సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పదోన్నతి కోసం బోగస్ సర్టిఫికెట్లు సమర్పించిన 42 మంది ప్రభుత్వ ఉపాధ్యాయుల అరెస్టుకు రంగం సిద్ధమైంది. నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపిన సీబీసీఐడీ ఆధారాల సేకరణ ప్రక్రియ పూర్తి చేసినట్లు సమాచారం. దర్యాప్తు నివేదికను కోర్టుకు సమర్పించిన తర్వాత నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ అయ్యే అవకాశముంది. బోగస్ సర్టిఫికెట్ల ద్వారా పదోన్నతి పొందిన వారు రాష్ట్రంలో 3,500 మంది ఉన్నట్లు ఆరోపణలు రాగా, ఇందులో జిల్లా నుంచి 300కు పైగా ఉన్నట్లు ఫిర్యాదులు అందాయి. వీటిలో ప్రస్తుతానికి 42 మందిని సీబీసీఐడీ గుర్తించినట్టు సమాచారం. డీఈఓ కార్యాలయ వర్గాల నుంచి అందిన ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్లు 420, 468, 471 (34) కింద ఎఫ్‌ఐఆర్ జారీ చేసిన సీబీసీఐడీ విచారణ జరిపింది.
అక్టోబర్ మూడో వారంలో బోగస్ సర్టిఫికెట్లు సమర్పించిన వారిపై కేసులు నమోదయ్యాయి. 2009 జనవరి చివరివారంలో జరిగిన పదోన్నతి కౌన్సెలింగ్‌లోనూ కొందరు ఉపాధ్యాయులు బోగస్ సర్టిఫికెట్లు సమర్పించినట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో అర్హతలున్నా పదోన్నతులు దక్కక పోవడంతో కొందరు ఉపాధ్యాయులు లోకాయుక్తను ఆశ్రయించారు. లోకాయుక్త ఆదేశాల మేరకు ‘బోగస్’లను గుర్తించేందుకు 4 ఏప్రిల్, 2010లో విద్యాశాఖ డెరైక్టరేట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఉప విద్యాధికారుల స్థాయిలో సర్టిఫికెట్లను పరిశీలించి వినాయక విద్యామిషన్ (తమిళనాడు), రాజస్థాన్ విద్యాపీఠ్, కువెంపు, భోజ్ యూనివర్సిటీల పేరిట జారీ అయిన సర్టిఫికెట్లు బోగస్‌విగా నిర్ధారించారు.
నకిలీ సర్టిఫికెట్ల ముఠా!
సిద్దిపేట కేంద్రంగా ఓ ముఠా నకిలీ సర్టిఫికెట్లను చెలామణి చేస్తోందంటూ 2009 పదోన్నతుల కౌన్సెలింగ్ సందర్భంగా ‘సాక్షి’ పలు కథనాలు ప్రచురించింది. రాత్రికి రాత్రే పోస్టుగ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు పుట్టుకొచ్చిన వైనాన్ని బయట పెట్టింది. ప్రస్తుతం బోగస్ సర్టిఫికెట్లు సమర్పించిన ఉపాధ్యాయులపై విచారణ కొలిక్కి వస్తోంది. సర్టిఫికెట్లు ఎక్కడ నుంచి పొందారు, వీటి జారీ వెనుక వున్న ముఠా ఎవరనే కోణంలోనూ సీబీసీఐడీ సమాచారం సేకరిస్తోంది. డీఎస్సీ 2012లో కూడా కొందరు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించేందుకు ప్రయత్నించడంతో స్వయంగా డీఈఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీబీసీఐడీ అభియోగాలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుల జాబితాను వెలువరించేందుకు డీఈఓ కార్యాలయ వర్గాలు నిరాకరిస్తున్నాయి. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయులకు ఇప్పటికే సమాచారం ఉండటంతో కొందరు ముందస్తుగా కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నారు.