కర్నూలు(జిల్లా పరిషత్):
ఆదోని మున్సిపాలిటీ పరిధిలోని మున్సిపల్ స్కూల్ ఉపాధ్యాయుల పదోన్నతులు వివాదస్పదమవుతున్నాయి. రోస్టర్ కమ్ మెరిట్ గాకుండా కేవలం మెరిట్ ఆధారంగా పదోన్నతులు నిర్వహిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. పదోన్నతుల ప్రక్రియలో అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేత ప్రమేయం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈప్రక్రియతో అర్హులైన వారు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో పలువురు ఉపాధ్యాయులు కోర్టును ఆశ్రయించేందుకు రెడీ అవుతున్నారు. సాధారణంగా ఉపాధ్యాయుల పదోన్నతులను జీవో నం.436, తేది : 15-10-1996 ప్రకారం సర్వీసురూల్స్‌ను ఉపయోగించి రోస్టర్ కమ్ మెరిట్ ఆధారంగా నిర్వహిస్తారు. కానీ ఆదోని మున్సిపాలిటీలోని ఉపాధ్యాయులకు కొన్నేళ్లుగా ఇష్టం వచ్చిన రీతిలో పదోన్నతులు ఇస్తూ వెళ్లిపోయారు. ఇప్పుడు కూడా అదే విధంగా పదోన్నతులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. సర్వీస్ రూల్స్‌ను పక్కన పెట్టి కేవలం మెరిట్ ఆదారంగా 31 మందితో సీనియారిటీ జాబితా తయారు చేశారు. వారికి బుధవారం పదోన్నతులు నిర్వహించేందుకు మున్సిపల్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 2000 డీఎస్సీ ద్వారా 70 మంది ఉపాధ్యాయులు మున్సిపల్ పాఠశాలల్లో చేరారు. అప్పటి జిల్లా కలెక్టర్ సాయిప్రసాద్ రోస్టర్ కమ్ మెరిట్ ప్రకారం వీరికి పోస్టింగ్ ఇచ్చారు. ఆ తర్వాత 2004లోనూ ఇదే పద్ధతిలో 11 మందికి పదోన్నతులు కల్పించారు. అయితే కొన్నిసార్లు కొంత మంది రాజకీయ నాయకులు, అధికారులు కుమ్మక్కై నిబంధనలకు తూట్లు పొడిచినట్లు సమాచారం. పలుమార్లు మెరిట్ ఆధారంగానే అప్పట్లో పదోన్నతులు ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. రెండేళ్ల క్రితం ఈ విధమైన ప్రక్రియ ఆగిపోయింది. తాజాగా 31 మంది ఉపాధ్యాయులకు మెరిట్ ప్రకారం పదోన్నతుల ప్రక్రియ నిర్వహిస్తామంటూ మున్సిపల్ అధికారులు తేల్చి చెప్పారు. దీంతో ఎస్సీ,ఎస్టీ,బీసీ ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ విషయమై ఆదోని మున్సిపల్ కమిషనర్ కన్యాకుమారి వివరణ ఇస్తూ కోర్టు తీర్పు, డీఈవో సూచన మేరకు పదోన్నతుల ప్రక్రియ నిర్వహిస్తున్నామని చెప్పారు. కోర్టు ఉత్తర్వుల మేరకు మెరిట్ ప్రకారమే పదోన్నతులు నిర్వహిస్తామని, ఈ విషయమై ఎవ్వరికైనా అభ్యంతరం ఉంటే కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపారు.
అడ్డగోలుగా ఉపాధ్యాయ పదోన్నతులు
Published Thu, Sep 11 2014 12:35 AM | Last Updated on Sat, Sep 2 2017 1:10 PM
Advertisement