cellphone
-
క్లాస్ రూమ్‌కు సెల్ తీసుకెళ్లొద్దు
సాక్షి, హైదరాబాద్: తరగతి గదిలోసెల్‌ఫోన్ వాడొద్దని ఉపాధ్యాయులకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అలా చేస్తే శిక్ష తప్పదని హెచ్చరించింది. ఫోన్ వాడే టీచర్లను ఓ కంట కనిపెట్టాలని అధికారులకు సూచించింది. క్లాస్ రూ మ్‌లోకి అసలు ఫోన్ లేకుండానే వెళ్ళాలని స్పష్టం చేసింది. అత్యవసరమైతేనే ఫోన్ తీసుకెళ్ళాలని, దానికీ ప్రధానోపాధ్యాయుడి అనుమతి తప్పనిసరి అని పేర్కొంది. వాస్తవానికి ఈ నిబంధన పాతదేనని ఉన్నతాధికారులు అంటుండగా, ఇకపై దీన్ని కఠినంగా అమలు చేయనున్నట్లు డీఈవోలు చెబుతున్నారు. కొన్ని నెలల పాటు సెల్‌ఫోన్ వినియోగంపై నిఘా పెట్టాలని ఎంఈవోలకు ఆదేశాలిచ్చారు. దీనిపై ఉపాధ్యాయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా యి. ఇది టీచర్లకు ఇబ్బందికరంగా మారుతుందని, హెచ్ఎంలు వేధించేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. వాట్సాప్ చూస్తూ..ఫోన్ మాట్లాడుతూ..! ఇటీవల కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. అనేకమంది టీచర్లు సెల్ఫోన్లో వాట్సాప్, ఇతర సోషల్ మీడియా ఫాలో అవుతూ గడుపుతున్నారని గుర్తించారు. కొంతమంది ఎక్కువ సమయం ఫోన్లో మాట్లాడుతున్నారనే ఫిర్యాదులొచ్చాయి. దాదాపు 12 జిల్లాల నుంచి ఈ తరహా ఉదంతాలను జిల్లా అధికారులు గుర్తించారు. వీటిని రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయానికి పంపారు. సెల్‌ఫోన్‌పై క్లాస్‌రూంలో నిషేధం విధించాలని సూచించారు. పైగా టీచర్లు బోధనకు ముందుగా సన్నద్ధమవ్వడం లేదని, క్లాస్ రూంలో సెల్‌ఫోన్ ద్వారా సెర్చ్ చేసి పాఠాలు చెబుతున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. విద్యార్థులు క్లిష్టమైన ప్రశ్నలు వేసినప్పుడు సెల్ఫోన్లో సెర్చ్‌చేసి సమాధానమిస్తున్నారని ఉన్నతాధికారుల దృష్టికి వచి్చంది. వీటన్నింటినీ పరిగణనలోనికి తీసుకుని సెల్‌ఫోన్‌పై నిషేధం విధించినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. ఫోన్ లేకుండా స్కూల్ నడుస్తుందా? టీచర్లు వ్యక్తిగత ప్రయోజనాలకు సెల్ వాడుతున్నారని చెప్పడం అర్థం లేని మాట. అసలు సెల్‌ఫోన్ లేకుండా స్కూళ్ళు నడిచే అవకాశం ఉందా? విద్యార్థుల ముఖ హాజరు తీసుకోవాలంటే ఫోన్ కావాలి. ఉన్నతాధికారులకు పంపే అన్ని రిపోర్టులను సెల్ లేదా ట్యాబ్ ద్వారానే పంపాల్సి ఉంటుంది. అత్యాధునిక టెక్నాలజీ వాడమని ప్రభుత్వాలే చెబుతున్నాయి. సెల్‌ఫోన్‌తో పనులు చేయాలని చెప్పే అధికారులు ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలి. – చావా రవి (టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) స్వీయ నియంత్రణ మంచిది తరగతి గదిలో సెల్‌ఫోన్ వాడకంపై నిషేధం కన్నా.. టీచర్లు స్వీయ నియంత్రణ పాటించేలా చర్య లు తీసుకోవాలి. బోధనకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన అవసరం ఉంది. నిషేధాన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది హెచ్ఎంలు అనవసరంగా టీచర్లను వేధించకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా స్కూల్లో ఫోన్ వినియోగానికి టీచర్లు దూరంగా ఉండాలి. – సయ్యద్ షౌకత్ అలీ (టీఎస్పీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు) -
టీనేజర్లపై.. స్మార్ట్ ఫోన్ల ప్రభావం! అధ్యయనాల్లో ఏం తేలిందంటే?
ఇటీవల పరిస్థితులను గమనిస్తే చిన్నారుల నుంచి మొదలుకొని పండు ముదుసలి వరకు సెల్ ఫోన్ వాడనీ వారు లేరేమో. సంవత్సరంలోపు పిల్లలు గుక్కపట్టి ఏడిస్తే కన్నతల్లి దగ్గరకు తీసుకొని పాలు తాగించేది. భయంతో ఏడిస్తే నేనున్నానే భరోసాను నింపుతూ ఎత్తుకుని లాలించేది. గోరుముద్దలు తినిపిస్తూ జోలపుచ్చే ది. కానీ ప్రస్తుతం ఇవేవీ కనిపించడం లేదు. ఆప్యాయతలు, ప్రేమానురాగాలు కనుమరు గయ్యాయి. పిల్లవాడు మారం చేస్తేచాలు సెల్ ఫోన్ చేతిలో పెడితే ఏడుపు ఆగిపోతుంది. సెల్ ఫోన్ మన జీవతంలో ఎంత దూరం వరకు వెళ్లిందో గమనిస్తున్నామా అనిపిస్తుంది.ప్రస్తుతం ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్లు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం పరిస్థితులను గమనిస్తే ఇంటిలో ఏది ఉన్నా లేక పోయినా స్మార్ట్ ఫోన్లు మాత్రం ఇంటిలో కనీస ఒక్కరికి ఉంటుంది. అదృష్టమో, దురదృష్టమో కానీ స్మార్ట్ ఫోన్ నేడు మానవ జీవతంలో ఒక భాగమైంది. చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉంటే చాలు అందలమెక్కేసినట్లుగా భావిస్తున్నారు. జనం నాలుగో జనరేషన్ టెక్నాలజీ పుణ్యమా అని స్మార్ట్ ఫోన్లు మరింత స్మార్ట్ గా జనానికి చేరువైపోయింది.అవసరం కోసం మొదలై సౌకర్యంగా అలవాటై చివరికి ఫోన్ కి బానిసలుగా మారే ప్రమాదకరం ఏర్పాడింది. స్మార్ట్ ఫోన్ల విషయంలో నియంత్రణ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. పేరెంట్స్ ఇద్దరు ఉద్యోగస్తులు అయిన ఇళ్లల్లో ఇలాంటి సమస్య ఎక్కువగా తలెత్తుతుంది. సెల్ ఫోన్ వాడకంతో పిల్లల్లో మానసిక సామర్థ్యం కొరవడుతుంది.సెల్ ఫోన్ నుంచి వచ్చే రేడియో ధార్మిక కిరణాల నుంచి చిన్నారుల బ్రెయిన్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. పిల్లల్లో సృజనాత్మకశక్తి, ఆలోచనాశక్తి, తెలివితేటలు, మందగిస్తాయి. ఏకాగ్రత సన్నగిల్లుతుంది. ఆత్మ విశ్వాసం లోపించడంతో పాటుగా కోపం, మానసిక ఒత్తిడి, ఆందోళనలు పెరిగే అవకాశం ఉంటుంది. సెల్ ఫోన్లలో వివిధ రకాలైన గేమ్స్ అందుబాటులోకి రావడంతో ఆ గేమ్స్ లో మునిగిపోయిన పిల్లలు పక్కనున్న ఎవరినీ పట్టించుకోని స్థితిలో ఒంటరితనానికి అలవాటుపడి మానవ సంబంధాలకు దూరంగా తల్లిదండ్రుల ఆత్మీయ స్పర్శకు నోచుకోలేక పెరుగుతారు.మొదటగా ఎంతో చిన్నవిగా కనిపించే సమస్యలను సరైన సమయంలో పట్టించుకుని సరైన పరిష్కారాలు వెతకకపోతే అవే పెద్దవిగా మారి పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యంపై త్రీవ ప్రభావాన్ని చూపిస్తాయి. పిల్లలు ఏవైనా సమస్యలతో బాధపడుతూ, ఏడుస్తూ తమ దగ్గరకు వస్తే అవి చిన్నవే కదా అని వదిలివేయకుండా వాటిని పరిశీలించి, పరిష్కరించాలి. తల్లిదండ్రులు పని ఒత్తిడిలో ఉండి సెల్ ఫోన్లోనే అన్ని సమస్యలకు పరిష్కారం ఉన్నట్లు యూట్యూబ్ గేమ్స్ కు పిల్లలను అలవాటు చేస్తున్నారు.ఇవి పిల్లవాడి భవిష్యత్తును దెబ్బతీస్తుందని గుర్తించాలి. పిల్లల కోసమే మా జీవతం అని భావిస్తున్న తల్లిదండ్రులు పిల్లల సెల్ ఫోన్ వాడకంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే వారి భవిష్యత్తును చేజేతులా పాడు చేసినవారవుతారు. పిల్లలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండటం చాల ముఖ్యం. సమస్య ఎదురైనప్పుడు ముందుగా గుర్తించి దాన్ని పరిష్కారం చేయగలిగితే పిల్లల భవిష్యత్ బంగారంగా మార్చుకోచ్చు.టీనేజర్ల ప్రవర్తనపై అధ్యయనం..టీనేజర్ల ఆరోగ్యం, ప్రవర్తన తాలూకు అంశాలపై అమెరికాలోని "శాండియాగో స్టేట్ యూనివర్సిటీ సైకాలజీ ప్రొఫెసర్ ఐజెన్ కన్సెల్టింగ్ ఫౌండర్" వైద్యురాలు 'జీన్ త్వెంగె' టీనేజర్ల ప్రవర్తనపై అధ్యయనం చేశారు. ఆమె తన బృందంతో కలసి 13 నుంచి 18 వయస్సుగల పది లక్షలకు పైగా పిల్లలపై అధ్యయనం చేశారు.టీనేజర్లు తమ సమయాన్ని ఎలా గడుతున్నారనేదే మానసిక ఆరోగ్య కోణంలో ప్రాథమిక అంశమని ఆమె పేర్కొన్నారు. స్మార్ట్ ఫోన్ల యుగం పిల్లల్లో మానసిక సమస్యలు సర్వసాధారణమైపోయాయి. ఇందుకు సంబంధించిన ఓ బలమైన కేస్ స్టడీని ప్రపంచం ముందుంచారు జీన్ త్వెంగె. ఒంటరితనంతో బాధపడే టీనేజర్లు సంఖ్య బాగా పెరగడం, వారు తమ జీవితం వృథా అయిపోనట్లు భావిస్తుండడం వంటి లక్షణాలు గమనించారు. ఇవన్నీ డిప్రెషన్ లక్షణాలు.ఐదేళ్లలో ఈ వ్యాధి లక్షణాలు 60 శాతం మేరకు పెరిగాయి. తమను తాము గాయపరచుకునేంతగా అవి విజృంభించాయి. బాలికల్లో ఈ ప్రమాదకర ధోరణి రెండు మూడింతలు పెరిగింది. కొన్నేళ్లలోనే టీనేజర్ల అత్మహత్యలు రెట్టింపయ్యాయి. అని జీన్ తన అధ్యయన సారాంశాన్ని వివరించారు."అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్" కలిసి జరిపిన అధ్యయనం ప్రకారం మన దేశంలోని కాలేజీ విద్యార్థులు రోజుకు 150 సార్లకు పైగా తమ ఫోన్లు చెక్ చేసుకుంటున్నారు. ఫోన్ చూసుకోకపోతే ఏదో మిస్ అయిపోతామనే ఆలోచన వారిని వెంటాడుతోందని, ఇదో వ్యసనంలా మారిందని పరిశోధకులు స్పష్టం చేశారు. ఈ లక్షణాలున్న వారు క్రమంగా యాంగ్జయిటీ సంబంధిత సమస్యల బారినపడే ప్రమాదముందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.ఇవి చదవండి: మచ్చల జింక, దెయ్యం అంటూ అవహేళనలు..! ఐనా.. -
మీ ఫోనే.. మీ ఆయుధం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘‘ఇటువైపున జగన్ ఒకే ఒక్కడు... అటువైపున చూస్తే ఇంత మంది! దానికి తోడు కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలు, మోసాలు, బెదిరింపులు, హెరాస్మెంట్.. అన్నీ జరుగుతున్నాయి. మరిఇంత మంది, ఇన్ని కుట్రలు, ఇన్ని ఇబ్బందులను తట్టుకుని మీ జగన్ నిలబడగలుగుతున్నాడంటే కారణం? వాళ్లకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఉండొచ్చు కానీ మనకు సోషల్ మీడియా ఉంది. సెల్‌ఫోన్ చేతిలో ఉన్న నా ప్రతి చెల్లెమ్మ, ప్రతి తమ్ముడూ జగన్‌కు తోడుగా ఉన్నారు. అందుకే జగన్ ఒంటరి కాదు. జగన్‌కు కోట్ల గుండెలు అండగా ఉన్నాయి’ అని సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. 21వ రోజు ‘మేమంతా సిద్ధం బస్సు’ యాత్ర సందర్భంగా మంగళవారం విశాఖ జిల్లా పెద్దిపాలెంలోని చెన్నాస్ కన్వెన్షన్ హాలులో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో నిర్వహించిన ముఖాముఖిలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. రాత్రి బస ప్రాంతం నుంచి సీఎం అక్కడకు చేరుకున్నారు. పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి సజ్జల భార్గవ్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ ముఖాముఖి కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల సోషల్ మీడియా కార్యకర్తలతోపాటు వివిధ దేశాల నుంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. మీకు ఎంత చేసినా తక్కువే ఆ దేవుడి దయమీద జగన్‌కు నమ్మకం ఉంది. జగన్‌ను ప్రేమించే గుండెల మీద నమ్మకం ఉంది. మరి జగన్ ఒంటరి ఎలా అవుతాడు? మీరు చూపిస్తున్న అభిమానానికి మీకు ఎంత చేసినా తక్కువే అవుతుంది. అన్ని రకాలుగా మీ అందరికీ తోడుగా ఉంటామని మరోసారి భరోసా ఇస్తున్నా. భార్గవ్ చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ స్ట్రీమ్ లైనింగ్ చేయడంలో ముందు నిలిచి అడుగులు వేస్తున్నాడు. మీ వెనుక ఒక్క జగనే కాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మీకు అండగా నిలుస్తుంది. ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలం, ప్రతి గ్రామంలో మీకు అండగా ఉంటామని భరోసా ఇస్తున్నా. మన మీద దుష్ట చతుష్టయం దాడులు పెరిగాయంటే దాని అర్థం మనం విజయానికి చాలా దగ్గరగా ఉన్నామనే! ఇంకా పెద్ద స్క్రిప్ట్ ఏదో ఉన్నట్లే! దెబ్బ ఇక్కడ (నుదిటిపై) తగిలింది. ఇక్కడ (కంటిపై) తగల్లేదు. ఇక్కడా (కణతలపై) తగల్లేదంటే.. దేవుడు ఇంకా పెద్ద స్క్రిప్ట్ ఏదో మనతో రాయించే కార్యక్రమంలో ఉన్నాడని అర్థం. కాబట్టి ఆందోళన అవసరం లేదు. 175కి 175 అసెంబ్లీ, 25కి 25 ఎంపీ సీట్లను గెలుచుకోవడంలో మనం ఎక్కడా తగ్గేదే లేదు. ఫోన్ అనే ఆయుధం మీ చేతుల్లోనే ఉందని గుర్తు పెట్టుకోవాలని కోరుతున్నా. వందల మంది చంద్రబాబులు, రామోజీలు, దత్తపుత్రులు, ఎల్లో మీడియాలు వచ్చినా వైఎస్ జగన్ తొణకడు. కారణం.. పైన దేవుడున్నాడు, కింద మీరంతా మీ అన్నకు అండగా ఉన్నారు. ప్రత్యేకంగా యాప్.. సోషల్ మీడియా వల్ల ఎవరైనా ఇబ్బందులకు గురైతే చెప్పుకోగలిగేలా ఒక యాప్ తయారు చేయాలి. ప్రతివారం నాకు దానిపై రిపోర్టు కావాలి. సిటీ ఆఫ్ డెస్టినీ.. ఆంధ్రా డెస్టినీ మన విశాఖ వచ్చిన మీరంతా ఈరోజు సిటీని చూస్తున్నారు కదా! ఈ సిటీ ఆఫ్ డెస్టినీ రేపు ఆంధ్ర రాష్ట్ర డెస్టినీ అవుతుందని కచ్చితంగా చెబుతున్నా. ఎప్పుడైతే ఒక ముఖ్యమంత్రి వచ్చి ఈ సిటీలో కూర్చుని పరిపాలన ప్రారంభిస్తారో అప్పుడు హైదరాబాద్, చెన్నై, బెంగళూరుతో పోటీ పడే పరిస్థితి వస్తుంది. ఐటీని అత్యుత్తమ స్థానానికి చేర్చే పరిస్థితి కూడా వస్తుంది. చెల్లి గీతాంజలి చావుకు కారకులు.. ఇప్పటిదాకా ప్రతి సందర్భంలోనూ నాకు తోడుగా ఉంటున్న మీ అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా. మరో 18 రోజుల్లో ఎన్నికల యుద్ధం జరగనుంది. ఒక్క జగన్ మీద చంద్రబాబు, దత్తపుత్రుడు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5.. వీళ్లంతా చాలరన్నట్లుగా బీజేపీ, కాంగ్రెస్ యుద్ధం చేస్తున్నాయి. ఈ మధ్య వాళ్ల ఉక్రోషం ఏ స్థాయికి వెళ్లిందంటే సోషల్ మీడియాలో జగన్‌కు సపోర్ట్ చేసిందని చెల్లెమ్మ గీతాంజలిని ఎంత దారుణంగా వేధించారో అందరూ చూశారు. జగనన్న చేసిన మంచితో తన కుటుంబం బాగుపడిందని, జగనన్న వల్ల తనకు ఇల్లు, ఇంటి స్థలం వచ్చిందని, మిగిలిన పథకాలు కూడా వచ్చాయని తన సంతోషాన్ని అందరితో పంచుకోవటమే ఆమె చేసిన పాపం! చివరికి ఆ చెల్లి సూసైడ్ చేసుకునే పరిస్థితికి వెళ్లిందంటే ఈ వ్యవస్థ ఎంత దారుణంగా చెడిపోయిందో చెప్పేందుకు నిదర్శనం. అన్నా.. జాగ్రత్త తెనాలిలో ఇంటి పట్టా తీసుకున్న గీతాంజలి ఆనందంతో తన అభిప్రాయాన్ని చెప్పుకుంది. కాయలున్న చెట్టుకు రాళ్ల దెబ్బలు తప్పవు. వైఎస్సార్సీపీ కాయలున్న చెట్టు అయితే టీడీపీ ముళ్ల చెట్టు లాంటిది. గీతాంజలి కుటుంబానికి వైఎస్సార్సీపీ ఎంతో అండగా నిలిచింది. అన్నా మీరు జాగ్రత్త.. మీ మీద దాడి జరిగితే అది మా మీద జరిగినట్లు భావించాం. వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబుకు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు. చంద్రబాబు యుద్ధానికి డైరెక్ట్‌గా రాడు. – పి.నాని, బాపట్ల జిల్లా విశాఖ ఘటనకు నేనే ప్రత్యక్ష సాక్షిని.. విశాఖ ఎయిర్‌పోర్టులోని ఫుడ్ కోర్టు టీడీపీ వాళ్లదని తెలియక గతంలో అక్కడ ఉద్యోగం చేశా. విశాఖ ఎయిర్‌పోర్టులో మీపై జరిగిన దాడి ఘటనకు నేను ప్రత్యక్ష సాక్షిని. నేను జగన్ అభిమానిని అని తెలిసి నన్ను చాలా వేధించారు. టీడీపీ నాయకులు లోకేశ్, చంద్రబాబు, బాలకృష్ణ, సీఎస్‌వో వేణుగోపాల్, హర్షవర్థన్ అందరూ ఒక కూటమిలా ఉండేవాళ్లు. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా నేను పీసీఎస్ రూల్స్ ప్రకారం నడుచుకుంటే నాపై దొంగ కేసులు బనాయించారు. నాకెక్కడా ఉద్యోగం రాకుండా చేశారు. నా కుటుంబాన్ని ఎంతగానో హింసించారు. సీఎస్‌వో వేణుగోపాల్ నిన్ను ఎక్కడా బతకనివ్వనని బెదిరించారు. మీ మీద హత్యాయత్నం వ్యవహారంలో నాపై ఒత్తిడి తేవటంతో ఉద్యోగానికి రాజీనామా చేసి మా కుటుంబం అంతా దూరంగా వెళ్లిపోయాం. ఇన్నేళ్లూ ఉద్యోగం లేకుండా ఉన్నా. విజయవాడలో మీ మీద బొండా ఉమ ప్రోద్బలంతో జరిగిన దాడి చూశాక మౌనంగా ఉండలేక ఇవన్నీ బయట పెడుతున్నా. – సామ్రాజ్యం, మాజీ ప్రైవేట్ చీఫ్ సెక్యూరిటీ అఫీసర్, విశాఖ ఎయిర్‌పోర్టు ముస్లింలంతా మీ వెనకే .. 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో ముస్లింలంతా భయపడుతూ బతికారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఊపిరి పీల్చుకుంటున్నాం. మైనార్టీలను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డిప్యూటీ సీఎంగా, మండలి వైస్ చైర్‌పర్సన్‌గా చేశారు. ఏడుగురికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. ముస్లింల కోసం వైఎస్సార్ ఒక అడుగు ముందుకేస్తే.. మీరు నాలుగు అడుగులు ముందుకేశారు. – వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమాని మీ మాటలు మాకెంతో స్ఫూర్తినిస్తాయి. అబ్రహాం లింకన్, గాంధీజీ, అంబేడ్కర్ గురించి పుస్తకాల్లో చదువుకున్నాం. మీరు మాకు కళ్లెదుటే కనిపించే లైవ్ ఎగ్జాంపుల్. మీ లైఫ్ జర్నీ ఇంకా తెలుసుకోవాలని ఉంది. మీ మాటలు మాకెంతో స్ఫూర్తినిస్తాయి. –హెబ్సిబా, అసోసియేట్ ప్రొఫెసర్, ఫార్మసీ మీ మాటలు మాకెంతో స్ఫూర్తినిస్తాయి. అబ్రహాం లింకన్, గాంధీజీ, అంబేడ్కర్ గురించి పుస్తకాల్లో చదువుకున్నాం. మీరు మాకు కళ్లెదుటే కనిపించే లైవ్ ఎగ్జాంపుల్. మీ లైఫ్ జర్నీ ఇంకా తెలుసుకోవాలని ఉంది. మీ మాటలు మాకెంతో స్ఫూర్తినిస్తాయి. –హెబ్సిబా, అసోసియేట్ ప్రొఫెసర్, ఫార్మసీ మీ అభిమానిగా ఒక్క రోజైనా చాలు తమ్ముడు భరత్‌కుమార్‌రెడ్డి ఫిబ్రవరిలో ఎన్నికల ప్రచారానికి వెళ్లి వస్తూ ప్రమాదవశాత్తు మృతిచెందాడు. ఆ సమయంలో ఎమ్మెల్యే శ్రీకాంత్, భార్గవ్ అన్న మా కుటుంబానికి అండగా నిలిచారు. నా తమ్ముడికి మీరే దైవం అన్నా. మీరు బాగుంటేనే మేమూ బాగుంటాం. మీరు తలపెట్టిన ప్రతి కార్యక్రమంపై ఎల్లోమీడియా దుష్ప్రచారం చేసేది. భార్గవ్ అన్న ఛార్జ్ తీసుకున్న తర్వాత వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ప్రతిపక్షాలు భయపడేంత స్ట్రాంగ్ అయ్యింది. మిమ్మల్ని కలుసుకుంటే నా తమ్ముడి ఆత్మ శాంతిస్తుందని వచ్చా. మీ అభిమానిగా ఒక్కరోజు బతికినా చాలు. – ఎం.అనిల్‌కుమార్ రెడ్డి, అన్నమయ్య జిల్లా, రాయచోటి నియోజకవర్గం మిమ్మల్ని చూసి స్ఫూర్తి పొందా జగనన్నా మీరు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. మనసుకు, దేహానికి ఎంత గాయమైనా చిరునవ్వుతో ఎదుర్కోవాలని మిమ్మల్ని చూసి స్ఫూర్తి పొందా. నా పిల్లలకు ఎంతో సాయం చేశారు. ఎప్పటికీ మీ అండదండలు ఉండాలని కోరుకుంటున్నా. మళ్లీ మీరే ముఖ్యమంత్రి కావాలి. – బాలచంద్ర, గుంటూరు జిల్లా, తెనాలి మండలం (గీతాంజలి భర్త) కడుపు కాలేవాడికి మీ పథకాల విలువ తెలుసు సోషల్ మీడియా సైనికుడైన మా అన్నయ్య 2022లో యాక్సిడెంట్లో మరణించాడు. అది తెలిసి సజ్జల భార్గవ్ మా ఇంటికి వచ్చారు. మీకు సాయం చేయాలని జగనన్న ఆదేశించారని చెప్పారు. మా వదినకు ఉద్యోగం ఇప్పించారు. మా పిన్ని, బాబాయి టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలో మెంబర్లు. వాళ్లకి సైతం పెన్షన్ మన ప్రభుత్వంలో ఇచ్చారు. మీరు అందించే పథకాల విలువ కడుపు కాలేవాడికే తెలుస్తుంది. కడుపు నిండిన వాడికి తెలియదు. మా అన్న చనిపోయినప్పుడు కూలీ పనులు చేసుకునే వ్యక్తి ఒకరు ఫోన్ చేసి ఆ రోజు వచ్చిన రూ.600 సాయంగా పంపుతున్నట్లు చెప్పాడు. ఇంత గొప్ప కుటుంబం ఇచ్చింది నువ్వే కదా జగనన్నా! – వినయ్ కుమార్, మల్కాపురం, జగ్గయ్యపేట మండలం, ఎన్టీఆర్ జిల్లా -
షావోమీ స్మార్ట్ ఫోన్ యూజర్లకు అలెర్ట్!
స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షావోమీ తన వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది. లిక్విడ్ యూవీ స్క్రీన్ ప్రొటెక్టర్లను వాడొద్దని సూచించింది. వాటిల్లో ద్రవరూపంలో ఉండే రసాయన జిగురు స్మార్ట్‌ఫోన్ చార్జింగ్ పోర్ట్, స్పీకర్, ఇతర భాగాల్లోకి వెళ్లి.. ఫోన్ పనితీరును దెబ్బతీస్తుందని హెచ్చరించింది. దీంతో పరికరం వారంటీ పూర్తి కాలం రాదని తెలిపింది. స్మార్ట్ ఫోన్ లలో స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాస్ అమర్చబడి ఉంటుంది. అయినప్పటికి ఫోన్ కింద పడినప్పుడు డిస్ ప్లేకి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు యూజర్లు అదనంగా స్క్రీన్ ప్రొటెక్టర్ లను ఉపయోగిస్తుంటారు. అయితే మార్కెట్లో లభించే వివిధ రాకలైన స్క్రీన్ ప్రొటెక్ట్ లలో లిక్విడ్ యూవీ అడెసివ్ ప్రొటెక్టర్లు మంచివని అంటుంటారు. ముఖ్యంగా కర్డ్వ్ ఫోన్ లకు ఫోన్ స్క్రీన్ కు, గ్లాస్ లేయర్ లు భద్రతగా ఉంటాయని వ్యాపారస్తులు నమ్మిస్తుంటారు. కానీ అలాంటి స్క్రీన్ ప్రొటెక్ట్ ల పట్ల జాగ్రత్తగా ఉండాలని షావోమీ ఓ నోట్ ను షేర్ చేసింది. ఈ ప్రొటెక్టర్‌లలో ఉపయోగించే లిక్విడ్ అంటుకునే పదార్థం ఫిజికల్ కీలు, ఛార్జింగ్ పోర్ట్, స్పీకర్ హోల్, బ్యాటరీ కవర్లోకి ప్రవేశించి, ఊహించని రీస్టార్ట్‌లు, బటన్ పనిచేయకపోవడం, స్పీకర్ శబ్దం, బ్యాటరీ కవర్ లెదర్ ఊడిపోవడం వంటి సమస్యలకు దారి తీస్తుందని నోట్ లో పేర్కొంది. వాటికి బదులుగా టెంపర్డ్ గ్లాస్, నాన్ టెంపర్డ్ లేదా ఎలక్ట్రోస్టాటిక్ ఫిల్మ్‌ల వంటి ప్రత్యామ్నాయాలను వినియోగించాలని సిఫార్సు చేస్తోంది. -
ఏంటి? మొబైల్ ఫోన్ ఆర్డర్ చేశారా.. మీక్కూడా ఇలా జరుగుతుందేమో.. జాగ్రత్త!
సాక్షి, అల్లూరి సీతారామరాజు: దసరా పండగ సందర్భంగా సెల్‌ఫోన్ కొనుక్కోవాలనుకున్న ఓ వినియోగదారుడికి చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే రాజవొమ్మంగికి చెందిన పండు అనే ఓ యువకుడు ఆఫర్లో రూ.6 వేలకు వస్తోందని ఇంటెల్– ఏ60ఎస్ సెల్‌ఫోన్ కోసం ఓ ప్రముఖ ఆన్లైన్ కంపెనీకు ఆర్డర్ పెట్టాడు. సెల్‌ఫోన్ కోసం ఎదురు చూస్తున్న అతనికి గురువారం కొరియర్ బాయ్ ఫోన్ వచ్చిందంటూ ఓ బాక్స్ అందజేశాడు. ఆ యువకుడు ముందు జాగ్రత్తతో ఆ బాక్సును కొరియర్ బాయ్ ఎదురుగానే తెరిచాడు. తీరా ఆ బాక్సులో ఫోన్‌కు బదులు రెండు రాళ్లు, వైరు లేని చార్జర్ కనిపించడంతో అతనితోపాటు, ఇది చూసిన ఇరుగు పొరుగువారు అవాక్కయ్యారు. కొరియర్ బాయ్ వెంటనే సంబంధిత కొరియర్ కంపెనీకి ఫోన్ చేసి విషయం తెలియజేశాడు. ఆర్డర్ ప్రకారం సెల్‌ఫోన్ అందజేస్తామని వారు హామీ ఇవ్వడంతో ఆ యువకుడు శాంతించాడు. -
వివాహేతర సంబంధం..! నిందితులను పట్టించిన సెల్‌ఫోన్..!!
ఆదిలాబాద్: భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భర్త మరో ముగ్గురితో కలిసి ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 12న నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన అబ్దుల్ నదీమ్ తాహెర్(28) పటాన్చెరు మండలం లక్డారం గేటు సమీపంలో జాతీయ రహదారి పక్కన హత్యకు గురయ్యాడు. మృతుడి సెల్‌ఫోన్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. అందులో మొఘల్పూర్కు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని తెలిసింది. ఇంకా ఆమె భర్త షహజాద్‌కు ఈ వ్యవహారం రెండు నెలల క్రితమే తెలిసింది. అతడిని మందలించినా తీరులో మార్పు రాలేదు. ఇక హైదరాబాద్‌లోని టోలిచౌకిలో ఉన్న సోదరి ఇంటికి వస్తున్నాడని తెలుసుకుని హత్యకు పథక రచన చేశాడు. అందులో భాగంగా షహజాద్ తన బంధువు గౌస్ నుంచి కత్తులు, గొడ్డలి సేకరించాడు. స్నేహితులు షబ్బీర్ అహ్మద్, ఎజాజ్ అలీ సహాయం తీసుకున్నాడు. టోలీచౌకీకి నదీమ్ వచ్చాడని తెలుసుకున్న అతడు ఇదే విషయమై మాట్లాడుకుని పరిష్కరించుకుందామని అందరూ ఓ హోటల్లో కలిశారు. ఇక్కడ వద్దని సంగారెడ్డిలోని ఓ దాబాకు వెళ్దామని నమ్మించారు. నదీమ్, షహజాజ్ బైక్‌పై బయలుదేరారు. మార్గమధ్యలో లక్డారం గేటు సమీపాన వచ్చేసరికి నదీమ్ మూత్రవిసర్జనకు ఆగాడు. అక్కడ సీసీ కెమెరాలు లేవని ధ్రువీకరించుకుని అతడితో వారు గొడవ పడ్డారు. పథకం ప్రకారం గొడ్డలి, కత్తితో మెడపై దాడి చేయగా అతను అక్కడికక్కడే మరణించాడు. తర్వాత అక్కడి నుంచి నిందితులు పరారయ్యారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్ తరలించారు. అయితే మరో నిందితుడు గౌస్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
కరోనా తెచ్చిన తంటా! పిల్లల్ని ఫోన్లకు అడిక్ట్ కాకుండా ఏం చేయాలి?
