కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: పంచాయతీ కార్యదర్శి పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన నిరుద్యోగులతో గురువారం జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం వద్ద పరిస్థితి జాతరను తలపించింది. జిల్లాలో ఖాళీగా ఉన్న 98 గ్రామ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ కోసం ఈ నెల 4న నోటిఫికేషన్ జారీ అయిన విషయం తెలిసిందే. ఇందుకు డిగ్రీ అర్హతగా ప్రకటించిన నేపథ్యంలో తత్సమాన టెక్నికల్ కోర్సులు (బీటెక్, ఎంటెక్, ఎంబీఏ) చేసిన అభ్యర్థులు కూడా రోజూ పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
ఉదయం కార్యాలయ పనివేళలు ప్రారంభం కాక ముందే నిరుద్యోగులు వచ్చి వేచి ఉంటున్నారు. గురువారం రద్దీ మరింత పెరిగింది. కార్యాలయంలో రెండు, కార్యాలయ మిద్దెపై రెండు కౌంటర్లు ఏర్పాటు చేసి ఇక్కడి సిబ్బందితో పాటు డీఎల్‌పీఓ కార్యాలయ సిబ్బంది సైతం దరఖాస్తుల ప్రక్రియలో నిమగ్నమైనా రద్దీని నివారించలేని పరిస్థితి ఉంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన అనేక మంది డీపీఓ కార్యాలయ ప్రాంగణంలోనే భోజనాలు కానిచ్చి క్యూలో నిల్చొని దరఖాస్తులు సమర్పించారు. ఒకానొక సందర్భంలో తోపులాట చోటు చేసుకోవడంతో డీపీఓ కార్యాలయం నుంచి కలెక్టరేట్ మెయిన్ గేట్ వరకు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గురువారం ఒక్కరోజే 3,087 మంది దరఖాస్తు చేసుకున్నారు. 4వ తేదీ నుంచి 7వ తేదీ సాయంత్రం వరకు 5,957 దరఖాస్తులు వచ్చినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. నేటి సాయంత్రం 5 గంటల వరకు గడువుండడంతో మరో మూడువేలకుపైగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది.
నిరుద్యోగ జాతర
Published Fri, Nov 8 2013 2:11 AM | Last Updated on Sat, Sep 2 2017 12:23 AM
Advertisement