cbcid
-
లింగమూర్తి హత్యపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్
హైదరాబాద్/భూపాలపల్లి, సాక్షి: మేడిగడ్డ కుంగుబాటు వ్యవహారంపై కేసు వేసిన నాగవెల్లి రాజ లింగమూర్తి(Nagevelli Raja Lingamurthy) దారుణ హత్యకు గురికావడాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా భావిస్తోంది. రాజకీయ ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలోఈ కేసు విచారణను సీబీసీఐడీకి అప్పగించాలని నిర్ణయించింది. మధ్యాహ్నాం మంత్రి కోమటిరెడ్డి ఈ కేసుపై మీడియాతో మాట్లాడతారని సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని లింగమూర్తి కేసు వేశారు. అయితే.. రాజలింగమూర్తి బుధవారం సాయంత్రం దారుణ హత్యకు గురయ్యారు. ముసుగులో వచ్చిన కొందరు ఆయనపై కత్తులు, గొడళ్లతో దాడి చేశారు. స్థానికులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బీఆర్ఎస్ హస్తం ఉందంటూ..తన భర్త హత్య వెనుక బీఆర్ఎస్ హస్తం ఉందని సరళ ఆరోపిస్తున్నారు. తన భర్త హత్యకు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ సర్పంచి బుర్ర చంద్రయ్య, వార్డు మాజీ కౌన్సిలర్ కొత్త హరిబాబు కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కుటుంబ సభ్యులతో కలిసి పట్టణంలోని అంబేడ్కర్ కూడలిలో జాతీయ రహదారిపై బుధవారం రాత్రి బైఠాయించారు. ఇక.. మేడిగడ్డ అవినీతి వ్యవహారంపై పోరాటం చేస్తున్నందుకే ఆయన్ని హత్య చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. చట్ట ప్రకారం విచారణ జరపాలని, నేరస్తులు ఎవరైనా వదిలిపెట్టొద్దని, స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పోలీసులను కోరారు. హత్యా రాజకీయాలు ఏమాత్రం మంచివి కావని అంటున్నారాయన. కుటుంబ సభ్యుల అనుమానాలు, రాజకీయ ఆరోపణల నేపథ్యంలో తాజాగా.. లింగమూర్తి(Lingamurthy) కేసును ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించాలనుకుంటోంది.పోలీసుల అదుపులో నిందితులు? రాజా లింగమూర్తి హత్య కేసులో నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. భూ వివాదాల నేపథ్యంలో లింగమూర్తి స్నేహితుడే ఈ హత్యకు ప్లాన్ వేశాడని పోలీసులు ప్రాథమికంగా ఓ అంచనాకి వచ్చారు. సంజీవ్, హరిబాబు, కొమురయ్య, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో జిల్లా ఎస్పీ ఈ కేసు గురించి మీడియాకు వివరించే అవకాశం ఉంది.బీఆర్ఎస్తో అనుబంధం నుంచి..రాజా లింగమూర్తికి గతంలో బీఆర్ఎస్తో మంచి అనుబంధం ఉంది. ఆయన భార్య మాజీ కౌన్సిలర్ నాగవెల్లి సరళ. ఆమె 2019లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భూపాలపల్లి లోని 15వ వార్డు నుంచి బీఆర్ఎస్ తరఫున కౌన్సిలర్‌గా గెలుపొందారు. అయితే కొద్ది నెలల తర్వాత నాగవెళ్లి సరళను పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ జంట కొన్ని నెలలుగా పట్టణంలోని రెడ్డి కాలనీలో నివాసం ఉంటోంది. మంకీ క్యాపులతో వచ్చి..బుధవారం తన స్వస్థలం జంగేడు శివారు ఫక్కీర్‌గడ్డలోని తన బంధువుల ఇంటికి వెళ్లి పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్దకు వచ్చాడు. అక్కడ టీ తాగి రెడ్డి ఇంటికి బయల్దేరారు. కాలనీలోని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఎదురుగా రోడ్డును దాటుతున్న క్రమంలో.. ఆటోలో మంకీ క్యాపులతో వచ్చిన కొందరు దాడికి దిగారు. మొఖం, పొట్ట భాగంలో కత్తులతో విచక్షణారహితంగా పొడవడంతో పేగులు బయటపడి ఆయన కుప్పకూలిపోయారు. అయితే.. జిల్లాకేంద్రంలోని ఓ భూ వివాదంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు చెబుతుండగా.. లింగమూర్తి కుటుంబ సభ్యుల వాదన మాత్రం మరోలా ఉంది. లింగమూర్తిపైనా పలు కేసులురాజలింగమూర్తి రెండు దశాబ్దాలుగా వరంగల్‌కు చెందిన ఓ ప్రముఖ న్యాయవాది ద్వారా భూ సమస్యలను పరిష్కరించేవారు. గతంలో రాజలింగమూర్తిపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఓపెన్‌కాస్ట్ గనుల తవ్వకాలతో పర్యావరణం దెబ్బతింటోందని సింగరేణిపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌లో ఆయన ఫిర్యాదు చేశారు కూడా. ఈ వివాదాల నేపథ్యంలోనే ఆయన హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
సెన్సార్ బోర్డుకు లంచం.. అధికారుల ముందు హాజరైన విశాల్ కార్యదర్శి
హీరో విశాల్ కథానాయకుడిగా నటించిన చిత్రం మార్క్ ఆంటోని. ఈ చిత్రాన్ని హిందీలోనూ విడుదల చేశారు. రిలీజ్‌కు ముందు మార్క్ ఆంటోని చిత్ర హిందీ వెర్షన్‌ను సెన్సార్ బోర్డుకు పంపగా అక్కడ సెన్సార్ సభ్యులు సర్టిఫికెట్ కావాలంటే రూ.6.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడం సంచలనం సృష్టించింది. వారు అడిగినట్లుగానే విశాల్ డబ్బులు చెల్లించి సర్టిఫికెట్ తీసుకున్నారు. ఆ తర్వాత సెన్సార్ బోర్డు సభ్యులకు బ్యాంకు ద్వారా లంచం ఇచ్చినట్లు, దానికి సంబంధించిన బ్యాంక్ చలానా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఈ విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఆయన ఫిర్యాదుపై మహారాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ తీవ్రంగా స్పందించింది. దీనిపై విచారణ చేపట్టాలని ముంబయి సీబీసీఐడీని కోరింది. సీబీసీఐడీ విచారణలో ముంబయి సెన్సార్ బోర్డ్ సభ్యులు లంచం తీసుకున్నట్లు రుజువు కావడంతో వారిని సస్పెండ్ చేశారు. సెన్సార్ సభ్యులకు లంచం ఇచ్చిన విశాల్ కార్యదర్శి హరికుమార్‌ను సీబీసీఐడీ అధికారులు విచారణకు పిలిచారు. దీంతో హరికుమార్ శుక్రవారం అధికారుల ముందు హాజరై వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్టు సమాచారం. మరో విషయం ఏమిటంటే విశాల్ ఫిర్యాదు కారణంగా ఇప్పుడు తమిళం, తెలుగు సహా ప్రాంతీయ భాషల హిందీ అనువాద చిత్రాలకు చైన్నెలోనే సెన్సార్ సర్టిఫికెట్ అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. చదవండి: ఆ వ్యాధుల వల్ల ఏ పనీ చేయలేకపోతున్నా.. ఫిజియోథెరపీ చేయించుకుంటున్నా -
చిన్నమ్మ.. ఎవరా జ్యోతిష్కుడు?
సాక్షి, చైన్నె: కొడనాడు హత్య, దోపిడీ కేసులో శశికళను విచారణ వలయంలోకి తెచ్చేందుకు సీబీసీఐడీ నిర్ణయించింది. ఆమెతో పాటు మాజీ ఎమ్మెల్యే ఆరుకుట్టి, ఎడపాడిలో ఉన్న ఓ జ్యోతిష్కుడిని కూడా విచారించేందుకు కసరత్తులు మొదలయ్యాయి. దివంగత సీఎం జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌లో 2017లో నవంబర్‌లో జరిగిన వాచ్‌మన్ హత్య, దోపిడీ ఘటన గురించి తెలిసిందే. అన్నాడీఎంకే హయాంలో ఈ కేసును మమా అంటూ ముగించారు. అయితే, ఈ ఘటన వెనుక ఉన్న మిస్టరీని వెలుగులోకి తెచ్చేందుకు తాజాగా డీఎంకే ప్రభుత్వం కంకణం కట్టుకుంది. తొలుత ఐజీ సుధాకర్, డీఐజీ ముత్తుస్వామి నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏడాది కాలంగా విచారించింది. ఆ తర్వాత సీబీసీఐడీకి కేసును అప్పగించారు. ప్రధానంగా మాజీ సీఎం, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళనిస్వామి, ఆయన సన్నిహిత మిత్రుడు ఇలంగోవన్‌ను టార్గెట్ చేసి ఈకేసులో సీబీసీఐడీ దూకుడుగా ముందుకెళుతోంది. గతవారం పళనిస్వామికి భద్రతాధికారిగా పనిచేసిన కనకరాజ్‌ను సీబీసీఐడీ విచారించింది. ఈపరిస్థితులలో ఈకేసులో శశికళ, మాజీ ఎమ్మెల్యే ఆరుకుట్టిని స్వయంగా విచారించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అలాగే, పళనిస్వామి డ్రైవర్‌గా పనిచేసి అనుమానాస్పదంగా గతంలో మరణించిన కనకరాజ్‌కు ఎడపాడిలోని ఓ జ్యోతిష్కుడికి మధ్య సంబంధాలు ఉన్న సమాచారం సీబీసీఐడీ దృష్టికి చేరింది. దీంతో శశికళ, మాజీ ఎమ్మెల్యే ఆరుకుట్టితోపాటు ఆ జ్యోతిష్కుడిని విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మే మొదటి వారంలో వీరిని విచారించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా సమన్ల జారీకి ఏర్పాట్లు జరుగుతుండడం గమనార్హం. అదే సమమయంలో పళనిస్వామి నియోజకవర్గం ఎడపాడికి చెందిన జ్యోతిష్కుడి గురించిన సమాచారం తెరపైకి రావడంతో విచారణలో ఎలాంటి ఆసక్తికర అంశాలు బయటకు రానున్నాయో అన్న ఉత్కంఠ మొదలైంది. అలాగే, గతంలో చిన్నమ్మ వద్ద విచారణ బృందం వాంగ్మూలం సేకరించిన నేపథ్యంలో ప్రస్తుతం ప్రత్యక్ష విచారణకు సిద్ధం కావడం గమనార్హం. -
తమిళనాట ట్విస్ట్.. పన్నీర్‌సెల్వానికి బిగ్ షాక్
సాక్షి ప్రతినిధి, చెన్నై : అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలోకి చొరబడి నష్టం కలిగించిన వ్యవహారంపై పన్నీర్‌సెల్వం, ఆయన అనుచరులకు సమన్లు జారీచేయాలని సీబీసీఐడీ పోలీసులు నిర్ణయించారు. వైద్యలింగం, మనోజ్ పాండియన్ తదితరులకు సైతం సమన్లు పంపనున్నారు. సీబీసీఐడీ డీఎస్పీ నేతృత్వంలోని ఒక బృందం శుక్రవారం పార్టీ కార్యాలయానికి వెళ్లి పరిశీలించింది. చెన్నై వానగరంలో గతనెల 11వ తేదీన జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో ఎడపాడి పళనిస్వామిని తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఇందుకు నిరసనగా పన్నీర్‌సెల్వం సహా ఆయన అనుచర వర్గం తీవ్ర ఆగ్రహంతో చెన్నై రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. కార్యాలయ ప్రధాన ద్వారాన్ని పగులగొట్టిలోనికి జొరబడి ఫరి్నచర్, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారని, ముఖ్యమైన డాక్యుమెంట్లను ఎత్తుకెళ్లారని ఎడపాడి వర్గానికి చెందిన రాజ్యసభ సభ్యుడు సీవీ షణ్ముగం చెన్నై రాయపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇందుకు ప్రతిగా పన్నీర్ వర్గం కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రెండు వర్గాలకు చెందిన చెరో 200 లెక్కన మొత్తం 400 మంది కార్యకర్తలపై పోలీసులు ఏడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసుల విచారణను గ్రేటర్ చెన్నై పోలీసుల నుంచి సీబీసీఐడీ పోలీసులకు అప్పగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం మద్రాసు హైకోర్టుకు తెలిపింది. కార్యాలయంపై దాడి వ్యవహారంపై ఓపీఎస్, ఆయన మద్దతుదారు ముఖ్యనేతలకు వేర్వేరుగా సమన్లు జారీచేసి విచారణ చేపట్టాలని సీబీసీఐడీ నిర్ణయించింది. పన్నీరుసెల్వంకు దర్శకుడు భాగ్యరాజ మద్దతు ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎంకేను అంద రూ కలిసి కాపాడుకోవాలని ప్రముఖ సినీ దర్శకులు భాగ్యరాజా అన్నారు. పారీ్టలో, న్యాయస్థానాల్లో చో టుచేసుకుంటున్న పరిణామాలపై చర్చించేందుకు పన్నీర్‌సెల్వం తన అనుచరులతో శుక్రవారం చెన్నై లో సమావేశమయ్యారు. ఇందులో భాగ్యరాజ పా ల్గొని పన్నీర్‌కు మద్దతు ప్రకటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఒక చిన్న కార్యకర్తలా పార్టీ క్షేమాన్ని కోరుతున్నానని, పారీ్టలోని అన్ని వర్గాలు ఏకం అవుతాయని, ఇందుకు సమయం పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
లైంగిక వేధింపులు: గుండెపోటు అంటూ నాటకం.. వేట మొదలు!
సాక్షి, చెన్నై: విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న శివశంకర్ బాబా కోసం సీబీసీఐడీ వేట మొదలెట్టింది. గుణవర్మన్, జయశంకర్ నేతృత్వంలోని బృందం విచారణపై దృష్టి పెట్టింది. శివశంకర్ బాబా నేతృత్వంలో కేలంబాక్కంలో సాగుతున్న సుశీల్ హరి ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంటున్న హాస్టల్ విద్యార్థినులు ఇచ్చిన ఫిర్యాదుతో ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. దీంతో సీబీసీఐడీ అధికారులు పాఠశాల, ఆశ్రమంలో తనిఖీలు, విచారణను ముమ్మరం చేసింది. తాజా పరిణామాలతో పాఠశాలలో పనిచేస్తున్న పలువురు ఉపాధ్యాయులు రాజీనామా చేశారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం పెద్ద ఎత్తున పాఠశాలకు చేరుకుని టీసీలు తీసుకుని వెళ్లారు. ఆధ్యాత్మిక పర్యటన, గుండెపోటు అంటూ డెహ్రాడూన్‌లోని ఓ ఆస్పత్రిలో శివశంకర్ బాబా చికిత్స పొందుతున్నట్టు సమాచారం వెలువడ్డ విషయం తెలిసిందే. దీంతో ఆయన ఆస్పత్రిలోనే ఉన్నారా..? ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి చెన్నైకు తీసుకొచ్చేందుకు సీబీసీఐడీ చేపట్టింది. చదవండి: లైంగిక వేధింపులు: బయటపడ్డ కీచక బాబా లీలలు -
సీబీసీఐడీకి కీచక వ్యవహారం
సాక్షి, చెన్నై: ప్రత్యేక డీజీపీ రాజేశ్‌దాస్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణ కేసు సీబీసీఐడీకి చేరింది. ఇందుకు తగ్గ ఉత్తర్వులను డీజీపీ త్రిపాఠి ఆదివారం జారీ చేశారు. ప్రత్యేక డీజీపీ రాజేశ్‌దాస్ తనను లైంగికంగా వేధించినట్టు మహిళా ఐఏఎస్ అధికారిణి ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో విచారణ నిమిత్తం విశాఖ కమిటీ రంగంలోకి దిగింది. కాగా ఉన్నతాధికారులకు ఆ మహిళా ఐపీఎస్ ఫిర్యాదు చేయకుండా అనేక మంది అధికారులు అడ్డుకున్నట్టుగా సమాచారం. దీనికి తోడు మానవ హక్కుల కమిషన్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంది. రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని డీజీపీ త్రిపాఠిని మానవహక్కుల కమిషన్ ఆదేశించింది. ఈ వ్యవహారంలో పలువురు అధికారుల ప్రమేయంపై సమాచారం వస్తుండడంతో విచారణ వేగాన్ని పెంచేందుకు డీజీపీ నిర్ణయించారు. దీంతో ఈ కేసును సీబీసీఐడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: ఐపీఎస్‌కు డీజీపీ హోదా అధికారి వేధింపులు -
తలుపులు మూసి చిత్రహింసలు!
సాక్షి, చెన్నై: తమిళనాడులో సంచలనం రేపిన తండ్రీకొడుకుల కస్టడీ మరణాలపై విచారణ కొనసాగుతోంది. తండ్రి, కుమారుడ్ని తలుపుమూసి మరీ పోలీసులు చితక్కొట్టి ఉండడం వెలుగు చూసింది. కానిస్టేబుల్ రేవతి ఇచ్చిన వాంగ్మూలం మేరకు ఐదుగురు పోలీసులపై సీబీసీఐడీ రహస్యంగా గురి పెట్టి అరెస్టు చేసింది. పట్టుబడ్డ ఈ పోలీసుల్ని బుధవారం అర్ధరాత్రి రిమాండ్‌కు తరలించారు. ఇక, గురువారం కోవిల్ పట్టి సబ్జైల్లో మెజిస్ట్రేట్ భారతీ దాసన్ విచారణ సాగించారు. తూత్తుకుడి జిల్లా శంకరన్‌కోవిల్ సమీపంలోని సాత్తాన్ కులం పోలీసుల దాష్టీకానికి తండ్రి జయరాజ్, తనయుడు ఫిలిప్స్ పోలీసు కస్టడీలో మరణించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఎస్ఐలు బాలకృష్ణన్, రఘుగణేష్, కానిస్టేబుల్స్ మురుగన్, ముత్తురాజ్‌లను సీబీసీఐడీ అరెస్టు చేసింది. వీరందర్నీ ప్రస్తుతం మదురై కేంద్ర కారాగారంలోని ఓ నివాసంలో బంధించారు. ఈ కేసులో మరి కొందరు అరెస్టు కావొచ్చన్న సంకేతాలు వెలువడ్డాయి. సీబీసీఐడీ అధికారులు ఎక్కడ లీకులకు ఆస్కారం ఇవ్వని రీతిలో విచారణను వేగవంతం చేశారు.(ఎస్సై చెంప పగలగొట్టిన మహిళ) రేవతి వాంగ్మూలం కీలకం.... మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం ఆదేశాలతో ఆది నుంచి ఈ కేసులో సీబీసీఐడీ దూకుడుగానే ముందుకు సాగుతోంది. ఆ విభాగం ఐజీ శంకర్ నేతృత్వంలోని బృందం రేయింబవళ్లు విచారణను ముమ్మరం చేసింది. తొలుత ప్రధాన నిందితుల్ని అరెస్టు చేసినానంతరం ఈ కేసులో అత్యంత కీలక సాక్షిగా ఉన్న ఆ స్టేషన్ మహిళా కానిస్టేబుల్ రేవతి వద్ద సీబీసీఐడీ వర్గాలు రహస్యంగా విచారణ చేపట్టారు. ఈ కేసులో ఈ ఐదుగురే నిందితులు అన్నది తొలుత భావించినా, ఆ స్టేషన్లో పనిచేసిన మరి కొందరి హస్తం ఉండవచ్చన్న సంకేతాలు వెలువడ్డాయి. రేవతి ఇచ్చిన వాంగ్మూలంలో ఆ స్టేషన్ ఏఎస్ఐ పాల్దురై, హెడ్ కానిస్టేబుల్ చెల్లదురై, కానిస్టేబుల్ థామస్, స్వామిదురై, వేలు ముత్తుల ప్రమేయం వెలుగులోకి వచ్చింది. స్టేషన్ గేట్లు, తలుపులు మూసి వేసి మరీ అర్ధరాత్రి వేళ తండ్రి, కొడుకుల్ని వీరు కూడా చిత్ర హింసలకు గురి చేసినట్టు తేలింది. దీంతో బుధవారం వద్ద వీరి వద్ద విచారణ వీడియో చిత్రీకరణ ద్వారా సాగింది. అర్ధరాత్రి వేళ వీరిని రిమాండ్‌కు తరలించారు. తొలుత ఈ ఐదుగురు కేసుతో తమకు సంబంధం లేదని, అంతా పెద్దలు చేసిన పనే అంటూ గ్రామస్తుల్ని నమ్మించి తప్పించుకు వెళ్లారు. అలాగే, సస్పెండ్ వేటు నుంచి బయట పడ్డాడు. ప్రస్తుతం వీరి బండారం బయట పడడంతో సాత్తాన్ కులం వాసులు ఈ ఐదుగురి మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ఎవరి కంట పడకుండా వీరిని భద్రత బలగాల నడుమ తూత్తుకుడి న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. జైలుకు తరలించేందుకు ముందుగా ఆస్పత్రికి తరలించారు. అయితే, పాల్ దురై, థామస్ తాము జైలుకు వెళ్లమని మారం చేశారు. తమకు షుగర్, బీపీ వంటి వ్యాధులు ఉన్నాయని, ఆస్పత్రిలోనే ఉంటామని భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో న్యాయమూర్తి ఆదేశాలతో ఈ ఇద్దర్ని భద్రత నడుమ ఆస్పత్రికి పరిమితం చేశారు. మిగిలిన వారిని జైలుకు తరలించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇన్స్పెక్టర్ శ్రీధర్ తనకు బెయిల్మంజూరు చేయాలని కోరుతూ గురువారం తూత్తుకుడి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మెజిస్ట్రేట్ భారతీ దాసన్ తన విచారణను కొనసాగిస్తూనే ఉన్నారు. తన విచారణ నివేదికను మదురై ధర్మాసనానికి సమర్పించేందుకు పరుగులు తీశారు. ఆయన కోవిల్ పట్టి సబ్ జైల్లో కొన్ని గంటల పాటు విచారణ నిర్వహించారు. -
‘చిత్తూరు ఘటన సీబీసీఐడీ విచారణకు ఆదేశించాం’
సాక్షి, ప్రకాశం: చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఘటనను సీబీసీఐడీ విచారణకు ఆదేశించామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉద్యోగుల పట్ల పారదర్శకంగా వ్యవహరిస్తోందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య రంగాన్ని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రయత్నిస్తున్నామని వ్యాఖ్యానించారు. ప్రతీ సచివాలయం పరిధిలో ఓ విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేస్తున్నామని ఆళ్ల నాని తెలిపారు. మారు మూల వైద్యశాలలను కూడా ఆధునీకరిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో వైద్య రంగం భ్రష్టు పట్టిందని మండిపడ్డారు. వైద్యశాలలకు, మెడికల్ కళాశాలలకు కావాల్సిన అన్నీ మౌళిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కావాల్సిన వైద్య ఏర్పాట్లకు అన్నీ ప్రతిపాదనలు సిద్ధం చేశామని ఆళ్ల నాని పేర్కొన్నారు. -
వీడియోలతో బ్లాక్ మెయిలింగ్..
సాక్షి, చెన్నై: యువతుల్ని మాయమాటలతో లొంగదీసుకుని, వీడియో చిత్రీకరణ ద్వారా బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతూ, అందింది దోచుకుంటూ వచ్చిన కన్యాకుమారి మన్మ థుడు కాశీ లీలలు సీబీసీఐడీ గుప్పెట్లోకి చేరింది. ఇతగాడిపై రోజురోజుకు ఫిర్యాదులు పెరుగుతుండడంతో కేసును సీబీసీఐడీకి అప్పగిస్తూ డీజీపీ త్రిపాఠి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. (సినిమాలోనే కాదు బుల్లితెరలోనూ అడ్జెస్ట్మెంట్ ) చెన్నైకు చెందిన మహిళా డాక్టరు ఒకరు గత నెల ఇచ్చిన ఫిర్యాదుతో కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్ కేంద్రంగా మన్మథుడు కాశి(26) సాగిస్తూ వచ్చిన లీల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. సామాజిక మాధ్యమాల ద్వారా యువతులు, సంపన్న మహిళల్ని గురి పెట్టి, వారితో సన్నిహితం పెంచుకుని, లొంగ దీసుకోవడమే కాదు, వీడియో చిత్రీకరించి బ్లాక్ మెయిలింగ్ తో సొమ్ము చేసుకుంటూ వచ్చిన ఈ మన్మథుడు కుమరి ఎస్పీ శ్రీనాథ్‌కు అడ్డంగా బుక్కయ్యాడు. ఇతగాడ్ని గూండా చట్టంలో అరెస్టు చేసి విచారించగా, ల్యాప్‌టాప్, పెన్ డ్రైవ్‌లో పదుల సంఖ్యలో యువతులతో గడిపిన వీడియోలు బయట పడ్డాయి. రెండు సార్లు ఇతడ్ని కస్టడికి తీసుకుని విచారించారు.(రఫికా కూతురుపైనా ఆత్యాచారం..? ) ఈ సమయంలో ఐదుగురు యువతులు, ఇద్దరు మహిళలు, ఓ బాలిక, ఓ యువకుడు సైతం కాశిపై ఫిర్యాదు చేయడం గమనార్హం. ఈ కేసుల సంఖ్య ప్రస్తుతం కుమరికే పరిమితం కాకుండా రాష్ట్రంలోని పలు నగరాలకు విస్తరిస్తున్నది. దీంతో కేసును సీబీసీఐడీకి అప్పగించాలని కుమరి ఎస్పీ శ్రీనాథ్ డీజీపీ త్రిపాఠిని కోరారు. ఇందుకు తగ్గ నివేదికను డీజీపీకి పంపించారు. తాము కాశి మీద నమోదు చేసిన గూండా చట్టం, ఇప్పటి వరకు కుమరిలో వచ్చిన ఫిర్యాదులు, ఇతర జిల్లాల్లో వస్తున్న ఫిర్యాదుల గురించి వివరించారు. ఈ కేసులో కాశి అనుచరుడు ఒకడ్ని అరెస్టు చేశామని, మరొకడు విదేశాల్లో ఉన్నాడని, అతడు తప్పించుకోకుండా లుక్ అవుట్ నోటీసు జారీ చేసినట్టు వివరించారు. దీంతో ఈకేసును సీబీసీఐడీకి అప్పగిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. సీబీసీఐడీ ఎస్పీ లేదా, ఏఎస్పీ పర్యవేక్షణలో ప్రత్యేక బృందం ఈకేసును ముందుకు తీసుకెళ్లనుంది. కాశీని మళ్లీ కస్టడికి తీసుకుని విచారించేందుకు సీబీసీఐడీ కసరత్తులు చేపట్టనుంది. -
రెవెన్యూ రికార్డుల తారుమారు
కర్నూలు, కోడుమూరు: అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో సీబీసీఐడీ అధికారులు శోధించే కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. కృష్ణగిరి, రామకృష్ణాపురం, తాళ్ల గోకులపాడు గ్రామాల్లో అగ్రిగోల్డ్ సంస్థ దాదాపు 700 ఎకరాల భూములను కొనుగోలు చేసింది. ఇందులో ఎక్కువగా టీడీపీ నాయకులు అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించిన ఆధారాలను సీబీసీఐడీ అధికారులు సేకరించారు. రెవెన్యూ రికార్డులలో లేని సర్వే నంబర్లను సృష్టించి రిజిస్ట్రేషన్లు చేశారు. అలాగే విస్తీర్ణం తక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువగా చూపి రిజిస్ట్రేషన్ చేశారు. మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ప్రధాన అనుచరుడు, రామకృష్ణాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు పి.దామోదర్‌నాయుడు అగ్రిగోల్డ్‌కు భూములమ్మి..ఆ తర్వాత వాటి రికార్డులను తారుమారు చేసి భార్య వరలక్ష్మీ పేరుమీద పట్టాదారు పాసు పుస్తకం తెచ్చుకున్నాడు. అలాగే దాదాపు 150 ఎకరాల భూములు క్షేత్రస్థాయిలో లేకపోయినప్పటికీ టీడీపీ నాయకులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించినట్లు సీబీసీఐడీ అధికారుల విచారణలో బయటపడింది. అప్ప ట్లో పనిచేసిన తహసీల్దార్లు సత్యం, సూర్యనారాయణ సంతకాలతో రైతులకు భూములు ఉన్నట్లు ధ్రువీకరణ పత్రాలు తీసుకుని.. బోగస్ వ్యక్తులతో రిజిస్ట్రేషన్లు చేయించినట్లు గుర్తించారు. అధికారుల సంతకాలు ఫో ర్జరీవా? నిజమైనవా? తేల్చేందుకు ఫొరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు తెలిసింది. దామోదర్ నాయుడు సోదరుడు పి.వెంకటయ్య, నారాయణ స్వామి, ధనుంజయ, బోయ గిడ్డమ్మలు కలిసి 113, 146/1 సర్వే నంబర్లలోని 13.19 ఎకరాల భూమిని అగ్రిగోల్డ్‌కు చెందిన గోల్డెన్ వుడ్ ట్రేడర్స్ రియల్టర్స్ అండ్ డెవలపర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యజమాని సీతారామారావుకు విక్రయించారు. డాక్యుమెంట్ నంబర్ 1760/2009. వాస్తవానికి సర్వే నంబర్ 146/1 రెవెన్యూ రికార్డులలో లేకపోయినప్పటికీ అందులో 9.07 ఎకరాల భూమి ఉన్నట్లు చూపి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించిన విషయం సీబీసీఐడీ విచారణలో బయటపడింది. అలాగే అగ్రిగోల్డ్‌కు అమ్మిన భూమిలో 4.12 ఎకరాలను దామోదర్ నాయుడు తన భార్య పి.వరలక్ష్మీ పేరిట బదలాయించి..పట్టాదారు పాసు పుస్తకం (ఖాతా నంబర్ 505) కూడా తీసుకున్నారు. సర్వే నంబర్ 149/బీ, 80/1, 137/డీ, 40/2లలో పి.రామాంజినేయులు, కొండేటి పుల్లయ్య, పి.పార్వతమ్మ, బోయ శేషమ్మలకు 22.78 ఎకరాల భూమి ఉన్నట్లు (డాక్యుమెంట్ నెం.4497/2009) చూపి మాతంగి ఇన్ఫ్రా వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులకు రిజిస్ట్రేషన్ చేయించారు. 40/ 2 సర్వే నంబర్లో రెవెన్యూ రికార్డుల ప్రకారం పూర్తి విస్తీర్ణం 2.72 ఎకరాలు మాత్రమే ఉండగా..ఏకంగా 10.61 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించడం గమనార్హం. ప్రస్తుతం అగ్రిగోల్డ్‌కు విక్రయించిన పై సర్వే నంబర్లలో భూముల్లో కేబీ మద్దయ్య (ఖాతా నంబర్ 263), కృష్ణ (1139), బోయ సాయిలీల (1267), మురళీధర్ (ఖాతా నం 932), వల్లె ఓబులేసు (ఖాతా నం 615) సాగులో ఉన్నట్లు రెవెన్యూ అధికారులు పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చారు. రెవెన్యూ రికార్డుల గోల్‌మాల్‌పై సీబీసీఐడీ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నారు. -
ప్రభుత్వ భూముల కబ్జాపై విచారణ
ఇబ్రహీంపట్నం: నగరానికి సమీపం లోని ఇబ్రహీంపట్నంలో అతి విలువైన ప్రభుత్వ భూములు కబ్జాదారుల గుప్పిట్లోకి వెళ్తున్నాయని, దీనిపై సీబీసీఐడీతో విచారణ జరి పించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ భూములను అక్రమంగా కాజేసి ప్లాట్లు చేస్తున్న విషయంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లిస్తుంటే..మన రాష్ట్రంలో ఆర్టీసీని కేసీఆర్ నాశనం చేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలవకుంటే మంత్రులకు పదవులుండవని, ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవని సీఎం కేసీఆర్ హెచ్చరించడాన్ని ఖండించారు. నిజామాబాద్‌లో ఎంపీ స్థానానికి ఆయన కూతురు కవిత ఓడిపోయినప్పుడు కేసీఆర్ ఎందుకు తన పదవికి రాజీనామా చేయలేదని వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. -
సాక్ష్యాన్వేషణలో...
నేరస్తులను పట్టుకోవడానికి క్లూస్ వెతుకుతున్నాడు అరవింద్‌స్వామి. సత్యాన్వేషణ కోసం సాక్ష్యాన్వేషణ చేసి, దోషులకు శిక్ష పడేలా చేయగల చాలా తెలివైన సిబీసీఐడీ ఆఫీసర్ అతను. ‘హరహరమహాదేవకి, ఇరుట్టు అరయిల్ మురట్టు కుత్తు, గజనీకాంత్’ వంటి సినిమాలను తెరకెక్కించిన సంతోష్ పి. జయకుమార్ దర్శకత్వంలో అరవింద్‌స్వామి హీరోగా ఓ థ్రిల్లర్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ఇందులోనే సీబీసీఐడీ ఆఫీసర్ పాత్రలో అరవిందస్వామి నటిస్తున్నారు. ‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. నా గత చిత్రాలకన్నా ఇది భిన్నమైన చిత్రం. హీరో పాత్ర కూడా కొత్తగా ఉంటుంది’’ అన్నారు దర్శకుడు. -
90 శాతం ఆ వీడియోల తొలగింపు
సాక్షి, చెన్నై : పొల్లాచ్చి లైంగిక దాడి వ్యవహారంలో 90 శాతం వీడియోలను తొలగించినట్లు యూట్యూబ్ సంస్థ సీబీసీడీ పోలీసులకు శనివారం వివరణ ఇచ్చింది. ఈ కేసుపై సీబీసీఐడీ పోలీసులు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఇలావుండగా బాధిత యువతుల వీడియోలు ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో వీడియోల వ్యాప్తిని అడ్డుకోవాలని సీబీసీఐడీ పోలీసులు యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ సంస్థలకు లేఖలు పంపారు. రెండు రోజుల క్రితం యూట్యూబ్‌లో మరో ఆడియో విడుదలైంది. అందులో పొల్లాచ్చి ముఠా దాడికి గురైన బాధితురాలినంటూ ఒక యువతి గళం వినిపించింది. అందులో ముఠా ఒక బాలికపై రాత్రంతా లైంగికదాడి జరపగా మృతిచెందిందని, ఆ బాలిక మృతదేహం తిరునావుక్కరసు ఇంటి వెనుక భాగంలో పాతిపెట్టి ఉన్నట్లు తెలిపింది. ఇది ఈ కేసులో మళ్లీ సంచలనం కలిగించింది. ఈ వీడియోలో వాస్తవాల గురించి సీబీసీఐడీ పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీనికి సంబంధించి పోలీసులు మళ్లీ యూట్యూబ్ సంస్థకు లేఖ రాశారు. ఈ ఆడియో పోస్టు చేసిన వ్యక్తి వివరాలు తెలపమని కోరారు. ఇలావుండగా పొల్లాచ్చి సంఘటనకు సంబంధించిన వీడియోలను తొలగించాలని కోరడంతో 90 శాతం వీడియోలు తొలగించినట్లు, మార్ఫింగ్ చేసిన కొన్ని వీడియోలు మాత్రం ఉన్నట్లు యూట్యూబ్ సంస్థ సీబీసీఐడీ పోలీసులకు శనివారం వివరణ ఇచ్చింది. మణివన్నన్‌ను విచారించిన సీబీసీఐడీ పొల్లాచ్చి లైంగిక దాడి కేసులో నిందితుడు మణివన్నన్‌ను పోలీసులు శనివారం విచారణ చేశారు. పొల్లాచ్చి లైంగిక దాడి కేసులో బాధిత కళాశాల విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫైనాన్సర్ తిరునావుక్కరసు సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇలా ఉండగా విద్యార్థిని అన్నపై దాడి చేసిన బార్ నాగరాజ్, సెంథిల్, వసంతకుమార్, బాబు అరెస్టయ్యారు. ఈ కేసులో పరారీలో ఉన్న పొల్లాచ్చి అచ్చిపట్టి ప్రాంతానికి చెందిన మణివన్నన్ (28) గత 25వ తేదీన కోయంబత్తూరు కోర్టులో లొంగిపోయాడు. అతన్ని 11 రోజుల కస్టడీలో విచారణ జరిపేందుకు సీబీసీఐడీ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మణివన్నన్ వద్ద నాలుగు రోజులపాటు విచారణ జరిపేందుకు న్యాయమూర్తి నాగరాజన్ ఉత్తర్వులిచ్చారు. దీంతో మణివన్నన్‌ను పోలీసులు శనివారం కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. -
వెలుగులోకి పొల్లాచ్చి మృగాళ్ల మరో దారుణం!
సాక్షి ప్రతినిధి, చెన్నై: పొల్లాచ్చికి చెందిన నలుగురు మృగాళ్లు లైంగికదాడులే కాదు, ఓ చిన్నారిపై వరుసగా సామూహిక అత్యాచారానికి పాల్పడి ప్రాణాలు కూడా తీసినట్లుగా సామాజిక మాధ్యమాల్లో ఒక ఆడియో వైరల్ అవుతోంది. పొల్లాచ్చిలో తిరునావుక్కరసర్ సహా నలుగురు యువకులు యువతులు, మహిళలతో ఫేస్బుక్ ద్వారా పరిచయాలు పెంచుకుని, ప్రేమ, మాటలతో లోబరుచుకుని లైంగికదాడులకు పాల్పడడం రాష్ట్రంలో కలకలం రేపింది. అంతేగాక తమ వలలో పడిన యువతుల నగ్నదృశ్యాలను, లైంగికదాడులను సెల్‌ఫోన్ వీడియో దృశ్యాలను చిత్రీకరించి పదే పదే లైంగిక హింసకు పాల్పడడం, భయభ్రాంతులకు గురిచేసి సొమ్ముదోచుకోవడం వంటి రాక్షసకృత్యాలకు పాల్పడ్డారు. (చదవండి: భారీ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు) ఇలా వందమందికి పైగా యువతులు తమ ధన, మానాలను కోల్పోగా ఓ చిన్నారి ప్రాణాలను కూడా కోల్పోయిన సమాచారం బాధిత యువతి ఆడియో ద్వారా సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. ‘తిరునావుక్కరసర్ నలుగురు యువకులతోపాటు ఈ ముఠాలో మరో 8 మంది ఉన్నారు. బాధిత యువతుల్లో ఆరుగురు నా వద్ద తలదాచుకుని ఉండేవారు. వారిలోని ఒక చిన్నారిపై ఆ యువకులు పదేపదే లైంగిక దాడులకు పాల్పడడంతో ప్రాణాలు కోల్పోయింది. ఆ చిన్నారి మృతదేహాన్ని వారి పైశాచికత్వానికి సాక్ష్యంగా నిలిచిన ఇంటికి సమీపంలో పూడ్చిపెట్టారు. ఈ ఘోరాన్ని ఎలా బైటపెట్టాలో తెలియక ఇన్నాళ్లు తపించాను. ఇప్పటికి ధైర్యం తెచ్చుకుని ఆడియో ద్వారా వెలుగులోకి తెచ్చాను’ అని ఆమె చెప్పారు. ఈ ఆడియోలోని వివరాలపై ఆరా తీస్తున్నామని సీబీసీఐడీ అధికారి ఒకరు చెప్పారు. మద్రాసు హైకోర్టులో మహిళా న్యాయవాదుల పిటిషన్ రాష్ట్రంలో పెను సంచలనానికి దారితీసిన పొల్లాచ్చి అత్యాచారాల పరంపర కేసును మహిళా పోలీసు ఉన్నతాధికారిచే విచారణ జరిపించేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ మహిళా న్యాయవాదులు మద్రాసు హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. న్యాయవాదులు అజిత, ఆదిలక్ష్మి లోకమూర్తి, సుధ దాఖలు చేసిన పిటిషన్లో వివరాలు ఇలా ఉన్నాయి. పొల్లాచ్చి లైంగికవేధింపులకు గురైన యువతి పేరును బైటపెట్టడం ద్వారా బాధితులకు రక్షణ కల్పించే విషయంలో తమిళనాడు ప్రభుత్వం విఫలమైంది. అంతేగాక బాధిత యువతి కేసు విషయంలో విశ్వాసాన్ని కోల్పోయింది. అంతేగాక బాధిత యువతులు, వారి కుటుంబీకులకు తగిన రక్షణ కల్పించడంలో కూడా తగిన హామీని ఇవ్వలేకపోయింది. ఈ కారణాల వల్ల సీబీఐలోని ఉన్నత మహిళాఅధికారిచే కేసు విచారణ చేపట్టేలా ఆదేశించాలి. బాధిత యువతులకు మానసిక స్థైర్యంకల్పించేలా మానసిక నిపుణులచే కౌన్సెలింగ్, వైద్య సదుపాయం, న్యాయపరమైన తోడ్పాటు కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలి. బాధిత యువతులకు సాక్షులకు భద్రత చట్టం కింద రక్షణ కల్పించాలి. విద్యాసంస్థల్లో అవగాహనా శిబిరాలు నిర్వహించాలని వారు కోరారు. ఈ పిటిషన్‌పై ఈనెల 29న విచారణను చేపట్టనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి తహీల్ రమణి, న్యాయమూర్తి దురైస్వామిలతో కూడిన బెంచ్ ప్రకటించింది. చదవండి...(పొల్లాచ్చి కేసు : మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాలు) డీఎంకే నేత కుమారుడికి సీబీసీఐడీ సమన్లు ఇదిలా ఉండగా, పొల్లాచ్చి ఘటనపై డీఎంకే నేత కుమారుడికి సీబీఐ సమన్లు జారీచేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు తిరునావుక్కరసర్ ఇచ్చిన వాంగ్మూలాన్ని అనుసరించి ఈనెల 28వ తేదీన విచారణకు హాజరుకావాల్సిందిగా డీఎంకే పొల్లాచ్చి నగర ఇన్చార్జ్ తెన్రల్ సెల్వరాజ్ కుమారుడు మణిమారన్‌కు సీబీసీఐడీ పోలీసులు మంగళవారం సమన్లు జారీచేశారు. బాధిత యువతి అన్నపై దాడిచేసిన కేసులో అరెస్టయి బెయిల్‌పై బైటకువచ్చిన బార్ నాగరాజ్ సైతం ఆదేరోజున విచారణకు హాజరుకావాల్సిందిగా సమన్లు పంపారు. -
చిత్తూరు జిల్లా జైలుకు నౌహీరా
చిత్తూరు అర్బన్: హీరా గ్రూపుల సంస్థ అధినేత్రి నౌహీరా షేక్‌ను ఏపీ సీబీసీఐడీ పోలీసులు గురువారం చిత్తూరు జిల్లా కోర్టుకు తీసుకొచ్చారు. మదన పల్లెకు చెందిన నౌహీరా.. హీరా గ్రూపుల్లో అక్రమ మార్గాల ద్వారా ప్రజల నుంచి పెట్టుబడులు సేకరించి, వినియోగదారులను మోసం చేశారంటూ గతే డాది అక్టోబర్‌లో చిత్తూరు జిల్లా కలకడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల హీరా మోసాలపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో కేసు విచారణను ప్రభుత్వం సీబీసీఐడీ పోలీసులకు అప్పగించింది. హైదరాబాద్‌లోని నాంపల్లిలోనూ ఇదే తరహా ఫిర్యాదు అందడంతో తెలంగాణ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. దాని తర్వాత మనీ లాండరింగ్ కింద ముంబైకు చెందిన పలువురు హీరాపై పోలీసులు ఫిర్యాదు చేయగా.. వారెంటుపై నాంపల్లి నుంచి హీరాను ముంబై మహి ళా సెంట్రల్ జైలుకు తరలించారు. తాజాగా కలకడలో ఉన్న కేసులో సీబీసీఐడీ పోలీసులు హీరాను ముంబై నుంచి చిత్తూరులోని జిల్లా న్యాయస్థానంలో హాజరుపరిచారు. దీంతో నౌహీరాకు ఈ నెల 10 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి కబర్ది ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆమెను జిల్లా జైలుకు తరలించారు. మరోవైపు రూ. వేల కోట్లలో జరిగిన హీరా గ్రూపు లావాదేవీల్లో ఉగ్రవాద సంస్థల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో నౌహీరాను తమ కస్టడీకి అప్పగించాలని సీబీసీఐడీ పోలీసులు చిత్తూరు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, దీనిపై న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టనుంది. -
పెద్దల కోసమే విద్యార్ధినుల్ని ప్రేరేపించి..
సాక్షి, చెన్నై : విద్యార్ధినుల్ని ప్రేరేపించి, ఒత్తిడి తెచ్చి మరీ తప్పుడు మార్గంలో పయనింపచేయడానికి ప్రొఫెసర్ నిర్మలాదేవి చేసిన ప్రయత్నానికి సంబంధించి రోజుకో రూపంలో వెలువుడుతున్న వాంగ్మూలం అంతా కట్టు కథ అని మురుగన్ న్యాయవాది సురేష్ స్పష్టంచేశారు. సీబీసీఐడీ ఓ కట్టుకథను సృష్టించి, దానిని చార్జ్ షీట్‌గా పేర్కొంటూ, మీడియాను తప్పుదారి పట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము నిర్ధోషులం అని, తమను ఈ కేసు నుంచి విడుదల చేయాలని కోరుతూ నిర్మలాదేవి అండ్ బృందం విరుదునగర్ కోర్టును గురువారం ఆశ్రయించింది. విరుదునగర్ జిల్లా అరుప్పుకోట్టై దేవాంగుర్ కళాశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినుల్ని లైంగిక ప్రేరణకు గురిచేయడానికి అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి సాగించిన వ్యవహారం ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎవరో పెద్దల కోసమే ఆమె విద్యార్థినుల మీద ఒత్తిడి తెచ్చినట్టు తొలుత ప్రచారం సాగింది. ఈ వ్యవహారంలో పెద్దలు అనేకమంది ఉన్నట్టుగా వచ్చిన ఆరోపణలతో కేసును సీబీసీఐడీకి అప్పగించారు. ఈ కేసులో నిర్మలాదేవితో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ మురుగన్, పరిశోధక విద్యార్థి కరుప్ప స్వామిలను అరెస్టుచేశారు. ఈకేసును విచారిస్తున్న సీబీసీఐడీ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ చార్జ్‌షీట్, విచారణలో వారు ఇచ్చిన వాంగ్మూలం మేరకు వివరాలు అంటూ సరికొత్త తరహా కథనాలు మీడియాల్లో వెలువడుతున్నాయి. ఈ కథనాలన్నీ సీబీసీఐడీ సృష్టిగా పేర్కొంటూ, మురుగన్ తరపు న్యాయవాది సురేష్ మీడియా ముందుకు వచ్చారు. బలి పశువులుగా.. కోర్టు విచారణకు హాజరవుతూ వస్తున్న నిర్మలాదేవి, మురుగన్, కరుప్పస్వామి తాము వాంగ్మూలం ఇచ్చినట్టు ఏ సందర్భంలోనూ పేర్కొనలేదని వివరించారు. ఈ కేసులో ఎవర్నో పెద్దల్ని రక్షించే ప్రయత్నంలో ఇద్దర్ని బలి పశువులు చేయడానికి సీబీసీఐడీ సిద్ధం అయిందని ఆరోపించారు. ఆ ఇద్దరే మురుగన్, కరుప్పు స్వామిలగా పేర్కొన్నారు. ఈ ఇద్దర్నీ కేసులో ఇరికించేందుకు రోజుకో కథనం మీడియాల్లోకి ఎక్కుతోందని ఆరోపించారు. ఇది సీబీసీఐడీ సృష్టించిన కట్టు కథ అని, ఇది తమ కేసుకు ఉపయోగపడే రీతిలో మీడియాను సీబీసీఐడీ వాడుకుంటోందని ధ్వజమెత్తారు. ఈ కట్టు కథను నమ్మవద్దు అని సూచించారు. కాగా, ఈ కేసులో తాము నిర్ధోషులం అని, తాము తప్పుచేసినట్టు ఎలాంటి ఆధారాలు లేవని, అయితే, తమను బలవంతంగా మదురై కారాగారంలో బంధించారని, తమ విడుదలకు ఆదేశాలు ఇవ్వాలని, లేదా బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నిర్మలాదేవి, మురుగన్, కరుప్పుస్వామి విరుదునగర్ కోర్టును ఆశ్రయించడం గమనార్హం. -
గుంటూరులో మైనింగ్ అక్రమాలపై సీబీసీఐడీ విచారణ
-
మైనింగ్ అక్రమాలపై సీబీసీఐడీ విచారణ
సాక్షి, గుంటూరు: పల్నాడులో అధికార పార్టీ ఎమ్మెల్యే కనుసన్నల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్ మరో మలుపు తిరిగింది. ఈ వ్యవహారాన్ని సీబీసీఐడీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు మైనింగ్ డీడీ పాపారావు, దాచేపల్లి మైనింగ్ ఏడీ జగన్నాధరావులపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వంలో కొనసాగుతున్న వారిని సీబీసీఐడీ విచారిస్తుందా? గురజాల నియోజకవర్గంలో అక్రమ క్వారీయింగ్ అంతా అధికార పార్టీ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు ప్రభుత్వ పెద్దలకు స్పష్టంగా తెలిసినా ఈ వ్యవహారంలో ఉద్యోగులను బలి పశువులుగా మార్చే కుట్ర జరుగుతోంది. సీబీఐ విచారణకు సర్కారు జంకుతోంది. మైనింగ్ మాఫియాపై హైకోర్టు కన్నెర్ర చేయడం, ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ ఆందోళనలు నిర్వహించడంతో ఉలిక్కిపడ్డ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులు, మిల్లర్లకు నోటీసులు జారీ చేస్తోంది. మైనింగ్ ద్వారా కోట్లు గడించిన వారిని వదిలేసి వారి వద్ద పనిచేసే కూలీలు, ట్రాక్టర్ డ్రైవర్లు, సూపర్వైజర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తోంది. గతంలో పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో పనిచేసిన తహశీల్దార్లు, వీఆర్వోలు, గ్రామ కార్యదర్శులు, మైనింగ్ అధికారులకు సోమవారం షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మైనింగ్ డీడీ, ఏడీపై సస్పెన్షన్ వేటు వేసి అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని సీబీసీఐడీకి అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని గమనిస్తే పెద్దల పాత్ర బయటకు రాకుండా కాపాడే యత్నాలు జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వంలో కొనసాగుతున్నవారిని సీబీసీఐడీ విచారించగలుగుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లెక్కలు దాచిపెట్టి కార్మికులపై చర్యలు టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమ మైనింగ్ యథేచ్ఛగా సాగుతున్నా స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుండటంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూసేందుకు కూడా సాహసించలేదు. ఈ వ్యవహారంపై హైకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహంవ్యక్తం చేయడంతోపాటు సీబీఐ, కాగ్, కేంద్ర గనుల శాఖను ప్రతివాదులుగా చేర్చడంతో ఉలిక్కిపడ్డ రాష్ట్ర ప్రభుత్వం బలి పశువుల కోసం రంగంలోకి దిగింది. మైనింగ్ మాఫియా అక్రమంగా దోచుకున్న వేల కోట్ల విలువ చేసే సున్నపురాయి లెక్కలను దాచిపెట్టి కార్మికులపై చర్యలకు ఉపక్రమించింది. ఉద్యోగులపై వేటు వేయడం ద్వారా అక్రమ మైనింగ్ వ్యవహారంలో తాము అన్ని చర్యలు చేపట్టామని న్యాయస్థానానికి నివేదించేందుకే కంటి తుడుపు చర్యలకు దిగినట్లు భావిస్తున్నారు. సీబీఐ విచారణకు ఆదేశించాలి రాష్ట్ర ప్రభుత్వం తన ఆధీనంలో నడిచే సీబీసీఐడీ విచారణకు ఆదేశించి సరికొత్త డ్రామా మొదలు పెట్టింది. అక్రమ మైనింగ్‌లో టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ పెద్దల పాత్ర లేకుంటే సీబీఐ విచారణకు ఎందుకు జంకుతోంది? ఉన్నతాధికారులకు మా పార్టీ నేతలు పలుమార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకుండా ఇప్పుడు మైనింగ్ ఉద్యోగులపై చర్యలకు దిగటాన్ని బట్టి కేసును నీరుగార్చే కుట్ర జరుగుతోందని స్పష్టమవుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై చర్యలు చేపట్టకుండా ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం ఏమిటి? మైనింగ్ మాఫియాపై సీబీఐ విచారణకు ఆదేశించాలి. – కాసు మహేష్‌రెడ్డి (వైఎస్సార్సీపీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త) -
ఉచ్చులో మరో ఇద్దరు ప్రొఫెసర్లు
టీ.నగర్: ప్రొఫెసర్ నిర్మలాదేవి వ్యవహారంలో మరో ఇద్దరు ప్రొఫెసర్లకు సంబంధం ఉన్నట్లు సీబీసీఐడీ విచారణలో తేలింది. విద్యార్థినులను లైంగికంగా ఒత్తిడిచేసిన వ్యవహారంలో ప్రొఫెసర్ నిర్మలాదేవి అరెస్టయిన విషయం తెలిసిందే. ఈమె వద్ద సీబీసీఐడీ పోలీసులు జరిపిన విచారణ ఆధారంగా నిర్మలాదేవితో సంబంధం ఉన్న ప్రొఫెసర్ మురుగన్, పరిశోధక విద్యార్థి కరుప్పసామిలను ఇదివరకే అరెస్టు చేశారు. ఇప్పటివరకు జరిపిన విచారణలు, వాంగ్మూలాలు, పత్రాల ఆధారంగా మధ్యంతర చార్జిషీటును కోర్టులో దాఖలు చేసేందుకు సీబీసీఐడీ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. నిర్మలాదేవి వ్యవహారంలో మరో ఇద్దరు ప్రొఫెసర్లకు సంబంధాలు ఉన్నట్లు గురువారం సమాచారం అందింది. వీరికి సమన్లు పంపి అరెస్టు చేసేందుకు సీబీసీఐడీ అధికారులు నిర్ణయించారు. -
వటోలి నిందితులపై కేసు కొట్టివేత
సాక్షి, ఆదిలాబాద్: వటోలి కేసులో ఆదిలాబాద్ కోర్టు నిందితులపై కేసును కొట్టివేసింది. నిందితులపై నేరారోపణలు నిరూపించడానికి సీబీసీఐడీ తగిన సాక్ష్యాలు చూపించడంలో విఫలమైందని సోమవారం ఆదిలాబాద్ మొదటి అదనపు జిల్లా సెషన్స్‌కోర్టు ఇన్చార్జి జడ్జి అరుణసారిక కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చారు. 2008లో భైంసా మండలం వటోలిలో ఒకే వర్గానికి చెందిన ఆరుగురు నిద్రిస్తున్న గుడి సెకు రాత్రి నిప్పుపెట్టి చంపిన ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. కేసు పుర్వాపరాలు.. 2008 అక్టోబర్ 11, 12 మధ్యరాత్రి వటోలి లోని ఓ గుడిసెలో మహబూబ్‌ఖాన్(55), ఫసియా ఖానమ్(50), రిజ్వాన బేగం(22), మీనమ్ఖాన్(3), అస్లమ్‌ఖాన్ (6), శబామాహిన్ (2) గుడిసెలో నిద్రిస్తున్న సమయం లో గ్రామానికి చెందిన కొంతమంది సజీవ దహనం చేశారని భైంసా పోలీసులు కేసు నమోదు చేశారు. అదే గ్రామానికి చెందిన హిందూవాహిని కార్యకర్తలుగా భావిస్తున్న కుంచల్‌వార్ చంద్రభాన్, జాదవ్ వినోద్, అడబాగి చంద్రకాంత్, జాదవ్ అవధూత్, జాదవ్ భగవంత్‌రావు, సూర్యవంశి రామానంద్, జాదవ్ వినాయక్, కుంచల్‌వార్ నాగనాథ్, భైంసాకు చెందిన శిండే డిగంబర్లపై హత్యారోపణల కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వం ఈ కేసును హైదరాబాద్ సీబీసీఐడీకి అప్పగించింది. 2009లో సీబీసీఐడీ పోలీసులు కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. అప్పటి నుంచి కేసు విచారణ కొనసాగింది. 60 మంది సాక్షులను విచారించింది. నిందితులపై సాంకే తికంగా నేర నిరూపణకు సీబీసీఐడీ సాక్ష్యాలను చూపలేకపోయింది. -
అగ్రిగోల్డ్‌పై అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
అమరావతి: అగ్రిగోల్డ్ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం అసెంబ్లీలో ప్రకటన చేశారు. బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. స్థిరాస్తి వ్యాపారంతో ప్రజలకు ఎ అధిక వడ్డీ ఆశ చూపి 32లక్షల 2వేల 607మంది నుంచి రూ.6380 కోట్ల డిపాజిట్లు సేకరించారన్నారు. మొత్తం 9 రాష్ట్రాల్లో 32లక్షల మంది బాధితులు ఉన్నారన్నారు. అగ్రిగోల్డ్‌పై 2014లో పశ్చిమగోదావరి జిల్లాలో తొలికేసు నమోదు అయినట్లు చంద్రబాబు తెలిపారు. అలాగే వివిధ జిల్లాల్లో పాటు కర్ణాటక, ఒడిశా, తమిళనాడులో అగ్రిగోల్డ్‌పై బాధితులు ఫిర్యాదు చేశారన్నారు. 2015 జనవరిలో ఈ కేసును సీబీసీఐడీకి అప్పగించినట్లు చెప్పారు. 2016 నుంచి అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం ప్రారంభమైందన్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 19 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారని, వారి నుంచి సుమారు 4వేల కోట్ల రూపాయిలు డిపాజిట్లు సేకరించినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. విచారణ జరగుతుండగా తెలంగాణలో కొంతమంది కోర్టును ఆశ్రయించారని, కోర్టు నియమించిన కమిటీ ద్వారా అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం ప్రారంభించారన్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఆస్తుల వేలం ప్రక్రియ కొనసాగుతోందని సీఎం తెలిపారు. అగ్రిగోల్డ్ చేతిలో మోసపోయి ఆత్మహత్యలు చేసుకున్నవారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షలు చెల్లించాలని నిర్ణయించినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఆర్థిక నేరాల విచారణకు ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేశామని నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. మోసపోయిన బాధితులందరికీ న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఈ కేసులో ఇప్పటికే తొమ్మిదిమందిని అరెస్ట్ చేసినట్లు చంద్రబాబు తెలిపారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల ఆచూకీ తెలిపితే రూ.10 లక్షల ప్రోత్సాహం ఇస్తామన్నారు. అవసరం అయితే సీబీఐ విచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అలాగే ఎర్రచందనం స్మగ్లర్లను వదిలిపెట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు. -
కడచూపు కరువు!
► మిగిలింది మట్టే ► మురుగంపట్టిలో కన్నీటి ఘోష ► 19కి చేరిన మృతుల సంఖ్య ► రంగంలోకి సీబీసీఐడీ ► వెలుగులోకి యాజమాన్య నిర్లక్ష్యం ► సాంకేతిక సమస్యతోనే పెను ప్రమాదం సాక్షి, చెన్నై : ‘గుర్తు పట్టేందుకు వీలులేనంతంగా ఛిద్రమైన శరీరాలు.. మట్టిలో కలిసిన అవయవాలు.. ప్రతి గుండె బరువెక్కేంతగా హృదయ విదారకర పరిస్థితులు’. ఇది మురుగంపట్టిలో దర్శనం ఇస్తు న్న దృశ్యాలు. తమ వాళ్ల కడచూపు కూడా దక్కని దృష్ట్యా, బాధిత కుటుంబాల కన్నీటి వేదనకు హద్దే లేదు. చివరకు తమకు మిగిలింది మట్టే అన్నట్టుగా అక్కడి మట్టిని కొంత తవ్వి, అదే తమ వారి భౌతిక కాయం అంటూ అంత్యక్రియలకు తీసుకెళ్తుండడం బట్టి చూస్తే, పేలుడు తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. తిరుచ్చి జిల్లా తురైయూర్ సమీపంలోని మురుగంపట్టిలోని వెట్రివేల్ రసాయన కర్మాగారంలో గురువారం భారీ పేలుడు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతులు 18 మంది అని అధికార వర్గాలు తేల్చాయి. తొలి రోజు సహాయక చర్యలకు వర్షం అడ్డంకిగా మారడంతో రెండో రోజైన శుక్రవారం కూడా రెస్క్యూ ఆపరేషన్ తీవ్రంగానే సాగింది. నాలుగు ప్రొక్లైనర్లను తీసుకొచ్చి మరీ మృతదేహాల కోసం గాలించాల్సిన పరిస్థితి. కర్మాగారంలో పనిచేస్తున్న తమ అబ్బాయి ప్రవీణ్ కన్పించడం లే దంటూ సేలం నుంచి కుటుంబీకులు ఇచ్చిన సమాచారంతో మృతుల సంఖ్య 19కు చేరినట్టు అరుుంది. అరుుతే, మిగిలిన పదిహేను మృతదేహాల్ని గుర్తిం చేం దుకు వీలు కూడా లేదని అధికార వర్గాలు తేల్చాయి. ఎక్కడికక్కడ శరీర అవయవాలు ఛిద్రమై మట్టిలో కలవడం, పేలుడు దాటికి భవనం కుప్పకూలడమే కాకుండా, అక్కడి రసాయనాలు, యాసిడ్ కారణంగా చెలరేగిన మంటల కారణంగా ఆచూకీ తేల్చడం కష్టతరంగా మారింది. దీంతో అక్కడికి చేరుకున్న బాధిత కుటుంబాల కన్నీటి రోదనకు హద్దే లేదు. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదు. తమ వాళ్ల కడచూపు కూడా దక్కకుండా చేశారంటూ తిట్టి పోస్తూ, రోదించే వాళ్లు కొందరు అరుుతే, జరిగింది జరిగి పోరుుందంటూ ఆవేదన వ్యక్తం చేసే వాళ్లు మరి కొందరు. చివరకు తమకు మిగిలింది మట్టే అంటూ పలు కుటుంబాలు పేలుడు జరిగిన ప్రదేశం నుంచి కొంత మేరకు మట్టిని తవ్వి అవే తమ వారి మృతదేహాలుగా భావించి, అంత్యక్రియలు జరుపుకునేందుకు బరువెక్కిన హృదయాలతో ముందుకు సాగారు.రంగంలోకి సీబీసీఐడీ: పేలుడు ఘటన ఎలా జరి గిందో అంతు చిక్కని దృష్ట్యా, కేసును సీబీసీఐడీకి అ ప్పగించారు. ఆ విభాగం వర్గాలు శుక్రవారం పేలుడు జరిగిన పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఆ గ్రామాల ప్రజలతో మాట్లాడేందుకు యత్నించారు. అరుుతే, ఫ్యాక్టరీకి శాశ్వత తాళం వేయాల్సిందేనంటూ గ్రామస్తులు డిమాండ్ చేయడంతో అధికారులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. కాగా, సాంకేతిక కారణాలను సరి చేయడంలో యాజమాన్యం విఫలం అవుతుండడం వల్లే భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చినట్టుగా విచారణలో తేలింది. 22 ఏళ్ల క్రితం యాభై ఎకరాల విస్తీర్ణంలో వెట్రివేల్ రసాయన కర్మాగారం ఏర్పాటు చేసినట్టు తేలింది. ఇక్కడి ఏడు యూనిట్లలోని ఒక్కో యూనిట్లో ఒక్కో రకం పేలుడుకు ఉపయోగించే ముడిసరుకు తయారు అవుతున్నట్టు వెలుగుచూ సింది. పేలుడు జరిగిన యూనిట్లో భారీ విస్పోటనాలకు ఉపయోగించే పీఈటీ నైట్రేట్ అనే ముడిసరుకు తయారు అవుతున్నట్టు, రాత్రి షిఫ్ట్‌లో ఉన్న వాళ్లు టెంపరేచర్ లీక్‌ను గుర్తించి సంబంధిత విభాగానికి సమాచారం ఇచ్చినట్టే తేలింది. అరుుతే, దానిని సరిచేయలేదు. ఉదయం షిఫ్ట్‌లో పనికి వచ్చిన వాళ్లకు ఆ లీక్ విషయం తెలియనట్టు సమాచారం. దీంతో టెంపరేచర్‌ను పెంచే క్రమంలోనే ఈ విస్ఫోటనం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. అక్కడి యూనిట్లు పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల క్రితం నెలకొల్పినట్టు, వా టిలో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నా, వా టిని పూర్తి స్థారుులో కాకుండా , తాత్కాలికంగా సరిచేయడం వల్లే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిం దని గాయపడ్డ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము పదే పదే యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా, పర్యవేక్షణ లోపం కారణంగా, ప్రస్తుతం సహచరులను కోల్పోయామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
లారీల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసు సీబీసీఐడీకి బదిలీ
-మంగళగిరి కార్యాలయంలో వివరాలు సేకరణ -త్వరితగతిన విచారించి నిందితులను జైలుకు పంపుతాం -సీబీసీఐడీ ఎస్పీ కె.వి.మోహనరావు మంగళ గిరి(గుంటూరు జిల్లా) లారీలు లేకుండా అక్రమంగా రిజస్ట్రేషన్లు ఎందుకు చేయాల్సివచ్చింది.. దాని వెనుక ఉన్న సూత్రధారులెవరు.. పాత్రధారులెవరనే అంశంపై లోతుగా విచారించి సాక్ష్యాలు సేకరించి నిందితులను జైలుకు పంపుతామని సీబీసీఐడీ ఎస్సీ కె.వి.మోహనరావు చెప్పారు. ఈ ఏడాది జూలై 11న 27లారీలు లేకుండానే కొందరు తమ పేరిట రిజస్ట్రేషన్లు చేయించుకోగా.. చేసిన గుంటూరు జిల్లా మంగళగిరి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శివనాగేశ్వరరావు సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రవాణశాఖ ఈ కేసును సీబీసీఐడీకి బదిలీ చేసింది. ఇందులో భాగంగా గురువారం మంగళగిరి ఎంవీఐ కార్యాలయానికి చేరుకున్న ఎస్పీ మోహనరావు ఇన్చార్జి ఎంవీఐ బాలకృష్ణను అడిగి వివరాలు సేకరించారు. ఎంవీఐతో కలిసి విధులు నిర్వహించిన సిబ్బంది స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మోహనరావు మాట్లాడుతూ.. సీఐడీ అధికారులను నాలుగు బృందాలుగా నియమించి విజయవాడ, మంగళగిరిల్లోని నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు కేసులో ఎనిమిది మంది నిందితులుగా ఉన్నారని, విచారణ వేగంగా చేసి అందరినీ సాక్ష్యాధారాలతో అరెస్టు చేస్తామని చెప్పారు. మంగళగిరి పట్టణంలోని కొప్పురావు కాలనీ చిరునామాతో అనీల రవీంద్రనాథ్ 12 లారీలు, పొట్లూరి ఆనంద రవిశంకర్ 10 లారీలు, జూపల్లి పద్మావతి 2, నూతక్కి గ్రామం చిరునామాతో ఎలిశెట్టి లక్ష్మీనారాయణ 3 లారీలను కొనుగోలు చేసినట్లు రిజస్ట్రేషన్ చేయించగా.. వారికి విజయవాడ జాస్పర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కొనుగోలు చేసినట్లు నకిలీ పత్రాలను అందజేసిందన్నారు. విజయవాడ ఆటోనగర్‌కు చెందిన తరుణోమయ బాడీ బిల్డింగ్ కంపెనీ లారీలకు బాడీలు తయారుచేసినట్లు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వగా.. స్టార్ వేబ్రిడ్జి లారీల కాటా పత్రాలను సమకూర్చిందన్నారు. వారందరికీ ఎంవీఐ శివనాగేశ్వరరావు సహకరించడంతో ఇరవై నాలుగు గంటలలో మొత్తం వ్యవహారం నడిచిందని తెలిపారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంతో సంబంధం ఉన్న నిందితులందరికీ శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆయన వెంట సీఐలు రామచంద్రరావు, ఇంద్ర శ్రీనివాసరావు, సిబ్బంది ఉన్నారు. -
విద్యార్థినుల 'మిస్టరీ' హత్య కేసు సీఐడీకి
- డీఎస్పీ బాలు జాదవ్‌కు దర్యాప్తు బాధ్యతలు నర్సంపేట: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించి ఇంకా మిస్టరీగానే ఉండిపోయిన ఆశ్రమ పాఠశాల విద్యార్థినుల హత్యకేసు దర్యాప్తు సీబీసీఐడీ విభాగానికి బదిలీ అయింది. రెండు నెలలు కావస్తున్నప్పటికీ నిందితులను వెదికిపట్టుకోవడంలో జిల్లా పోలీసులు విఫలం కావడంతో సీఐడీ దర్యాప్తు అనివార్యమైంది. చనిపోయిన బాలికల తల్లిదండ్రులు 20 రోజుల కిందట డీజీపీ అనురాగ్‌శర్మను కలసి దర్యాప్తును వేగవంతం చేయాలని వినతిపత్రం అందించారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు బాధ్యతలను సీఐడీ డీఎస్పీ బాలుజాదవ్‌కు అప్పగించారు. రెండు రోజుల కిందటే ఉత్తర్వులు జారీ అయ్యాయని, మేడారం జాతర బందోబస్తులో ఉండడం వల్ల బాధ్యతలు తీసుకోలేకపోయానని, అతి త్వరలోనే కేసును టేకప్ చేస్తానని డీఎస్సీ జాదవ్ 'సాక్షి'కి తెలిపారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మూడుచెక్కలపల్లె గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోన్న భానోత్ భూమిక, భానోత్ ప్రియూంకలను గుర్తుతెలియని దుండగులు అతికిరాతకంగా చంపి, పూడ్చిపెట్టిన ఉదంతం గత ఏడాది డిసెంబర్ 27న వెలుగులోకి వచ్చింది. చెన్నారావుపేట వుండలం ఖాదర్‌పేట గుట్ట వద్ద కుళ్లిపోయిన స్థితిలో ఆ ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. పోలీసులకు సవాల్‌గా నిలిచిన ఈ ఘటనకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి వివరాలు తెలియరాలేదు. -
చిక్కుల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు
సాక్షి, చెన్నై: రాజకీయ వేధింపులు, ఉన్నతాధికారుల ఒత్తిళ్లు వెరసి కింది స్థాయి అధికారులు ఆత్మహత్యల బాట పడుతున్నారు. ముత్తుకుమార స్వామి మరణించారో లేదో, ఉన్నతాధికారుల వేధింపులతో ధర్మపురిలో మరో ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నారు. రాజకీయ వేధింపులతోనే తాను ఆత్మహత్యాయత్నం చేసినట్టుగా తిరుచ్చి వైద్యుడు స్పష్టం చేశారు. రాజకీయ వేధింపులతో తిరునల్వేలి జిల్లాలో వ్యవసాయ శాఖ ఇంజనీరు ముత్తుకుమార స్వామి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీసీఐడీ ఇప్పటికే మాజీ మంత్రి అగ్రి కృష్ణమూర్తి, వ్యవసాయ శాఖ ప్రధాన ఇంజనీరింగ్ అధికారి సెంథిల్‌ను అరెస్టు చేసి ఉన్నారు. విచారణలో వెలుగు చూసిన అంశాల మేరకు వ్యవసాయ శాఖలో ఖాళీల భర్తీలో భారీ ఎత్తున అవినీతి తాండవం చేసినట్టు తేలి ఉన్నది. రాష్ట్రవ్యాప్తంగా 119 పోస్టుల భర్తీకి ఒక్కో పోస్టుకు 1.75 లక్షల చొప్పున ప్రధాన ఇంజనీర్ సెంథిల్ వసూళ్లు చేసి, మొత్తం రెండు కోట్లకు పైగా నగదును అగ్రికృష్ణమూర్తికి ఇచ్చి ఉన్నట్టు విచారనలో వెలుగు చూసి ఉన్నది. అలాగే, కన్యాకుమారి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఒకరికి ఈ కేసుతో సంబంధం ఉన్నట్టు విచారనలో తేలి ఉన్నది. ఆ ఎమ్మెల్యే ఏకంగా ముత్తుకుమార స్వామిని తన అనుచరుల్ని పంపి బెదిరించి కిడ్నాప్ యత్నం కూడా చేసినట్టు సమాచారం అందడటంతో ఆ ఎమ్మెల్యేను అరెస్టు చేయడానికి రంగం సిద్ధం అవుతోన్నది. అలాగే, మరో ముఖ్య నేతను సైతం అదుపులోకి తీసుకుని విచారించేందుకు కసరత్తులు జరుగుతున్నది. ఈ పరిస్థితుల్లో ధర్మపురిలో ఉన్నతాధికారుల వేదింపులో ఓ కింది స్థాయి ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవడం మరింత చర్చకు దారి తీసి ఉన్నది. ఆత్మహత్య : ధర్మపురి జిల్లా కంబై నల్లూరు పట్టణ పంచాయతీ కార్యాలయ అసిస్టెంట్‌గా ఆది(45) పనిచేస్తున్నాడు. గత నెల రోజులుగా ఆయన మరో ఊరికి డిప్యూటేషన్ మీద వెళ్లారు. రెండు రోజుల క్రితం మళ్లీ కంబై నల్లూరులో తన విధుల్ని నిర్వర్తించే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఆది తన ఇంట్లో ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన సోదరుడి ఆత్మహత్యకు పట్టణ పంచాయతీ కార్యాలయంలోని ఉన్నతాధికారుల వేదింపులే కారణం అని ఆది తమ్ముడు తంగ వేల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సోదరుడ్ని మానసికంగా హింసించారని, డిప్యూటేషన్ల పేరిట ఇతర ఊర్లకు పంపించడంతో పాటుగా వచ్చి రాగే, తమకు కావాల్సిన వారికి అవసరమయ్యే పనులు త్వరితగతిన చేయాలంటూ ఉన్నతాధికారులు, స్థానికంగా ఉండే నాయకులు వేదిస్తూ వచ్చినట్టుగా తంగవేల్ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తును వేగవంతం చేశారు. ఒత్తిళ్లతోనే ఆత్మహత్యాయత్నం: గత వారం తిరుచ్చి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ నెహ్రు రాజకీయ ఒత్తిళ్లతో ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. చికిత్స అనంతరం కోలుకున్న ఆయన గురువారం మీడియా ముందుకు వచ్చారు. ఆరు నెలల క్రితం తంజావూరు నుంచి తిరుచ్చి ఆసుపత్రికి బదిలీ అయినట్టు వివరించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదాతో ఉన్న తనను ఇక్కడి ఆసుపత్రి వైద్యాధికారిగా పనిచేయాలని స్థానికంగా ఉన్న అధికారులు ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఒత్తిళ్లకు తలొగ్గి ఆ బాధ్యతలు చేపట్టినా, చివరకు రాజకీయ ఒత్తిళ్లు పెరిగాయని వివరించారు. అధికార పక్షం నాయకుడు అంటు ఒకరు, మంత్రి అనుచరుడు అంటు మరొకరుడు ఇలా రోజుకు యాభై ఫోన్ కాల్స్ రూపంలో వేదింపులు వచ్చేవి అని పేర్కొన్నారు. తమ వాళ్లకు చికిత్సలు చేయాలని కొందరు, తమ వాళ్లకు ఆ పనిచేసి పెట్టు, ఈ పని చేసి పెట్టు అని వేదించడం మొదలెట్టారన్నారు. ఆరోగ్య శాఖమంత్రి తనతో ఇంత వరకు ఒక్క సారిగా కూడా మాట్లాడ లేదని, ఆయన సహచరులం అని, పీఎ అని పేర్కొంటూ, పలుమార్లు చివాట్లు ఎదురు అయ్యేదన్నారు. ఈ రాజకీయ ఒత్తిళ్లు తాళ లేక సంఘటన జరిగిన రోజు ఆసుపత్రికి వచ్చి సహచర సిబ్బందికి తన ఆవేదనను వెల్లగక్కినట్టు పేర్కొన్నారు. ఆతర్వాత తీవ్ర మనో వే దనకు గురై 30 నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించానని, అయితే, తనను రక్షించి మళ్లీ రాజకీయ ఈ వేదింపులు ఎదుర్కొనేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, అన్నాడిఎంకే అధినేత్రి జయలలిత జైలు శిక్ష నేపథ్యంలో రాష్ర్టంలో పాలన కుంటు పడిందన్న ఆరోపణలు సాగుతున్న సమయంలో రాజకీయ ఒత్తిళ్లతో అధికారులు, కింది స్థాయి ఉద్యోగులు ఆత్మహత్య బాట పట్టడం ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో కలవరం రేపుతున్నది. -
రెండు నెలల్లో లక్ష్మీపేటలో ప్రత్యేక కోర్టు
లక్ష్మీపేట(వంగర) : లక్ష్మీపేట గ్రామంలో రెండు నెలల్లో ప్రత్యేక కోర్టు ప్రారంభానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సీబీసీఐడీ విభాగం డీఐజీ ఆలూరి సుందర్‌కుమార్‌దాస్ వెల్లడించారు. 2012 జూన్ 12వ తేదీన ఇరువర్గాల మధ్య జరిగిన మారణహోమంలో ఐదుగురు దళితులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో గ్రామంలో గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా పోలీస్ పికెట్ పాయింట్లను పరిశీలించి శాంతిభద్రతలపై ఆరా తీశారు. ప్రత్యేక కోర్టు నిర్వహణకు అవసరమైన నిధుల మంజూరుకు మార్గం సుగుమం కావడంతో ఏప్రిల్, మే నెలల్లో కోర్టు ప్రారంభిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 14 ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులున్నాయని..వీటి ద్వారా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విభాగంలో పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం దళిత బాధిత కుటుంబాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రేషన్, పింఛన్, గృహనిర్మాణ సమస్యలు పరిష్కరించాలని వేడుకున్నారు. స్పందించిన డీఐజీ రాష్ట్ర మంత్రి రావెల కిశోర్‌బాబుతో ఫోన్లో మాట్లాడారు. తక్షణమే సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు డీఐజీ దళిత బాధిత కుటుంబాలకు వివరించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీలు దేవానంద్‌శాంతో, సీహెచ్ పెంటారావు, సీఐ ఎంవీవీ రమణమూర్తి, ఎస్ఐ భాస్కరరావు ఉన్నారు. -
బోగస్ సర్టిఫికెట్లపై సీబీసీఐడీ విచారణ!
రవాణా శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శికి సీఎం ఆదేశాలు గుర్తింపు లేని వర్సిటీ సర్టిఫికెట్లతో ఆర్టీఏలో పదోన్నతులు సిటీబ్యూరో: రవాణా శాఖలో గత సంవత్సరం తీవ్ర కలకలం సృష్టించిన రాజస్థాన్ వర్సిటీ సర్టిఫికెట్ల ఉదంతంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సీబీసీఐడీ విచారణకు ఆదేశించారు. ఈ మేరకు రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్‌శర్మకు ఈ నెల 19వ తేదీన స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. చెల్లుబాటు కాని ఆటోమోబైల్ డిప్లొమా సర్టిఫికెట్ల ఆధారంగా కొందరు ఆర్టీఏ కానిస్టేబుళ్లు సహాయ మోటారు ఇన్స్పెక్టర్లుగా (ఏఎంవీఐలు) పదోన్నతులు పొందడమే కాకుండా, ప్రస్తుతం మోటారు వాహన ఇన్స్పెక్టర్లుగా (ఎంవీఐలు) కూడా మరోసారి పదోన్నతిని పొం దేందుకు సిద్ధంగా ఉన్నారు. రవాణా శాఖలో ఏడాది కాలంగా వివిధ స్థాయిల్లో చర్చనీయాంశంగా మారిన ఈ ఉదంతంపై ఇటీవల కొందరు నిరుద్యోగులు, ‘తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రివెన్షన్ ఆఫ్ రోడ్ సేఫ్టీ’ ప్రతినిధులు ఇటీవల సీఎంను కలిసి ఈ అక్రమ పదోన్నతులపై ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలను సైతం సీఎంకు అందజేయడంతో ఆయన దీనిపై సమగ్రమైన విచారణ కోరినట్లు తెలిసింది. చెల్లుబాటు కావు.... ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, అప్పటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వంటి సంస్థలు రాజస్థాన్ వర్సిటీ సర్టిఫికెట్లు చెల్లబోవని ఏడాది క్రితమే తేల్చిచెప్పాయి. ఈ క్రమంలోనే రాజస్థాన్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ డీమ్డ్ వర్సిటీ (ఐఏఎస్ఈ) అందజేసే ఈ ఆటోమోబైల్ డిప్లొమా సర్టిఫికెట్ ఆధారంగా గతంలో ఏఎంవీఐ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న జితేందర్ అనే ఓ నిరుద్యోగి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సైతం ఏపీపీఎస్సీ వాదననే బలపరిచింది. అయినప్పటికీ ఈ సర్టిఫికెట్ల ఆధారంగానే 50 మందికి పైగా ఆర్టీఏ కానిస్టేబుళ్లు పదోన్నతి పొందారు. ఈ వ్యవహారంలో లక్షల రూపాయలు చేతులుమారినట్లు సమాచారం. -
‘గూడుపుఠాణి
సాక్షి, కరీంనగర్ : ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలపై 36 రోజులపాటు చేస్తున్న సీబీసీఐడీ విచారణలో ఊహించని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. కేవలం మూడు మండలాల్లో.. అదీ తొలి విడత విచారణలోనే 710 మంది అక్రమార్కులున్నట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. క్షేత్రస్థాయి విచారణ, రికార్డులు లోతుగా పరిశీలిస్తే సంఖ్య వెయ్యి దాటుతుందని స్వయంగా అధికారులే పేర్కొంటున్నారు. మరోవైపు అక్రమార్కులపై దసరా తర్వాత చర్యలు తీసుకునేందుకు సర్కారు నిర్ణయించింది. తొలి విడత క్షేత్రస్థాయి విచారణను రెండు రోజుల్లో పూర్తి చేసి.. రికార్డులు పరిశీలించేందుకు సీఐడీ బృందాలు కసరత్తు చేస్తున్నాయి. పరిశీలన ఐదురోజుల్లోగా పూర్తి చే సి నెలాఖరులోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సీఐడీ డీఎస్పీ మహేందర్ నిర్ణయం తీసుకున్నారు. సీఐడీ దూకుడు.. ప్రభుత్వ వైఖరితో ఇందిరమ్మ ఇళ్ల అనర్హులు.. దళారులు.. ప్రజాప్రతినిధుల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గత నెల 14 నుంచి మల్హర్ మండలం రుద్రారం, మహాముత్తారం మండలం పెగడపల్లి, వీణవంక మండలం రెడ్డిపల్లి, కొండపాక గ్రామాల్లో సీఐడీ డీఎస్పీ మహేందర్, సీఐ రెండు బృందాలుగా విడిపోయి విచారణ చేపడుతున్నారు. వీటి పరిధిలో మంజూరై.. నిర్మాణం పూర్తయిన ఇల్లు మొత్తం 2708 ఉన్నాయి. వాటిలో సగానికి పైగా ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగినట్లు సీఐడీ విచారణ బృందాలు నిగ్గు తేల్చాయి. వెయ్యికి పైగా మంది అక్రమార్కులు ఉంటారని సీఐడీ చెబుతోంది. కేవలం మూడు మండలాలు.. నాలుగు గ్రామాల్లోనే వెయ్యి మందికి పైగా అక్రమార్కులున్నారంటే జిల్లావ్యాప్తంగా ఇంకెంత మంది అక్రమార్కుల బండారం బయటపడుతుందోననే చ ర్చ జిల్లాలో జోరుగా జరుగుతోంది. అక్రమార్కుల్లో గృహనిర్మాణశాఖ అధికారులు, సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు, పారిశ్రామిక వేత్తలు, సింగరేణి కార్మికులూ ఉన్నారని సీఐడీ విచారణలో తేలింది. వీరి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించినట్టు అధికారులు చెబుతున్నారు. రెండో విడత జిల్లావ్యాప్తంగా..? ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలపై తొలి విడతగా ప్రభుత్వం జిల్లాలోని రెండు నియోజకవర్గాలు.. నాలుగు గ్రామాల్లో విచారణ చేపట్టాలని నిర్ణయించింది. విచారణ పూర్తయిన తర్వాత సీఐడీ విచారణ అధికారులు ఇచ్చే నివేదికల అనుగుణంగా రెండో విడత విచారణ చేపట్టాలని యోచిస్తోంది. అన్ని చోట్లా ఊహించని విధంగా అక్రమాలు వెలుగులోకి రావడం.. విచారణలో అవి నిర్ధరణ కావడంతో రెండో విడత విచారణ జిల్లావ్యాప్తంగా చేపట్టే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే విచారణ కోసం సీఐడీలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందిని ఎంపిక చే యాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోపక్క ఇప్పటి వరకు చేపట్టిన విచారణలో సీఐడీ అధికారులకు లభించిన హౌసింగ్ సిబ్బంది సహకారం అంతంతే. విచారణకు సహకరించని హుజూరాబాద్ డీఈఈని హౌసింగ్ పీడీ నర్సింగరావు ప్రభుత్వానికి సరెండర్ చేశారు. మంథని డీఈఈపైనా సీఐడీ డీఎస్పీ మహేందర్ ఇదే ఆరోపణ చేయడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇందిరమ్మ ఇళ్లపై ఆరా! మహాముత్తారం/ మల్హర్ : మండలంలోని పెగడపల్లిలో సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన జాటోత్ రజిత, వీరమ్మ, వావిల్లా హేమలత, జాటోత్ లహరియా, కీరిబాయి, జాటోత్ గౌతమిబాయి పేరిట మంజూరైన గృహాలను తనిఖీ చయగా.. హేమలత పేరిట సిబ్బంది రెండు విడతల బిల్లులు కాజేసినట్లు తేలింది. మరోవైపు పెగడపల్లి పరిధిలోని ప్రేమ్‌నగర్, ఆంజనేయపల్లి, మామిడిగూడెంలో 2006 నుంచి 2012 వరకు మంజూరైన 400 గృహాలను పరిశీలించారు. మల్హర్ మండలంలోని రుద్రారంలోనూ సీఐడీ అధికారులు విచారణ కొనసాగించారు. హౌసింగ్ అధికారుల తీరుపై సీఐడీ డీఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుద్రారంలో 1133 ఇళ్లను సర్వే చేయగా.. 44 పాత ఇళ్లకు, 181 కట్టని ఇళ్లకు బిల్లులు తీసుకున్నట్లు తేలిందన్నారు. 15 ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధిపొందారని, 115 పూర్తి కానివి, 56 బినామీ, 15 అవివాహితులకు ఇళ్లు మంజూరైనట్లు గుర్లించారు. 95 ఇళ్లకు రెండుసార్లు బిల్లులు వచ్చినట్లు నిర్ధరించారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేసిన డీఈ భాస్కర్‌పై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. -
అక్రమాల పుట్ట పగులుతోంది!
బషీరాబాద్: నిజాం కాలంలో నిర్మించిన ఇళ్లకు కొత్త ఇళ్లంటూ బిల్లులు చెల్లించారని సీబీసీఐడీ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్లలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి ఇందిరమ్మ ఇళ్లు కట్టుకున్నారా లేదా అనే విషయమై తనిఖీ చేశారు. బషీరాబాద్‌లో ఏ ఇంటికి వెళ్లిన 50 ఏళ్ల క్రితం నిర్మించుకున్న ఇళ్లకే హౌసింగ్ అధికారులు ఇందిరమ్మ బిల్లులు చెల్లించారని విచారణలో వెల్లడైంది. ఇందిరమ్మ ఇళ్లుగా చెప్పుకుంటున్న ప్రతి ఇంటికి వెళ్లి విచారణ జరిపిన అధికారులు బిల్లుల స్వాహాలో లబ్ధిదారులు, అధికారులు, స్థానిక నాయకుల చేతివాటం ఉన్నట్లు నిర్ధారించారు. బషీరాబాద్ ఉప సర్పంచ్ రజాక్ ఇంటికి అధికారులు వెళ్లగా ఉప సర్పంచ్ తల్లి పేరిట పాత ఇంటిని చూపించి ఇల్లు కట్టుకున్నట్లుగా బిల్లు స్వాహ చేశారని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరు ఇందిరమ్మ ఇళ్ల పేరిట దుకాణ సముదాయం నిర్మించుకున్నారని గుర్తించారు. జయంతి కాలనీలో మధ్యవర్తులతో కలిసి అధికారులు బిల్లులు స్వాహా చేశారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఎవ్వర్నీ వదలం.. బషీరాబాద్ మండల కేంద్రంలో 479 ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రూ. 98 లక్షల అవినీతి జరిగినట్లు సీబీసీఐడీ డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మొదటి విడతలో ఎంపికైన బషీరాబాద్ గ్రామ పంచాయతిలో మొత్తం 1195 ఇళ్లు మంజూరు కాగా అందులో 951 నిర్మాణం పూర్తయినట్లు హౌసింగ్ అధికారులు బిల్లులు చెల్లించారన్నారు. వాస్తవానికి బషీరాబాద్ గ్రామ పంచాయతిలో 80 శాతం వరకు ఇళ్ల బిల్లులలో అక్రమాలు జరిగాయన్నారు. పథకం అమలు నాటి నుంచి కొనసాగిన అధికారులను విచారణ చేస్తామన్నారు. ఇప్పటికే అక్రమాలకు పాల్పడిన పలువురి అధికారులను సంబంధిత శాఖ సస్పెండ్ చేసిందని, క్రిమినల్ యాక్ట్ ప్రకారం ఇందిరమ్మ ఇళ్లలో జరిగిన అక్రమాలపై అధికారుల పాత్రను గుర్తించి అరెస్టు చేసి జైలుకు పంపుతామన్నారు. ఈనెల 14 లోపు జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లలో జరిగిన అక్రమాలను ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు. బషీరాబాద్ ఉప సర్పంచ్ సైతం తల్లి పేరిట ఇల్లు కట్టకుండానే బిల్లు తీసుకోవడం విడ్డూరమన్నారు. ఈ విచారణలో సీబీసీఐడీ అధికారుల బృందం జితేందర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, సంపత్‌రెడ్డి, బషీరాబాద్ ఎస్ఐ లకా్ష్మరెడ్డి, హౌజింగ్ డీఈఈ సీతారామమ్మ, గతంలో పని చేసిన డీఈఈలు, ఏఈలు ఉన్నారు. బషీరాబాద్ పంచాయతీ పరిధిలో విచారణ జరగనుందని తెలిసినా హౌసింగ్ అధికారులు ఇళ్లకు నంబర్లు వేయకపోవడంతో సీఐడీ అధికారుల బృందానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. మధ్యాహ్నం వరకు సీఐడీ అధికారులు కొన్ని ఇళ్ల తనిఖీ చేశారు. అయితే ఇళ్లకు నంబర్లు వేసి పిలుస్తామని చెప్పిన హౌసింగ్ అధికారులు సాయత్రం 4గంటల వరకు కూడా సమాచారం ఇవ్వకపోవడంతో సీఐడీ అధికారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. -
‘ఇందిరమ్మ’లో అక్రమాలపై విచారణ
పోల్కంపేట(లింగంపేట) : నిజామాబాద్-మెదక్ జిల్లాల సరిహద్దు గ్రామమైన లింగంపేట మండలంలోని పోల్కంపేట గ్రా మంలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో జరిగిన అవకతవకలపై మంగళవారం సీబీసీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. సీబీసీఐడీ సీఐలు జి.వెంకటేశ్, ఉదయ్‌కిరణ్,ఎస్సైలు సాల్మన్‌రాజ్,నాగేందర్,హెడ్ కానిస్టేబుల్ రషీద్‌అలీ గ్రామంలో ప్రతి ఇల్లు తిరుగు తూ విచారణ చేపట్టారు. గ్రామంలో177 ఇందిరమ్మ గృహాలు నిర్మాణాలు జరుగకపోయినా కొందరు అధికారులు,నాయకులు నిధులను దుర్వినియోగం చేసిన ట్లు గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు చేసిన ఫి ర్యాదు నేపథ్యంలో విచారణ నిర్వహించారు. గ్రామానికి చెందిన బొల్లారం రాజమ్మ 1989లో ఇల్లు కట్టుకుం ది. కానీ సంబంధిత అధికారులు ఆమె పేరుమీద 2006లో ఇల్లు కట్టుకున్నట్లు బిల్లులు చెల్లించారు.బిల్లుల విషయం రాజమ్మను సీబీసీఐడీ సీఐ ఉదయ్‌కిరణ్ ప్రశ్నించగా తనకు నయా పైసా ఇవ్వలేదని జవాబిచ్చింది. అలాగే గ్రామానికి చెందిన తలారి కిషన్ సైతం తాను ఇల్లు కట్టుకున్నా రూపాయి చేతికందలేదని చెప్పాడు. నిబంధనలకు విరుద్ధంగా వంట గది నిర్మించుకున్న వారికి సైతం హౌసింగ్ అధికారులు బిల్లులు చెల్లించి తమ శాఖ సత్తా చాటినట్లు విచారణ లో వెల్లడి కావడం గమ నార్హం. అధికారులు ఇం దిరమ్మ ఇల్లు మంజూరైన వారి ఇంటికి వెళ్లి యజమాని ఫొటోలను తీస్తూ విచారణ చేపడుతున్నారు. అవినీతి అక్రమాలకు చెక్‌పెట్టేందుకే.. సదాశివనగర్ : ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందిరమ్మ గృహాల నిర్మాణంలో జరిగిన అవినీతి అక్రమాలను వెలికితీయడానికే ఇందిరమ్మ గృహాలను పరిశీలిస్తున్నట్లు సీబీసీఐడీ ఇన్స్పెక్టర్లు ఉదయ్‌కిరణ్, వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం మండలంలోని భూం పల్లి గ్రామంలో గతంలో మంజూరైన 599 ఇందిరమ్మ గృహాలను పరిశీలించారు. అవకతవకలు, అక్రమాలు జరిగాయా..రికార్డు ప్రకారం గృహాలు ఉన్నాయా...లేదా...డీఈలు, ఏఈలు అవినీతికి పాల్పడి ఇళ్లు నిర్మించకున్న బిల్లులు మంజూరు చేశారా అనే కోణంలో పరి శీ లన చేస్తున్నట్లు తెలిపారు. గ్రామం లో మూడు బృందాలుగా విడిపోయి అధికారులు ఇళ్లను పరిశీలించారు. ఇళ్లు మంజూరైనప్పటికీ బిల్లులు తీసుకుని ఇళ్లు నిర్మించకుండా ఉన్న కుటుంబాలను గుర్తిస్తామన్నారు. ఒకే ఇల్లుపై కొందరు మూడు నాలుగు బిల్లులు తీసుకున్నారా..అనే విషయాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. -
‘ఇందిరమ్మ’ అవినీతిపై విచారణ
తిమ్మాపూర్ (చందంపేట) : ఇందిరమ్మ పథకం కింద 2004 - 2009 సంవత్సరాల మధ్య లబ్ధిదారుల ఎంపిక, బిల్లుల చెల్లింపులో జరిగిన అవినీతి ఆరోపణలపై మంగళవారం సీబీసీఐడీ డీఎస్పీ రామచంద్రుడు ఆధ్వర్యంలోని బృందం తిమ్మాపూర్ గ్రామంలో విచారణ జరిపింది. ఇక్కడ 590 ఇళ్లు మంజూరు కాగా 247 ఇళ్ల నిర్మాణం జరిగినట్లు రికార్డులున్నాయి. కానీ అందులో 44 ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు గతంలోనే గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా 44 ఇళ్లకు చెల్లింపులు జరిపారన్న అంశంపై ఇంటింటికీ వెళ్లి విచారణ చేశారు. పాత ఇళ్లకు మరమ్మతులు చేయడం, నూతన గృహాలు నిర్మించకపోవడం తదితర లోపాలను గుర్తించారు. బృందంలో ఇన్స్పెక్టర్లు, సిబ్బంది ఉన్నారు. హాలియా : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవినీతిపై మండలంలోని చల్మారెడ్డిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని చల్మారెడ్డిగూడెం, కొట్టాల గ్రామాల్లో సీబీసీఐడీ డీఎస్పీ రాంచంద్రుడు నేతృత్వంలోని అధికారుల బృంద మంగళవారం విచారణ చేపట్టింది. లబ్ధిదారుల వద్దకు వెళ్లి ఇళ్లు కట్టుకున్నారాలేదా? హౌసింగ్ అధికారులు ఎంత బిల్లు, ఎన్ని బస్తాల సిమెంట్ ఇచ్చారన్నది ఆరా తీసున్నారు. -
రంగంలోకి సీబీసీఐడీ
ఖానాపూర్ : ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలపై నిగ్గు తేల్చడానికి సీబీసీఐడీ రంగంలోకి దిగింది. జిల్లాలో అత్యధికంగా ఖానాపూర్, ఇంద్రవెల్లి, ఆసిఫాబాద్, రెబ్బెన ప్రాంతాల్లో భారీగా అక్రమాలు జరిగాయన్న నేపథ్యంలో ప్రభుత్వం సీబీసీఐడీ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో ఆయా మండలాల్లో దర్యాప్తుకు శ్రీకారం చుట్టారు. సోమవారం సీబీసీఐడీ డీఎస్పీ రవికుమార్, ఇన్స్పెక్టర్లు వి.చేరాల, బి.రఘుపతి హౌసింగ్ డీఈ కార్యాలయంలో ఈఈ అలీంబిన్‌మాలియా నుంచి ఇళ్ల వివరాలు, చెల్లింపులు, ఇతరత్రా సమాచారం సేకరించారు. కంప్యూటర్ నుంచి వివరాలు డౌన్లోడ్ చేసుకున్నారు. ఇప్పటికే 2009లో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలపై థర్డ్ పార్టీ సర్వే కమిటీ వివరాలు, తదితర అంశాలను సేకరిస్తున్నారు. రూ.కోటీ 29లక్షలకు పైగా అక్రమాలు జరిగాయన్న థర్డ్ పార్టీ విచారణ నివేదిక ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ విషయమై ఈఈ ఆదేశాల మేరకు వర్క్ఇన్స్పెక్టర్లు, సిబ్బంది నాలుగు రోజులుగా ఇళ్ల నిర్మాణాల రికార్డులు తయారు చేశారు. ఇంటింటికీ తిరుగుతూ లబ్ధిదారుల నుంచి వీడియో స్టేట్మెంటు రికార్డు చేసి విచారణ జరిపిన ఇళ్లకు నంబర్లు వేస్తున్నారు. తహశీల్దార్, ఎంపీడీవో, తదితర శాఖల అధికారుల నుంచి ఇళ్ల నిర్మాణాలపై సీబీసీఐడీ అధికారులు ఆరా తీస్తున్నారు. తాజాగా సీబీసీఐడీ అధికారులు రంగంలోకి దిగడంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు మొదలైంది. సీబీసీఐడీ అధికారుల వెంట ఆ శాఖ సిబ్బంది షంషీర్‌ఖాన్, రమణ, పట్టాభి, తిరుపతి, సుధాకర్, ఆన్‌చార్జి ఎస్సై టీవీరావు, వర్క్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ తదతరులు ఉన్నారు. -
కోయంబత్తూర్ పేలుళ్ల ప్రధాన నిందితుడు అరెస్ట్
మల్లాపురం: కోయంబత్తూర్ పేలుళ్ల కేసులో నిందితుడు కుంజు మహ్మద్ ను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళలోని మల్లాపురంలో కుంజు మహ్మద్‌ను అరెస్ట్ చేసినట్టు తమిళనాడు సీబీసీఐడీ పోలీసులు తెలిపారు. 1998లో అద్వానీ బహిరంగసభలో కుంజు మహ్మద్ బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. నాటి ఘటనలో 58 మంది మృతి చెందగా, సభకు ఆలస్యంగా రావడంతో నాడు అద్వానీకి ప్రాణాలకు ముప్పు తప్పింది. -
బాలిక హత్యను తీవ్రంగా పరిగణిస్తున్నాం...
వినుకొండ : ముక్కుపచ్చలారని బాలికపై అతి కిరాతంగా లైంగికదాడి జరిపి, హత్య చేసిన సంఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని సీబీసీఐడీ అడిషనల్ డీజీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. వినుకొండ పట్టణ శివారు రాజీవ్ రజక కాలనీకి చెందిన మైనర్ బాలిక లక్ష్మీతిరుపతమ్మ ఇంటి వద్ద ఆడుకుంటుండగా అపహరణకు గురైన బాలిక 14వ తేదీన శావల్యాపురం మండలం కనుమర్లపూడి గ్రామ సమీపంలోని నక్కలగండివాగు వద్ద మృతదేహమై కనిపించిన ఘటన తీవ్ర కలకలం సృష్టించిన విషయం విధితమే. ఈ ఘటనపై స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి తక్షణమే విచారణ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించారు. దీంతో సీబీసీఐడి అడిషన్ డీజీ తిరుమలరావు సిబ్బందితో కలిసి శావల్యాపురం మండలం కనుమర్లపూడి సంఘటన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం పట్టణంలోని రాజీవ్ రజక కాలనీలోని బాలిక పెంపుడు తల్లి లింగమ్మను విచారించారు. సంఘటనకు ముందుగా జరిగిన విషయాలను అడిగి తెల్సుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వెంకటేశ్వర్లును పట్టణ పోలీసు స్టేషన్లో ఆయన విచారించారు. అదేవిధంగా బాలిక శవాన్ని పోస్టు మార్టం నిర్వహించిన డాక్టర్ లక్ష్మణరావును వివరాలు అడిగి తెల్సుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విచారణకు సంబంధించి జిల్లా రూరల్ ఎస్పీకి పలు సూచనలు చేశామని, ఆ దిశగా విచారణ చేయాలని సూచించినట్లు చెప్పారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్‌తో మాట్లాడామని పేర్కొన్నారు. ఆయనతో పాటు ఎస్పీ సత్యనారాయణ, ఐజీ రామకృష్ణ, సీఐడీ డిఎస్పీ రఘు, నర్సరావుపేట డిఎస్పీ డి ప్రసాదు, సీఐడీ సీఐ శివప్రసాదు, లీగల్ అడ్వైజర్ తదితరులు ఉన్నారు. -
పేలుడులో సిద్ధిక్ హస్తం
సాక్షి, చెన్నై: సెంట్రల్ రైల్వే స్టేషన్లో పేలుడు వెనుక తీవ్రవాది అబూబక్కర్ సిద్ధిక్ హస్తం ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విచారణలో లభిస్తున్న సమాచారం ఇందుకు బలం చేకూరుస్తున్నట్టు తెలిసింది. కోల్‌కతాలో సీబీసీఐడీ జరిపిన దర్యాప్తు మేరకు సిద్ధిక్ అనుచరులు రాష్ట్రంలో తిష్ట వేసి ఉన్నట్టు తేలింది. సెంట్రల్ రైల్వే స్టేషన్‌లోజరిగిన గువాహటి ఎక్స్‌ప్రెస్ పేలుడు దర్యాప్తు సీబీసీఐడీకి సవాల్‌గా మారింది. ఈ ఘటన వెనుక ఉన్న అదృశ్య శక్తుల్ని గుర్తించడంలో తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి. ప్రత్యేక బృందాలు బెంగళూరు, బీహార్‌లో తిష్ట వేసి దర్యాప్తును సాగిస్తూనే వస్తున్నాయి. పలు కోణాల్లో దర్యాప్తు సాగుతున్నా, చిన్నపాటి ఆధారం కూడా లభించడం లేదు. దీంతో కేసు ఛేదింపు మరి కొన్ని నెలలు పట్టేనా? లేదా సెంట్రల్ రైల్వే స్టేషన్లో గతంలో జరిగిన రైలు హైజాక్ ఘటన విచారణ మాదిరిగా మిస్టరీ అయ్యేనా? అన్న సందేహం వ్యక్తమవుతోంది. బెంగళూరులో లభించిన చిన్న క్లూ ఆధారంగా కోల్‌కతాకు ప్రత్యేక బృందం వెళ్లి ఉన్నది. అక్కడ జరుగుతున్న దర్యాప్తు మేరకు తమిళనాడుకు చెందిన అజ్ఞాత తీవ్రవాది సిద్ధిక్ ప్రమేయం ఉండొచ్చన్న సంకేతాలు వెలువడ్డాయి. జాడ ఏదీ?: తమిళనాడుకు చెందిన అజ్ఞాత తీవ్ర వాదులు నలుగురిలో ముగ్గురు ఇటీవల పట్టుబడ్డారు. చైన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ లాడ్జీలో పోలీసు ఫకృద్దీన్ పట్టుబడడం, అతడు ఇచ్చిన సమాచారంతో ఇస్మాయిల్, బిలాల్‌ను పుత్తూరులో అరెస్టు చేశారు. వీరు పట్టుబడినా, మరో ప్రధాన అజ్ఞాత తీవ్ర వాది అబూబక్కర్ సిద్ధిక్ జాడ మాత్రం తెలియడం లేదు. ఇత డిని పట్టిస్తే రివార్డులు సైతం ఎదురు చూస్తున్నాయి. ఇతడి కోసం రాష్ట్రంలో జల్లెడ పట్టినా ఫలితం శూన్యం. తరచూ రాష్ట్రానికి మాత్రం వచ్చి వెళ్లే వాడని కోల్‌కతాలో లభించిన సమాచారంతో ఈ పేలుడు వెనుక సిద్ధిక్ హస్తం ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నారుు. ఇతడు సౌత్ ఇండియన్ ముజాహిద్దీన్ పేరిట రహస్యంగా ఓ సంస్థను నడుపుతున్నట్టు, తమిళనాడుకు చెందిన యువతను వలలో వేసుకున్నట్టుగా విచారణలో వెలుగు చూసింది. దీంతో కోల్‌కతా వెళ్లిన ప్రత్యేక బృందం రాష్ట్రంలోని ఉన్నతాధికారులకు సమాచారం పంపింది. దీంతో రాష్ట్రంలో సిద్ధిక్ మద్దతుదారులు, అనుచరుల కోసం వేట ఆరంభం అయింది. ఇటీవల బెంగళూరు బీజేపీ కార్యాలయం వద్ద జరిగిన బాంబు పేలుడు కేసు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల చుట్టూ తిరిగిన విషయం తెలిసిందే. దీంతో ఆ జిల్లాల్లో సిద్ధిక్ అనుచరగణం నక్కి ఉండొచ్చన్న అనుమానాలు నెలకొన్నాయి. వీరి కోసం రహస్య వేట శరవేగంగా సాగుతోంది. -
ఒక్కో పేపర్ రూ. కోటిపైనే.. పీజీ మెడికల్ స్కాం చేధించిన సీఐడీ
హైదరాబాద్: పీజీ మెడికల్ స్కాంను సీబీసీఐడీ పోలీసులు ఛేదించారు. ఎంట్రన్స్ ప్రవేశ పరీక్షల్లో అక్రమాలు జరిగినట్టు నిర్ధారించారు. ఈ కేసులో ఇద్దరు బ్రోకర్లతో పాటు ఐదుగురి విద్యార్థులను అరెస్ట్ చేశారు. సీఐడీ చీఫ్ కృష్ణప్రసాద్ కేసు వివరాలను వెల్లడించారు. శ్రీనగర్ కాలనీలోని వర్జిన్స్ కన్సెల్టెన్సీ పేరిట కుంభకోణం జరిగినట్టు సీఐడీ పోలీసులు విచారణలో గుర్తించారు. ఈ కుంభకోణంలో మొత్తం 50 నుంచి 70 కోట్ల రూపాయల వరకు చేతులు మారాయి. ఒక్కో పేపర్‌కు కోటి నుంచి కోటి 20 లక్షల రూపాయల దారా వసూలు చేశారు. అంజూ సింగ్ అనే వ్యక్తిని ప్రధాన నిందితుడు. సాయినాథ్, మునీశ్వర్ రెడ్డి బ్రోకర్లుగా వ్యవహరించారు. అరెస్ట్ అయిన వారిలో ఓ విద్యార్థిని తండ్రి కూడా ఉన్నారు. ఈ కేసులో మరికొంతమందిని అరెస్ట్ చేయాల్సివుందని కృష్ణ ప్రసాద్ చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు దర్యాప్తు బృందాలను పంపామని తెలిపారు. పీజీ ప్రవేశ పరీక్ష ప్రశ్నా పత్రం జిరాక్స్ కాపీని కీతో సహా విద్యార్థులకు అందజేశారని వివరించారు. పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయని తెలిపారు. డీజీపీ ప్రసాదరావు, సీఐడీ చీఫ్ కృష్ణప్రసాద్, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేందర్‌రెడ్డి, హెల్త్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం అంతకుముందు గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. పీజీ మెడికల్ స్కాంపై విచారణ నివేదికను గవర్నర్‌కు సమర్పించారు. పీజీ మెట్ను రద్దు చేయాలని సీఐడీ చీఫ్ గవర్నర్‌కు సూచించినట్టు సమాచారం. పీజీ మెట్ పరీక్ష రద్దుచేయాలా? వద్దా? అన్న విషయంపై గవర్నర్ నిర్ణయం తీసుకోనున్నారు. -
మెడికల్ పీజీ స్కాంపై సీఐడీ నివేదిక
హైదరాబాద్: మెడికల్ పీజీ ఎంట్రన్స్ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు సీఐడీ విచారణలో తేలింది. ప్రాథమికంగా ఈ విషయాన్ని నిర్ధారించింది. డీజీపీ ప్రసాదరావు, సీఐడీ చీఫ్ కృష్ణప్రసాద్, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేందర్‌రెడ్డి, హెల్త్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం శనివారం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. పీజీ మెడికల్ స్కాంపై విచారణ నివేదికను గవర్నర్‌కు సమర్పించారు. పీజీ మెట్ను రద్దు చేయాలని సీఐడీ చీఫ్ గవర్నర్‌కు సూచించినట్టు సమాచారం. పీజీ మెట్ పరీక్ష రద్దుచేయాలా? వద్దా? అన్న విషయంపై గవర్నర్ నిర్ణయం తీసుకోనున్నారు. కాసేపట్లో ప్రకటన రావచ్చని భావిస్తున్నారు. -
పీజీ వైద్య పరీక్ష స్కాంపై ఎఫ్ఐఆర్ నమోదు
హైదరాబాద్ : పీజీ మెడికల్ ప్రవేశ పరీక్షలో అవకతవకలపై రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 120 (B), 420 సహా పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ కింద కేసు నమోదు అయ్యింది. ఈ కేసు విచారణకు సీఐడీ ఆరు ప్రత్యేక విచారణ బృందాలను రంగంలోకి దించింది. వివిధ ప్రాంతాల్లో, కోణాల్లో ఆరా తీసేందుకు విజయవాడ, గుంటూరు, విశాఖ, హైదరాబాద్, బెంగళూరుకు ప్రత్యేక బృందాలు బయల్దేరి వెళ్లాయి. కాగా గవర్నర్ ఆదేశాల నేపథ్యంలో సీఐడీ అధికారులు హుటాహుటిన రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిన్న సాయంత్రం ఐపీసీలోని ఓ సెక్షన్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ యాక్ట్‌లోని కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా సీబీసీఐడీ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో కౌన్సెలింగ్ ప్రారంభం కానున్న ఏప్రిల్ 15లోగా విచారణ పూర్తిచేసి నివేదిక ఇస్తారా? కౌన్సెలింగ్‌ను వాయిదా పడుతుందా? అన్నది తేలాల్సి ఉంది. -
మెడికల్ పీజీ సీట్ల వివాదంపై సీబీ సీఐడీ విచారణ
హైదరాబాద్: మెడికల్ పీజీ ప్రవేశ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని వచ్చిన ఆరోపణలపై సీబీసీఐడీ విచారణకు గవర్నర్ నరసింహన్ ఆదేశించారు. వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలని సూచించారు. పీజీ మెడికల్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈనెల 18న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గవర్నర్ ఈఎల్ఎస్ నరసింహన్ వెంటనే విచారణకు ఆదేశించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య ఎల్.వేణుగోపాల్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన విచారణ కమిటీ 100లోపు ర్యాంకులు సాధించిన 11 మంది నాన్‌లోకల్ అభ్యర్థులపై అనుమానం వ్యక్తం చేసింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విచారణలో ప్రాథమికంగా గుర్తించిన అంశాలను వేణుగోపాల్‌రెడ్డి వివరించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ సీబీసీఐడీ విచారణకు ఆదేశించారు. 19వ తేదీన హెల్త్ యూనివర్సిటీకి చేరుకుని మూల్యాంకన ప్రక్రియపై ప్రాథమికంగా విచారణ చేశామని అంతకుముందు వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. అనంతరం 20వ తేదీ గురువారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాల యంలో బహిరంగ విచారణ చేయగా, 200 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారన్నారు. విద్యార్థులు నిర్ధిష్టంగా ఫిర్యాదు చేయనప్పటికీ వారు లేవనెత్తిన అంశాలను పరిశీలించగా, మొదటి 100లోపు మంచి ర్యాం కులు సాధించిన 11 మంది నాన్‌లోకల్ అభ్యర్థులపై ప్రాథమికంగా అనుమానిస్తున్నామన్నారు. -
దేవరకొండ కేసు సీబీసీఐడీకి
నల్లగొండ టౌన్, న్యూస్‌లైన్: దేవరకొండ సహకార బ్యాంకులో జరిగిన అక్రమాలను విచారించేందుకు కేసును సీబీసీడీకి అప్పగించాలని డీసీసీబీ బోర్డు సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. అక్కడ జరిగిన *18 కోట్ల అక్రమాలపై పూర్తిస్థాయిలో నిగ్గుతేల్చే వరకు వదిలిపెట్టవద్దని డెరైక్టర్లు ముక్తకంఠంతో పట్టుబట్టారు. శుక్రవారం డీసీసీబీ సమావేశ మందిరంలో ఇన్చార్జ్ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. అక్రమాలకు సంబంధం ఉన్న వారు ఎంతటి హోదాలో ఉన్నా విడిచిపెట్టవద్దని తీర్మానించారు. తొలుత ఇన్చార్జ్ చైర్మన్‌గా అధికారికంగా బాధ్యతలు చేపట్టిన పాండురంగారావును పలువురు డెరైక్టర్లు అభినందించారు. అనంతరం సమావేశం ప్రారంభం కాగానే డెరైక్టర్లు చాపల లింగయ్య, ఏర్పుల సుదర్శన్, పిల్లలమర్రి శ్రీనివాస్, హనుమయ్యలు మాట్లాడుతూ దేవరకొండలో జరిగిన అవినీతి అక్రమాలపై నాన్చుడి ధోరణికి పోకుండా వెంటనే సీబీసీఐడీ చేత విచారణ జరిపించడానికి సమావేశంలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. విచారణలో కాలయాపన చేయడం వలన బ్యాంకుపై ప్రజలలో నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉందని చెప్పారు. నూతనంగా ఇన్చార్జ్ బాధ్యతలు తీసుకున్నందున నిస్పక్షపాతంగా సీబీసీఐడీ చేత విచారణ జరిపించాలని కోరారు. దీంతో ఇన్చార్జ్ చైర్మన్ పాండురంగారావు మాట్లాడుతూ అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటి హోదాలో ఉన్నా ఎవరినీ వదలిపెట్టేది లేదని, విచారణ సీబీసీఐడీతోనే జరిపించడానికి తీర్మాణనం చేస్తున్నామని తెలిపారు. నిజాన్ని నిగ్గుతేల్చేంత వరకు విడిచేది లేదని అన్నారు. బ్యాంకుకు పూర్వ వైభవం వచ్చేలా చూస్తా : ఇన్చార్జ్ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు వచ్చిన మచ్చను తొలగించి పూర్వవైభవాన్ని తీసుకురావడానికి అందరి సహకారంతో ముందుకు సాగుతానని ఇన్చార్జ్ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు తెలిపారు. శుక్రవారం డీసీసీబీలో విలేకరులతో మాట్లాడారు. బ్యాంకు అధికారులు, డెరైక్టర్ల సమష్టి సహకారంతో బ్యాంకును అన్ని విధాలుగా లాభాల బాటలో నడిపించి రైతులకు మెరుగైన సేవలు అందించనున్నామన్నారు. దేవరకొండ సహకార బ్యాంకులో జరిగిన అక్రమాలపై సీబీసీఐడీ చేత విచారణ చేయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. బ్యాంకు అధికారులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. త్వరలో అధికారులు, డెరైక్టర్లతో కలిసి జిల్లాలోని అన్ని బ్రాంచ్‌లను సందర్శించి అక్కడ ఉన్న లోపాలను సవరించడానికి కృషి చేయనున్నామని తెలిపారు. బ్యాంకు సీఈఓ భాస్కర్‌రావు మాట్లాడుతూ దేవరకొండ అక్రమాలపై సీబీసీఐడీతో విచారణ జరిపించడంతో పాటు బ్యాంకులో అక్రమాలు జరిగి నట్లు వచ్చిన ఆరోపణలపై హెచ్ఆర్ కమిటీతో విచారణ జరిపించనున్నట్లు చెప్పారు. పాలకమండలి సహకారంతో బ్యాంకును లాభాల బాటలో నడిపించనున్నామన్నారు. విలేకరుల సమావేశంలో డెరైక్టర్లు డేగబాబు, గరిణే కోటేశ్వర్రావు, మిర్యాల గోవర్ధన్, గుడిపాటి వెంకటరమణ, హరియానాయక్, పీర్‌నాయక్ పాల్గొన్నారు. -
నకిలీ ఇంగ్లిష్ టీచర్లపై దర్యాప్తు ముమ్మరం
కొణిజర్ల(వైరా),న్యూస్‌లైన్: జిల్లాలో తప్పుడు సర్టిఫికెట్లతో పదోన్నతులు పొందిన 66 మంది ఇంగ్లిష్ ఉపాధ్యాయులపై సీబీసీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసిందని, ఈ నివేదిక రాగానే సంబంధిత ఉపాధ్యాయులపై చర్య తీసుకుంటామని జిల్లా విద్యాశాఖాధికారి రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. బుధవారం వైరాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సదరు ఉపాధ్యాయులపై శాఖా పరమైన దర్యాప్తు పూర్తి చేసి, క్రిమినల్ కేసులకు సిఫారసు చేసినట్లు తెలిపారు. అలాగే తప్పుడు వైద్య ధ్రుపత్రాలతో రీయింబర్స్మెంట్ పొందిన 21 మంది ఉపాధ్యాయులకు 3 ఇంక్రిమెంట్లు కోత విధిస్తున్నట్లు తెలిపారు. పదో తర గతి విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ నుంచి ఇచ్చే స్టడీ మెటీరియల్ రెండు మూడు రోజుల్లో అన్ని పాఠశాలలకు పంపిణీ చేస్తామన్నారు. జిల్లాలో 33 మోడల్ స్కూళ్లు ఈ ఏడాది ప్రారంభం కావాల్సి ఉండగా స్థలం లేక 31 పాఠశాలలు ప్రారంభం కాలేద ని, రెండు పాఠశాలలు మాత్రమే ప్రస్తుతం నడుస్తున్నాయని వివరించారు. జాతీయ సగటు మహిళా అక్షరాస్యత శాతం తక్కువగా ఉన్న మండలాల్లో మాత్రమే మోడల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామన్నారు. ఉపాధ్యాయుల ప్రమోషన్ల ప్రక్రియ కోర్టులో ఉన్నందున ప్రభుత్వం నుంచి వచ్చే ఉత్తర్వులకు అనుగుణంగా పదోన్నతులు చేపట్టి, షెడ్యూలు విడుదల చేస్తామన్నారు. ఆర్వీఎం పీఓ బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో ఆర్వీఎం ద్వారా ఈ ఏడాది రూ.84.65 కోట్లు కేటాయించగా ఇప్పటివరకు రూ.62.51 కోట్లు వివిధ పనులకు ఖర్చు చేసినట్లు తెలిపారు. జిల్లాలో అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో మరుగుదొడ్ల మరమ్మతులకు నిధులు పుష్కలంగా విడుదల చేసినట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఏఎంఓ వి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
నేడో రేపో బేడీలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పదోన్నతి కోసం బోగస్ సర్టిఫికెట్లు సమర్పించిన 42 మంది ప్రభుత్వ ఉపాధ్యాయుల అరెస్టుకు రంగం సిద్ధమైంది. నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపిన సీబీసీఐడీ ఆధారాల సేకరణ ప్రక్రియ పూర్తి చేసినట్లు సమాచారం. దర్యాప్తు నివేదికను కోర్టుకు సమర్పించిన తర్వాత నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ అయ్యే అవకాశముంది. బోగస్ సర్టిఫికెట్ల ద్వారా పదోన్నతి పొందిన వారు రాష్ట్రంలో 3,500 మంది ఉన్నట్లు ఆరోపణలు రాగా, ఇందులో జిల్లా నుంచి 300కు పైగా ఉన్నట్లు ఫిర్యాదులు అందాయి. వీటిలో ప్రస్తుతానికి 42 మందిని సీబీసీఐడీ గుర్తించినట్టు సమాచారం. డీఈఓ కార్యాలయ వర్గాల నుంచి అందిన ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్లు 420, 468, 471 (34) కింద ఎఫ్ఐఆర్ జారీ చేసిన సీబీసీఐడీ విచారణ జరిపింది. అక్టోబర్ మూడో వారంలో బోగస్ సర్టిఫికెట్లు సమర్పించిన వారిపై కేసులు నమోదయ్యాయి. 2009 జనవరి చివరివారంలో జరిగిన పదోన్నతి కౌన్సెలింగ్‌లోనూ కొందరు ఉపాధ్యాయులు బోగస్ సర్టిఫికెట్లు సమర్పించినట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో అర్హతలున్నా పదోన్నతులు దక్కక పోవడంతో కొందరు ఉపాధ్యాయులు లోకాయుక్తను ఆశ్రయించారు. లోకాయుక్త ఆదేశాల మేరకు ‘బోగస్’లను గుర్తించేందుకు 4 ఏప్రిల్, 2010లో విద్యాశాఖ డెరైక్టరేట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఉప విద్యాధికారుల స్థాయిలో సర్టిఫికెట్లను పరిశీలించి వినాయక విద్యామిషన్ (తమిళనాడు), రాజస్థాన్ విద్యాపీఠ్, కువెంపు, భోజ్ యూనివర్సిటీల పేరిట జారీ అయిన సర్టిఫికెట్లు బోగస్విగా నిర్ధారించారు. నకిలీ సర్టిఫికెట్ల ముఠా! సిద్దిపేట కేంద్రంగా ఓ ముఠా నకిలీ సర్టిఫికెట్లను చెలామణి చేస్తోందంటూ 2009 పదోన్నతుల కౌన్సెలింగ్ సందర్భంగా ‘సాక్షి’ పలు కథనాలు ప్రచురించింది. రాత్రికి రాత్రే పోస్టుగ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు పుట్టుకొచ్చిన వైనాన్ని బయట పెట్టింది. ప్రస్తుతం బోగస్ సర్టిఫికెట్లు సమర్పించిన ఉపాధ్యాయులపై విచారణ కొలిక్కి వస్తోంది. సర్టిఫికెట్లు ఎక్కడ నుంచి పొందారు, వీటి జారీ వెనుక వున్న ముఠా ఎవరనే కోణంలోనూ సీబీసీఐడీ సమాచారం సేకరిస్తోంది. డీఎస్సీ 2012లో కూడా కొందరు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించేందుకు ప్రయత్నించడంతో స్వయంగా డీఈఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీబీసీఐడీ అభియోగాలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుల జాబితాను వెలువరించేందుకు డీఈఓ కార్యాలయ వర్గాలు నిరాకరిస్తున్నాయి. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయులకు ఇప్పటికే సమాచారం ఉండటంతో కొందరు ముందస్తుగా కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నారు.