
17 ఏళ్ల తర్వాత చెపాక్‌లో ఆర్‌సీబీ విజయం
50 పరుగులతో ఓడిన సూపర్ కింగ్స్
పాటీదార్ అర్ధసెంచరీ, రాణించిన బౌలర్లు
ఎప్పుడో 2008లో తొలి ఐపీఎల్‌లో చెపాక్ మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గెలిచింది. ఆ తర్వాత ఈ మైదానంలో తలపడిన ఎనిమిది మ్యాచుల్లోనూ చెన్నై చేతిలో ఓటమిపాలైంది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఎట్టకేలకు చెన్నై గడ్డపై సీఎస్‌కేపై ఆర్‌సీబీ పైచేయి సాధించింది. ముందుగా బ్యాటింగ్‌లో మెరుగైన స్కోరు సాధించిన బెంగళూరు, ఆపై పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని పూర్తిగా కట్టిపడేసింది. స్పిన్నర్ల రాజ్యం సాగే నెమ్మదైన తన సొంత మైదానంలో చెన్నై జట్టు ప్రభావం చూపించ లేకపోగా...స్ఫూర్తిదాయక బౌలింగ్ ప్రదర్శనతో ఆర్‌సీబీ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.
చెన్నై: ఐపీఎల్ సీజన్‌లో బెంగళూరు వరుసగా రెండు ప్రత్యర్థి వేదికలపై వరుస విజయాలు అందుకుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 50 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాయల్ చాలెంజర్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రజత్ పాటీదార్ (32 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా...ఫిల్ సాల్ట్ (16 బంతుల్లో 32; 5 ఫోర్లు, 1 సిక్స్), విరాట్ కోహ్లి (30 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్లకు 146 పరుగులకే పరిమితమైంది. రచిన్ రవీంద్ర (31 బంతుల్లో 41; 5 ఫోర్లు), ఎమ్మెస్ ధోని (16 బంతుల్లో 30 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు.
పాటీదార్ అర్ధ సెంచరీ...
ఓపెనర్ సాల్ట్ దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించగా, మరో ఎండ్‌లో కోహ్లి మాత్రం కాస్త తడబడ్డాడు. తన స్థాయికి తగినట్లుగా వేగంగా ఆడలేకపోయాడు. ఖలీల్ వేసిన తొలి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన సాల్ట్...అశి్వన్ వేసిన తర్వాత ఓవర్లో సిక్స్, 2 ఫోర్లు బాదాడు. అయితే ధోని అద్భుత స్టంపింగ్‌కు సాల్ట్ వెనుదిరగ్గా, దేవ్‌దత్ పడిక్కల్ (14 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) క్రీజ్‌లో ఉన్నంత సేపు ధాటిని ప్రదర్శించాడు.
జడేజా ఓవర్లోనే అతను 2 ఫోర్లు, సిక్స్ కొట్టాడు. ఎట్టకేలకు పతిరణ ఓవర్లో కోహ్లి వరుసగా సిక్స్, ఫోర్ కొట్టినా...నూర్ బౌలింగ్‌లో అవుటై నిరాశగానే వెనుదిరిగాడు. మరో వైపు జడేజా ఓవర్లో సిక్స్, 2 ఫోర్లతో పాటీదార్ తన జోరును కొనసాగించాడు. ఈ క్రమంలో 30 బంతుల్లో అతని హాఫ్ సెంచరీ పూర్తయింది.
ఇలాంటి స్థితిలో ఐదు పరుగుల వ్యవధిలో జితేశ్ శర్మ (12), పాటీదార్, కృనాల్ పాండ్యా (0) వికెట్లు తీసి బెంగళూరును కొద్ది సేపు చెన్నై నిలువరించగలిగింది. అయితే స్యామ్ కరన్ వేసిన ఆఖరి ఓవర్లో టిమ్ డేవిడ్ (8 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్‌లు) వరుసగా మూడు సిక్సర్లు బాది స్కోరును 200కు చేరువగా తీసుకొచ్చాడు.
సమష్టి వైఫల్యం...
ఛేదనలో చెన్నై తీవ్రంగా ఇబ్బంది పడింది. రచిన్ కొన్ని చక్కటి షాట్లు ఆడటం మినహా ఒక్క బ్యాటర్ కూడా కనీస ప్రదర్శన ఇవ్వలేదు. చెప్పుకోదగ్గ భాగస్వామ్యం కూడా లేకుండా తక్కువ వ్యవధిలో సీఎస్‌కే వరుసగా వికెట్లు కోల్పోయింది. ఒకే స్కోరు వద్ద రాహుల్ త్రిపాఠి (5), రుతురాజ్ గైక్వాడ్ (0) వెనుదిరగ్గా, దీపక్ హుడా (4), స్యామ్ కరన్ (8) పూర్తిగా విఫలమయ్యారు. శివమ్ దూబే (15 బంతుల్లో 19; 2 ఫోర్లు, 1 సిక్స్), రవీంద్ర జడేజా (19 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా పెద్దగా ప్రభావం చూపలేదు.
ఆర్‌సీబీ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ చెన్నైపై ఒత్తిడిని కొనసాగించారు. ఆరంభంలో పవర్‌ప్లే ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 30 పరుగులు మాత్రమే చేసిన చెన్నై ఆ తర్వాత కోలుకోలేకపోయింది. ఆఖర్లో 28 బంతుల్లో 98 పరుగులు చేయాల్సిన స్థితిలో బరిలోకి దిగిన ధోని అభిమానులను అలరించే కొన్ని షాట్లు కొట్టడం మినహా అవి జట్టుకు ఏమాత్రం ఉపయోగపడలేదు. కృనాల్ వేసిన చివరి ఓవర్లో ధోని 2 సిక్స్‌లు, ఫోర్ కొట్టడానికి చాలా ముందే ఓటమి ఖాయమైపోయింది!

స్కోరు వివరాలు:
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (స్టంప్డ్) ధోని (బి) నూర్ 32; కోహ్లి (సి) రచిన్ (బి) నూర్ 31; పడిక్కల్ (సి) గైక్వాడ్ (బి) అశ్విన్ 27; పాటీదార్ (సి) కరన్ (బి) పతిరణ 51; లివింగ్‌స్టోన్ (బి) నూర్ 10; జితేశ్ (సి) జడేజా (బి) అహ్మద్ 12; డేవిడ్ (నాటౌట్) 22; కృనాల్ (సి) హుడా (బి) పతిరణ 0; భువనేశ్వర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–45, 2–76, 3–117, 4–145, 5–172, 6–176, 7–177. బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 4–0–28–1, రవిచంద్రన్ అశ్విన్ 2–0–22–1, స్యామ్ కరన్ 3–0–34–0, నూర్ అహ్మద్ 4–0–36–3, రవీంద్ర జడేజా 3–0–37–0, పతిరణ 4–0–36–2.
చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రచిన్ రవీంద్ర (బి) దయాళ్ 41; త్రిపాఠి (సి) సాల్ట్ (బి) హాజల్‌వుడ్ 5; గైక్వాడ్ (సి) (సబ్) భాందగే (బి) హాజల్‌వుడ్ 0; హుడా (సి) జితేశ్ (బి) భువనేశ్వర్ 4; స్యామ్ కరన్ (సి) కృనాల్ (బి) లివింగ్‌స్టోన్ 8; శివమ్ దూబే (బి) దయాళ్ 19; జడేజా (సి) సాల్ట్ (బి) హాజల్‌వుడ్ 25; అశ్విన్ (సి) సాల్ట్ (బి) లివింగ్‌స్టోన్ 11; ధోని (నాటౌట్) 30; నూర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 146. వికెట్ల పతనం: 1–8, 2–8, 3–26, 4–52, 5–75, 6–80, 7–99, 8–130. బౌలింగ్: భువనేశ్వర్ 3–0–20–1, హాజల్‌వుడ్ 4–0–21–3, యశ్ దయాళ్ 3–0–18–2, లివింగ్‌స్టోన్ 4–0–28–2, సుయాశ్ శర్మ 4–0–32–0, కృనాల్ పాండ్యా 2–0–26–0.
ఐపీఎల్‌లో నేడు
గుజరాత్ X ముంబై
వేదిక: అహ్మదాబాద్
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం