panchayat secretary
-
పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
వికారాబాద్: వికారాబాద్ జిల్లా కొడంగల్ పరిధిలోని ‘లగచర్ల కేసు’కు సంబంధించి సోమవారం పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. దాడిలో పాలుపంచుకున్నాడనే కారణంతో పోలీసులు ఓ పంచాయతీ కార్యదర్శిని అరెస్టు చేయగా, అతన్ని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 11న లగచర్ల ఘటన చోటుచేసుకోగా, ఇందులో 42 మంది పాల్గొన్నట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. మరుసటి రోజున 21 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.ఇందులో సంగాయిపల్లి పంచాయతీ కార్యదర్శి కావలి రాఘవేందర్ ఏ– 26గా ఉన్నాడు. అతని స్వగ్రామం లగచర్ల కాగా సంగాయిపల్లిలో విధులు నిర్వర్తిస్తున్నాడు. రిమాండ్ రిపోర్టులో అతని వృత్తి పంచాయతీ కార్యదర్శి అని కూడా పోలీసులు మెన్షన్ చేశారు. ఈ విషయాన్ని పోలీసులు తమకు తెలియజేయలేదని, శనివారం కలెక్టర్‌కు తెలియడంతో అతన్ని సస్పెండ్ చేశారని డీపీఓ జయసుధ తెలిపారు. ఇదిలావుండగా రిమాండ్ రిపోర్టులో తాను ఇచి్చనట్టుగా పేర్కొన్న వాంగ్మూలం వాస్తవం కాదని, మూడురోజుల క్రితం నరేందర్‌రెడ్డి అందజేసిన అఫిడవిట్‌ను న్యాయవాదులు సోమవారం కొడంగల్ కోర్టులో దాఖలు చేశారు. మరోవైపు నరేందర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై సోమవారం వికారాబాద్ జిల్లా కోర్టులో వాదనలు జరగగా, న్యాయమూర్తి తదుపరి విచారణను ఈనెల 25వ తేదీకి వాయిదా వేశారు. కస్టడీ పిటిషన్‌పై రేపు విచారణ నరేందర్‌రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్‌పై విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేశారు. ఇంకోవైపు లగచర్లలో ఘటనలో నిందితుల అరెస్టులు కొనసాగుతుండగానే.. పోలీసు ఉన్నతాధికారులు పరిగి డీఎస్పీ కరుణాసాగర్రెడ్డిపై వేటు వేశారు. ఆయనను డీజీపీ ఆఫీస్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఉత్తర్వుల్లో సాధారణ బదిలీగా పేర్కొనడం గమనార్హం. కాగా కొత్త డీఎస్పీగా శ్రీనివాస్‌కు బాధ్యతలు అప్పగించారు. -
కాంగ్రెస్ నేతలవి పిచ్చి మాటలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘కాంగ్రెస్ నాయకులు వీఆర్ఏలను, పంచాయతీ కార్యదర్శులను రెచ్చగొట్టాలని చూశారు.. కానీ వారిని రెగ్యులరైజ్ చేశాము.. రేషన్‌డీలర్ల సమస్యనూ పరిష్కరించాం.. ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు.. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ఇంటింటికీ మంచినీరు వంటి పథకాలతో మహిళలు సీఎం కేసీఆర్‌కు జైకొడుతున్నారు.. ఇక ఏం చేయాలో తెలియక కాంగ్రెస్ నాయకులు పిచ్చిగా మాట్లాడుతున్నారు’’ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. శనివారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆయన బీసీ బంధు లబ్ధిదారులకు రూ.లక్ష సాయం పంపిణీ చేశారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారానికి సంబంధించిన డబ్బులను బ్యాంకు వెబ్సైట్లపై స్వయంగా మీట నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేయించారు. అనంతరం హరీశ్ మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల తీరును తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ సభలకు ప్రజలు రాకపోవడంతో వారికి ఏం చేయాలో తోచడం లేదన్నారు. ధరణిని రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్ నాయకులు తిరిగి బ్రోకర్ల రాజ్యం తెచ్చేందుకు ప్రయత్నిస్తారా అని నిలదీశారు. రైతులే తేల్చుకోవాలి.. వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ సరిపోతుందన్న కాంగ్రెస్ కావాలో.. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెట్టాలంటున్న బీజేపీ కావాలో.. మూడు పంటలు పండించేలా రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ కావాలో రైతులే తేల్చుకోవాలని మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. రైతుల ఉసురు పోసుకున్నది కాంగ్రెస్ పార్టీనే అని, ఆ ప్రభుత్వ హయాంలో అర్ధరాత్రి విద్యుత్ సరఫరా అయ్యేదని, ఎరువుల బస్తాల కోసం పోలీస్స్టేషన్లలో క్యూలైన్లో నిలబడాల్సిన దుస్థితి ఉండేదన్నారు. కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలి.. కేంద్రంలోని బీజేపీ సర్కారు తెలంగాణకు రావాల్సిన రూ.35 వేల కోట్లు నిలిపివేసిందని, ఆ నిధులను కేంద్రం ఎందుకు ఆపిందో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలని హరీశ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ సర్కారేనని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీ బీబీపాటిల్, రాష్ట్ర హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, కలెక్టర్ శరత్ పాల్గొన్నారు. -
ఫుల్లుగా తాగి పడుకున్న పంచాయతీ కార్యదర్శి.. మంత్రి ఆకస్మిక తనిఖీ..
లక్నో: యూపీలోని కన్నౌజ్‌లోని జసర్‌పురా సరయ్య గ్రామం పంచాయతీ కార్యాలయంలో మంత్రి అసీమ్ అరుణ్ ఆకస్మిక తనిఖీ చేశారు. శుక్రవారం ఆయన పంచాయతీ కార్యాలయానికి వచ్చేసరికి ప్రధాన కార్యదర్శి ఫుల్లుగా తాగి పడుకున్నాడు. మంత్రి స్వయంగా ఆ పెద్దమనిషిని లేపారు. లేచాక ఆ కార్యదర్శి చేసిన హంగామాకు చుట్టూ ఉన్నవారు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. మిషన్-2024లో భాగంగా యూపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అసీమ్ అరుణ్ మొదట కన్నౌజ్‌లోని జసర్‌పురా సరయ్య గ్రామంలో పర్యటించారు. స్థానిక బీజేపీ నాయకులతో మొదట చర్చలు నిర్వహించిన మంత్రి తర్వాత వారితో కలిసి టిఫిన్ కూడా చేశారు. అనంతరం ఆ గ్రామంలోని పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. కార్యాలయం లోపలికి వెళ్లేసరికి పంచాయతీ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర కమల్ ఫుల్లుగా తాగి మంచం మీద పడుకుని హాయిగా నిద్రిస్తున్నారు. మంత్రి తన కళ్ళను తాను నమ్మలేకపోయారు. దగ్గరకు వెళ్తూ.. "ఎవరీయన..?" అనడిగారు. "ఆయన ఇక్కడి పంచాయతీ ప్రధాన కార్యదర్శి" అని అక్కడున్నవారు బదులిచ్చారు . షాకైన మంత్రి అతడిని తట్టి లేపగా గాఢ నిద్రలో ఉన్న కార్యదర్శి మెల్లగా కళ్ళు తెరిచి చుట్టూ జనం ఉండటాన్ని చూసి మత్తులోనే లేచే ప్రయత్నం చేశాడు. లేస్తూ తూలిపడబోగా అతడిని స్వయంగా మంత్రి పట్టుకుని ఊతమిచ్చారు. మొత్తానికి తేరుకున్న ఆ పెద్దమనిషిని చూస్తూ "నేను మంత్రిని" అని తనని తాను పరిచయం చేసుకుని "మీరు ఇక్కడ కార్యదర్శా..?" అని ప్రశ్నించారు. అవునన్నట్టు తల ఊపాడు సతీష్ చంద్ర. "తాగి ఉన్నావా?" అనడిగితే నేను తాగలేదని చెబుతూ మంత్రి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరాడు. ఒకసారి నడిచి చూపించమని మంత్రి అడగ్గా అడుగులో అడుగు వేసుకుంటూ జాగ్రత్తగా రెండడుగులు వేశాడు. నీ పేరేంటి అనడిగితే కార్యాలయం బయట సతీష్ చంద్ర కమల్ అని ఉన్న నేమ్ ప్లేటును చూపించాడు. మరీ ఇంతలాగా తాగితే ఎలా పని చేస్తారని మంత్రి ప్రశ్నించగా కార్యదర్శి కళ్లనీళ్లు పెట్టుకుని క్షమించమని కోరాడు. ఇంతలో అక్కడున్నవారు ఇదే కార్యాలయంలో సహాయ కార్యదర్శిగా ఒక మహిళను నియమించారని ఆమే అన్ని పనులను చక్కబెడుతుందని మంత్రి అసీమ్ అరుణ్ కు వివరించారు. మంత్రి కార్యదర్శికి నాలుగు చీవాట్లు పెట్టి వారించి అక్కడినుండి వెళ్లిపోయారు. ఈ తంతు జరుగుతున్నంత సేపు అక్కడున్నవారంతా నవ్వు ఆపుకోలేకపోయారు. Intoxicated Pradhan Ji, Minister reached office 😳 WATCH .#PanchayatOffice #AseemArun #Kannauj #UttarPradesh #ViralVideo #ViralPost #ViralNews #ViralShorts #ViralReels #viralpage #AsianetNewsable pic.twitter.com/Otn8QoRCLy — Asianet Newsable (@AsianetNewsEN) July 15, 2023 ఇది కూడా చదవండి: మీ ఇంట్లో గేదెలు పాలు ఇవ్వకపోయినా మేమే కారణమా? -
పంచాయతీ కార్యదర్శినా... పాలేరునా? చావే నాకు దిక్కు!
బయ్యారం: ‘నాది మధ్యతరగతి కుటుంబం. మా కాడ ఎవరూ పెట్టుబడి పెట్టరు. కార్య దర్శినే పెట్టుకోవాలి. ఇదెక్కడి న్యాయం? ట్రాక్టర్ పర్సంటేజీలు తీసుకునేది సర్పంచ్‌లు. కానీ కార్యదర్శి డీజిల్ పోయించి ట్రాక్టర్ నడపాలా.. వారికి బాధ్యత లేదా? ఇది ఉద్యోగమా.. బానిస బతుకా సార్’ అంటూ ఎంఏ బీఈడీ చదివిన ఓ దివ్యాంగ పంచాయతీ కార్యదర్శి శుక్రవారం సూసైడ్‌నోట్ రాసి ఆత్మహత్యకు యత్నించాడు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నారాయణపురం పంచాయతీ కార్యదర్శిగా అదే మండలం ఇర్సులాపురం గ్రామానికి చెందిన దివ్యాంగుడు ఈసం వెంకటేష్ 16 నెలలుగా పనిచేస్తున్నాడు. గ్రామంలో వాడే ట్రాక్టర్‌కు డీజిల్‌ను రోజూ తన డబ్బులతోనే కొంటున్నాడు. వాటి బిల్లుల కోసం వెళ్లితే జాయింట్ చెక్ పవర్ ఉన్న సర్పంచ్, ఉప సర్పంచ్‌లు సంతకాల కోసం తిప్పించుకుంటున్నారు. దీంతో కలత చెందిన వెంకటేష్ ఇంటివద్ద పురుగుమందు తాగాడు. దీంతో కుటుంబ సభ్యులు మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. సూసైడ్ నోట్లో ఏముందంటే.. ‘అడిషనల్ కలెక్టర్ మేడం... కలెక్టర్ సార్.. గ్రా మంలో ఏమైనా ఖర్చులు పెట్టాల్సి వస్తే కా ర్యదర్శి పెట్టాలి అని ఏమైనా చట్టంలో ఉందా.. మేమూ మనుషులమే. మమ్మల్ని బలిపశువుల్ని చేశారు. పాలేరు కంటే ఎక్కువగా వాడుకుం టున్నారు. ఉపసర్పంచ్ సంతకం ఏమైనా రాష్ట్రపతి సంతకమా? అ, ఆ..లు రానివాళ్లు సర్పంచ్, ఉపసర్పంచ్లు అయితే మా పరిస్థితి ఏమిటి?’ అంటూ ఆవేదన వెలిబుచ్చాడు. -
Panchayat Secretary: ఉద్యోగమా.. చాకిరా?
ఆమె ఓ పంచాయతీ కార్యదర్శి. ఇద్దరు పిల్లల తల్లి. చీకటిలోనే పనులు ముగించు కున్నారు. ఈలోపు భారీ వర్షం. అయినా.. తడుస్తూనే విధులకు వెళ్లారు. కార్యాలయానికి చేరుకొని ఫొటో తీసుకుని యాప్‌లో అప్లోడ్ చేశారు. ఇదంతా ఎందుకంటే కేవలం అటెండెన్స్ కోసమే. సాక్షి, కరీంనగర్: ఉదయాన్నే 8 గంటలకు విధుల్లో చేరామన్న సందేశం చేరితేనే ఆ రోజు పనిచేసినట్లు లెక్క. పోనీ అంత ఉదయం వెళ్లినా.. ఎప్పుడు తిరిగి వస్తారో తెలియనంతగా పనులు. ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో తీవ్ర పని ఒత్తిడి మధ్య పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులకు పల్లెప్రగతి యాప్ వచ్చాక వేధింపులు పెరిగిపోయాయి. ముఖ్యంగా తాము ఉదయాన్నే అది కూడా ఉదయం 8 గంటల్లోపే గ్రామపంచాయతీ కార్యాలయాన్ని చేరుకొని, కార్యాలయం కనిపించేలా సెల్ఫీ తీసుకుని దాన్ని అప్లోడ్ చేయాలి. ఏదైనా కారణం చేత కాస్త లేటైనా.. ఆ రోజు జీతం హుష్‌కాకి. ఇటీవల బుగ్గారంలో ఓ ఎంపీడీవో తన పరిధిలోని తొమ్మిది మంది పంచాయతీ కార్యదర్శులకు మెమో జారీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. తాను వాట్సాప్ గ్రూపులో పెట్టిన సందేశానికి స్పందించలేదన్న కారణానికే ఆగ్రహించిన అధికారి ఏకంగా 9 మందికి మెమో జారీ చేశారు. ఈ విషయం పలువురు నెటిజన్లు మంత్రి కేటీఆర్‌కు, జగిత్యాల కలెక్టర్ రవి దృష్టికి తీసుకెళ్లారు. సెల్ఫీ తీసుకుంటేనే మస్టర్.. ► ఉదయాన్నే ఎనిమిది గంటలకు పంచాయతీ కార్యాలయానికి రావాలి. అక్కడ జీపీ లైవ్ లొకేషన్‌తోపాటు, లాంగిట్యుడ్, లాటిట్యూడ్ వివరాలు, పంచాయతీ భవనం కనిపించేలా సెల్ఫీ దిగి పల్లె ప్రగతి పీఎస్ యాప్‌లో అప్లోడ్ చేయాలి. ► పల్లెప్రగతి పీఎస్ యాప్.. ఎంపీవో (మండల పంచాయతీ ఆఫీసర్) అనే రెండు రకాల లాగిన్లు పంచాయతీ కార్యదర్శులకు ఉంటాయి. ప్రతీ పంచాయతీ కార్యదర్శి విధిగా రోజూ రెండు కాలువలు, రెండు రోడ్లు, ఏదైనా ఒక ప్రభుత్వ సంస్థల భవనాలను క్లీన్ చేయించాలి. ► ఈ ఐదు పనులకు సంబంధించి ఐదు ఫొటోలు విత్ డేట్ అండ్ టైం ప్రకారం.. అప్లోడ్ చేస్తేనే ఆ రోజు పనిచేసిట్లు లెక్క. ఈ విధంగా నెలలో మొత్తం 24 పనిదినాలు ఇదే రకంగా విధులు నిర్వహించాలి. పాత ఫొటోలు అప్లోడ్ కావు. ► దీనికితోడు వీధి బల్బులు మార్చడం, ఇళ్ల నుంచి చెత్త సేకరణ వివరాలు కూడా రోజూ రిపోర్టు అప్లోడ్ చేయాలి. ► ఏ ఉద్యోగికైనా ఇంట్లో కనీస బాధ్యతలు ఉంటాయి. పిల్లలను స్కూలుకు పంపడం, మహిళలైతే ఇంట్లో వంట, పిల్లలు తదితర పనులు ఉంటాయి. కానీ.. కొత్త నిబంధన కారణంగా ఉదయాన్నే 7 గంటలకు బయల్దేరాలి. పిల్లలు నిద్రలేవక ముందే వదిలేసి రావడం చాలా బాధగా ఉందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ► పోనీ, 5 గంటలకు ఉద్యోగం ముగుస్తుందా.. అంటే అదీ లేదు. వీడియో కాన్ఫరెన్స్‌లు, టెలీకాన్ఫనెన్స్లు జరిగితే గంటల కొద్దీ సమయంపాటు అక్కడే ఉండాలి. అవి పూర్తయ్యాక ఏ అర్ధరాత్రో అపరాత్రో ఇల్లు చేరాలి. మళ్లీ ఉదయాన్నే విధులకు హాజరవ్వాలి. ► పంచాయతీ కార్యదర్శులపై మండలస్థాయిలో ఎంపీవో, ఎంపీడీవో, డివిజనల్ స్థాయిలో డీఎల్పీవో, ఏపీడీ, పీడీ జిల్లాస్థాయిలో ఏపీవో, డీపీవో వరకు ఇంతమంది సూపర్విజన్ ఉంటుంది. వీరందరూ ఏం పనిచెప్పినా ఎదురుచెప్పకుండా చేయాల్సిందే. ► ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలి. జనన మరణ రికార్డులు, ఇంటి పన్నులవసూళ్లు, రెవెన్యూ రికార్డుల నమోదు, పరిపాలనపరమైన విధులన్నీ వీరే నిర్వహించాలి. ► పొరపాటున ఎదురుతిరిగినా, చేయలేమని చెప్పినా, టైమ్‌కు విధులకు రాలేకపోయినా మెమోలు జారీ చేస్తూ మానసికంగా తీవ్రంగా వేధిస్తున్నారు. ► హరితహారం మొక్కలు పెరగకపోయినా, ఊర్లో కోవిడ్ వ్యాక్సినేషన్ వేసుకోకపోయినా, చిన్న చెత్త కనిపించినా వెంటనే మెమో జారీ చేస్తారు. ► ఇవి చాలవన్నట్లుగా గ్రామంలో సర్పించి, వార్డుమెంబర్లు, ప్రతిపక్ష నాయకులు, ఊర్లో ఉన్న పెద్దమనుషులు అంతా ప్రతీ పనికి వీరి మీదే పడుతున్నారు. ► ఈ ఉద్యోగాలు చేస్తున్న వారిలో దాదాపు 99 శాతం మంది పీజీలు చదివిన వారే. కరోనాకు ముందు ఈ ఉద్యోగాన్ని చాలామంది మానేద్దామనుకున్నారు. కానీ.. బయట కూడా పరిస్థితి బాగాలేకపోవడంతో విధిలేక ఈ కొలువులోనే కొనసాగుతున్నారు. చదవండి: 50 వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలి -
తెలంగాణలో 172 జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టులు
తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని పంచాయతీ రాజ్, గ్రామీణ ఉపాధి కమీషనర్ కార్యాలయం.. స్పోర్ట్స్ కోటా కింద రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ► పోస్టులు: జూనియర్ పంచాయతీ సెక్రటరీలు ► మొత్తం పోస్టుల సంఖ్య: 172 ► అర్హత: డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.స్పోర్ట్స్ కోటా అర్హత సాధించి ఉండాలి. ► వయసు: 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీలకు ఐదేళ్లు, ఎక్స్ సర్వీస్మెన్లకు మూడేళ్లు, పీహెచ్ అభ్యర్థులకు పదేళ్లు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. ► జీత భత్యాలు: నెలకు రూ.28,719 వేతనం అందిస్తారు. ► ఎంపిక విధానం: రాత పరీక్షతోపాటు క్రీడలకు సంబంధించిన సర్టిఫికెట్ల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ 1లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, కల్చర్, తెలంగాణ హిస్టరీ నుంచి 100 మార్కులకు 100 ప్రశ్నలు ఉంటాయి. అలాగే పేపర్2లో తెలంగాణ పంచాయతీ రాజ్ యాక్ట్ 2018,రూరల్ డవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై 100 మార్కులకు 100ప్రశ్నలు అడుగుతారు.ప్రతి పేపర్లో కనీసం 35మార్కులు సాధించాల్సి ఉంటుంది.ప్రశ్న పత్రం తెలుగు,ఇంగ్లిష్, ఉర్దూల్లో ఉంటుంది. (ఐటీ నిరుద్యోగులకు శుభవార్త.. భారీగా ఉద్యోగాలు!) ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 08.10.2021 ► వెబ్సైట్: https://epanchayat.telangana.gov.in/cs -
పంచాయతీ కార్యదర్శికి సీఎం కేసీఆర్ ఫోన్
పర్వతగిరి: వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామపంచాయతీ కార్యదర్శి రమాదేవితో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. శనివారం కార్యదర్శికి ఫోన్ చేసిన సీఎం.. పంచాయతీలో గృహ నిర్మాణ రికార్డులు, అనుమతులు, నాలా కన్వర్షన్ తదితర వివరాలపై ఆరా తీశారు. ఏనుగల్ పంచాయతీలో రికార్డుల పరంగా ఎన్ని గృహాలు ఉన్నాయి? నమోదు కాని గృహాలు ఎన్ని.. తండ్రి నుంచి పిల్లలకు వారసత్వంగా వస్తే ఏ విధంగా రికార్డు చేస్తారు..? తండ్రి చనిపోతే రికార్డుల్లో నమోదు చేసే విధానం ఏమిటి.. గృహ నిర్మాణ రికార్డులు రెవెన్యూ విభాగంలో పొందుపర్చి ఉంటాయా అని కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. నాలా కన్వర్షన్ తర్వాతనే.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తనతో పాటు కుమారుడు కేటీఆర్ పేరిట ఎర్రవల్లిలో వ్యవసాయ భూమి ఉందని తెలిపారు. ఇందులోని ఎకరన్నర స్థలంలో గృహ నిర్మాణం చేపట్టేందుకు ఉన్నతాధికారులతో ఆరా తీయగా.. నాలా కన్వర్షన్ అనంతరం గ్రామపంచాయతీ అనుమతి తీసుకోవాలని సూచించినట్లు చెప్పారు. దీంతో నాలా కన్వర్షన్ తదుపరి ఎర్రవల్లి గ్రామపంచాయతీ నుంచి అనుమతి తీసుకుని గృహ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. గ్రామాల్లో రైతులు తమ వ్యవసాయ భూముల్లో గృహం నిర్మించాలనుకుంటే ఇదే తరహాలో నాలా కన్వర్షన్ చేశాక నిర్మాణ అనుమతి పంచాయతీ కార్యదర్శులు ఇవ్వాలని సూచించారు. అదే విధంగా ప్రతీ గ్రామపంచాయతీలో రెవెన్యూ శాఖతో సంబంధం లేకుండా గృహ నిర్మాణాల రికార్డులను ఆన్లైన్ చేయాలని తెలిపారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో ఆన్లైన్ వ్యవస్థ నెమ్మదిగా ఉన్నా, భవిష్యత్‌లో పూర్తి స్థాయిలో మెరుగుపరుస్తామని వివరించారు. కాగా, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ స్వగ్రామం ఏనుగల్ కావడం గమనార్హం. -
పంచాయతీ కార్యదర్శికి సీఎం కేసీఆర్ ఫోన్
సాక్షి, వరంగల్ రూరల్ : పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రమాదేవికి శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ రికార్డులపై ఆరా తీశారు. ఎమ్మార్వో ఆఫీసు, పంచాయతీ ఆఫీసుల్లో ఉండే రికార్డులను అడిగి తెలుసుకున్నారు. ఏనుగల్ గ్రామంలో ఇంటి పన్నుల నిర్వహణ, అనుమతుల జారీ, ఇళ్ల యజమానుల పేరు మార్పిడి, వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్పు తదితర అంశాల గురించిఅడిగి తెలుసుకున్నట్లు రమాదేవి మీడియాకు తెలిపారు. -
కార్యదర్శి, సర్పంచ్ భర్త బాహాబాహీ..
సాక్షి, రఘునాథపల్లి: అభివృద్ధి పనుల్లో జాప్యంపై సర్పంచ్ భర్త, పంచాయతీ కార్యదర్శి పరస్పరం దాడి చేసుకున్నారు. నిధులు డ్రా చేసి పనులు చేయకపోవడంపై నిలదీసినందుకు తనపై దాడి చేశాడని కార్యదర్శి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, తనపై అసత్య ప్రచారం చేస్తూ తననే దుర్భాషలాడి దాడి చేశాడని సర్పంచ్ భర్త కూడా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కాగా, ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం భాంజీపేట గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. భాంజీపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీరంగరెడ్డి, సర్పంచ్ గొరిగె భాగ్య భర్త రవి మధ్య నిధుల విడుదల, తడి పొడి చెత్త వేరు చేసేందుకు సెగ్రిగేషన్ షెడ్డు నిర్మాణంలో జాప్యంపై వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మాటామాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. సెగ్రిగేషన్ షెడ్డు నిర్మాణం కోసం రూ.1.14 లక్షల నిధులను పంచాయతీ ఖాతా నుంచి డ్రా చేశారని, ఇప్పటికి షెడ్డు నిర్మించకపోవడంతో అధికారులు తనను ప్రశ్నిస్తున్నారని పంచాయతీ కార్యదర్శి పేర్కొన్నాడు. అధికారులకు సమాధానం చెప్పలేక సర్పంచ్ భర్త రవిని అడిగానని, దీంతో తననే ప్రశ్నిస్తావా అని చొక్కా చింపి దాడి చేశాడని కార్యదర్శి అంటున్నాడు. కాగా, ఇవే విషయాలను ప్రస్తావిస్తూ కార్యదర్శి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉంటే పంచాయతీ నిధులు దుర్వినియోగం చేస్తున్నానని, సీసీ రోడ్డు నాణ్యత లేదని గ్రామంలో తనపై దుష్పచారం చేస్తూ కార్యదర్శి అవమానిస్తున్నాడని సర్పంచ్ భర్త రవి చెబుతున్నాడు. సెగ్రిగేషన్ షెడ్ నిర్మాణానికి అడ్వాన్స్‌గా పంచాయతీ నిధులు తీసుకున్న మాట వాస్తవమేనన్నారు. ఈ విషయమై తాను నెమ్మదిగా సమాధానం చెబుతున్నా వినకుండా తననే దుర్మషలాడుతూ చేయిచేసుకోవడంతో రక్తస్రావం జరగడంతో తాను పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు రవి పేర్కొన్నాడు. అయితే, సర్పంచ్ భర్త రవి, పంచాయతీ కార్యదర్శి శ్రీరంగరెడ్డి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఇరువురిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కందుల అశోక్‌కుమార్ తెలిపారు. -
ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియామకం
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 425 గ్రామ పంచాయతీ కార్యదర్శి పోస్టులను ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రిటైర్డ్, పదోన్నతి, చనిపోయిన కార్యదర్శుల స్థానే కొత్త పోస్టులు మంజూరయ్యే వరకు.. తాత్కాలిక ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంగళవారం వెల్లడిం చింది. ఈ మేరకు జిల్లాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు నియామకాలు చేపట్టాలని పీఆర్ శాఖ కమిషనర్ కలెక్టర్లను ఇటీవలే ఆదేశించారు. ఈ పోస్టులకు రిటైర్డ్ ఉద్యోగులు, మాజీ సైనికులనే ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. తాత్కాలిక ప్రాతిపదికన నియమించే వీరికి నెలకు రూ.15 వేల వేతనం ఇవ్వనున్నారు. ఈ నెలాఖరులోపు భర్తీ చేయనున్న ఈ పోస్టులకు కనీస విద్యార్హతగా డిగ్రీ ఉత్తీర్ణతను నిర్ణయించారు. -
దొడ్డి దారిన ఉద్యోగ భర్తీ చెల్లదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 9,335 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేసేట ప్పుడు రిజర్వేషన్ల నిబంధనలను అమలు చేయలేదని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఏపీ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్–1996లోని రూల్ 22కు వ్యతిరేకంగా ఆ పోస్టులను భర్తీ చేయడంపై కోర్టు ఆక్షేపించింది. 2018లో రాష్ట్రంలోని వివిధ ప్రాం తాల్లో పంచాయతీరాజ్ శాఖ ఆ పోస్టులను భర్తీ చేసింది. అయితే అప్పటికే ఆ పోస్టులను రిజర్వేషన్ల నిబంధనలకు లోబడి భర్తీ చేయాలని హైకోర్టు ఉత్తర్వులున్నా పట్టించుకోలేదు. క్రీడలు ఇతర అన్ని కేటగిరీల రిజర్వేషన్లు 50 శాతం మించకుండా భర్తీ ఉండాలని, వంద పాయింట్ల రోస్టర్ విధానాన్ని అమలు చేయాలని, ఏపీ సబా ర్డినేట్ రూల్స్ యాక్ట్–1996లోని 22వ నిబం ధనలను అమలు చేయాలన్న చట్ట నిబంధనలను ఉల్లంఘించి పోస్టులు భర్తీ చేశారని తప్పుపట్టింది. చట్టానికి వ్యతిరేకంగా పోస్టుల భర్తీ చేశారని దాఖలైన కోర్టు ధిక్కార వ్యాజ్యం విచారణకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ రఘునందన్‌రావు హాజరయ్యారు. పూర్తి వివరాలు సమర్పిం చేందుకు 8 వారాల సమయం కావాలని ఆయన కోరారు. అందుకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావు అంగీకరించలేదు. అంతకు ముందు ఉన్న కమిషనర్ నీతూకుమారి ప్రసాద్‌కు హైకోర్టు సుమోటోగా కోర్టు ధిక్కార నోటీసు జారీ చేసింది. ఇదే విషయాన్ని ఆమెకు తెలియజేయాలని రఘునందన్‌రావును హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. ఐఏఎస్‌లకు ఆ మాత్రం తెలియదా? ‘దొడ్డి దారిన భర్తీ చేసిన పోస్టులపై ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలి. రిజర్వేషన్ల నిబంధన అమలు చేయకుండా పోస్టులను భర్తీ చేస్తే హైకోర్టు చూస్తూ కూర్చోదు. చట్ట వ్యతిరేకంగా భర్తీ చేసిన పోస్టుల్లో చేరిన వారిని ఏం చేస్తారో చెప్పండి. నియామకాలు చేసేటప్పుడు చట్ట ప్రకారం న్యాయపర అభిప్రాయాన్ని కూడా పొందిన తర్వాతే చేయాలన్నది పాలనలో అత్యంత కీలక విషయం అని ఐఏఎస్ అధికారులకు తెలియదా. చట్టాలను సరిగ్గా అమలు చేస్తే కోర్టు ధిక్కార కేసుల నమోదు అనూహ్యంగా ఉండదు. ఈ కేసులో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయకపోవడం చట్టవ్యతిరేకం. చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఎవ్వరూ ఉద్యోగాలు పొందడానికి వీల్లేదు. చేసిన తప్పుల్ని ఎలా సరిదిద్దుతారో చెప్పండి. భర్తీ చేసే ముందు అడ్వొకేట్ జనరల్ అభిప్రాయం తీసుకుని ఉంటే న్యాయపరమైన అవరోధాలు ఉండేవే కావు. తప్పులను సరిదిద్దే చర్యలు ఏం తీసుకున్నారో వచ్చే శుక్రవారం జరిగే విచారణ సమయంలో చెప్పండి’అని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ఏ పనికైనా జేబు నిండాల్సిందే..
