పంచాయతీ కార్యదర్శి కటాఫ్ 240-250? | Exam Review on Panchayat Secretary | Sakshi
Sakshi News home page

పంచాయతీ కార్యదర్శి కటాఫ్ 240-250?

Published Thu, Mar 6 2014 12:46 PM | Last Updated on Wed, Sep 26 2018 3:23 PM

Exam Review on Panchayat Secretary

మొత్తం 2,677 పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్-4) ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఏపీపీఎస్సీ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 23న పరీక్ష నిర్వహించింది. ఇటీవల విడుదలైన వీఆర్‌వో పరీక్ష ఫలితాల్లో వందకు వంద మార్కులు రావడంతో పంచాయతీ కార్యదర్శి పరీక్ష కటాఫ్‌పై రకరకాల అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శి ప్రశ్నపత్రాల తీరుతెన్నులు, కటాఫ్ అంచనాలపై నిపుణుల విశ్లేషణ..
 
 
 పంచాయతీ కార్యదర్శి పరీక్షకు 8.14 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. 71 శాతం మంది హాజరయ్యారు. ఉదయం జరిగిన పేపర్-1 (జనరల్ స్టడీస్)కు 71.21 శాతం మంది హాజరుకాగా, మధ్యాహ్నం జరిగిన పేపర్-2 (గ్రామీణాభివృద్ధి)కు 70.83 శాతం మంది హాజరయ్యారు. పేపర్-1లో వచ్చిన మూడు ప్రశ్నలు స్వల్ప తేడాతో రెండో పేపర్‌లోనూ వచ్చాయి. అవి..
 
1.బెరి బెరి వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది? (పేపర్-1); బి-విటమిన్ లోపం వల్ల సంక్రమించే వ్యాధి? (పేపర్-2).
2.ఏ కమిటీ సూచనల ఆధారంగా నాబార్డ్‌ను స్థాపించారు? (పేపర్-1); నాబార్డ్ సంస్థను ఏ కమిటీ సిఫార్సుల మేరకు స్థాపించారు? (పేపర్-2).
3.భారతదేశ ఏ రెండు రాష్ట్రాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థను మొదట ప్రవేశపెట్టారు? (పేపర్-1); రాజస్థాన్‌తో పాటుగా మొట్టమొదట పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రారంభమైన మరో రాష్ట్రం? (పేపర్ 2).
 
 పేపర్ 1 (జీఎస్): జనరల్ స్టడీస్ పేపర్‌లో ఐదారు ప్రశ్నలు తప్ప, మిగిలిన ప్రశ్నలన్నీ తేలిక నుంచి మధ్యస్థాయి (Easy to Moderate) కాఠిన్యత ఉన్నవే. చాలా వరకు ప్రశ్నలు నేరుగా వచ్చాయి. భారతదేశ మొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు?; సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం ఏది?; చంద్రునిపై కాలు పెట్టిన మొదటి వ్యోమగామి ఎవరు? వంటి ప్రశ్నలు ఈ కోవకు చెందుతాయి.

 

ఇందులో లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ విభాగం నుంచి ఏకంగా 37 ప్రశ్నలు వచ్చాయి. వర్తమాన వ్యవహారాల నుంచి 19 ప్రశ్నలు వచ్చాయి. జనరల్ నాలెడ్జ్ విభాగం నుంచి సింహ భాగం ప్రశ్నలు (దాదాపు 42) వచ్చాయి. గ్రూప్స్, జేఎల్ వంటి పోటీ పరీక్షలకు పకడ్బందీగా సిద్ధమవుతున్న వారు జీఎస్ పేపర్‌లో 135 వరకు స్కోర్ చేస్తారనడంలో సందేహం లేదు.
 
విపత్తుల నిర్వహణ విభాగం నుంచి ఎనిమిది ప్రశ్నలు వచ్చాయి. ఈ ప్రశ్నలు గతంలో ఏపీపీఎస్సీ నిర్వహించిన వివిధ పరీక్షల్లో పదేపదే వచ్చినవే.
 ఉదా: సార్క్ విపత్తు నిర్వహణ కేంద్రం ఎక్కడ ఉంది?
 1) కటక్    
 2) న్యూఢిల్లీ
 3) విశాఖపట్నం
 4) మదురై
 జవాబు: 2
 
 ఉదా: ఏ సంవత్సరంలో విపత్తు నిర్వహణ చట్టాన్ని భారత్‌లో చేశారు?
 1) 2003
 2) 2004
 3) 2005
 4) 2006
 జవాబు: 3
 
 పేపర్ 2 (గ్రామీణాభివృద్ధి):
 పరీక్షకు సంబంధించిన పేపర్-2 (గ్రామీణాభివృద్ధి, గ్రామీణ ప్రాంత సమస్యలు) సిలబస్‌లో అయిదు అంశాలను పేర్కొన్నారు. అయితే ప్రశ్నపత్రం రూపకల్పనలో వీటికి సమ ప్రాధాన్యం ఇవ్వలేదు. అకౌంటింగ్‌కు సంబంధించి 28 వరకు ప్రశ్నలు వచ్చాయి. ఇవి ఇంటర్, డిగ్రీలో కామర్స్ చదువుకున్న వారు మాత్రమే సమాధానాలు గుర్తించేలా ఉన్నాయి. పేపర్-1 బాగా రాసి, ఉత్సాహంగా పేపర్-2కు హాజరైన వారు ఇందులోని అకౌంటింగ్ ప్రశ్నల సంఖ్య, అడిగే తీరును చూసి నిరాశచెందారు. పదాలు పూర్తిగా కొత్తవి కావడంతో, ప్రశ్నను సైతం అర్థం చేసుకోలేని స్థితిలో ఉండటంతో కామర్స్ నేపథ్యం లేని అభ్యర్థులు నిరుత్సాహానికి గురయ్యారు.
 
ఉదా: జంట పద్దు విధానంలో ఖాతా పుస్తకాల నమోదు, నిల్వలు తేల్చడంలో దొర్లిన అంకగణిత కచ్చితత్వాన్ని కనుక్కోవడానికి ఈ కింది దాన్ని తయారు చేస్తారు?
 1) నగదు పుస్తకం
 2) చిట్టా
 3) అంకణా    
4) బ్యాంకు నిల్వల సమన్వయ పట్టీ
 జవాబు : 3
 
 ఉదా: రూ.5 వేలు జీతాల చెల్లింపు అంకణాలో క్రెడిట్ వైపు చూపారు. అప్పుడు అంకణాలోని డెబిట్ వైపు
 1) రూ.5 వేలు తగ్గుతుంది
 2) రూ.5 వేలు అధికంగా చూపుతుంది
 3) రూ.10 వేలు తగ్గుతుంది
 4) రూ.10 వేలు అధికంగా చూపుతుంది.
 జవాబు: 3
 
 పంచాయతీరాజ్ హవా!
 అందరూ ఊహించినట్లుగానే పేపర్-2లో పంచాయతీరాజ్ వ్యవస్థ నుంచి అధిక ప్రశ్నలు వచ్చాయి. పంచాయతీరాజ్ వ్యవస్థ- రాజ్యాంగం; స్థానిక సంస్థల నిర్మాణం- విధులు తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడిగారు.
 
 ఉదా:1)పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్ని సంవత్సరాల కొకసారి ఎన్నికలు జరపాలని భారత రాజ్యాంగం నిర్దేశిస్తుంది?
 2)మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో ఏ మూడు ఉన్నాయి?
 
 గ్రామీణ ప్రాంత ప్రజల జీవితాల్లో ప్రధానమైన వ్యవసాయం- అనుబంధ రంగాల గురించి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. ఒకే అంశానికి సంబంధించి నాలుగైదు ప్రశ్నలు వచ్చాయి.
 
 విటమిన్లకు సంబంధించి సూర్యరశ్మి ద్వారా లభించే విటమిన్ ఏది?; ‘ఎ’ విటమిన్ ఆహారంలో లోపిస్తే దెబ్బతినే అవయవం ఏది?; సి విటమిన్ ఏ ఆహార పదార్థాలలో ఎక్కువగా లభిస్తుంది? బి విటమిన్ లోపం వల్ల సంక్రమించే వ్యాధి ఏది? అనే ప్రశ్నలు వచ్చాయి.
 
