
Photo Courtesy: BCCI/IPL
జట్టు ప్రయోజనాలే తన మొదటి ప్రాధాన్యం అని టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) స్పష్టం చేశాడు. మ్యాచ్‌లో పరిస్థితులను బట్టే బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందని.. ఈ క్రమంలో వ్యక్తిగత ఇష్టానికి చోటు ఉండదని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వ్యాఖ్యానించాడు. తాను ఎప్పుడైనా జట్టు గురించే ఆలోచిస్తూ ఆడానని పేర్కొన్నాడు.
‘అహం’ పనికిరాదు..
‘జట్టు తరఫున ఆడుతున్నప్పుడు ‘నేను’ అనే అహం బ్యాటింగ్‌లో ఎప్పుడూ కనిపించకూడదు. మరో ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌పై ఆధిపత్యం ప్రదర్శించే ప్రయత్నం సరైన బ్యాటింగ్ అనిపించుకోదు. నేను మ్యాచ్‌లో పరిస్థితిని అర్థం చేసుకునేందుకే ప్రయత్నిస్తా. దానిని బట్టే ఆడేందుకు ప్రయత్నిస్తా. ఇది నేను గర్వించే విషయం కూడా.
నేను మంచి లయ అందుకొని జోరు మీదుంటే నాపై బాధ్యత వేసుకుంటా. మరో బ్యాటర్ బాగా ఆడుతుంటే అతడూ అదే బాధ్యత తీసుకుంటాడు’ అని విరాట్ విశ్లేషించాడు.
కాగా ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున 256 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి మొత్తం 8168 పరుగులు చేశాడు. అయితే తొలి మూడు సీజన్లలో ఎక్కువగా మిడిలార్డర్‌లో బరిలోకి దిగిన అతడు చెప్పుకోదగ్గ ప్రభావం చూపలేకపోయాడు. 38 ఇన్నింగ్స్‌లు ఆడినా అతడి ఖాతాలో రెండు హాఫ్ సెంచరీలే ఉన్నాయి.
నా అసలు ఐపీఎల్ ప్రయాణం అప్పుడే మొదలు
అయితే 2011 నుంచి కోహ్లి ఆట మలుపు తిరిగింది. ఈ విషయం గురించి స్పందిస్తూ.. ‘ఆర్సీబీ తరఫున మొదటి మూడేళ్లు నాకు టాపార్డర్‌లో ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశాలు రాలేదు. కాబట్టి ఐపీఎల్‌లో గొప్పగా ఆడలేదు.
అయితే 2010లో కాస్త నిలకడ వచ్చింది. 2011 నుంచి రెగ్యులర్‌గా మూడో స్థానంలోకి వచ్చేశాను. సరిగ్గా చెప్పాలంటే నా అసలు ఐపీఎల్ ప్రయాణం అప్పుడే మొదలైంది’ అని కోహ్లి గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్‌లో సుదీర్ఘ కాలంగా ఆడటం వల్లే టీ20 ఫార్మాట్‌లో తన ఆటను మెరుగుపర్చుకోవడం సాధ్యమైందని కోహ్లి చెప్పుకొచ్చాడు.
కాగా ఐపీఎల్ ఆరంభ సీజన్ (2008) నుంచి విరాట్ కోహ్లి ఆర్సీబీతోనే కొనసాగుతున్నాడు. ఆటగాడిగా.. కెప్టెన్‌గా అభిమానులను అలరించిన కోహ్లి.. జట్టుకు ఇంత వరకు ట్రోఫీని మాత్రం అందించలేకపోయాడు. ఇక ఐపీఎల్-2025 సందర్భంగా బెంగళూరు ఫ్రాంఛైజీ రజత్ పాటిదార్‌ను తమ సారథిగా ప్రకటించింది.
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆర్సీబీ నాలుగు మ్యాచ్‌లు ఆడి మూడు గెలిచింది. ఇటు బ్యాటర్‌గా.. అటు కెప్టెన్‌గా పాటిదార్ రాణిస్తుండటం విశేషం. మరోవైపు.. కోహ్లి కూడా బ్యాటింగ్‌లో అదరగొడుతున్నాడు. ఇప్పటికి నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి 164 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్ధ శతకాలు ఉన్నాయి.
చదవండి: IPL 2025: సాయి సుదర్శన్ విధ్వంసం.. రాజస్థాన్‌పై గుజరాత్ ఘన విజయం