
Photo Courtesy: BCCI
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో టేబుల్ సెకెండ్ టాపర్‌గా ఉన్న గుజరాత్ టైటాన్స్ తమ గాయపడిన ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిగా శ్రీలంక పరిమిత ఓవర్ల మాజీ కెప్టెన్ దసున్ షనకను ఎంపిక చేసుకుంది. షనక 2023 సీజన్‌లో కూడా గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ సీజన్ మెగా వేలంలో షనక అన్ సోల్డ్‌గా మిగిలిపోయినప్పటికీ.. ఫిలిప్స్ గాయపడటంతో అతనికి అవకాశం వచ్చింది.
షనక త్వరలోనే గుజరాత్ టైటాన్స్‌తో జతకడతాడని సమాచారం. షనక 2023 సీజన్‌లో గుజరాత్ తరఫున 3 మ్యాచ్‌లు ఆడి కేవలం 26 పరుగులే చేశాడు. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన షనకకు ఆ సీజన్‌లో బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. 2023 సీజన్‌లో గుజరాత్ హార్దిక్ పాండ్యా నేతృత్వంలో రన్నరప్‌గా నిలిచింది.
షనక ఈ ఏడాది ఇంటర్నేషనల్ టీ20 లీగ్ (దుబాయ్) టైటిల్ గెలిచిన దుబాయ్ క్యాపిటల్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 33 ఏళ్ల కుడి చేతి వాటం ఆల్‌రౌండర్ అయిన షనక శ్రీలంక తరఫున 6 టెస్ట్‌లు, 71 వన్డేలు, 102 టీ20లు ఆడాడు. షనక టెస్ట్‌ల్లో ఓ హాఫ్ సెంచరీ 13 వికెట్లు.. వన్డేల్లో 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు, 27 వికెట్లు.. టీ20ల్లో 5 హాఫ్ సెంచరీలు, 33 వికెట్లు తీశాడు. షనక వన్డేల్లో ఓ ఐదు వికెట్ల ప్రదర్శన కూడా నమోదు చేశాడు. షనక తన ఐపీఎల్ కెరీర్ మొత్తంలో గుజరాత్ తరఫునే మూడు మ్యాచ్‌లు ఆడాడు.
ఫిలిప్స్ విషయానికొస్తే.. ఈ సీజన్‌లోనే సన్‌రైజర్స్ నుంచి గుజరాత్‌కు వచ్చిన ఫిలిప్స్ ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఏప్రిల్ 6న సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫిలిప్స్ గాయపడ్డాడు. గాయం తీవ్రమైంది కావడంతో ఫిలిప్స్ సీజన్ మొత్తానికే దూరమ్యాడు.
గుజరాత్ ఈ సీజన్‌ను నిదానంగా ఆరంభించి ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. ఆ జట్టు ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించి, రెండింట ఓటమిపాలైంది. గుజరాత్ తమ తదుపరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్ 19న అహ్మదాబాద్‌లో జరుగనుంది.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీ ఈ సీజన్‌లో 6 మ్యాచ్‌లు ఆడి ఐదింట గెలిచింది. ఆర్సీబీ, పంజాబ్ చెరో 6 మ్యాచ్‌లు ఆడి తలో 4 విజయాలతో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. లక్నో, కేకేఆర్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్, సీఎస్‌కే వరుసగా ఐదు నుంచి పది స్థానాల్లో నిలిచాయి.