హైదరాబాద్, సాక్షి: రాష్ట్రంలోని పల్లెలు ప్రత్యేకాధికారుల పాలనలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల పదవీకాలం వచ్చే నెల (ఫిబ్రవరి) 1న ముగుస్తోంది. దీంతో స్పెషల్ ఆఫీసర్లను నియమించి పంచాయతీల బాధ్యతలను అప్పగించాలని రాష్ట్ర సర్కారు భావిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుత సర్పంచ్‌లకే ఇన్‌చార్జులుగా బాధ్యతలు అప్పగించే అవకాశమున్నా.. పంచాయతీల పాలకమండళ్లలో బీఆర్‌ఎస్ పార్టీకే ఆధిపత్యం ఉండటంతో అందుకు కాంగ్రెస్ సర్కారు విముఖంగా ఉంది.
మండల, గ్రామస్థాయిల్లోని వివిధ శాఖల అధికారులను స్పెషలాఫీసర్లుగా నియమించేందుకు ప్రభుత్వపరంగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖాపరంగా ఇప్పటికే కసరత్తు మొదలైనట్టు సమాచారం. పోలీసుశాఖ మినహా మండల, గ్రామస్థాయిల్లోని పంచాయతీరాజ్, రెవెన్యూ, విద్యా, వైద్య తదితర శాఖల అధికారులను పంచాయతీలకు ప్రత్యేక అధికారులుగా నియమించే అవకాశం ఉంది.
ఏ నిర్ణయమూ తీసుకోని సర్కారు..
రాష్ట్రంలో 2019 జనవరిలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీలోగా పంచాయతీ ఎన్నికలు పూర్తయి, కొత్త పాలకమండళ్లు ఏర్పాటై ఉండాల్సింది. అక్టోబర్ నుంచి డిసెంబర్ తొలివారం వరకు అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ కొనసాగడం.. ఏప్రిల్, మేలలో లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముందుకు పడలేదు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ముందస్తు సన్నాహాల్లో నిమగ్నమైనా.. ఎన్నికల తేదీలపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంది. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదన నేపథ్యంలో..
స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని, ఉపకులాల వారీగా కూడా రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. దీనికి సంబంధించి బీసీ కమిషన్ నుంచి ఆరు నెలల్లో నివేదిక తెప్పించుకుని తదుపరి చర్యలు చేపడతామని తెలిపింది. వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు, ఇతర గ్రూపులకు రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు గతంలో ‘ట్రిపుల్ టెస్ట్’ పేరిట మార్గదర్శకాలు ఇచ్చింది.
స్థానిక సంస్థల పరిధిలో ఆయా గ్రూపుల వెనుకబాటు స్వభావంపై బీసీ కమిషన్‌న్‌ద్వారా విచారణ జరపాలని.. ఆయా చోట్ల ఏ నిష్పత్తిలో రిజర్వేషన్లు ఇవ్వాలనేది తేల్చాలని సూచించింది. మొత్తంగా రిజర్వేషన్లు (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కలిపి) 50శాతం మించకుండా ఉండాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపు, మార్పుల కోసం బీసీ కమిషన్ విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సి ఉంది. దాని ఆధారంగానే పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లను పెంచేందుకు వీలు కానుంది.
ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూపులు!
చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌న్‌ఆధ్వర్యంలోని రాష్ట్ర బీసీ కమిషన్.. ‘ట్రిపుల్ టెస్ట్’ అంశంలో అనుసరించిన విధానాలపై ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు పూర్తిచేసినట్టు సమాచారం. ప్రభుత్వానికి నివేదిక సమర్పించే విషయంలో కమిషన్‌కు పూర్తి స్పష్టత లేక ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు తెలిసింది. కొత్త ఓటర్ల జాబితా వచ్చాక.. దాని ఆధారంగా మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలను నోడల్ ఏజెన్సీలుగా పెట్టి ఆ వివరాలు సేకరించి ఇవ్వాలని భావిస్తున్నట్టు బీసీ కమిషన్ వర్గాలు చెప్తున్నాయి.
అయితే ఓటర్ల జాబితా ద్వారానా? లేక సామాజిక, ఆర్థిక, కుల సర్వే ఆధారంగా వెళ్లాలా అన్న దానిపై ప్రభుత్వపరంగా ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో సందిగ్థత ఏర్పడినట్టు సమాచారం. లోక్‌సభ ఎన్నికలు ముగిశాక పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని, ఆలోగా బీసీ కమిషన్ నివేదిక ప్రక్రియ పూర్తవుతుందని రాష్ట్ర సర్కారు భావిస్తున్నట్టు తెలిసింది.
మొత్తం 12,751 పంచాయతీలు..
రాష్ట్రంలో ప్రస్తుతం 12,751 గ్రామ పంచాయతీలకు (కొత్తగా ఏర్పాటు చేసినవి కలిపితే మొత్తం 12,772 పంచాయతీలు) సర్పంచ్‌లు ఉన్నారు. వార్డు సభ్యులు సుమారు లక్షా 27వేల మంది వరకు ఉంటారు. తెలంగాణ నూతన పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం.. సర్పంచ్‌ల పదవీకాలం ముగిసిపోయాక పర్సన్ ఇన్‌చార్జులుగా నియమించే అవకాశం లేదు. దీనితోపాటు సకాలంలో ఎన్నికలు జరగకపోతే గ్రామ పంచాయతీలకు ‘స్పెషల్ ఆఫీసర్’లను నియమించాల్సి ఉంటుంది.
– ఉమ్మడి ఏపీలో కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు.. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో 2011–2013 మధ్య పంచాయతీలు స్పెషల్ ఆఫీసర్ల పాలనలో కొనసాగాయి. అంతకు ముందు చంద్రబాబు సర్కారు హయాంలోనూ గడువులోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించని కారణంగా, అంతకు ముందున్న సర్పంచ్‌లనే పర్సన్ ఇన్‌చార్జులుగా కొనసాగించారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిపాదనలు పంపినా..!
రాజ్యాంగం ప్రకారం పంచాయతీరాజ్ సంస్థల ఐదేళ్ల పదవీకాలం ముగిసేలోపే.. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పదవీకాలం ముగియడానికి మూడు నెలల ముందే ఎన్నికలు పూర్తిచేయాలి. ఈ క్రమంలో రాష్ట్రంలో జనవరి లేదా ఫిబ్రవరిలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని, అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ప్రభుత్వానికి గతంలోనే ప్రతిపాదనలు పంపినట్టు తెలిసింది.
కానీ దీనిపై గత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. త్వరలో లోక్‌సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. కనీసం ఆరునెలల వరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు. దీంతో అప్పటివరకు స్పెషలాఫీసర్ల పాలనలో కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్టు తెలిసింది.
ప్రస్తుత సర్పంచ్‌లనే ఇన్‌చార్జులుగా కొనసాగించాలి
‘‘ప్రస్తుతమున్న సర్పంచ్‌లనే పర్సన్ ఇన్‌చార్జులుగా కొనసాగించాలి. దీనిపై ఇప్పటికే ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించాం. గ్రామాల అభివృద్ధిపై మాకు పూర్తి అవగాహన ఉన్నందున ప్రభుత్వ కార్యక్రమాల అమల్లో, పాలనలో జాప్యం జరగదు. స్పెషలాఫీసర్లకు గ్రామాల్లోని పరిస్థితులపై అవగాహన ఏర్పడేందుకే కొంత సమయం పడుతుంది.
అధికారులు స్థానికంగా ఉండరు, ఆఫీస్ టైమ్ బట్టి వచ్చి వెళ్తుంటారు. మేం గ్రామాల్లోనే అందుబాటులో ఉంటాం. ఆరునెలల పాటు ఇన్‌చార్జులుగా పొడిగించాలి. కోవిడ్ మహమ్మారి కారణంగా దాదాపు మూడేళ్ల పదవీకాలాన్ని కోల్పోయాం. మాకు చెక్ పవర్ కూడా ఆరు నెలలు ఆలస్యంగా ఇచ్చారు. గతంలో చేసిన పనులకు ఇంకా బిల్లులు రావాల్సి ఉంది.
– ఉప్పుల అంజనీప్రసాద్, రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం గౌరవాధ్యక్షుడు
స్పెషలాఫీసర్లతో పాలనకు ఇబ్బంది
‘‘ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రస్తుత సర్పంచ్‌లకే పర్సన్ ఇన్‌చార్జులుగా బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుంది. గతంలో పనిచేసిన అనుభవం, విధుల నిర్వహణకు పనికొస్తుంది. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి దోహదపడతారు. వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు కాబట్టి సర్పంచ్‌లనే మరో ఆరునెలల పాటు కొనసాగిస్తే గ్రామాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశముంది.
పరిపాలన ఇబ్బందులు లేకుండా సజావుగా సాగే అవకాశాలు ఉంటాయి. అదే స్పెషల్ ఆఫీసర్‌గా నియమితులైన వారికి గ్రామంపై పట్టు రావడానికి.. ఆయా సమస్యలు, అంశాలపై అవగాహన ఏర్పడడానికి సమయం పడుతుంది. పాలనకు ఇబ్బంది అవుతుంది.
– చింపుల సత్యనారాయణరెడ్డి, తెలంగాణ పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షుడు
పల్లెల్లో ‘ప్రత్యేక’మే!
Published Fri, Jan 19 2024 12:42 AM | Last Updated on Fri, Jan 19 2024 6:50 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment