సాక్షి, కొత్తగూడెం : గ్రామ సభల నిర్వహణకు సంబంధించి పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం జీఓ నంబర్ 791 జారీ చేసింది. ఈ జీఓ ప్రకారం కార్యదర్శులు గ్రామ సభలకు హాజరుకాని మండలస్థాయి అధికారులపై జిల్లా స్థాయి అధికారులకు నివేదికలు ఇవ్వవచ్చు.
ప్రణాళికా బద్ధంగా నిర్వహించేందుకు..
జిల్లా వ్యాప్తంగా 758 గ్రామ పంచాయతీలున్నాయి. ప్రస్తుతం పాలకవర్గాలు ఏర్పడడంతో పంచాయతీల వారిగా అభివృద్ధి పనులు, ఆదాయ, వ్యయాలకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. గతంలో గ్రామ సభల నిర్వహణ అస్తవ్యస్తంగా మారడం, ఆశించిన ప్రయోజనం లేకపోవడంతో ఈసారి సభలను ప్రణాళికా బద్ధంగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా నవంబర్ 7న జీఓ నంబర్ 791ని జారీ చేసింది. గతంలో గ్రామ సభలకు మండలస్థాయి అధికారులు రాకున్నా కొనసాగించేవారు. దీంతో గ్రామ సమస్యలు అపరిష్కృతంగానే ఉండేవి. అలాగే ఏయే అధికారులు సభలకు హాజరయ్యారనే సమాచారం ఉన్నతాధికారు వద్ద కూడా లేకుండా పోతోంది. ఈ జీఓ ప్రకారం ప్రధాన శాఖల మండల స్థాయి అధికారులు ఏడాదిలో నాలుగు సార్లు నిర్వహించే గ్రామ సభలకు విధిగా హాజరు కావాలి. గ్రామాల్లో తాగునీటి సమస్య, డ్రెయినేజీ, రోడ్లు తదితర విషయాలపై చర్చించడం, ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలి. సభలకు హాజరు కాని ఆయా అధికారులపై పంచాయతీ కార్యదర్శులు జిల్లా పంచాయతీ అధికారికి ప్రతి గ్రామ సభకు సంబంధించి నివేదిక అందజేయాలి.
చిక్కులు తప్పవా..?
ఇప్పటి వరకు గ్రామ సభలను నామ మాత్రంగా నిర్వహించిన పంచాయతీ కార్యదర్శులు ఈ జీఓతో ఇబ్బందులు తప్పవని చర్చించ ుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 161 మంది పంచాయతీ కార్యదర్శులున్నారు. ఒక్కో కార్యదర్శి నాలుగు నుంచి ఐదు గ్రామ పంచాయతీల వ్యవహారాలను చూసుకుంటున్నారు. ఇప్పటికే ఇది తమకు తలకు మించిన భారమని వారు భావిస్తున్నారు. అయితే ఈ జీఓతో గ్రామసభలకు రాని మండల స్థాయి అధికారులపై రిపోర్టు చేస్తే ఏ సమయంలో తమకు మండలస్థాయి అధికారులు ఏకు మేకవుతారోనని వారు ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలపై సీరియస్‌గా స్పందిస్తే క్షేత్రస్థాయిలో తమకు ఇబ్బందులు తప్పవంటున్నారు. పంచాయతీల్లో గతంలో అస్తవ్యస్తంగా ఉన్న ఆడిట్‌ను ఎలా పూర్తి చేయాలని ఇప్పుడు కార్యదర్శులు తల పట్టుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ జీఓ రావడం తమ మెడకు పరోక్షంగా ఉచ్చు బిగుసుకుంటున్నట్లేనని ఆందోళన చెందుతున్నారు.
పంచాయతీ కార్యదర్శులకు ‘పవర్’
Published Sat, Dec 14 2013 5:51 AM | Last Updated on Sat, Sep 2 2017 1:36 AM
Advertisement