సాక్షి, యద్దనపూడి (ప్రకాశం): మండల కేంద్రమైన యద్దనపూడి మండల పంచాయతీ తాజామాజీ కార్యదర్శి కుమారస్వామి గత ప్రభుత్వ కాలంలో అప్పటి అధికారపార్టీ నాయకుల అండదండలతో రెచ్చిపోయి ప్రవర్తించిన తీరు ప్రస్తుతం మండలంలో తీవ్ర చర్చనీయాంశమైంది. గత ఎనిమిది సంవత్సరాల్లో యద్దనపూడి పంచాయతీ కార్యదర్శిగా, రెండు సంవత్సరాలుగా ఈఓఆర్డీగా విధులు నిర్వహించిన కుమారస్వామి గత జూలై 23న ఇక్కడ నుంచి బదిలీపై పుల్లల చెరువు మండలం వెళ్లి లాబీయింగ్ ద్వారా ప్రస్తుతం బల్లికురవ మండలం కొప్పెరపాడు గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కుమారస్వామి ఇక్కడ కార్యదర్శిగా విధులు నిర్వహించిన సమయంలో నాటి అధికార పార్టీ నేతల దెబ్బకు సదరు అధికారిపై నోరుమెదపలేని వారు ప్రస్తుతం ప్రభుత్వం మారటంతో ధైర్యంగా ఒక్కొక్కరు తమకు జరిగిన అన్యాయాలను బహిర్గతం చేయటం గమనార్హం. ఇదిగోండి జాబితా.. ► యద్దనపూడి గ్రామానికి చెందిన రావిపాటి లక్ష్మీకాంతమ్మ అనే వృద్ధురాలికి గత సంవత్సరం జూన్ నెలలో వృద్ధాప్య పింఛన్ మంజూరు కాగా ఆ మహిళకు పెన్షన్ ఇవ్వకుండా అదే గ్రామానికి చెందిన రావిపాటి కాంతయ్య అనే పురుషునికి గత నెల ఆగస్టు వరకు అంటే 14 నెలల పాటు పెన్షన్ ఇచ్చారు. ఇది స్థానికులను విస్మయానికి గురిచేసింది. ప్రస్తుతం సదరు మహిళ ఎంపీడీఓ కార్యాయలంలో, సీఎం పేషీలో ఫిర్యాదు చేయటంతో శుక్రవారం యద్దనపూడి వచ్చిన కుమారస్వామి స్థానిక నేతల ద్వారా ఆ మహిళతో రాజీయత్నం చేయటం గమనార్హం. ► అలాగే మండలంలో గన్నవరం గ్రామానికి చెందిన కేతినేని అంజమ్మ అనే మహిళ యద్దనపూడి గ్రామ పరిధిలో 2016లో అంజలి ఇండస్ట్రీస్ పేరుతో ఫ్యాక్టరీ స్థాపించేందుకు అప్రూవల్ కోసం దరఖాస్తు చేసుకుంది. లక్ష రూపాయలు ఇస్తేనే అప్రూవల్ ఇస్తానని చెప్పటంతో చేసేదేమి లేక రూ.30 వేల నగదును ఇచ్చింది. మరోసారి రూ.70 వేలను అంజలి ఇండస్ట్రీస్ బ్యాంకు ఖాతా నెంబరు 916020070482078 నుంచి కుమారస్వామికి చెందిన స్టేట్ బ్యాంకు ఖాతాకు జమ చేసింది. ఆ తర్వాతే అప్రూవల్ మంజూరు చేసినట్లు బాధితులరాలు వాపోయింది. ► యద్దనపూడి గ్రామంలో హౌస్ అప్రూవల్ కోసం నల్లపునేని అనీల్ వద్ద రూ.60 వేలు, ఎన్. సీతమ్మ అనే మహిళ రూ.20 వేలు, టి.బాబు వద్ద రూ.22 వేలు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ► 100 శాతం అంగవైకల్యం ఉన్న దివ్యాంగులకు గతంలో రూ.1500 పెన్షన్ ఇవ్వాల్సి ఉండగా చాలామందికి రూ.1000 మాత్రమే ఇచ్చినట్లు బాధితుల ఆరోపణ. అలాగే పంచాయతీ నీటికుళాయి కనెక్షన్‌కు పరిమితికి మించి వసూలు చేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అలాగే గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టకుండానే లక్షల రూపాయల నిధులు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. ఆయన బదిలీపై వెళ్లినా పూర్తిస్థాయిలో రికార్డులు కూడా సదరు పంచాయతీలకు అందజేయలేదని గ్రామస్తులు చెప్పటం గమనార్హం. ► మరణధ్రువీకరణ పత్రాల మంజూరులో రూ.3 వేల నుంచి రూ.8 వేలు వరకు వసూలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. గతంలో పర్చూరు మండలం చెరుకూరులో, చీమకుర్తిలో అవినీతి ఆరోపణలపై రెండుసార్లు సస్పెండ్ అయినప్పటికీ కుమారస్వామి తన ప్రవర్తన మార్చుకోలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. అతనిపై తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇవన్నీ ఆరోపణలే.. కొందరు కావాలనే నాపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. నేను ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. లక్ష్మీకాంతం పింఛన్ విషయంలో పొరపాటు పడిన మాట వాస్తవమే. - పంచాయతీ కార్యదర్శి కుమారస్వామి -
కాలేజీ చదువులు
సాక్షి, అమరావతి రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు ఆధోగతిలో ఉన్నట్లు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పరీక్షల ఫలితాల్లో తేటతెల్లమైంది. ఇటు ప్రభుత్వంలో అటు ప్రైవేట్ రంగంలో ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు ఇతర డిగ్రీ కాలేజీల్లో విద్యా ప్రమాణాలు బాగా దిగజారి పోయాయనేందుకు సచివాలయ ఉద్యోగాలకు నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం నిదర్శనంగా నిలుస్తోంది. పంచాయతీ కార్యదర్శి డిజిటల్ అసిస్టెంట్ పోస్టులకు బీటెక్ (కంప్యూటర్స్)తో పాటు పీజీ చేసిన వారు ఏకంగా 2,72,088 మంది పరీక్షలు రాశారు. అయితే ఇంత మంది పరీక్షలు రాస్తే ఉత్తీర్ణులైన వారి సంఖ్య చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. కేవలం 3,623 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించడం చూసి ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫలితాలు విద్యాలయాల్లో విద్యా ప్రమాణాలను ఎత్తి చూపుతున్నాయని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. డిజిటల్ అసిస్టెంట్ పరీక్షకు సంబంధించి 150 మార్కులకు గాను 60 మార్కులు వస్తే ఉత్తీర్ణత సాధించినట్లు. అయితే పరీక్ష రాసిన వారిలో ఉత్తీర్ణత కేవలం 1.33 శాతమే ఉండటం విద్యా ప్రమాణాలు ఇంత దిగజారిపోయాయా అని ఆందోళన కలిగిస్తోంది. మొత్తం 11,158 డిజిటల్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలు నిర్వహించగా ఉత్తీర్ణులైన వారు కేవలం 3,623 మంది మాత్రమే ఉండటం గమనార్హం. వార్డు శానిటేషన్ కార్యదర్శి పోస్టుల ఉత్తీర్ణత శాతం కూడా విద్యా ప్రమాణాలను ఎత్తి చూపింది. ఈ పోస్టులకు 52,334 మంది పరీక్షలు రాస్తే, కేవలం 1,474 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. డిగ్రీలు, పీజీలు చేసిన వారు పరీక్షలు రాసినప్పటికీ కనీస అర్హత మార్కులను కూడా సాధించలేకపోయారు. అంటే పరీక్షలు రాసిన వారిలో కేవలం 2.8 శాతం మందే ఉత్తీర్ణులయ్యారు. మొత్తం వార్డు శానిటేషన్ కార్యదర్శి పోస్టులు 3,648 ఉండగా 52,334 మంది పరీక్షలు రాయగా కేవలం 1,474 మందే ఉత్తీర్ణులవ్వటం గమనార్హం. అలాగే గ్రామ వ్యవసాయ అసిస్టెంట్ పోస్టుల పరీక్షల ఉత్తీర్ణత శాతం చూస్తే అగ్రికల్చర్ బీఎస్సీ విద్యా ప్రమాణాలు దిగజారిపోయాయనే అనుమానం కలుగుతుంది. 6,714 గ్రామ వ్యవసాయ అసిస్టెంట్ పోస్టులకు 22,622 మంది పరీక్షలు రాయగా కేవలం 6,239 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. అంటే ఉత్తీర్ణత 27.57 శాతం మాత్రమే. వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ కార్యదర్శి పోస్టుల పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత శాతం చాలా తక్కువగా ఉంది. 3,770 పోస్టులకు 12,643 మంది పరీక్ష రాయగా 2,096 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. అంటే ఉత్తీర్ణత 16.57 శాతం మాత్రమే. విద్యా ప్రమాణాలు పెంచడంపై సర్కారు దృష్టి ఇబ్బడి ముబ్బడిగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతి ఇచ్చిన గత ప్రభుత్వాలు ఆ కాలేజీల్లో మౌలిక వసతులు, విద్యా ప్రమాణాల గురించి పట్టించుకోలేదు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలను ప్రోత్సహించిన గత ప్రభుత్వాలు ప్రభుత్వ రంగంలోని కాలేజీలను నీరుగార్చాయి. దీంతో అటు ప్రైవేట్ రంగం, ఇటు ప్రభుత్వ రంగంలోని ఉన్నత విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాలు నిర్వీర్యం అయినట్లు సచివాలయ ఉద్యోగుల పరీక్షల ఉత్తీర్ణత శాతం స్పష్టం చేస్తోంది. ఈ పరీక్షల ఉత్తీర్ణత శాతాలతో సంబంధం లేకుండా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటు ప్రభుత్వ, అటు ప్రైవేట్ రంగంలోని ఉన్నత విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాలు పెంచాలని, అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఉన్నత విద్యా సంస్థల నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలోని విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాలను పెంచనున్నారు. -
చికిత్సపొందుతూ పంచాయతీకార్యదర్శి మృతి
నాగర్‌కర్నూల్: పని ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యకు యత్నించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శి స్రవంతి చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి నిమ్స్‌లో మృతి చెందింది. నాగర్‌కర్నూల్ పట్టణానికి చెందిన స్రవంతి గుమ్మకొండలో పంచాయతీకార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నక్రమంలో గురువారం మధ్యాహ్నం కార్యాలయంలోనే పురుగుమందు తాగిన విషయం తెలిసిందే. స్రవంతి భర్త 8 నెలల క్రితం నాగర్‌కర్నూల్‌లో జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందాడు. ఆమెకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు -
గ్రామపంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యాయత్నం
నాగర్‌కర్నూల్/జడ్చర్ల టౌన్: పనిఒత్తిడి తట్టుకోలేక జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిన్నపల్లి గ్రామ జూనియర్ కార్యదర్శి ప్రత్యూష ఉద్యోగానికి రాజీనామా చేయగా, గురువారం నాగర్‌కర్నూలు జిల్లా తిమ్మా జిపేట మండలం గుమ్మకొండ జూని యర్ కార్యదర్శి స్రవంతి ఆత్మహత్యకు యత్నించింది. ‘30 రోజుల ప్రణాళిక’లో భాగంగా గురువారం తిమ్మాజిపేట మండలం గుమ్మకొండలో బడ్జెట్‌పై గ్రామసభ నిర్వహించారు. సభ ముగిశాక స్రవంతి కార్యాలయంలోనే పురుగుల మందు తాగింది. వెంటనే స్థానికులు స్రవంతిని తిమ్మాజిపేట ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. స్రవంతి స్వస్థలం నాగర్‌కర్నూల్. ఆమెకు ఇద్దరు పిల్లలు. భర్త ఏడు నెలల క్రితమే రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. -
‘జూనియర్స్’ రాజీనామా
సాక్షి, కరీంనగర్: నిరుద్యోగ యువతకు జూనియర్ పంచాయతీ కార్యదర్శి కొలువు దొరికిన సంబరం లేకుండా పోతోంది. బాధ్యతల బరువు, ఒత్తిడి తట్టుకోలేక రాజీనామాకు సిద్ధం అవుతున్నారు. ఓ వైపు ప్రభుత్వం గతంలో కార్యదర్శులకు ఉన్న చెక్‌పవర్ తొలగించడంతోపాటు అదనంగా హరితహారం, పారిశుధ్య నిర్వహణ, ఓడీఎఫ్, ప్రభుత్వ పథకాల అమలు బాధ్యతలు అప్పగించింది. మరో వైపు సర్పంచులు, అధికార పార్టీ నాయకులు తమ పనుల కోసం ఒత్తిళ్లు తేవడమే కాకుండా దాడులకు పాల్పడుతున్నారు. రెండువైపుల నుంచి ఒత్తిళ్లు భరించలేక కొందరు కార్యదర్శులు కొత్త ఉద్యోగాల్లో చేరగా.. మరికొందరు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు. గతనెల 23న కరీంనగర్ మండలం ఇరుకుల్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి పద్మపై సర్పంచు భర్త బలుసుల శంకరయ్య దౌర్జన్యం చేయడం జిల్లాలో వివాదాస్పదంగా మారింది. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై కార్యదర్శులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం పనిచేసే అవకాశం లేకుండా పోతుందంటూ పలువురు కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 12మంది రాజీనామా.. కరీంనగర్ జిల్లాలో మొత్తం 313 గ్రామ పంచాయతీలుండగా ప్రభుత్వం ఏప్రిల్ 12న మొత్తం 205మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను కేటాయించింది. వీరిలో 197మంది మాత్రమే ఉద్యోగాల్లో చేరగా మిగతా 8మంది వివిధ కారణాలతో బాధ్యతలు చేపట్టలేదు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల్లో కొందరు రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేక ఉద్యోగాన్ని వదులుకుంటున్నారు. కార్యదర్శులకు ఎలాంటి శిక్షణ ఇవ్వకుండానే ప్రభుత్వం నియమించడంతో క్షేత్రస్థాయిలో పలు సమస్యలు ఏర్పడుతున్నాయి. విధినిర్వహణపై అవగాహన లేకపోవడంతోపాటు కొత్తపంచాయతీరాజ్ చట్టంతో బాధ్యతలు పెరగడం, పనిభారంతో ఆందోళనకు గురవుతున్నారు. మూడేళ్ల వరకు ఉద్యోగ భద్రత లేకపోవడంతో మంచి ఉద్యోగాలు రావడంతో కార్యదర్శి ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం కార్యదర్శులకు జీతాలు సైతం చెల్లించలేదు. ఇటీవల ప్రకటించిన ఎస్సై, ఫారెస్ట్‌బీట్ ఆఫీసరు ఉద్యోగాలకు పలువురు కార్యదర్శులు ఎంపికయ్యారు. దీంతో వెంటనే కార్యదర్శి పోస్టులకు రాజీనామా చేసి ఆయా ఉద్యోగాల్లో చేరిపోయారు. ప్రస్తుతం జిల్లాలో 12మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తమ పదవులకు రాజీనామా చేశారు. త్వరలో ప్రకటించే గ్రూప్–2, కానిస్టేబుల్ ఉద్యోగాల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని మరికొందరు కార్యదర్శులు సైతం రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు. -
సర్పంచ్‌కు ఆ అధికారం లేదు
సాక్షి, హైదరాబాద్: అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని పంచాయతీ చేసే తీర్మానాన్ని అమ లు చేయాలని నోటీసు జారీ చేసే అధికారం గ్రామ సర్పంచ్‌లకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. గ్రామ పంచాయతీ తీర్మానాన్ని పంచాయతీ కార్యదర్శి ద్వారా అమలు చేయించాలని చట్టం చెబుతోందని, గ్రామ పంచాయతీ చేసిన తీర్మానం ప్రకారం నోటీసును నేరుగా గ్రామ సర్పంచ్ జారీ చేసే అధికారం చట్టంలో లేదని తెలిపింది. రంగారెడ్డి జిల్లా శంషా బాద్ మండలం నానాజీపూర్కి చెందిన రైతు వంగ రాఘవరెడ్డి దాఖలు చేసిన కేసులో హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ప్రహరీ నిర్మాణం వల్ల రోడ్డు మూసుకుపోతుందని, అక్రమంగా నిర్మించిన ప్రహరీని తొలగించాలని గ్రామ పంచాయతీ చేసిన తీర్మానం ప్రకా రం నోటీసును నేరుగా అక్రమ కట్టడానికి పాల్పడిన వ్యక్తికి సర్పంచ్ జారీ చేయడాన్ని తప్పుబడుతూ రాఘవరెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి చేయాల్సిన విధుల్ని సర్పంచ్ చేయడం చట్ట వ్యతిరేకమని, పంచాయతీరాజ్ చట్టంలోని 32 సెక్షన్ ప్రకారం సర్పంచ్‌కు అధికారం పరిమితమని పిటిషనర్ తరఫు న్యాయవాది జనార్దన్‌రెడ్డి వాదించారు. పంచాయతీ చట్టం ప్రకారం పంచాయతీలకు అధికారం ఉంటుందని, పంచాయతీ తీర్మానం ప్రకారం సర్పంచ్ నోటీ సు ఇవ్వొచ్చని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. వాద నలు విన్న హైకోర్టు ‘పంచాయతీ శాఖ కమిషనర్ చట్టంలోని 42వ సెక్షన్ ప్రకారం గ్రామ పంచాయతీ కార్యదర్శిని నియమిస్తారు. కార్యదర్శే పంచాయతీ స్థిరచరాస్తుల రక్షణ, నిర్వహణ బాధ్యతలు నిర్వహించాలి. ఆస్తుల అంశంపై పంచాయతీ పాలకవర్గం చేసే తీర్మానాన్ని కార్యదర్శే అమలు చేయాలి. ఈ కేసులో పిటిషనర్ సర్పంచ్ నేరుగా నోటీసు ఇవ్వడాన్ని సవాల్ చేయడం సరైనదే. సర్పంచ్‌కు నోటీసు ఇచ్చే అధికారం లేదు’ అని స్పష్టం చేస్తూ వ్యాజ్యంపై విచారణ ముగిసినట్లుగా ప్రకటించింది. -
వనజ.. అనే నేను..!
వెనుకబాటుతనం నుంచి పురోగతి దిశగాకట్టుబాట్లు, వెలివేత నుంచి సర్పంచ్ వరకుచదువు, కుటుంబ పోషణతో పాటు ప్రజాసేవపోటీ పరీక్షల్లోనూ ప్రతిభ చాటుకుని ఉద్యోగంసంగారెడ్డికి చెందిన ఓ మహిళ ప్రస్థానం వెనుకబాటు తనం.. బాల్య వివాహం.. సామాజిక వివక్ష.. కుటుంబ పోషణ.. మహిళా పురోగతికి అవరోధాలు. వీటన్నింటినీ అధిగమిస్తూ తనను తాను ఆవిష్కరించుకునే ప్రయత్నంలో ముందుకు సాగుతోంది ఈ ముపై ్ప నాలుగేళ్ల వనిత. సామాజిక కార్యకర్తగా, సర్పంచ్‌గా పనిచేసి పలువురి మన్ననలు అందుకున్న మహిళ.. ఇటీవలి పంచాయతీ కార్యదర్శుల పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ ఉద్యోగాన్ని సొంతం చేసుకుంది. ఓ వైపు భర్తకు వ్యవసాయ పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటూనే జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే తపనతో ముందుకు సాగుతున్న సంగారెడ్డి జిల్లా కల్పగూరు గ్రామ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ తాలెల్మ వనజ సక్సెస్ అండ్ స్ట్రగుల్ సోరీ.. ఆమె మాటల్లోనే:‘‘మా నాయిన ఉపాధి కోసం పుల్కల్ మండలం ఇసోజిపేట నుంచి మంజీర డ్యాం కట్టే సమయంలో వలస వచ్చిండు. మేం మొత్తం నలుగురం. ఇద్దరు అక్కచెల్లెళ్లం. ఇద్దరు అన్నదమ్ములు. డ్యాం నిర్మాణం పూర్తికావడంతో మా నాయిన గంగారాం ఇక్కడే డ్యాం దగ్గర చిన్న ఉద్యోగం సంపాదించిండు. మా బాల్యమంతా మంజీర డ్యాం పరిసరాల్లోనే సాగింది. పక్కనే ఉన్న కల్పగూరు స్కూళ్లో పదో తరగతి వరకు చదివిన. స్కూల్లో చదువులో ముందున్నా.. తాగుడుకు బానిసైన మా నాయిన ఏ విషయాన్నీ పట్టించుకునే వాడు కాదు. పది తర్వాత దగ్గరలో ఉన్న సంగారెడ్డి బాలికల కాలేజీలో ఇంటర్మీడియెట్‌లో చేరిన. చదువు ఆగిపోతుందనుకునే సమయంలో మా బాబాయి సంగారెడ్డిలో ఓ ప్రైవేటు కాలేజీలో డిగ్రీ బీఎస్సీ కోర్సులో చేర్పించిండు. డిగ్రీ రెండో సంవత్సరంలో ఉండగానే కల్పగూరుకు చెందిన జనార్దన్‌తో పెళై్లంది. పదో తరగతి చదివిన ఆయన హైదరాబాద్‌లో కుష్టు వ్యాధి నిర్మూలనకు సంబంధించిన లెప్రా సొసైటీలో చిరుద్యోగం చేసేవారు. డిగ్రీ ఫైనల్ ఇయర్లో గర్భవతిని కావడంతో కాలేజీకి వెళ్లలేక పోయా. దీంతో కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో చదువు అర్ధంతరంగా నిలిచిపోయింది. బాబు పుట్టడంతో ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువయ్యాయి. లెప్రా సొసైటీ శాఖ సంగారెడ్డిలో ప్రారంభించడంతో అందులో నేనూ చేరి ఉద్యోగం చేయడం మొదలుపెట్టా. ఉద్యోగం చేస్తూనే.. తీరిక సమయాల్లో చదివి డిగ్రీ పూర్తి చేశా. ఆ వెనువెంటనే బీఈడీ ఎంట్రన్స్‌లో సీటు సాధించినా, మా నాన్న చనిపోవడంతో చేరలేకపోయా. మరుసటి ఏడాది పటాన్‌చెరులోని ఓ బీఈడీ కాలేజీలో చేరి పూర్తి చేశా. బోధన అనుభవం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఓ ప్రై వేటు స్కూల్లో టీచర్‌గా చేరా. సర్పంచ్‌గా కొత్త బాధ్యత ఓ వైపు ప్రై వేటు స్కూళ్లో టీచర్‌గా పనిచేస్తూనే 2012 డీఎస్సీకి ప్రిపేరయ్యా. కేవలం అరమార్కు తేడాతో ఉద్యోగాన్ని దక్కించుకోలేకపోయా. కొద్ది నెలలకే 2013లో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. మా గ్రామం కల్పగూరు సర్పంచ్ పదవిని ఎస్సీ మహిళలకు రిజర్వు చేసింది. మాకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకున్నా.. చదువుకున్న అమ్మాయి సర్పంచ్ అయితే బాగుంటుందని కొందరు గ్రామస్తులు నా భర్తను సంప్రదించారు. అయితే మా సామాజిక వర్గంలోనే కొందరు ఆ ప్రతిపాదనను వ్యతిరేకించారు. తమ మాటను ధిక్కరించి పోటీ చేస్తే కుల బహిష్కరణ చేస్తామని తీర్మానం కూడా చేశారు. ఈ హెచ్చరికను సవాలుగా తీసుకుని పోటీలో దిగి గ్రామస్తుల మద్దతుతో సర్పంచ్‌గా గెలుపొందా. ఐదేళ్ల పదవీ కాలం నాకు అనేక విషయాలను నేర్పింది. గ్రామ పాలనకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు, మెటీరియల్, అధికారుల సలహాలు ఎంతో ఉపయోగపడ్డాయి. మొదట్లో గ్రామ సభల్లో కొంత తడబాటుకు గురైనా, నిబంధనలపై పట్టుచిక్కిన తర్వాత.. ఎవరితోనూ మాట పడకుండా పాలన సాగించా. భర్త చాటు భార్య అనే మచ్చ రాకుండా పనిచేయడంపైనే నా దృష్టి ఉండేది. వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన మహిళగా అక్కడక్కడా కొంత వివక్ష ఎదురైనా.. పెద్దగా పట్టించుకునే దాన్ని కాదు. ఐదేళ్ల కాలంలో గ్రామ పంచాయతీకి కొత్త భవనం సమకూర్చడంతో పాటు, దాదాపు గ్రామం అంతా సీసీ రోడ్లు నిర్మించాం. సర్పంచ్‌గా పనిచేసిన ఐదేళ్ల కాలంలో 2016 ఏప్రిల్‌లో జంషెడ్‌పూర్‌లో ప్రధాని మోడీ మొదలుకుని, మంత్రులు, కలెక్టర్లను కలిసే అవకాశం దక్కింది. దీంతో కొత్త విషయాలు తెలుసుకోవాలనే తపన మరింత పెరిగింది. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కోరికను ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేదు. సర్పంచ్‌గా పనిచేస్తున్న కాలంలో కొందరు ఉద్యోగుల పనితీరు అంత సంతృప్తిగా అనిపించేది కాదు. ఉద్యోగం చేయడం కూడా ఓ రకమైన సేవ అనే అవగాహన ఏర్పడింది. దీంతో సర్పంచ్‌గా పనిచేస్తూనే, వ్యవసాయంలో నా భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపరేషన్ ప్రారంభించా. సంగారెడ్డి అంబేడ్కర్ స్టడీ సర్కిల్లో జరిగే పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వో తదితర పరీక్షలకు ప్రిపేర్ అయ్యా. ఇద్దరు బాబుల బాగోగులను చూసుకుంటూనే, వీలు చిక్కినప్పుడు స్టడీ మెటీరియల్‌ను తిరగేసేదాన్ని. ఈ ఏడాది ఆగస్టులో సర్పంచ్‌గా పదవీ కాలం పూర్తయినా, గ్రామస్తుల బాగోగుల్లో నా వంతు పాత్ర పోషిస్తూనే పంచాయతీ కార్యదర్శి పరీక్ష రాశా. సర్పంచ్‌గా పనిచేసిన అనుభవం పరీక్షలో ఉపయోగపడటం.. ఉద్యోగ సాధనలో కలిసి వచ్చింది. నా ప్రస్థానంలో ఇది ఒక అడుగు మాత్రమే అనుకుంటున్నా.. పీజీ చదువుతో పాటు గ్రూప్ పరీక్షలపై దృష్టి పెట్టాలన్నదే నా సంకల్పం.. రాజ్యాంగం.. అంబేడ్కర్.. ఇవన్నీ బాల్యం నుంచి వింటున్నా.. పూర్తిగా అర్థమయ్యేది కాదు.. ఆయన ఇచ్చిన శక్తి ఏంటో.. తెలిసిన కొద్దీ ఉత్సాహం పెరుగుతోంది. – కల్వల మల్లికార్జున్‌రెడ్డి, సాక్షి, సంగారెడ్డి -
ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి
చీరాల(ప్రకాశం): అతని సర్వీసు అంతా అవినీతి...అక్రమాలతో చీరాల ప్రాంత ప్రజలను పీల్చుకుతిన్న ఓ తిమింగలం ఎట్టకేలకు ఏసీబీ వలలో చిక్కుకుంది. దేవాంగపురి తాజా మాజీ సర్పంచ్ పృధ్వీ చాందినీ పంచాయతీలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు విడుదల చేసేందుకు రూ.70 వేలు లంచం తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి చిక్కాడు. బుధవారం ఒంగోలు ఏసీబీ డీఎస్పీ తోట ప్రభాకర్ దేవాంగపురి పంచాయతీ కార్యదర్శి వై.చెంచును రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డీఎస్పీ వివరాల మేరకు.. దేవాంగపురి గ్రామంలో 14వ ఆర్థిక సంఘం, సాధారణ నిధులతో గ్రామంలో తాజా మాజీ సర్పంచ్ పృధ్వీ చాందినీ 2017–18 ఆర్థిక సంవత్సరాల్లో రూ.18.60 లక్షలకు అభివృద్ధి పనులు చేశారు. వీటిలో రూ.15 లక్షలను గతనెల 274 తేదీన సర్పంచ్ ఖాతాకు నిధులు జమ అయ్యాయి. మిగిలిన రూ.3.60 లక్షల బిల్లులు చెల్లించాలని పంచాయతీ సెక్రటరీ వై.చెంచును చాందినీ, అతని భర్త సుబ్బారావులు పలుమార్లు పం కోరారు. అయితే తనకు లంచం ఇస్తేనే మీ బిల్లులు చెల్లింపులు చేస్తామని తేల్చి చెప్పడంతో సర్పంచ్ దంపతులు ఈనెల 6వ తేదీ ఒంగోలు ఏసీబీ ప్రభాకర్‌ను లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఏసీబీ అధికారులు రసాయనాలు కలిపిన నగదు రూ.70 వేలను సర్పంచ్ దంపతులకు అందించి సెక్రటరీ చెంచుకు ఇప్పించారు. ఈ నేపథ్యంలో నగదును లెక్కించుకుని చెంచు జేబులో పెట్టుకుంటుండగా డీఎస్పీ ప్రభాకర్, సీఐలు ప్రతాప్, ఎస్సై రాఘవలు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడు చెంచుపై పలు అవినీతి ఫిర్యాదులు తమకు అందాయని, ప్రజలతో పాటు సర్పంచ్‌లను కూడా లంచాల కోసం వే«ధిస్తున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపుతున్నామని తెలిపారు. పంచాయతీ పన్నులు, ప్లాన్లు, బిల్లుల చెల్లింపులకు సంబంధించి కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ కోటేశ్వరరావు రికార్డులను బీరువాలో పెట్టుకుని పరారీలో ఉన్నాడని .. ఇతనిపై కూడా కేసు నమోదు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. లంచం తీసుకుంటూ పట్టుబడిన చెంచు గతంలో చినగంజాంలో పనిచేస్తూ అవినీతి, అక్రమాల్లో నేరం రుజువు కావడంతో సస్పెండ్ అయ్యాడని, రామకృష్ణాపురంలో అక్రమాలపై విచారణ జరిగినట్లు తమ విచారణలో తేలిందన్నారు. అనంతరం స్థానిక పోలీసుల సహకారంతో బీరువాను తెరచి పంచాయతీ సెక్రటరీ రికార్డులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీకి సమాచారం ఇవ్వండి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు, లంచాల కోసం వేధిస్తున్న వారి వివరాలు, అక్రమార్జనల గురించి తమకు ఫిర్యాదు చేయవచ్చని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. సమాచారం ఇచ్చిన వారిపేర్లు గోప్యంగా ఉంచడంతో పాటు వారికి అండగా ఏసీబీ ఉంటుందన్నారు. అక్రమాలపై డీఎస్పీ 9440446189, సీఐ 9440446187, ఎస్సై 833925624 నంబర్లను సంప్రదించాలన్నారు. చెంచు అక్రమాలపై ‘సాక్షి’ కథనాలు ఏసీబీ వలలో లంచం తీసుకుంటూ పట్టుబడిన పంచాయతీ కార్యదర్శి చెంచు ఎక్కడ పనిచేసినా అక్రమాలకు పాల్పడటం అలవాటు. గతంలో చినగంజాంలో పనిచేస్తున్న సమయంలో సస్పెండ్ అయ్యాడు. అలానే రామకృష్ణాపురం పంచాయతీ కార్యదర్శిగా కూడా పనిచేస్తున్న చెంచు పింఛన్లు కాజేస్తున్న వైనం పోయినోళ్ల పింఛన్లు స్వాహా’ కథనం సాక్షి ప్రచురించింది. గ్రామంలో చనిపోయిన వారి పేర్లతో మూడు నెలల పాటు రూ. 55 వేలు అక్రమంగా తీసుకోవడం, బిల్డింగ్ ప్లాన్లు మంజూరులో భారీ స్థాయిలో నగదు వసూళ్లు చేశాడు. దీనిపై రెండు సార్లు సాక్షి కథనాలు ప్రచురించగా డీపీఓ, ఈవోఆర్డీలు విచారించి చెంచుపై శాఖా పరమైన చర్యలకు సిఫార్సు చేశారు. అయినా కార్యదర్శి చెంచు లంచాలను తీసుకోవడం మానలేదు. మరోసారి ఏసీబీ అధికారులకు పట్టుబడి సస్పెండ్‌తో పాటు జైలుకు వెళ్లనున్నాడు. -
మరో రంగస్థలం
జిల్లాలోని కుల్లూరు పంచాయతీలో ప్రస్తుతం రంగస్థలం కథ నడుస్తోంది. పంచాయతీ ఎన్నికలు రాక ముందే అక్కడ వాతావరణం వేడెక్కింది. పంచాయతీలో ఓ ప్రజాప్రతినిధి చెప్పిందే వేదం. ఆయన చెప్పినట్లు అధికారులు, ప్రజలు వినాల్సిందే. వినకపోతే వారిపై అవినీతి, అక్రమాల పేరుతో అధికారుల చేత విచారణలు, వేదింపులకు గురి చేస్తున్నాడు. తప్పు చేయకపోయినా.. చేసినట్లు ఆధారాలు లేకపోయినా.. ఏదో ఒక విధంగా చర్యలు తీసుకునేలా అధికారులపై ఒత్తిళ్లు చేయిస్తున్నాడు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ ప్రజాప్రతినిధి చెప్పినట్లు చేయడం లేదనే అక్కసుతో అతనిపై లేనిపోని ఆరోపణలు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఆకాశారామన్న ఫిర్యాదులు తీసుకెళ్లి జిల్లా అధికారులకు అందజేసి విచారణ పేరుతో వేదిస్తున్నారు. అధికారులు కూడా ఆకాశ రామన్న ఫిర్యాదులకు అత్యంత ప్రధాన్యం ఇచ్చి కింది స్థాయి అధికారులతో విచారణలు చేయిస్తున్నారు. విచారణలో ఎలాంటి ఆధారాలు లేదని నివేదికలు అందజేస్తే మరొక ఆకాశ రామన్న ఫిర్యాదు చేసి విచారించి చర్యలు తీసుకోమని ఒత్తిడి తెస్తున్నారు. నెల్లూరు(పొగతోట): జిల్లాలోని కలువాయి మండలంలో ఉన్న కుల్లూరు మేజర్ పంచాయతీలో ఉపాధి హామీ పథకానికి సంబంధించి పి.వంశీకృష్ణ ఫీల్డ్ అసిస్టెంట్(ఎఫ్ఏ)గా పని చేస్తూ కూలీలకు పనులు కల్పిస్తున్నాడు. ఉపాధి హామీ పనులు కల్పించడంలో ఈ పంచాయతీ ప్రథమ స్థానంలో ఉండడంతో ఎఫ్ఏ వంశీకృష్ణ ఎంపీడీఓ చేతులమీదుగా అవార్డు కూడా అందుకున్నారు. ఉ పాధి కూలీలకు రోజుకు రూ.200లకు పైగా వేత నం మంజూరయ్యేలా పనులు చూపిస్తున్నాడు. ఎఫ్ఏ తాను చెప్పినట్లుగా నడుచుకోలేదని ప్రజా ప్రతినిధి ఆకాశ రామన్న ఫిర్యాదులు చేయడం ప్రారంభించాడు. ఇద్దరు, ముగ్గురు కూలీలను రెచ్చగొట్టి ఎఫ్‌ఏపై ఫిర్యాదులు చేయించాడు. కొద్ది రోజుల తరువాత ఫిర్యాదులు చేసిన కూలీలు ఎంపీడీఓ వద్దకు వచ్చి తమకు రాజకీయాలతో సంబంధం లేదని, ఎఫ్ఏ తమకు పనులు కల్పిస్తున్నాడని, అతను అక్రమాలకు పాల్పడడం లేదని తెలిపారు.\ తమకు రావాల్సిన వేతనాలు అతను తీసుకోవడం లేదని ఎంపీడీఓకు రాతపూర్వకంగా వివరించారు. అనంతరం ఆ ప్రజాప్రతినిధి కూలీలు కాకుండా పంచాయతీ పాలక సభ్యులతో ఫిర్యాదు చేయించాడు. ఫిర్యాదు అందుకున్న అధికారులు ఆగమేఘాలపై కుల్లూరులో ఈ నెల 18వ తేదీన విచారణ చేపట్టారు. విచారణ సమయంలో ఎలాంటి ఆధారాలు లభించలేదు. గతంలో ఆధారులు లేని ఫిర్యాదుకు సంబంధించి బ్యాంక్ కార్సండెంట్ నుంచి కూలీలకు ఇవ్వాల్సిన రూ.1.20 లక్షల నగదు ఎఫ్ఏ తీసుకున్నాడని అతనితో రాయించుకుని దీనిపై క్రిమినల్ కేసు పెడతామని బెదిరిస్తున్నారు. ఉపాధి పనులు చేసినందుకు బ్యాంక్ కార్సండెంట్ కూలీలకు వేతనాలు ఇవ్వాల్సిఉంది. దానితో ఎఫ్‌ఏకు ఎలాంటి సంబంధం ఉండదు. చేసిన పనులకు వేతనాలు ఇంత వరకు ఇవ్వలేదని కూలీలు ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు. ఫిర్యాదులు చేయకుండా బ్యాంక్ కార్సండెంట్ నుంచి ఎఫ్ఏ నగదు తీసుకుపోయడంటే గుడ్డిగా ఏవిధంగా కేసు నమోదు చేసే విషయాన్ని పరిశీలిస్తే పై నుంచి ఏస్థాయిలో ఒత్తిళ్లు వచ్చాయో అర్థమవుతోంది. అవినీతిని కప్పిపెట్టి.. కుల్లూరు పంచాయతీలో రోడ్లు వేయకుండా రూ.లక్షల బిల్లులు స్వాహా చేసిన పంచాయతీ కార్యదర్శిపై ఎలాంటి విచారణ చేయలేదు. పంటకుంటల బిల్లులు మంజూరు కాగానే వాటిని పూడ్చి వేసి పంటలు సాగు చేస్తున్నా వాటిపై ఎలాంటి విచారణ చేయడం లేదు. పంచాయతీ కార్యదర్శి నిధులు స్వాహా చేశారని జిల్లా అధికారులకు నాలుగు పర్యయాలు ఫిర్యాదులు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి విచారణ చేపట్టలేదు. ఉపాధి టీఏకు రూ.3.50 లక్షల రికవరీ పడితే దానిని రూ.14 వేలకు తగ్గించారు. దీనిపై ఇంత వరకు విచారణ చేయలేదు. అధికారపార్టీ ప్రజాప్రతినిధి కావడంతో అధికారులు ఆయన చెప్పినట్లు చేస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకపోయిన ఎఫ్‌ఏపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేయడం చేస్తుండడం గమనార్హం. -
రెండు నెలల్లో 9,200 పోస్టుల భర్తీ
-
ఏసీబీ వలలో తణికెళ్ల కార్యదర్శి
సాక్షి, ఖమ్మం: లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కొణిజర్ల మండలం తణికెళ్ల పంచాయతీ సెక్రటరీ ఇంటి నిర్మాణ పనుల కోసం లంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు. -
మరొకరు చిక్కారు
ఏసీబీ అధికారుల వలలో మరో అవినీతి చేప పడింది. ఈ నెల తొమ్మిదో తేదీన రీపోస్టింగ్ కోసం కె.జమ్మయ్య అనే ఉపాధ్యాయుడు నుంచి డీఈవో కార్యాలయంలోని సూపరింటెండెంట్ ఎ.విక్టర్‌ప్రసాద్ 20 వేల రూపాయలను లంచంగా తీసుకుంటూ పట్టుబడిన విషయాన్ని మరువకముందే మరో అవినీతి చేప పట్టుబడడం చర్చనీయాంశమైంది. ఈసారి పాపులేషన్ సర్టిఫికెట్ జారీకి రూ. 10 వేలు డిమాండ్ చేసి..రూ. 6 వేలు తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా ఎచ్చెర్ల మండలం కుశాలపురం పంచాయతీ కార్యదర్శి తెంబూరు కూర్మారావు గురువారం చిక్కారు. ఎచ్చెర్ల క్యాంపస్: కుశాలపురం పంచాయతీ (ఫరీదుపేట ఇన్చార్జి) గ్రామ కార్యదర్శి తెంబూరి కూర్మారావు ఆరు వేల రూపాయలను లంచంగా తీసుకుంటూ పంచాయతీ కార్యాలయంలోనే పట్టుబడ్డారని అవినీతి నిరో« దకశాఖ (ఏసీబీ) డీఎస్పీ కరణం రాజేంద్ర తెలిపారు. ఫరీదుపేట గ్రామానికి చెందిన యువకుడు సీపా న దిలీప్ కుమార్‌కు కుశాలపురం పంచాయతీ పరిధి నవభారత్ సమీపంలో స్థలం ఉంది. ఇక్కడ పేపర్ ప్లేట్లు, గ్లాస్ తయారీ పరిశ్రమ స్థాపించాలనుకున్నారు. ఇందుకోసం ఖాదీబోర్డు శాఖకు రాయితీ రుణం కోసం దరఖాస్తు చేసేందుకు పాపులేషన్ సర్టిఫికెట్ అవసరమైంది. సర్టిఫికెట్ కోసం కార్యదర్శి కూర్మారావును ఫోన్లో దిలీఫ్ సంప్రదించగా రూ. 10 వేలు డిమాండ్ చేశారు. యువకుడు కార్యదర్శి ఫోన్ సంభాషణను కూడా వాయిస్ రికార్డు చేసి ఏసీబీ అధికారులను సంప్రదించారు. కార్యదర్శికి రూ. 6 వేలు ఇచ్చేందుకు యువకుడు దిలీప్ అంగీకరించాడు. స్వీయ ధ్రువీకరణతో పాపులేషన్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు వీరిద్దరి మధ్య ఒప్పందం కుదిరింది. గురువారం కుశాలపురంలోని పంచాయతీ కార్యాలయంలో దిలీప్ కుమార్ కార్యదర్శి కూర్మారావుకు లంచంగా ఆరు వేల రూపాయలను అందజేస్తుండగా.. అప్పటికే మాటువేసి ఉన్న ఏసీబీ శ్రీకాకుళం డీఎస్పీ కరణం రాజేంద్ర, సీఐలు రమేష్, శ్రీనివాసరావు దాడి చేసి పట్టుకున్నారు. ఏసీబీ అధికారులను గమనించిన కార్యదర్శి పంచాయతీ సహాయకుడుగా పని చేస్తున్న మెరక ప్రసాదరావు చేతిలో డబ్బులు పెట్టేప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఏసీబీ అధికారులు దాడి చేయడంతో ఆయన ప్రయత్నం విఫలమైంది. లంచంగా తీసుకున్న ఆరు వేల రూపాయలను ఏసీబీ అధికారులు కార్యదర్శి నుంచి స్వాధీనం చేసుకొని అతనిపై కేసు నమోదు చేశారు. కూర్మారావును అరెస్టు చేసి ఏసీబీ కోర్టుకు తరలించామని డీఎస్పీ కరణం రాజేంద్ర చెప్పారు. చర్చనీయాంశం గ్రామ కార్యదర్శి ఏసీబీకి చిక్కడం ఎచ్చెర్ల మండలంలో చర్చనీయాంశమైంది. ఎచ్చెర్ల మండలంలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు ఇటీవల ఏసీబీకి చిక్కారు. నాలుగు నెలల క్రితం తహసీల్దార్ కార్యాలయం వద్దే పాస్ పుస్తకం కోసం రూ. 30 వేలు లంచంగా తీసుకుంటూ డిప్యూటీ తహసీల్దార్ బలివాడ శ్రీహరి బాబు ఏసీబీకి చిక్కారు. అలాగే ధర్మవరం, కొయ్యాం వీఆర్వోలు అప్పారావునాయుడు, నర్సునాయుడు కూడా ఇటీవల పట్టుబడ్డారు. -
టీడీపీ కార్యకర్త బరితెగింపు!
శ్రీకాకుళం: అధికార టీడీపీ కార్యకర్తల దౌర్జన్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. గతంలో పలువురు ప్రభుత్వ అధికారులపై దాడిచేసిన ఘటనలు జిల్లాలో చోటుచేసుకోగా.. తాజాగా సంతకవిటి మండలానికి చెందిన పంచాయతీ కార్యదర్శిపై మండలాభివృద్ధి అధికారి సాక్షిగా ఓ తెలుగుదేశం పార్టీ కార్యకర్త దాడికి పాల్పడ్డాడు. సంతకవిటి మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా జనన ధ్రువీకరణ పత్రం ఇవ్వాలంటూ పంచాయతీ సెక్రటరీని టీడీపీ కార్యకర్త డిమాండ్ చేయగా.. దానికి ససేమీరా అనడంతో దాడికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. మండల పరిధి వాసుదేవపట్నం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త గురుగుబెల్లి రాజు మండలాభివృద్ధి కార్యాలయానికి వచ్చాడు. ఎంపీడీఓ జి.వేణుగోపాలనాయుడు చాంబర్లో అదే గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి వడగ గౌరీశంకరరావును పిలిపించి శ్రీకాకుళంలో జన్మించిన బిడ్డ పేరున జనన ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా జనన ధ్రువీకరణ పత్రం ఇవ్వలేనని కార్యదర్శి స్పష్టం చేయడంతో ఆవేశానికి గురైన రాజు గట్టిగా కేకలు వేస్తూ కార్యదర్శిపై దాడికి దిగాడు. ఎంపీడీఓ వారిస్తున్నప్పటికీ వినకుండా గౌరీశంకరరావుపై దాడి చేశాడు. అక్కడున్నవారంతా అడ్డుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. దాడికి గురైన పంచాయతీ కార్యదర్శితోపాటు మండల పరిషత్ కార్యాలయానికి చెందిన మిగిలిన కార్యదర్శులు, ఎన్జీఓ సంఘ నాయకులు స్థానిక పోలీసుస్టేషన్‌కు చేరుకొని ఎస్సై ఎస్.చిరంజీవికి టీడీపీ కార్యకర్త రాజుపై ఫిర్యాదు చేశారు. విధుల్లో ఉన్న కార్యదర్శిపై ఎంపీడీఓ సమక్షంలో దాడికి పాల్పడడం చట్టరీత్యా నేరమని మండిపడ్డారు. దాడికి పాల్పడిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్యదర్శులు, ఎన్జీవో ఉద్యోగులు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చెప్పారు. నేడు విధుల బహిష్కరణ ఇదిలా ఉండగా పంచాయతీ కార్యదర్శిపై టీడీపీ కార్యకర్త రాజు దాడికి నిరసనగా గురువారం విధులు బహిష్కరించాలని పంచాయతీ కార్యదర్శులంతా నిర్ణయించారు. జిల్లాలోని ఎన్జీఓ సంఘ ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శులు తమకు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ఉద్యోగులపై టీడీపీ కార్యకర్తలు, నేతలు దౌర్జన్యాలు చేయడం ప్రజస్వామ్యానికి విరుద్ధమని, ఇటువంటి హేయమైన చర్యను ఇంత వరకు చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దాడి దారుణం అరసవల్లి: సంతకవిటి మండలం వాసుదేవపట్నం పంచాయతీ కార్యదర్శి వి.గౌరిశంకర్పై గురుగుబిల్లి రాజు అనే వ్యక్తి భౌతికంగా దాడి చేయడం దారుణమని, ఈఘటనను తాము ముక్తకంఠంతో ఖండిస్తున్నామని జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బివి.రమణ, ఎం.భాస్కరరావులు ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంపీడీవో సమక్షంలోనే కార్యదర్శిపై దాడి జరిగిందని, విధుల్లో ఉన్న ఉద్యోగిపై దాడి చేయడాన్ని సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు., ఇందుకు నిరసనగా సంతకవిటి మండల పంచాయతీ కార్యదర్శులంతా మూకుమ్మడిగా సెలవు పెట్టేందుకు నిర్ణయించారని ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికైనా దాడిపై విచారణ జరిపి బాధిత కార్యదర్శికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
మళ్లీ రెచ్చిపోయిన ఎమ్మెల్యే చింతమనేని
► గ్రామ కార్యదర్శి మెడ పట్టుకుని తోసివేత సాక్షి, ఏలూరు రూరల్: పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి గ్రామస్థాయి సిబ్బందిపై జులుం ప్రదర్శించారు. ఏలూరు మండలం కోటేశ్వరదుర్గాపురం గ్రామ కార్యదర్శి మెడ పట్టుకుని డ్రైనేజీపైకి తోశారు. ఎవడ్రా నీకు ఉద్యోగం ఇచ్చింది? నిన్ను ఇప్పుడే సస్పెండ్ చేయిస్తా.. అంటూ చిందులు తొక్కారు. శని వారం జరిగిన ఈ సంఘటన ఉద్యోగులతో పాటు స్థానిక నాయకులను ఉలికిపాటుకు గురి చేసింది. ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో భాగంగా ఆయన కోటేశ్వరదుర్గాపురం, గుడివాకలంక, మొండికోడు గ్రామాల్లో పర్యటించారు. కోటేశ్వరదుర్గాపురంలో పంచాయతీ కార్యదర్శి గ్రామానికి సరిగా రావడం లేదని టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. దీంతో చింతమనేని ఆగ్రహంతో ఏయ్.. సెక్రటరీ, ఎవడ్రా నీకు ఉద్యోగం ఇచ్చింది? నేను వస్తుంటే గ్రామాన్ని శుభ్రంగా ఉంచడం కూడా తెలియదా? అంటూ కార్యదర్శి అనిల్‌కుమార్ మెడపట్టుకుని పక్కనే ఉన్న డ్రైనేజీ వద్దకు తోసుకెళ్లారు. చూడు డ్రైనేజీ అధ్వానంగా ఉంది... నీకు కళ్లు కనబడడం లేదా? అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. దీంతో స్థానిక టీడీపీ నాయకులు కార్యదర్శిని పక్కకు లాగి వెనక్కి పంపారు. భీతిల్లిన కార్యదర్శి ‘సార్.. నాకు నాలుగు గ్రామాల ఇన్చార్జి ఇచ్చారు...’ అని చెప్పారు. వాస్తవానికి కార్యదర్శి అనిల్‌కుమార్ మేజర్ పంచాయతీలైన శనివారపుపేట, చాటపర్రు, మాదేపల్లితో పాటు కోటేశ్వరదుర్గాపురం ఇన్చార్జిగా పనిచేస్తున్నారు. నలుగురి పని ఒక్కడు చేస్తున్నా ఎమ్మెల్యే ఇలా దూషించడం అన్యాయమని కార్యక్రమంలో పాల్గొన్న ఇతర శాఖల అధికారులు ఆవేదన వ్యక్తంచేశారు.