
ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య పోరు
రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టోర్‌లో ప్రత్యక్ష ప్రసారం
న్యూఢిల్లీ: భారత ప్రధాన బ్యాటర్లు... ఆ్రస్టేలియా ప్రధాన పేసర్ల మధ్య పోరులా అభివర్ణిస్తున్న మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఐపీఎల్ 18వ సీజన్‌లో ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)తో రాయల్ చెలంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ సాధించలేకపోయిన ఈ రెండు జట్లు... తాజా సీజన్‌లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాయి. కెపె్టన్‌లు కాకపోయినా... బెంగళూరు బ్యాటింగ్ భారాన్ని విరాట్ కోహ్లి మోస్తుండగా... ఢిల్లీ క్యాపిటల్స్‌కు కేఎల్ రాహుల్ వెన్నెముకగా నిలుస్తున్నాడు. సాధికారికంగా ఆడుతున్న ఈ ఇద్దరి మధ్య ప్రధాన పోటీ ఉండనుంది.
ఇరు జట్ల మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ రాణించడంతో ఢిల్లీ సునాయాసంగా విజయం సాధించింది. స్వతహాగా కర్ణాటకకు చెందిన రాహుల్... ఆ మ్యాచ్ గెలిచిన తర్వాత ‘ఇది నా అడ్డా’ అన్న తరహాలో సంబరాలు జరుపుకొని వార్తల్లో నిలిచాడు. మరి ఢిల్లీకి చెందిన విరాట్ కోహ్లి ఆదివారం తన సొంత నగరంలో జరగనున్న పోరులో దీనికి సమాధానం చెప్తాడా చూడాలి.
ఢిల్లీ స్టేడియంలో విరాట్‌కు మంచి రికార్డు ఉంది. ఈ సీజన్‌లో తొమ్మిది మ్యాచ్‌లాడిన కోహ్లి అందులో 5 అర్ధ శతకాలు సాధించి ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఇక బౌలింగ్‌లోనూ ఇరు జట్ల ఆసీస్ పేసర్ల మధ్య పోటీ కనిపిస్తోంది. ఢిల్లీ ప్రధాన పేసర్ స్టార్క్ మంచి జోష్‌లో ఉండగా... బెంగళూరు తరఫున హాజల్‌వుడ్ మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆసక్తికర పోరు ఖాయమే!
డుప్లెసిస్ రాకతో...
ఇప్పటి వరకు ఐపీఎల్ ట్రోఫీ చేజిక్కించుకోలేకపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు... ఈ సీజన్‌లో అత్యుత్తమ ఆటతీరు కనబరుస్తోంది. అక్షర్ పటేల్ సారథ్యంలో ముందుకు సాగుతున్న క్యాపిటల్స్... 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 2 పరాజయాలతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక అగ్రస్థానంలో ఉంది. గాయం కారణంగా జట్టుకు దూరమైన ఫాఫ్ డుప్లెసిస్ తిరిగి అందుబాటులోకి రావడం ఆ జట్టు బలాన్ని మరింత పెంచుతోంది.
ఓపెనర్ అభిషేక్ పొరెల్ మంచి ఫామ్‌లో ఉండగా... కరుణ్ నాయర్ తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటున్నాడు. కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, స్టబ్స్, అశుతోష్ శర్మతో మిడిలార్డర్ పటిష్టంగా ఉంది.స్టార్క్‌తో కలిసి ముకేశ్ కుమార్ పేస్ భారం పంచుకోనుండగా... కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ స్పిన్ బాధ్యతలు మోయనున్నారు.
జోరు సాగేనా..!
అంతర్జాతీయ టి20లకు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం ఆడుతున్న తొలి ఐపీఎల్లో విరాట్ దంచికొడుతున్నాడు. బరిలోకి దిగితే చివరి వరకు నిలవాలనే కసితో ముందుకు సాగుతున్నాడు. 65.33 సగటుతో అతడు పరుగులు రాబట్టాడు. ఈ సీజన్‌లో ప్రత్యర్థుల మైదానాల్లో ఆడిన అన్నీ మ్యాచ్‌ల్లోనూ గెలిచిన బెంగళూరు అదే కొనసాగించాలనుకుంటోంది.
కోహ్లితో పాటు మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ కూడా మంచి టచ్‌లో ఉండగా... మిడిలార్డర్‌లో దేవదత్ పడిక్కల్, కెప్టెన్ రజత్ పాటీదార్, జితేశ్ శర్మ కీలకం కానున్నారు. టిమ్ డేవిడ్, రోమారియో షెఫర్డ్ ఫినిషర్ల బాధ్యతలు మోస్తున్నారు. భువనేశ్వర్ కుమార్, హాజల్‌వుడ్, యశ్ దయాళ్ పేస్ భారం మోస్తుండగా... సుయాశ్ శర్మ, కృనాల్ పాండ్యా స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఈ సీజన్‌లో 16 వికెట్లు తీసిన హాజల్‌వుడ్‌పై భారీ అంచనాలున్నాయి.
తుది జట్లు (అంచనా)
ఢిల్లీ క్యాపిటల్స్: అక్షర్ పటేల్ (కెప్టెన్), అభిషేక్ పొరెల్, డుప్లెసిస్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, స్టార్క్, కుల్దీప్, ముకేశ్ కుమార్, చమీరా.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: రజత్ పాటీదార్ (కెప్టెన్), కోహ్లి, సాల్ట్, పడిక్కల్, జితేశ్ శర్మ, షెఫర్డ్, డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్, హాజల్‌వుడ్, యశ్ దయాళ్, సుయాశ్ శర్మ.