ఎప్పుడెప్పుడు స్కూల్ లాంగ్ బెల్ కొడతారా ? ఇంటికెళుదామా ? అని చూస్తుంటారు " "క్లాసు రూమ్ లో పాఠాలు వినడం లేదు . పక్క వారిని గిల్లడం, గిచ్చడం లాంటి పనులు చేస్తున్నారు " " చిరాకు, కోపం, అసహనం ఎక్కువయ్యింది . ఏకాగ్రత లోపించింది " " టీచర్ల పై తిరుగుబాటు, తల్లితండ్రుల్ని ఎదిరించడం ఎక్కువయ్యింది. రాగ్గింగ్ , బుల్లియింగ్ , ఘర్షణలు ఎక్కువయ్యాయి " " చెడు వ్యసనాల బారిన పడుతున్నారు " ఒక్కో సారి మనం ఫ్లోలో వెళ్ళిపోతాం. మనకు కనిపించిందే లోకం అనుకొంటాము. మనసులో ఉన్నదే నిజంగా జరుగుతోంది అనుకొంటాము . అలాంటప్పుడు మనకు రియాలిటీ చెక్ అవసరం . నేను మొన్న ఆదివారం అదే పని చేశాను. ఆ రోజు జరిగిన ఇంటర్వ్యూ కు దాదాపు డెబ్భై మంది హాజరయ్యారు . వారిలో అత్యధిక శాతం ఇదివరకే ఏదో ఒక స్కూల్లో పనిచేస్తున్నారు. కరోనా ముందు కాలం తో పోలిస్తే , ఇప్పుడు... అంటే కరోనా తరువాత కాలం లో , పిల్లల ప్రవర్తనలో ఏదైనా మార్పు చూసారా ? అయితే ఏంటది ? ఇది నేను ఆ ఇంటర్వ్యూలో చాల మందిని అడిగిన ప్రశ్న . పైన ఇచ్చినవి వారి సమాధానాలు. ఒక్కరంటే ఒక్కరు పాజిటివ్ చేంజ్ ఉందని చెప్పలేదు . సమస్య తీవ్రంగా ఉందని చాలా మంది చెప్పారు . కారణం ఏంటని అడిగితే అందరూ ఆన్లైన్ క్లాసు లు . మొబైల్ వ్యసనం అని సమాధానం చెప్పారు . "ఈ కాలం పిలల్లు సెల్ ఫోన్ వాడక పొతే ఎట్టా ? " "టెక్నాలజీ మార్పు తెస్తుంది . ఇది సహజం " "టెక్ సావీ పిల్లలు " "మార్పు సహజం . మారుతున్న సమాజంతో పాటే మనం మారాలి " అని ఇంకా పలవరిస్తున్న అజ్ఞానులు కోకొల్లలు. ఏది మార్పు ? టెక్నాలజీని ఎలా వాడుకోవాలి అనే సింపుల్ విషయం అర్థం కాని అమాయకత్వం అది. ఫ్లో లో వెళ్ళాలి అనుకొనే వారు .. ఇదే ట్రెండ్ అనుకొనే వారు .. మన పిల్లలు ఏదో సాధిస్తున్నారు అనుకొనే వారు .. ఇంకా కోట్లలో . ఈ లోగా యునెస్కో కుండబద్దలు కొట్టేసింది . మొబైల్ అడిక్షన్ వల్ల కలిగే నష్టాన్ని అధికారికంగా తేల్చేసింది. కమిషన్ల ఆశతో హోమ్ వర్క్ ను మొబైల్ డివైసెస్తో ముడిపెట్టే పాఠశాల యాజమాన్యాలకు పచ్చి వెలక్కాయ గొంతుకు అడ్డుపడట్టయ్యింది. కరోనా కాలం లో ఆన్లైన్ క్లాసులను నేను సెలైన్ పెట్టుకోవడంతో పోల్చా. తీవ్ర రోగముండి ఐసీయూ లో ఉంటే తప్పదు . కానీ టిఫిన్ బాక్స్ కు బదులు సెలైన్ పెట్టుకొని రోజూ ఇంటినుంచి బయటకు వెళుతామా? వారం రోజులు వానపడితే (వాన పడింది గట్టిగా రెండు రోజులే ) ఆన్లైన్ క్లాసులు షురూ చేసిన స్కూల్స్ . "పక్కన ఉన్న అన్ని స్కూల్స్ ఆన్లైన్ క్లాసులు నడుపుతుంటే మీరెందుకు చేయరు?" అని మొన్న ఒక పేరెంట్ మెసేజ్ . "వెంటనే వారు కట్టిన ఫీజు వాపసు ఇచ్చేయండి .. ఆన్లైన్ క్లాసులు పెడుతున్న స్కూల్ లో అబ్బాయి ని చదివించడానికి వీలుగా టీసీ ఇచ్చేయండి " నా ఆర్డర్ . చివరకు పేరెంట్ కు తత్త్వం బోధపడింది. సారీ చెప్పారు "మాకు సెల్ ఫోన్ వల్ల కలిగే నష్టం అర్థం అయ్యింది. కానీ ఏమి చెయ్యాలి ?"... అని ఇంకా చాలా మంది ఇంట్లో బాంబు పెట్టుకొంటే పేలుతుంది . ఏమి చేస్తాము ? ఇంట్లో బాంబు పెట్టుకోము . ఇదీ అంతే. "పెద్దాళ్ళకు తప్పని సరి. ఆఫీస్ వర్క్ కోసం సెల్ ఫోన్. ఇది అట వస్తువు కాదు. మీ మెదళ్ళు సెల్ ఫోన్ వల్ల వంద రెట్లు అధికంగా ప్రభావితం అవుతాయి , కాబట్టి వద్దు" అని పిల్లలకు నచ్చ చెప్పి వారు సెల్ ఫోన్ వాడకుండా చూడాలి . మాట వినకపోతే కౌన్సిలింగ్ చేయించాలి . సమస్య జటిలం. పరిష్కారం అంత సులభం కాదు. సంవత్సరాల తరబడి అధిక తిండి తిని ఒంట్లో కిలోల కొద్దీ అధిక కొవ్వును పేరపెట్టుకొన్న వారు ఏమి చెయ్యాలి ? తిన్నప్పుడు పొందిన సుఖాన్ని గుర్తు చేసుకొంటూ దానికి ప్రాయచ్చితం అన్నట్టు సరైన తిండి తినాలి . వ్యాయామం చెయ్యాలి. అబ్బే ఇంత కష్టం మేము పడలేము. ఏదైనా సింపుల్ మార్గం ఉంటే చెప్పండి అని లక్షల్లో అనుకొంటున్నారు. అలాంటి బకరాల కోసం డబ్బాల్లో మూలికా మందులు వచ్చాయి. అవి జస్ట్ ఒక స్పూన్ తింటే సరిపోతుంది అని ప్రచారం. ఈజీ మార్గం కదా అని లక్షల మంది. దాన్ని తిని కిడ్నీలు నాశనం చేసుకొన్న వారు వేలమంది. అయినా ఆగదు. ఆగితే వారి బిజినెస్ సాగదు బలహీనతల్ని కాష్ చేసుకోవడంలో ఫార్మసురులకు మించిన వారెవరూ ఉండరు. నువ్వు అధిక తిండి తింటే వాడికి డయాబెటిస్ బిజినెస్. కనీస ఆహార నియమాలు లేకుండా టెన్షన్ పెంచుకొని నువ్వు ఇమ్మ్యూనిటిని కుళ్ళపొడుచుకొంటే ... తుమ్ముకు.. దగ్గుకు... కాన్సర్‌కు.. జ్వరానికి.. ఒంటి నొప్పులకు ... చివరాఖరికి దురద కూడా వాక్సిన్లు .తిరుగు లేని బిజినెస్. అవి వేసుకొని సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకొంటే బోనస్ బిజినెస్ . ఇంతకీ కరోనా వాక్సిన్లు ఏమయ్యాబ్బా ? ముక్కు నోరు . చెవి.. ఇలా నవ రంద్రాల్లో వేసే వాక్సిన్లు .. వాటి మార్కెటింగ్ కోసం అదిగో చైనాలో కేసులు .. లాంగ్ కరోనా .. తొక్క... అంటూ విషపు రాతలు .. మరో పక్క కరోనా వాక్సిన్ వేసుకంటే కండ పుష్టి .. అంటూ మార్కెటింగ్ చేసే బ్రోకర్లు ... అరెరే .. ఎక్కడ పోయారబ్బా ? పిల్లి వచ్చే ఎలుక భద్రం అంటూ ఒక్క సారిగా మొత్తం మాయం అయిపోయారే. అన్నట్టు వారి ప్రకారం సంవత్సరానికి రెండు సార్లు వేసుకోవాలిగా . ఆ లెక్కన ఇప్పుడు.. అయిదోదో ఆరోదో పొడుస్తుండాలిగా ? ఏంటి ఆగిపోయింది. ఇక ఇప్పుడు సెల్ ఫోన్ కు పిల్లలు బానిసలు అయిపోతుంటే... వాడిది రెహబ్ సెంటర్ బిజినెస్ . వాడిదేనా ? తిలాపాపం తలా పిడికెడు.. పిల్లలు సెల్ ఫోన్ వాడడం మానేస్తే వాటి అమ్మకాలు సగానికి పడిపోతాయి. సెల్ ఫోన్ బిజినెస్ దెబ్బ తింటుంది. దానితో పత్రికలకు ప్రకటనలు తగ్గిపోతాయి. ఓయో హోటళ్ల బిజినెస్ డల్ అయిపోతుంది. గంజాయి దందా తగ్గిపోతుంది. చెప్పుకొంటూ పొతే లిస్ట్ కొండ వీటి చేంతాడంత. ఒకటి నిజం. తమ చుట్టూరా ఉన్న పిల్లలు సెల్ ఫోన్ వాడుతుంటే మన పిల్లలు అదే పని చెయ్యాలని చూస్తారు. అందుకే మేము రివర్స్ ఎటాక్ మొదలెట్టాము. మా పిల్లలు సెల్ ఫోన్ వాడరు. మీ ఇరుగు పొరుగు పిల్లలో చైతన్యం తెండి అని చెప్పాము . ఒక్కోక్కరూ కనీసం అయిదు మందికి .. ఈ వారం రోజుల వానల్లో అందరూ కలిసి కొన్ని వేల మంది పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చారు . "సెల్ ఫోన్ వద్దు. ఆటలు ఆడుకోండి. బాల్యాన్ని ఎంజాయ్ చెయ్యండి. జంక్ ఫుడ్ వద్దు . ఆరోగ్య కరమయిన ఆహారం తీసుకోండి" అని ఎలుగెత్తి చాటారు. మార్పు వస్తుందా ? వస్తుంది. అవతలి వారికి చెప్పడమంటే తమకు తాము చెప్పుకోవడం. ఈ విధంగా మా పిల్లల్లో ఆ భావన మరింత దృడంగా .. పక్కింటి పిల్లలో .. ముఖ్యంగా వారి తల్లితండ్రుల్లో అవగాహన. వారు ఇప్పుడైనా నిద్ర లేస్తే బయటపడతారు . లేకుంటే రేపు దారుణాలకు మూగ సాక్ష్యంగా మిగిలి పోతారు. ఒక స్కూల్ ఇలా చేస్తోంది . మీరు ఇలా ఎందుకు చెయ్యరు అని ప్రతి ఒక్కరు తమ పిల్లలు చదువుతున్న స్కూల్ యాజమాన్యాలను ప్రశ్నిస్తే ? ఎన్నికలు రాబోతున్నాయి. మీ డ్రామాలు, గోవా ఫైటింగ్‌లు ఆపండి. బాల లోకాన్ని పీడిస్తున్న ఈ వ్యసనం పై మీ స్టాండ్ ఏంటి ? యునెస్కో చెప్పాక కూడా నిద్ర నటిస్తారా ?" అని ప్రతి రాజకీయనాయకుడ్ని, పార్టీని ప్రశ్నిస్తే .. మార్పు రాదా ? ప్రశ్నించడం ఆంటే వీధుల్లోకి పోనక్కర లేదు. జస్ట్ సోషల్ మీడియాను వేదికగా చేసుకొంటే చాలు. ఇంకా... స్వచ్చంద సేవ సంఘాలు .. ప్రజా సంఘాలు .. సినిమా హీరోలు .. అబ్బో సమాజం శక్తి కొంచమయ్యిందా ? ముందుకు రావాలి. రావాలి... బాబూ... రావాలి . రాక పొతే చరిత్ర హీనులయి పోతారు . ఎవరో వస్తారని .. ఏదో చేస్తారని .. నిజం మరిచితే నిదురోతే? కరోనా రెండో వేవ్ .. అటు పై వాక్ సీన్ సైడ్ ఎఫెక్ట్స్ కంటే... దారుణాలు ఖాయం . ఇది శాపనార్థం కాదు . హెచ్చరిక దండోరా ! మార్పు మనింటి నుంచే మొదలు కావాలి . వాసిరెడ్డి అమర్ నాథ్, మానసిక నిపుణులు, విద్యావేత్త (చదవండి: మీకు మీరే నిజమైన స్నేహితుడు, మీరే అసలైన శత్రువు) -
ఇన్స్టాల్ చేసే యాప్‌తోపాటే ‘రాట్’ వైరస్.. ఫోన్ మీ దగ్గరే ఉంటుంది.. కానీ,
సాక్షి, హైదరాబాద్ : ఆకర్షణీయ సౌకర్యాలు, ముఖ్యమైన అంశాలకు సంబంధించినవి అంటూ అనేక యాప్స్‌కు సంబంధించిన యాడ్స్ ఇంటర్నెట్, సోషల్‌మీడియాల్లో రాజ్యమేలుతున్నాయి. వీటితో అవస రం ఉన్నా లేకపోయినా ఉచితం కదా అని అనేక మంది తమ స్మార్ట్‌ఫోన్స్‌లో డౌన్లోడ్ చేసుకుంటున్నారు. దీన్నే ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ–నేరగాళ్లు ప్రయోగిస్తున్న ఆయుధం ‘రాట్’గా పిలిచే రిమోట్ యాక్సెస్ ట్రోజన్. యాప్స్ మాటున నేరగాళ్లు ఈ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను చొప్పించడం ద్వారా డౌన్లోడ్ చేసుకున్న వారి సెల్‌ఫోన్‌ను తమ అదీనంలోకి తీసుకుని చేయాల్సిన నష్టం చేసేస్తున్నారు. అడుగడుగునా యాప్స్ వినియోగమే... ♦ స్మార్ట్ఫోన్ల వినియోగం ఎంతగా పెరిగిందో... వివిధ రకాలైన యాప్స్ వాడకం అంతకంటే ఎక్కువైంది. నిద్ర లేవడం నుంచి ఆహారం తీసుకోవడం, ఉష్టోగ్రతలు తెలుసుకోవడం, వినోదం ఇలా... ఒక్కో ఫోన్లో కనీసం 10–15 యాప్స్ ఉంటున్నాయి. వినియోగదారుడి ‘యాప్ మేనియా’ను క్యాష్ చేసుకునేందుకు సైబర్ క్రిమినల్స్ కొత్త ఎత్తులు వేస్తున్నారు. వీరు తొలుత దేశవ్యాప్తంగా ఉన్న మొబైల్ నంబర్ల డేటాను వివిధ మార్గాల్లో సేకరిస్తున్నారు. ఇలా నంబర్లు తమ చేతికొచ్చాక అసలు కథ మొదలవుతుంది. సందేశాలతో ప్రారంభమయ్యే ప్రక్రియతో.. ♦ తాము ఉచితంగా ఇస్తున్న ఫలానా యాప్‌లో ఇన్ని ఆకర్షణలు ఉన్నాయంటూ ఎస్సెమ్మెస్, వాట్సాప్ లేదా సోషల్‌మీడియాల్లో యాడ్స్ పంపిస్తారు. ఈ ‘ప్రకటన’ను చూసి ఆకర్షితులైన వారు అందులో ఉన్న లింక్‌ను క్లిక్ చేస్తే సదరు యాప్ డౌన్లోడ్ అవుతుంది. వినియోగదారుడికి తెలియకుండా, అతడి ప్రమేయం లేకుండా దీంతోపాటే సదరు క్రిమినల్ పంపిచే ట్రోజన్ కూడా అదే మొబైల్ ఫోన్లోకి దిగుమతి అయిపోతుంది. అలా జరిగిన మరుక్షణం నుంచి ఫోన్ మన దగ్గర ఉన్నప్పటికీ.. అది సైబర్ క్రిమినల్ ఆదీనంలోకి వెళ్లిపోతుంది. దూరంగా ఉన్న ఓ వ్యక్తి అక్కడ నుంచి మన దగ్గరున్న సెల్‌ఫోన్‌ను యాక్సెస్ చేస్తూ అవసరమైన విధంగా వాడగలుగుతాడు. అందుకే ఈ వైరస్‌ను రిమోట్ యాక్సెస్ ట్రోజన్ (రాట్) అంటారు. నేరగాడి అధీనంలోకి వెళ్తే ఖాతా ఖాళీ ♦ మన ఫోన్ సైబర్ నేరగాడి ఆదీనంలోకి వెళ్లిపోయాక మనం ఫోన్లో చేసే ప్రతి చర్యనూ అతడు పర్యవేక్షించగలడు. కాల్స్, ఎస్సెమ్మెస్‌లతోపాటు సెల్ఫోన్లో ఉన్న సమాచారం, దాని కెమెరాలను సైతం సైబర్ నేరగాడు తన ఆదీనంలోకి తీసుకోగలడు. ఇటీవల సినిమా టికెట్లు మొదలుకుని కొన్ని రకాలైన బిల్లుల చెల్లింపు వరకు అన్నీ అత్యధిక శాతం సెల్‌ఫోన్ ద్వారా జరుగుతోంది. వీటి కోసం కోసం మొబైల్ వినియోగదారులు నెట్ బ్యాంకింగ్ వాడటం లేదా తమ డెబిట్/క్రెడిట్ కార్డు వివరాలను నమోదు చేస్తుంటారు. దీంతోపాటు లావాదేవీలకు సంబంధించి బ్యాంకు పంపే వన్ టైమ్ పాస్వర్డ్స్ సైతం సెల్‌ఫోన్‌కే వస్తుంటాయి. ఎవరైనా క్రెడిట్/డెబిట్ కార్డు వివరాలు, నెట్‌బ్యాంకింగ్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్స్‌లను వినియోగదారుడికి తెలియకుండా తీసుకున్నా... ఓటీపీ నమోదు చేయనిదే లావాదేవీ పూర్తికాదు. వినియోగదారుడి ప్రమేయం లేకుండానే.. ♦ ఈ ఓటీపీని సంగ్రహించడానికీ సైబర్ నేరగాళ్లు ముందు పంపే యాప్‌లోని రాట్ ద్వారానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బ్యాంకుల నుంచి వచ్చే ఓటీపీలను ఈ యాప్ నుంచే సంగ్రహిస్తున్నారు. కార్డుల వివరాలు అప్పటికే సిద్ధంగా ఉంటాయి కాబట్టి ఓటీపీ నమోదుచేసి అందినకాడికి స్వాహా చేస్తున్నారు. ఓటీపీ అవసరమైన లావాదేవీలను సైబర్ క్రిమినల్స్ అర్ధరాత్రి దాటిన తర్వాత చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ సమయంలో వినియోగదారులు నిద్రలో ఉంటారని, అతడి ప్రమేయం లేకుండానే వచ్చిన ఓటీపీని గుర్తించరని అంటున్నారు. ఉదయం లేచి జరిగింది తెలుసుకునే సరికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సైబర్ నేరగాళ్లు ఎక్కువగా బోగస్ వివరాలతో తెరిచిన ఖాతాలనో, బోగస్ చిరునామాలను పెట్టడమో చేస్తుంటారని వివరిస్తున్నారు. దీనివల్ల జరిగిన నష్టంపై ఫిర్యాదులు వచ్చినా నేరగాళ్లను పట్టుకోవడం సాధ్యం కాదంటున్నారు. సరైన గుర్తింపులేని సంస్థలు/వ్యక్తులు రూపొందించే యాప్స్‌కు దూరంగా ఉండటం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. -
కీలక ‘లేఖ’పై కిమ్మనరెందుకు?
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు సంస్థను తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా ఈనాడు రామోజీ కంకణం కట్టుకున్నారు. ఘటనా స్థలంలో దొరికిన అత్యంత కీలకమైనవిగా భావిస్తున్న లేఖ, సెల్‌ఫోన్‌ను వెంటనే ఎందుకు పోలీసులకు స్వాధీనం చేయలేదనే అంశాన్ని ఏనాడైనా రాశారా రామోజీ? ఈ కేసులో తొలి నుంచీ ప్రతి విషయంలో మీ వక్రీకరణ కనిపిస్తూనే ఉంది. ఎప్పుడు ఏ చిన్న విషయం తెలిసినా.. దానిని ప్రభుత్వానికి, ఎంపీ అవినాశ్రెడ్డికీ ముడిపెట్టి లేనిపోని విషయాలు కలిపి చెలరేగిపోతూ వండివార్చడమే మీరు పనిగా పెట్టుకోవడం నిజం కాదా? అసలు వివేకా కేసులో ఇంత గందరగోళానికి కారణం ఏమిటని ఏనాడైనా తొంగి చూశారా? వైఎస్ వివేకానందరెడ్డిపై తీవ్రంగా దాడి చేసిన ఆగంతకులు ఆయనతో బలవంతంగా ఓ లేఖ రాయించారు. తనను డ్రైవర్ ప్రసాద్ తీవ్రంగా గాయ పరచినట్టుగా ఆ లేఖలో వివేకా రాసినట్టుగా ఉంది. ఆ లేఖ ఆయన పీఏ కృష్ణారెడ్డి ఆ రోజే అంటే 2019 మార్చి 15న ఉదయమే గుర్తించారు. వివేకానందరెడ్డి మృతదేహాన్ని మొదటగా చూసింది ఆయనే. ఆ లేఖతోపాటు వివేకానందరెడ్డి సెల్‌ఫోన్‌ను కూడా ఆయన స్వాధీనం చేసుకున్నారు. వివేకానందరెడ్డి మరణించిన సమాచారాన్ని ఆయన భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది శివ ప్రకాశ్‌రెడ్డిలకు ఫోన్ చేసి చెప్పారు. వివేకానందరెడ్డి మృతదేహం ఫొటోలను కూడా వాట్సాప్ చేశారు. ఆ ఫొటోలు చూస్తే ఎవరికైనా అది హత్య అని సులువుగా తెలుస్తుంది. ఆ లేఖను తాము వచ్చే వరకు ఎవరికీ ఇవ్వొద్దని.. ఆ విషయం బయటకు చెప్పొద్దని వివేకానందరెడ్డి కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి పీఏ కృష్ణారెడ్డితో చెప్పారు. దాంతో ఆ లేఖ విషయం ఆయన పోలీసులకుగానీ ఇతరులకుగానీ చెప్పనే లేదు. ఆ తర్వాత కాసేపటికే సమీప నివాసాల్లోని వారు, పార్టీ కార్యకర్తలువచ్చారు. అనంతరం వివేకానందరెడ్డి పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్ రెడ్డి ఫోన్ చేసి చెప్పడంతో ఎంపీ అవినాశ్‌రెడ్డికి విషయం తెలిసింది. దాంతో ఎన్నికల ప్రచారానికని బయలు దేరిన ఆయన వెనుదిరిగి వివేకా నివాసానికి చేరుకున్నారు. అప్పుడు కూడా వివేకానందరెడ్డి రాసిన లేఖ విషయాన్ని పీఏ కృష్ణారెడ్డి ఎవరికీ చెప్పనే లేదు. ఆ లేఖ విషయం అప్పుడే చెప్పి ఉంటే వివేకానందరెడ్డిది హత్య అని వెంటనే తెలిసేది. ఈ విషయం కదా తొలుత తేలాల్సింది. అది తేలితే తర్వాత కథ వేరుగా ఉండేది. ఈ విషయాలపై దర్యాప్తు సాగాలని ఏనాడైనా ఈనాడు రాసిందా? అంటే మీ ఉద్దేశం అసలు దోషులను తప్పించి.. ఇంకెవరినో ఇరికించాలనేగా! ఆ దిశగా దర్యాప్తు సాగేలా.. దర్యాప్తు సంస్థను ప్రభావితం చేసేలా తప్పుడు కథనాలు వండివార్చుతున్నది అందుకేగదా.. ఇది మీకు కనిపించలేదా? సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివ ప్రకాశ్ రెడ్డి ఆ రోజు అంటే 2019 మార్చి 15న మధ్యాహ్నం 12 – ఒంటి గంట మధ్య పులివెందులకు చేరుకున్నారు. అప్పుడు పీఏ కృష్ణారెడ్డి ఆ లేఖను వారికి అందించారు. వారు దానిని సాయంత్రం 5 గంటల వరకు వారి వద్దే ఉంచుకున్నారు. ఆ తర్వాత తిరిగి వాటిని కృష్ణారెడ్డి ద్వారా పోలీసులకు అందించారు. ఆ సెల్‌ఫోన్‌లోని మెసేజ్‌లు, ఇతర డాటాను డిలీట్ చేసి మరీ పోలీసులకు ఇచ్చినట్టు సమాచారం. సహజంగా ఆ లేఖ విషయాన్ని వెంటనే చెప్పకుండా గోప్యంగా ఉంచిన పీఏ కృష్ణారెడ్డిని తొలుతే ఎందుకు ప్రశ్నించలేదని, ఎవరి ఆదేశాల మేరకు ఆ లేఖ విషయాన్ని రహస్యంగా ఉంచారో ఎందుకు తెలుసుకోలేదని.. అందువల్లే ఈ కేసులో కీలకమైన చిక్కుముడి విడిపోవడం లేదని ఎందుకు మీ రాతల్లో కనిపించదు రామోజీ? విషయం అందరికీ తెలిశాక.. ఘటనా స్థలానికి చేరుకున్న వారిని లక్ష్యంగా చేసుకుని.. వారిని దోషులుగా చూపుతూ దుష్ప్రచారం చేయడం మీకే చెల్లింది. వివేకా హత్య జరిగిన రోజు ఎన్నికల ప్రచారానికి వెళ్లడానికి అవినాశ్‌రెడ్డి ఇంటి వద్దకు వెళ్లానని ఉదయ్‌కుమార్‌రెడ్డి ఆ రోజూ చెప్పారు. ఈ రోజూ అదే చెబుతున్నారు. ఓ పని కోసం ఎంపీ ఇంటికి వెళ్లానని మాజీ ఎంపీటీసీ సభ్యురాలు శశికళ కూడా ఆరోజు, ఈ రోజు అదే చెబుతోంది. ఎంపీ ఇంటి వద్ద ఉన్నామని వాళ్లే స్వయంగా చెబుతున్నప్పుడు.. ఆ విషయం కొత్తగా కనిపెట్టినట్లు మీరు చెప్పడం ఏమిటో! ఉదయ్‌ను పోలీస్ కస్టడీకి ఇవ్వండి వైఎస్ వివేకా హత్య కేసులో అరెస్టయిన గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డిని పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్ సీబీఐ కోర్టులో కేంద్ర దర్యాప్తు సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై సోమవారం సీబీఐ కోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది. శుక్రవారం ఆయన్ను కడపలో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించిన విషయం తెలిసిందే. -
సెల్‌ఫోన్ రికవరీలపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి
నిత్య జీవితంలో సెల్‌ఫోన్ అత్యంత అవసరంగా మారింది. వినోదమే కాదు డిజిటల్ లావాదేవీలు, ముఖ్యమైన సమాచారం మొత్తం ఫోన్లలోనే భద్రపరుచుకుంటున్నారు. అంతటి ముఖ్యమైన సెల్‌ఫోన్ పోగొట్టుకుంటే సంబంధాలు ఒక్కసారిగా తెగిపోయినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో సెల్‌ఫోన్ రికవరీలపై ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలోనే మొదటిసారిగా రికవరీని ప్రారంభించి ఇప్పటికే వేలాది ఫోన్లను బాధితులకు అందజేశారు. ఎస్పీ మల్లికాగార్గ్ తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలను ఇస్తుండటంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బేస్తవారిపేట: సెల్‌ఫోన్ చోరీలు సాధారణంగా మారిపోయాయి. ఈ నేరాలు ప్రకాశం జిల్లాలో గణనీయంగా పెరిగాయి. సెల్‌ఫోన్ చోరీలతో పాటు వాటిని మరిచిపోయినప్పుడు అందులోని డేటా విషయంలో ఎక్కువ బాధపడాల్సిన పరిస్థితులు. బంధువులు, సన్నిహితులు, మిత్రుల ఫోన్ నంబర్లతో పాటు కీలకమైన డాక్కుమెంట్లు సైతం సెల్ఫోన్లోనే దాచుకోవడం సమస్యగా మారింది. అనుకోని పరిస్థితుల్లో సెల్‌ఫోన్ పోగొట్టుకుంటే వచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. గతంలో పోలీసులు సైతం సెల్‌ఫోన్ రికవరీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు కాదు. సెల్‌ఫోన్ పోయిందంటూ పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కితే చేదు అనుభవాలను మూటగట్టుకోవాల్సి వచ్చేది. రాష్ట్రంలోనే తొలిసారిగా.. సెల్‌ఫోన్ రికవరీలపై ఎస్పీ ప్రత్యేక చర్యలు చేపట్టారు. వేలకు వేలు ఖర్చుపెట్టి కొనుగోలు చేసిన సెల్ఫోన్లు పొగొట్టుకున్న బాధితులకు సకాలంలో న్యాయం చేకూర్చేందుకు రాష్ట్రంలో తొలిసారిగా ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి నూతన సాంకేతిక వ్యవస్థతో ఫోన్లను రికవరీ చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1600 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. మరో 1000 ఫోన్లను ఎవరు ఉపయోగిస్తున్నారో గుర్తించారు. 300 ఫోన్లు మన జిల్లాలో, 700 ఇతర రాష్ట్రాలు, జిల్లాలో ఉన్నట్లు గుర్తించి వాటిని రికవరీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. సెల్‌ఫోన్ వినియోగంలో ఉంటేనే.. సెల్‌ఫోగొట్టుకున్న వారు పేరు, చిరునామా, కాంటాక్ట్ నంబర్, 15 అంకెలతో కూడిన ఐఎంఈఐ నంబర్‌ను తెలియపరుస్తూ ఒక ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఈ ఫిర్యాదును ఎస్పీ పర్యవేక్షణలోని ప్రత్యేక సాంకేతిక బృందం పరిశీలనకు స్థానిక పోలీస్స్టేషన్ల నుంచి పంపిస్తారు. ఐఎంఈఐ ద్వారా ఆ సెల్‌ఫోన్ ఎక్కడ వినియోగిస్తున్నారో గుర్తించి రికవరీ చేస్తున్నారు. అయితే ఆ సెల్‌ఫోన్ వినియోగంలో ఉన్నప్పుడే రికవరీ సాధ్యమవుతుందని పోలీసులు తెలిపారు. ప్రత్యేక టీంను ఏర్పాటు చేశాం: మలికాగార్గ్, ఎస్పీ జిల్లాలో ఇప్పటి వరకు 3799 ఫిర్యాదు వచ్చాయి. పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదు జిల్లా ఐటీ కోర్ టీంకు అందుతాయి. జిల్లాలో మిస్సింగ్ మొబైల్స్‌ను ట్రేస్ చేసేందుకు ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేశాను. ఇప్పటి వరకు 1600 ఫోన్లను నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రికవరీ చేశాం. ఫోన్ పోగొట్టుకున్నా లేదా మర్చిపోయినా వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఒక ఫార్మాట్లో డేటాను పూర్తి చేసి ఇవ్వాలి. బహిరంగ ప్రదేశాల్లో దొరికిన ఫోన్లను తీసుకుని వాడడం చేయరాదు. వాటిని స్థానిక పోలీస్స్టేషన్లలో అందజేయాలి. 10 రోజుల్లోనే తెచ్చి ఇచ్చారు నా మొబైల్ పోయినట్లు ఫిర్యాదు చేసిన పది రోజుల్లోనే ఎస్సై నాకు అప్పగించారు. తిరిగి రాదనుకున్న రూ. 40 వేల సెల్‌ఫోన్ అందడం ఎంతో సంతోషంగా ఉంది. – ఎన్ రమణారెడ్డి, సర్పంచ్, పిటికాయగుళ్ల -
ఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్య
రాయదుర్గం రూరల్: సెల్‌ఫోన్ కొనివ్వకపోవడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. రాయదుర్గం మండలం వేపరాలకు చెందిన హరిజన రమేష్ కుమారుడు యశ్వంత్ (18) ఇంటర్ వరకు చదువుకుని కూలి పనులతో తండ్రికి చేదోడుగా ఉంటున్నాడు. కొన్ని రోజులుగా తనకు సెల్‌ఫోన్ కొనివ్వాలంటూ తండ్రిని అడుగుతున్నాడు. అయితే ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో తండ్రి కాలయాపన చేస్తూ వచ్చాడు. దీంతో మనస్తాపం చెందిన యశ్వంత్ శనివారం ఉదయం శ్మశాన వాటిక సమీపంలో క్రిమి సంహారక మందు సేవించాడు. గమనించిన స్థానికులు వెంటనే సమాచారం అందించడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. తండ్రి రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ భాస్కర్ తెలిపారు. యువకుడి దారుణ హత్య గార్లదిన్నె: విధులు ముగించుకుని ఇంటికి బయల్దేరిన యువకుడు అదృశ్యమయ్యాడు. రెండు రోజుల తర్వాత విగతజీవిగా కనిపించాడు. ఎవరో హత్య చేసి.. గుర్తుపట్టకుండా శరీరంపై పెట్రోలు పోసి తగులబెట్టారు. ఈ ఘటన రామదాస్‌పేట సమీపంలో శనివారం వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి. కేశవాపురానికి చెందిన రాజేష్ (23) గార్లదిన్నె భారత్ గ్యాస్ కంపెనీలో హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి బయల్దేరాడు. అయితే రాత్రి అయినా ఇంటికి చేరుకోలేదు. మొబైల్‌కు ఫోన్ చేస్తే స్విచాఫ్ అని వస్తుండటంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు తమ కుమారుడు కనిపించకుండా పోయాడని శనివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో రామదాస్‌పేట అటవీ ప్రాంతంలో ఓ యువకుడికి నిప్పంటించి చంపేసినట్లు సమాచారం అందింది. హుటాహుటిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. రెండు రోజుల కిందటే శరీరంపై పెట్రోలు పోసి తగులబెట్టి ఉంటారని భావిస్తున్నారు. ఆనవాళ్లను బట్టి చనిపోయింది రాజేష్ అని తల్లిదండ్రులు తెలిపారు. సీఐ అస్రార్‌బాషా అటవీప్రాంతానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలనున్నాయి. (చదవండి: మొబైల్ చార్జర్ మాదిరిగా ఉండే స్పై కెమెరాను అమర్చి..) -
