
అడ్మిషన్లకు ముందే ప్రైవేటు స్కూళ్లు,కాలేజీల సీట్ల అమ్మకాలు
సాక్షి, హైదరాబాద్: జూన్‌లో ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం కోసం ప్రైవేటు విద్యాసంస్థలు సీట్లను అమ్మకానికి పెట్టాయి. విద్యార్థులను ఆకర్షించేందుకు కొత్త పద్ధతులు అవలంభిస్తున్నాయి. మధ్యవర్తులు, ఏజెంట్లు, తమ సంస్థల్లో చదివే సీనియర్లను రంగంలోకి దించుతున్నాయి. పెద్ద ఎత్తున కరపత్రాలు, ప్రకటనలతో హోరెత్తిస్తున్నాయి. గ్రామాల్లో ఆటోలకు మైకులు పెట్టి ఊదరగొడుతున్నాయి. పల్లెల్లో పెద్దల్ని ఆశ్రయించి తమ విద్యార్థులకు తమ సంస్థలను సిఫారసు చేయమని అడుగుతున్నాయి.
నిరుద్యోగులను నియమించుకుని వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులను ఆకర్షించేలా ఇల్లిల్లూ తిప్పుతున్నాయి. వీలున్న మార్గాల్లో విద్యార్థుల ఫోన్ నంబర్లు, వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నాయి. ఎల్‌కేజీ మొదలుకుని, ఇంజనీరింగ్ వరకు స్కూళ్లు, కాలేజీలు ముందస్తు ప్రవేశాలకు తెరతీశాయి. ముందస్తు అడ్మిషన్లకు ప్రభుత్వం నుంచి అనుమతి లేకున్నా వెనక్కి తగ్గకుండా దూసుకెళ్తున్నాయి.
‘బీ’ బ్యాచ్ టార్గెట్ రూ.1,000 కోట్లు!
ఇంటర్మీడియెట్ పరీక్షలు ఇంకా పూర్తవ్వలేదు. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు మొదలవ్వలేదు. కానీ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు అప్పుడేయాజమాన్య కోటా సీట్ల అమ్మకాలకు తెరలేపాయి. జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఎర వేస్తున్నాయి. ఇప్పుడే సీటు రిజర్వు చేసుకుంటే తక్కువ మొత్తానికే లభిస్తుందని, తర్వాత డిమాండ్ పెరిగే అవకాశం ఉందంటూ తల్లిదండ్రులను ఒత్తిడి చేస్తున్నాయి.
రాష్ట్రంలో 150 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలుండగా.. కన్వీనర్, యాజమాన్య కోటా కలిపి 1,07,039 సీట్లున్నాయి. ఇందులో యాజమాన్య కోటా సీట్లు 30 శాతం.. అంటే 32 వేల సీట్లుంటాయి. ప్రధానంగా పది కాలేజీల్లోనే 15 వేల యాజమాన్య కోటా సీట్లున్నాయి. ఇందులో కంప్యూటర్ సైన్స్ సీట్లు 12,500 వరకూ ఉన్నాయి. ఈ ఏడాది కొత్తగా మరో 3 వేల సీట్లు వచ్చే వీలుంది.
వీటికే ప్రధానంగా డిమాండ్ ఉంటోంది. జేఈఈ, ఈఏపీసెట్, ఇంటర్ మార్కుల కొలమానంగా మెరిట్ విద్యార్థులకే సీట్లివ్వాలి. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు వసూలు చేయాలి. కానీ యాజమాన్యాలు ఒక్కో సీటు గరిష్టంగా రూ.20 లక్షల వరకు అమ్ముకుంటున్నాయనే ఆరోపణలు విని్పస్తున్నాయి. ఒక్కో సీటు సగటున రూ.7 లక్షలు అనుకున్నా..17 వేలకు పైగా యాజమాన్య సీట్ల విలువ రూ.1,000 కోట్లు దాటిపోతుందని అంటున్నారు.
తగ్గేదే లేదంటున్న కార్పొరేట్ జూనియర్ కాలేజీలు
ఇంటర్ మొదటి సంవత్సరంలో ఏటా సగటున 4.50 లక్షల మంది ప్రవేశాలు పొందుతున్నారు. 2 లక్షల మంది ప్రభుత్వ కాలేజీలు, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలలు, గురకులాల్లో చేరుతుంటే, మిగిలిన 2.50 లక్షల మంది ప్రైవేటు కాలేజీల్లో చేరుతున్నారు. రాష్ట్రంలో 1,500 వరకూ ప్రైవేటు జూనియర్ కాలేజీలున్నాయి. ఇందులో 500కు పైగా కాలేజీలున్న నాలుగు కార్పొరేట్ సంస్థలే హవా కొనసాగిస్తున్నాయి. దాదాపు 1.80 వేల మంది ఈ కాలేజీల్లోనే చేరుతున్నారు. 1,000 వరకు ఉండే లోబడ్జెట్ కాలేజీల్లో చేరే వారి సంఖ్య 70 వేల వరకూ ఉంటోంది.
ఈ నేపథ్యంలో కార్పొరేట్ జూనియర్ కాలేజీలు ముందే ప్రవేశాల ప్రక్రియ మొదలు పెట్టాయి. టెన్త్ పరీక్షలకు ఇంకా ఎంతో సమయం ఉన్నా..భవిష్యత్‌ను నిర్ణయించేది ఇంటర్మీడియెట్టేనని, ఇక్కడే అసలైన పునాది అంటూ ప్రచారం హోరెత్తిస్తున్నాయి. హాస్టళ్ళలో వసతులు, అత్యాధునిక పద్ధతుల్లో బోధన, నిష్ణాతులైన సిబ్బంది, కొన్నేళ్ళుగా వస్తున్న పరీక్షల ఫలితాలను తల్లిదండ్రులకు వివరిస్తూ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఊళ్ళల్లో చోటామోటా నేతలకు మామూళ్ళిస్తున్నాయి. విలాస వంతమైన ట్రిప్పులు ఏర్పాటు చేస్తున్నాయి.
‘కేజీ’ చదువులపైనా క్రేజ్
ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లూ జోరు కొనసాగిస్తున్నాయి. కొత్త విద్యార్థులను చేర్పించమని స్కూల్‌లో ఉన్న విద్యార్థులు, టీచర్లకు టార్గెట్లు పెడుతున్నాయి. అడ్మిషన్లకు వేతనాలకు లింక్ పెడుతున్నాయి. రాష్ట్రంలో 30 వేల ప్రభుత్వ రంగ స్కూళ్ళల్లో 24 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. అయితే కేవలం 11 వేల ప్రైవేటు స్కూళ్ళల్లో 36 లక్షల మంది చదువుతుండటం గమనార్హం. తల్లిదండ్రులు కూడా ప్రైవేటు స్కూళ్ల వైపే మొగ్గు చూపుతున్నారు.
నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీల్లో చేర్పించేటప్పుడే మంచి స్కూళ్ల కోసం గాలిస్తున్నారు. దీంతో ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు వారికి గాలం వేస్తున్నాయి. అందమైన బ్రోచర్లతో, ఆకర్షణీయమైన వాట్సాప్ మెసేజీలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తమ స్కూల్‌లో చేరితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని నమ్మ బలుకుతున్నాయి. అడ్మిషన్లు మొదలయ్యే లోగా చేరే వారికి ప్రత్యేక ప్యాకేజీ అంటున్నాయి. రూ. 50 వేలు మొదలుకొని, పెద్ద కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూళ్లలో రూ.12 లక్షల వరకూ ఫీజులు వసూలు చేస్తున్నారు.
ప్రభుత్వం దృష్టికి పరిస్థితి
నోటిఫికేషన్ ఇవ్వకుండానే అడ్మిషన్ల కోసం వెంటపడే కాలేజీల వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటోంది. యాజమాన్య కోటా సీట్లను ఆన్‌లైన్ వ్యవస్థలోకి తేవాలి. పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. అనుమతి వచి్చన తర్వాత అడ్డుకట్ట వేయడానికి కార్యాచరణ సిద్ధం చేస్తాం.
– ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి (ఉన్నత విద్యామండలి చైర్మన్)
కఠిన చర్యలు తప్పవు
వచ్చే విద్యా సంవత్సరానికి గాను ఇప్పటివరకు ఏ కాలేజీకీ అఫ్లియేషన్ ఇవ్వలేదు. కాబట్టి అడ్మిషన్లు చేపట్టినట్టు ఎవరైనా ఆధారాలతో ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులు కూడా తొందరపడి అడ్మిషన్లు తీసుకోవద్దు.
– కృష్ణ ఆదిత్య (ఇంటర్ బోర్డు కార్యదర్శి)
Comments
Please login to add a commentAdd a comment