
పంజాబ్, నైట్‌రైడర్స్ మ్యాచ్ రద్దు
పంజాబ్ 201/4
రాణించిన ప్రభ్‌సిమ్రన్, ప్రియాన్ష్
కోల్‌కతా 7/0
కోల్‌కతా: ఈ మ్యాచ్ గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే ‘మెరుపులు... చినుకులు... రద్దు!’ పంజాబ్ ఓపెనర్ల బౌండరీతో మొదలైన ఈ మ్యాచ్ బ్యాటింగ్ వండర్‌గా సాగింది. మైదానంలో జోష్ తెచ్చింది. ప్రేక్షకుల్ని బాగా అలరించింది. కానీ ఇదంతా ఒక ఇన్నింగ్స్ వరకే పరిమితమైంది. కోల్‌కతా లక్ష్యఛేదన మొదలయ్యాక ఒకటే ఓవర్‌కు ఆట ముగించాల్సి వచ్చింది. వానొచ్చి మైదానంతో పాటు అంతకు ముందరి పరుగుల వరదను ముంచెత్తింది.
భారీ వర్షంతో చాలా సేపు నిరీక్షించినా ఆట కొనసాగే పరిస్థితి లేకపోవడంతో అంపైర్లు చివరకు మ్యాచ్‌ను రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. శనివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (49 బంతుల్లో 83; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు), ప్రియాన్ష్ ఆర్య (35 బంతుల్లో 69; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగారు.
వీరిద్దరు తొలి వికెట్‌కు 72 బంతుల్లో 120 పరుగులు జోడించారు. ఆ తర్వాత వర్షంతో ఆట నిలిచే సమయానికి కోల్‌కతా నైట్‌రైడర్స్ ఒక ఓవర్లో వికెట్ నష్టపోకుండా 7 పరుగులు చేసింది. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ మ్యాచ్ రద్దు కావడం ఇదే మొదటిసారి!
120 దాకా జోరే జోరు!
ఫోర్‌తో మొదలైన పంజాబ్ స్కోరు తర్వాత జోరందుకుంది. ఓపెనర్లు ప్రియాన్ష్, ప్రభ్‌సిమ్రన్‌ల క్రమంగా హోరెత్తించడంతో మైదానం పరుగుల పండగ చేసుకుంది. ఇద్దరు ఫోర్లు, సిక్స్‌లను అలవోకగా దంచేయడంతో స్కోరుబోర్డు దూసుకెళ్లింది. 4.3 ఓవర్లలో కింగ్స్ 50 స్కోరును దాటింది. హర్షిత్ పదో ఓవర్లో ప్రియాన్ష్ వరుసగా 4, 6, 4 బాదాడంతో 27 బంతుల్లోనే అతని ఫిఫ్టీ పూర్తయ్యింది. తర్వాత నరైన్ 11వ ఓవర్‌ను ఇద్దరు కలిసి చితగ్గొట్టారు. ప్రియాన్ష్ ఓ సిక్స్ కొడితే... ప్రభ్‌సిమ్రన్ రెండు సిక్సర్లు బాదాడు. దీంతో 22 పరుగులొచ్చాయి.
ఈ ఓవర్లోనే జట్టు స్కోరు వంద దాటింది. ఎట్టకేలకు 12వ ఓవర్లో రసెల్ ఓపెనింగ్ జోడీకి చెక్ పెట్టాడు. ప్రియాన్ష్ భారీ షాట్‌కు యత్నించి వైభవ్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత 38 బంతుల్లో ప్రభ్‌సిమ్రన్ అర్ధ సెంచరీ పూర్తయింది. సకారియా వేసిన 13వ ఓవర్లో ప్రభ్‌సిమ్రన్ వరుసగా 4, 4, 6 కొట్టడంతో మొత్తం 18 పరుగులు వచ్చాయి. వరుణ్ వేసిన 14వ ఓవర్‌ను పూర్తిగా ఆడిన ప్రభ్‌సిమ్రన్ 4, 0, 4, 6, 4, 1లతో 19 పరుగుల్ని పిండుకున్నాడు. దీంతో ఈ రెండు ఓవర్లలోనే 37 పరుగులు రావడంతో 121/1 స్కోరు కాస్తా 158/1గా ఎగబాకింది.
15వ ఓవర్లో ప్రభ్‌సిమ్రన్ అవుట్ కావడంతోనే స్కోరు, జోరు అన్నీ తగ్గాయి. మ్యాక్స్‌వెల్ (7), మార్కో యాన్సెన్ (3) నిరాశపరచగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (16 బంతుల్లో 26 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) పెద్దగా మెరిపించలేకపోయాడు. దీంతో ఆఖరి 6 ఓవర్లలో పంజాబ్ 43 పరుగులే చేయగలిగింది.
ఈడెన్ గార్డెన్స్‌లో ఏ మ్యాచ్ జరిగినా గంట మోగించే ఆట ఆరంభించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే పహల్గాంలో ఉగ్ర ఘాతుకానికి నివాళిగా ఈ సారి గంట మోగించకుండా నల్ల రిబ్బన్లతో ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలోకి దిగారు. మ్యాచ్ ఆరంభానికి ముందు బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) పహల్గాంలో అసువులు బాసిన పర్యాటకులకు నివాళులు అర్పించింది.
స్కోరు వివరాలు
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ (సి) వైభవ్ (బి) రసెల్ 69; ప్రభ్‌సిమ్రన్ (సి) పావెల్ (బి) వైభవ్ 83; శ్రేయస్ నాటౌట్ 25; మ్యాక్స్‌వెల్ (బి) వరుణ్ 7; యాన్సెన్ (సి) వెంకటేశ్ (బి) వైభవ్ 3; ఇన్‌గ్లిస్ నాటౌట్ 11; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–120, 2–160, 3–172, 4–184. బౌలింగ్: వైభవ్ అరోరా 4–0–34–2, చేతన్ సకారియా 3–0–39–0, హర్షిత్ రాణా 2–0–27–0, వరుణ్ చక్రవర్తి 4–0–39–1, సునీల్ నరైన్ 4–0–35–0, రసెల్ 3–0–27–1.
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: గుర్బాజ్ నాటౌట్ 1; నరైన్ నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (1 ఓవర్లో వికెట్ కోల్పోకుండా) 7. బౌలింగ్: యాన్సెన్ 1–0–6–0.
మాల్దీవుల్లో సన్‌రైజర్స్
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు ఐపీఎల్ మ్యాచ్‌ల ఒత్తిడికి దూరంగా కాస్త విరామం తీసుకున్నారు. తర్వాతి మ్యాచ్‌కు వారం రోజుల వ్యవధి ఉండటంతో సరదాగా గడిపేందుకు ఆటగాళ్లంతా శనివారం మాల్దీవులకు వెళ్లారు. చెన్నైలో సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో విజయం సాధించిన తర్వాత అక్కడినుంచే టీమ్ సభ్యులు మాల్దీవులకు చేరుకున్నారు. సన్‌రైజర్స్ తమ తర్వాతి పోరులో శుక్రవారం అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడుతుంది. ఈ సీజన్‌లో ఆడిన 9 మ్యాచ్‌లలో 3 గెలిచి 6 ఓడిన టీమ్... మిగిలిన ఐదు మ్యాచ్‌లూ గెలిస్తేనే ‘ప్లే ఆఫ్స్’ చేరేందుకు అవకాశం ఉంటుంది.
ఐపీఎల్‌లో నేడు
ముంబై X లక్నో
వేదిక: ముంబై
మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి
ఢిల్లీ X బెంగళూరు
వేదిక: ఢిల్లీ
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం