క్లాస్‌ రూమ్‌కు సెల్‌ తీసుకెళ్లొద్దు | Do not take cell to class room | Sakshi
Sakshi News home page

క్లాస్‌ రూమ్‌కు సెల్‌ తీసుకెళ్లొద్దు

Published Thu, Sep 19 2024 3:42 AM | Last Updated on Thu, Sep 19 2024 3:42 AM

Do not take cell to class room

ఉపాధ్యాయులకు విద్యాశాఖ ఆదేశాలు    

సెల్‌ఫోన్‌ వాడితే చర్యలు తప్పవని హెచ్చరిక    

కలెక్టర్ల ఆకస్మిక తనిఖీల నేపథ్యంలో నిర్ణయం!

సాక్షి, హైదరాబాద్‌: తరగతి గదిలోసెల్‌ఫోన్‌ వాడొద్దని ఉపాధ్యాయులకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అలా చేస్తే శిక్ష తప్పదని హెచ్చరించింది. ఫోన్‌ వాడే టీచర్లను ఓ కంట కనిపెట్టాలని అధికారులకు సూచించింది. క్లాస్‌ రూ మ్‌లోకి అసలు ఫోన్‌ లేకుండానే వెళ్ళాలని స్పష్టం చేసింది. అత్యవసరమైతేనే ఫోన్‌ తీసుకెళ్ళాలని, దానికీ ప్రధానోపాధ్యాయుడి అనుమతి తప్పనిసరి అని పేర్కొంది. 

వాస్తవానికి ఈ నిబంధన పాతదేనని ఉన్నతాధికారులు అంటుండగా, ఇకపై దీన్ని కఠినంగా అమలు చేయనున్నట్లు డీఈవోలు చెబుతున్నారు. కొన్ని నెలల పాటు సెల్‌ఫోన్‌ వినియోగంపై నిఘా పెట్టాలని ఎంఈవోలకు ఆదేశాలిచ్చారు. దీనిపై ఉపాధ్యాయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా యి. ఇది టీచర్లకు ఇబ్బందికరంగా మారుతుందని, హెచ్‌ఎంలు వేధించేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. 

వాట్సాప్‌ చూస్తూ..ఫోన్‌ మాట్లాడుతూ..! 
ఇటీవల కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. అనేకమంది టీచర్లు సెల్‌ఫోన్‌లో వాట్సాప్, ఇతర సోషల్‌ మీడియా ఫాలో అవుతూ గడుపుతున్నారని గుర్తించారు. కొంతమంది ఎక్కువ సమయం ఫోన్‌లో మాట్లాడుతున్నారనే ఫిర్యాదులొచ్చాయి. దాదాపు 12 జిల్లాల నుంచి ఈ తరహా ఉదంతాలను జిల్లా అధికారులు గుర్తించారు. వీటిని రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయానికి పంపారు. 

సెల్‌ఫోన్‌పై క్లాస్‌రూంలో నిషేధం విధించాలని సూచించారు. పైగా టీచర్లు బోధనకు ముందుగా సన్నద్ధమవ్వడం లేదని, క్లాస్‌ రూంలో సెల్‌ఫోన్‌ ద్వారా సెర్చ్‌ చేసి పాఠాలు చెబుతున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. విద్యార్థులు క్లిష్టమైన ప్రశ్నలు వేసినప్పుడు సెల్‌ఫోన్‌లో సెర్చ్‌చేసి సమాధానమిస్తున్నారని ఉన్నతాధికారుల దృష్టికి వచి్చంది. వీటన్నింటినీ పరిగణనలోనికి తీసుకుని సెల్‌ఫోన్‌పై నిషేధం విధించినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. 

ఫోన్‌ లేకుండా స్కూల్‌ నడుస్తుందా? 
టీచర్లు వ్యక్తిగత ప్రయోజనాలకు సెల్‌ వాడుతున్నారని చెప్పడం అర్థం లేని మాట. అసలు సెల్‌ఫోన్‌ లేకుండా స్కూళ్ళు నడిచే అవకాశం ఉందా? విద్యార్థుల ముఖ హాజరు తీసుకోవాలంటే ఫోన్‌ కావాలి. ఉన్నతాధికారులకు పంపే అన్ని రిపోర్టులను సెల్‌ లేదా ట్యాబ్‌ ద్వారానే పంపాల్సి ఉంటుంది. అత్యాధునిక టెక్నాలజీ వాడమని ప్రభుత్వాలే చెబుతున్నాయి. సెల్‌ఫోన్‌తో పనులు చేయాలని చెప్పే అధికారులు ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలి.    – చావా రవి  (టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) 

స్వీయ నియంత్రణ మంచిది 
తరగతి గదిలో సెల్‌ఫోన్‌ వాడకంపై నిషేధం కన్నా.. టీచర్లు స్వీయ నియంత్రణ పాటించేలా చర్య లు తీసుకోవాలి. బోధనకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన అవసరం ఉంది. నిషేధాన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది హెచ్‌ఎంలు అనవసరంగా టీచర్లను వేధించకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా స్కూల్లో ఫోన్‌ వినియోగానికి టీచర్లు దూరంగా ఉండాలి.      – సయ్యద్‌ షౌకత్‌ అలీ (టీఎస్పీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు) 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement