హైదరాబాద్, సాక్షి: ఫార్ములా ఈ రేస్ కేసులో సంచలన విషయం వెలుగు చూసింది. రేసుకు స్పాన్సర్‌షిప్ చేసిన గ్రీన్‌కో కంపెనీ నుంచి అప్పటి అధికార పార్టీ బీఆర్‌ఎస్(BRS)కు లబ్ధిచేకూరినట్లు తెలుస్తోంది. ఆ లావాదేవీలు చందాలు, ఎన్నికల బాండ్ల రూపంలో వెళ్లినట్లు సమాచారం.
ఎన్నికల బాండ్ల రూపంలో గ్రీన్‌కో(Greenko), దాని అనుబంధ సంస్థల నుంచి బీఆర్‌ఎస్‌కు మొత్తం రూ.49 కోట్లు ముట్టాయి. ఇందులో 2022, 8 ఏప్రిల్ నుంచి అక్టోబర్ 10 మధ్య 41 సార్లు రూ.కోటి చొప్పున ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసింది. అలాగే.. రేసుకు సంబంధించిన చర్చలు మొదలయినప్పటి నుంచే ఈ కొనుగోలు వ్యహారం నడిచినట్లు తేలింది. ఈ మేరకు ఈ విషయాన్ని తాజాగా ప్రభుత్వం బయటపెట్టింది. ఇదిలా ఉంటే.. ఫార్ములా ఈ రేస్ కేసును అవినీతి కోణంలో తెలంగాణ ఏసీబీ, ఫెమా ఉల్లంఘనలపై ఈడీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.
కేటీఆర్ స్పందన
బీఆర్‌ఎస్‌కు గ్రీన్‌కో ఎన్నికల బాండ్ల అంశంపై కేటీఆర్ స్పందించారు. ‘‘గ్రీన్‌కో 2022లో ఎన్నికల బాండ్లు ఇచ్చింది. 2023లో ఫార్ములా-ఈ రేసు జరిగింది. కాంగ్రెస్, బీజేపీకి కూడా గ్రీన్‌కో బాండ్లు ఇచ్చింది. ఫార్ములా ఈ రేసు వల్ల గ్రీన్‌కో నష్టపోయింది. అందుకే మరుసటి ఏడాది స్పాన్సర్‌షిప్ నుంచి నుంచి తప్పుకుంది. అది క్విడ్ ప్రోకో ఎలా అవుతుంది?. ఇది రేవంత్ టీం చేస్తున్న దుష్ప్రచారం. పార్లమెంట్ ఆమోదించిన బాండ్లు అవినీతి ఎలా అవుతుంది?. అన్ని పార్టీలకు వచ్చిన బాండ్లపై చర్చకు సిద్ధం. ’’ అని అన్నారాయన.
హైదరాబాద్‌లో ఫార్ములాఈ రేస్ నిర్వహణకు సంబంధించి.. యూకేకు చెందిన ఫార్ములా ఈఆపరేషన్స్ (FEO)కు సుమారు రూ.45.71 కోట్లను తెలంగాణ మున్సిపల్ శాఖ(MAUD) తరఫున హెచ్‌ఎండీఏ చెల్లించింది. ఈ చెల్లింపుల్లో ఉల్లంఘనలు జరిగాయంటూ ఇటీవల ఎంఏయూడీ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఫైనాన్స్ ఆమోదం పొందకుండానే.. హెచ్‌ఎండీఏ ఛైర్మన్ అయిన ముఖ్యమంత్రికి ఫైల్ పంపకుండానే.. ఆర్‌బీఐ అనుమతి తీసుకోకుండానే ఈ చెల్లింపులు జరిగాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. లండన్‌లోని ఎఫ్‌ఈవో ఖాతాకు బ్రిటన్ పౌండ్ల రూపంలోకి మార్చి సొమ్ము బదిలీ చేసిన క్రమంలో ఆదాయపన్ను మినహాయించలేదని.. అందువల్ల ఆదాయపన్ను శాఖకు రూ.8.06 కోట్లను హెచ్‌ఎండీఏ చెల్లించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ ఉల్లంఘనల వెనక ఏమైనా మతలబులున్నాయేమో తేల్చాలని కోరారు.
ఈ ఘటనల్లో అప్పటి మంత్రి, ఎంఏయూడీ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్‌ఎండీఏ అప్పటి చీఫ్ ఇంజినీర్ల పాత్ర ఉండటంతో అవినీతి కోణంలో ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టింది. అలాగే.. విదేశీ సంస్థకు నిధుల బదిలీ వెనక ఫెమా ఉల్లంఘనలతో పాటు నిధుల అంతిమ లబ్ధిదారులెవరనే కోణంలో ఈడీ దర్యాప్తు ఆరంభించింది.
ఇదీ చదవండి: ఫార్ములా ఈ రేస్.. ఇదో లొట్టపీసు కేసు!
Comments
Please login to add a commentAdd a comment