సర్టిఫి‘కేటుగాళ్ల’పై చర్యలేవీ?
నకిలీ సర్టిఫికెట్లతో విద్యాశాఖలో వేలల్లో పదోన్నతులు
తెలంగాణలో తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చినవారు 1,600 మంది!
హైదరాబాద్: విద్యాశాఖలో నకిలీ సర్టిఫికెట్ల ఫైలు అటకెక్కింది. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా వేలమంది టీచర్లు అడ్డదారిలో పదోన్నతులు పొందారని తేలింది. ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 4 వేలమంది టీచర్లు నకిలీ సర్టిఫికెట్లతో పదోన్నతులు పొందినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో విద్యాశాఖ, సీఐడీ విచారణ చేపట్టాయి. నకిలీ, తప్పుడు సర్టిఫికె ట్లతో పొందిన పదోన్నతులను రద్దు చేశారే తప్ప చర్యలు తీసుకోలేదు. గతేడాది కొద్దిమందికి నోటీసులు జారీ చేశారు. ఒకట్రెండు జిల్లాల్లో కొందరిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. ఇటీవల నకిలీ సర్టిఫికెట్ల అంశం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టికి వెళ్లింది. నాస్కామ్ ప్రతినిధులు నకిలీ సర్టిఫికెట్లపై ఫిర్యాదులు చేయడంతో మళ్లీ ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి కూడా యూనివర్సిటీల వైస్ చాన్స్‌లర్లు, పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని సర్టిఫికెట్లను వెబ్‌సైట్‌లో పెట్టడం ద్వారా నకిలీల దం దాను నిరోధించవచ్చని భావించారు.
రాష్ట్రంలోని యూనివర్సిటీల సర్టిఫికెట్లను వెబ్‌సైట్‌లో పెట్టినా ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్న నకిలీ సర్టిఫికెట్లపై దృష్టి సారించడం లేదు. ప్రధాన సమస్యల్లా ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్న సర్టిఫికెట్లతోనే ఏర్పడుతోంది. ప్రభుత్వ శాఖల్లో అలాంటి సర్టిఫికెట్లతో ఉద్యోగాలు, పదోన్నతులు పొందినవారు వేల సంఖ్య లో ఉన్నట్లు అంచనా. ఇందులో తెలంగాణ లోనే విద్యాశాఖలో నకిలీ, తప్పుడు సర్టిఫికెట్లతో పదోన్నతులు పొందినవారు 1,600 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వర్సిటీల సర్టిఫికెట్లను వెబ్‌సైట్‌లో పెట్టడమే కాకుండా ఇతర రాష్ట్రాల సర్టిఫికెట్లపై గట్టి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు చెబుతున్నారు.
2009లోనే బయటపడ్డ బాగోతం..
విద్యాశాఖలో 2009లో సెకండరీ గ్రేడ్ టీచర్ నుంచి స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతుల ప్రక్రియలో నకిలీ సర్టిఫికెట్ల బాగో తం బయటపడింది. జిల్లాల్లో అధికారులు ముడుపులు పుచ్చుకొని తొక్కి పెట్టారనే ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. ఆ తర్వాత అప్పటి పాఠశాల విద్యా డెరైక్టర్ పూనం మాలకొం డయ్య నకిలీల వ్యవహారాన్ని తేల్చేందుకు అధ్యయనం చేయించారు. ఇతర రాష్ట్రాల్లోని విద్యాసంస్థల సర్టిఫికెట్ల పరిశీ లనకు ప్రత్యేకచర్యలు చేపట్టారు. 14 అంశాలపై లోతుగా పరిశీలన జరిపారు. టీచర్లు నకిలీ సర్టిఫికెట్లతో పదోన్నతులు పొందినట్లు 2010లోనే నిర్ధారణకు వచ్చారు. అక్రమాలపై చర్యలకు విద్యాశాఖ డెరైక్టరేట్ ఆదేశాలు జారీ చేసినా నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినవారిపై చర్యలు చేపట్టలేదు.
జిల్లాల్లో ఇదీ పరిస్థితి..
కరీంనగర్ జిల్లాలో 138 మందివి నకిలీ సర్టిఫికెట్లు అని తేల్చగా, 53 మంది సర్టిఫికెట్లపై అనుమానాలు ఉన్నాయని తేల్చారు. మరో 76 మంది చెల్లని సర్టిఫికెట్లు పెట్టినట్లు నిర్ధరణకు వచ్చారు. వరంగల్ జిల్లాలో 121 మంది, ఖమ్మంలో 83 మంది టీచర్లు, ఆదిలాబాద్‌లో 33 మంది టీచర్లు, నల్లగొండలో 63 మంది టీచర్లు నకిలీ సర్టిఫికెట్లు పెట్టినట్లు తేల్చారు. వీరే కాక అనేక మంది తప్పుడు సర్టిఫికెట్లు, గుర్తింపులేని యూనివర్సిటీల సర్టిఫికెట్లు, స్కూల్లో పని చేస్తూ, సెలవు పెట్టకుండానే రెగ్యులర్‌గా చదివినట్లు సర్టిఫికెట్లు పొందారు. రెండేళ్ల పీజీని ఒక ఏడాదే చదివినట్లు సర్టిఫికెట్లు తెచ్చుకుని పదోన్నతులు పొందిన వారు ఉన్నారు. వీరిపై ఎలాంటి చర్యలు చేపడతారో వేచి చూడాల్సిందే!