ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న ఉద్యోగార్థులను పంచాయతీ కార్యదర్శి పోస్టుల రూపంలో మరో అవకాశం పలకరించింది. దీంతో అభ్యర్థులు ఉత్సాహంగా పరీక్షకు సిద్ధమవుతున్నారు. అయితే పరీక్షకు చాలా తక్కువ సమయం ఉండటం, సిలబస్.. ఏపీపీఎస్సీ, ఇతర పోటీ పరీక్షల సిలబస్‌తో కొంత భిన్నంగా ఉండటంతో అభ్యర్థులకు పటిష్ట ప్రిపరేషన్ ప్రణాళిక అవసరమైంది. ఈ నేపథ్యంలో గెలుపు వ్యూహాలపై ఫోకస్..
పంచాయతీ కార్యదర్శి.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పంచాయతీరాజ్ సబార్డినేట్ సర్వీసులో క్షేత్రస్థాయిలో కీలక ఉద్యోగం.. గతంలో ఉన్న వీడీవో ఉద్యోగాన్ని పేరుమార్చి, ఆపై హోదాను పెంచి పంచాయతీ కార్యదర్శిగా మార్చారు. మొత్తం 2,677 పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్- 4) పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ పూర్తిచేసిన వారు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు.
పరీక్ష విధానం:
పేపర్ {పశ్నలు మార్కులు సమయం
1.జనరల్ స్టడీస్ 150 150 150 ని.
2.గ్రామీణాభివృద్ధి
(ఏపీకి ప్రాధాన్యం) 150 150 150 ని.
పరీక్ష ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది. ప్రశ్నలు డిగ్రీ స్థాయిలో ఉంటాయి.
రాత పరీక్ష మార్కుల ఆధారంగా తుది ఎంపిక.
పేపర్-1
జనరల్ స్టడీస్
జనరల్ స్టడీస్ సిలబస్‌లో మొత్తం ఏడు అంశాలను పేర్కొన్నారు. అవి: 1. జాతీయ, అంతర్జాతీయ ప్రధాన సంఘటనలు. 2. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు. 3. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- సమకాలీన పరిణామాలు. 4. ఆధునిక భారత దేశ చరిత్ర (జాతీయోద్యమానికి ప్రత్యేక ప్రాధాన్యం. 5. భారత్- ఆర్థికాభివృద్ధి. 6. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రెటేషన్. 7. విపత్తు నిర్వహణ.
ఉద్యోగ నియామక పోటీ పరీక్షల్లో జీఎస్ ఉమ్మడిగా ఉంటుంది. అయితే ఈ పరీక్షకు సంబంధించిన జీఎస్‌లో కొన్ని అంశాలను మాత్రమే ప్రస్తావించారు. జాగ్రఫీ, జనరల్ సైన్స్‌ను స్పృశించలేదు. అందువల్ల ఆయా విభాగాలను ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం లేదు.
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో కొత్త ఆవిష్కరణలపై దృష్టిసారించాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ, మెడికల్ టెక్నాలజీ, అగ్రికల్చర్ టెక్నాలజీ తదితర అంశాలను చదవాలి. అంతర్జాతీయ సదస్సులు, వివిధ దేశాలతో భారత్ ఒప్పందాలు, ప్రధాన సంఘటనలు, పురస్కారాలు వంటి వాటిని అధ్యయనం చేయాలి.
ఉదాహరణ: 2014 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంగా ప్రకటించింది?
జవాబు: కుటుంబ వ్యవసాయ సంవత్సరం ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పనిచేసే సూపర్ కంప్యూటర్ తియాన్హె-2ను అభివృద్ధి చేసిన దేశం?
జవాబు: చైనా
ఆధునిక భారత దేశ చరిత్ర:
సిలబస్‌లో భారత జాతీయోద్యమానికి ప్రాధాన్యం ఇస్తూ ఆధునిక భారత దేశ చరిత్రను పేర్కొన్నారు. కనుక కొంత భారం తగ్గినట్లే! ఐరోపా దేశాల వలస స్థాపన, స్థావరాలు, ఆధిపత్య పోరాటాలు, బ్రిటిష్ సామ్రాజ్య వ్యాప్తి, కర్ణాటక యుద్ధాలు, ఆంగ్లో- మరాఠా యుద్ధాలు, బ్రిటిష్ కంపెనీ పరిపాలన, ఆర్థిక విధానాలు- సంస్కరణలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి.
భారత జాతీయోద్యమం అత్యంత ప్రధాన అంశం. సిపాయిల తిరుగుబాటు దగ్గర నుంచి స్వాతంత్య్రం వచ్చినంత వరకు జరిగిన మహోన్నత పోరాటాలు చాలా ఉన్నాయి. జాతీయ కాంగ్రెస్ స్థాపన, మితవాదులు, అతివాదులు; స్వదేశీ ఉద్యమం; మహాత్మాగాంధీ ప్రవేశం; సహాయ నిరాకరణ; శాసనోల్లంఘన ఉద్యమం; క్విట్ ఇండియా ఉద్యమం; రాజ్యాంగ రచన తదితర అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి.
ఉదాహరణ: భారత దేశానికి వ్యాపార ప్రయోజనాలకై వచ్చిన మొట్టమొదటి, చిట్టచివరి దేశాలు?
జవాబు: పోర్చుగల్, ఫ్రాన్స్
అన్ని రౌండ్‌టేబుల్ సమావేశాలకు హాజరైన వారు?
జవాబు: బి.ఆర్.అంబేద్కర్
భారత ఆర్థిక వ్యవస్థ- అభివృద్ధి:
స్వాతంత్య్రం తర్వాత భారత దేశం ఏ విధంగా అభివృద్ధి చెందిందన్న అంశంపై ప్రధానంగా ప్రశ్నలు వస్తాయి. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, పంచవర్ష ప్రణాళికలు, అభివృద్ధి పథకాలు, మౌలిక వసతులు, పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం, రవాణా, పన్నులు, ఎగుమతులు- దిగుమతులు, బ్యాంకింగ్ వంటి వాటికి సంబంధించిన సమకాలీన అంశాలపై దృష్టిసారించాలి.
విపత్తు నిర్వహణ:
ప్రకృతిపరంగా మానవాళి ఎదుర్కొంటున్న అనేక వైపరీత్యాలపై, ముఖ్యంగా వరదలు, సునామీలు, కరువులు, భూకంపాలు, తుఫాన్లు తదితర అంశాలపై అభ్యర్థులకున్న ప్రాథమిక అవగాహనను పరిశీలిస్తారు. విపత్తులు సంభవించినప్పుడు ఎలా స్పందించాలి?; పునరావాస కార్యక్రమాలు; ఆస్తి, ప్రాణ నష్టం నివారణ; జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ తదితర అంశాలపై ప్రశ్నలు వస్తాయి. విపత్తులు- సమకాలీన పరిణామాలను అభ్యర్థులు తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. సీబీఎస్‌ఈ 8, 9 తరగతులలో నిర్దేశించిన సిలబస్‌కు అనుగుణంగా చదవితే సరిపోతుంది.
అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రెటేషన్:
ఈ తరహా ప్రశ్నలు ఎక్కువగా బ్యాంకు పరీక్షల్లో వస్తుంటాయి. పంచాయతీ కార్యదర్శులు తమ విధి నిర్వహణలో భాగంగా అనేక విషయాలను త్వరితగతిన ఆకళింపు చేసుకొని, విశ్లేషించాల్సి ఉంటుంది. ఇచ్చిన డేటాను పరిశీలించి, సరైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల పరీక్షలో కొన్ని గణాంకాలు ఇచ్చి, వాటి నుంచి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవచ్చో అడిగే అవకాశం ఉంది.
పేపర్ 2
గ్రామీణాభివృద్ధి- సమస్యలు
పంచాయతీ కార్యదర్శులు నిర్వర్తించే విధులను దృష్టిలో ఉంచుకొని, ఈ పేపర్ సిలబస్‌ను నిర్దేశించారు. ఈ పోస్టును ఆశిస్తున్న అభ్యర్థికి తెలిసి ఉండాల్సిన అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రజారోగ్యంపై అవగాహన ఉండాలి కాబట్టి అంటువ్యాధులు ప్రబలినపుడు సత్వరం తీసుకోవాల్సిన చర్యలు; అంటు వ్యాధులు- కారణాలు; పారిశుద్ధ్యం వంటి అంశాలను,సమకాలీన అంశాలకు జోడిస్తూ చదవాలి. హైస్కూల్ స్థాయి పుస్తకాలలోని ప్రజారోగ్యం అంశాలను చదవాలి. ప్రస్తుతం ప్రజారోగ్యానికి సంబంధించి అమలవుతున్న పథకాల గురించి క్షుణ్నంగా అధ్యయనం చేయాలి.
సంక్షేమ పథకాలు:
గ్రామీణ సమాజంలో అణగారిన, నిర్లక్ష్యానికి గురైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళల సంక్షేమంపై దృష్టిసారించాలి. ఆయా వర్గాలకు రాజ్యంగ, చట్టపరమైన రక్షణల గురించి తెలుసుకోవాలి. సంక్షేమ, అభివృద్ధి పథకాలు- వాటి ప్రాముఖ్యతను లోతుగా అధ్యయనం చేయాలి. సామాజిక ఒత్తిళ్లు, సంఘర్షణ కారణాలు, పరిష్కార మార్గాలపై అవగాహన పెంపొందించుకోవాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం, నిరుద్యోగం, ప్రభుత్వ పథకాలపై ఎక్కువ ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ స్వభావం; కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు; పంచాయతీరాజ్ వ్యవస్థ; అధికార వికేంద్రీకరణ; 73వ రాజ్యాంగ సవరణ ప్రాముఖ్యత తదితర అంశాలను లోతుగా అధ్యయనం చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో సహకార సంస్థలు, వాటి నేపథ్యం; పరపతి సౌకర్యాలు వంటి అంశాలను కూడా చదవాలి.
అకౌంటింగ్- మౌలికాంశాలు:
పరీక్షలో నిర్దేశించిన అకౌంటింగ్ విభాగం పూర్తిగా కొత్తది. ఇప్పటి వరకు ఏపీపీఎస్సీ నిర్వహించిన ఏ పోటీపరీక్షల సిలబస్‌లోనూ ఈ విభాగం లేదు. పంచాయతీ ఖాతాల నిర్వహణపై అవగాహన పెంపొందించుకోవడానికి సిలబస్‌లో అకౌంటింగ్ అంశాలను పేర్కొన్నారు. అభ్యర్థులు అకౌంటింగ్ భావనలు, సంప్రదాయాలు, బుక్ కీపింగ్, ఒంటిపద్దు, జంటపద్దు, క్యాష్‌బుక్, లెడ్జర్ వంటి అంశాలపై ప్రాథమిక అవగాహన పెంపొందించుకోవాలి.
అభ్యర్థులు ఇంటర్మీడియెట్ స్థాయి కామర్స్ పాఠ్యపుస్తకంలోని అకౌంటింగ్ చాప్టర్లను చదివితే సరిపోతుంది.
జనరల్ స్టడీస్ ప్రత్యేకత!
ఏ పోటీ పరీక్ష అయినా జీఎస్ పేపర్‌లో సాధారణంగా భారతదేశ చరిత్ర; రాజకీయ వ్యవస్థ; ఆర్థిక వ్యవస్థ; భారత భౌగోళికాంశాలు; శాస్త్రసాంకేతిక అంశాలు; జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ పరిణామాలు; జనరల్ మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ అంశాలుంటాయి. అయితే ఆయా ఉద్యోగ నియామకాలనుబట్టి సంబంధిత అంశాలపై ప్రత్యేకంగా పరీక్షకు రూపకల్పన చేస్తారు.
ఈ క్రమంలోనే పంచాయతీ కార్యదర్శి విధులకు సంబంధించి అభ్యర్థులకున్న అవగాహనను పరీక్షించేందుకు పేపర్-2లో ప్రత్యేక అంశాలను పొందుపరిచారు. అందువల్ల జీఎస్ పేపర్‌లోని పాలిటీని పేపర్-2లో ప్రస్తావించారు. గ్రామీణ ప్రాంతాలకు అవసరమైన శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని కూడా పేపర్-2లోనే పేర్కొన్నారు కాబట్టి జీఎస్‌లో దాని ప్రస్థావన అవసరం లేదు.
సిలబస్‌లో ప్రపంచ భౌగోళికాంశాలను పేర్కొనలేదు. అయినా గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం వంటి అంశాలను భారత భౌగోళికాంశాలకు, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పరిస్థితులకు అన్వయించి, అధ్యయనం చేయాల్సి ఉంటుంది. మొత్తంమీద రెండు, మూడు అంశాలను మినహాయిస్తే పంచాయతీ కార్యదర్శి పరీక్ష జీఎస్‌కూ, ఇతర ఏపీపీఎస్సీ పరీక్షల జీఎస్‌కూ చెప్పుకోదగ్గ గుణాత్మక తేడా కనిపించలేదు. అభ్యర్థులు జీఎస్ పేపర్‌లో ఎక్కువ మార్కులు సాధించాలంటే విస్తృత అధ్యయనం అవసరం.
జిల్లాల వారీగా పోస్టుల వివరాలు
జిల్లా పోస్టులు
మహబూబ్‌నగర్ 350
ఆదిలాబాద్ 241
శ్రీకాకుళం 209
అనంతపురం 202
విజయనగరం 201
మెదక్ 182
కర్నూలు 164
విశాఖపట్నం 155
నల్లగొండ 133
వరంగల్ 106
చిత్తూరు 104
ప్రకాశం 95
కరీంనగర్ 88
నెల్లూరు 86
ఖమ్మం 83
తూర్పుగోదావరి70
నిజామాబాద్ 66
రంగారెడ్డి 57
గుంటూరు 26
కడప 26
పశ్చిమ గోదావరి 25
కృష్ణా 8
మొత్తం 2,677
పంచాయతీ కార్యదర్శి విధులు:
పంచాయతీ కార్యదర్శిగా విధులు చేపట్టిన వారు అంచెలంచెలుగా ఎదిగి, ఎంపీడీవో స్థాయికి చేరుకోవచ్చు.ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం(1994), 73వ రాజ్యాంగ సవరణ చట్టం (1992)లో నిర్దేశించిన విధులను పంచాయతీ కార్యదర్శి నిర్వర్తించాలి.
సర్పంచ్ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ సమావేశాలను ఏర్పాటు చేయాలి. సమావేశాల మినిట్స్ తయారు చేయాలి.
గ్రామ పంచాయతీ తీర్మానాల అమలు బాధ్యత.
గ్రామ పంచాయతీ విధించే పన్నుల వసూలు.
ప్రజారోగ్యం, తాగునీటి సరఫరా, గ్రామ పంచాయతీ ఆస్తుల పరిరక్షణ.
వివిధ సంక్షేమ కార్యక్రమాల అమలు.
గ్రామ పంచాయతీకి, ప్రభుత్వానికి అనుసంధాన కర్తగా వ్యవహరించాలి.
పంచాయతీ ఉద్యోగులపై పర్యవేక్షణ బాధ్యత వంటి విధులను నిర్వర్తించాలి.
ముఖ్య తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: జనవరి 4, 2014.
ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: జనవరి20, 2014.
దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 22, 2014.
పరీక్ష తేదీ: ఫిబ్రవరి 23, 2014.
బి. కృష్ణారెడ్డి, డెరైక్టర్,
క్లాస్-1 స్టడీ సర్కిల్, హైదరాబాద్