
Photo Courtesy: BCCI
ఐపీఎల్-2025 సీజన్‌లో భాగంగా నిన్న (మార్చి 28) జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ, సీఎస్‌కే తలపడ్డాయి. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ అన్ని విభాగాల్లో సత్తా చాటి సీజన్‌లో వరుసగా రెండో విజయం నమోదు చేసింది. సీజన్ ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్‌ను మట్టికరిపించిన విషయం తెలిసిందే. రెండు వరుస విజయాల తర్వాత ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
సీఎస్‌కేతో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. రజత్ పాటిదార్ (32 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), ఫిల్ సాల్ట్ (16 బంతుల్లో 32; 5 ఫోర్లు, సిక్స్), పడిక్కల్ (14 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (8 బంతుల్లో 22 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. సీఎస్‌కే బౌలర్లలో నూర్ అహ్మద్ (4-0-36-3), పతిరణ (4-0-36-2), ఖలీల్ అహ్మద్ (4-0-28-1) బాగానే బౌలింగ్ చేసినా అశ్విన్ (2-0-22-1), జడ్డూ (3-0-37-0) సామర్థ్యం మేరకు రాణించలేక ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో సీఎస్‌కే ఆదిలోనే చేతులెత్తేసింది. 8 పరుగులకే (రెండో ఓవర్‌లో) 2 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు.. ఆతర్వాత కూడా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేశారు. హాజిల్‌వుడ్ (4-0-21-3), లవింగ్‌స్టోన్ (4-0-28-2), యశ్ దయాల్ (3-0-18-2) వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ చేసి సీఎస్‌కేను కట్టడి చేశారు. ఫలితంగా ఆర్సీబీ సీఎస్‌కేను 17 ఏళ్ల తర్వాత వారి సొంత ఇలాకాలో ఓడించింది. సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో రచిన్ రవీంద్ర (41) టాప్ స్కోరర్‌గా నిలువగా.. ఆఖర్లో ధోని (16 బంతుల్లో 30 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టు విజయానికి ఉపయోగపడని మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
ఈ మ్యాచ్‌లో అర్ద సెంచరీ సాధించిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. తదుపరి మ్యాచ్‌లో ఆర్సీబీ గుజరాత్ టైటాన్సను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 2న ఆర్సీబీ సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో జరుగనుంది. సీఎస్‌కే విషయానికొస్తే.. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసిన ఈ జట్టు.. తమ మూడో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్ మార్చి 30న గౌహతిలో జరుగనుంది.
భువీ వరల్డ్ రికార్డు
ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వరల్డ్ రికార్డు సాధించాడు. టీ20ల్లో ఓ జట్టు తరఫున ఆడేందుకు అత్యధిక గ్యాప్ తీసుకున్న ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 2009లో ఆర్సీబీ తరఫున తన ఆఖరి మ్యాచ్ ఆడిన భువీ.. 238 మ్యాచ్‌ల తర్వాత మళ్లీ ఆ జట్టుకు (ఐపీఎల్ 2025లో సీఎస్‌కేతో మ్యాచ్) ఆడాడు.
దాదాపు 16 ఏళ్లు ఆర్సీబీకి దూరం ఉన్న భువీ.. ఈ సీజన్ మెగా వేలంలో తిరిగి ఆర్సీబీ పంచన చేరాడు. 35 ఏళ్ల ఈ మీరట్ బౌలర్‌ను ఆర్సీబీ ఈ సీజన్ మెగా వేలంలో రూ. 10.75 కోట్లకు దక్కించుకుంది. 2009లో ఆర్సీబీ వీడాక భువీ పూణే వారియర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడాడు. భువీ సన్‌రైజర్స్‌కు పదేళ్లు ప్రాతినిథ్యం వహించాడు. భువీ.. 2016 సీజన్‌లో టైటిల్ గెలిచిన సన్‌రైజర్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఆ సీజన్‌లో అతను 23 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా నిలిచాడు.
టీ20ల్లో ఓ జట్టు తరఫున ఆడేందుకు అత్యధిక గ్యాప్ (మ్యాచ్‌లు) తీసుకున్న ఆటగాళ్లు..
238 మ్యాచ్‌లు - RCB తరపున భువనేశ్వర్ కుమార్ (2009-2025)*
225 - RCB తరపున కర్ణ్ శర్మ (2009-2023)
206 - KKR తరపున మన్‌దీప్ సింగ్ (2010-2023)
164 - హాంప్‌షైర్ తరపున బెన్నీ హోవెల్ (2011-2023)
155 - DD/DC తరపున శిఖర్ ధవన్ (2008-2019)