
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల పట్ల దయగా ఉండాల్సిందేనని రైల్వేశాఖకు హైకోర్టు సూచించింది. 26 ఏళ్లుగా రిమార్కు లేని ఉద్యోగి చనిపోతే, ఆయన భార్యని పట్టించుకోరా అని ప్రశ్నించింది. ఆమెకు పరిహారమివ్వాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు ఈ కేసులో ముడిపడి ఉన్న అసాధారణ వాస్తవాల ఆధారంగానే ఇస్తున్నామని, ఈ ఆదేశాలను భవిష్యత్తులో ఓ ఉదాహరణగా తీసుకోవడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.
రుక్ష్మిణీబాయి న్యాయ పోరాటం
పి.దిగంబర్ రైల్వేశాఖలో ట్రాక్‌మ్యాన్‌గా పనిచేశారు. 26 ఏళ్ల సర్వీసులో ఒక్క రిమార్క్ కూడా లేదు. విధి నిర్వహణలో ఉండగానే 2009లో దారుణ హత్యకు గురయ్యారు. దీంతో ఆయన భార్య రుక్ష్మిణీ బాయి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని 2014లో రైల్వే అధికారులకు దరఖాస్తు పెట్టుకున్నారు. వారు స్పందించకపోవడంతో 2015లో ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. రుక్ష్మిణీబాయికి కారుణ్య నియామకం కింద ఉద్యోగమైనా లేదా పరిహారమైనా ఇవ్వాలంటూ ట్రిబ్యునల్ ఆదేశించింది. వీటిపై రైల్వేశాఖ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి తీర్పు వెలువరించింది.
‘దిగంబర్ 26 సంవత్సరాలు నిబద్ధతతో తన విధులను నిర్వర్తించాడు. దురదృష్టవశాత్తు మరో పదేళ్ల సర్వీసు ఉండగానే హత్యకు గురయ్యాడు. ఓ వితంతువు బాధ, పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. భర్త చనిపోవడంతో ఆమె ప్రతిరోజూ ప్రమాదాల మధ్యనే బతుకు వెళ్లదీస్తుంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో రైల్వేశాఖకు ట్రిబ్యునల్ ఇచ్చిన రెండు ఆప్షన్లు సమర్థనీయమైనవే’ అని తెలిపింది.
చిన్న సంకేతాలే మనోస్థైర్యాన్ని ఇస్తాయి
‘కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వడం సాధ్యం కాదన్నప్పుడు, ఆమెకు పరిహారం ఇచ్చేందుకు తమ వద్ద ఎటువంటి నిధులుగానీ, సంక్షేమ నిధులుగానీ లేవని రైల్వే అధికారులు చెప్పజాలరు. తమతో పనిచేస్తున్నంతకాలం మీరంతా సురక్షితమేనన్న భావన ఉద్యోగులకు కల్పించేందుకు యజమాని ఓ మైలుదూరం ఎక్కువ నడిచినా నష్టమేమీ లేదు. రుక్ష్మిణీబాయి వంటి వారి విషయంలో రైల్వేశాఖ ఒకింత దాతృత్వంతో వ్యవహరించి పరిహారం చెల్లిస్తే, అది మిగిలిన ఉద్యోగుల మనోస్థైర్యాన్ని పెంచుతుంది. కొన్ని సందర్భాల్లో యాజమాన్యం ఇచ్చే చిన్న సంకేతాలే ఉద్యోగుల్లో గొప్ప మనోస్థైర్యాన్ని నింపుతాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని రుక్ష్మిణీబాయికి రైల్వేశాఖ తగిన పరిహారం చెల్లిస్తుందని ఆశిస్తున్నాం’అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment