సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కళాశాలలకు హైకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా.. అభ్యంతరం లేదంటూ(ఎన్‌ఓసీ) సర్టిఫికెట్ జారీ చేయకుండా ఇంజనీరింగ్ కళాశాలల్లో కొత్త కోర్సులు, సీట్ల పెంపు సాధ్యం కాదని తేల్చిచెప్పింది. సుప్రీంకోర్టు గత ఉత్తర్వులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయని స్పష్టం చేసింది. పిటిషన్లలో ఎలాంటి మెరిట్ లేని కారణంగా పిటిషనర్లకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేమని పేర్కొంది.
ఈ మేరకు దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు చెప్పింది. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా యూనివర్సిటీలు అఫిలియేషన్ ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించడం అవసరమని తెలిపింది. ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్ సీఎస్‌ఈ డేటా సైన్స్‌స్, సీఎస్‌ఈ సైబర్ సెక్యూరిటీ, సీఎస్‌ఈ ఏఐఎంల్, ఐటీ తదితర కొత్త కోర్సులకు ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) అనుమతి ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదంటూ చెరబుద్ది ఎడ్యుకేషనల్ సొసైటీ సహా పలు కాలేజీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.
దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ ఇవ్వాల్సి వస్తుందనే కారణంతోనే కాలేజీల్లో కొత్త కోర్సులకు అనుమతి ఇవ్వడం లేదని పేర్కొన్నారు. సామాజిక కోర్సుల్లో విద్యార్థులు చేరడం లేదని.. దీంతో కొత్త కోర్సుల ప్రాముఖ్యత పెరిగిందన్నారు. ఈ క్రమంలో ఆయా కోర్సులను అనుమతి ఇవ్వాలని కోరారు. ఏఐసీటీఈ అనుమతి ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం దాదాపు 4000 సీట్లపై ప్రభావం చూపుతుందని, ఇది సరికాదన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనం ఇవ్వడం.. ఇవ్వకపోవడం ప్రభుత్వ ఇష్టమని.. అయితే కోర్సులకు మాత్రం అనుమతి ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయా కాలేజీల్లో కొత్త కోర్సులకు అనుమతి ఇస్తే తమకెలాంటి అభ్యంతరం లేదని జేఎన్‌టీయూ తరఫు న్యాయవాది మయూర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జీపీ, ఏఐసీటీఈ తరఫున ముద్దు విజయ్, టీఎస్ ఎంసెట్ కనీ్వనర్ తరఫున సీ.వాణి రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వ అనుమతి లేనిదే సీట్ల పెంపు సాధ్యం కాదని తేల్చిచెబుతూ ఉత్తర్వులు వెలువరించింది.
చదవండి: అదో చిన్న సమస్య..పెద్దది చేయొద్దు: మంత్రి మల్లారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment