
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో సంచలనం నమోదైంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా ముల్లాన్‌పూర్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ రికార్డు విజయాన్ని అందుకుంది. 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకుని పంజాబ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ హిస్టరీలో అత్యల్ప టార్గెట్‌ను డిఫెండ్ చేసుకున్న జట్టుగా శ్రేయస్ సేన నిలిచింది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 15.3 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. ప్రియాన్ష్ ఆర్య (12 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 22), ప్రభ్‌సిమ్రాన్ సింగ్(15 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 30) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌తో సహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రానా మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ తలా రెండు వికెట్లు సాధించారు.వీరితో పాటు నోకియా, వైభవ్ ఆరోరా చెరో వికెట్ సాధించారు.
తిప్పేసిన చాహల్..
112 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌కు పంజాబ్ పేసర్ మార్కో జానెసన్ తొలి ఓవర్‌లోనే భారీ షాకిచ్చాడు. ఇన్‌ఫామ్ బ్యాటర్ సునీల్ నరైన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత ఓవర్‌లోనే మరో పేసర్ బార్ట్‌లెట్.. క్వింటన్ డికాక్‌ను ఔట్ చేశాడు.
ఆ తర్వాత రఘువన్షి, కెప్టెన్ అజింక్య రహానే (Ajinkya Rahane) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో ఎటాక్‌లోకి వచ్చిన స్పిన్నర్ చాహల్ (Chahal) మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. రహానే, రింకూ సింగ్, రమణ్‌దీప్, రఘువన్షి వంటి కీలక వికెట్లను పడగొట్టి కేకేఆర్‌ను దెబ్బతీశాడు.ఆ తర్వాత జానెసన్ ఆఖరిలో చెలరేగి ఆడుతున్న విధ్వంసకర బ్యాటర్ రస్సెల్‌ను ఔట్ చేసి తన జట్టుకు అద్బుతమైన విజయాన్ని అందించాడు. 3.1 ఓవర్లు బౌలింగ్ చేసిన జానెసన్.. కేవలం 17 పరుగులు ఇచ్చి 3 వికెట్లను పడగొట్టాడు
కేకేఆర్ కొంపముంచిన రహానే..
కాగా ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఓటమికి కెప్టెన్ అజింక్య రహానే పరోక్షంగా కారణమయ్యాడు. కేకేఆర్ లక్ష్య చేధనలో ఓపెనర్ల వికెట్లను ఆరంభంలోనే కోల్పోయినప్పటికి రఘువన్షి, రహానే అద్బుతంగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకువెళ్లారు. 7 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ రెండు వికెట్లు కోల్పోయి పటిష్ట స్థితిలో నిలిచింది. దీంతే కేకేఆర్ విజయం అంతా లాంఛనమే అనుకున్నారు.
కానీ ఇక్కడే రహానే చేసిన తప్పిదం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. కేకేఆర్ ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన చాహల్ బౌలింగ్‌లో నాలుగో బంతిని రహానే స్వీప్ ఆడటానికి ప్రయత్నించాడు. కానీ బంతి మాత్రం బ్యాట్‌కు మిస్స్ అయ్యి అతడి ప్యాడ్‌కు తాకింది. వెంటనే పంజాబ్ ఆటగాళ్లు ఎల్బీకి అప్పీల్ చేయగా.. అంపైర్ ఔట్ అని వేలు పైకెత్తాడు.
అప్పటికే కేకేఆర్‌కు రెండు రివ్యూలు మిగిలిన్నప్పటికి రహానే మాత్రం రివ్యూ తీసుకోకుండా మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత రిప్లేలో క్లియర్‌గా ఇంపాక్ట్ ఔట్ సైడ్‌గా కన్పించింది. రహానే వికెట్‌తో కేకేఆర్ పతనం మొదలైంది. వరుస క్రమంలో బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. రహానే అక్కడ రివ్యూ తీసుకుని ఉండింటే కేకేఆర్ సునాయసంగా గెలిచుండేది.