 వ్యవసాయం, అనుబంధ రంగాల విప్లవాలపై ఆరు ప్రశ్నలు వచ్చాయి. వీటిలో హరిత విప్లవానికి సంబంధించి రెండు, శ్వేత విప్లవం నుంచి రెండు, నీలి విప్లవం నుంచి ఒకటి, యెల్లో విప్లవం నుంచి ఒకటి ప్రశ్నలు వచ్చాయి.
 
 కటాఫ్ అంచనా
 పేపర్-1లో 130-135 మార్కులు తెచ్చుకునే అవకాశముంది. అదే విధంగా రెండో పేపర్‌లో 110-115 మార్కులు స్కోర్ చేయొచ్చు. దీన్నిబట్టి మొత్తంమీద కటాఫ్ 240-250 (300 మార్కులకు) ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు మార్కులు సాధించిన వారు పోటీలో నిలిచేందుకు అవకాశముందంటున్నారు.
 
 
 ఇంటర్ పాఠ్యపుస్తకాల్లోనివే
 అకౌంటింగ్ ప్రాథమిక అంశాల విభాగంలో వచ్చిన ప్రశ్నల్లో చాలా వరకు ఇంటర్మీడియెట్ కామర్స్ తెలుగు అకాడమీ పుస్తకాల్లో ఉన్నవే. అయిదారు ప్రశ్నలు సీబీఎస్‌ఈ 11, 12 తరగతి పుస్తకాల్లో ఉన్నాయి. ఇంటర్, డిగ్రీ స్థాయిలో కామర్స్ చదువుకున్న వారికి ఈ విభాగం అనుకూలంగా ఉందని చెప్పొచ్చు.
 - కురుహూరి రమేష్, సీనియర్ ఫ్యాకల్టీ.
 
 డేటా ఇంటర్‌ప్రిటేషన్, అకౌంటింగ్ కీలకం!
 పోటీ పరీక్షల ప్రశ్నపత్రం ఎప్పుడూ సమతూకంగా ఉండాలి. ఏదో ఒక విభాగం వారికి ప్రయోజనం చేకూరేలా ఉండకూడదు. పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీని అర్హతగా నిర్దేశించారు. అలాంటప్పుడు అందరినీ దృష్టిలో ఉంచుకొని ప్రశ్నపత్రాన్ని రూపొందించాలి. కానీ, పరీక్షలో ఏకంగా 28 ప్రశ్నలు అకౌంటింగ్‌కు సంబంధించినవి ఉన్నాయి. అవి కూడా జనరల్‌గా కాకుండా పూర్తిగా టెక్నికల్‌గా ఉన్నాయి. కామర్స్ నేపథ్యమున్న విద్యార్థులు మాత్రమే వాటికి సమాధానాలు రాయగలరు. అదే విధంగా సిలబస్‌లో ‘సమకాలీన సమాజంలో సామాజిక ఉద్రిక్తతలు, ఘర్షణలు- అణగారిన వర్గాల సమస్యలు’ అంశాన్ని పేర్కొన్నారు. కానీ, ఈ విభాగం నుంచి చాలా తక్కువ ప్రశ్నలు వచ్చాయి. మొత్తంమీద పేపర్-1లో డేటా ఇంటర్‌ప్రిటేషన్, పేపర్-2లో అకౌంటింగ్‌లో మంచి స్కోర్ చేసిన వారు తుది జాబితాలో నిలిచే అవకాశముంది.    - బి.కృష్ణారెడ్డి, డెరైక్టర్, క్లాస్-1 స్టడీసర్కిల్.
 
 
 డిగ్రీ అర్హతతో గతంలో ఏపీపీఎస్సీ నిర్వహించిన పరీక్షల జనరల్ స్టడీస్ పేపర్‌తో పోల్చితే ప్రస్తుత పంచాయతీ కార్యదర్శి పేపర్-1 భిన్నంగా ఉంది. దాదాపు అన్ని ప్రశ్నలూ నేరుగా వచ్చాయి. జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు ఎక్కువగా వచ్చాయి. పేపర్-1లో 140 మార్కుల వరకూ స్కోర్ చేయొచ్చు. ప్రస్తుతం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు తప్పనిసరిగా స్టాండర్డ్ జీకేపై పట్టు సాధించాలి.
 - ఎన్.విజయేందర్‌రెడ్డి, జనరల్ అవేర్‌నెస్ ఫ్యాకల్టీ.
 
 
 సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి
 ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించాలన్న కోరిక ఉన్నప్పటికీ చాలా మంది.. నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ గురించి ఆలోచిస్తారు. అయితే నోటిఫికేషన్లతో సంబంధం లేకుండా దీర్ఘకాలిక ప్రణాళికతో లక్ష్యాన్ని సాధించే దిశగా సాగిపోవాలి. అప్పుడే పోటీ ప్రపంచంలో విజేతల జాబితాలో చోటు లభిస్తుంది. ఎక్కువ మంది గ్రూప్స్‌ను లక్ష్యంగా పెట్టుకుంటారు. కొత్త నోటిఫికేషన్లు రావడానికి మరికొన్ని నెలలు ఆగాల్సి ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రిపరేషన్‌ను కొనసాగించేందుకు సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. ఇలా చేస్తే ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా పోటీలో ముందువరుసలో ఉండొచ్చు.
 
 ఎన్ని గంటలు చదవాలి:
 ప్రిపరేషన్‌కు ఎవరెన్ని గంటలు కేటాయించాలనేది వారివారి చేతుల్లోనే ఉంటుంది. వివిధ ఉద్యోగాల్లో ఉన్నవారు, ఫ్రెషర్స్ తమకు అందుబాటులో ఉన్న సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి.
 
 జనరల్ స్టడీస్ పట్టుపట్టాలి:
 డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ సూపరింటెండెంట్, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, ఎంపీడీవో, రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్, డీఎల్, జేఎల్ వంటి ఉన్నత స్థాయి పోస్టుల నుంచి జూనియర్ అసిస్టెంట్, అకౌంటెంట్, హాస్టల్ వార్డెన్, కానిస్టేబుల్ వంటి ఉద్యోగాల వరకు నిర్వహించే పరీక్షల్లో జనరల్ స్టడీస్ కీలకపాత్ర పోషిస్తుంది. గ్రూప్స్‌తో పాటు వివిధ పోస్టులకు నిర్వహించే పరీక్షల్లో జీఎస్‌కు ప్రత్యేక పేపర్ ఉంటుంది. ఓ ప్రణాళిక ప్రకారం చదివితే ఇందులో అత్యధిక మార్కులు సంపాదించవచ్చు.

 

జీఎస్‌లో హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకనామిక్స్, మెంటల్ ఎబిలిటీ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, కరెంట్ అఫైర్స్‌లకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. అందువల్ల అభ్యర్థులు ఆరు నుంచి పదో తరగతి వరకు సైన్స్, సోషల్ పాఠ్యపుస్తకాలను చదివి, సొంతంగా నోట్స్ రూపొందించుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ నోట్స్‌ను చదివిన తర్వాత ఇతర ఏ ప్రామాణిక మెటీరియల్‌ను అయినా త్వరగా చదివేందుకు, తేలిగ్గా అర్థం చేసుకునేందుకు అవకాశముంటుంది.
 
 అప్‌డేట్.. అసలైన ఆయుధం:
 ఏ ప్రభుత్వ ఉద్యోగ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులైనా సిలబస్‌లోని విషయాలకు సంబంధించి తాజా సమాచారాన్ని తెలుసుకోవడం (అప్‌డేట్) ప్రధానం. దీనికోసం ఒకట్రెండు దిన పత్రికలు చదువుతూ సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. పోటీ పరీక్షల డిస్క్రిప్టివ్ పేపర్లలో అత్యధిక మార్కులు సాధించాలంటే రైటింగ్ స్కిల్స్ చాలా ముఖ్యం. దీనికోసం అభ్యర్థులు  తక్కువ సమయంలో ఎగ్జామినర్ ఆశించిన సమాధానం రాయాలంటే ఇప్పటి నుంచే రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. దీనికోసం రోజులో కొంత సమయాన్ని కేటాయించాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement