పంచాయతీ కార్యదర్శి
2,677 పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ ఫిబ్రవరి 23న నిర్వహించే పరీక్షకు లక్షల మంది హాజరు కానున్నారు. పరీక్షకు సంబంధించిన పేపర్-2లో నిర్దేశించిన అకౌంటింగ్ సిలబస్ పూర్తిగా కొత్తది. దీంతో అభ్యర్థుల్లో కొంత ఆందోళన ఉంది. ఈ నేపథ్యంలో అకౌంటింగ్‌లోని ప్రాథమిక అంశాలపై స్పెషల్ ఫోకస్..
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం, 73వ రాజ్యాంగ సవరణ చట్టంలో నిర్దేశించిన విధులను పంచాయతీ కార్యదర్శి నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ విధుల్లో గ్రామ పంచాయతీ తీర్మానాలను అమలు చేయడం, పంచాయతీ విధించే పన్నులను వసూలు చేయడం వంటివి ఉన్నాయి. ఈ తరుణంలో పంచాయతీ కార్యదర్శికి ఖాతాల నిర్వహణపై అవగాహన ఉండాల్సిన అవసరం ఏర్పడింది. దీన్ని దృష్టిలో ఉంచుకొనే సిలబస్‌లో అకౌంటింగ్ విభాగాన్ని చేర్చారు. 150 మార్కులకున్న పేపర్-2 సిలబస్‌లో ఐదు విభాగాలున్నాయి. వీటిలో ఐదో విభాగం ‘అకౌంటింగ్‌తో సంబంధమున్న ప్రాథమిక అంశాలు’. దీన్నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయో కచ్చితంగా చెప్పలేంగానీ గరిష్టంగా 30 ప్రశ్నలు రావొచ్చు. ఆ.ఇౌఝ, క.ఇౌఝ పూర్తిచేసిన వారికి ఈ విభాగం అనుకూలం. అయితే మిగిలిన వారు కొంత కష్టపడితే పూర్తిస్థాయి మార్కులు పొందొచ్చు. ఈ కింది అంశాలను అర్థం చేసుకుంటే అకౌంటింగ్‌కు సంబంధించిన విషయాలు తేలిగ్గా అర్థమవుతాయి.
అకౌంటింగ్- ప్రాథమిక అంశాలు
అకౌంటింగ్: అమెరికన్ అకౌంటింగ్ అసోసియేషన్ ప్రకారం.. ‘‘వ్యవహారాలను గుర్తించి, కొలచి, ఆర్థికపరమైన సమాచారం అందజేయడం ద్వారా నిర్ణయాలు తీసుకోవడానికి సహకరించే ప్రక్రియే అకౌంటింగ్.
బుక్ కీపింగ్: బుక్ కీపింగ్.. అకౌంటింగ్‌లో అంతర్భాగం. ఇది వ్యవహారాలను పుస్తకాల్లో నమోదుచేసి, వాటిని నిర్వహించేందుకు సంబంధించినది.
బుక్ కీపింగ్‌లో చేసే పనులు:
వ్యవహారాలను, సంఘటనలను గుర్తించడం.
గుర్తించిన వ్యవహారాలను, సంఘటనలను సాధారణంగా ఉపయోగించే కొలమానంలో కొలవడం.
గుర్తించిన, కొలచిన వ్యవహారాలను వాటి అనుబంధ ఖాతా పుస్తకాల్లో కాలక్రమంలో నమోదు చేయడం.
నమోదు చేసిన వ్యవహారాలను, సంఘటనలను ఆవర్జాలో వర్గీకరించడం.
అకౌంటింగ్ లాభాలు:
ఒక ఆర్థిక సంవత్సరంలో సంస్థ లాభం లేదా నష్టాన్ని నిర్ధారించడానికి ఉపయోగపడుతుంది.
సంస్థ ఆర్థిక స్థితిని తెలుసుకోవచ్చు.
సంస్థ ఖాతా పుస్తకాల నిర్వహణ ద్వారా చట్టపరమైన నిబంధనను అమలు చేయొచ్చు.
వ్యాపార కార్యక్రమాల ప్రణాళికల తయారీకి, నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగపడుతుంది.
అకౌంటింగ్ విభాగాలు: 1. ఆర్థిక అకౌంటింగ్. 2. కాస్ట్ అకౌంటింగ్. 3. యాజమాన్య అకౌంటింగ్.
అకౌంటింగ్ భావనలు: అందరికీ ఆమోదయోగ్యమైన అకౌంటింగ్ ప్రమేయాలను అకౌంటింగ్ భావనలుగా చెప్పొచ్చు. అవి: వ్యాపార అస్తిత్వ భావన, ద్రవ్య కొలమాన భావన, వ్యయ భావన, గతిశీల సంస్థ భావన, ద్వంద్వ భావన, అంశాల భావన, వసూలు భావన.
వ్యాపార వ్యవహారాలను రెండు విధాలుగా నమోదు చేస్తారు. అవి.. ఒంటి పద్దు విధానం, జంట పద్దు.
ఒంటి పద్దు విధానం: వ్యవహారాల నమోదు అశాస్త్రీయంగా, అసంపూర్తిగా ఉంటుంది. ఇందులో ఓ వ్యవహారానికి సంబంధించి రెండు అంశాలకు బదులు ఒక అం శం మాత్రమే (డెబిట్ లేదా క్రెడిట్) నమోదు చేస్తారు.
జంట పద్దు విధానం: ఈ విధానాన్ని ఇటలీకి చెందిన లుకాపాసియాలో కనుగొన్నారు. ప్రతి వ్యవహారంలోనూ ఒక ఖాతాకు డెబిట్, మరో ఖాతాకు క్రెడిట్ చేస్తారు. ఇదే జంట పద్దు సూత్రం.
ఖాతాలు- రకాలు:
జంట పద్దు విధానంలోని వ్యవహారాలన్నింటినీ మూడు ఖాతాలుగా విభజించవచ్చు. అవి.. 1. వ్యక్తిగత ఖాతాలు. 2. వాస్తవ ఖాతాలు. 3. నామమాత్రపు ఖాతాలు.
చిట్టా: ఇదొక పుస్తకం. ఇందులో వ్యాపార వ్యవహారాలను వాటి కాలానుగుణంగా నమోదు చేస్తారు. అన్ని వ్యవహారాలను తొలుత చిట్టాలో రాస్తారు. అందుకే దీన్ని తొలి పద్దు పుస్తకంగా పేర్కొంటారు.
ఆవర్జా (లెడ్జర్): అకౌంటింగ్ చక్రంలోని రెండో దశ ఆవర్జా. ఇది వ్యక్తిగత, వాస్తవిక, నామమాత్రపు ఖాతాలకు సంబంధించిన వ్యవహారాల ఖాతాలను రాసే పుస్తకం. చిట్టాలో రాసిన అన్ని డెబిట్, క్రెడిట్ అంశాలన్నీ ఆవర్జాలో సంబంధిత ఖాతాలకు బదిలీ అవుతాయి. ఈ బదిలీ ప్రక్రియనే ఆవర్జా నమోదని అంటారు. ఆవర్జాను తుది పుస్తకమని పేర్కొంటారు.
సహాయక చిట్టాలు:
వ్యాపార వ్యవహారాలను, వాటి స్వభావాన్ని బట్టి వేర్వేరు పుస్తకాల్లో రాస్తారు. ఈ ప్రత్యేక పుస్తకాలనే సహాయక చిట్టాలంటారు. వీటిలో వివిధ రకాలున్నాయి. అవి.. కొనుగోలు చిట్టా, అమ్మకాల చిట్టా, కొనుగోలు వాపసుల చిట్టా, అమ్మకాల వాపుసుల చిట్టా, నగదు చిట్టా, వసూలు హుండీల చిట్టా, చెల్లింపు హుండీల చిట్టా, అసలు చిట్టా.
బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక
సాధారణంగా వ్యాపార సంస్థలు ఈ కింద పేర్కొన్న వాటి కోసం బ్యాంకులో ఖాతాను తెరుస్తాయి. అవి.. దొంగతనం అరికట్టడం, ఉద్యోగులు నిధులను దుర్వినియోగం చేయకుండా చూసేందుకు, చెల్లింపులు జరిపినట్లు సాక్ష్యాల కోసం, దూరప్రాంతాల్లో ఉన్నవారికి చెల్లింపులకు, వారి నుంచి వసూలుకు ఖాతాలు ఉపయోగపడతాయి.
ఓవర్ డ్రాఫ్ట్: కొన్నిసార్లు వ్యాపార సంస్థకు తన బ్యాంకు ఖాతాలో ఉన్న నిల్వ కంటే ఎక్కువ మొత్తం అవసరమవుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఓవర్‌డ్రాఫ్ట్ రూపంలో బ్యాంకు నుంచి అప్పు తీసుకుంటుంది. ఈ పరిస్థితిలో సంస్థకు బ్యాంకు రుణదాత అవుతుంది. ఈ రుణంపై సంస్థ వడ్డీ చెల్లించాలి. ఓవర్‌డ్రాఫ్ట్ అంటే వసూళ్ల కంటే చెల్లింపులు ఎక్కువగా ఉండటం.
ముగింపు లెక్కలు:
ఏడాది చివర్లో సంస్థ.. తన ఆర్థిక పరిస్థితిని ఆస్తి, అప్పుల పరంగా తెలుసుకునేందుకు ముగింపు లెక్కల్ని తయారు చేస్తుంది. లాభనష్టాలను తెలుసుకునేందుకు వర్తకపు, లాభనష్టాల ఖాతాను, ఆస్తి, అప్పుల స్థితిగతులను తెలుసుకునేందుకు ఆస్తి, అప్పుల పట్టీని తయారు చేస్తుంది.
వ్యాపార ఫలితాలు అంటే ఒక సంవత్సర కాలంలోని లాభాలు లేదా నష్టాలు. వీటిని లాభనష్టాల ఖాతాను తయారు చేసి తెలుసుకుంటారు. వాటినే ఆదాయపు పట్టిక అంటారు.
ముగింపు లెక్కల వల్ల లాభాలు:
1.వ్యాపారపు ఆర్థిక ఫలితం
(లాభమా? నష్టమా?) తెలుస్తుంది.
2.వ్యాపారపు ఆర్థిక పరిస్థితి
(ఆస్తులు, అప్పులు) తెలుస్తుంది.
3.వ్యాపార ద్రవ్యత్వ పరిస్థితిని, ఆర్థిక పటిష్టతను
గుర్తించవచ్చు.
4.పన్నులను లెక్కించేందుకు ఉపయోగపడుతుంది.
తరుగుదల
ఓ సంస్థ తాను దీర్ఘకాలం మనుగడలో ఉంటుందని భావిం చి తన వ్యవహారాలను నమోదు చేస్తుంది. దీన్నే గతిశీల సంస్థ భావన అంటారు. దీన్ని అనుసరించి సంస్థ ఆస్తులను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి.. 1. స్థిరాస్తులు (భవనాలు, యంత్రాలు, ఫర్నిచర్ తదితరాలు). 2. చరాస్తులు (రుణగ్రస్తులు, సరుకు, వసూలు హుండీలు తదితరాలు).
ఆస్తి విలువ క్రమేపీ తగ్గడాన్ని తరుగుదల అని అంటాం. తరుగుదల స్థిరాస్తులలోనే ఉంటుంది. అందువల్ల తరుగుదల అనే పదాన్ని స్థిరాస్తులకు సంబంధించి మాత్రమే ఉపయోగించాలి.
తరుగుదలకు కారణాలు:
అరుగు, తరుగు; లుప్తత; భౌతిక శక్తులు; కాలగమనం; ఉద్గ్రహణ.
ఆస్తుల తరుగుదలను ఏర్పరిచేందుకు వివిధ పద్ధతులు అమల్లో ఉన్నాయి. కానీ, వివిధ పారిశ్రామిక, వాణిజ్య సంస్థలు తరుగుదలను ఏర్పరిచేందుకు సాధరణంగా రెండు ముఖ్యమైన పద్ధతులను ఉపయోగిస్తాయి. అవి.. 1. స్థిర వాయిదా పద్ధతి. 2. తగ్గుతున్న నిల్వల పద్ధతి.
స్థిర వాయిదాల పద్ధతి: ఈ పద్ధతిలో ప్రతి సంవత్సరం ఆస్తి కొన్న ఖరీదుపై ఒక స్థిరమొత్తం లేదా కొంత శాతాన్ని ఆస్తి విలువ నుంచి తగ్గిస్తారు. ఆస్తి కొన్న ఖరీదుపై తరుగుదలను ఏటా లెక్కించడం వల్ల, అన్ని సంవత్సరాలకు తరుగుదల, మొత్తాలు స్థిరంగా ఉంటాయి. అందుకే దీన్ని స్థిరవాయిదాల పద్ధతి అంటారు.
తగ్గుతున్న నిల్వల పద్ధతి: ఈ పద్ధతిలో మొదటి ఏడాది ఆస్తి కొన్న ఖరీదుపై తరుగుదలను లెక్కిస్తారు. మిగిలిన సంవత్సరాల్లో ఆస్తి తగ్గుతున్న నిల్వలపై మాత్రమే తరుగుదలను లెక్కిస్తారు. అందుకే దీన్ని నిల్వల పద్ధతిగా పేర్కొంటారు.
కన్‌సైన్‌మెంట్ ఖాతాలు:
టోకు వర్తకుడు, ఉత్పత్తిదారులు తమ వస్తువులను సౌకర్యవంతంగా, లాభదాయకంగా అమ్మాలంటే ఓ ప్రతినిధి అవసరం. ప్రతినిధి.. వర్తకుడు పంపిన సరుకును అమ్మి, తన సేవలకుగాను కొంత కమిషన్ పొందుతాడు. ఇలా ఒక ప్రాంతంలో ఉన్న వర్తకుడు తన సరుకులను వేరొక ప్రాంతంలో ఉన్న ప్రతినిధికి కమిషన్ మీద అమ్మకానికి పంపడాన్ని కన్‌సైన్‌మెంట్ అంటారు. సరుకు పంపే వ్యక్తిని కన్‌సైనర్ అని, సరుకు పొందిన వ్యక్తిని కన్‌సైనీ అని అంటారు. ఏజెంట్ ద్వారా సరుకులను అమ్మే విధానాన్ని కన్‌సైన్‌మెంట్ వ్యాపారంగా పేర్కొనవచ్చు.
కమిషన్: కన్‌సైనర్.. తన సరుకులను అమ్మినందుకుగాను కన్‌సైనీకి చెల్లించిన ప్రతిఫలమే కమిషన్. ఇది ప్రధానంగా మూడు రకాలు. 1. సాధారణ కమిషన్. 2. అదనపు కమిషన్. 3. డెల్ క్రెడరీ కమిషన్.
ముఖ్యాంశాలు
వ్యాపారంలో వ్యాపారస్తుడు పెట్టుబడి పెట్టిన మొత్తం మూలధనం.
నగదు లేదా సరుకులను యజమాని సొంతానికి వాడుకుంటే వాటిని సొంతవాడకాలు అంటారు.
తొలి పద్దు పుస్తకాన్ని చిట్టా అంటారు.
ఖాతాల సంపుటిని ఆవర్జాగా పేర్కొంటారు.
వ్యాపార వ్యవహారాలను చిట్టా నుంచి ఆవర్జాకు బదిలీ చేయడాన్ని నమోదు అంటారు.
మూలధనం, అప్పులను కలిపి ఆస్తులుగా వ్యవహరిస్తారు.
ఆస్తులు, అప్పులకు మధ్యగల తేడా మూలధనం.
మూలధనం వ్యక్తిగత ఖాతాకు చెందినది.
నగదు వాస్తవిక ఖాతాకు చెందినది.
జీతాలు నామమాత్రపు ఖాతాకు చెందినది.
సహాయక చిట్టాలు ఎనిమిది రకాలు.
రుణదాత రుణగ్రస్థునికి ఇచ్చే డిస్కౌంట్ నగదు డిస్కౌంట్.
వర్తకుడు, కొనుగోలుదారునికి అమ్మకపు ధరపై ఇచ్చే తగ్గింపును వర్తకపు డిస్కౌంట్లు అంటారు.
వర్తకపు డిస్కౌంటును ఖాతాపుస్తకాల్లో నమోదు చేయకూడదు.
చిట్టా, ఆవర్జాగా ఉపయోగపడే పుస్తకాన్ని నగదు పుస్తకమని అంటారు.
ఓవర్ డ్రాఫ్టు పద్ధతిలో నగదు పుస్తకంలో క్రెడిట్ నిల్వ చూపుతుంది.
పాస్‌బుక్ క్రెడిట్ నిల్వ చూపే పద్ధతి అనుకూల నిల్వ పద్ధతి.
మూలధన అంశాలను ఆస్తి, అప్పుల పట్టీలో నమోదు చేస్తారు.
రాబడి అంశాలను లాభనష్టాల ఖాతాలో నమోదు చేస్తారు.
ఫర్నిచర్ కొనుగోలును సాధారణ ఖర్చుల ఖాతాకు డెబిట్ చేయడాన్ని సిద్ధాంతపరమైన తప్పులు అంటారు.
కన్‌సైనీ, కన్‌సైనర్‌కు పంపే నివేదికను అకౌంట్ సేల్స్ అంటారు.
కన్‌సైన్‌మెంట్ ఖాతా నామమాత్రపు ఖాతాకు చెందినది.
అకౌంటింగ్ సూత్రం ప్రకారం నమోదు చేయని వ్యవహారాలను సిద్ధాంతరపరమైన తప్పులుగా పేర్కొంటారు.
వ్యవహారాలను పూర్తిగా నమోదు చేయకుండా వదిలేసిన తప్పులు ఆకృతి తప్పులు.
కన్‌సైనీ ఖాతా వ్యక్తిగత ఖాతాకు చెందినది.
ఆస్తి జీవితకాలం పూర్తయిన తర్వాత మిగులు విలువను తుక్కు విలువ లేదా అవశేషపు విలువ అని అంటారు.
అసాధారణ నష్టాన్ని కన్‌సైన్‌మెంట్ ఖాతాలో క్రెడిట్ వైపున వేస్తారు.
ఆస్తి విలువ మాత్రమే కాకుండా ఆస్తి ధరపై వడ్డీని కూడా పరిగణనలోకి తీసుకునే పద్ధతిని వార్షిక పద్ధతి అంటారు.
కురుహూరి రమేష్,
సీనియర్ ఫ్యాకల్టీ హైదరాబాద్.