Village Panchayat
-
TS: పల్లెల్లో ‘ప్రత్యేక’మే!
హైదరాబాద్, సాక్షి: రాష్ట్రంలోని పల్లెలు ప్రత్యేకాధికారుల పాలనలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల పదవీకాలం వచ్చే నెల (ఫిబ్రవరి) 1న ముగుస్తోంది. దీంతో స్పెషల్ ఆఫీసర్లను నియమించి పంచాయతీల బాధ్యతలను అప్పగించాలని రాష్ట్ర సర్కారు భావిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుత సర్పంచ్‌లకే ఇన్చార్జులుగా బాధ్యతలు అప్పగించే అవకాశమున్నా.. పంచాయతీల పాలకమండళ్లలో బీఆర్ఎస్ పార్టీకే ఆధిపత్యం ఉండటంతో అందుకు కాంగ్రెస్ సర్కారు విముఖంగా ఉంది. మండల, గ్రామస్థాయిల్లోని వివిధ శాఖల అధికారులను స్పెషలాఫీసర్లుగా నియమించేందుకు ప్రభుత్వపరంగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖాపరంగా ఇప్పటికే కసరత్తు మొదలైనట్టు సమాచారం. పోలీసుశాఖ మినహా మండల, గ్రామస్థాయిల్లోని పంచాయతీరాజ్, రెవెన్యూ, విద్యా, వైద్య తదితర శాఖల అధికారులను పంచాయతీలకు ప్రత్యేక అధికారులుగా నియమించే అవకాశం ఉంది. ఏ నిర్ణయమూ తీసుకోని సర్కారు.. రాష్ట్రంలో 2019 జనవరిలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీలోగా పంచాయతీ ఎన్నికలు పూర్తయి, కొత్త పాలకమండళ్లు ఏర్పాటై ఉండాల్సింది. అక్టోబర్ నుంచి డిసెంబర్ తొలివారం వరకు అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ కొనసాగడం.. ఏప్రిల్, మేలలో లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముందుకు పడలేదు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ముందస్తు సన్నాహాల్లో నిమగ్నమైనా.. ఎన్నికల తేదీలపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంది. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదన నేపథ్యంలో.. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని, ఉపకులాల వారీగా కూడా రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. దీనికి సంబంధించి బీసీ కమిషన్ నుంచి ఆరు నెలల్లో నివేదిక తెప్పించుకుని తదుపరి చర్యలు చేపడతామని తెలిపింది. వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు, ఇతర గ్రూపులకు రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు గతంలో ‘ట్రిపుల్ టెస్ట్’ పేరిట మార్గదర్శకాలు ఇచ్చింది. స్థానిక సంస్థల పరిధిలో ఆయా గ్రూపుల వెనుకబాటు స్వభావంపై బీసీ కమిషన్‌న్‌ద్వారా విచారణ జరపాలని.. ఆయా చోట్ల ఏ నిష్పత్తిలో రిజర్వేషన్లు ఇవ్వాలనేది తేల్చాలని సూచించింది. మొత్తంగా రిజర్వేషన్లు (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కలిపి) 50శాతం మించకుండా ఉండాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపు, మార్పుల కోసం బీసీ కమిషన్ విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సి ఉంది. దాని ఆధారంగానే పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లను పెంచేందుకు వీలు కానుంది. ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూపులు! చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్న్ఆధ్వర్యంలోని రాష్ట్ర బీసీ కమిషన్.. ‘ట్రిపుల్ టెస్ట్’ అంశంలో అనుసరించిన విధానాలపై ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు పూర్తిచేసినట్టు సమాచారం. ప్రభుత్వానికి నివేదిక సమర్పించే విషయంలో కమిషన్‌కు పూర్తి స్పష్టత లేక ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు తెలిసింది. కొత్త ఓటర్ల జాబితా వచ్చాక.. దాని ఆధారంగా మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలను నోడల్ ఏజెన్సీలుగా పెట్టి ఆ వివరాలు సేకరించి ఇవ్వాలని భావిస్తున్నట్టు బీసీ కమిషన్ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఓటర్ల జాబితా ద్వారానా? లేక సామాజిక, ఆర్థిక, కుల సర్వే ఆధారంగా వెళ్లాలా అన్న దానిపై ప్రభుత్వపరంగా ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో సందిగ్థత ఏర్పడినట్టు సమాచారం. లోక్‌సభ ఎన్నికలు ముగిశాక పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని, ఆలోగా బీసీ కమిషన్ నివేదిక ప్రక్రియ పూర్తవుతుందని రాష్ట్ర సర్కారు భావిస్తున్నట్టు తెలిసింది. మొత్తం 12,751 పంచాయతీలు.. రాష్ట్రంలో ప్రస్తుతం 12,751 గ్రామ పంచాయతీలకు (కొత్తగా ఏర్పాటు చేసినవి కలిపితే మొత్తం 12,772 పంచాయతీలు) సర్పంచ్‌లు ఉన్నారు. వార్డు సభ్యులు సుమారు లక్షా 27వేల మంది వరకు ఉంటారు. తెలంగాణ నూతన పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం.. సర్పంచ్ల పదవీకాలం ముగిసిపోయాక పర్సన్ ఇన్చార్జులుగా నియమించే అవకాశం లేదు. దీనితోపాటు సకాలంలో ఎన్నికలు జరగకపోతే గ్రామ పంచాయతీలకు ‘స్పెషల్ ఆఫీసర్’లను నియమించాల్సి ఉంటుంది. – ఉమ్మడి ఏపీలో కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు.. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో 2011–2013 మధ్య పంచాయతీలు స్పెషల్ ఆఫీసర్ల పాలనలో కొనసాగాయి. అంతకు ముందు చంద్రబాబు సర్కారు హయాంలోనూ గడువులోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించని కారణంగా, అంతకు ముందున్న సర్పంచ్‌లనే పర్సన్ ఇన్చార్జులుగా కొనసాగించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిపాదనలు పంపినా..! రాజ్యాంగం ప్రకారం పంచాయతీరాజ్ సంస్థల ఐదేళ్ల పదవీకాలం ముగిసేలోపే.. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పదవీకాలం ముగియడానికి మూడు నెలల ముందే ఎన్నికలు పూర్తిచేయాలి. ఈ క్రమంలో రాష్ట్రంలో జనవరి లేదా ఫిబ్రవరిలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని, అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ప్రభుత్వానికి గతంలోనే ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది. కానీ దీనిపై గత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. త్వరలో లోక్‌సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. కనీసం ఆరునెలల వరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు. దీంతో అప్పటివరకు స్పెషలాఫీసర్ల పాలనలో కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్టు తెలిసింది. ప్రస్తుత సర్పంచ్‌లనే ఇన్చార్జులుగా కొనసాగించాలి ‘‘ప్రస్తుతమున్న సర్పంచ్‌లనే పర్సన్ ఇన్చార్జులుగా కొనసాగించాలి. దీనిపై ఇప్పటికే ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించాం. గ్రామాల అభివృద్ధిపై మాకు పూర్తి అవగాహన ఉన్నందున ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో, పాలనలో జాప్యం జరగదు. స్పెషలాఫీసర్లకు గ్రామాల్లోని పరిస్థితులపై అవగాహన ఏర్పడేందుకే కొంత సమయం పడుతుంది. అధికారులు స్థానికంగా ఉండరు, ఆఫీస్ టైమ్ బట్టి వచ్చి వెళ్తుంటారు. మేం గ్రామాల్లోనే అందుబాటులో ఉంటాం. ఆరునెలల పాటు ఇన్చార్జులుగా పొడిగించాలి. కోవిడ్ మహమ్మారి కారణంగా దాదాపు మూడేళ్ల పదవీకాలాన్ని కోల్పోయాం. మాకు చెక్ పవర్ కూడా ఆరు నెలలు ఆలస్యంగా ఇచ్చారు. గతంలో చేసిన పనులకు ఇంకా బిల్లులు రావాల్సి ఉంది. – ఉప్పుల అంజనీప్రసాద్, రాష్ట్ర సర్పంచ్ల సంఘం గౌరవాధ్యక్షుడు స్పెషలాఫీసర్లతో పాలనకు ఇబ్బంది ‘‘ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రస్తుత సర్పంచ్‌లకే పర్సన్ ఇన్చార్జులుగా బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుంది. గతంలో పనిచేసిన అనుభవం, విధుల నిర్వహణకు పనికొస్తుంది. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి దోహదపడతారు. వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు కాబట్టి సర్పంచ్‌లనే మరో ఆరునెలల పాటు కొనసాగిస్తే గ్రామాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశముంది. పరిపాలన ఇబ్బందులు లేకుండా సజావుగా సాగే అవకాశాలు ఉంటాయి. అదే స్పెషల్ ఆఫీసర్‌గా నియమితులైన వారికి గ్రామంపై పట్టు రావడానికి.. ఆయా సమస్యలు, అంశాలపై అవగాహన ఏర్పడడానికి సమయం పడుతుంది. పాలనకు ఇబ్బంది అవుతుంది. – చింపుల సత్యనారాయణరెడ్డి, తెలంగాణ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు -
Video: చిన్నారిపై అత్యాచారం.. నిందితుడికి ఐదు గుంజీల శిక్ష
మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు నానాటికీ పెరిగిపోతున్నాయి. పసిమొగ్గల నుంచి పండటాకుల వరకు ఎవరిని వదలం లేదు. ఎన్ని చట్టాలు అమలు చేసినా, కఠిన శిక్షలు విధించినా కామాంధుల ప్రవర్తనలో మార్పు రావడం లేదు. దేశంలో మహిళ భద్రత ప్రశ్నార్థకంగా మారిన సమయంలో బిహార్‌లో జరిగిన ఓ ఘటన సమాజాన్ని నివ్వేరపరుస్తోంది. రాష్ట్రంలో అత్యాచార నిందితుడికి అక్కడి గ్రామ పెద్దలు వింత శిక్ష విధించారు. నవదా జిల్లాలోని ఓ గ్రామంలో అరుణ్ పండిట్ అనే వ్యక్తి చాకెట్ల ఆశచూసి అయిదేళ్ల బాలికను కోళ్ల ఫామ్‌కు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనిపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకోగా.. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి… ఈ విషయాన్ని పంచాయతీలో తేల్చుకోమని సూచించాడు. దీంతో వారు పంచాయతీ పెద్దల వద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పారు. అయితే పంచాయితీ పెద్దలు సొంత నిర్ణయంతో తీర్పును ప్రకటించారు. నిందితుడు బాలికపై అత్యాచారానికి పాల్పడలేదని చెబుతూ..కేవలం ఆమెను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లినందుకు మాత్రమే అతనికి శిక్ష వేశారు. నిందితుడికి గ్రామస్థులందరి ముందు ఐదు గుంజీలను శిక్షగా విధించి చేతులు దులుపుకున్నారు. పంచాయతీ పెద్దల షాకింగ్ పనిష్మెంట్ అక్కడి వారందరినీ ఒక్కసారిగా అవాక్కయ్యేలా చేసింది. In Bihar's Nawada Arun Pandit rapes a 6 year old minor. Girl. He is given a Strict punishment of doing 5 Sit-ups by the Panchayat (village court). pic.twitter.com/8uVRpKsxdE — Ahmed Khabeer احمد خبیر (@AhmedKhabeer_) November 24, 2022 పంచాయతీ పెద్దలు, గ్రామస్తుల ముందు నిందితుడు గుంజీలు తీస్తున్న దృశ్యాలను అక్కడే ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 14 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. పంచాయతీ తీర్పుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గ్రామీణ భారతదేశంలో పిత్రుస్వామ్యానికి ఈ ఘటన నిదర్శనమని, న్యాయ వ్యవస్థను అవహేళన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి వేసిన శిక్ష ఇదేనా? బాలికకు చేసే న్యాయం ఇదేనా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియోను బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, డిప్యూటీ తేజస్వి యాదవ్‌ను ట్యాగ్ చేస్తూ షేర్ చేస్తున్నారు. కాగా ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసు సూపరింటెండెంట్ గౌరవ్ మంగ్లా తెలిపారు. అంతేగాక ఈ దారుణాన్ని అణిచివేసేందుకు ప్రయత్నించిన వారిపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. చదవండి: 'గే' వివాహాలకు చట్టబద్దత కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ -
స్థానిక సంస్థలకు మరిన్ని అధికారాలు
సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీలతో పాటు మండల, జిల్లా పరిషత్‌లకు మరిన్ని అధికారాలు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో అమలవుతున్న 1994 నాటి పంచాయతీరాజ్ చట్టం స్థానంలో కొత్త పంచాయతీరాజ్ చట్టం రూపకల్పన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ నేతృత్వంలో.. తూర్పు గోదావరి జిల్లాలోని పంచాయతీరాజ్ శాఖ శిక్షణా కేంద్రం ప్రిన్సిపాల్ ఆనంద్‌తో పాటు మరో ముగ్గురు అధికారుల బృందం కొత్త చట్టం ముసాయిదా తయారీ పనిలో ఉంది. ఈ బృందం వివిధ జిల్లాల్లో పనిచేసే పంచాయతీరాజ్ శాఖ సీనియర్ అధికారులతో కలిసి ఈ నెల 22, 23, 24 తేదీల్లో ముసాయిదా చట్టం రూపకల్పనపై కమిషనర్ కార్యాలయంలో వర్క్‌షాప్ నిర్వహించింది. 15–20 రోజులలో కొత్త చట్టం ముసాయిదా నివేదికను తయారు చేసి, ప్రభుత్వానికి అందజేయనున్నట్టు బృందంలోని ఒక సభ్యుడు ‘సాక్షి’కి వివరించారు. -
నేడు ‘పంచాయతీ’ తుది పోరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు బుధవారం జరగనున్న తుది (మూడో) విడతతో ముగియనున్నాయి. ఈ నెల 21న మొదటి, 25న రెండో విడత ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో ఇప్పుడు మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 3,506 పంచాయతీలకు 11,664 మంది, 27,582 వార్డులకు 73,976 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. బుధవారం పంచాయతీ పోలింగ్ ఉదయం 7 గంటలకు మొదలై మధ్యాహ్నం ఒంటిగంటకు ముగియనుంది. అదేరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి సర్పంచ్, వార్డు సభ్యుల ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తర్వాత ఉపసర్పంచ్‌ను ఎన్నుకుంటారు. పోలింగ్ విధుల నిర్వహణకు పెద్ద సంఖ్యలో అధికారులు, సిబ్బందితో పాటు పోలీసుల సేవలనువినియోగిం చుకుంటున్నారు. రూ.1.95 కోట్ల నగదు స్వాధీనం మూడో విడత ఎన్నికల సందర్భంగా కూడా పెద్ద ఎత్తున మద్యం, డబ్బు పంపిణీతో పాటు ప్రలోభాల పర్వం సాగుతున్నట్టు ఆరోపణలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో అధికారులు, పోలీసులు నిఘా పెంచారు. మంగళవారం వరకు రూ.1.95 కోట్ల మేర నగదు, దాదాపు రూ.65 లక్షల విలువ చేసే మద్యం, ఇతర వస్తువులను పోలీసులు, అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సెలవు లేదా వెసులుబాటు.. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లోని (హైదరాబాద్ మినహా) పబ్లిక్, ప్రైవేట్ అండర్ టేకింగ్స్, పారిశ్రామిక, ఇతర సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా సంస్థల యాజమాన్యాలు స్థానికంగా ఈ నెల 30న వేతనంతో కూడిన సెలవు ఇవ్వొచ్చని పంచాయతీరాజ్ శాఖ పేర్కొంది. ఆయా సంస్థలు ఉత్పత్తి లక్ష్యాలు చేరుకునేందుకు వీలుగా మరో సెలవు రోజును పనిదినంగా పరిగణించవచ్చునని సూచించింది. అది సాధ్యం కాకపోతే ఓటు వేసేందుకు వీలుగా ఓటింగ్ సమయాల్లో 3 గంటల పాటు వెసులుబాటు కల్పించవచ్చునని పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్ ఉత్తర్వులిచ్చారు. -
పంచాయతీ రిజర్వేషన్లు మొదటికి
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. కొత్త రాష్ట్రం కావడం, కొత్త పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి రావడంతో రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ మొదటికి రానుంది. ఇప్పటివరకు జరిగిన ఎన్నికలతో సంబంధం లేకుండా రిజర్వేషన్లు అమలు కానున్నాయి. 1995లో గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్ల విధానం అమల్లోకి వచ్చింది. జనాభా ఆధారంగా మండలం యూనిట్‌గా ఈ రిజర్వేషన్లు ఖరారు చేస్తున్నారు. జనరల్, జనరల్ మహిళ,బీసీ, బీసీ మహిళ, ఎస్సీ, ఎస్టీతోపాటు ఎస్సీ, ఎస్టీ మహిళా కేటగిరీలు ఉంటాయి. రొటేషన్ పద్ధతిలో అన్ని కేటగిరీలు వర్తింపజేస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో 1995, 2001, 2006, 2013లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అన్ని గ్రామాలకు నాలుగు రకాల రిజర్వేషన్లు వర్తింపజేశారు. మిగతా నాలుగు కేటగిరీలను వంతుల వారీగా అమలు చేయాల్సి ఉంది. కొత్త రాష్ట్రం కావడంతో గ్రామాల్లో ఇప్పటికే అమలైన రిజర్వేషన్లు మళ్లీ ఖరారయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఖరారయ్యే రిజర్వేషన్ కేటగిరీలు వరుసగా రెండు ఎన్నికలకు వర్తిస్తాయి. జూన్ నుంచి ఖరారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియ జూన్ మొదటి వారంలో మొదలయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ప్రస్తుతం ఓటర్ల జాబితా రూపకల్పన జరుగుతోంది. మే 17న ఓటర్ల తుది జాబితాను అన్ని పంచాయతీలలో ప్రదర్శించనున్నారు. అనంతరం గ్రామ పంచాయతీలు, వార్డుల వారీగా బీసీ ఓటర్ల గణన జరగనుంది. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో మే 18 నుంచి ఇది మొదలై రెండు వారాలపాటు కొనసాగనుంది. జూన్ 3 కల్లా పూర్తయ్యే అకాశం ఉంది. అనంతరం వారం రోజుల పాటు గ్రామ పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్లను నిర్ణయిస్తారు. రిజర్వేషన్లు ఖరారు చేసిన జాబితాను ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తుంది. ఎన్నికల సంఘం పోలింగ్ షెడ్యూల్‌ను ప్రకటిస్తుంది. -
పంచాయతీల అభివృద్ధికి ప్రణాళికలు
► ముందస్తుగా జిల్లాకు 10 డీఆర్సీలు ► జిల్లా పంచాయతీ అధికారిణి పార్వతి కర్నూలు(అర్బన్): జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు చర్యలు చేపట్టినట్లు జిల్లా పంచాయతీ అధికారిణి పార్వతి చెప్పారు. శనివారం స్థానిక డీపీఓ కార్యాలయంలో ఈఓఆర్డీ, పంచాయతీ కార్యదర్శులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ ముందుగా పలు గ్రామ పంచాయతీల్లో సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్లు షెడ్లు ఏర్పాటు చేసి వర్మీకంపోస్టు ఎరువు తయారీపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని పాణ్యం, అయ్యలూరు, కోవెలకుంట్ల, హోళగుంద, ఆలూరు, గోనెగండ్ల, గార్గేయపురం, లక్ష్మీపురం, వెల్దురి, పాములపాడు గ్రామ పంచాయతీల్లో డిస్ట్రిక్ట్ రిసోర్సు సెంటర్లు (డీఆర్సీ) ఏర్పాటు చేసి మౌలిక వసతులు కల్పించాల్సి ఉందన్నారు. ఒక్కో సెంటర్‌కు ఐదు గ్రామ పంచాయతీలను అనుసంధానం చేస్తామన్నారు. అక్కడ తడిపొడి చెత్త వేరుచేయడం, వర్మీ కంపోస్టు యూనిట్‌కు అవసరమైన పేడను రైతుల నుంచి సేకరించడం వంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అంతకు ముందుగా 14వ ఆర్థిక సంఘం నిధులతో డస్ట్బిన్లను ఆయా గ్రామ పంచాయతీలు కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. చెత్త సేకరణ కోసం ప్రతి వెయ్యి జనాభాకు ఒక ట్రైసైకిల్ అందజేస్తామన్నారు. సమావేశంలో కర్నూలు డివిజనల్ పంచాయతీ అధికారి విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రామపంచాయతే.. ఆ అవ్వ ఇల్లు!
అందరూ ఉన్నా అనాథగా.. తలదాచుకుంటున్న వృద్ధురాలు సిరిసిల్ల: అందరిలానే ఆ తల్లి ఎన్నో కలలుగన్నది.. ప్రయోజకులైన ఇద్దరు కొడుకులు, కూతురు ఇక తనకు మలిసంధ్యలో ఏ లోటూ రానివ్వరని భరోసా తో ఉంది.. కానీ, ఆమె కలలు కల్లలయ్యాయి. బతుకుదెరువు కోసం కుమారులు స్వగ్రామం విడిచివెళ్లి ఆమె బాగోగులు పట్టించుకోవడం మానే శారు. దీంతో ఆ వృద్ధురాలికి గ్రామపంచాయతీ కార్యాలయమే ఆవాసమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామానికి చెందిన మల్లెపూల లచ్చమ్మ (70)కు కుమారులు బాలయ్య, శ్రీనివాస్, కూతురు సుశీల ఉన్నారు. లచ్చమ్మ భర్త నారాయణ పదేళ్ల క్రితమే మృతి చెందాడు. ఉపాధికోసం పెద్ద కుమారుడు బాలయ్య చీకోడులో స్థిరపడ్డాడు. చిన్న కుమారుడు శ్రీనివాస్ నిజామా బాద్‌లో ఉంటున్నాడు. లచ్చమ్మ ఇల్లు నాలుగేళ్ల క్రితమే శిథిలమై కూలిపోయింది. తన బాగోగులు చూసుకోవాలని కుమారులను కోరినా.. ఎవరూ పట్టించుకోలేదు. తన ఊర్లోనే ఉంటున్న కూతురు సుశీల ఇంట్లో మొన్నటివరకు ఉంది. కూతురు పేదరికంలోనే మగ్గడంతో తనను పోషించాలని మళ్లీ తన కుమారులను వేడుకుంది. అయినా ఎవరూ స్పందించకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. ఎస్సై ప్రవీణ్.. ఆమె కుమారులకు సమాచా రం అందించినా ప్రయోజనం లేకపోయింది. విసిగిపోయిన లచ్చమ్మ.. కూతురును ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక వీధిలోనే నివాసం ఉంటూ ఎవరైనా ఓ ముద్ద పెడితే తింటూ ఉంటోంది. ఆమె దీనస్థితిని చూసి చలించిన ఆ గ్రామ మాజీ సర్పంచ్ చీటి వెంకటనర్సింగరావు, గ్రామస్తుడు కిషన్ కలిసి లచ్చమ్మను చేరదీశారు. వానకాలం.. అదీ ఒంటరిగా వీధిలో ఉండడం సరికాదని, ఆమెను పోషించాలని కుమారులకు సమాచారం చేరవేశారు. అయినా వారు గూడూరు రాలేదు. అంతేకాదు.. లచ్చమ్మను చేరదీసిన తమ సోదరి సుశీలను సైతం వారు దూషించారు. విధిలేని పరిస్థితిలో లచ్చమ్మకు గ్రామపంచాయతీ కార్యా లయంలోని ఓ గది కేటాయించారు. దీంతో గత పదిరోజులుగా ఆమె అక్కడే జీవనం సాగిస్తోంది. గ్రామస్తులు పెట్టే భోజనం తింటోంది. కలెక్టర్ స్పందించి తనను ఆదుకోవాలని, తన కుమారులకు బుద్ధి చెప్పాలని ఆ వృద్ధురాలు వేడుకుంటోంది. -
పెళ్లి కొడుక్కు ఇలా బుద్ధి చెప్పిన పంచాయతీ
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో, ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో పంచాయతీలు సంఘ వ్యతిరేక ఉత్తర్వులు జారీ చేయడం, వాటిని అమలు చేయని కుటుంబాలను సాంఘికంగా బహిష్కరించడం సర్వసాధారణం. కానీ అందుకు విరుద్ధంగా భాగ్‌పట్ జిల్లాలోని సిసాన గ్రామ పంచాయతీ మొట్టమొదటి సారిగా బుధవారం సంఘహిత ఉత్తర్వులు జారీచేసి రాష్ట్రంలోనే ఓ కొత్త స్ఫూర్తికి బాటలు వేసింది. గురువారం (ఫిబ్రవరి 4వ తేదీన) పెళ్లికి అంతా సిద్ధమయ్యాక మంగళవారం అదనపు కట్నం కింద రెండు లక్షల రూపాయలను, ఓ ఎస్యూవీ కారును ఇస్తేగానీ పెళ్లి చేసుకోనని అదే గ్రామానికి చెందిన ప్రకాశ్ సింగ్ అనే పెళ్లి కొడుకు మంకుపట్టు పట్టాడు. తనకు అంతస్థోమత లేదంటూ పెళ్లి కూతురు తండ్రి కాళ్లా వేళ్లా పడి బతిమాలినా కరుణించలేదు. పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు పెళ్లి కొడుకు, ఆయన కుటంబ సభ్యులు ప్రకటించారు. ఊహించని సంఘటనకు హతాశులైన పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు కుమిలిపోసాగారు. మంగళవారం ఈ సంఘటన గురించి తెలిసిన సిసాన గ్రామ పంచాయతీ ఎవరి ఫిర్యాదు అందకపోయినా తానంతట అదే స్పందించింది. బుధవారం పెళ్లి కూతురు తండ్రిని పిలిపించి పెళ్లి నిలిచిపోవడం వల్ల జరిగిన నష్టం గురించి వాకబు చేసింది. పెళ్లి కొడుకు కోసం అప్పటికే సమర్పించిన బహుమతులు కలుపుకొని పెళ్లి ఏర్పాట్లకు దాదాపు ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టినట్లు పెళ్లి కూతురు తండ్రి పంచాయతీకి తెలిపారు. పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులను తక్షణమే పిలిపించి పంచాయతీ విచారించింది. పెళ్లిని కాదన్నందుకు నష్ట పరిహారంగా ఐదు లక్షల రూపాయలు సాయంత్రానికల్లా చెల్లించాలని ఆదేశించింది. పెళ్లి కొడుకు కుటుంబం అక్షరాల ఐదు లక్షల రూపాయలను తెచ్చి పంచాయతికి అప్పగించారు. 65 ఏళ్ల పంచాయతీ పెద్ద హీరో దేవీ ఆ సొమ్మును పెళ్లి కూతురు తండ్రికి అప్పగించారు. పీటల మీద పెళ్లి నిలిచిపోయిన కారణంగా పిల్ల పెళ్లి కాదని ఆందోళన చెందవద్దని, ఆ బాధ్యత తాము తీసుకుంటామని, తగిన వరుణ్ని వెతికి పెట్టే బాధ్యత కూడా తమదేనని పంచాయతీ తీర్మానించింది. పంచాయతీ అంతటితో సరిపెట్టక, పెళ్లి కొడుకు ప్రకాష్ సింగ్ పీటల మీదదాక వచ్చిన సంబంధాన్ని అదనపు కట్నం కోసం వదులు కోవడం రెండోసారి కావడంతో పెళ్లి కొడుకు కుటంబాన్ని గ్రామంలో సంఘ బహిష్కరణ చేసింది. ఈ విషయమై స్థానిక మీడియా పోలీసులను సంప్రదించగా, ఈ విషయం గురించి తమకు ఎవరి వద్ద నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని, అయినా పంచాయతీ తీసుకున్నది ప్రశంసనీయ నిర్ణయమేకదా! పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని సర్కిల్ ఇనిస్పెక్టర్ వ్యాఖ్యానించారు. -
ఇది మనుషులు చేసే పనియేనా?
గయ: బీహార్ గయకు సమీపంలోని గ్రామంలో అమానుషం చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ పెద్దల సమక్షంలో వందలాది మంది గ్రామస్తులు చూస్తుండగానే ఆటవికమైన శిక్షను అమలు చేశారు. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో 16 ఏళ్ల అమ్మాయిని, 32 ఏళ్ల వ్యక్తిని విచక్షణా రహితంగా కొట్టి సజీవ దహనం చేశారు. పెళ్లయి ముగ్గురు పిల్లలున్న వ్యక్తి తన అత్తగారింటికి తరచూ వచ్చి వెళుతూ ఉండేవాడు. ఈ క్రమంలో గ్రామంలోని ఈ పదహారేళ్ల అమ్మాయితో పరిచయం ఏర్పడింది. మూడు రోజుల క్రితం ఇద్దరూ కనిపించకుండా పోయారు. దీంతో ఇద్దరినీ వెతికి పట్టుకున్న అమ్మాయి బంధువులు పంచాయితీకి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే పంచాయతీ పెద్దలు సమావేశాన్ని ఏర్పాటుచేసి శిక్షను ఖరారు చేశారు. వారి ఆదేశాల ప్రకారమే బుధవారం ఈ శిక్షను అమలు చేశారు. బాలిక తల్లిదండ్రులు, ఇతర బంధువుల సమక్షంలోనే ఈ ఘోరం జరిగింది. గ్రామంలో ఒక్కరు కూడా ఈ ఘటనను వ్యతిరేకించలేదు, కనీసం పోలీసులకు తెలియజేయలేదు. పొరుగున ఉన్న గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామంలో మోహరించారు.ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. బాలిక తల్లిదండ్రులతో సహా, 20 మందిని అనుమానితులుగా గుర్తించామని, తదుపరి విచారణ అనంతరం మిగతావారిని కూడా అరెస్ట్ చేస్తామని సీనియర్ పోలీసు అధికారి షాలిన్ తెలిపారు. మనిషిని సమాధి చేస్తారా.. ఇది మనుషులు చేసే పనేనా...తప్పు చేసిన మనుషులను శిక్షించడానికే కోర్టులు, చట్టాలు ఉన్నాయంటున్నారు రాష్ట్రంలోని హక్కుల సంఘాల నాయకులు. ఇంకా మధ్య యుగాల నాటి శిక్షలు అమలు కావడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
హద్దుల్లేని పద్దులు
36 పంచాయతీల్లో జరగని ఆడిట్ సర్పంచులకు రద్దుకానున్న చెక్‌పవర్ మూడు మండల కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి నేటి వరకు అవకాశం కల్పించిన అధికారులు ఈఓపీఆర్డీల పాలనలోని నగదు పుస్తకాలను చూపించని వైనం కడప : ప్రతి గ్రామ పంచాయతీతోపాటు మండల పరిషత్, మున్సిపాలిటీల్లో నగదు పద్దులకు సంబంధించి ఆడిట్ జరగాలని చట్టం ఉన్నా... కొంతమంది అధికారులు చట్టాన్ని పక్కన పెట్టారు. దీంతో ఆపద్దులపై ఓ వైపు అనుమానాలు వ్యక్తం అవుతుండగా మరోవైపు ఆయూ పంచాయతీల్లో సర్పంచుల చెక్‌పవర్ రద్దుకు దారితీయనుంది. జిల్లాలో 2013లో ఎన్నికైన సుమారు 36 మంది సర్పంచులకు ఈ గండం పొంచి ఉంది. గ్రామ పంచాయతీ కార్యకలాపాల పర్యవేక్షణకు కొద్దిరోజులు ఈఓపీఆర్డీలు ప్రత్యేక అధికారంలో ఉన్న కాలానికి సంబంధించిన నగదు పుస్తకాలు కూడా పలుచోట్ల ఆడిట్ అధికారులకు చూపించకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. 2014 డిసెంబరు చివరిలోపు ఆడిట్ చేయించుకోని 36 పంచాయతీలకు సంబంధించి జనవరి చివరి వరకు (నేటి వరకు) గడువు ఇచ్చారు. ఈ గడువులో కూడా తక్కువ పంచాయతీలు మాత్రమే చెక్ పవర్ గండం నుంచి బయటపడే అవకాశం కనిపిస్తోంది. 36 పంచాయతీల్లో కనిపించని ఆడిట్ జిల్లాలో సుమారు 746 గ్రామ పంచాయతీలు ఉండగా, అందులో 36 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆడిట్ జరగలేదు. ప్రతి ఏడాది చివరిలో పంచాయతీలో జమ ఖర్చులను తేల్చాల్సిన బాధ్యత ఆడిట్ అధికారులపై ఉంది. అయితే 36 పంచాయతీలకు సంబంధించి ఇంతవరకు ఆడిట్ జరగకపోవడంతో వాటికి సంబంధించిన సర్పంచులు చెక్ పవర్కోల్పోయే అవకాశం ఉంది. దీంతో ప్రతి వ్యవహారంలోనూ కీలకంగా వ్యవహారించే సర్పంచులకు చెక్ పవర్ లేకపోతే అభివృద్ది పనులు కూడా కుంటుపడే అవకాశం లేకపోలేదు. 2014 డిసెంబరు నాటికే గ్రామ పంచాయతీల్లో ఆడిట్ నిర్వహణకు సంబంధించి గడువు ముగిసింది. అయితే, జనవరి చివరి వరకు పంచాయతీల్లో ఆడిట్ నిర్వహించుకునేందుకు గడువు పెంచి అవకాశం ఇచ్చినా ఎంతమాత్రం ఆడిట్ చేయించుకున్నారన్నది అనుమానంగా ఉంది. జనవరి నెలకు సంబంధించి ఎన్ని పంచాయతీలు ఆడిట్ చేయించుకున్నాయన్న విషయాలు ఒకటి, రెండు రోజుల్లో వెల్లడి కానున్నాయి. మూడు మండల కేంద్రాల్లో కూడా... జిల్లాలో ప్రధానంగా మూడు మండల కేంద్రాలైన పంచాయతీల్లో కూడా ఆడిట్ నిర్వహించకపోవడంపై అసలు కారణాలు బయటికి రావడం లేదు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని మైలవరం, పెద్దముడియం, రాజంపేట నియోజకవర్గంలోని సిద్దవటం మండల కేంద్రంలోని పంచాయతీల్లో కూడా డిసెంబరు ఆఖరు వరకు ఆడిట్ నిర్వహించలేదు. ఎందుకు ఆడిట్ నిర్వహణకు స్థానిక పంచాయతీ అధికారులు ముందుకు రాలేదన్నది అర్థం కావడం లేదు. పైగా జిల్లా స్థాయి అధికారులైనా దృష్టి సారించి పంచాయతీల్లో ఆడిట్ జరిగేలా కృషి చేసి ఉంటే బాగుండేదని పలువురు సర్పంచులు పేర్కొంటున్నారు. -
'ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 10 లక్షల నిధులు'
ఏలూరు: తీరప్రాంత మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. శనివారం పశ్చిమగోదావరిజిల్లాలోని మోరీ, కలవపూడి గ్రామాలలో ఎన్టీఆర్ సుజల స్రవంతి, నీరు - చెట్టు, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. అనంతరం బాబు మాట్లాడుతూ.... ప్రతి గ్రామానికి తాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 10 లక్షల చొప్పున నిధులు కేటాయిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల అభివృద్ధికి రూ. 1300 కోట్ల నిధులు కేటాయిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. -
లేఔట్లకు అనుమతులు తప్పనిసరి
అక్రమ అనుమతులకు పంచాయతీ కార్యదర్శులే బాధ్యులు కర్నూలు(సిటీ), న్యూస్‌లైన్: జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో లేఔట్లకు టౌన్ ప్లానింగ్ విభాగం అనుమతి తప్పనిసరి అని జిల్లా పట్టణ, గ్రామీణ ప్రణాళిక అధికారి ప్రసాదరావు తెలిపారు. కొంత మంది అనుమతులు తీసుకోకుండా యథేచ్ఛగా లేఔట్లను వేస్తున్నారన్నారు. అనుమతులు, అక్రమ లేఔట్ల వల్ల వచ్చే ప్రజలకు వచ్చే ఇబ్బందులు తదితర వాటిపై సోమవారం ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. జిల్లా పట్టణ, గ్రామీణ అధికారి జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో లేఔట్ల అనుమతి విషయంలో జిల్లా పట్టణ, గ్రామీణ ప్రణాళిక అధికారికార్యాలయం పర్యవేక్షిస్తుందన్నారు. 2.5 ఎకరాల వరకు లేఔట్ల అనుమతి తమ పరిధిలో ఉందని, 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు అనంతపురం జిల్లాలోని డీటీసీపీప ప్రాంతీయ కార్యాలయం అనుమతి ఇస్తుందన్నారు. 5 ఎకరాలు దాటినా వాటికి హైదరాబాద్‌లోని డెరైక్టరేట్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో పలుచోట్ల అక్రమ లేఔట్లపై సెల్ 98490 83365 నంబర్‌కు సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అనుమతులు తప్పనిసరి: పట్టణ ప్రాంతాల్లో కన్న మునిసిపాలిటీ, కార్పొరేషన్ పరిసర ప్రాంతాల్లోని గ్రామ పంచాయతీల్లో ఎక్కువగా లేఔట్లు వెలుస్తున్నాయి. అనుమతులు తీసుకుంటే ఇబ్బందులు ఉండవు. గ్రామ పంచాయతీల్లో వెలిసే లేఔట్లకు సంబంధించి విధిగా 10 శాతం స్థలం గ్రామ పంచాయతీకి అప్పగించాలి. తప్పనిసరిగా జిల్లా పట్టణ, గ్రామీణ ప్రణాళిక అధికారి కార్యాలయం నుంచి అనుమతులు పొందాల్సి ఉంది. మునగాలపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని స్వే నంబర్ 5/1లో1 ఎకరాకు అన్ని అనుమతులు ఉన్నాయి. అదే విధంగా అదే గ్రామంలోనిమరో 16 ఎకరాలకు పట్టణ, గ్రామీణ ప్రణాళిక శాఖ నుంచి లేఔట్లను మంజూరయ్యాయి. నందనపల్లె గ్రామంలో 291 సర్వే నంబర్లో 4.96 ఎకరాలు,పసుపుల గ్రామంలో 314-3పి సర్వే నంబర్లో 3.80 ఎకరాలు, ఆదోని డివిజన్లోని బైచిగేరి గ్రామంలో 47/పి సర్వే నంబర్లో 2.94 ఎకరాలు, అదే డివిజన్ పరిధిలోని 38 సర్వే నంబర్లో 2.65 ఎకరాలు, ఉల్లిందకొండ గ్రామం లో 45/3బి సర్వే నంబర్లో 3.99 ఎకరాలకు ప్రణాళిక శాఖ అనుమతి ఉంది. ప్రయోజనాలు ఇవి: ఏదేని వ్యవసాయ భూమిని, వ్యవసాయేతర భూమిగా(ల్యాండ్ కన్వర్షన్) చేసి ఇళ్ల ప్లాట్లుగా విభజించాలి. రోడ్డు నిర్మాణం, మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల, పార్కులు, ఆట స్థలాల ఏర్పాటు, వీధి దీపాలు తదితర మౌళిక సదుపాయాలు, రోడ్లకు ఇరువైపుల చెట్లు లేఔట్లు ఉంటాయి. అప్రోచ్ రోడ్డు 33 అడుగుల అంతర్గత రోడ్లు ఉంటాయి. ఎకరానికి 10 శాతం చొప్పున లేఔట్లు స్థలాన్ని గ్రామ పంచాయతీకి అప్పగిస్తారు. భవిష్యత్తులో ఉద్యానవనాలు, ఆట స్థలాల కోసం వినియోగిస్తారు. -
ఏకగ్రీవాలకు ప్రోత్సాహమేదీ?
భువనగిరి, న్యూస్‌లైన్: గత సంవత్సరం జూలైలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన వాటికి ఇస్తామన్న నజరానా నేటికీ అందలేదు. ప్రభుత్వం ఇస్తామన్న నగదు ప్రోత్సాహకం కోసం ఎదురుచూస్తున్న ఏకగ్రీవ సర్పంచ్‌లకు నిరాశే మిగులుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో ఎన్నికలు లేకుండా పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆ పంచాయతీకి *7లక్షల పారితోషికం అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జిల్లాలో ఉన్న 1169 పంచాయతీల్లో 103 ఏకగ్రీవమయ్యాయి. వీటన్నింటికి కలిపి *7.21కోట్ల నిధులు రావాల్సి ఉంది. ఎన్నికలు జరిగి ఏడు నెలలవుతున్నా ఒక్క పంచాయతీకి కూడా ప్రోత్సాహక నిధులు విడుదల చేయలేదు. పంచాయతీల్లో నిధులు లేక గ్రామాల్లో కనీస సౌకర్యాలు కూడా కల్పించలేని స్థితిలో సర్పంచ్‌లున్నారు. కనీసం ప్రోత్సాహక నిధులు వస్తే వాటితోనైనా తాగునీరు, వీధి దీపాలు తదితర పనులు పూర్తి చేద్దామనుకుంటే ప్రభుత్వం వాటి గురించే పట్టించుకోవడం లేదని ఏకగ్రీవ సర్పంచ్‌లు వాపోతున్నారు. ఆ నిధుల కోసం ఎన్నిసార్లు అధికారులను కలిసినా ఎవరూ స్పం దించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు ఇస్తామన్న ప్రోత్సాహక నగదును మంజూరు చేయాలని వారు కోరుతున్నారు. -
పంచాయతీ కార్యదర్శులకు ‘పవర్’
సాక్షి, కొత్తగూడెం : గ్రామ సభల నిర్వహణకు సంబంధించి పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం జీఓ నంబర్ 791 జారీ చేసింది. ఈ జీఓ ప్రకారం కార్యదర్శులు గ్రామ సభలకు హాజరుకాని మండలస్థాయి అధికారులపై జిల్లా స్థాయి అధికారులకు నివేదికలు ఇవ్వవచ్చు. ప్రణాళికా బద్ధంగా నిర్వహించేందుకు.. జిల్లా వ్యాప్తంగా 758 గ్రామ పంచాయతీలున్నాయి. ప్రస్తుతం పాలకవర్గాలు ఏర్పడడంతో పంచాయతీల వారిగా అభివృద్ధి పనులు, ఆదాయ, వ్యయాలకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. గతంలో గ్రామ సభల నిర్వహణ అస్తవ్యస్తంగా మారడం, ఆశించిన ప్రయోజనం లేకపోవడంతో ఈసారి సభలను ప్రణాళికా బద్ధంగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా నవంబర్ 7న జీఓ నంబర్ 791ని జారీ చేసింది. గతంలో గ్రామ సభలకు మండలస్థాయి అధికారులు రాకున్నా కొనసాగించేవారు. దీంతో గ్రామ సమస్యలు అపరిష్కృతంగానే ఉండేవి. అలాగే ఏయే అధికారులు సభలకు హాజరయ్యారనే సమాచారం ఉన్నతాధికారు వద్ద కూడా లేకుండా పోతోంది. ఈ జీఓ ప్రకారం ప్రధాన శాఖల మండల స్థాయి అధికారులు ఏడాదిలో నాలుగు సార్లు నిర్వహించే గ్రామ సభలకు విధిగా హాజరు కావాలి. గ్రామాల్లో తాగునీటి సమస్య, డ్రెయినేజీ, రోడ్లు తదితర విషయాలపై చర్చించడం, ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలి. సభలకు హాజరు కాని ఆయా అధికారులపై పంచాయతీ కార్యదర్శులు జిల్లా పంచాయతీ అధికారికి ప్రతి గ్రామ సభకు సంబంధించి నివేదిక అందజేయాలి. చిక్కులు తప్పవా..? ఇప్పటి వరకు గ్రామ సభలను నామ మాత్రంగా నిర్వహించిన పంచాయతీ కార్యదర్శులు ఈ జీఓతో ఇబ్బందులు తప్పవని చర్చించ ుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 161 మంది పంచాయతీ కార్యదర్శులున్నారు. ఒక్కో కార్యదర్శి నాలుగు నుంచి ఐదు గ్రామ పంచాయతీల వ్యవహారాలను చూసుకుంటున్నారు. ఇప్పటికే ఇది తమకు తలకు మించిన భారమని వారు భావిస్తున్నారు. అయితే ఈ జీఓతో గ్రామసభలకు రాని మండల స్థాయి అధికారులపై రిపోర్టు చేస్తే ఏ సమయంలో తమకు మండలస్థాయి అధికారులు ఏకు మేకవుతారోనని వారు ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలపై సీరియస్‌గా స్పందిస్తే క్షేత్రస్థాయిలో తమకు ఇబ్బందులు తప్పవంటున్నారు. పంచాయతీల్లో గతంలో అస్తవ్యస్తంగా ఉన్న ఆడిట్‌ను ఎలా పూర్తి చేయాలని ఇప్పుడు కార్యదర్శులు తల పట్టుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ జీఓ రావడం తమ మెడకు పరోక్షంగా ఉచ్చు బిగుసుకుంటున్నట్లేనని ఆందోళన చెందుతున్నారు.