
రోహిత్‌ను ఆలింగనం చేసుకున్న పంత్ (Photo Courtesy: MI 'X' Video)
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్-2025 (IPL 2025)లో ఇప్పటి వరకు తన మార్కు చూపలేకపోయాడు. ముంబై ఇండియన్స్ తరఫున ఈ సీజన్‌లో మూడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఈ ఓపెనింగ్ బ్యాటర్.. మొత్తంగా కేవలం 21 పరుగులే చేశాడు.
తమ తొలి మ్యాచ్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్‌తో పోరులో డకౌట్ అయిన రోహిత్.. గుజరాత్ టైటాన్స్‌పై ఎనిమిది పరుగులకే పెవిలియన్ చేరాడు. చివరగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో పదమూడు పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ (Rohit Sharma) బ్యాటింగ్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక ముంబై ఇండియన్స్ తదుపరి శుక్రవారం నాటి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ఇందుకోసం ఇప్పటికే లక్నోలోని ఏకనా స్టేడియంలో కసరత్తు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో లక్నో మెంటార్, టీమిండియా పేస్ దిగ్గజం జహీర్ ఖాన్ (Zaheetr Khan)తో రోహిత్ శర్మ జరిపిన సంభాషణ వైరల్‌గా మారింది.
ఏం చేయాలో.. అది సరిగ్గానే చేశాను
‘‘నేనేం చేయాలో అది సరిగ్గానే చేశాను. గతంలో చాలానే చేశాను. ఇప్పుడు కొత్త చేయాల్సింది ఏమీ లేదు’’ అని రోహిత్ జహీర్‌తో అన్నాడు. ఇంతలో లక్నో కెప్టెన్, టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ వచ్చి వెనుక నుంచి రోహిత్ శర్మను ఆలింగనం చేసుకున్నాడు. ఈ క్రమంలో చిన్నగా స్మైల్ ఇస్తూనే రోహిత్ సీరియస్‌గా తన సంభాషణను కొనసాగించాడు.
ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. కాగా ఐపీఎల్-2025లో రోహిత్ వరుస వైఫల్యాల నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ గట్టిగానే విమర్శించాడు.
మూస పద్ధతులకే పరిమితమైతే కుదరదు
‘‘రోహిత్ ప్రస్తుతం గడ్డు దశను ఎదుర్కొంటున్నాడు. గత మూడు- నాలుగేళ్ల క్రితం ఉన్న పస ఇప్పుడు తన బ్యాటింగ్‌లో లేదు. ప్రతి ఉదయం కొత్తదే. అత్యుత్తమంగా రాణించాలంటే కఠినంగా శ్రమించకతప్పదు.
పరిస్థితులు అతడి చేజారిపోయాయి. ఇప్పటికీ తన సహజమైన ప్రతిభ, మూస పద్ధతులకే పరిమితమైతే కుదరదు’’ అని మంజ్రేకర్ ఘాటు విమర్శలు చేశాడు. ఈ నేపథ్యంలో రోహిత్ జహీర్‌తో అన్న మాటలను మంజ్రేకర్‌కు ఆపాదిస్తూ నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
ఘనమైన చరిత్ర
ఇదిలా ఉంటే.. గతేడాది ముంబై ఇండియన్స్.. కెప్టెన్‌గా రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. ఈ క్రమంలో 2025లో అతడు జట్టును వీడతాడనే ప్రచారం జరిగినా.. హిట్‌మ్యాన్ ముంబైతోనే కొనసాగుతున్నాడు.
కాగా ముంబైకి ఐదుసార్లు ట్రోఫీ అందించిన చరిత్ర రోహిత్ శర్మకు ఉంది. క్యాష్ రిచ్ లీగ్‌లో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి సారథి కూడా అతడే. ఇక ఐపీఎల్‌లో రోహిత్ శర్మ ఇప్పటి వరకు 260 మ్యాచ్‌లు ఆడి 6649 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు కూడా ఉన్నాయి.
చదవండి: జట్టు మారనున్న తిలక్ వర్మ?.. HCA స్పందన ఇదే
Q: For how long are you going to watch this reel? 😍
A: Haaanjiiii 🫂💙#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL #LSGvMI pic.twitter.com/e2oxVieoz2— Mumbai Indians (@mipaltan) April 3, 2025