ప్రాణం తీసిన సెల్‌ఫోన్.. చెల్లెలితో కలిసి ఆడుకుంటుండగా
పిఠాపురం: ఆ అమ్మాయి చేతిలో నుంచి సెల్‌ఫోన్ పొరపాటున జారి పడి పగిలిపోయింది. తండ్రి తిడతాడన్న భయంతో ఆత్మహత్యాయత్నం చేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషాద సంఘటన కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చిన జగ్గంపేటలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సారిపల్లి నాగన్నది నిరుపేద కుటుంబం. భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కూలిపని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కష్టపడి పెద్ద కుమార్తెకు వివాహం చేశాడు. రెండో కుమార్తె సత్యవేణి (16) ఆరో తరగతి వరకూ చదివి మానేసింది. ఆమె స్నేహితులందరూ ఎప్పటి నుంచో సెల్‌ఫోన్ వాడుతున్నారు. తనకూ కొనిపెట్టమని తండ్రిని తరచుగా అడిగేది. అయితే అంత స్థోమత లేదంటూ కుమార్తెకు నాగన్న నచ్చజెబుతూండేవాడు. చదవండి: (Hyderabad: గుట్టుచప్పుడు కాకుండా అపార్ట్మెంట్లో వ్యభిచారం) కుమార్తె కోరిక తీర్చేందుకు అప్పు చేసి, 11వ తేదీన కొత్త సెల్‌ఫోన్ కొని ఇచ్చాడు. అదే రోజు చెల్లెలితో కలిసి ఆ ఫోనుతో సత్యవేణి ఆడుకుంటూండగా, ఒక్కసారిగా అది కింద పడి పగిలిపోయింది. విషయం తెలిస్తే తండ్రి తిడతాడని సత్యవేణి భయపడింది. పొలానికి కొట్టడానికని నాగన్న గడ్డి మందు కొని తెచ్చి, బాత్రూములో పెట్టాడు. సత్యవేణి ఆ మందు తాగి ఎవరికీ చెప్పకుండా పడుకుని ఉండిపోయింది. కొంతసేపటికి వాంతులు కావడంతో ఏమైందని అడగ్గా గడ్డి మందు తాగినట్టు చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను కాకినాడలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటి నుంచీ అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఆమె మృతి చెందింది. గొల్లప్రోలు ఎస్సై రామలింగేశ్వరరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (తనకెవ్వరూ సాటిరారని నిరూపించాడు.. దానిని తట్టుకోలేకే చంపేశారా?) ►ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
సెల్‌ఫోన్ దొంగిలించాడని కొట్టి చంపేశారు
దుండిగల్: సెల్‌ఫోన్ దొంగిలించాడనే నెపంతో ఓ వ్యక్తిని తల్లి కొడుకులు కలిసి తీవ్రంగా కొట్టడంతో మృతి చెందాడు.. హత్యానేరం నుంచి తప్పించుకునేందుకు మృతదేహాన్ని నిర్మానుష్య ప్రాంతంలో పడేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీనిపై పోలీసులు కూపీ లాగడంతో అసలు హంతకులు పట్టుబడిన ఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురానికి చెందిన దండసాయి రమేష్ (35) వృత్తిరీత్యా హోటళ్లల్లో చెఫ్‌గా పని చేసేవాడు. నగరానికి వలస వచ్చిన అతను సూరారం కాలనీలో ఉంటూ స్థానికంగా ఉంటున్న హోటళ్లల్లో పని చేస్తున్నాడు. నెల రోజుల క్రితం గండిమైసమ్మలోని జెఎంజే టిఫిన్ సెంటర్లో చెఫ్‌గా చేరాడు. అయితే డిసెంబరు 26న హోటల్లో సెల్‌ఫోన్, నగదు చోరీకి గురయ్యాయి. రమేష్‌పై అనుమానంతో హోటల్ నిర్వాహకుడు రాకేశ్, అతని తల్లి భాగ్యలక్ష్మి అతన్ని చేతులు కట్టేసి కొట్టారు. అయినా ఒప్పుకోకపోవడంతో వెదురు కట్టెలతో తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో హత్యానేరం నుండి తప్పించుకునేందుకు రాకేష్ అతని స్నేహి తులు వెంకటసాయి, వినయ్, మున్నా, సతీశ్, సంపత్, అజారుద్దీన్లు మృతదేహాన్ని బహదూర్‌పల్లి సాయినాథ్ సొసైటీలో రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. పట్టుబడిందిలా.. సాయినాథ్ సొసైటీలోని రోడ్డు పక్కన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దుండిగల్ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహంగా కేసు నమోదు చేశారు. కాగా మృతుడి ప్యాంట్‌జేబులో లభించిన ఫోన్ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. రమేష్ పలు హోటళ్లలో చెఫ్‌గా పని చేసేవాడని తెలుసుకున్నారు. గండిమైసమ్మలోని జెఎంజే హోటల్లో పని చేస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు స్థానికులను విచారించగా గొడవ విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా రమేష్‌ను కొడుతున్న దృశ్యాలు లభించాయి. దీంతో హోటల్ నిర్వాహకుడు రాకేశ్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా తీవ్రంగా కొట్టడంతోనే మృతి చెందాడని, మృతదేహాన్ని సాయినాథ్ సొసైటీ సమీపంలో పడేసినట్లు అంగీకరించాడు. దీంతో రాకేశ్‌తో పాటు అతని స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా రాకేశ్ తల్లి భాగ్యలక్ష్మి పరారీలో ఉన్నట్లు తెలిసింది. -
సెల్ ఫోన్లో గేమ్స్ ఆడొద్దని మందలించడంతో..
జామి: సెల్ ఫోన్లో ఆటలాడొద్దని తండ్రి మందలించాడని కుమారుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం జామిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. జామి మంగలవీధికి చెందిన లగుడు సింహాచలంనాయుడు(14) విద్యార్థి స్థానిక జెడ్పీ ఉన్నతపాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. సెల్ఫోన్లో ఆటలాడొద్దని తండ్రి కృష్ణ మందలించి పొలం పనులకు వెళ్లాడు. దీంతో సింహాచలంనాయుడు ఇంటివద్ద ఉన్న పురుగుల మందు తాగాడు. నోటిలో నుంచి నురగలు రావడంతో తల్లి కేకలు వేసి భర్తకు సమాచారం అందించింది. విద్యారి్థని స్థానిక పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స అందించిన అనంతరం విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ మృతిచెందాడు. ఘటనపై జామి ఏఎస్సై గోపి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
లక్కంటూ... కిక్కిచ్చారు!
పిడుగురాళ్ల టౌన్(గుంటూరు జిల్లా): మీకు లక్కీడీప్‌లో జె–7 సెల్‌ఫోన్ వచ్చింది.. నాలుగు వేలు చెల్లిస్తే.. రూ.14వేల విలువైన సెల్‌ఫోన్ అందుకోవచ్చు’ అని ఓ కంపెనీ వారి మాయమాటలు నమ్మిన ఓ యువకుడు నిండా మోసపోయిన ఘటన మంగళవారం జరిగింది. సెల్‌ఫోన్ స్థానంలో చిన్న ఆంజనేయస్వామి విగ్రహంతోపాటు హనుమాన్ చాలీసా విజిటింగ్ కార్డును పార్శిల్లో పంపిన వైనం వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన బత్తుల వెంకటేశ్వర్లు మూడునెలల కిందట సామ్సంగ్ కంపెనీ ఫ్రిజ్‌ను కొనుగోలు చేశాడు. ఈ నేపథ్యంలో పదిరోజుల కిందట వెంకటేశ్వర్లుకు ఫోన్ వచ్చింది. “మీరు ఫ్రిజ్ కొన్నారు కదా.. ఆ లక్కీడీప్‌లో జె–7 సెల్‌ఫోన్ వచ్చింది. నాలుగువేలు చెల్లించి పోస్టాఫీస్‌లో తీసుకోవాలి అని ఫోన్లో చెప్పారు. ఆశతో వెంకటేశ్వర్లు రూ. నాలుగువేలు పోస్టాఫీస్‌లో చెల్లించి పార్శిల్‌ను అందుకున్నాడు. తీరా ఇంటికి వెళ్లి పార్శిల్ తెరవగా అందులో చిన్న ఆంజనేయస్వామి విగ్రహం, హనుమాన్ చాలీసా విజిటింగ్కార్డు ఉండడంతో అవాక్కయ్యాడు. -
సెల్‌ఫోన్ కొనివ్వలేదని..
సాక్షి, జనగాం: సెల్‌ఫోన్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు.. నర్మెట్ట మండలం హన్మంతపూర్ గ్రామానికి చెందిన పోతాని ప్రశాంత్ డిగ్రి పూర్తి చేశాడు. ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉండి వ్యవసాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో సెల్‌ఫోన్ కొనివ్వాల్సిందిగా తండ్రిని కోరాడు. అందుకు తండ్రి అంగీకరించకపోవడంతో మనస్థాపానికి గురైన ప్రశాంత్ శుక్రవారం అర్ధరాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అపస్మారక స్థితిలో ఉన్న ప్రశాంత్‌ను గమనించిన తల్లిదండ్రులు వెంటనే అతన్ని స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రశాంత్ మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
విషాదం మిగిల్చిన ఫొటో సరదా
సాక్షి, జనగామ: సెల్ఫోన్లో ఫొటోలు దిగాలనే సరదా ప్రాణాలను బలితీసుకుంది. రిజర్వాయర్‌లోకి దిగిన బావతోపాటు ఇద్దరు మరదళ్లు మృత్యువాత పడిన ఘటన జనగామ జిల్లా నర్మెట మండలం బొమ్మకూర్ వద్ద శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా కేంద్రానికి చెందిన మాజీ కౌన్సిలర్ మూడ్ లక్ష్మణ్‌నాయక్, కాంతాబాయి దంపతుల కుమారుడు మూడ్ అవినాష్ (29)కు రఘునాథపల్లి మండలం గిద్దెబండ తండా (జీబీతండా)కు చెందిన లకావత్ లక్ష్మణ్, లీల దంపతుల కుమార్తె దివ్య వివాహం ఏడాదిన్నర క్రితం జరిగింది. హైదరాబాద్‌లో ఉంటున్న అవినాష్ శుక్రవారం రాత్రి జనగామకు వచ్చాడు. శనివారం గిద్దెబండతండాలోని అత్తగారింటికి వెళ్లాడు. మధ్యాహ్నం తల్లిగారింటి వద్ద ఉన్న భార్య దివ్యతోపాటు చిన్న మామ లకావత్ అంజయ్య కుమార్తెలు సంగీత (17), సుమలత(15)తో కలసి నర్మెట మండలం బొమ్మకూరు రిజర్వాయర్ వద్దకు వెళ్లారు. ఒడ్డున ఉన్న దివ్య ఫొటోలు తీస్తుండగా అవినాష్, సంగీత, సుమలత నీటిలోకి దిగి సరదాగా ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటున్నారు. అకస్మాత్తుగా రిజర్వాయర్‌లోని ఊబిలోకి అవినాష్ మునిగిపోయాడు. సంగీత, సుమలత సైతం నీటిలో గల్లంతయ్యారు. దివ్య గమనించి కేకలు వేయగా.. చుట్టుపక్కల వాళ్లు వచ్చి నీటిలోకి దిగి గాలించి ముగ్గురి మృతదేహాలను ఒడ్డుకు తీసుకొచ్చారు. పోలీసులు వచ్చి మృతదేహాలను జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి తరిలించారు. సంగీత ఇటీవలే ఇంటర్ ఉత్తీర్ణత కాగా సుమలత పదో తరగతి పాసైంది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బ్యాంకులో ఓ రోజు
ఉదయం ఏడు గంటలు అవుతోంది. కనురెప్పలు తెరుచుకోవడం లేదు, ఇంకా కాసేపు నిద్ర పోతే బావుంటుంది అనిపించినా లేవక తప్పని పరిస్థితి. ఇంతలో సెల్‌ఫోన్‌కి ఏదో మెసేజ్ వచ్చిన శబ్దం గుయ్‌మని వినిపించసాగింది. బద్ధకంగా మెసేజ్ చూశాడు. నిద్ర మత్తు వదిలిపోయింది. ఏజీయం నుండి సందేహానికి తావు లేని సందేశం. బడ్జెట్ నెగటివ్ నుండి పాజిటివ్‌కి రాక పోతే ఈ నెల ఆఖరులోగా బదిలీకి సిద్ధంగా ఉండమని. ఈ పది రోజుల్లోగా ఏ మాయో, మంత్రమో జరిగితే తప్ప అది అసాధ్యం. గబగబా బ్రష్ చేసి వచ్చేసరికి కాఫీ పట్టుకుని శ్రీమతి నిలబడివుంది. కప్పు అందుకున్నాడు. ‘రాత్రంతా నడుము నొప్పితో నిద్ర లేదండీ...ఈ రోజు అయినా డాక్టర్ దగ్గరకు వెళ్లకపోతే ఇక భరించలేను’ అంది. ‘సాయంకాలం అపాయింట్ మెంట్ తీసుకుంటాను’ చెప్పాడు. ‘తీసుకున్నాను, కానీ మీరు ఎన్నింటికి వస్తారో?’ ‘నేను డైరెక్ట్ గా క్లినిక్ కి వస్తాను’ చెప్పాడు. ఈ లోగా ఇంకో ఫోన్ కాల్. గబగబా మాట్లాడి బాత్రూం లోకి వెళ్ళాడు. ఓ కస్టమర్ తన హౌసింగ్ లోన్ ఎప్పటికి అవుతుందని అడిగాడు. స్నానం ముగించి వచ్చేసరికి మరో మెసేజ్.మొండి బకాయిల గురించి మీ మొండి వైఖరి మారకపోతే దండన తీవ్రంగా ఉంటుందని ఓ తీర్మానం. ఏం టిఫిన్ తిన్నాడో ఎలా తిన్నాడో తెలియదు, బయలుదేరిపోయాడు. బ్యాంకుకి వెళ్లి సిస్టమ్స్ ఆన్ చేసాడు. చక్రం గిర్రున తిరుగుతోంది... కనెక్టివిటీ ప్రాబ్లెమ్. ఫోన్ చేస్తే గంట కనీసం పడుతుందని శుభవార్త. కౌంటర్లలో సిబ్బంది హాయిగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ‘సర్, అర్జంట్ గా కాష్ కావాలి’ కస్టమర్ అభ్యర్ధన. కనెక్టివిటీ వచ్ఛేవరకు వేచి వుండమంటే ‘నా చెక్ ఉంచుకుని కాష్ ఇచ్చేయండి’ అంటూ కస్టమర్ విన్నపం మరియు సలహా. క్యాషియర్ కి చెబితే, ‘అదెలా అవుతుంది..అతని అకౌంట్లో బాలన్స్ వుందో లేదో... అంతగా అయితే మీరే ఇచ్చేయండి’ కనీసపు మొహమాటం కరువు. ఇవన్నీ రొటీన్లో మామూలే. ఈలోగా ఏటీఎంలో కాష్ లేదని, కనెక్టివిటీ వస్తేగాని కాష్ రాదని ప్రశ్న ప్లస్ జవాబు?! ఇంతలో లోన్ సెల్ నుండి డీవియేషన్ అప్రూవ్ అయితే గాని హౌసింగ్ లోన్ క్లియర్ కాదని, అర్జంట్ గా రమ్మనమని పిలుపు. సింగల్ బ్రాంచ్ బీఎంకి ఇదెలా సాధ్యం అవుతుందో ఎవరికి చెప్పినా అర్ధం కాదు, ప్రయోజనం లేదు. జోనల్ ఆఫీస్ నుండి కాల్. సీజీమ్ ఎల్లుండి వస్తున్నారు. ఇన్సూరెన్స్ మీ వంతు పది లక్షలు చేయాలి. (నేనేమైనా ఇన్సూరెన్స్ ఏజెంట్ నా?!) ‘నేను సింగల్ బ్రాంచ్ బీ ఎం నండీ... పది కష్టం’ అంటే ‘మీరెంత కష్ట పడుతున్నారో అందరికీ తెలుసు... చిన్న బ్రాంచ్‌లలో ఏం పని ఉంటుంది, కనీసం ఇది అయినా చెయ్యండి’సెల్ ఫోన్ పక్కన పెట్టి తలెత్తి చూస్తే ఎదురుగా ఓ పెద్దాయన.\ ‘నా పెన్షన్ రాలేదు’ ‘లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చారా?’ ‘గుర్తు లేదు’ ‘ఉండండి... చూసి చెబుతా....సిస్టమ్స్ ఇంకా రాలేదు, కూర్చోండి’ ‘ఎంతసేపు ఉండాలి’ ‘గంట పడుతుందని అన్నారు...చెప్పలేము’ ఇంతలో ఫోన్ మ్రోగింది. అటునుండి సీఎం అడ్మిన్ ‘సిస్టమ్ సస్పెన్స్ లో నాలుగు ఎంట్రీలు అర్జెంట్‌గా రివర్స్ చెయ్యండి... అసలు ఉదయం రాగానే వాటిని చూసి ఈ పాటికి క్లియర్ చెయ్యాలి, మేము పనిగట్టుకుని చెబితే కానీ చేయరా..’ ‘ఇక్కడ కనెక్టివిటీ ప్రాబ్లెమ్ సర్! ఇంకా రెస్టోర్ కాలేదు’ ‘రాగానే వెంటనే రివర్స్ చేసేయండి... నేను మళ్ళా రిమైండ్ చెయ్యను’ హుకుం జారీ అయ్యింది. ఇంతలో మెసెంజర్ వచ్చి ‘సర్ వచ్చింది’ చెప్పాడు. ‘ఎవరు?’ ‘అదే సర్...కంప్యూటర్లు... పని చేస్తున్నాయట’ హమ్మయ్య... సిస్టమ్స్ వచ్చేసాయి. హడావుడి ప్రారంభమయ్యింది. జనాల తోపులాట. గబగబా బీఓడీ చేసి, కాష్ తీయడానికి పరుగెత్తాడు. ‘సర్! మన సుబ్బరాజు అబ్బాయికి జలుబు చేసింది. ఈ రోజు సెలవు పెట్టాడు’ కాష్ ఇన్ఛార్జ్ చల్లగా కబురు చెప్పాడు. ‘సుబ్బరాజు కౌంటర్ కూడా చెయ్యాలి, గోల్డ్ లోన్‌కి ఇద్దరు రెడీగా వున్నారు. అది మీరు చూసుకోండి’ నిర్భయంగా, నిర్మొహమాటంగా చెప్పేశాడు కాష్ ఇన్ఛార్జ్. చిరాకు, టెన్షన్ తో ఛాంబర్లోకి వచ్చి కూర్చున్నాడు. ‘టీ చల్లరిపోతోంది..తాగండి’ అంది రమణమ్మ. కప్పు అందుకున్నాడు. జనాలు సీరియస్‌గా చూస్తున్నారు. ‘మా పని చేయకుండా నువ్వు టీ తాగుతూ కూర్చుంటావా?’ అని అందరిలోనూ ఒకటే ఫీలింగ్ సూటిగా బాణంలా తగులుతోంది. అబ్బ...పంచదార పానకం... ఎన్ని సార్లు చెప్పినా మరిచిపోయాను ఈ రోజుకి తాగేయండి’ అంటుంది. ఈ దెబ్బతో షుగర్ లెవెల్ నాలుగొందలు దాటి కిడ్నీలు డాం గ్యారెంటీ.పాసింగ్ ప్రారంభించాడు చకచకా. ఓ గంట ఏకధాటిగా అదే పని మీద ఉంటే కొంత జనాలు కదిలారు \మంగళ సూత్రాలు పట్టుకుని కట్టడానికి రెడీ అన్నట్టు ఓ పెద్దాయన ఎదురుగా కూర్చున్నాడు గోల్డ్ లోన్‌కి.‘వీటికి లోన్ ఇవ్వడం కుదరదు...ఆ నల్లపూసలు తీసేయాలి. ఆ సూత్రాల వెనక ఆ లక్క ఉండకూడదు’ చెప్పాడు.‘అయ్యా...ఎంత ఎమర్జెన్సీ కాకపోతే ఇలా మా ఆవిడ పుస్తెలు తెస్తాను... మీరు అదితీసేయండి ఇది ఉండకూడదు అంటే ఎలాగ చెప్పండి’‘రూల్స్ ఒప్పు కోవండీ...’ అంటూ ఓ పావుగంట సేపు వివరంగా చెప్పి ఒప్పించేసరికి తలప్రాణం కాళ్ళలోకి వచ్చిందిఇంతలో లోకల్ హెడ్ ఆఫీస్ నుండి ...ట్రేడింగ్ అకౌంట్లో కొంత అమౌంట్ లీన్ లో ఉందనీ, అది లిఫ్ట్ చేయడం కుదరదని చెప్పినందుకు గాను కస్టమర్ అంబుడ్స్‌మెన్‌కు వెళ్తున్నాడని...దీనికి మీ సమాధానం ఏమిటని ఘాటుగా ఫోన్ వచ్చింది.ట్రేడింగ్ అకౌంట్ ఆపరేట్ చేసేది కస్టమర్, అతడు షేర్స్ కొనేటప్పుడు అవసరమైన అమౌంట్ లీన్లో పెట్టుకునేది అతడే...షేర్స్ అలాట్ కానప్పుడు ఆ లీన్ లిఫ్ట్ చేసేది కస్టమరే తప్ప బ్రాంచ్ మేనేజర్ కి ఎటువంటి ప్రమేయం ఉండదని వివరించేసరికి...‘అదంతా మాకు తెలియదు, కస్టమర్‌ని పిలిపించి అతనిచేత దగ్గరుండి లీన్ లిఫ్ట్ చేయించి ప్రాబ్లెమ్ లేకుండా చూసుకోండి’ అని ఫోన్ కట్ చేసేసారు.ఒక్కసారి నీరసంగా అనిపించి అలా సీట్లో వెనక్కి వాలి మంచి నీళ్ళు కోసం బాటిల్ అందుకుంటే అది ఖాళీ.బెల్ కొట్టాడు. రమణమ్మ వచ్చింది. బొటన వేలితో సైగ చేసాడు. బాటిల్ పట్టుకుని వెళ్ళి మంచి నీళ్ళు తెచ్చింది.ఓ గుక్కెడు తాగుదామనే సరికి కేకలు వినిపించాయి.చెక్ క్లియరింగ్‌కి నాలుగు రోజులా? అరుస్తున్నాడు ఓ కస్టమర్ హాల్లో.మంచి నీళ్ళు తాగి కౌంటర్ దగ్గరకు వెళ్లి విషయాన్ని తెలుసుకుని ‘అయ్యా! మీరు చెక్ లక్ష్మి వారం సాయంకాలం డ్రాప్ బాక్స్ లో వేశారు. అది శుక్రవారం ఉదయం వెళ్ళింది. శనివారం నాన్ క్లియిరింగ్ డే, ఆదివారం సెలవు కనుక ఈ రోజు సోమవారం సాయంకాలానికి మీ అకౌంట్లో పడుతుంది’ అని వివరంగా చెప్పాడు.‘మరి,ఈ మాత్రం దానికి ఇరవై నాలుగు గంటల్లో క్లియిరింగ్ అని బోర్డ్ పెట్టడం దేనికి?’ఏం సమాధానం చెబుతాడు?అదే సమయానికి ‘దొంగ నోటు’ అని కౌంటర్లో కాష్ ఇన్చార్జ్ చెప్పడం,‘అది నిన్న మీరే ఇచ్చారు’ అని కస్టమర్ దబాయించడం....ఆ వాదనకి అంతం ఆఖరికి పోలీస్ కంప్లయింట్ ఇస్తాననే వరకు వచ్చి అప్పటికి కాస్తా సద్దు మణిగింది.లంచ్ టైం అవ్వడంతో ఇంట్రవెల్ దొరికింది.ఈరోజు నడుం నొప్పి కారణంగా శ్రీమతి కేరెజీ కట్టలేదనే విషయం గుర్తొచ్చింది. రమణమ్మకు టిఫిన్ తెమ్మనమని చెప్పాడు.బాంక్ ఎదురుగా ఓ పాక హోటల్ నుండి రాళ్ల లాంటి రెండు గారెలు తెచ్చింది. ఒకటి తింటే చాలు ఆకలి చచ్చి కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్‌కి బైపాస్ తప్పదేమో? సీనియర్ కొలీగ్ ఒకాయన గుర్తుకు వచ్చాడు. నలభై ఏళ్లకే పాపం....ఆలోచనలకు భంగం కలిగిస్తూ మెసెంజర్ వచ్చి,‘సర్, ఆక్వా కంపెనీ మూర్తి గారికి పది లక్షలు కాష్ అర్జంట్ గా కావాలిట’ అని చెప్పాడు.‘మన దగ్గర ఎంత ఉందో కనుక్కో’‘అంతా కలిపి నాలుగు మించదట, చెప్పారు’‘సరే పద..వస్తున్నా’ సగం తినగా మిగిలిన గారె వదిలి పెట్టి లేచాడు.సింగల్ బ్రాంచ్ లిమిట్ పది లక్షలు. ఈ రోజు ఇండెంట్ పెడితేరేపటికి గాని రాదు.మెయిన్ బ్రాంచ్‌కి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తే, చెక్ ఎటెస్టు చేసి కస్టమర్‌ని పంపిస్తే ఇస్తామన్నారు.అదే విషయం ఆ మూర్తిగారికి చెబితే, ‘మీరు తెప్పించలేరా?మేమే వెళ్ళాలా?’ అంటూ ఒకటే విసుగు ప్రకటించి ఆఖరికి వెళ్లారు.సాయంకాలం నాలుగు అవ్వడంతో పబ్లిక్ ట్రాన్జాక్షన్స్ క్లోజ్ చేసి తాను చేయాల్సిన తదితర పనులు చేయసాగాడు.కాష్ బాలన్స్ అవ్వగానే, ‘రండి సర్, సేఫ్ క్లోజ్ చేద్దామని పిలుపు.ఆ తరువాత గుడ్ నైట్.ఒక్కడే మిగిలిపోయాడు.సస్పెన్స్ ఎంట్రీలు రివర్స్ చెయ్యాలంటే స్టాఫ్ ఉండాలి. వాళ్లు ఫీడ్ చేసాక గాని తను ఆథరైస్ చెయ్యడం కుదరదు. ఏం సమాధానం ఎలా చెబుతాడు?సరిగ్గా అదే సమయానికి సీఎం అడ్మిన్ నుండి ఫోన్ వచ్చింది.‘ఇంకా రివర్స్ చేయలేదా? ఎట్టి పరిస్థితుల్లోనూ సిస్టం సస్పెన్స్ జీరో చెయ్యకుండా ఇంటికి వెళ్లే ప్రసక్తి లేదు’ఐదు దాటింది...స్టాఫ్ వెళ్లిపోయారు...రేపు చేస్తాను...అని చెప్పటానికి కూడా గొంతు పెగలలేదు.తన మిత్రుడికి ఫోన్ చేశాడు.వాడు పక్క బ్రాంచి మేనేజర్. ‘ఒరేయ్...రోలు పోయి మద్దెలతో మొరపెట్టుకున్నట్టుగా ఉంది. ఉదయం నాకు అరగంట సేపు ఆపకుండా వాయించారు. మెమో ఇస్తామన్నారు’దేనికి?’ అడిగాడు.‘బ్రాంచికి బిజినెస్ లేదని? చుట్టూ ఉన్నవి పట్టా లేని భూములు. హౌసింగ్ లోన్లు ఎలా వస్తాయి? జనాలు దిగువ మధ్యతరగతి వాళ్ళు. బంగారం మీద లోన్లు ఇమ్మంటారు. ఏరియాలో ఉద్యోగస్తులే లేరు. పెర్సనల్ లోన్ లిమ్మంటారు.బ్రాంచ్ షిఫ్ట్ చేద్దామంటే నన్నే షిఫ్ట్ చేస్తామన్నారు. పైగా నా వాక్ స్వతంత్రానికి మెమో అంటున్నారు. నిద్ర మాత్రలు మింగేద్దామని అనుకుంటుండగా నువ్వు ఫోన్ చేశావ్’‘అటువంటి ఆలోచనలు చెయ్యకురా...ఎట్టి పరిస్థితులలోనూ అలా చెయ్యకూడదు...ఒత్తిడికి చిత్తు కాకూడదు. ఆ ఒత్తిడిని పుత్తడిగా మార్చుకోవాలి’‘పుత్తడిగా మారితే అప్పుడు గోల్డ్‌లోన్ ఇవ్వొచ్చూ అంటావ్...సరి సరి’ఇంతలో సెల్ఫోన్లు గుయ్ మని శబ్దం చేశాయి.‘ఏదో మెసేజ్ వచ్చినట్టు ఉంది’ అంటూ ఇద్దరూ ఫోన్ పెట్టేసారు.ఆదివారం ఉదయం పది గంటలకు మీటింగ్.ఈ వారాంతపు సెలవు గోవిందా ?ఇంతలో మరో కాల్ ...‘హలో’ అన్నాడు.‘నేనురా...గోపీని’ తన మిత్రుడు.‘ఏరా... ఏంటి సంగతి!’‘చాలా హాపీ రా....ఈ రోజే నేను నా ఉద్యోగానికి రాజీనామా సమర్పించాను’ఒక్క క్షణం గుండె లయ తప్పి కొట్టుకుంది.‘అదేంటిరా..అంత సడన్ గా ఎవరికీ చెప్పకుండా నిర్ణయం తీసుకున్నావ్? ఇంకా పదేళ్లు సర్వీస్ ఉంది’‘పదేళ్లు ఈ టెన్షన్స్‌తో వుంటామో లేదో....వున్నా రోగాలతో, మందులతో బ్రతకాలి, ఎందుకొచ్చిన బ్రతుకని’గోపీ మాటలు నిజమే అనిపించాయి.ఉదయం లేచిన దగ్గర నుండి కుటుంబం గురించి గాని, పిల్లల గురించి గాని ఆలోచించడం అటు ఉంచితే కనీసం ఓ ఐదు నిముషాలు మాట్లాడటం కూడా జరగదు. ఇరవై నాలుగు గంటలూ బ్యాంకుతోనేఅయిపోతోంది.మిత్రులూ, బంధువులు సరేసరి పూర్తిగా మరిచిపోయారు.సోషల్ లైఫ్ అనేది లేకుండా పోయింది.ఇంతలో మరో ఫోన్ కాల్, ఓ రెండు మెసేజ్ లు వచ్చాయి. వాటికి తగు సమాధానాలు ఇచ్చి భార్యకు కు ఫోన్ చేసాడు.‘క్లినిక్ కి వస్తున్నాను’ చెప్పాడు.ఆవిడ చాలా ఆశ్చర్యంగా ‘నిజంగా’ అంది.వెంటనే చకచకా బయలుదేరిపోయాడు.డాక్టర్ చెక్ అప్, ఎక్స రే తీయడం, మందులు కొనుక్కొని బైటకు వచ్చేసరికి రాత్రి పది గంటలు దాటింది. ఇప్పుడిక ఇంటికి వెళ్లి ఏం తింటామని మంచి హోటల్ కెళ్ళి చక్కని పదహారణాల తెలుగు భోజనం తిని,చివరలో గడ్డ పెరుగు వేసుకుని ఆవకాయతో రెండు ముద్దలు తిన్నాక తృప్తిగా అనిపించింది.భర్త నిదానం చూసి ‘రేపు బాంక్ లేదా?’ అంది.సరిగ్గా అప్పుడే సెల్ ఫోన్ గుయ్ మంది.మెసేజ్ చూశాడు...బ్రాంచ్ ఇన్స్పెక్ట్ చేయడానికి ఉదయం ఏడు గంటలకు ఆడిటర్ వస్తున్నట్టుగా ఓ వార్త. ∙పక్కి శివప్రసాదరావు -
సింగపూర్ బాబు సెల్‌ఫోన్ ఇచ్చాడా అక్కా!
సాక్షి, విశాఖపట్నం: ఓ వైపు ఎండాకాలం.. మరోవైపు ఎన్నికలు.. రాష్ట్రమంతా వేడిగా, వాడిగా ఉంది. ఎవరు కలిసినా ఎన్నికల గురించే మాట్లాడుకుంటున్నారు. మధ్యలో ఎండ గురించి కూడా చెప్పుకుంటున్నారు. ఆ విధంగానే ఓచోట పిచ్చాపాటీ మాటాడుకుంటున్నారు ఈ ముగ్గురు మహిళలు. డ్వాక్రా సభ్యులైన వీళ్లు తమకు సీఎం ఇస్తామన్న పసుపు– కుంకుమ చెక్కుల గురించి చర్చించుకుంటున్నారు. బ్యాంకోళ్లు నా డబ్బులివ్వలేదంటే ..నా డబ్బులివ్వలేదంటూ దుమ్మెత్తిపోశారు. చంద్రబాబేమో వడ్డీ డబ్బులు ఇవ్వకుండా ఈ ఖాళీ చెక్కులు తమ మొగాన పడేశాడని, ఆ డబ్బులు కూడా బ్యాంకు అధికారులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. పనిలోపనిగా బాబు ఇస్తామన్న సెల్ ఫోన్ల గురించి కూడా ముచ్చట్లాడుకున్నారు. ఆ మాట అటెళ్లి, ఇటెళ్లి చివరికి ఎన్నికల వైపు నడిచింది. ఆ సంభాషణ ఇలా సాగింది. సత్తెక్క: ఏమే.. మంగక్కా.. డ్వాక్రాలో పదేల్లుగా ఉన్నానే.. పోయినసారి ఎలచ్చన్లలో డ్వాక్రా లోన్లు కట్టొద్దని సెంద్రబాబు అన్నాడని ఇరవై వేలు అప్పు కట్టడం మానీసేను. రెండేల్ల తర్వాత సూస్తే, అసలు రెండింతలయింది. బ్యాంకోల్లు కట్టీమని గట్టిగ సెప్పినారు. దీంతో ఇరవై వేలు వడ్డీకి తెచ్చి కట్టినాను. మంగక్క: అవునే సత్తెక్క .. నాపని కూడా అలాగే అయింది. బాబు మాటలు ఇని అసలుకంటే వొడ్డీ ఎక్కువగా బ్యాంకోళ్లకు కట్టినం. ఇప్పుడు ఎలచ్చన్లు వస్తున్నాయని మళ్లీ చంద్రబాబు పసుపు– కుంకుం సెక్కులు ఇచ్చినాడు. ఆ డబ్బులు కూడా బ్యాంకోల్లే పాత బాకీలకు జమ సేసుకుంటామన్నారు. లచ్చిమక్క: ఇదేటమ్మా.. మనం లోన్లు తీసుకుంటే సెంద్రబాబు ఒక్క రూపాయి కూడా వొడ్డీ కట్టకపాయె. మొన్నటి వరకూ కూడా అదిగోఇదిగో అని వొడ్డీ ఎగ్గొట్టీసినాడు. వొడ్డీ డబ్బులు సేతిలో పెట్టకుండా అందులో నుంచి కొంత తీసి మొకాన కొడుతున్నాడు. ఆ డబ్బులు సూసి కొందరు మురిసిపోతన్నారు. అసలు ఇసయం ఏటంటే.. ఐదేళ్ల కిందట మన అప్పెంత.. దానికి వొడ్డీ ఎంత.. మళ్లీ మన లోనెంత.. వొడ్డీ ఎంత, కట్టిందెంత? ఇవన్నీ సూసుకుంటే పసుపు కుంకం మోసం తెలిసిపోద్ది. సత్తెక్క: నిజమేనే లచ్చిమక్క..ఏమో అనుకున్నా.. సెంద్రబాబు మామోలోడు కాడు. మన డబ్బులోంచి కొంత తీసి మన ముకాన కొడతన్నాడు. మనకే సాలా బాకీ పడినాడు. మొన్ననే డ్వాక్రా వోల్లకు సెల్ ఫోన్లు ఇస్తామని సెప్పినాడు. సింగపూర్ బాబు సెల్పోన్లు ఎవురికీ ఇవ్వలేదు. ఇచ్చినా టెంపర్వొరీ పోన్లు ఇస్తాడేమో .. ఆ పోన్ల నుంచి మన ఇవరాలన్నీ లాగేస్తాడేమో. మరేటి.. మనం ఎవరికి వోటేత్తామే మంగక్కా.. మంగక్క: సత్తెక్కా.. ఆ మద్దిన రాజశేకర రెడ్డి కొడుకు జగన్ బాబు వొచ్చినాడు కదా. పేదోల్లకు ఏం సేసేదీ క్లీరుగా సెప్పాడు. సాలా పనులు, సాయం సేస్తానన్నాడు. పొదుపు సేస్తున్న ఆడోల్లకు మొత్తం లోను తీర్సేస్తానన్నాడు. ఆల్ల నాయన మాదిరి ఈయన కూడా మాటకు కట్టుబడే వోడు. నాకైతే ఆతడికి ఓసారి చాన్సు ఇయ్యాలని ఉందే. లచ్చిమక్క: అవునే ఈ సారికి ఆ బాబుకే ఏద్దామే. -
ప్రాణం తీసిన సెల్‌ఫోన్ వివాదం
పటాన్చెరు టౌన్: సెల్‌ఫోన్‌పై గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. సెల్‌ఫోన్ విషయమై విద్యార్థుల మధ్య ఏర్పడ్డ వివాదం బీటెక్ విద్యార్థి ప్రాణాలు తీసింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, విద్యార్థి తండ్రి కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరికి చెందిన పితాని నాగేశ్వర్రావు కుటుంబం 20 ఏళ్ల కింద బతుకుదెరువు కోసం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల పరిధిలోని ఐటీడబ్ల్యూ సిగ్నోడ్ కాలనీకి వచ్చారు. ఇతని కుమారుడు గౌతమ్ (18) హైదరాబాద్‌లోని ఎంఎల్ఆర్ కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. గౌతమ్ తనకు సెల్‌ఫోన్ అవసరం ఉందని స్నేహితుడైన పవన్‌కి చెప్పాడు. ఆన్లైన్లో ఆఫర్స్ ఉన్నాయని చెప్పి సెల్‌ఫోన్ బుక్ చేయాల్సిందిగా పవన్ తన స్నేహితుడైన వినయ్‌కు రూ.8 వేలను గౌతమ్ నుంచి ఇప్పించాడు. నగదు ఇచ్చి నెలరోజులైనా సెల్‌ఫోన్ ఇవ్వకపోవడంతో గౌతమ్ ఆ విషయాన్ని తండ్రికి చెప్పాడు. దీంతో నాగేశ్వర్రావు వారిని అడగడంతో వినయ్, అతని స్నేహితులు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో సెల్‌ఫోన్ కోసం డబ్బులు ఇచ్చాను కదా అని పవన్‌ను గౌతమ్ నిలదీశాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం అమీన్పూర్ మండల పరిధిలోని సుల్తాన్పూర్ రింగ్ రోడ్డు వద్దకు రమ్మని గౌతమ్‌కు పవన్ చెప్పాడు. గౌతమ్ అక్కడికి వెళ్లగా పవన్, అతని స్నేహితుడు కాశీమ్ అక్కడ ఉన్నారు. ఈ విషయమై మరోసారి వారిమధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పవన్, కాశీమ్ ఇద్దరూ కలిసి గౌతమ్ గొంతు నులిమి చంపేసి స్థానిక సుల్తాన్పూర్ చెరువులో పడేశారు. అనంతరం తమ మిత్రులైన మిశ్ర, వినయ్‌కి విషయం చెప్పారు. తమ కుమారుడు కనిపించడం లేదని గౌతమ్ తల్లిదండ్రులు సోమవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి గౌతమ్ స్నేహితులను విచారించగా అసలు నిజం బయటపడింది. గౌతమ్ మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పవన్, కాశీమ్‌ను రిమాండ్‌కు తరలించారు. -
అక్కపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తమ్ముడు
-
పెళ్లయ్యాక ప్రేమ ఇలా ఉండొచ్చా?
ప్రేమ నుంచి పెళ్లి దాకా వెళ్లగలగడం అదృష్టమే. పెళ్లయ్యాక అదే ప్రేమను కోరుకుంటే మాత్రం ఆ అదృష్టం.. తిరగబడినట్లనిపిస్తుంది! ఈ స్టోరీలో భార్య.. భర్తనుంచి పెళ్లికి పూర్వపు ప్రేమను కోరుకుంది. అనుక్షణం ఆ ప్రేమ కోసం ఆరాటపడింది.. అలమటించింది.. చేజారిపోతాడేమోనని భయపడింది. చివరికి ఆ దాంపత్యం ఎలా సెట్‌రైట్ అయింది? బీప్ బీప్... సెల్ఫోన్లో మెసేజ్ బ్లింక్ అయ్యింది. ఆఫీసులో ఉన్నాడు అతను. తీసి చూశాడు. భార్య నుంచి.‘ఏం చేస్తున్నావు?’ మళ్లీ బీప్ బీప్ శబ్దం వచ్చింది. ‘తిన్నావా?’ మళ్లీ బీప్. ‘ఇవాళ ఆఫీసుకు వెళ్లేప్పుడు నా వైపు తిరిగి చూడలేదు నువ్వు’ మళ్లీ బీప్. ‘అసలు నేనంటే నీకు ప్రేముందా?’ మళ్లీ బీప్. ‘అలా అయితే ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు’ మళ్లీ బీప్. ‘ఇదంతా నా ఖర్మ’. అతడు నిస్పృహగా ఫోన్ పక్కన పెట్టేశాడు. ఆ రోజు ఆఫీసులో చేయాల్సిన పని అంతా గంగపాలు. సాయంత్రం భయం భయంగా ఇంటికి వెళ్లాడతను. తల్లిదండ్రులు అప్పటికే వృద్ధులు. ఇద్దరికీ 70 దాటాయి. ఆఫీసు నుంచి రాగానే వాళ్లను చూడాలి. లేదా వాళ్లు తనను చూడాలి. వాళ్ల దగ్గర పది నిమిషాలు కూచుంటే ఇరుపక్షాలకూ తృప్తి. కాని అదే జరిగితే? ‘హు.. అంతేలేండి ఇంటికొచ్చిన ఏ మగాడైనా భార్య ముఖం చూద్దామనుకుంటాడు. మీరు ఉన్నారు దండగముఖం వేసుకుని. ఏకంగా అమ్మా అయ్యల దగ్గరకు వెళ్లి వాళ్ల వీపు వెనుక దాక్కోవడమే’ ఆ తిట్లు ఎందుకు అని నేరుగా గదిలోకి వెళ్లాడు. వెళ్లి భార్యను చూసి దడుచుకున్నాడు. పొద్దున ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది. తిన్నట్టు లేదు. స్నానం చేసినట్టు లేదు. అసలు గది నుంచి కదిలినట్టే లేదు. గుండెలు దడదడలాడాయి. అంటే బయటకు వచ్చి తల్లిదండ్రులకు భోజనం పెట్టిందా? అసలు వంట చేసిందా? కోపం నషాళానికి అంటింది. కాని వీలైనంత అనునయంగా ‘ఏమైంది?’ అని అడిగాడు. ‘నువ్వు నాతో ప్రేమగా లేవు’ ‘ఎందుకు అలా అంటావు. నీకు కావలసినవన్నీ చేస్తున్నాను. ఇంట్లో ఉన్నప్పుడు నీతోనే ఉంటాను’... ‘మరి ఆఫీసుకు వెళ్లాక ఒక్క మెసేజన్నా పెడుతున్నావా? ఒక్క కాల్ అన్నా చేస్తున్నావా?’ ‘అంటే పని చేయవద్దా?’ ‘చేయాలో వద్దో నీ ఇష్టం. కాని నాకు నీ ప్రేమ కావాలి. ఎప్పుడూ నువ్వు నా పక్కనే ఉండాలి. నన్ను ప్రేమిస్తూనే ఉండాలి’‘లేకుంటే?’ ‘నేను చచ్చిపోతాను. లేదా నిన్ను చంపేస్తాను’. ‘డాక్టర్... ఇదీ నా పరిస్థితి. ఇంటికి వెళ్లలేకపోతున్నాను. నా తల్లిదండ్రులు పూర్తిగా భయపడిపోయారు. ఈ స్థాయి ప్రేమ నరకంగా ఉంది. దీనిని తట్టుకోలేక, ఇంటికి వెళ్లలేక, బయట ఉండలేక తాగుడుకు బానిస అయ్యాను. నా భార్యను మీరే ట్రీట్ చేయాలి’ అన్నాడు అతను.సైకియాట్రిస్ట్ తల పంకించి అతని వైపు చూశాడు. 37 ఏళ్లు ఉంటాయి.‘మీ పెళ్లయి ఎన్నేళ్లు?’‘ఒకటిన్నర సంవత్సరం’‘సరే... మీరు వెళ్లి ఆమెను పంపండి’ఆమె వచ్చింది. చూశాడు. చామనఛాయలో సన్నగా పలుచగా కళ్ల కింద నలుపుతో ఉంది. అప్రసన్నంగా ఉంది. 33 లేదా 34 ఏళ్లు ఉంటాయి.‘మనం కాసేపు మాట్లాడుకుందామా?’ అడిగాడు. తల ఊపింది.ఆమె పేరు రాధ. బాల్యం అనగానే ఆమెకు గుర్తుకు వచ్చేది కృష్ణుడి కోవెల. అక్కడకు తీసుకెళ్లే తండ్రి జ్ఞాపకం. ఐదేళ్ల వయసులో తండ్రి భుజం దిగేది కాదు. తండ్రి చాక్లెట్లు తెచ్చి ఇచ్చేవాడు. సైకిల్ మీద కూచోబెట్టి తిప్పేవాడు. ఎనిమిదేళ్లు వచ్చాయి. తండ్రి రావడం మానేశాడు. రోజూ గేటు దగ్గర నిలబడి చూసేది. వచ్చేవాడు కాదు. రాత్రి పూట ఉలిక్కిపడి లేచి చూసేది. ఉండేవాడు కాదు. వీపు మీద కూచోబెట్టి తిప్పిన తండ్రి... బంగారూ అని పిలిచే తండ్రి... ఎగరేసి పట్టుకునే తండ్రి... ఎలా వదిలేశాడు?తర్వాత తెలిసింది.అమ్మ ఆయనకు రెండో భార్య అట.మొదటి భార్య గోల చేసి గగ్గోలు పెట్టేసరికి రావడం మానేశాడట. వేరే ఊరు వెళ్లిపోయాడట.‘ఇలా చేస్తారా ఏ నాన్నైనా?’ చిన్న వయసులో నిస్సహాయత నుంచి కోపం వచ్చింది. నాన్న మీద కోపం మగాళ్ల మీద కోపంగా మారింది. అసలు ప్రతి విషయం మీద కోపంగా మారింది. వయసు వచ్చింది. కాని ఆ వయసు ఎవరి కోసం? ఏ మగాణ్ణి నమ్మాలని. వద్దు.. ఏ మగాణ్ణీ నమ్మొద్దు. వయసు పెరుగుతూ పోయింది. తల్లికి ఇది బెంగ. బాగా చదివించుకుని జాగ్రత్తగా పెంచుకుందని అనుకుంది కాని కూతురి మనసులో ఇలాంటి విపరీతం ఉందని తెలుసుకోలేదు.అలాంటి టైములో వేణు కనిపించాడు. ఇద్దరివీ వేరు వేరు ఆఫీసులే అయినా ఒకే బస్‌లో ప్రయాణించేవారు. రెండు మూడు నెలల పరిచయం తర్వాత ఒకసారి మాటల్లో ‘బంగారూ’ అని పిలిచాడు. అంతే. ఎక్కడో శిథిలాలలో ఉన్న తండ్రి జ్ఞాపకం సజీవంగా మేల్కొంది. ఇతను తన తండ్రి లాంటివాడే. అప్పటి తండ్రిలా అంతే ప్రేమ పంచేవాడా? అవును అనుకుంది. వేణులోని మంచితనాన్ని ప్రేమించింది. స్నేహితుణ్ణి ప్రేమించింది. తండ్రి స్పర్శను ప్రేమించింది. ఇంట్లో ముగ్గురు అక్కయ్యల పెళ్లి అయ్యేంత వరకు ఆగి వయసు మీదకు తెచ్చుకుని ఉన్న అతణ్ణి మరో ఆలోచన లేకుండా పెళ్లాడింది. అతడి కోసం పూర్తి ఇల్లాలిగా ఉండాలని ముందే ఉద్యోగం మానేసింది.పెళ్లయిన మొదటి పదిరోజులు అతడు సెలవు పెట్టి తన దగ్గరే ఉన్నాడు. కాని సెలవు పూర్తయ్యి రోజూ ఆఫీసుకు వెళ్లి వస్తున్నప్పుడు ప్రాబ్లమ్ మొదలయ్యింది.అది ఎలాంటి ప్రాబ్లమ్ అంటే అతడు కంటికి కనిపించకపోతే కనుక తన ప్రేమలో లేనట్టే అని భావించేంతగా. బయటకు వెళితే ఎవరి ప్రేమలో పడతాడో. లేదా ఎక్కడ దూరం అవుతాడో. లేదా తన మీద ఎక్కడ ప్రేమ తగ్గిపోతుందో? దొరక్క దొరక్క దొరికాడు ఇష్టపడే మగవాడు. వాణ్ణి వదలకూడదు. అందుకే బంధించడం పెంచింది.ఎంత పెంచిందంటే అతడికి ఊపిరి సలపక చచ్చిపోయేంత.ఇద్దరినీ పిలిచి కూచోబెట్టాడు సైకియాట్రిస్ట్.ఆమె వైపు చూస్తూ అన్నాడు.‘ఏమ్మా... చిన్నప్పుడు నువ్వు ఎప్పుడైనా ఇన్లాండ్ కవర్ అంటించావా?’తల ఊపింది.‘ఇన్లాండ్ కవర్‌కు ఆల్రెడీ కొద్దిగా జిగురు పూత ఉంటుంది. మనం నాలుకతో కొంచెం తడి చేసి అంటిస్తే అంటుకుంటుంది. ఉత్తరం అందుకున్నవారు కొంచెం నైపుణ్యంతో విప్పితేచిరగకుండా విప్పుకుంటుంది. అవునా?’మళ్లీ తల ఊపింది.‘అలా కాదని కవర్ బాగా అంటుకోవాలని బంక రాసి చాలనట్టు జిగురు రాసి అదీ చాలనట్టు ఫెవికాల్ కూడా రాసి అంటిస్తే ఏమవుతుంది?’మౌనంగా చూసింది.‘కవర్ పాడవుతుంది. చిరుగుతుంది. పనికిరాకుండా పోతుంది. ఇప్పుడు నువ్వు చేస్తున్నది అదే. ప్రాక్టికల్ రిలేషన్ అంటారు. పెళ్లి ఒక ప్రాక్టికల్ రిలేషన్. మీ ఇద్దరి స్వేచ్ఛను మీరు గౌరవిస్తూ మీ అనుబంధాన్ని పెంచుకుంటూ సంసారం నడవడానికి అవసరమైన నియమాల్ని పాటిస్తూ ముందుకు సాగాలి. కాని నువ్వు అతని నుంచి అతి ప్రేమను ఆశించి జీవితం నాశనం చేసుకుంటున్నావు. నువ్వే కాదు.. ఈ పని కొందరు మగాళ్లు కూడా చేస్తారు. భార్య మీద ఓవర్ పొజెసివ్నెస్తో ఆమె జీవితం నరకం చేస్తారు. పరస్పరం నమ్మకం, గాఢమైన ప్రేమ ఉంటే సంవత్సరం దూరంగా ఉన్నా ఏమీ కాదు. ఆ నమ్మకం ఏర్పడకపోతే వీధి చివరకు వెళ్లి వచ్చేలోపల అనుమానం వచ్చేస్తుంది. నాకు తెలిసినంత వరకు నీ భర్త నిన్ను ప్రేమిస్తున్నాడు. కోరుకుంటున్నాడు. ఇక మారాల్సింది నువ్వే’ఆమె పలుచటి కన్నీటి తెర వచ్చింది.‘చూడమ్మా... దొరక్క దొరక్క దొరికింది చేజారిపోవాలన్న నియమం లేదు. ఆలస్యంగా పూచిన పువ్వుకు కూడా అంతే పరిమళం ఉంటుంది. సందేహాలు పెట్టుకోకు.భర్త కోసం జీవించడం మంచిదేకానీ అదే నీ జీవితం కాదు. నువ్వు కూడా ఉద్యోగం చేయి. నీ స్పేస్ నువ్వు తీసుకో. అలాగే భర్తను అతను కోరుకునే విధంగా అతని తల్లిదండ్రులను నీవారిగా భావిస్తే నీ అభద్రతపోతుంది. జీవితం సంతోషంగా ఉంటుంది’ అన్నాడు సైకియాట్రిస్ట్.అతని టేబుల్ మీద ఉన్న ఫ్లవర్‌వాజ్‌లో తాజా గులాబీలు ఉన్నాయి.వాటి తేలికపాటి సువాసన వారి జీవితంలో కూడా వచ్చే అవకాశం ఉందన్న నమ్మకం ఆమెలో కనిపించింది. పెళ్లయిన మొదటి పదిరోజులు అతడు సెలవు పెట్టి తన దగ్గరే ఉన్నాడు. కాని సెలవు పూర్తయ్యి రోజూ ఆఫీసుకు వెళ్లి వస్తున్నప్పుడు ప్రాబ్లమ్ మొదలయ్యింది. అది ఎలాంటి ప్రాబ్లమ్ అంటే అతడు కంటికి కనిపించకపోతే కనుక తన ప్రేమలో లేనట్టే అని భావించేంతగా. బయటకు వెళితే ఎవరి ప్రేమలో పడతాడో. లేదా ఎక్కడ దూరం అవుతాడో. – ఇన్పుట్స్: డాక్టర్ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్ -
పెట్రోల్ టు సెల్‌ఫోన్!
హిమాయత్‌నగర్: వాహనాల్లో పెట్రోల్ కొట్టేయడంతో చోరీలకు శ్రీకారం చుట్టిన ఓ యువకుడు సెల్ఫోన్లు చోరీ చేసేస్థాయికి ఎదిగాడు. ఇప్పటికే 10 కేసుల్లో నిందితుడిగా ఉన్న అతను జైలుకు వెళ్లినా బుద్ధి మార్చుకోకుండా మరో ఇద్దరితో కలిసి ముఠాగా ఏర్పడి సెల్ఫోన్ల చోరీలకు పాల్పడుతున్నాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో సెల్‌ఫోన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఈ ముఠాను నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. అబిడ్స్ ఏసీపీ భిక్షంరెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఐఎస్ సదన్‌కు చెందిన పోతుల అరవింద్ చిన్నతనం నుంచే దోపిడీ, దొంగతనాలను పాల్పడుతున్నాడు. సరోజనీకాలనీకి చెందిన గంజి వికాస్, కంచన్‌బాగ్‌లోని దామోదర్ సంజివయ్య నగర్‌కు చెందిన జవడి కార్తీక్‌లతో కలసి ముఠాగా ఏర్పడిన అతను పలు ప్రాంతాల్లో సెల్‌ఫోన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నాడు. ఈ నెల 17న హిమాయత్‌నగర్ ప్రధాన రహదారిపై ఓ వ్యక్తి క్యాబ్ బుక్ చేసుకుంటుండగా వెనక నుంచి వికాస్, కార్తీక్ అతడి సెల్‌ఫోన్ లాక్కుని బైక్‌పై పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 24న లిబర్టీ వద్ద ఓ యువకుడు ఫోన్లో మాట్లాడుతుండగా అరవింద్, కార్తీక్‌లు వెనక నుంచి వచ్చి అతడి ఫోన్ లాక్కుని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా వికాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన ఆధారాలతో అరవింద్, కార్తీక్‌లను అరెస్ట్ చేసినట్లు క్రైం ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపారు. గ్యాంగ్ పెద్దదే నాలుగేళల్లో అరవింద్‌కు పరిచయమైన ప్రతి వ్యక్తిని మచ్చిక చేసుకుని వారికి కొంత డబ్బులు ఇచ్చి చోరీలకు వినియోగించుకున్నట్లు విచారణలో వెల్లడైయ్యింది. స్కూల్ పిల్లలు మొదలు, కాలేజీ విద్యార్థుల వరకు పలువురిని తన దొంగతనాల్లో భాగస్వాములను చేసుకున్నట్లు గుర్తించారు. బంధిపోటు దొంగతనం, ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడిన అరవింద్ పెద్ద నేరాలు చేసి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. పది కేసులు, రెండు సార్లు జైలుకు పోతుల అరవింద్‌పై రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పది కేసులు ఉన్నాయి. 16ఏళ్ల వయసులో పెట్రోల్ దొంగతనాలతో చోరీలు ప్రారంభించిన అతను అనంతరం మూడు దోపిడీ కేసుల్లో అరెస్టయ్యాడు. సరూర్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో మరో రెండు దోపిడీ కేసులు, ఒక సెల్‌ఫోన్ స్నాచింగ్ కేసుల్లో పోలీసులకు చిక్కాడు. చైతన్యపురి పోలీసుస్టేషన్ పరిధిలో ఒక రాబరీతో, బందిపోటు దొంగతనానికి పాల్పడి జైలుకు వెళ్లి వచ్చాడు. హయత్‌నగర్ పీఎస్ పరిధిలో ఓ ఇంట్లో బంగారం, డబ్బు దొంగలించాడు. పది కేసులకు సంబంధించి రెండు పర్యాయాలు జైలుకు కూడా వెళ్లి వచ్చినట్లు తెలిపారు. తాజాగా నారాయణగూడ, సుల్తాన్‌బజార్ పీఎస్ పరిధిలో సెల్‌ఫోన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. -
0.0 ఈ ప్రపంచం మనుషుల కోసమే కాదు...
ప్రదేశం: అమీర్‌పేట్, హైదరాబాద్దృశ్యం: ఒకాయన ఇరానీ చాయ్ తాగుతూ సెల్ఫోన్లో మాట్లాడుతున్నాడు...\ ‘‘హలో లింగమూర్తి, ఎలా ఉన్నావు? బాగానే ఉండి ఉంటావులే. అది సరేగానీ ఏమిటీ విశేషాలు? నా బొంద, విశేషాలేముంటాయి... రోజూ తినడం తొంగోవ్వడమే కదా నీ పని, అది సరే, హెల్త్ ఎలా ఉంది, నా బొంద, అది ఎక్కడ బాగుంటుంది, నీకు మందు సిగరెట్లు లేనిది గడవదాయే! పిల్లాడు బాగా చదువుతున్నాడా, నా బొంద, వాడెక్కడ చదువుతాడు...అన్నీ నీ పోలికలే వాడికి, పొట్ట చీల్చిన అక్షరం ముక్క కనిపించదు. అరే మరిచిపోయాను. మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు. నా బొంద, మీదో తొక్కలో ఫ్రెండ్షిప్, ఎవడైనా ఆపదలో ఉంటే ఒక్కడూ కనిపించడు. మీ మామగారు ఎలా ఉన్నారు? దిట్టంగా ఉండి ఉంటాడులే. పనా పాటా! పొద్దున్నంత పేకాడడం, రాత్రయితే మందుకొట్టడమే కదా ఆయన పని...’’ కొద్దిసేపటి తరువాత... ‘ఠాప్’ అని పెద్దగా సౌండ్ వినిపించింది. సెల్‌ఫోన్ గాల్లోకి ఎగిరిపోయింది! ప్రదేశం: ఏలూరు రోడ్, విజయవాడ దృశ్యం: ఒక సెలూన్లో గెడ్డం చేయించుకుంటున్న నాగభూషణం సెల్ఫోన్లో మాట్లాడుతున్నాడు... ‘‘మనకు కొన్ని అలవాట్లుంటాయి నాగేçశ్వర్రావు. అవి మంచివనుకో, చెడ్డ వనుకో. కానీ అలవాటు అలవాటే కదా. సెలూన్లో గెడ్డం గీసుకుంటున్నప్పుడు సైలెంట్‌గా కూర్చోవాలి. నీకు తెలుసుకదా నాగేశ్వర్రావు... నేను సైలెంట్‌గా కూర్చోలేను. గెడ్డం చేయించుకుంటున్నప్పుడు కూడా సెల్ఫోన్లో ఎవరో ఒకరితో మాట్లాడుతుంటాను. నీకు తెలుసు కదా నాగేశ్వర్రావు... మాట్లాడుతున్నప్పుడు రకరకాలుగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటాను. బాడీని రకరకాలుగా కదిలిస్తుంటాను. అలా కదిలించినప్పుడల్లా ముఖం మీద కత్తిగాట్లు పడుతుంటాయి. సెలూన్ నుంచి నేను వెళ్లేది హాస్పిటల్‌కే. అయినా నేను ఈ పాడు అలవాటును మానుకోలేకపోతున్నాను నాగేశ్వర్రావు. చంద్రబింబంలాంటి ముఖం నీది అనే వాళ్లు గర్ల్‌ఫ్రెండ్స్. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా నాగేస్వర్రావు... చంద్రబింబం మాటేమిటోగానీ ఇప్పుడు నా ముఖం మీద కత్తి గాటు లేని ఏరియా లేదంటే నమ్ము...’’ కొద్ది సేపటి తరువాత... ‘ఠాప్’ అని సౌండ్ వినిపించింది. సెల్‌ఫోన్ గాల్లోకి ఎగిరిపోయింది! ప్రదేశం: నేషనల్ హైవే 18 (కర్నూల్–చిత్తూరు) దృశ్యం: ‘‘హలో ప్రసాదు. నేను డ్రైవింగ్‌లో ఉన్నాను. ఏమిటి విశేషాలు? ఆ... ఎప్పుడు? ఎలా? ఛాఛాఛా... డ్రైవ్ చేస్తూ సెల్ఫోన్లో మాట్లాడుతుంటే యాక్సిడెంట్ కాకుండా గాడిద గుడ్డవుతుందా! చేతులు కాలాక ఆయింట్మెంట్ రాసుకొని ఏంలాభం! అవును... అవును... నేనే డ్రైవింగ్ చేస్తున్నాను. హ్హా హ్హా హ్హా.... నాకేమవుతుంది. డ్రైవింగ్‌లో నేను చాలా స్ట్రాంగ్. సెల్‌ఫోన్ సెల్‌ఫోనే... డ్రైవింగ్ డ్రైవింగే! నాకేమీ కాదు ప్రసాదూ... నేను అనేది వేరే వాళ్ల గురించి. ఇంకేంటి విశేషాలు...’’ఠా....ప్ సెల్‌ఫోన్ మాయం! స్థలం: హైదరాబాద్‌లోని కార్పొరేట్ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్.దృశ్యం: డాక్టర్ మాణిక్చంద్బాషా గుండె ఆపరేషన్ చేస్తూ ఫ్రెండ్‌తో ఫోన్లో మాట్లాడుతున్నాడు...‘‘ఏరా పండు ఎలా ఉన్నావ్! ఇన్ని రోజుల తరువాత గుర్తొచ్చానా? అయినా మేమెందుకు గుర్తుంటాం లెండీ మీకు! ఒకప్పటి పండు కాదు కదా మీరు... ఆ గుండురావుగాడి చెల్లిని చేసుకున్న తరువాత మీలెవలే మారిపోయింది.మాలాంటి వాళ్లు మీ విలువైన కంటికి ఎలా కనబడతారు.సెలవా!!నాకు సెలవనేదే లేదు.పనే నాకు విశ్రాంతి. అంతెందుకు ఇప్పుడు కూడా నేను ఒకరికి గుండె ఆపరేషన్ చేస్తున్నాను. పనిలో పడి స్నేహాన్ని మరిచిపోయే క్యారెక్టర్ కాదు నాది. అందుకే గుండె ఆపరేషన్ చేస్తూ కూడా నీలాంటిమిత్రులతో సెల్ఫోన్లో మాట్లాడుతుంటాను.ఇలా చేయడం వల్ల పని తాలూకు అలసట మన మీద ఉండదు.అదెలా? అంటావా.సెల్ఫోన్లో మాట్లాడుతూ స్పీడ్‌గా డ్రైవింగ్ చేయగా లేనిది, సెల్ఫోన్లో మాట్లాడుతూ స్లోగా గుండె ఆపరేషన్ చేయలేమా! అలా ఎన్ని ఆపరేషన్లు చేశానో....’’కొద్దిసేపటి తరువాత...డాక్టర్ మాణిక్చంద్బాషా సెల్‌ఫోన్ ఎవరో లాగేసినట్టు మాయమైపోయింది.‘ఇచట’, ‘అచట’ అనే తేడా లేకుండా సెల్ఫోన్లు మాయమవుతున్నాయి. ఎవరికీ ఏమీ అర్థం కావడం లేదు.పోలీసులు రంగంలోకి దిగారు. వారితో పాటు సైంటిస్టులు కూడా దిగారు. రాజ్యాంగ సంక్షోభంలాగా సెల్‌ఫోన్ సంక్షోభం తలెత్తింది. కొనే వాళ్లు లేక సెల్‌ఫోన్ దుకాణాలు వెలవెలబోతున్నాయి. టవర్లు బేల ముఖం వేశాయి. సెల్‌ఫోన్ సంక్షోభంపై ఒక కమిటీ ఏర్పాటయింది. ఈ కమిటీ వాళ్లు రకరకాల కోణాల్లో సమస్యను విశ్లేషించారు. ఎన్నో పుస్తకాలు తిరగేశారు. అయినప్పటికీ సమస్యకు పరిష్కారం దొరకలేదు. సెల్‌ఫోన్ రహిత సమాజం ఏర్పడింది. ‘‘చాలా టఫ్ క్వశ్చన్ అడుగుతున్నాను విక్రమార్కా. సెల్‌ఫోన్ సంక్షోభం ఎందుకు తలెత్తింది?’’ విక్రమార్కుడి కళ్లలోకి సూటిగా చూస్తూ అడిగాడు బేతాళుడు.అప్పుడు విక్రమార్కుడు ఇలా చెప్పాడు:‘‘బేతాళామనిషి తన సౌకర్యం, సుఖం గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు. ఈ భూగ్రహం తనది మాత్రమే అనుకుంటున్నాడు. సెల్‌ఫోన్ టవర్ల వల్ల పక్షుల జనాభా తగ్గిపోతుంది. ఎలక్ట్రోమాగ్నటిక్ రేడియేషన్ పక్షుల పాలిట యమపాశంగా తయారైంది. అందుకే మిగిలిన జీవరాసులతో కలిసి పక్షులు మహాకూటమిగా ఏర్పడ్డాయి. ఎంతో శ్రమించి ‘ఎలిమినేట్–0.0’ అనే సరికొత్త పరికరాన్ని తయారుచేశాయి. ఇది పనిచేస్తున్నంత కాలం ఎక్కడి సెల్ఫోన్లు అక్కడ మాయమైపోతూనే ఉంటాయి.’’ – యాకుబ్ పాషా -
మొబైల్ పోయిందని విద్యార్థిని ఆత్మహత్య
కర్ణాటక, మైసూరు : సెల్‌ఫోన్ పోగొట్టుకోవడంతో మనస్తాపం చెందిన విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం మైసూరు నగరంలో చోటు చేసుకుంది. నగరంలోని గాంధీనగర్‌కు చెందిన నిఖిత (16) గాయత్రిపురంలో ఉన్న ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. బుధవారం సాయంత్రం సోదరుడు బబ్లూతో ఫోన్లో మాట్లాడిన అనంతరం నిఖిత సెల్‌ఫోన్ కనిపించలేదు. నాన్న ఎంతో ప్రేమగా ఇచ్చిన ఫోన్ కనిపించకపోవడంతో నిఖిత గురువారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎన్ఆర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.