ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, భువనగిరి(నల్లగొండ): తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా అందజేసే పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ప్రాఠశాలల ప్రారంభానికి ముందే పుస్తకాలను పంపిణీ చేసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2021–22 విద్యా సంవత్సరంలో కొత్త ప్రవేశాలు పొందిన వారితో పాటు ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు ఈ పాఠ్యపుస్తకాలను అందించనున్నారు. రెండేళ్లనుంచి ముందస్తుగానే సరఫరా చేయడంతో పుస్తకాల కొరత లేకుండా విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే బోధన సాఫీగా సాగుతుంది. వేసవిలోనే జిల్లాకు అవసరమైన పాఠ్యపుస్తకాల ప్రతిపాదనలను రాష్ట్ర విద్యాశాఖకు పంపింది. దీంతో ఇప్పటి వరకు వచ్చిన పుస్తకాలను జిల్లా గోదాంలో నిల్వ చేశారు.
జిల్లాకు 3,30,000 పుస్తకాలు
జిల్లాలోని ప్రభుత్వ జెడ్పీ, ఉన్నత, మోడల్ పాఠశాలలతో పాటు సంక్షేమ, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలను అందజేయనున్నారు. ఆయా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మొత్తం 3,30,000 పుస్తకాలు అవసరమని జిల్లా విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. గత విద్యా సంవత్సరం పంపిణీ చేయగా మిగిలిన 9,000 పాఠ్యపుస్తకాలు గోదాంలో మిగిలి ఉన్నాయి. ఇంకా జిల్లాకు 3,21,000 జిల్లాకు రావల్సి ఉండగా 1,29,150 రాగా మరో 1,91,850 పుస్తకాలు రావాల్సి ఉంది. కరోనా విజృంభణ, లాక్‌డౌన్ కారణంగా జూన్ 2న ప్రారంభించాల్సిన పాఠశాలలను ఈ నెల 15కు వాయిదా వేశారు. కాగా గత సంవత్సరం సెప్టెంబర్‌లో ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించి పుస్తకాలను పంపిణీ చేశారు.
ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్
ఆన్‌లైన్ తరగతులకు అలవాటు పడిన విద్యార్థులు అదే మాదిరిగా ఈ సారి కూడా పాఠాలు వినేలా పాఠ్యపుస్తకాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు.1 నుంచి 10వ తరగతుల అన్ని పాఠ్యపుస్తకాల్లోని పాఠాలను దృశ్య రూపంలో చూసి అర్థం చేసుకునేలా తయారు చేశారు. గత సంవత్సరం కొన్ని తరగతుల సైన్స్ పుస్తకాలు ఇలా ఉండగా ఈ సారి అన్ని పుస్తకాల్లోని పాఠాలను చూసేలా అవకాశాన్ని కల్పించారు. ఇందు కోసం ప్రతి పుస్తకంపై ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్‌ను ముద్రించారు. ఫోన్ ద్వారా ఆ కోడ్ స్కాన్ చేస్తే అందులో ఉన్న పాఠ్యాంశ్యాన్ని దృశ్యంలో చూడవచ్చు.
ఆదేశాలు రాగానే పంపిణీ చేస్తాం
2021–22 విద్యా సంవత్సరానికి జిల్లా అవసరమైన ఉచిత పాఠ్య పుస్తకాల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాం. ప్రతిపాదనలకు అనుగుణంగా పుస్తకాలు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు 1,29,150 పుస్తకాలు వచ్చాయి. వచ్చిన పుస్తకాలను పాఠశాల ప్రారంభానికి ముందే ఇవ్వాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే పంపిణీకి చర్యలు తీసుకుంటాం.
–చైతన్య జైని, డీఈఓ
చదవండి: తెలంగాణలో ఇంటర్ పరీక్షలు రద్దు
Comments
Please login to add a commentAdd a comment