డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాల పంపిణీ సభలో సీఎం రేవంత్
తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దేది మీరే..
ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపాలంటే తల్లిదండ్రులు నామోషీగా భావిస్తున్నారు
ఇకపై సర్కారీ బడులంటే గర్వపడేలా వ్యవస్థల్ని నిర్మిస్తున్నాం
ప్రజలు గతంలో రెండుసార్లు కోరి కొరివిదెయ్యాన్ని తెచ్చుకున్నారని కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్య
ప్రభుత్వాన్ని పడగొడతామని బిల్లారంగాలు రంకెలేస్తున్నారంటూ కేటీఆర్, హరీశ్‌లపై ధ్వజం
నక్క ద్రాక్షపళ్లకు ఆశపడ్డట్టే వాళ్లకు మళ్లీ అధికారం రాదని జోస్యం
సాక్షి, హైదరాబాద్: ‘మీరే మా ప్రతినిధులు. మా వారధులు. మేము ఏ నిర్ణయం తీసుకున్నా కింది స్థాయికి తీసుకెళ్లాల్సింది మీరే. ప్రభుత్వం ఎన్ని పాలసీలు చేసినా పిల్లలు వచ్చేది మీ దగ్గరికే. మేము ఎన్ని చేసినా అమలు చేయాల్సిన పిల్లర్స్ మీరే. తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దేది మీరే. తెలంగాణ భవిష్యత్తు నిర్మాణానికి మీరే బాధ్యులు. మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నాది. భావితరాలను నిర్మించే బాధ్యత మీది’అని డీఎస్సీ–24లో ఎంపికైన ఉపాధ్యాయులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
ఎంపికైన 10,006 మంది ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందించడానికి ప్రభుత్వం బుధవారం ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీతక్క, రాజ్యసభ ఎంపీ అభిషేక్ సింఘ్వీ, ఎమ్మెల్సీ కోదండరాం, ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు పాల్గొన్నారు.
కార్యక్రమం చివర్లో కొందరు అభ్యర్థులకు సీఎం, మంత్రులు నియామక పత్రాలు అందజేశారు. అంతకుముందు సీఎం మాట్లాడుతూ భవిష్యత్తు తెలంగాణ తరాలను నిర్మించడానికి సంపూర్ణ కృషి చేయాలని సభకు హాజరైన వేల మంది ఉపాధ్యాయులతో ప్రతిజ్ఞ చేయించారు. కేసీఆర్ కొడుకు, అల్లుడు, బిడ్డకు ఉద్యోగాలిస్తే కాదు.. వేలాది, లక్షాలాది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చిన నాడే తెలంగాణ పండుగ చేసుకుంటుందని చప్పట్లతో ఆయనకు తెలియజేయాలని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ బడుల్లో చదువుతున్నామని గర్వంగా చెప్పుకునేలా..
‘ప్రభుత్వ బడులకు పంపాలంటే తల్లిదండ్రులు నామోషీగా భావిస్తున్నారు. ఉపాధి కూలీ అయినా సరే వారి పిల్లలను కాన్వెంట్, ప్రైవేటు స్కూళ్లకు పంపాలనుకుంటున్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్‌తో కలిపి 30 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 24 లక్షల మంది విద్యార్థులుంటే... కేవలం 10 వేల ప్రైవేటు పాఠశాలల్లో ఏకంగా 34 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రైవేటు బడుల్లో మీకంటే గొప్పగా చదువుకున్న వాళ్లు, అనుభవం ఉన్న వాళ్లు ఉన్నారా? దీనికి కారణం ఏమిటో మీరు ఆలోచించాలి.
ప్రభుత్వ పాఠశాల్లో చదువుకుంటున్నట్లు విద్యార్థులు గర్వంగా చెప్పుకొనేలా వ్యవస్థలను నిర్మిస్తున్నాం. వచ్చే 100 ఏళ్లకు అవసరమైన విద్యా విధానాన్ని రూపొందించడానికి రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళితో విద్యా కమిషన్ ఏర్పాటు చేశాం. ప్రభుత్వ బడులకు ఉచిత విద్యుత్‌తోపాటు అటెండర్లను పెట్టాం. ప్రతి స్కూల్‌లో టాయిలెట్స్, మంచినీరు, క్లాస్‌రూమ్స్‌ను తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నాం’అని సీఎం రేవంత్ అన్నారు.
అలాగే వెయ్యి రెసిడెన్షియల్ స్కూళ్లను యంగ్ ఎండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లుగా తీర్చిదిద్దనున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల్లో రూ. 125 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తామని.. తొలి విడతగా 25 నియోజకవర్గాల్లో నిర్మాణ పనులను ఈ నెల 11న ప్రారంభిస్తున్నట్లు సీఎం వివరించారు.
సర్కారు బడుల్లో సీఎంలు, రాష్ట్రపతులను తయారు చేయాలి..
‘తెలంగాణ బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించి ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఎమ్మెల్యేలు, సీఎంలుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీపై ఉంది. నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకొనే సీఎం అయ్యా. ఉపముఖ్యమంత్రి భట్టితోపాటు కేశవరావు, కోదండరాం ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నారు. అబ్దుల్ కాలం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొనే గొప్ప శాస్త్రవేత్త కావడంతోపాటు రాష్ట్రపతి అయ్యారు’అని సీఎం రేవంత్ గుర్తుచేశారు.
రూ. 15 వేలకే ఇంజనీర్ దొరుకుతున్నా రూ. 60 వేలిచ్చినా మేస్త్రీ దొరకట్లేదు..
రాష్ట్రంలోని ఐటీఐలను టాటా గ్రూపు భాగస్వామ్యంతో 75 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దుతున్నామని సీఎం రేవంత్ తెలిపారు. రూ. 15 వేలకే ఉద్యోగం చేయడానికి ఇంజనీర్లు వస్తున్నారని... కానీ నైపుణ్యంగల మేస్త్రీ నెలకు రూ. 60 వేలిచ్చినా దొరకడం లేదని సీఎం అన్నారు. నైపుణ్యాభివృద్ధి కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించి ఏటా 20 వేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు కోర్సు చివరి ఏడాదిన్నరలో ప్రాక్టికల్స్ శిక్షణ, ఇంటర్న్íÙప్ ఇప్పించనున్నట్లు చెప్పారు.
డ్రగ్స్ నుంచి క్రీడలకు మళ్లింపు...
తెలంగాణ కోసం పోరాడిన యువత నేడు మత్తుకు బానిసైందని.. గత పదేళ్లలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా డ్రగ్స్, గంజాయి మహమ్మారి వ్యాపించిందని సీఎం రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే యువతను క్రీడల వైపు మళ్లించి 2028 ఒలింపిక్స్‌లో తెలంగాణ నుంచి బంగారు పతకాలు సాధించాలనే ఆలోచనతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment