అందుకే ఓడిపోయాం: కోహ్లి, సాల్ట్‌లపై పాటిదార్‌ విమర్శలు! | Intent Was Good But We Shouldn't Have: Is Patidar Indirectly Blames Kohli, Salt? | Sakshi
Sakshi News home page

అందుకే ఓడిపోయాం: కోహ్లి, సాల్ట్‌లపై పాటిదార్‌ విమర్శలు!

Published Thu, Apr 3 2025 10:43 AM | Last Updated on Thu, Apr 3 2025 1:00 PM

Intent Was Good But We Shouldn't Have: Is Patidar Indirectly Blames Kohli, Salt?

Photo Courtesy: BCCI/IPL

టాపార్డర్‌ వైఫల్యం తమ విజయావకాశాలను దెబ్బతీసిందని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB) కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ (Rajat Patidar) అన్నాడు. పవర్‌ ప్లేలో వరుసగా వికెట్లు కోల్పోవడం వల్ల భారీ స్కోరు సాధించలేకపోయామని పేర్కొన్నాడు.  అయితే, ఒక్క మ్యాచ్‌తో తమ బ్యాటింగ్‌ లైనప్‌ను తక్కువ చేసి చూడలేమని.. ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటామని  తెలిపాడు.

కాగా ఐపీఎల్‌-2025 (IPL 2025) సందర్భంగా పాటిదార్‌ ఆర్సీబీ కెప్టెన్‌గా పగ్గాలు అందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో అతడి సారథ్యంలో ఆర్సీబీ.. డిఫెండింగ్‌ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ను చిత్తు చేసింది. అనంతరం చెన్నై సూపర్‌ కింగ్స్‌పై చెపాక్‌లో చరిత్రాత్మక విజయం సాధించింది. పదిహేడేళ్ల విరామం తర్వాత చెన్నైని తమ సొంతగడ్డపైనే ఓడించింది.

అయితే, తాజాగా తమ సొంత మైదానంలో మాత్రం ఆర్సీబీ ఇదే ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయింది. గుజరాత్‌ టైటాన్స్‌తో బుధవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఫలితంగా ఆర్సీబీ సారథిగా పాటిదార్‌ ఖాతాలో తొలి పరాజయం నమోదైంది.

పవర్‌ ప్లేలో మూడు వికెట్లు కోల్పోయాం
ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం పాటిదార్‌ మాట్లాడుతూ.. ‘‘పవర్‌ ప్లే తర్వాత మా దృక్పథం మారిపోయింది. 200 కాకపోయినా.. కనీసం 190 పరుగుల మార్కు అందుకోవాలని భావించాం. అయితే, ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడం తీవ్ర ప్రభావం చూపింది.

దూకుడుగా ఆడాలన్న మా ఆలోచన సరైందే. కానీ పరిస్థితులు భిన్నంగా మారిపోయాయి. పవర్‌ ప్లేలో మేము వరుసగా మూడు వికెట్లు కోల్పోకుండా ఉండాల్సింది. ఒక్కటి కాదు.. ఏకంగా మూడు వికెట్లు కోల్పోవడం తీవ్ర నిరాశకు గురిచేసింది.

ఆ ముగ్గురు అద్భుతం
ఆ తర్వాత పిచ్‌ బ్యాటింగ్‌కు మరింతగా అనుకూలించింది. అయినప్పటికీ మా బౌలర్లు మ్యాచ్‌ను 18వ ఓవర్‌ వరకు తీసుకురావడం అభినందనీయం. తక్కువ స్కోరును కాపాడేందుకు వారు అద్భుతంగా పోరాడారు. కానీ ఫలితం మాత్రం దక్కలేదు.

అయితే, ఈ మ్యాచ్‌లో జితేశ్‌ శర్మ, లియామ్‌ లివింగ్‌ స్టోన్‌, టిమ్‌ డేవిడ్‌ బ్యాటింగ్‌ చేసిన తీరు మాకు సానుకూలాంశం. మా బ్యాటింగ్‌ లైనప్‌ ఇప్పటికీ పటిష్టంగానే ఉంది. వరుస విరామాల్లో వికెట్లు పడినా.. ఆ ముగ్గురు సానుకూల దృక్పథంతో బ్యాటింగ్‌ చేయడం శుభపరిణామం’’ అని పేర్కొన్నాడు.

కాగా గుజరాత్‌తో మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది ఆర్సీబీ. ఓపెనర్లు విరాట్‌ కోహ్లి (7), ఫిల్‌ సాల్ట్‌ (14)తో పాటు.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ దేవదత్‌ పడిక్కల్‌(4) పూర్తిగా విఫలమయ్యారు. రజత్‌ పాటిదార్‌ కూడా 12 పరుగులకే పెవిలియన్‌ చేరాడు.

సిరాజ్‌ తీన్‌మార్‌
ఇలాంటి దశలో లియామ్‌ లివింగ్‌ స్టోన్‌ (40 బంతుల్లో 54), జితేశ్‌ శర్మ (21 బంతుల్లో 33), టిమ్‌ డేవిడ్‌ (18 బంతుల్లో 32) వేగంగా ఆడి ఆర్సీబీకి గౌరవప్రదమైన స్కోరు అందించారు. ఈ ముగ్గురి అద్భుత బ్యాటింగ్‌ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ 169 పరుగులు చేయగలిగింది.

గుజరాత్‌ బౌలర్లలో మహ్మద్‌ సిరాజ్‌ మూడు వికెట్ల (3/19)తో చెలరేగగా.. సాయి కిషోర్‌ రెండు, ఇషాంత్‌ శర్మ, ప్రసిద్‌ కృష్ణ, అర్షద్‌ ఖాన్‌ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు. ఇక గుజరాత్‌ టైటాన్స్‌ 17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌ చెరో వికెట్‌ దక్కించున్నారు.

ఇక కేవలం రెండు వికెట్లు నష్టపోయి 170 పరుగులు చేసిన టైటాన్స్‌ ఎనిమిది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఫలితంగా టైటాన్స్‌కు వరుసగా రెండో విజయం లభించింది.

ఐపీఎల్‌-2025: ఆర్సీబీ వర్సెస్‌ గుజరాత్‌
ఆర్సీబీ స్కోరు: 169/8 (20)
గుజరాత్‌ స్కోరు: 170/2 (17.5)
ఫలితం: ఎనిమిది వికెట్ల తేడాతో ఆర్సీబీపై గుజరాత్‌ గెలుపు
ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: మహ్మద్‌ సిరాజ్‌ (3/19).

చదవండి: ముంబై ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన సారా టెండూల్కర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement