
సాక్షి, హైదరాబాద్: అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని పంచాయతీ చేసే తీర్మానాన్ని అమ లు చేయాలని నోటీసు జారీ చేసే అధికారం గ్రామ సర్పంచ్‌లకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. గ్రామ పంచాయతీ తీర్మానాన్ని పంచాయతీ కార్యదర్శి ద్వారా అమలు చేయించాలని చట్టం చెబుతోందని, గ్రామ పంచాయతీ చేసిన తీర్మానం ప్రకారం నోటీసును నేరుగా గ్రామ సర్పంచ్ జారీ చేసే అధికారం చట్టంలో లేదని తెలిపింది. రంగారెడ్డి జిల్లా శంషా బాద్ మండలం నానాజీపూర్‌కి చెందిన రైతు వంగ రాఘవరెడ్డి దాఖలు చేసిన కేసులో హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రహరీ నిర్మాణం వల్ల రోడ్డు మూసుకుపోతుందని, అక్రమంగా నిర్మించిన ప్రహరీని తొలగించాలని గ్రామ పంచాయతీ చేసిన తీర్మానం ప్రకా రం నోటీసును నేరుగా అక్రమ కట్టడానికి పాల్పడిన వ్యక్తికి సర్పంచ్ జారీ చేయడాన్ని తప్పుబడుతూ రాఘవరెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి చేయాల్సిన విధుల్ని సర్పంచ్ చేయడం చట్ట వ్యతిరేకమని, పంచాయతీరాజ్ చట్టంలోని 32 సెక్షన్ ప్రకారం సర్పంచ్‌కు అధికారం పరిమితమని పిటిషనర్ తరఫు న్యాయవాది జనార్దన్‌రెడ్డి వాదించారు.
పంచాయతీ చట్టం ప్రకారం పంచాయతీలకు అధికారం ఉంటుందని, పంచాయతీ తీర్మానం ప్రకారం సర్పంచ్ నోటీ సు ఇవ్వొచ్చని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. వాద నలు విన్న హైకోర్టు ‘పంచాయతీ శాఖ కమిషనర్ చట్టంలోని 42వ సెక్షన్ ప్రకారం గ్రామ పంచాయతీ కార్యదర్శిని నియమిస్తారు. కార్యదర్శే పంచాయతీ స్థిరచరాస్తుల రక్షణ, నిర్వహణ బాధ్యతలు నిర్వహించాలి. ఆస్తుల అంశంపై పంచాయతీ పాలకవర్గం చేసే తీర్మానాన్ని కార్యదర్శే అమలు చేయాలి. ఈ కేసులో పిటిషనర్ సర్పంచ్ నేరుగా నోటీసు ఇవ్వడాన్ని సవాల్ చేయడం సరైనదే. సర్పంచ్‌కు నోటీసు ఇచ్చే అధికారం లేదు’ అని స్పష్టం చేస్తూ వ్యాజ్యంపై విచారణ ముగిసినట్లుగా ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment