45 ప్రకారం తెల్ల రేషన్ కార్డుదారులందరికీ రూ.1,500 వంతున అందజేయాలంది. కౌంటర్ దాఖలుకు ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం విచారణను జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది. 8 లక్షల కార్డుల్నిఎలా రద్దు చేస్తారు.. విచారణ సందర్భంగా హైకోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. ‘రాష్ట్రంలో 8 లక్షల కార్డుల్ని ఒక్కసారిగా ఎలా రద్దు చేస్తారు.. వారికి నోటీసు లేకుండా రద్దు చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. లాక్డౌన్ వేళ కార్డు లేదని బియ్యం ఇవ్వకపోయినా, నిత్యావసరాలకు నగదు పంపిణీ చేయకపోయినా ఆకలితో అలమటించే వారి సంఖ్య పెరుగుతుంది. ధనవంతులు బాగానే ఉంటారు. పేదరికంలోని వారికే దయనీయ స్థితి. కార్డుదారుల అర్హతలన్నీ చూశాకే తెల్ల కార్డుల్ని జారీ చేసినప్పుడు రద్దు చేసేప్పుడు వారి వివరణ కోరాలి కదా ’అని వ్యాఖ్యానించింది. అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. పిటిషనర్ చెబుతున్న స్థాయిలో కార్డులు రద్దు కాలేదని చెప్పారు. పూర్తి వివరాల కోసం సమయం కావాలని కోరడంతో విచారణను కోర్టు జూన్ 2కి వాయిదా పడింది. కార్డులు లేకపోయినా ఇవ్వండి లాక్డౌన్ వేళ పేదలకు రేషన్ కార్డులున్నా లేకున్నా నెలకు 12 కిలోల బియ్యాన్ని పంపిణీ చేయాలని మరో పిల్ విచారణ సందర్భంగా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెల్ల కార్డు చూపిస్తేనే రేషన్ ఇస్తామని అధికారులు చెబుతున్నారని, పెద్ద ఎత్తున రద్దు చేసిన కార్డులను పునరుద్ధరించాలని అభ్యర్థిస్తూ సామాజిక కార్యకర్త ఎస్.క్యూ మసూద్ రాసిన లేఖను హైకోర్టు పిల్‌గా పరిగణించి బుధవారం మరోసారి విచారించింది. అటవీ ప్రాంతంలోగానీ, లాక్డౌన్ అమలు ఉన్న ప్రాంతాల్లోని పేదలు, కూలీలు, వలస కార్మికులకు నిత్యావసర వస్తువుల పంపిణీకి విధిగా బయోమెట్రిక్ కింద వేలి ముద్రల కోసం ఒత్తిడి చేయరాదని, అది లేకుండానే నిత్యావసరాలు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
కుల,మత వివరాల్లేకుండా సర్టిఫికెట్లు ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: జన ధ్రువీకరణపత్రంలో కుల,మత వివరాలు లేకుండా జారీ చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా ఉప్పల్ మండలం నాచారం గ్రామానికి చెందిన జర్నలిస్టు సందేపు స్వరూప, ఎ.డేవిడ్‌లు దాఖలు చేసిన పిల్లో ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, జనన, మరణ ధ్రువీకరణ అధికారి, కొత్తకోట మున్సిపల్ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. విచారణను 4 వారాలకు వాయిదా వేస్తున్నామని, ఈలోగా కౌంటర్లు దాఖలు చేయాలని వారిని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్లు కుల,మతాలకు అతీతంగా ఇష్టపడి వివాహం చేసుకున్నారని, వారి కుమారుడు ఇవాన్ రూడే జనన పత్రంలో కులమత వివరాలు లేకుండా జారీ చేసేలా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలని వారి తరఫు న్యాయవాదులు ఎస్.వెంకన్న, డి.సురేశ్‌కుమార్‌లు వాదించారు. గతేడాది మార్చి 23న వారికి కుమారుడు పుడితే ఇప్పటి వరకూ జనన ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వలేదన్నారు. తమిళనాడుకు చెందిన న్యాయవాది ఎం.స్నేహ గతంలో ఇదే తరహాలో చేసిన ప్రయత్నాలు ఫలించాయని, స్థానిక కలెక్టర్ ఆమెకు కుల,మత వివరాలు లేకుండా «సర్టిఫికెట్ ఇచ్చారని తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన డి.వి. రామకృష్ణారావు, కృపాళి దంపతులు తమ కుమారుడిని స్కూల్లో చేర్చినప్పుడు ఏమతమో దరఖాస్తులో రాయాలని స్కూల్ యాజమాన్యం పట్టుబట్టిందని, చివరికి హైకోర్టు మందలించిన తర్వాత వారి కుమారుడికి స్కూల్లో సీటు లభించిందని న్యాయవాదులు తెలిపారు. కులం, మతం పట్ల నమ్మకం లేని వారి విశ్వాసాలను కూడా గౌరవించాలన్నారు. -
భూ ఆక్రమణ.. వాల్టా ఉల్లంఘన!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వ భూమిని ఆక్రమించడంతో పాటు నీటి వనరులను ధ్వంసం చేసినట్లు రెవెన్యూ అధికారుల విచారణలో తేలింది. ఆక్రమించిన భూమి చుట్టూ ప్రహరీ నిర్మించి గేట్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్‌కు తుది విచారణ నివేదికను రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ సమర్పించారు. శేరిలింగంపల్లి మండలం గోపనపల్లిలోని సర్వే నంబర్ 127లో 12.02 ఎకరాలకు ప్రహరీ నిర్మించినట్లు క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా వెల్లడైంది. ఈ విస్తీర్ణంలో సర్వే నంబర్ 34 పరిధిలో 1.21 ఎకరాల భూమి ఉందని తేల్చారు. బండ్లబాటగా ఉన్న మరో 10 గుంటలు నామ రూపాల్లేకుండా పోయిందని గుర్తించా రు. ఈక్రమంలో భూ ఆక్రమణల చట్టాన్ని ప్రయోగించి చర్యలు తీసుకోవచ్చని సిఫారసు చేశారు. 126 సర్వే నంబర్ పరిధి కిందికి వచ్చే కోమటికుంట చెరువులోకి నీరు వెళ్లకుండా అడ్డుకునేలా ప్రహరీ ఉందన్నారు. సదరు ప్రహరీని రేవంత్‌రెడ్డి, ఆయన సోదరులు కొండల్‌రెడ్డి, కృష్ణారెడ్డి నిర్మించినట్లు విచారణలో తేలింది. సర్వే నంబర్ 127 లో 5.21 ఎకరాలకు వారసులు/హక్కుదారులు లేరని విచారణలో బహిర్గతమైంది. కోమటికుంట చెరువు ఆక్రమణల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన శేరిలింగంపల్లి తహశీల్దార్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సర్వేనంబర్లు 127, 218, 34, 35, 160లో విస్తరించిన భూములపై విచారణ నిర్వహించారు. ఈ నివేదికను కలెక్టర్.. ప్రభుత్వానికి పంపించినట్లు తెలిసింది. ఓటుకు కోట్లు కేసులో కోర్టుకు రేవంత్ సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో నిందితుడైన మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్ రెడ్డి మంగళవారం ఏసీబీ కోర్టు ముందు హాజరయ్యారు. 2015లో ఓటుకు కోట్లు కేసులో అరెస్టయిన రేవంత్‌రెడ్డి కొన్ని నెలలు జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేయాలని ఆశ చూపుతూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు రూ.50 లక్షలు ఇస్తుండగా రేవంత్‌రెడ్డి ఏసీబీకి పట్టుబడ్డారు. ఈ కేసులో ఏ–1 నిందితుడిగా ఉన్న రేవంత్‌రెడ్డితో పాటు పలువురుపై కేసులు నమోదయ్యాయి. మంగళవారం నిందితులు ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచా రణ ఈ నెల 17వ తేదీకి వాయిదా పడింది. కేంద్రానికి దరఖాస్తు చేసుకోండి రేవంత్‌రెడ్డికి హైకోర్టు సూచన తనకు 4 ప్లస్ 4 భద్రత కల్పించేలా కేంద్రానికి మరోసారి దరఖాస్తు చేసుకోవాలని మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డికి హైకోర్టు సూచించింది. రెండు వారాల్లోగా దరఖాస్తు చేసుకుంటే అది అందిన ఆరు వారాల్లో కేంద్ర హోం శాఖ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని మంగళవారం ఆదేశాలు జారీచేసింది. ఉమ్మడి ఏపీలో 4ప్లస్4 భద్రత ఉన్న తనకు తెలంగాణ వచ్చాక టీఆర్ఎస్ ప్రభుత్వం 2ప్లస్2కు తగ్గించిందని, కేంద్ర భద్రత కల్పించాలని 2019 ఆగస్టు 28న కేంద్ర హోం శాఖకు చేసుకున్న దరఖాస్తు పెండింగ్‌లో ఉందంటూ రేవంత్ హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలీ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. -
'గుర్తింపు లేని కాలేజీలపై చర్యలు తీసుకొండి'
సాక్షి, హైదరాబాద్ : గుర్తింపులేని నారాయణ, శ్రీ చైతన్య కళాశాలలపై విచారణ చేపట్టాలని సామాజిక కార్యకర్త రాజేష్ ప్రజా దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో గుర్తింపు లేని కళాశాలలపై ఇంటర్ బోర్డు హైకోర్టుకు నివేదికను సమర్పించింది. ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసీ పొందని కాలేజీలకు షోకాజ్ నోటీసులిచ్చినట్లు తెలిపింది. అయితే మార్చి 4నుంచి ఇంటర్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో కాలేజీలు మూసివేస్తే విద్యార్థులపై ప్రభావం పడుతుందని ఇంటర్ బోర్డు హైకోర్టుకు స్పష్టం చేసింది. కాగా తాము షోకాజ్ నోటీస్‌లు జారీ చేసిన కాలేజీల్లో 29,808 మంది విద్యార్థులున్నారని, అలాగే ఎన్ఓసీ లేని కాలేజీల్లోనూ పరీక్షా కేంద్రాలు ఉన్నాయని పేర్కొంది. పరీక్షలు ముగిశాక కాలేజీలు మూసివేసేందుకు అనుమతి ఇవ్వాలని ఇంటర్ బోర్డు హైకోర్టును కోరింది. ఇంటర్ బోర్డు వాదనలు విన్న హైకోర్టు ఎన్ఓసీ లేని కాలేజీలపై చర్యలు తీసుకొని ఏప్రిల్ 3న తుది నివేదిక సమర్పించాలని ఆదేశించింది. -
ఆర్డీవో నిర్ణయం సమంజసమే
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నాదర్గుల్ భూములపై బుధవారం హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. బాలాపూర్ మండలం నాదర్గుల్ గ్రామంలోని సర్వే నెం.613లోని వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్పు చేసేందుకు ఖానాపూర్ ఆర్డీవో నిరాకరించడం సమంజసమేనని పేర్కొంది. భూముల మార్పిడి దరఖాస్తును ఆర్డీవో తోసిపుచ్చడాన్ని, భూముల్ని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో నిషేధిత జాబితా నుంచి తొలగించకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. యునైటెడ్ ల్యాండ్ మార్క్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఒమేగా డెవలప్మెంట్ వెంచర్స్ లిమిటెడ్, ఆల్ఫా హోల్డింగ్స్ కంపెనీలు దాఖలు చేసిన రిట్ పిటిషన్లను కొట్టివేస్తూ న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు బుధవారం తీర్పు చెప్పారు. సుమారు రూ.150 కోట్ల విలువైన తమ భూమి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో నిషేధిత భూముల జాబితాలో సెక్షన్ 22ఏ కింద ఉన్నాయని, ఆ జాబితా నుంచి తొలగింపునకు ఉత్తర్వులివ్వాలన్న పిటిషనర్ల అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. హక్కుదారుల నుంచి భూములు కొనుగోలు చేశామని, రెవెన్యూ రికార్డుల్లోనూ మా కంపెనీల పేర్లున్నాయని, సుప్రీంకోర్టుకు చేరిన ఈ వివాదంలో కంపెనీల హక్కుల నిర్ధారణ కూడా అయిందని కంపెనీలు వాదించాయి. వ్యవసాయేతర భూములుగా చేసేందుకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ జాబితా అడ్డంకిగా ఉందన్న అధికారుల వాదనను కొట్టేయాలని కోరాయి. అయితే, ఈ వాదనను ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. సర్వే నెంబర్ 613లో 373.22 ఎకరాలున్నాయని, ల్యాండ్ సీలింగ్ అంశంపై స్పష్టత లేదని, భూగరిష్ట చట్టం కింద క్రయవిక్రయదారుల నుంచి ఏవిధమైన డిక్లరేషన్ ఇవ్వలేదని స్పష్టంచేసింది. ఇరుపక్షాల వాదనల తర్వాత ప్రభుత్వ వాదనను ఆమోదిస్తూ ఈ పిటిషన్లను డిస్మిస్ చేస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పు చెప్పారు. -
హైకోర్టులో అప్పీల్ చేయనున్న సమత దోషులు
సాక్షి, ఆదిలాబాద్: సమత కేసులో ఉరిశిక్ష పడిన ముగ్గురు దోషులు అప్పీల్ కోసం హైకోర్టుకు వెళ్లనున్నారు. దోషులకు కోర్టు విధించిన 26 వేల రూపాయల జరిమానాను శనివారం రోజున కుటుంబ సభ్యులు చెల్లించారు. రేపు హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు తెలుస్తోంది. సమత అత్యాచారం, హత్య కేసులో షేక్ బాబు, షాక్ షాబుద్దీన్, షేక్ మగ్దుమ్‌కి ఇప్పటికే ప్రత్యేక న్యాయస్థానం ఉరి శిక్ష విధించింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సమత అత్యాచారం, హత్య కేసులో నిందితులను దోషులుగా నిర్ధారించిన ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టు.. వారికి ఉరి శిక్ష తీర్పు విధిస్తూ సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. గతేడాది నవంబర్ 24న ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం ఎల్లాపటార్‌లో సమతపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి, దారుణంగా హత్య చేశారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్‌లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి ఈ కేసులో న్యాయ మూర్తి విచారణ జరిపి మరణశిక్ష విధించారు. (‘మరణమే’ సరి..) -
కరీంనగర్ ఎన్నికలకు లైన్ క్లియర్
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. మూడు మున్సిపల్ డివిజన్లపై వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించాకే ఎన్నికలు నిర్వహించాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన అప్పీల్ పిటిషన్‌ను ధర్మాసనం అనుమతించింది. పొన్నుస్వామి కేసులో సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్, అంత కుముందు జరిగే ఎన్నికల ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకోడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం తీర్పు వెలువరించింది. అప్పీల్ పిటిషన్ తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయ వాది సంజీవ్‌కుమార్ సింగిల్ జడ్జి తీర్పు ప్రతిని ధర్మాసనానికి అందజేశారు. దానిని పరిశీలించిన అనంతరం సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. 3, 24, 25 డివిజన్లపై వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించాక ఎన్నికలు నిర్వహించాలని, ఈ ఉత్తర్వులు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దాఖలు చేసిన పిల్‌పై డివిజన్ బెంచ్ వెలువరించే తీర్పునకు లోబడి ఉంటాయని పేర్కొనడాన్ని గుర్తు చేసింది. పిల్‌ను తాము తోసిపుచ్చామని, సింగిల్ జడ్జి ఉత్తర్వులను కొనసాగించలేమని పేర్కొంది. 24న కరీంనగర్ ఎన్నిక కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు లైన్ క్లియరైంది. ఈ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లకు ఈ నెల 24న ఎన్నికల నిర్వహణతో పాటు 27 ఫలితాల ప్రకటనకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. శుక్రవారం కరీంనగర్ రిటర్నింగ్ ఆఫీసర్ ఎన్నికల నోటీస్‌ను జారీచేశాక, ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 దాకా నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. 12వ తేదీ సాయంత్రం 5 వరకు నామినేషన్లు స్వీకరణ, 13న నామినేషన్ల పరిశీలన, అది పూర్తయ్యాక చెల్లుబాటయ్యే అభ్యర్థుల నామినేషన్ల ప్రచురణ, 14న సాయంత్రం 5 గంటల దాకా తిరస్కరణకు గురైన నామినేషన్లపై అప్పీళ్ల స్వీకారం, 15న అప్పీళ్ల పరిష్కారం, 16న మధ్యాహ్నం 3 దాకా ఉపసంహరణ, మధ్యాహ్నం 3 తర్వాత అభ్యర్థుల తుదిజాబితా ప్రచురణ ఉంటుంది. 24న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల దాకా పోలింగ్ నిర్వహిస్తారు. అవసరమైతే 25న రీపోలింగ్, 27న ఫలితాలు ప్రకటిస్తారు. -
కుక్కలపై ఉన్న శ్రద్ధ పిల్లలపై ఏదీ?
సాక్షి, హైదరాబాద్: ధనవంతుల కుక్క తప్పిపోతే పోలీసులు సర్వశక్తులనూ ఒడ్డి ఆ కుక్కను పట్టుకున్నారని, అదే పేద వాళ్ల పిల్లలు అదృశ్యమైతే వాళ్ల ఆచూకీ తెలుసుకునేందుకు ఆసక్తి చూపడం లేదంటూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. గతేడాది జూబ్లీహిల్స్‌లో ఓ ధనవంతుడి కుక్క తప్పిపోతే పోలీసులు దర్యాప్తు చేసి పట్టుకుని యజమానికి అప్పగించారని, అయితే రాష్ట్రం లో పిల్లలు అదృశ్యమైన కేసుల్ని పోలీసులు మూసేస్తున్నారని పిల్లో పేర్కొన్నారు. పిల్లల అదృశ్యం కేసుల్ని పూర్తిస్థాయిలో విచారించేలా ప్రతివాదులకు ఆదేశాలివ్వాలని, మూసేసిన కేసుల్ని తెరిచి విచారణ చేపట్టేలా ఉత్తర్వులివ్వాలంటూ న్యా యవాది రాపోలు భాస్కర్ పిల్ దాఖలు చేశారు. దేశంలో ఆడ పిల్లల ఆక్రమ రవాణా జరుగుతోందని, 8,057 వేల పైచిలుకు కేసులు నమోదైతే.. అందులో తెలంగాణలో 229 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇందులో 49 కేసుల్లోనే చార్జిషీటు దాఖలు చేశారన్నారు. తెలంగాణలో 2015 నుంచి 2018 మధ్య కాలంలో 2,122 మంది పిల్లలు అదృశ్యమైతే, అందులో 1,350 మంది బాలికలు ఉన్నారన్నారు. ఇంతవరకు వీరి ఆ చూకీ తెలియలేదన్నారు. పిల్లల ఆచూకీ తెలియక మనోవేదన తో కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతు న్న ఘటనలూ ఉన్నాయన్నా రు. 2015లో 407 మంది పిల్లలు, ఆ తర్వాత మూడేళ్లలో వరసగా 474, 681, 560 మంది చొప్పున పిల్లల అదృశ్యం కేసులు నమోదైతే, వారిలో అత్యధికంగా బాలికలే 1,350 మంది ఉన్నా రని తెలిపారు. పిల్లో ప్రతివాదులుగా హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలను చేర్చారు. క్రిమినల్ కేసుల పరిష్కారం: పెండింగ్ కేసుల పరిష్కారంలో భాగంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గండికోట శ్రీదేవి 24 క్రిమినల్ పిటిషన్లు, 43 మధ్యంతర దరఖాస్తులను పరిష్కరించారని హైకోర్టు రిజిస్ట్రార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
ఎగ్జిబిషన్‌కు ఎన్వోసీలపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: నాంపల్లిలో ప్రతి ఏటా నిర్వహించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్)కు వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన నిరభ్యంతర సర్టిఫికెట్ల (ఎన్వోసీ)పై హైకోర్టు మండిపడింది. మొత్తం స్థలంలో 40 శాతం పార్కింగ్‌కు కేటాయించాలన్న నిబంధనను ఏవిధంగా అమలు చేశా రని ప్రశ్నించింది. గగన్‌విహార్, చంద్రవిహార్, ఆదాయపన్ను తదితర శాఖల భవనాల వద్ద పార్కింగ్ ఏర్పాట్లు చేశామని చెప్పడం కాదని, ఆయా శాఖల నుంచి అందుకు అనుమతులు పొందిందీ లేనిదీ చెప్పాలని ఆదేశించింది. క్షేత్రస్థాయిలో ఆయా శాఖలు తనిఖీలు చేసిన తర్వాతే ఎన్వోసీలు ఇవ్వాలని తేల్చి చెప్పింది. ఏకపక్షంగా ఎన్వోసీలు ఇస్తే ఈ ఏడాది ఎగ్జిబిషన్ నిర్వహణకు కూడా అనుమతి ఇవ్వ బోమని తెలిపింది. ఆయా శాఖల తనిఖీ నివేదికలను తమ ముందుంచాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. భారీ సంఖ్యలో ఎగ్జిబిషన్ సందర్శనకు వస్తారని, అలాంటి చోట్ల ప్రమాదం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటేనే అనుమతి ఇస్తామని పేర్కొంది. అన్ని వివరాలు మంగళవారం తమకు నివేదించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఎగ్జిబిషన్ నిర్వహణకు అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు పొందలేదని, అప్పుడు జరిగిన అగ్నిప్రమాదానికి ఎగ్జిబిషన్ సొసైటీనే కారణమని, సొసైటీ నిర్వహకులపై క్రిమినల్ కేసులను నమోదు చేసేలా పోలీసులకు ఆదేశాలివ్వాలని కోరుతూ న్యాయవాది ఖాజా ఐజాజుద్దీన్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. జనవరి 1 నుంచి ప్రారంభం కాబోయే ఎగ్జిబిషన్‌కు అనుమతిచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎన్వోసీ ఇచ్చిన ఆయా ప్రభుత్వ శాఖలు ఏ కారణాలతో నిరభ్యంతర పత్రాలు జారీ చేశారో స్పష్టం చేయకపోతే అనుమతి మంజూరు ఉండదని తేల్చి చెప్పింది. అనుమతులు పొందాల్సిన బాధ్యత ఎగ్జిబిషన్ సొసైటీ, ఆయాశాఖలదేనని చెప్పింది. ఎగ్జిబిషన్ ఏర్పాట్లపై పోలీస్ కమిషనర్ దాఖలు చేసిన కౌంటర్ పట్ల ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎగ్జిబిషన్ నిర్వహణ ఏరియాల్లో ఫుట్ పాత్ల ఆక్రమణలు తొలగించాలనే తమ ఆదేశాల్ని అమలు చేశారో లేదో చెప్పాలని పోలీసులను ఆదేశించింది. ఎన్వోసీ ఇచ్చిన అధికారులు పరిహారం ఇస్తారా? ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్‌కుమార్ కల్పించుకుని ఎగ్జిబిషన్ సమీపంలో 40 ఏళ్లుగా ఫుట్‌పాత్‌లపై నివాసం ఉంటూ వ్యాపారాలు చేసుకుంటున్నారని, ఇప్పటికిప్పుడు వాళ్లను తొలగించ డం ప్రభుత్వానికి కష్టమేనని చెప్పారు. పైగా అన్ని వర్గాల వారి నుంచి వ్యతిరేకత వస్తుందని గట్టిగా చెప్పారు. ఎగ్జిబిషన్ మైదానంలో మాక్‌డ్రిల్ నిర్వహణ జరిగిందని, ప్రమాదం జరిగితే యుద్ధప్రాతిపదికపై చర్యలు తీసుకునేందుకు జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. 1.5 లక్షల లీటర్ల సామర్థ్యం ఉన్న 2 నీటి ట్యాంకులు ఏర్పాటు చేశామని, అగ్నిప్రమాదం జరిగితే అక్కడికి తరలించేలా పైపులైన్లు వేశామన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ప్రభుత్వ అధికారులు కింది స్థాయిలో ఏం జరుగుతోందో పరిశీలన చేయకుండా గదుల్లో కూర్చుని ఎగ్జిబిషన్ నిర్వహణకు ఎన్వోసీ ఇచ్చినట్లుగా ఉందని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రమాదం జరిగితే ఎగ్జిబిషన్ సందర్శకులు ఎలా వెళ్లాలో ఏర్పాట్లు చేయాలని తేల్చి చెప్పింది. ఒక వేళ ప్రమాదం జరిగి పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరిగిందని అనుకుందాం.. (ఇలా జరగాలని అనుకోకూడదు) అప్పుడు ప్రభు త్వం ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.50 లక్షలు చొప్పున ఇవ్వాల్సి వస్తే.. ఎన్వోసీ ఇచ్చిన అధికారులు ఇస్తారా అని ధర్మాసనం నిలదీసింది. ఎగ్జిబిషన్ నిర్వహణను జోక్‌లా తీసుకోరాదని, హైకోర్టులోనే రెండు సార్లు షార్ట్‌సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగిందని, జైపూర్‌లోని హైకోర్టు బెంచ్ వద్ద కూడా ప్రమాదం జరిగిందని, లండన్‌లో అయితే ఒక్క అగ్గిపుల్ల కారణంగా సగం నగరం అగ్నికి ఆహుతి అయిందని ధర్మాసనం గుర్తు చేసింది. ఎన్వోసీలు ఇచ్చేసి చేతులు దులుపుకుంటే కుదరదని చెప్పింది. ఎన్వోసీ ఎలా ఇచ్చారో, ఏయే అంశాలపై సంతృప్తి చెందారో పూర్తి వివరాలతో మంగళవారం జరిగే విచారణ సమయంలో తమ ముందు నివేదించాలని ధర్మాసనం ఆదేశించింది. -
హైకోర్టు రిజిస్ట్రార్‌కు రీ పోస్ట్‌మార్టం రిపోర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు దిశ కేసు నిందితుల మృతదేహాలకు చేసిన రీ పోస్ట్‌మార్టం ప్రిలిమినరీ రిపోర్ట్ రిజిస్ట్రార్‌కు చేరుకుంది. మృతదేహాలకు రీ పోస్ట్‌మార్టం నిర్వహించిన ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు మంగళవారం ప్రిలిమినరీ రిపోర్టుతో పాటు చిత్రీకరించిన వీడియో సీడీని అందజేశారు. కాగా ఢిల్లీ వెళ్లిన తరువాత పూర్తిస్థాయి రిపోర్టును అందజేస్తామని ఈ మేరకు ఎయిమ్స్ వైద్య బృందం హైకోర్టుకు నివేదించింది. చదవండి: ‘మృతదేహాలకు రీ పోస్టుమార్టం పూర్తి’ -
‘మృతదేహాలకు రీ పోస్టుమార్టం పూర్తి’
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆదేశాల మేరకు దిశ కేసులోని నలుగురు నిందితుల మృతదేహాలకు సోమవారం ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు సుమారు నాలుగు గంటలకు పైగా రీ పోస్టుమార్టం తంతు పూర్తి చేశారు. అనంతరం ఫోరెన్సిక్ నిపుణులు తయారు చేసిన నేటి పోస్టుమార్టం నివేదికను హైకోర్టుకు సమర్పిస్తామని ఈ మేరకు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. శ్రవణ్‌కుమార్ తెలిపారు. మరికాసేపట్లో మృతదేహాలను తరలించే అవకాశం ఉంది. నిందితుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఇప్పటికే గాంధీ వైద్యులు రెండు ప్రత్యేక అంబులెన్స్‌లను సిద్ధం చేశారు. ఇక రెండు రోజుల్లో రీ పోస్టుమార్టం నివేదికను సీల్ట్ కవర్లో హైకోర్టు రిజిస్టార్కు అప్పగించనున్నటట్లు ఢిల్లీ ఎయిమ్స్ ఫోరెన్సిక్ డాక్టర్లు పేర్కొన్నారు. -
సుప్రీంకోర్టు వివరణ తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: పోలీసుల ఎన్కౌంటర్లో మరణించిన దిశ నిందితుల మృతదేహాలను భద్రపరిచే వ్యవహారంపై సుప్రీంకోర్టు వివరణ తీసుకొని తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ అంశాన్ని సుప్రీంకోర్టులో శుక్రవారం ఉదయం ప్రత్యేకంగా ప్రస్తావించి స్పష్టత తీసుకోవాలని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్‌ను ధర్మాసనం ఆదేశించింది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలపై విచారణను శుక్రవారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది. అప్పటివరకు నిందితుల మృతదేహాల్ని గాంధీ ఆస్పత్రిలోనే భద్రపర్చాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దిశ నిందితులను ఎన్కౌంటర్ చేసిన పోలీసులపై ఐపీసీలోని 302 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై వివిధ విచారణలను నిలుపుదల చేస్తూ సుప్రీంకోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం స్పష్టత తీసుకోనవసరం లేదు: ఏజీ అంతకుముందు అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదిస్తూ మృతదేహాల్ని భద్రపరిచినట్లు సుప్రీంకోర్టు దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి తీసుకువెళ్లారని చెప్పారు. దీనిపై లిఖితపూర్వక ఉత్తర్వులు ఏమీ లేవన్నారు. శుక్రవారం మృతదేహాల్ని తీసుకువెళ్లేందుకు నిందితుల కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉన్నారని, ఎన్‌కౌంటర్‌పై సందేహాలు లేనందున సుప్రీంకోర్టు నుంచి ప్రభుత్వం స్పష్టత తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదన్నారు. అయితే కోర్టుకు సహాయకారిగా నియమితులైన (అమికస్ క్యూరీ) సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి మాత్రం ఏజీ ప్రకటనలో స్పష్టత లేదన్నారు. దీనిపై సుప్రీంకోర్టు నుంచి ప్రభుత్వం శుక్రవారం తెలుసుకుని వివరణ తీసుకోవాలని, తదుపరి విచారణను వచ్చే సోమవారానికి (16వ తేదీకి) వాయిదా వేయాలని కోరారు. ఈ దశలో పిటిషనర్ తరఫు సుప్రీంకోర్టు న్యాయవాది వృందా గ్రోవర్ వాదిస్తూ ఎన్కౌంటర్ కేసులో సుప్రీంకోర్టు వాడిన పదాలను పరిశీలిస్తే ఎన్హెచ్ఆర్సీ, సిట్ దర్యాప్తులపై స్టే ఇచ్చిందని, హైకోర్టులోని కేసులపై కాదన్నారు. మృతదేహాల భద్రత వ్యవహారాన్ని పెండింగ్‌లో పెట్టాలని, శుక్రవారం తాము సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లి వివరణ పొందుతామని తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ‘సుప్రీంకోర్టు స్టే అంటే హైకోర్టు విచారణ సహా కావచ్చు. అయినా ‡మీడియాలో వచ్చిన కథనాలపై కాకుండా సుప్రీంకోర్టు ఉత్తర్వుల ద్వారా స్పష్టమైన వివరణ ముఖ్యం కాబట్టి ప్రభుత్వమే సుప్రీంకోర్టు నుంచి వివరణ తీసుకోవాలి’అని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
ఆ పోలీసులపై 302 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్
సాక్షి, హైదరాబాద్: ఆటవికంగా ‘దిశ’నిందితులు నలుగురిని ఎన్కౌంటర్ పేర హతమాచ్చారని, ఇందుకు బాధ్యులైన పోలీసులపై ఐపీసీలోని 302 సెక్షన్ కింద హత్యానేరం కేసులు నమోదు చేయాలని హైకోర్టులో మరో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. పీయూ సీఎల్–మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పోలీసులపై 302 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నారు. తెలుగు రాష్ట్రాలతో సంబంధం లేని ఇతర రాష్ట్రాల పోలీసులపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ఉస్మా నియా విశ్వవిద్యాలయం రిటైర్డు ప్రొఫెసర్ రామశంకరనారాయణ మేల్కొటె, రిటైర్డు లెక్చరర్ ఎస్.జీవన్‌కుమార్ సంయుక్తంగా పిల్ దాఖలు చేశారు. దిశ ఘటన తర్వాత ఏర్పడిన భావోద్వేగాల నేపథ్యంలో తక్షణ న్యాయం పేరుతో పోలీసులు నలుగురు నిందితులను బూటకపు ఎన్కౌంటర్ చేశారని పేర్కొన్నారు. ఎన్కౌంటర్లో పోలీసులు వినియోగించిన ఆయుధాలపై బాలిస్టిక్ నిపుణులతో పరీక్షలు చేయించేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటో లు, ఫోరెన్సిక్, పోస్టుమార్టం రిపోర్టులను భద్రం చేసేలా పోలీసులకు ఆదేశాలివ్వాలని పిల్లో కోరారు. అయితే ఇదే తరహాలో ఇప్పటికే దాఖలైన రెండు వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ ప్రారంభించింది. మంగళవారం మరో మూడు వ్యాజ్యాలు దాఖలు కావడంతో మొత్తం ఐదు వ్యాజ్యాలను గురువారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. ఎన్కౌంటర్ ప్రదేశాన్ని పరిశీలించిన పౌర హక్కుల నేతలు షాద్‌నగర్‌టౌన్: దిశ కేసులో నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసిన ప్రదేశాన్ని, నిందితులు దిశను దహనం చేసిన చటాన్‌పల్లి బ్రిడ్జి కింది ప్రదేశాన్ని బుధవారం పౌర హక్కుల సంఘం నాయకులు పరిశీలించారు. ఎన్కౌంటర్ ఎలా జరిగింది, హంతకులను పోలీసులు ఎక్కడ ఎన్కౌంటర్ చేశారన్న విష యాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అయితే ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం సమీపానికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు వారిని చటాన్‌పల్లి బ్రిడ్జి వద్దనే అడ్డుకున్నారు. దీంతో వారు జాతీయ రహదారిపై నుంచే ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని చూశారు. -
ఆదివాసులను ఖాళీ చేయించవద్దు
సాక్షి, హైదరాబాద్: అటవీ నివాసుల హక్కుల చట్టంలో నిర్దేశించిన విధానాన్ని పాటించకుండా అటవీ ప్రాంతాల్లో ఉండే ఆదివాసులను అక్కడి నుంచి ఖాళీ చేయించవద్దని రాష్ట్ర అటవీ శాఖ అధికారులకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం వివిధ కేసుల్లో ఆదేశాలు జారీ చేశారు. కటాఫ్ తేదీకి ముందే వారు అడవిలో నివసిస్తున్నారో లేదో నిర్ణయించే పనిని చట్టంలో నిర్దిష్ట అధికారికి అప్పగించాలని ఉందని తెలిపారు. దాని ప్రకారమే చర్యలు తీసుకోవాలని, చట్ట విధానాన్ని పాటించకుండా పిటిషనర్లను ఖాళీ చేయించవద్దని అటవీ అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లా కేడబ్ల్యూ చౌడవరం, కిస్తారాం.. మహబూబాబాద్ జిల్లా వెంకటాపురం, మడగూడెం.. కొత్తగూడెం జిల్లా లింగగూడెం, విజయవారిగూడెం ప్రాంతాలకు చెందిన పలువురు ఆదివాసీయులు దాఖలు చేసిన వ్యాజ్యాలను హైకోర్టు మంగళవారం విచారించింది. గిరిజనుల తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. అటవీ నివాసుల చట్ట నిబంధనలకు విరుద్ధంగా అటవీ అధికారులు తమను బలవంతంగా నివాస ప్రాంతాల నుంచి ఖాళీ చేయిస్తున్నారని, ఆ చట్టం ప్రకారం సంప్రదాయ అటవీ నివాసాల్లో ఉండేలా తమకు హక్కులు ఉన్నాయని తెలిపారు. తమను గిరిజనేతరులుగా ముద్ర వేసి అటవీ ప్రాంతాల నుంచి అన్యాయంగా పంపిస్తున్నారని పిటిషనర్లు వాపోయారు. అటవీ నివాసుల చట్టం గ్రామసభ అని సూచిస్తుందని, దాని ప్రకారం ఈ ప్రాంత నివాసుల జాబితాను సిద్ధం చేయాలని, ఆ జాబితాను సబ్ డివిజనల్ స్థాయిలో చట్టం కింద ఏర్పాటు చేసిన కమిటీకి పంపాల్సి ఉంటుందని వారు వాదించారు. కాగా, 2012 నుంచి ఛత్తీస్‌గఢ్ నుంచి ఈ ప్రాంతాలకు వలస వచ్చిన వారు ఆక్రమణదారులని, అటవీ చట్టం ప్రకారం వారు ఆదివాసీయులు కాదని రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేస్తే స్పందించకుండా హైకోర్టును ఆశ్రయించారని తెలిపింది. 2005 డిసెంబర్ 13 తర్వాత ఈ ప్రాంతాలకు వలస వచ్చిన వారు ఆక్రమణదారులేనని చెప్పింది. -
దిశ : గాంధీకి చేరుకున్న నిందితుల మృతదేహాలు
సాక్షి, హైదరాబాద్ : చటాన్‌పల్లి ఎన్కౌంటర్లో మరణించిన దిశ హత్యకేసు నిందితుల మృతదేహాలను సోమవారం రాత్రి మహబూబ్‌నగర్ నుంచి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలిం చారు. ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కు ల కమిషన్ విచారణ చేపట్టడంతో పాటు పలు ప్రజా సంఘాలు కోర్టులో కేసులు వేశాయి. దీనిపై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టడం, ఆ తర్వాత విచారణను గురువారానికి వాయిదా వేయడం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు భారీ బందోబస్తు మధ్య మృతదేహాలను ప్రత్యేక వాహనాల్లో గాంధీ మార్చురీకి తరలించారు. శుక్రవారం వరకు ఇక్కడే భద్రపర్చనున్నారు. మృతదేహాలు కుళ్లిపోకుండా వైద్యులు జాగ్రత్తలు తీసుకున్నారు. గాంధీ ఆస్పత్రి మార్చురీ సమీపంలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు -
ఆ మానవ మృగాన్ని ఇంకా మేపుతారా?
హన్మకొండ చౌరస్తా : ముక్కు పచ్చలారని 9 నెలల కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన మానవ మృగాన్ని ఆరు నెలలుగా జైలులో ఉంచి మేపుతూ తమను క్షోభ పెడుతున్నారని హన్మకొండకు చెందిన చిన్నారి శ్రీహిత తల్లి రచన ఆవేదన వ్యక్తం చేశారు. దిశ హంతకుల ఎన్కౌంటర్ నేపథ్యంలో శుక్రవారం ఆమె హన్మకొండలో విలేకరులతో మాట్లాడారు. తామేం ఏం పాపం చేశామని ప్రభుత్వం అన్యాయం చేస్తుందో అర్థం కావడం లేదని వాపోయారు. ఒడిలో నిద్రిస్తున్న పాపను ఎత్తుకెళ్లి అత్యంత కిరాతకానికి ఒడిగట్టిన దుర్మార్గుడిని ఉరితీయాలని జిల్లా కోర్టు తీర్పు ఇస్తే.. హైకోర్టు ఈ తీర్పును యావజ్జీవ శిక్షగా మార్చడం తమను బాధించిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన మానవ మృగాన్ని ఎన్కౌంటర్ చేయాలని.. అప్పుడే తమకు న్యాయం జరుగుతుందని.. పాప ఆత్మకు శాంతి చేకూరుతుందని రచన తెలిపారు. -
కేసులు సత్వరం పరిష్కరించాలి
సాక్షి, కరీంనగర్: న్యాయస్థానాల్లో కేసులు త్వరగా పరిష్కరించాలని, ఇందుకు న్యాయమూర్తులతోపాటు న్యాయవాదులు, కక్షిదారుల సహకరించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్‌చౌహాన్ అన్నారు. కరీంనగర్ కోర్టులో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్‌ప్లాంట్, ఫ్యామిలీ కోర్టు మినీగార్డెన్, ఈఫైలింగ్ కోర్టు విభాగాలను హైకోర్టు న్యాయమూర్తులు, కరీంనగర్ పోర్ట్‌ఫోలియో జడ్జి జస్టిస్ చల్లా కోదండరామ్, జస్టిస్ పి.నవీన్‌రావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసి సమావేశంలో మాట్లాడారు. కోర్టు భవనాలు పటిష్టంగా తయారు చేస్తున్నామన్నారు. కోర్టుల్లో చక్కని వాతవరణం నెలకొల్పి, కోర్టుకు వచ్చేవారికి ఆహ్లాదకర వాతావరణం కల్పిస్తామని తెలిపారు. కరీంనగర్ కోర్టు తెలంగాణలో ఉన్న అన్ని కోర్టులకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తమ దృష్టి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కోర్టులో అన్ని సదుపాయాలు కల్పిస్తే కోర్టుకు వచ్చే న్యాయవాదులు, కక్షిదారులకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. కేసుల సత్వర పరిష్కారానికి కావాల్సిన పరిజ్ఞానం అభివృద్ధికి న్యాయమూర్తులకు ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. జనవరిలోగా కోర్టుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా న్యాయవాదుల పరిజ్ఞానం అభివృద్ధికి వర్క్‌షాప్‌లు ఏర్పాటు చేయాలన్నారు. దీని ద్వారా చట్టాలపై లోతైన అవగాహన కలుగుతుందని అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తులు న్యాయవాదులు కక్షిదారులతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. కరీంనగర్లో కోర్టులో 762 కేసులు పెండింగ్‌లో ఉండగా మరో రెండు కోర్టుల్లో 80, 22 కేసులు దాదాపు 10 ఏళ్లకుపైగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. అనంతరం కరీంనగర్ పోర్ట్‌ఫోలియో జడ్జి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం మాట్లాడుతూ కోర్టులు సరైన సమయంలో తీర్పులు ఇవ్వకపోవడంతోనే ప్రత్యేకంగా ట్రిబ్యునల్స్ ఏర్పాటయ్యాయని గుర్తుచేశారు. నిబంధనల మేరకే న్యాయమూర్తులను నియమించడం జరుగుతుందన్నారు. హైకోర్టు పరిధిలో ఉన్న అంశాలను ఎప్పుటికప్పుడు పరిష్కారం చేస్తున్నామన్నారు. అభివృద్ధిలో మార్పు అనేది కింది స్థాయి నుంచి రావాలని, మన చేతిలో ఉన్న చిన్నచిన్న అభివృద్ధి పనులు మనం చేసుకుంటే తప్పుకాదని వివరించారు. హైకోర్టు మరో జడ్జి పి.నవీన్‌రావు మాట్లాడుతూ కోర్టులో అధునాతన మార్పులు అనందకరమన్నారు. త్వరలో మరిన్ని మార్పులు తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి మాట్లాడుతూ కరీంనగర్లో కోర్టులో నూతన మార్పులు అందరి సహకారంతో చేయగలిగామని, సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ మెంబర్ కాసుగంటి లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ కోర్టు భవనాలను ప్రముఖ కంపెనీలకు కాంట్రాక్టు అప్పగించాలని అప్పుడే దీర్ఘకాలికంగా మన్నిక ఉంటుందని, సంబందిత కంపెనీలు కూడా బాధ్యతగా పర్యవేక్షిస్తారని సూచించారు. ప్రభుత్వ విభాగాలకు అప్పగిస్తే కట్టి వదిలేస్తున్నారని తర్వాత పట్టించుకోవడం లేదని తెలిపారు. అనంతరం కేసుల విషయంలో పలు సమస్యలను హైకోర్టు న్యాయమూర్తుల దృష్టికి తీసుకెళ్లారు. కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పీవీ.రాజ్‌కుమార్ మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని కోర్టు ఆవరణలో న్యాయవాదులకు డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్, పోలీసు కమిషనర్ వీబీ.కమలాసన్‌రెడ్డి, ఫారెస్ట్ ఛీప్ కన్జర్వేటర్ అక్బర్, జగిత్యాల, సిరిసిల్ల ఎస్పీలు సింధూశర్మ, రాహుల్‌హెగ్డే వివిధ కోర్టుల న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లెంకల రాంరెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బార్ అసోసియేషన్ ప్రతినిధులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, న్యాయస్థానాల సిబ్బంది పాల్గొన్నారు. ప్రధాన న్యాయమూర్తికి ఘనస్వాగతం... ఉదయం కరీంనగర్ కోర్టుకు చేరుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్‌కు జిల్లా జడ్జి అనుపమచక్రవర్తి ఆధ్వర్యంలో కలెక్టర్సర్పరాజ్ అహ్మద్, కరీంనగర్ పోలీసు కమి షనర్ వీబీ.కమలాసన్ రెడ్డి, వరంగల్ రేంజ్ ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ అక్బర్ ఘనస్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. తర్వాత పూర్ణకుంభ స్వాగ తంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్‌ప్లాంట్, ఫ్యామిలీ కోర్టు, చైల్డ్‌ఫ్రెండ్లీ కోర్టు భవనం, మిని పార్కు ప్రారంభించారు. కోర్టు ఆరవణలో హైకోర్టు న్యాయమూర్తులు బస్టిస్ కోదండరాం, పి,నవీన్‌రావుతో కలిసి మొక్కలు నాటారు. తర్వాత నూతనంగా ఏర్పాటు చేసిన ఈ–ఫైలింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. కరీంనగర్ ది బెస్ట్... కరీంనగర్ కోర్టును ది బెస్ట్ కోర్టుగా ఆదర్శంగా నిలుపాలని ఆకాంక్షిస్తూ చక్కటి ఆహ్లాదకరమైన వాతావారణం ఏర్పాటు చేసిన జిల్లా జడ్జి అనుపమచక్రవర్తి, జిల్లా కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్‌తోపాటు ఫారెస్ట్ అధికారులపై ప్రశంసలు కురిపించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో ఉచితంగా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినందుకు కమిషనర్, సిబ్బందిని అభినందించారు. బార్ అసోసియేషన్ సభ్యులు చక్కటి క్రమశిక్షణతో ఉన్నారని చీఫ్ జస్టిస్ కితాబునిచ్చారు. అనంతరం కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్, పోలీసు కమిషనర్ వీబీ.కమలాసన్‌రెడ్డి, ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ అక్బర్, మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డికి చీఫ్ జస్టిస్ శాలువాలు కప్పి అభినందించారు. న్యాయవాదులు అంకితభావంతో పనిచేయాలి : హైకోర్టు జడ్జి కోదండరామ్ కమాన్‌చౌరస్తా(కరీంనగర్): న్యాయవాదులు వృత్తిపై అంకిత భావంతో పనిచేయాలని, సమాజంలో తమ బాధ్యత తెలుసుకుని ఎంచుకున్న పనిలో నైపుణ్యత సాధించి దేశ అభివృద్ధికి పాటుపడాలని తెలంగాణ హైకోర్టు జడ్జి, కరీంనగర్ జిల్లా ఫోర్ట్ ఫోలియో జడ్జి, జస్టిస్ కోదండరామ్ అన్నారు. కరీంనగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో రాజ్యాంగ దినోత్సవంలో భాగంగా న్యాయవాద పరిషత్ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ లాపై శనివారం ఉదయం నిర్వహించిన వర్క్‌షాప్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశం కంటే ఎన్నో దేశాలు వెనుకబడి ఉన్నాయని, చిన్నదేశాల వారు ఎంతో అంకిత భావంతో దేశంపై ప్రేమతో ఉండడం వల్లనే సింగపూర్ వంటి దేశాలు అభివృద్ధి చెందాయని తెలిపారు. దేశం నాకు ఏం ఇచ్చిందని కాదని దేశానికి నేను ఏం చేయాలో ఆలోచించాలన్నారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ , సీనియర్ న్యాయవాది కాసుగంటి లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ రెవెన్యూ చట్టాల వివరాలను న్యాయవ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలని, ప్రత్యేక రెవెన్యూ కోర్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. హైకోర్టు ప్రభుత్వ న్యాయవాది భాస్కర్‌రెడ్డి రెవెన్యూ చట్టాలపై న్యాయవాదులకు అవగాహన కల్పించారు. సమావేశంలో న్యాయవాద పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు కరూర్ మోహన్, ప్రధాన కార్యదర్శి సునీల్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూపల్లి సత్యనారాయణరావ్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణార్జునచారి, వేణుగోపాల్, బార్ కౌన్సిల్ మెంబర్ జయాకర్, కరీంనగర్ జిల్లా కోర్టు ప్రభుత్వ న్యాయవాది కేవీ వేణుగోపాల్‌రావు, వివిధ బార్ అసోసియేషన్ల అధ్యక్ష, కార్యదర్శులు, సీనియర్, జూనియర్, మహిళ న్యాయవాదులు పాల్గొన్నారు. -
మరోసారి వార్డుల పునర్విభజన
సాక్షి, నల్లగొండ : జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజన మరోసారి చేపట్టనున్నారు. పుర ఎన్నికలపై ఉన్న పిటిషన్లను శుక్రవారం హైకోర్టు సింగిల్ బెంచ్ కొట్టివేసి మళ్లీ వార్డుల పునర్విభజన చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, హాలియా మున్సిపాలిటీల్లో తిరిగి వార్డుల పునర్విభజన చేపట్టి, ఓటరు జాబితాను సరిచేయనున్నారు. మిర్యాలగూడ మున్సిపాలిటీలో 36 వార్డులుంటే 48కి పెంచారు. నల్లగొండలో 40 ఉంటే 48 చేశారు. కొత్త మున్సిపాలిటీ అయిన హాలియాలో 12వార్డులు ఏర్పాటు చేశారు. ఆయా మున్సిపాలిటీల్లో వార్డుల విభజనలో కొందరు అధికారులు.. అధికార పార్టీ వారికి అనుకూలంగా వ్యవహరించడం, ఓటరు జాబితాలో అవకతవకలు చోటు చేసుకున్నాయని విపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. ఎన్నికలను నిలుపుదల చేసి అవకతవకలను సరిచేయాలని జూలైలో కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో స్టే వచ్చింది. ఇప్పుడు స్టే ఎత్తివేయడంతోపాటు పిటిషన్లను కొట్టివేయడంతో పై మూడు మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజన పూర్తిగా రద్దు చేసి కొత్తగా ప్రక్రియ చేపట్టాల్సి ఉంది. పిటిషన్ల కొట్టివేతతో ఆశావహుల్లో చర్చ .. మున్సిపల్ ఎన్నికలపై కోర్టులో కేసులు నడవడం, పలుమార్లు వాయిదా పడడంతో ఆశావహుల్లో నిర్లిప్తత ఏర్పడింది. ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్ రావడంతో ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహుల్లో చర్చ మొదలైంది. ప్రభుత్వం అనుమతి ఇస్తే మరో 20 రోజుల్లో వార్డుల పునర్విభజన, ఓటరు జాబితా తయారీ, ఎన్నికల అధికారుల నియామకం, సరిహద్దులు గుర్తించడం, వార్డులను పెంచడం, ఎన్నికల అధికారులకు శిక్షణ, పోలింగ్స్టేషన్లను గుర్తించడంలాంటి పనులు పూర్తిచేసే అవకాశం ఉంది. -
పురపోరుకు సిద్ధం
సాక్షి, రామాయంపేట(మెదక్): ఎట్టకేలకు మున్సిపల్‌పోరుకు చిక్కులు వీడాయి. తప్పుల తడకగా వార్డుల విభజన, ఓటరు జాబితా రూపొందించారని.. ఇష్టానుసారంగా ఈ ప్రక్రియ చేపట్టారని ఆరోపిస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించిన సంగతి విధితమే.. పలు వాయిదాల అనంతరం హైకోర్టు గురువారం తుదితీర్పు వెలువరించింది. రాష్ట్రవ్యాప్తంగా 73 మున్సిపాలిటీలపై స్టే ఎత్తివేయగా, ఇందులో జిల్లాలోని మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్ మున్సిపాలిటీలున్నాయి. గత జూలైలో జారీ అయిన నోటిఫికేషన్, వార్డులు, ఓటర్‌లిస్టును రద్దుచేస్తూ, మళ్లీ మొదటి నుంచి ఈ ప్రక్రియ చేపట్టాలని కోర్టు ఆదేశించింది. 14 రోజులోపు ఈప్రక్రియ పూర్తిచేయాలని కోర్టు ఆదేశాలు జారీచేసింది. కోర్టు తీర్పు నేపథ్యంలో మళ్లీ వార్డులు, ఓటర్ లిస్టు తయారీకై మున్సిపాలిటీ అధికారులు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే పూర్తిసమాచారం సేకరించిన అధికారులు.. ఆదేశాలు జారీకాగానే రంగంలోకి దిగనున్నారు. 14 రోజుల్లో అభ్యంతరాలు, సవరణలు పూర్తిచేసి తుదిజాబితా ప్రదర్శించనున్నారు. దీంతోపాటు కొత్తగా ఏర్పాటైన వార్డులకు సంబంధించి సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం వార్డుల వారీగా తుదిజాబితా రూపొందించి కార్యాలయాల్లో ప్రదర్శించనున్నారు. అనంతరం రాజకీయ పక్ష్యాలతో సమావేశం ఏర్పాటు చేసిన అనంతరం మార్పులు, చేర్పుల తరువాతనే కొత్త జాబితా విడుదల కానుంది. మెదక్‌లో గతంలో 27 వార్డులుండగా అది 32కు పెరిగింది. దీంతో పాటు తూప్రాన్ లో 11 నుంచి 16, నర్సాపూర్‌లో 9 నుంచి 15, రామాయంపేటలో 9 నుంచి 12 వరకు వార్డులు పెరగగాయి. వీటిలో ఓటర్ లిస్టుతో పాటు వార్డులు, పోలింగ్ కేంద్రాల్లో మార్పులు జరుగనున్నాయి. ఆశావహుల సంతోషం.. కోర్టు తీర్పు నేపథ్యంలో ఆశావహులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఓటర్లు ప్రజల వద్దకు వెళ్తున్నారు. రామాయంపేటలో బీజేపీతోపాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు ఆందోళన రూపంగా ప్రజలవద్దకు వెళ్తూ వార్డుల్లో నెలకొన్న సమస్యలను ప్రస్తావిస్తున్నారు. ఇటీవలనే బీజేపీ కార్యకర్తలు వార్డుల్లో పాదయాత్ర చేపట్టి సమస్యలను గుర్తించగా, కాంగ్రెస్ నాయకులు వార్డుల వారీగా దెబ్బతిన్న రహదారులు, మురుగుకాలువల మరమ్మతు విషయమై పలుమార్లు వినతిపత్రాలు అందజేశారు. ఆదేశాల మేరకు నడుచుకుంటాం ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ చేపడుతాం. ఇప్పటి వరకు మాకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. ఓటర్‌లిస్టు, వార్డుల విభజనలో మా ర్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు తాము ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాం. – రమేశ్, మున్సిపల్ కమిషనర్, రామాయంపేట -
మున్సిపల్ ఎన్నికలకు హైకోర్ట్ గ్రీన్‌సిగ్నల్
హైదరాబాద్ : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ శుక్రవారం నాడు కీలక తీర్పు వెలువరించింది. మున్సిపల్ ఎన్నికల ముందస్తు ప్రక్రియను మళ్లీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలోని 73 మున్సిపాలిటీలపై విధించిన స్టేను కూడా హైకోర్టు ఎత్తివేసింది. వార్డుల విభజన, ఓటర్ల జాబితా సవరణపై జులైలో ఇచ్చిన ప్రభుత్వ నోటిఫికేషన్‌ను ఈ సందర్భంగా కోర్టు రద్దు చేసింది. వార్డుల విభజన, ఓటర్ల జాబితా సవరణ మళ్లీ చేపట్టాలని ఆదేశించింది. కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని కోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 14 రోజుల్లో అభ్యంతరాలు, సవరణలు ముగించాలని కోర్టు సూచించింది. -
కార్మిక న్యాయస్థానానికే బాధ్యతలు..!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టు సూచనలు చేస్తూ ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కార్మిక శాఖ చర్యలకు ఉపక్రమించింది. కార్మికుల డిమాండ్లు పరిశీలించి 2 వారాల్లో పరిష్కరించాలని, లేకుంటే కార్మిక న్యాయస్థానానికి నివేదిక ఇవ్వాలని కార్మిక శాఖ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. కార్మికుల డిమాండ్లు, సమస్యల పరిష్కారం కార్మిక శాఖ పరిధిలో పరిష్కారమవుతాయా? లేక కార్మిక న్యాయస్థానానికి బాధ్యతలు అప్పగించాలా అనేదానిపై ఆ శాఖ తర్జనభర్జన పడుతోంది. కార్మిక శాఖ పరిధిలో సమస్య పరిష్కారమవ్వని పక్షంలో కార్మిక న్యాయస్థానానికి బాధ్యతలు ఇవ్వాల్సి వస్తే.. అందుకుగల కార ణాలను స్పష్టం చేయాలి. దీంతో కార్మిక శాఖ కమిషనరేట్ యంత్రాంగం కార్మిక చట్టాలు, నిబంధనలు తదితరాలను పరిశీలిస్తోంది. తీర్పు ప్రతి రాగానే.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కార్మిక శాఖ కమిషనరేట్ పరిధిలో సాధ్యమయ్యే అవకాశాలు లేవని ఆ శాఖ భావిస్తోంది. కార్మికుల డిమాండ్లన్నీ ఆర్టీసీ యాజమాన్యం పరిధిలోనివి. ఇందులో కొన్ని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనివి. దీంతో వీటి పరిష్కారానికి కార్మిక శాఖ కంటే కార్మిక న్యాయస్థానమే సరైందని అధికారులు భావిస్తున్నారు. దీంతో సమస్య పరిష్కారం కోసం కార్మిక న్యాయస్థానాన్ని కోరేందుకు కార్మిక శాఖ కార్యాచరణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. హైకోర్టు తీర్పు ఇచ్చి 3 రోజులవుతున్నా.. కోర్టు నుంచి అధికారికంగా తీర్పు ప్రతి రాలేదు. క్రమపద్ధతిలో తీర్పు ప్రతి అందిన వెంటనే తదుపరి చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు ముందు నోటీసులు ఇచ్చిన క్రమంలో ఆర్టీసీ యాజమాన్యం, కార్మికుల మధ్య కార్మిక శాఖ సంప్రదింపులు మొదలుపెట్టింది. వాస్తవానికి ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత నిర్ణీత గడువు ముగిసినప్పుడే కార్మికులు సమ్మె చేపట్టాలి. కానీ సంప్రదింపుల సమయంలోనే కార్మికులు సమ్మెకు వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో కార్మికులు చేపట్టిన సమ్మె చట్ట విరుద్ధమా లేదా అనేది కార్మిక న్యాయస్థానం తేల్చాలి. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం 2 వారాల్లో పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించిన క్రమంలో గడువులోగా కార్మిక న్యాయస్థానానికి పూర్తి వివరాలు, ఆధారాలతో నివేదికను సమర్పించేందుకు కార్మిక శాఖ చర్యలు వేగిరం చేసింది. హైకోర్టు తీర్పు ప్రతి అందిన గంటల వ్యవధిలోనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కూడా కార్మిక శాఖ భావిస్తోంది. 6 నెలల్లో పరిష్కారం కష్టమే.. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కార అంశం కార్మిక న్యాయస్థానానికి అప్పగించేందుకు సిద్ధమవుతున్న కార్మిక శాఖ.. కార్మిక చట్టాల్లోని క్లాజ్‌ల ప్రకారం 6 నెలల వ్యవధి లో పరిష్కరించేలా సూచన చేయనుంది. వాస్తవానికి చట్టంలో పొందుపర్చిన విధంగా 6 నెలల్లో సమస్యను పరిష్కరించాల్సి ఉన్న ప్పటికీ.. ఆధారాల సమర్పణ, విచారణ అంశం అంత సులువైన ప్రక్రియ కాదని నిపుణులు చెబుతున్నారు. కార్మికుల వాదనలన్నీ కార్మిక న్యాయస్థానం ప్రత్యక్షంగా వినాల్సి ఉంటుంది. ప్రస్తుతం సమ్మెలో 48 వేలకుపైగా కార్మికులు పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ప్రతి ఒక్క కార్మికుడి వాదన వినాల్సి ఉండటంతో ఈ వ్యవధి చాలదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. దీంతో కేసు విచారణకు మరింత సమయం పట్టే అవకాశం లేకపోలేదు. -
గ్రూప్ 2 ప్రొవిజనల్ లిస్ట్‌పై హైకోర్టు స్టే
సాక్షి,హైదరాబాద్ : గ్రూప్-2 కు సంబంధించిన ఫైనల్ ప్రొవిజనల్ లిస్ట్‌పై స్టే విధించినట్లు బుధవారం హైకోర్టు తెలిపింది .తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఎలాంటి నియామకాలు చేపట్టారాదని టీఎస్‌పీఎస్సీనీ హైకోర్టు ఆదేశించింది. గతంలో గ్రూప్ 2 కేసులో హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును దిక్కరిస్తూ టీఎస్పీఎస్సీ వ్యవహరించిందని గ్రూప్ 2 అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వైట్నర్, ట్యాంపరింగ్, స్క్రాచింగ్ చేసిన అభ్యర్థులను సెలక్ట్ చేయొద్దని పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో గ్రూప్ 2 పరీక్షల్లో అందుకు సంబంధించిన జవాబులు తీసివేసి మిగిలిన వారికి ఇంటర్య్వూలలో 1:2 ప్రకారం నియామకాలు జరపాలని హైకోర్టు డివిజన్ బెంచ్ వెల్లడించింది. అయితే తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు లెక్కచేయకుండా మళ్లీ అదే అభ్యర్థులను సెలక్ట్ చేసి ప్రొవిజనల్ లిస్ట్‌ను ప్రకటించింది. దీన్ని సవాలు చేస్తూ ఫైనల్ లిస్టుకు సెలక్ట్ కాని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు టీఎస్పీఎస్సీ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఎలాంటి నియామకాలు చేపట్టరాదని హైకోర్టు తెలిపింది. కాగా, తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. -
ఆరుగురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఆరుగురు ఎమ్మెల్యేల ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్లపై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది. వారిని కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. నోటీసులు జారీ అయిన వారిలో వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకురు ఆనంద్, పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఉన్నారు. తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. రవిప్రకాశ్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ.. టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాశ్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోర్టు మరోసారి సూచించింది. వచ్చే నెల 7లోపు మరో నిర్ణయం తెలపాలని హైకోర్టు తెలిపింది. అప్పటి వరుకు రవిప్రకాష్‌పై ఉన్న స్టే కొనసాగుతుంది. తుదుపరి విచారణను కోర్టు వచ్చే నెల 7 కు వాయిదా వేసింది. -
కేంద్రం పరిష్కరించాలి..
-
ఊసరవెల్లి రంగులు మార్చినట్లు..
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో దాఖలైన పిటిషన్ల విచారణ రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తాము ఆర్టీసీకి ఎలాంటి బకాయి లేమని, బకాయిల కన్నా అదనంగా రూ.622 కోట్లు గత ఆరేళ్లలో చెల్లించామని కోర్టుకు ప్రభుత్వం నివేదించింది. ఆర్టీసీ కార్పొరేషన్‌కు బకా యిలు చెల్లించేశామని, 2014–15 సంవ త్సరం నుంచి ఇప్పటివరకు రూ.4,253.36 కోట్లు చెల్లించామని, ఇది బకాయిల కంటే అధికమని పేర్కొంది. జీహెచ్ఎంసీ కూడా రూ.1,492 కోట్ల బకాయిల్లో రూ.335 కోట్లు చెల్లించేసిందని, ప్రభుత్వం అద నంగా చెల్లించిన నేపథ్యంలో ఆర్టీసీకి జీహెచ్ఎంసీ కూడా చెల్లిం చాల్సినదేమీ లేదని వెల్ల డించింది. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించాలని, సమ్మెచేసే ఉద్యోగుల డిమాం డ్లలో న్యాయ బద్ధమైన వాటి పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా హిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘ వేంద్ర సింగ్ చౌహాన్, న్యాయ మూర్తి జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డి లతో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. కేంద్రం పరిష్కరించాలి.. విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. అసలు ఆర్టీసీ విభజన జరగ లేదని, ఆస్తులు, అప్పులను తెలంగాణ, ఏపీలకు పంపకాల వంటి ఇతర సమస్య లను కేంద్రం పరిష్కరించాల్సి ఉందని, ఆర్టీసీలో 31 శాతం వాటా కేంద్రానికి కూడా ఉందని చెప్పింది. దీంతో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ముందుగానే రీయింబర్స్మెంట్ చేస్తున్నట్లు ఆర్టీసీకి తెలిపారా.. ఇవ్వాల్సింది లేదని కూడా చెప్పారా లేదా అని ప్రశ్నించింది. పైగా ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లో కూడా ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిల్లేవని చెప్పలేదని, బకాయి ఇవ్వాలన్న ఆర్టీసీ డిమాండ్‌ను ఖండించలేదని ధర్మాసనం ఎత్తిచూపింది. ముందుగానే డబ్బులు ఇచ్చేశామని ప్రభుత్వం ఇప్పుడు చెబుతున్నందున ఆర్టీసీకి బకాయిలు రావాల్సినవి ఉన్నాయో లేదో, ఉంటే ఎంత బకాయిలు ప్రభుత్వం నుంచి రావాలో తెలియజేయాలని ఆర్టీసీ ఎండీని కోర్టు ఆదేశించింది. నాలుగు ప్రధాన డిమాండ్లకు ఆర్టీసీ విభజన కాలేదు.. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని 9వ షెడ్యూల్ ప్రకారం ఆర్టీసీ ఇప్పటికీ ఉమ్మడిగానే ఉందని, ఈ వ్యవహారం కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందని ఏజీ చెప్పారు. ‘జనాభా నిష్పత్తి ప్రకారం తెలంగాణకు 42 శాతం, ఏపీకి 58 శాతం బకాయిల్ని డబ్బు రూపంలో చెల్లించేందుకు అడ్డుంకులు ఏమున్నాయి. ఐదేళ్లుగా కేంద్రం వద్ద ఈ సమస్యను పరిష్కరించుకోకుండా ఏం చేస్తున్నారు’అని ధర్మాసనం ప్రశ్నించింది. సోమవారమే దీనిపై కేంద్రానికి లేఖ రాశామని ఏజీ జవాబు చెప్పారు. దీంతో ధర్మాసనం కేంద్రాన్ని కూడా ప్రతివాదిగా చేసింది. ఆర్టీసీలో కేంద్రానికి 31 శాతం వాటా ఉన్నందున కేంద్రం ఏం చేయదల్చిందో చెప్పాలని, ఏపీ పునర్విభజన చట్టంలోని 53వ సెక్షన్ ప్రకారం వీటి విషయంలో కేంద్ర వైఖరి తెలపాలని ఆదేశించింది. తదుపరి విచారణ నవంబర్ 1న జరుపుతామని పేర్కొంది. ఆంకెలాట ఆడుతున్నట్లు ఉంది.. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లోని అంశాల్ని పరిశీలించిన ధర్మాసనం.. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అంకెలాట ఆడుతున్నట్లు అనిపిస్తోందని ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బకాయిలు చెల్లించామని చెబుతున్నారే గానీ, బకాయి ఏమీ లేదని చెప్పట్లేదని తప్పుపట్టింది. ఇందుకు ఏజీ బదులిస్తూ.. పూర్తి వివరాలిచ్చేందుకు రెండు రోజుల సమయం కావాలంటే హైకోర్టు ఇవ్వలేదని చెప్పారు. ‘ల్యాప్‌టాప్ క్లిక్ చేస్తే పూర్తి వివరాలు అందించే ఈ రోజుల్లో ఆర్టీసీకి ఎంత మేరకు బకాయిలు చెల్లించాలో చెప్పడానికి అంత సమయం ఎందుకు? రూ.4,253 కోట్లు చెల్లించామని చెబుతున్నారు. అందులో రూ.850 కోట్లు ఆర్టీసీ అప్పు తీసుకునేందుకు ప్రభుత్వం గ్యారెంటీగా ఉండటాన్ని కూడా డబ్బు ఇచ్చినట్లు ఎలా చెబుతారు? ఆర్టీసీకి అప్పు పుట్టేందుకు ప్రభుత్వం గ్యారెంటీగా ఉంటుంది. ఆ అప్పుపై వడ్డీలో కూడా ఒక్క రూపాయి ప్రభుత్వం చెల్లించదు. అలాంటప్పుడు గ్యారంటీగా ఉన్న మొత్తాన్ని కూడా ఆర్టీసీకి ఇచ్చామని ఎలా చెబుతారు? ఎప్పుడో డబ్బులిచ్చి 2018–19లో చెల్లించాల్సినవి కూడా ఇచ్చామని ఎలా చెబుతారు’అని హైకోర్టు ప్రశ్నలు సంధించింది. ప్రజాహితంతో అధికారులు వివరాలిచ్చారని ఏజీ చెప్పగానే.. ధర్మాసనం స్పందిస్తూ.. ‘వివరాలన్నీ వేగ్గా ఉన్నాయి. క్లిస్టర్ క్లియర్‌గా లేనేలేవు. సూటిగా చెప్పే ప్రయత్నమే కనబడలేదు’అంటూ వ్యాఖ్యానించింది. బడ్జెట్ లెక్కలు చెప్పండి ‘బడ్జెట్లో ఆర్టీసీకి 2013–2019 సంవత్సరాలకు ఎంత కేటాయించారు? తాజా బడ్జెట్ ఎంత.. ఇప్పటి వరకు ఎంత విడుదల చేశారు. ఇంకా ఎంత బడ్జెట్ విడుదల చేయాల్సి ఉందో తెలపండి. ఆర్టీసీ యూనియన్ల ప్రధాన 4 డిమాండ్ల పరిష్కారానికి అవసరమైన రూ.47 కోట్లను ప్రభుత్వం విడుదల చేస్తుందో లేదో కూడా స్పష్టం చేయాలి’అని కోర్టు పేర్కొనగా.. ఆర్థికమాంద్యం నేపథ్యంలో రూ.47 కోట్లు విడుదల చేసేందుకు సమయం కావాలని ఏజీ చెప్పారు. దీంతో ధర్మాసనం వెంటనే స్పందిస్తూ.. ‘ఇటీవల జరిగిన హుజూర్నగర్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత ఆ నియోజకవర్గ అభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తామని ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులకు రూ.47 కోట్లు ఇవ్వాలంటే ఆర్థిక మాంద్యమని చెబుతున్నారు. ఆర్టీసీ కూడా ప్రజల కోసమే పనిచేస్తోంది. విద్య, వైద్యం, సంక్షేమ కార్యక్రమాలకే ఆదాయం సరిపోతోందని ప్రభుత్వం చెబుతోంది. మరి ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఆర్టీసీ లేదా? గిరిజనులు, మహిళలు, పిల్లలు, పేద, మధ్యతరగతి వారంతా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తారు’అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆర్టీసీకి బడ్జెట్లో కేటాయించిన రూ.550 కోట్లకు రూ.425 కోట్లు ప్రభుత్వం చెల్లించిందని, మిగిలిన రూ.125 కోట్టు వచ్చే మార్చిలోగా విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఏజీ చెప్పారు. ఊసరవెల్లి రంగులు మార్చినట్లు.. పిటిషనర్ తరఫు న్యాయవాది కృష్ణయ్య వాదనలు వినిపిస్తూ.. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించాలని, ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేలా ఉత్తర్వులు ఇవ్వాలని పలుసార్లు కోరారు. సమ్మె చట్ట విరుద్ధమంటూనే, ఆర్టీసీ కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో చనిపోతున్నారంటూ పరస్పర విరుద్ధంగా చెప్పడం ఊసర వెల్లి రంగులు మార్చినట్లుగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. సమ్మె విరమించాలని ఆదేశిస్తే కార్మికులు ఏం చేస్తారో.. సమ్మె చట్ట విరుద్ధమంటే ఏమవుతుందో కూడా ఆలోచించాలని హితవు పలికంది. రాష్ట్ర ప్రభుత్వ వాదనపై ఆర్టీసీ వైఖరిని తెలిపేందుకు సోమవారం వరకు గడువు కావాలని ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సెల్ శ్రీనివాసన్ అయ్యంగార్ కోరగా అందుకు ధర్మాసనం అంగీకరించలేదు. కానుకకు జవాబుదారీ ఉంటుందా? ఆర్టీసీ బకాయిలు ముందుగానే చెల్లించేశామని ప్రభుత్వం చెప్పడంతో ఆ విషయాన్ని ముందుగానే కార్పొరేషన్‌కు చెప్పారా అని ప్రశ్నిస్తూ ‘మీకు నేను రూ.3 లక్షలు అప్పు ఉన్నాను. మీ కుమార్తె వివాహానికి నేను అప్పుతో కలిపి ప్రేమతో రూ.5 లక్షలు ఇచ్చాను. అప్పు పోను మిగిలిన రూ.2 లక్షలు కానుక అనుకుంటారు కదా? మరి ఆ రూ.2 లక్షలకు ఇప్పుడు మీరు జవాబుదారీ అని నేను అంటే ఎలా? అని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన జవాబు రాలేదు. -
మద్దిలేటిని కోర్టులో హాజరుపర్చాలి
సాక్షి, హైదరాబాద్: సీపీఐ మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో మక్తల్‌కు చెందిన తెలంగాణ విద్యార్థి వేదిక (టీవీవీ) రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటి, తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట ఉపాధ్యక్షుడు నలమాస కృష్ణలను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. బాగ్‌లింగంపల్లిలోని టీపీఎఫ్ ఆఫీసులో ఓ రౌండ్‌టేబుల్ సమావేశానికి హాజరైన వీరిద్దరిని పోలీసులు నేరుగా కస్టడీలోకి తీసుకొన్నారు. నిషేధిత మావోయిస్ట్ పార్టీతో సంబంధాలు ఉండటమేగాక, చురుకైన కార్యకర్తలుగా పనిచేస్తూ.. కొత్త క్యాడర్‌ను నియమించడం, నిధులను సేకరించడం వంటివి చేస్తున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో మావోయిస్ట్ పార్టీ నిర్వహించే బంద్‌లు, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు మద్దతిస్తున్నారని, అందుకే నిందితులను అరెస్ట్ చేశామని గద్వాల్ పోలీసులు పేర్కొన్నారు. దీంతో అరెస్ట్ చేసిన నలమాస కృష్ణ, మద్దిలేటిని కోర్టులో హాజరు పర్చాలని వారి బంధువులు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. అరెస్ట్‌లపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టనుంది. -
అధిక చార్జీలు వసూలు చేయనీయకండి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె విరమింపజేయాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగినా మధ్యంతర ఉత్తర్వులు ఏమీ జారీ కాలేదు. సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా నడుపుతున్న బస్సుల్లో అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని వాట్సాప్ మెసేజ్‌లు వస్తున్నాయని ధర్మాస నం తెలిపింది. అధిక చార్జీలు, బస్ పాసులున్న వారి నుంచి కూడా టికెట్ డబ్బులు వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి మౌఖిక ఆదేశాలిచ్చింది. సమ్మె విరమించేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషనర్ న్యాయవాది పలుమార్లు కోరితే.. ప్రజలేమీ ఇబ్బందులు పడటం లేదని, సమ్మె నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ప్రభు త్వం చెప్పింది. సమ్మె చట్ట విరుద్ధమని, క్రమశిక్షణా చర్యలు తప్పవంటూ ప్రభుత్వం చేసిన వాదనను ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్, ఆర్టీసీ ఉద్యోగుల, కార్మిక సంఘం జేఏసీల తరఫు న్యాయవాదులు వ్యతిరే కించారు. మధ్యంతర ఆదేశాల ప్రతిపాదనపై ఏమంటా రని ధర్మాసనం ప్రశ్నిస్తే.. వాయిదా వేయాలని యూనియన్ల తరఫు న్యాయవాదులు, మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని ప్రభుత్వం చెప్పింది. దీంతో ప్రభుత్వం, ఆర్టీసీ, సంఘం, జేఏసీ ఇతర ప్రతివాదులు కౌంటర్ పిటి షన్లు దాఖలు చేయాలని ఆదేశించి విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సమ్మె తర్వాత చేసిన ఏర్పాట్లపై ప్రభుత్వం సమర్పించిన నివేదిక అసమగ్రంగా ఉందని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రయాణికులు వస్తే బస్సులు రెడీ: అదనపు ఏజీ ఉస్మానియా విశ్వవిద్యాలయం రీసెర్చ్ స్కాలర్ ఆర్.సుబేందర్‌సింగ్ దాఖలు చేసిన పిల్‌పై గురువారం మరోసారి వాదనలు జరిగాయి. తొలుత అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు వాదిస్తూ.. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని, ప్రయాణికుల సమస్యల కోణంలో ఏమాత్రం ఆలోచన చేయకుండా సమ్మెకు దిగారని చెప్పా రు. సమ్మె ప్రభావం ప్రయాణికులపై పడకుండా ఉం డేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామన్నారు. డిపోల్లో బస్సులు, డ్రైవర్లు, కండక్టర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పగా.. ధర్మాసనం కల్పించుకుంటూ ‘అయితే ప్రయాణికులే లేరంటారా..’ అని వ్యాఖ్య చేయడంతో అందరూ నవ్వారు. ప్రయాణికులు ఎంతమంది వచ్చినా వారికి సరిపడేలా బస్సులు నడుపుతామని అదనపు ఏజీ చెప్పారు. ధర్మాసనం కల్పించుకుని.. తాము హైకోర్టుకు వస్తుంటే బస్సులు కనబడలేదన్నారు. దీనిపై అదనపు ఏజీ జవాబిస్తూ.. దసరా పండుగ ప్రభావం వల్ల ప్రయాణికులు లేరని చెబితే.. పండుగ సందడి నిన్ననే అయిపోయిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సమ్మె చట్ట విరుద్ధం.. సమ్మె చట్ట విరుద్ధమని, కార్మిక వివాదాలపై హైకోర్టును ఆశ్రయించకూడదని, కార్మికశాఖలోని సంబంధిత అధీకృత అధికారి వద్ద చెప్పుకోవాలని అదనపు ఏజీ అన్నారు. అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ వాదిస్తూ.. పిల్ వెనుక ప్రజాహితమేమీ లేదని, కార్మిక సంఘ నేతల హితం కోరే పిల్ దాఖలు చేశారని చెప్పారు. బస్సుల్ని నడుపుతుంటే అడ్డుకోవడం ద్వారా ఆర్టీసీ కార్మికులకు ప్రయాణికుల సౌకర్యాల కల్పనపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని స్పష్టమవుతోందన్నారు. సమ్మె చట్టను విరమింపునకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది పి.వి.కృష్ణయ్య కోరారు. ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి తరఫున సీనియర్ న్యాయవాది దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదిస్తూ.. సమ్మె చట్ట విరుద్ధమని ప్రభుత్వ చేస్తున్న వాదనను తోసిపుచ్చారు. నిధుల్ని వాడుకున్నారు.. జేఏసీ తరఫు న్యాయ వాది రచనారెడ్డి వాదిస్తూ.. పనిచేసిన కాలానికి జీతాలు చెల్లించకపోవడమేమిటో అర్థం కావడం లేదన్నారు. పీఎఫ్, కోఆపరేటివ్ సొసైటీ ఫండ్స్ రూ.545 కోట్లను ప్రభుత్వం తీసేసుకుందని, ఎంతోమందికి ఆర్టీసీలో ప్రభుత్వం రాయితీలిస్తూ ఆ మొత్తాల్ని చెల్లించకుండా ఆర్టీసీ ఆర్థికంగా దెబ్బతినేలా చేసిందన్నారు. -
1998 డీఎస్సీ అర్హులకు పోస్టులు ఇవ్వాల్సిందే
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి 1998లో నిర్వహించిన డీఎస్సీలో ఎంపికైన ప్రతిభావంతుల జాబితాలోని అర్హులను ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్లో భర్తీ చేయాలని హైకోర్టు తేల్చిచెప్పింది. దీనిపై ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ 2009 డిసెంబర్ 4న ఇచ్చిన ఉత్తర్వుల్ని 4 వారాల్లోగా అమలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం ఇటీవల ఆదేశించింది. ట్రిబ్యునల్ ఆదేశాల్ని అమలు చేయాల్సిందేనన్న హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన కోర్టు ధిక్కార కేసులను ఇటీవల సింగిల్ జడ్జి జస్టిస్ నవీన్‌రావు విచారించారు. అనంతరం నాలుగు జిల్లాల విద్యాధికారులకు (డీఈవో)లకు 2 నెలల జైలు శిక్ష, రూ.2 వేలు చొప్పున జరిమానా విధించిన విషయం విదితమే. ఈ శిక్షలపై కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల డీఈవోలు దాఖలు చేసిన అప్పీళ్లను ధర్మాసనం ఇటీవల విచారించింది. 4 వారాల్లోగా 1998 డీఎస్సీ అర్హులను ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్లో భర్తీ చేయాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. అప్పటి వరకూ సింగిల్ జడ్జి విధించిన జైలు శిక్ష, జరిమానాల అమలును నిలుపుదల చేసింది.