
ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న స్టార్లు
నేడు లక్నో సూపర్ జెయింట్స్‌తో ముంబై ఇండియన్స్ ‘ఢీ’
రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
లక్నో: భారీ అంచనాలతో బరిలోకి దిగి ఈ సీజన్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న ఇరు జట్ల మధ్య శుక్రవారం కీలక పోరు జరగనుంది. లక్నో సూపర్ జెయింట్స్‌ను ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ ‘ఢీ’ కొట్టనుంది. తాజా సీజన్‌లో చెరో 3 మ్యాచ్‌లాడిన ఇరు జట్లు ఒక్కో విజయం సాధించి రెండేసి పరాజయాలు మూటగట్టుకున్నాయి. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర (రూ. 27 కోట్లు) దక్కించుకున్న లక్నో సారథి పంత్... ఇప్పటి వరకు ఆకట్టుకోలేకపోయాడు.
గత మూడు మ్యాచ్‌ల్లో అతడు వరుసగా 0, 15, 2 పరుగులు చేశాడు. దీంతో అతడిపై తీవ్ర ఒత్తిడి ఉండగా... ఐపీఎల్‌లో కెప్టెన్సీకి దూరమైనప్పటి నుంచి కేవలం ఇంపాక్ట్ ప్లేయర్‌గానే ఆడుతున్న రోహిత్ శర్మ కూడా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నాడు. తాజా సీజన్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ‘హిట్‌మ్యాన్’ వరుసగా 0, 8, 13 పరుగులు చేశాడు. వీరిద్దరు ఎలాంటి ప్రణాళికలతో బరిలోకి దిగుతారో చూడాలి.
మరోవైపు ఐపీఎల్‌లో ముంబైపై మెరుగైన రికార్డు ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ దాన్నే కొనసాగించాలని భావిస్తోంది. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 6 మ్యాచ్‌లు జరగగా... అందులో ఐదింట లక్నో గెలుపొందింది. మరి స్పిన్‌కు సహకరిస్తున్న లక్నో పిచ్‌పై విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి!
బుమ్రా లేకపోయినా బలంగానే...
ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోయినా... ముంబై ఇండియన్స్ బౌలింగ్ దళం పటిష్టంగానే కనిపిస్తోంది. నైపుణ్యం ఉన్న దేశీయ ఆటగాళ్లను గుర్తించి వారిని సానబెట్టే అలవాటు ఉన్న ముంబై ఫ్రాంచైజీ ఇప్పటికి ఎందరో స్టార్ ఆటగాళ్లను తయారు చేసింది. బుమ్రా, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ ఇలా వెలుగులోకి వచ్చిన వారే. ఇప్పుడా జాబితాలో మరో రెండు కొత్త పేర్లు చేరేలా కనిపిస్తున్నాయి.
గాయం కారణంగా తొలి దశ మ్యాచ్‌లకు బుమ్రా దూరం కావడంతో... జట్టు బౌలింగ్ బలహీనపడుతుంది అనుకుంటే... మేమున్నామంటూ బాధ్యత తీసుకునేందుకు యువ ఆటగాళ్లు ముందుకు వచ్చారు. లెఫ్టార్మ్ పేసర్ అశ్వని కుమార్, మణికట్టు స్పిన్నర్ విఘ్నేశ్ పుథుర్ చెరో 4 వికెట్లతో ఆకట్టుకున్నారు. యంగ్ ప్లేయర్లకు దిశానిర్దేశం చేయడంలో మెరుగైన రికార్డు ఉన్న ముంబై ఫ్రాంచైజీ వీరిద్దరినీ జాగ్రత్తగా తీర్చిదిద్దుతోంది.
తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడినప్పటికీ డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆడిన చివరి మ్యాచ్‌లో ముంబై సాధికారిక విజయం సాధించింది. దక్షిణాఫ్రికా ప్లేయర్ రికెల్టన్ మెరుపులు మెరిపిస్తుండగా... హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ చక్కటి టచ్‌లో ఉన్నాడు. గత మ్యాచ్‌తో సూర్యకుమార్ కూడా లయ అందుకోగా... రోహిత్ శర్మ నుంచి మేనేజ్‌మెంట్ భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. కెపె్టన్ హార్దిక్‌తో పాటు బౌల్ట్, అశ్వని, దీపక్ చాహర్, సాంట్నర్ బౌలింగ్‌లో కీలకం కానున్నారు.
ఫుల్ ఫామ్‌లో పూరన్, మార్ష్...
కొత్త సారథి రిషబ్ పంత్ భారీ స్కోర్లు చేయలేకపోతున్నా... లక్నో జట్టుకు బ్యాటింగ్‌లో పెద్దగా సమస్యలు కనిపించడం లేదు. టి20 స్పెషలిస్ట్, విండీస్ స్టార్ నికోలస్ పూరన్ భారీ సిక్సర్లతో విరుచుకు పడుతుంటే... ఆ్రస్టేలియా బ్యాటర్ మిషెల్ మార్ష్ జట్టుకు మెరుగైన ఆరంభాలు అందిస్తున్నాడు. గత మూడు మ్యాచ్‌ల్లో ఈ ఇద్దరు రెండేసి హాఫ్ సెంచరీలు సాధించారు. క్షణాల్లో ప్రత్యర్థి నుంచి మ్యాచ్‌ను లాగేసుకోగల సామర్థ్యం ఉన్న వీరి నుంచి మేనేజ్‌మెంట్ ఇలాంటి మెరుపులే ఆశిస్తోంది.
మార్క్‌రమ్, డేవిడ్ మిల్లర్ రూపంలో మరో ఇద్దరు విదేశీ ఆటగాళ్లు కూడా ధాటిగా ఆడగలిగే వాళ్లే కావడం... లక్నోకు కలిసి రానుంది. ఆయుశ్ బదోని, శార్దుల్ ఠాకూర్, షాబాజ్ నదీమ్ రూపంలో ముగ్గురు స్వదేశీ ప్లేయర్లు లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసేందుకు సిద్ధం. ఎటొచ్చి పంత్ ఫామ్ మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది.
చాంపియన్స్ ట్రోఫీలో భారత తుది జట్టులో చోటు దక్కకపోవడంతో బెంచ్‌కే పరిమితమైన రిషబ్... ఈ మ్యాచ్‌లోనైనా దంచికొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇతర జట్లతో పోల్చుకుంటే... బౌలింగ్‌లో కాస్త బలహీనంగా కనిపించిన లక్నో... శార్దుల్ ఠాకూర్ రాకతో బలంగా తయారైంది. గాయం నుంచి కోలుకున్న ఆకాశ్‌దీప్ ఈ మ్యాచ్‌లో ఆడటం ఖాయమే. రవి బిష్ణోయ్, దిగ్వేశ్ రాఠి కీలకం కానున్నారు.
తుది జట్లు (అంచనా)
లక్నో సూపర్ జెయింట్స్: పంత్ (కెప్టెన్), మార్క్‌రమ్, మార్ష్, పూరన్, బదోని, మిల్లర్, సమద్, శార్దుల్, దిగ్వేశ్ రాఠి, ఆకాశ్‌దీప్, రవి బిష్ణోయ్, సిద్ధార్థ్.
ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్, రికెల్టన్, సూర్యకుమార్, తిలక్ వర్మ, నమన్ ధీర్, సాంట్నర్, దీపక్ చాహర్, బౌల్ట్, అశ్వని కుమార్, విఘ్నేశ్ పుథుర్, ముజీబ్.
6 ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య 6 మ్యాచ్‌లు జరిగాయి. ఐదింటిలో లక్నో గెలుపొందగా... ఒక మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది.