
ఒక్కగానొక్క కుమారుడి మృతితో కన్నీరు మున్నీరు
లిఫ్టులో ఇరుక్కుని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి మృతి
నాంపల్లి: చిరునవ్వుల అరుణవ్ ఊపిరాగింది. ఇరు కుటుంబాల ఆశల కిరణం ఆరిపోయింది. లిఫ్టులో ఇరుక్కుని చావుబతుకుల నడుమ కొట్టుమిట్టాడుతూ నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరేళ్ల బాలుడు అరుణవ్ శనివారం ఉదయం 11.30 గంటల సమయంలో మృతి చెందాడు. అరుణవ్‌ను బతికించడానికి నిలోఫర్ వైద్యులు శత విధాలా ప్రయతి్నంచినా ఫలితం దక్కలేదు. మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతో బాలుడు మృతి చెందినట్లు నిలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్.రవికుమార్ ప్రకటించారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించి బంధువులకు అప్పగించారు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఒక్కగానొక్క కుమారుడు ఆరేళ్లకే కన్నుమూయడంతో అజయ్‌కుమార్ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.
అత్తను చూసేందుకు వచ్చి..
గోడేఖీ ఖబర్ ప్రాంతానికి చెందిన అజయ్‌కుమార్ దంపతులకు ఒకే ఒక సంతానం. మగ పిల్లాడు పుట్టడంతో ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అజయ్‌కుమార్ సోదరి, అరుణవ్ మేనత్త జయశ్రీ అలియాస్ ఆయేషా శాంతినగర్‌లో నివాసం ఉంటున్న ఇమ్రాన్‌తో ప్రేమ వివాహం చేసుకున్నారు. సోదరి ప్రేమ వివాహం చేసుకోవడంతో చాలా రోజులు అజయ్‌కుమార్ కుటుంబం జయశ్రీ అలియాస్ ఆయేషాతో దూరంగా ఉంటోంది.
ఆయేషాకు ఇటీవల తన పుట్టింటితో బంధం మళ్లీ చిగురించింది. మాట్లాడుకోవడాలు, వచి్చపోవడాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే బాలుడు అరుణవ్ శుక్రవారం తన తాతయ్యతో కలిసి శాంతినగర్‌లోని మేనత్త ఇంటికి వచ్చి లిఫ్టులో ఇరుక్కుపోయాడు. అపస్మారక స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచాడు. రెండు కుటుంబాల మధ్య చిగురించిన బంధంలో బాలుడి మరణం విషాదాన్ని నింపింది.
Comments
Please login to add a commentAdd a comment