
ఉత్కంఠ పోరులో బెంగళూరు విజయం
12 పరుగులతో ఓడిన ముంబై ఇండియన్స్
రాణించిన పాటీదార్, కోహ్లి
తిలక్, హార్దిక్ పోరాటం వృథా
ముంబై విజయలక్ష్యం 222 పరుగులు... ఆర్‌సీబీ చక్కటి బౌలింగ్‌తో స్కోరు 99/4 వద్ద నిలిచింది. ముంబై గెలిచేందుకు 8 ఓవర్లలో 123 పరుగులు చేయడం అసాధ్యంగా అనిపించింది. అయితే అసాధారణ ఆటతో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా పోరాడారు. కేవలం 34 బంతుల్లో 89 పరుగులు జోడించి విజయం దిశగా నడిపించారు. అయితే ఆరు పరుగుల వ్యవధిలో వీరిద్దరిని అవుట్ చేసి బెంగళూరు చివరకు మ్యాచ్‌పై పట్టు నిలబెట్టుకుంది. అంతకుముందు కెప్టెన్ రజత్ పాటీదార్, విరాట్ కోహ్లి, జితేశ్ శర్మ దూకుడుతో బెంగళూరు ప్రత్యర్థికి సవాల్ విసిరింది.
ముంబై: వాంఖెడే మైదానంలో పదేళ్ల తర్వాత ముంబైపై బెంగళూరు విజయం సాధించింది. సోమవారం చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఆర్‌సీబీ 12 పరుగులతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రజత్ పాటీదార్ (32 బంతుల్లో 64; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (42 బంతుల్లో 67; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించగా... జితేశ్ శర్మ (19 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), దేవదత్ పడిక్కల్ (22 బంతుల్లో 37; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసింది. తిలక్ వర్మ (29 బంతుల్లో 56; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేయగా, హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో 42; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించాడు.
సమష్టి ప్రదర్శన...
ఇన్నింగ్స్ రెండో బంతికే ఫిల్ సాల్ట్ (4) వెనుదిరగ్గా... కోహ్లి, పడిక్కల్ కలిసి దూకుడుగా స్కోరుబోర్డును నడిపించారు. బౌల్ట్ ఓవర్లో వీరిద్దరు కలిసి 16 పరుగులు రాబట్టారు. చహర్ ఓవర్లో పడిక్కల్ వరుసగా 6, 6, 4 బాదగా పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 73 పరుగులకు చేరింది. చక్కటి షాట్లు ఆడిన కోహ్లి 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీని అందుకున్నాడు. మరో భారీ షాట్‌కు ప్రయతి్నంచి పడిక్కల్ వెనుదిరగడంతో 91 పరుగుల (52 బంతుల్లో) రెండో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత సాంట్నర్ ఓవర్లో 2 సిక్స్‌లతో పాటీదార్ జోరు ప్రదర్శించాడు. హార్దిక్ ఒకే ఓవర్లో కోహ్లి, లివింగ్‌స్టోన్ (0)లను అవుట్ చేయగా, బౌల్ట్ ఓవర్లో ఆర్‌సీబీ బ్యాటర్లు పాటీదార్, జితేశ్ కలిసి 18 పరుగులు సాధించారు. 16 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 169/4. ఆఖరి 4 ఓవర్లలో బెంగళూరు 52 పరుగులు సాధించింది.
భారీ భాగస్వామ్యం...
భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్లో 6, 4తో దూకుడుగా ఆటను మొదలు పెట్టిన రోహిత్ శర్మ (9 బంతుల్లో 17; 2 ఫోర్లు, 1 సిక్స్)... దయాళ్ తర్వాతి ఓవర్లో వరుసగా 2 ఫోర్లు కొట్టి తర్వాతి బంతికి బౌల్డయ్యాడు. రికెల్టన్ (17), జాక్స్ (22) కూడా మెరుగ్గానే ఆరంభించినా ఎక్కువ సేపు నిలవలేకపోయారు. బౌలర్ దయాళ్, కీపర్ జితేశ్ సమన్వయలోపంతో సులువైన క్యాచ్‌ను వదిలేయడంతో బతికిపోయిన సూర్యకుమార్ యాదవ్ (26 బంతుల్లో 28; 5 ఫోర్లు)ను అదే ఓవర్లో మరో
రెండు బంతుల తర్వాత పెవిలియన్ పంపించి దయాళ్ సంబరాలు చేసుకున్నాడు. ఆ తర్వాత సుయాశ్ ఓవర్లో తిలక్ 2 ఫోర్లు, సిక్స్...హాజల్‌వుడ్ వేసిన తర్వాతి ఓవర్లో హార్దిక్ 2 ఫోర్లు, 2 సిక్స్‌లు బాది విజయంపై ఆశలు రేపారు. గత మ్యాచ్‌లో ‘రిటైర్ట్ అవుట్’గా పంపించిన కసి తిలక్ బ్యాటింగ్‌లో కనిపించింది. తర్వాతి మూడు ఓవర్లలో కూడా ఈ జోరు కొనసాగి 43 పరుగులు వచ్చాయి. అయితే తిలక్ వికెట్‌తో ఆట మళ్లీ బెంగళూరు వైపు మొగ్గింది.
స్కోరు వివరాలు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (బి) బౌల్ట్ 4; కోహ్లి (సి) నమన్ (బి) హార్దిక్ 67; పడిక్కల్ (సి) జాక్స్ (బి) పుతూర్ 37; పాటీదార్ (సి) రికెల్టన్ (బి) బౌల్ట్ 64; లివింగ్‌స్టోన్ (సి) బుమ్రా (బి) హార్దిక్ 0; జితేశ్ (నాటౌట్) 40; డేవిడ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 221.
వికెట్ల పతనం: 1–4, 2–95, 3–143, 4–144, 5–213.
బౌలింగ్: బౌల్ట్ 4–0–57–2, చహర్ 2–0–29–0, బుమ్రా 4–0–29–0, జాక్స్ 1–0–10–0, సాంట్నర్ 4–0–40–0, హార్దిక్ 4–0– 45–2, విఘ్నేశ్ 1–0–10–1.
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) దయాళ్ 17; రికెల్టన్ (ఎల్బీ) (బి) హాజల్‌వుడ్ 17; జాక్స్ (సి) కోహ్లి (బి) కృనాల్ 22; సూర్యకుమార్ (సి) లివింగ్‌స్టోన్ (బి) దయాళ్ 28; తిలక్‌వర్మ (సి) సాల్ట్ (బి) భువనేశ్వర్ 56; హార్దిక్ (సి) లివింగ్‌స్టోన్ (బి) హాజల్‌వుడ్ 42; నమన్ ధీర్ (సి) దయాళ్ (బి) కృనాల్ 11; సాంట్నర్ (సి) డేవిడ్ (బి) కృనాల్ 8; దీపక్ చహర్ (సి) డేవిడ్ (బి) కృనాల్ 0; బౌల్ట్ (నాటౌట్) 1; బుమ్రా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 209.
వికెట్ల పతనం: 1–21, 2–38, 3–79, 4–99, 5–188, 6–194, 7–203, 8–203, 9–209.
బౌలింగ్: భువనేశ్వర్ 4–0–48–1, యశ్ దయాళ్ 4–0–46–2, హాజల్‌వుడ్ 4–0–37–2, సుయాశ్ శర్మ 4–0–32–0, కృనాల్ పాండ్యా 4–0–45–4.