ఎస్కేయూ :
పంచాయితీ సెక్రెటరీ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్‌లో లోకల్–నాన్‌లోకల్ అంశాన్ని అస్పష్టంగా పేర్కొన్నారని ఎస్కేయూ విద్యార్థి జేఏసీ ఆరోపించింది. ఎస్కేయూ ప్రధాన ద్వారం వద్ద జాతీయ రహదారిపై సోమవారం ఆందోళన నిర్వహించారు. పంచాయితీ సెక్రెటరీ రాత పరీక్షలకు పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేసుకున్న జిల్లాకే లోకల్ వర్తిస్తుందని అభ్యర్థుల సెల్‌ఫోన్‌లకు మెసేజ్ పంపారని విమర్శించారు. హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులు అక్కడి పరీక్ష కేంద్రం ఎంపిక చేసుకుంటే, హైదరాబాద్ లోకల్ కింద పరిగణస్తున్నారని ఆరోపించారు. కర్నూలు జిల్లా విద్యార్థులు అనంతపురంలో పరీక్ష కేంద్రం ఎంపిక చేసుకుంటే , అనంతపురం లోకల్ కింద, కర్నూలును నాన్‌లోకల్ కింద చూపిస్తుండడంతో ఉద్యోగాలు దక్కకుండా కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు క్రాంతికిరణ్, భానుప్రకాష్ రెడ్డి, రవినాయక్, జయచంద్రా రెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు పులిరాజు, జీవీఎస్ చిన్న శంకర్‌నాయక్, సురేష్ నాయక్ , గ్రూప్–3 అభ్యర్థులు పాల్గొన్నారు.