
హైదరాబాద్/భూపాలపల్లి, సాక్షి: మేడిగడ్డ కుంగుబాటు వ్యవహారంపై కేసు వేసిన నాగవెల్లి రాజ లింగమూర్తి(Nagevelli Raja Lingamurthy) దారుణ హత్యకు గురికావడాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా భావిస్తోంది. రాజకీయ ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలోఈ కేసు విచారణను సీబీసీఐడీకి అప్పగించాలని నిర్ణయించింది. మధ్యాహ్నాం మంత్రి కోమటిరెడ్డి ఈ కేసుపై మీడియాతో మాట్లాడతారని సమాచారం.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వమే కారణమని లింగమూర్తి కేసు వేశారు. అయితే.. రాజలింగమూర్తి బుధవారం సాయంత్రం దారుణ హత్యకు గురయ్యారు. ముసుగులో వచ్చిన కొందరు ఆయనపై కత్తులు, గొడళ్లతో దాడి చేశారు. స్థానికులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
బీఆర్‌ఎస్ హస్తం ఉందంటూ..
తన భర్త హత్య వెనుక బీఆర్‌ఎస్ హస్తం ఉందని సరళ ఆరోపిస్తున్నారు. తన భర్త హత్యకు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ సర్పంచి బుర్ర చంద్రయ్య, వార్డు మాజీ కౌన్సిలర్ కొత్త హరిబాబు కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కుటుంబ సభ్యులతో కలిసి పట్టణంలోని అంబేడ్కర్ కూడలిలో జాతీయ రహదారిపై బుధవారం రాత్రి బైఠాయించారు. ఇక.. మేడిగడ్డ అవినీతి వ్యవహారంపై పోరాటం చేస్తున్నందుకే ఆయన్ని హత్య చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. చట్ట ప్రకారం విచారణ జరపాలని, నేరస్తులు ఎవరైనా వదిలిపెట్టొద్దని, స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పోలీసులను కోరారు. హత్యా రాజకీయాలు ఏమాత్రం మంచివి కావని అంటున్నారాయన. కుటుంబ సభ్యుల అనుమానాలు, రాజకీయ ఆరోపణల నేపథ్యంలో తాజాగా.. లింగమూర్తి(Lingamurthy) కేసును ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించాలనుకుంటోంది.
పోలీసుల అదుపులో నిందితులు?
రాజా లింగమూర్తి హత్య కేసులో నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. భూ వివాదాల నేపథ్యంలో లింగమూర్తి స్నేహితుడే ఈ హత్యకు ప్లాన్ వేశాడని పోలీసులు ప్రాథమికంగా ఓ అంచనాకి వచ్చారు. సంజీవ్, హరిబాబు, కొమురయ్య, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో జిల్లా ఎస్పీ ఈ కేసు గురించి మీడియాకు వివరించే అవకాశం ఉంది.
బీఆర్‌ఎస్‌తో అనుబంధం నుంచి..
రాజా లింగమూర్తికి గతంలో బీఆర్‌ఎస్‌తో మంచి అనుబంధం ఉంది. ఆయన భార్య మాజీ కౌన్సిలర్ నాగవెల్లి సరళ. ఆమె 2019లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భూపాలపల్లి లోని 15వ వార్డు నుంచి బీఆర్‌ఎస్ తరఫున కౌన్సిలర్‌గా గెలుపొందారు. అయితే కొద్ది నెలల తర్వాత నాగవెళ్లి సరళను పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ జంట కొన్ని నెలలుగా పట్టణంలోని రెడ్డి కాలనీలో నివాసం ఉంటోంది.

మంకీ క్యాపులతో వచ్చి..
బుధవారం తన స్వస్థలం జంగేడు శివారు ఫక్కీర్‌గడ్డలోని తన బంధువుల ఇంటికి వెళ్లి పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్దకు వచ్చాడు. అక్కడ టీ తాగి రెడ్డి ఇంటికి బయల్దేరారు. కాలనీలోని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఎదురుగా రోడ్డును దాటుతున్న క్రమంలో.. ఆటోలో మంకీ క్యాపులతో వచ్చిన కొందరు దాడికి దిగారు. మొఖం, పొట్ట భాగంలో కత్తులతో విచక్షణారహితంగా పొడవడంతో పేగులు బయటపడి ఆయన కుప్పకూలిపోయారు. అయితే.. జిల్లాకేంద్రంలోని ఓ భూ వివాదంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు చెబుతుండగా.. లింగమూర్తి కుటుంబ సభ్యుల వాదన మాత్రం మరోలా ఉంది.
లింగమూర్తిపైనా పలు కేసులు
రాజలింగమూర్తి రెండు దశాబ్దాలుగా వరంగల్‌కు చెందిన ఓ ప్రముఖ న్యాయవాది ద్వారా భూ సమస్యలను పరిష్కరించేవారు. గతంలో రాజలింగమూర్తిపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఓపెన్‌కాస్ట్ గనుల తవ్వకాలతో పర్యావరణం దెబ్బతింటోందని సింగరేణిపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌లో ఆయన ఫిర్యాదు చేశారు కూడా. ఈ వివాదాల నేపథ్యంలోనే ఆయన హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment