
ఉత్కంఠపోరులో అనూహ్య విజయం
16 పరుగులతో ఓడిన కోల్‌కతా
4 వికెట్లతో గెలిపించిన చహల్
సొంత మైదానంలో బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై పంజాబ్ కింగ్స్ పడుతూ లేస్తూ 111 పరుగులు చేసింది. మరో 27 బంతులు మిగిలి ఉండగానే ఇన్నింగ్స్ ముగిసింది. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) విజయంపై ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. 14.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదిస్తే కోల్‌కతా జట్టు పాయింట్ల పట్టికలో నంబర్‌వన్ స్థానానికి కూడా దూసుకుపోతుంది. ఎంత వేగంగా ఛేదిస్తారనే దానిపైనే చర్చ. 62/2 స్కోరుతో జట్టు గెలుపు దిశగా సాగింది. కానీ ఒక్కసారిగా అనూహ్యం జరిగింది. యుజువేంద్ర చహల్ పదునైన స్పిన్‌తో కేకేఆర్ పతనానికి శ్రీకారం చుట్టాడు. 17 పరుగుల వ్యవధిలో కోల్‌కతా 6 వికెట్లు కోల్పోయింది.
అయితే రసెల్ ఒకే ఓవర్లో 16 పరుగులు రాబట్టడంతో మళ్లీ కేకేఆర్ విజయంపై అంచనాలు... కానీ యాన్సెన్ బంతితో రసెల్ ఆట ముగిసింది... మరో 29 బంతులు మిగిలి ఉండగానే కోల్‌కతా ఆలౌట్... పంజాబ్ అభిమానులతో మైదానం ఒక్కసారిగా హోరెత్తింది. శనివారం 245 పరుగులు చేసి కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిన పంజాబ్ కింగ్స్...ఇప్పుడు ఐపీఎల్ చరిత్రలోనే అతి తక్కువ లక్ష్యాన్ని కాపాడుకున్న జట్టుగా నిలిచింది.
ముల్లాన్‌పూర్: ఐపీఎల్‌లో అరుదుగా కనిపించే తక్కువ స్కోర్ల మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా ముగిసింది. మంగళవారం జరిగిన ఈ పోరులో పంజాబ్ కింగ్స్ 16 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ 15.1 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌటైంది.
ప్రభ్‌సిమ్రన్ సింగ్ (15 బంతుల్లో 30; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం కోల్‌కతా 15.1 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌటైంది. రఘువంశీ (28 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలవగా, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ యుజువేంద్ర చహల్ (4/28) ప్రత్యర్థిని కుప్పకూల్చాడు.
ఓపెనింగ్ మినహా...
తొలి 19 బంతుల్లో 39/0... తర్వాతి 17 బంతుల్లో 15/4... పవర్‌ప్లేలో పంజాబ్ ఆటతీరు ఇది. ఓపెనర్ల ఆటతీరు చూస్తే ఈ మైదానంలో జరిగిన గత రెండు మ్యాచ్‌ల తరహాలోనే భారీ స్కోరు ఖాయమనిపించింది. కానీ ఆ తర్వాత జట్టు ఒక్కసారిగా కుప్పకూలింది. నోర్జే ఓవర్లో ప్రియాన్ష్ఆర్య (12 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్) రెండు ఫోర్లు కొట్టగా... అరోరా వేసిన తర్వాతి ఓవర్లో ప్రభ్‌సిమ్రన్ వరుసగా 4, 6, 4 బాదాడు. అదే ఓవర్లో ప్రియాన్ష్ కూడా ఫోర్ కొట్టడంతో మొత్తం 20 పరుగులు వచ్చాయి.
రాణా తొలి బంతిని ప్రియాకూ సిక్స్ కొట్టే వరకు అంతా బాగుంది. కానీ ఆ తర్వాతి బంతి నుంచే కోల్‌కతా బౌలర్ల జోరు మొదలైంది. అదే ఓవర్లో ప్రియాన్ష్ , శ్రేయస్ అయ్యర్ (0)లను అవుట్ చేసిన రాణా తన తర్వాతి ఓవర్లో ప్రభ్‌సిమ్రన్‌ను కూడా వెనక్కి పంపాడు. అంతకు ముందే సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడిన ఇన్‌గ్లిస్ (2) కూడా వరుణ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 6 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 54/4కు చేరింది.
ఇక ఆ తర్వాత పంజాబ్ కోలుకోలేకపోయింది. నైట్‌రైడర్స్ కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు బ్యాటర్లంతా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. పవర్‌ప్లే తర్వాత ఆడిన 57 బంతుల్లో 57 పరుగులు మాత్రమే చేసిన జట్టు 6 వికెట్లు కోల్పోయింది. వధేరా (10), మ్యాక్స్‌వెల్ (7), ఇంపాక్ట్ సబ్‌గా వచ్చిన సూర్యాంశ్ (4) ఏమాత్రం ప్రభావం చూపలేకపోగా, శశాంక్ సింగ్ (17 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్) కూడా విఫలమయ్యాడు.
టపటపా...
ఛేదనలో కోల్‌కతాకు సరైన ఆరంభం లభించలేదు. మూడు బంతుల వ్యవధిలో ఒకే స్కోరు వద్ద ఓపెనర్లు నరైన్ (5), డికాక్ (2) వెనుదిరిగారు. అయితే అజింక్య రహానే (17), రఘువంశీ కలిసి కొన్ని చక్కటి షాట్లతో మూడో వికెట్‌కు 38 బంతుల్లో 55 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అయితే రహానే వెనుదిరిగిన తర్వాత కేకేఆర్ పతనం వేగంగా సాగిపోయింది.

ఒక్కరు కూడా పట్టుదలగా నిలబడి జట్టును గెలిపించే ప్రయత్నం చేయలేకపోయారు. చివర్లో రసెల్ (11 బంతుల్లో 17; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కొంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. రహానే దురదృష్టవశాత్తూ ఎల్బీపై రివ్యూ కోరకపోవడం కూడా కేకేఆర్‌కు నష్టం కలిగించింది. అతని అవుట్ తర్వాతే పరిస్థితి మారింది. బాల్ ట్రాకింగ్‌లో ప్రభావం ఆఫ్ స్టంప్ బయట కనిపించింది. రివ్యూ కోరితే అతను నాటౌట్‌గా తేలేవాడు.
చహల్ మ్యాజిక్
టోర్నీ తొలి 5 మ్యాచ్‌లలో ఏకంగా 83.50 సగటు, 11.13 చెత్త ఎకానమీతో కేవలం 2 వికెట్లు... 2 మ్యాచ్‌లలో మాత్రమే ఓవర్ల కోటా పూర్తి... వేలంలో రూ.18 కోట్లతో అమ్ముడుపోయిన చహల్ పేలవ ఫామ్ ఇది. కచ్చితంగా రాణించాల్సిన తీవ్ర ఒత్తిడి మధ్య బరిలోకి దిగిన అతను మ్యాజిక్ చూపించాడు. వరుస ఓవర్లలో రహానే, రఘువంశీలను అవుట్ చేసి పంజాబ్ శిబిరంలో ఆశలు రేపిన అతను కీలక సమయంలో వరుస బంతుల్లో రింకూ, రమణ్‌దీప్‌లను వెనక్కి పంపి విజయానికి బాటలు వేశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా తనకున్న గుర్తింపును నిలబెట్టుకుంటూ మళ్లీ రేసులోకి వచ్చాడు.
ఐపీఎల్‌లో నేడు
ఢిల్లీ X రాజస్తాన్
వేదిక: న్యూఢిల్లీ
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
స్కోరు వివరాలు
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్(సి) రమణ్‌దీప్ (బి) రాణా 22; ప్రభ్‌సిమ్రన్ (సి) రమణ్‌దీప్ (బి) రాణా 30; శ్రేయస్ (సి) రమణ్‌దీప్ (బి) రాణా 0; ఇన్‌గ్లిస్ (బి) వరుణ్ 2; వధేరా (సి) వెంకటేశ్ (బి) నోర్జే 10; మ్యాక్స్‌వెల్ (బి) వరుణ్ 7; సూర్యాంశ్ (సి) డికాక్ (బి) నరైన్ 4; శశాంక్ (ఎల్బీ) (బి) అరోరా 18; యాన్సెన్ (బి) నరైన్ 1; బార్ట్‌లెట్ (రనౌట్) 11; అర్ష్ దీప్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (15.3 ఓవర్లలో ఆలౌట్) 111. వికెట్ల పతనం: 1–39, 2–39, 3–42, 4–54, 5–74, 6–76, 7–80, 8–86, 9–109, 10–111. బౌలింగ్: వైభవ్ అరోరా 2.3–0–26–1, నోర్జే 3–0–23–1, హర్షిత్ రాణా 3–0–25–3, వరుణ్ చక్రవర్తి 4–0–21–2, నరైన్ 3–0–14–2.
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) సూర్యాంశ్ (బి) బార్ట్‌లెట్ 2; నరైన్ (బి) యాన్సెన్ 5; రహానే (ఎల్బీ) (బి) చహల్ 17; రఘువంశీ (సి) బార్ట్‌లెట్ (బి) చహల్ 37; వెంకటేశ్ (ఎల్బీ) (బి) మ్యాక్స్‌వెల్ 7; రింకూ సింగ్ (స్టంప్డ్) ఇన్‌గ్లిస్ (బి) చహల్ 2; రసెల్ (బి) యాన్సెన్ 17; రమణ్‌దీప్ (సి) శ్రేయస్ (బి) చహల్ 0; రాణా (బి) యాన్సెన్ 3; అరోరా (సి) ఇన్‌గ్లిస్ (బి) అర్ష్ దీప్ 0; నోర్జే (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (15.1 ఓవర్లలో ఆలౌట్) 95. వికెట్ల పతనం: 1–7, 2–7, 3–62, 4–72, 5–74, 6–76, 7–76, 8–79, 9–95, 10–95. బౌలింగ్: యాన్సెన్ 3.1–0–17–3, బార్ట్‌లెట్ 3–0–30–1, అర్ష్ దీప్ 3–1–11–1, చహల్ 4–0–28–4, మ్యాక్స్‌వెల్ 2–0–5–1.